Right To Protest: నిరసన నేరమైతే ప్రజాస్వామ్యం పతనమే!
డానీ
సమాజవిశ్లేషకులు
దేశంలో నిరసనోద్యమాలు, ఆందోళనల్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తు మొదలెట్టింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరిగిన నిరసనోద్యమాలు, వాటికి కారణాలు, అవి సాధించిన ఫలితాలు, వాటికి నాయకత్వం వహించిన వారి వ్యక్తిగత ప్రయోజనాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని భావిస్తోంది. ఈ అంశం మీద ఒక సమగ్ర నివేదికను అందించే పనిని పోలీసు మేధోసరోవరంగా భావించే బ్యురో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (BPR&D)కు అప్పగించారు. మరీ ముఖ్యంగా, 1974 తరువాత సాగిన ఉద్యమాల మీద మరింత లోతైన విశ్లేషణ జరపాలని కేంద్రం కోరింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాల హోంశాఖలకు ఆదేశాలు వెళ్ళాయి. అంతేకాక, భవిష్యత్ ఆందోళనల నివారణకు ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) రూపొందించాలని కూడ కేంద్రం భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే దేశంలో నిరసనలు, ఆందోళనల్ని నిషేధిస్తూ ఒక బిల్లు పార్లమెంటులో ప్రవేశించవచ్చు. అది ఆమోదం పొంది ఒక చట్టంగా కూడ మారవచ్చు.
ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలకు, ప్రభుత్వానికి కూడ కొన్ని బాధ్యతలు, హక్కులు ఉంటాయి. సమ్మెలు, ఆందోళనల్ని నియంత్రించే బాధ్యత ప్రభుత్వానికి వుంటుందిగానీ, వాటిని నిర్మూలించే అధికారం వుండదు. నియంత్రణకూ నిర్మూలనకూ మధ్య ప్రజాస్వామిక అవగాహనలో చాలా వ్యత్యాసం వుంది. అవి రెండూ పరస్పర వ్యతిరేక అంశాలు.
కార్మికులకు సమ్మె చేసే హక్కు, ప్రజలకు నిరసన వ్యక్యం చేసే హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం. వాటిని తీసివేస్తే ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డు మీద క్రూరంగా హత్య చేసినట్టే.
వ్యక్తులకు వుండే భావప్రకటన స్వేఛ్ఛ, సమూహ స్థాయిలో నిరసన స్వేఛ్ఛగా మారుతుంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనడం కూడ సరికాదు; ఆ పునాదుల మీదనే రాజ్యాంగం అవతరించింది అనడం సబబు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటేనే నిరసన హక్కు. ఆ విలువలను పరిరక్షించడానికే ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలనే నియమం రూపొందింది. అధికారంలో వున్న ప్రభుత్వ పని తీరుకు ఆమోదం తెలిపే అవకాశంతోపాటు, నిరసనతో గద్దెదించే అవకాశాన్ని కూడ ఎన్నికలు ప్రజలకు ఇస్తాయి. వీటిల్లో, మొదటిదానికన్నా రెండోదే కీలకమైనది.
సమ్మెలు, నిరసనలు, ఉద్యమాల ద్వార ప్రజలు తమ కోర్కెలను పాలకుల దృష్టి తెస్తారు. తద్వార తమ విధానాలను సరిదిద్దుకునే, కొత్త వాగ్దానాలను రూపొందించుకునే అవకాశం అధికార పార్టీకేకాక, ఇతర రాజకీయ పార్టీలకు కూడా కలుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియను నిరోధించే పనిలో కేంద్రప్రభుత్వం నిమగ్నమైంది.
సంఘ పరివారానికీ, దాని రాజకీయ వేదిక అయిన, భారతీయ జనతా పార్టికి రాజకీయాల్లో గాంధీజీ, ప్రభుత్వ నిర్వహణలో రాజ్యాంగం అస్సలు పడవు. ఆ విషయాన్ని వాళ్ళేమీ దాచుకోరు. చాలా బాహాటంగానే మొదటి నుండి చెపుతూ వస్తున్నారు. ఇప్పుడయితే గాంధీ వ్యతిరేకతను ప్రత్యక్షంగానూ, రాజ్యాంగం మీద వ్యతిరేకతను పరోక్షంగానూ డైలీ సీరియల్ గా ప్రసారం చేస్తున్నారు.
రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలోనే నిజాం సంస్థానంలోని తెలంగాణలో రైతులు సాయుధులై స్థానిక జాగీర్దాలతో హోరాహోరీగా పోరాడుతున్నారు. అలాంటి పోరాటాలను నిషేధించాలని రాజ్యాంగ సభ భావించలేదు. అలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని కల్పించిన రాజరిక వ్యవస్థను రద్దు చేయాలనుకుంది. భూస్వామ్య వ్యవస్థను నియంత్రించాలనుకుంది. రైతులు, వ్యవసాయకూలీల హక్కులకు రక్షణ కల్పించాలనుకుంది. కుల వివక్షను శిక్షించాలనుకుంది. ఈ ఆదర్శాలకు అనుగుణంగానే తరువాతి కాలంలో అనేక చట్టాలు వచ్చాయి.
మరోవైపు సంఘపరివారం రాజ్యాంగాన్ని తీవ్రంగా దూషించింది. మనువును అవమానించారంటూ గగ్గోలు పెట్టింది. తాము అధికారం లోనికి వచ్చిన రోజున ఈ రాజ్యాంగాన్ని తీసిపడేసి మనుధర్మాన్ని అమలు చేస్తామని ప్రతినలు చేసింది.
ఇంకో వైపున కూడ రాజ్యాంగాన్ని విమర్శించిన వారున్నారు. సామాజికంగా వెనుకబడిన శూద్రులు రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన కొత్తలోనే తమకు అన్యాయం జరిగిందంటూ పెద్దఎత్తున ఆందోళన సాగించారు. నాటి నెహ్రు ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించి చరిత్రలో మొదటిసారి రాజ్యాంగ సవరణకు పూనుకుంది. ఇది ప్రజాందోళన సాధించిన విజయం. అయినప్పటికీ, తమిళనాడులో పెరియార్ ఇవి రామసామి నాయకర్ 1957లో రిపబ్లిక్ డే రోజున రాజ్యాంగ ప్రతుల్ని బహిరంగంగా తగుల బెట్టారు. రాజ్యాంగం కులాన్ని నిర్మూలించకుండ కుల వివక్షను మాత్రమే నిర్మూలించిందనేది పెరియార్ చేసిన ప్రధాన విమర్శ. కులం వున్నంత కాలం కుల వివక్ష వుంటుందనేది ఆయన ఆందోళన. ఇప్పటికీ ఈ అంశం మీద ఆలోచనాపరుల వేదికల మీద చర్చలు సాగుతూనేవున్నాయి.
1990లలో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించాక పరిస్థితి మారింది. అయితే, అంతకు ముందు ప్రభుత్వలు చేసిన ప్రజానుకూల చట్టాలన్నీ ప్రజాందోళనలు సాధించుకున్నవే. కార్మిక హక్కుల చట్టాలు, అటవీ భూముల మీద ఆదివాసులకు హక్కు కల్పించే చట్టాలు, భూపరిమితి చట్టాలు సమస్తం ప్రజాందోళనలకు తలొగ్గి వచ్చినవే. ఇందులో కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన పాత్ర కూడ మహత్తరమైనది. ఏ చట్టం ఏ ఉద్యమం ఫలితంగా వచ్చింది అనేదాన్ని వివరిస్తూ ఒక పట్టిక తయారు చేయవచ్చు.
2017లో సంచలనం రేపిన ‘ఉన్నావ్ బాలిక మీద సామూహిక అత్యాచారం’ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న బిజెపి నేత కుల్దీప్సింగ్ సెంగార్ ను విడుదల చేయించుకోడానికి ఢిల్లీ పెద్దలు చేసిన కృషి ఇటీవల ఫలించింది. కానీ, ప్రభుత్వ చర్యను నిరశిస్తూ దేశ రాజధాని నగరంలో మహిళా, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధితురాలి పక్షాన గట్టిగా నిలిచాయి. ప్రభుత్వ పెద్దలు దిగివచ్చారు అనడంకన్నా ప్రజాందోళనలు వాళ్ళను దిగివచ్చేలా చేశాయి అనడం సబబు.
అలాగే, మైనింగ్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆరావళి పర్వత శ్రేణుల కనీసపు ఎత్తును వంద మీటర్లకు పెంచుతూ కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం కూడ వివాదంగా మారింది. ఈ నిర్వచనం సుప్రీం కోర్టు ఆమోదాన్ని పొందినాసరే దానికి వ్యతిరేకంగా ప్రజాందోళన సాగింది. మరోసారి ప్రభుత్వ పెద్దలు దిగివచ్చి సుప్రీం కోర్టులో తమ పాత వాదనల్ని వెనక్కు తీసుకున్నారు.
ఒక వారం రోజుల వ్యవధిలో రెండు కేసుల్లో దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ప్రజాందోళనల పని పట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టున్నారు.
నియంతృత్వం, మతతత్త్వ నియంతృత్వం,
1974 నుండి సాగిన నిరసనోద్యమాల మీద ప్రత్యేక అధ్యయనం సాగించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకొంటోంది. ఎమర్జెన్సీకు వ్యతిరేకంగా సాగిన ప్రజాస్వామ్య పునరుధ్ధరణ ఉద్యమాలను పరిశీలించాలనేది దాని ఉద్దేశ్యం కావచ్చు.
ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ సాగించింది నిస్సందేహంగా నియతృత్వమే. అయితే, ఇప్పుడు మనం చూస్తున్నది మతతత్త్వ నియంతృత్వం. ప్రజల్నీ ప్రజాస్వామిక హక్కుల్ని నియంతృత్వం క్రూరంగా అణిచివేస్తుంది. మతతత్త్వ నియంతృత్వం అంతకన్నా నాలుగు అడుగులు ముందుకేసి, ప్రజల్ని మతప్రాతిపదికన చీల్చి మెజారిటీ సమూహాన్ని మైనారిటీ సమూహం మీదికి ఉసి గొల్పుతుంది. నియంతృత్వం సరళమైనది. ప్రజలందరూ ఏకం అవుతారు కనుక దాన్ని ఎదుర్కోవడం సులువు. మతతత్త్వ నియంతృత్వం సంక్లిష్టమైనది. ప్రజల్లో అది తెచ్చిన కుత్రిమ చీలిక వుంటుంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి అదనపు ఉపాయాలు అవసరం అవుతాయి.
2014 తరువాత ప్రజాస్వామిక విలువలు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. భారత కరెన్సీ మీద గాంధీ బొమ్మ వుంటుందిగానీ, భారత ప్రభుత్వ విధానాల్లో గాంధీ ఆలోచనలు వుండవు. పైగా, అనుక్షణం గాంధీ ఆలోచనల్ని విమర్శించే ప్రకటనలే చేస్తుంటారు.
అంతకు ముందు వరకు ప్రజా నిరసనల్ని ప్రజాస్వామ్య ఒత్తిడి సాధనంగా భావించే ఒక రకమైన అంగీకారం వుండేది. ఇప్పుడు దాన్ని పాలనకు ముప్పుగా, దేశ భద్రతా సమస్యగా చిత్రీకరిస్తున్నారు. విభిన్న చట్టాల మీద ప్రజాభిప్రాయాన్ని రాజ్యాంగ హక్కుగా చూసేవారు, ఇప్పుడు దాన్ని ప్రజా క్రమశిక్షణ రాహిత్యంగా చూస్తున్నారు. అంతకన్నా తీవ్రంగా తప్పుపట్టితే ఏకంగా దేశ భద్రతకు ముప్పుంటున్నారు. గతంలో కార్మికుల సమ్మె హక్కును రాజకీయ సామూహిక చర్చగా గుర్తించేవారు. ఇప్పుడు ఆర్ధిక నష్టం కలిగించే చర్యగా ముద్ర వేస్తున్నారు. ఇంతకు ముందు ఆందోళనలు జరిగితే చర్చలకు పిలిచే వారు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలను నియమించేవారు. కమిటీల సిఫార్సుల మేరకు అవసరమైతే వెనక్కు తగ్గడానికి కూడ జంకేవారుకాదు. ఇప్పుడు నిరసనకారుల మీద ఎదురుదాడికి దిగుతున్నారు, వాటికి నాయకత్వం వహించేవారిని అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నింటికన్నా మైనంగా వుండిపోవడం ఇప్పుడు గొప్ప ఉపాయంగా మారిపోయింది. మణిపూర్ అల్లర్ల మీద ప్రధాని ప్రతిస్పందన ఏమిటో చూశాంగా! ఇంతకు ముందు దేశానికి ముప్పు సరిహద్దులకు ఆవలి నుండి వుందనేవారు, ఇప్పుడు ముప్పు అంతర్గతంగా వుందంటున్నారు.
ప్రజాస్వామ్య పతనం 2014కు ముందు ఆ తరువాత అని బేరీజు వేసుకుంటే మనల్ని ముంచుకొస్తున్న ప్రమాదం అర్ధం అవుతుంది. ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలో కూడ బోధపడుతుంది.
రచన : 31-12-2025
ప్రచురణ : ఆంధ్రజ్యోతి, 13 జనవరి 2026
https://www.andhrajyothy.com/2026/editorial/if-protest-becomes-a-crime-democracy-faces-collapse-1484567.html
.png)
No comments:
Post a Comment