Saturday, 17 January 2026

Happy Birthday Eluri Agitha

 

అజితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు! 






 

          ఎవరెవరికి రుణపడివున్నాను? అనుకున్నప్పుడు సహజంగానే మా అమ్మీ సుఫియా బేగం ముందుగా గుర్తుకు వస్తుంది.  ఇప్పుడు మా అమ్మకన్నా పెద్ద స్థానం అజితది.

         

          సాక్షాత్తు పార్టి అగ్రనేత కొండపల్లి సీతారామయ్య సూచించారని నేను తనను పెళ్ళిచేసుకున్నాను. తన తండ్రి చెప్పాడని తను నన్ను పెళ్ళి చేసుకుంది. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగానూ తనకు చాలా అడ్వాంటేజెస్ వున్నాయి. తను వాటిని ఎన్నడూ నా మీద ప్రయోగించలేదు. తన స్థాయిని గుర్తించడానికి నాకు చాలా సమయం పట్టింది.

 

          తనను నేను ఒక స్టూడెంట్ గానే చూసేవాడిని. తనూ నన్ను ఒక గురువుగానే భావించేది.  పిల్లలు పుట్టాక  తను అనుచర స్థానం నుండి సమాన స్థాయికి, ఆ తరువాత నన్ను నడిపించే స్థాయికి కూడ చేరుకుంది.

 

          మా ఇద్దరికి ఒక సామాన్య గుణం వుంది. ఇద్దరికీ కోపం ఎక్కువ. మా స్వభావాల గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ మేము మూడు నాలుగేళ్ళు కూడ కలిసుంటామని అనుకోలేదు. అలా నలభై మూడేళ్ళు దాటేశాం.

 

          తను చాలా మొండిది. విపరీతమయిన పట్టుదల. ఇప్పటికీ రైలు, బస్సు లేని కుగ్రామంలో తను పుట్టింది.  నేను అత్తారింకి వెళ్ళాలంటే మధిర స్టేషన్లో రైలు దిగి, వైరా గట్టుకుపోయి, బూట్లు, ప్యాంటు తీసి నెత్తిన పెట్టుకుని యేరు దాటి, ఐదు కిలోమీటర్లు నడిచి శివాపురం చేరుకునేవాడిని. ఈ వెనుకబాటు తనం నుండి బయటపడడానికి తను అదనంగా శ్రమించింది. నాకన్నా ముందే కంప్యూటర్స్ నేర్చుకుంది. పిల్లలకూ తనే కంప్యూటర్స్ నేర్పింది. ఆ ఏరియాలో నేను లేటుగా ప్రవేశించాను. అక్కడి నుండి మొదలయ్యి,  ఒక శాటిలైట్ న్యూస్ ఛానల్ లో అడ్మిన్ హెడ్ గా చాలా యేళ్ళు పనిచేసింది. ఆమెతో ప్రధాన సమస్య ఏమంటే ఇంట్లోనూ తనే అడ్మిన్ హెడ్ అనుకుంటుంది.

 

గడిచిన యాభై యేళ్లలో మనదేశ కుటుంబ వ్యవస్థలో మౌలిక మార్పులు వచ్చేశాయి. అప్పుడు భర్త యింటి మజమాని. ఇప్పుడు భార్య ఇంటి యజమాని. వ్యవస్థ తలకిందులు కావడానికి చాలా యేళ్ళు చాలా ఘర్షణ వుంటుంది.  దానికి మేమిద్దరం మినహాయింపుకాదు.

 

          గంటకోసారి మంచినీళ్ళు తాగినట్టుగా గంటకోసారి మేము దెబ్బలాడుకుంటాము. వెనెజులా అధ్యక్షుడ్ని డొనాల్డ్ ట్రంప్ కిడ్నాప్ చేయడం వంటి చిన్నచిన్న విషయాలను మేము అస్సలు పట్టించుకోము. తాలింపులో కరివేపాకు మాడడం వంటి పెద్దపెద్ద గ్లోబల్  ఇష్యూస్  మీద ఆ ఉప్మా తింటున్నంత సేపూ  కొట్లాడుకుంటాము.

 

          అయితే కుటుంబాన్ని తను ప్లాన్ చేసే విధానం, ముందు చూపు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పిల్లలు ఏం చదవాలీ  ఎక్కడ చదవాలి ఎక్కడ ఎలా సెటిల్ కావాలీ మన ఇల్లు ఇలావుండాలీ? వగయిరా విషయాలన్నింట్లో  తనకో లెఖ్ఖ వుంటుంది. దాదాపు అవన్నీ నెరవేర్చేసింది. ఈ విభాగంలో తనను బోలెడు ప్రేమించవచ్చు.

 

           వర్గ వ్యవస్థకన్నా ముందే వివాహవ్యవస్థ కూలిపోతుందని నేను గట్టిగా నమ్ముతాను. కొత్తతరం పెళ్ళిళ్లు చేసుకోవడంలేదు. లివి- ఇన్ రిలేషన్ షిప్స్ కూడ షార్ట్ లివింగ్ గా మారిపోతున్నాయి. వివాహాన్ని నిరాకరించవచ్చుగానీ పిల్లల పుట్టుకను నిరాకరించడం మహాపరాధం అని నేను భావిస్తాను. ఆర్ధిక పరిమితుల కారణంగా కుటుంబ నియంత్రణ పాటించాల్సి రావచ్చు. కానీ, అసలు పిల్లలు పుట్టడానికే వీల్లేని పరిస్థితుల్ని తెచ్చుకుంటున్నాం. ఇది దారుణం అనిపిస్తుంది. మానవజాతి మనుగడను కొనసాగించడం మనందరి బాధ్యత.

 

          నేను అజితను తనను తానుగా సగం ప్రేమిస్తాను.  పిల్లల్ని సాకిన తీరుకు అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాను.

 

          మా దండల పెళ్ళికి చలసాని ప్రసాద్ పురోహితుడు. చలసానికి ఒక రికార్డు వుంది. ఆయన వంద పెళ్ళిళ్ళు చేశాడు. 99 జంటలు విడిపోయారు. నిలబడింది మేమిద్దరమే. తను నన్ను దారికి తెచ్చుకోవాలి అనుకుంటుందిగానీ విడిపోవాలనుకోదు.

 

          అప్పుడప్పుడు నాకు కూడ తన మీద చాలా కోపం వస్తుంది. మూడు నాలుగు సంఘటనల్ని తలుచుకున్నప్పుడు తన గొప్పతనం గుర్తుకు వస్తుంది.

         

          మొదటిది; 1983లో మేము పెళ్ళి చేసుకున్నప్పుడు ఏడుగురు కుటుంబ సభ్యులకు నేను ఒక్కడ్నే బ్రెడ్ ఎర్నర్ ని. తాటాకు ఇంట్లో నివాసం. ఓపెన్ లావెటరీస్. అక్కడ తను నివశించడం చాలా కష్టం. రెండోది; 1985లో కారంచేడు ఉద్యమం మొదలయినపుడు పార్టి నన్ను అక్కడికి వెళ్ళమంది. అదొక ఛాలెంజ్ గా భావించి వెళ్ళాను. అప్పుడు మా పెద్దబ్బాయి మూడున్నర నెలల పిల్లోడు.  ఆ పరిస్థితిని తాను తట్టుకుంది. 1998లో తెలుగు జర్నలిజానికి కష్టకాలం. నేను పనిచేస్తున్న ఏపి టైమ్స్ మూతపడింది, అంతకు ముందు నేను పనిచేసిన ఆంధ్రజ్యోతి (పాతది) మూతపడింది. ఉదయం మూసేశారు, ఆంధ్రపత్రిక మూసేశారు. ఆంధ్రప్రభను అమ్మకానికి పెట్టారు. అసలే నిరుద్యోగం ఆపైన ఆ ఆందోళన, వత్తిడి, కుంగుబాట్లతో ఆరోగ్య సమస్యలు. నేను నా భార్యా పిల్లల్ని ఆకలితో మాడ్చిన రోజులవి. సరిగ్గా పిల్లలు పెద్ద చదువులకు వచ్చిన సమయం అది. ఆ కష్టాల నుండి గట్టేక్కడానికి తను అదనంగా కష్టపడింది. వీటిని తలుచుకున్నప్పుడు తన గొప్పతనం గుర్తుకు వస్తుంది.

 

          తన తరువాత నా బాగోగులు ఎవరు చూసుకుంటారని ఇప్పుడు తను ఆలోచిస్తూ వుంటుంది. నేనూ అంతే.

15 జనవరి 2026

No comments:

Post a Comment