Tuesday, 20 January 2026

 Please consider the following article for publication in Sakshi edit page.

-        Danny

The Warnings of the History

చరిత్ర  చేస్తున్న హెచ్చరికలు దేనికి సంకేతాలు?

 

డానీ

సమాజ విశ్లేషకులు




చరిత్ర పునరావృతం కాదు—కనీసం యథాతథంగా అయితే కాదు. అయినప్పటికీ, కొన్ని ధోరణులు మాత్రం తిరిగి తిరిగి కనిపిస్తుంటాయి. అవే ఒకప్పుడు ప్రపంచాన్ని మహావిధ్వంసం వైపు నడిపించిన సంకేతాలు. ఆ ధోరణులు మళ్ళీ కనిపించడం మొదలైతే, సమాజం అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందని అర్థం.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఏఐ ద్వారా రూపొందించిన  ఆ మ్యాప్‌లో గ్రీన్లాండ్, కెనడా, వెనిజులా తదితర దేశాలను  అమెరికా భూభాగంగా చూపించారు.  చట్టపరంగా దీనికి ఎటువంటి విలువ లేదని అందరికీ తెలుసు. కానీ రాజకీయాల్లో మ్యాప్‌లు అమాయకమైన బొమ్మలు కావు. అవి భవిష్యత్తు ఆకాంక్షలను, ప్రపంచ శక్తి నడక దిశను, దురాక్రమణ ఆలోచనలను సూచించే సంకేతాలు కావచ్చు.

చరిత్రను చూస్తే, ప్రపంచ శక్తులు ముందుగా మ్యాప్‌లతోనే ఆడుకున్నాయి. తరువాత మాటలుగా మారాయి. ఆపై విధానాలు మారాయి. యుధ్ధాలు జరిగాయి. చివరకు దేశాల సరిహద్దులే మారిపోయాయి. ప్రపంచ పటం మీద  అగ్రరాజ్యం కావాలనుకున్న దేశం తన ప్రయాణాన్ని ఎప్పుడూ యుద్ధంతో మొదలుపెట్టదు; అది ముందుగా భాషలోకి, చిత్రాల్లోకి, ప్రజల ఊహల్లోకి ప్రవేశిస్తుంది.

ఆ మ్యాప్ కింద రాసిన  “ఇక్కడి నుండి వెనక్కి వెళ్లే ప్రశ్న లేదు” అనే వ్యాఖ్య కూడా ఇదే కోవకు చెందుతుంది. ఇది కేవలం ఒక రాజకీయ వాక్యం కాదు. ఇది చర్చలు, రాజీలు, దౌత్య సంవాదాలకు తలుపులు మూసే భాష. చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే—ఇలాంటి భాష వినిపించిన ప్రతిసారీ, దాని వెనక ఘోర పరిణామాలే వచ్చాయి.

బ్రిటిష్ చరిత్రకారుడు ఏ.జె.పీ. టేలర్ ఒకసారి అన్నట్లు, “యుద్ధాలు అకస్మాత్తుగా జరుగుతాయనుకోవడం మన అజ్ఞానం; నిజానికి అవి చాలాకాలం మాటలలోనే సిద్ధమవుతాయి.” నేటి ప్రపంచంలో ఆ మాటల స్థానాన్ని ఇప్పుడు చిత్రాలు, మీమ్స్, ఏఐ మ్యాప్‌లు తీసుకున్నాయి.

1930ల నాటి యూరప్‌లో ఇటలీ ఫాసిస్టు నేత బెనిటో ముస్సోలినీ కూడా ఇలానే మాట్లాడాడు. ఆఫ్రికా ఆక్రమణను సమర్థించుకుంటూ, “మన ప్రజలకు ఊపిరి పీల్చుకోవడానికి స్థలం కావాలి” అన్నాడు. జాతీయ గర్వం, భద్రత, ప్రజల అవసరాల సాకులు నెపాలతో సాగిన ఆ వాదన చివరకు ఖండాన్ని రక్తపాతంలో ముంచింది. ఇది వ్యక్తుల్ని విమర్శించడానికో, డోనాల్డ్ ట్రంప్ ను ముస్సోలినీతో పోల్చడానికో కాదు; చరిత్రలో పదే పదే కనిపించే ధోరణుల్ని కొంచె ముందుగా లోతుగా అర్థం చేసుకోవడానికి.

గ్రీన్లాండ్ విషయంలో అంతర్జాతీయ చట్టం స్పష్టంగా ఉంది. అది డెన్మార్క్ రాజ్యానికి చెందిన స్వయం పాలిత ప్రాంతం. ఐక్యరాజ్యసమితి సూత్రాల ప్రకారం భూభాగాల మార్పు ప్రజల సమ్మతితోనే జరగాలి. అయితే, భద్రత పేరిట భౌగోళిక ఆకాంక్షలను కప్పిపుచ్చుకోవడం కొత్త కాదు. కానీ, అలాంటి ప్రయత్నాలు ప్రపంచానికి శాంతిని ఎప్పుడూ తీసుకురాలేదు. చరిత్రకారులు పలుమార్లు హెచ్చరించినట్లు, “చట్టం బలహీనపడినప్పుడు శక్తి మాట్లాడుతుంది.”

ఇక్కడే ఐక్యరాజ్యసమితి పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు నానాజాతి సమితి ఎలా నిర్వీర్యమైపోయిందో, ఇప్పుడు ఐక్యరాజ్యసమితి కూడా అలాంటి స్థితికి చేరుతోందా అన్న సందేహం అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తోంది. నాటో వంటి కూటముల్లోనూ అంతర్గత అసంతృప్తి పెరుగుతోంది. పైకి మౌనం ఉన్నా, లోపల ఉడుకుతున్న ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

యూరోపియన్ యూనియన్ కమీషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అప్పుడే స్పందించారు. “ట్రంప్ టారిఫుల బెదిరింపులు దారితప్పాయి” అని ఆమె  స్పష్టంగానే ప్రకటించారు. అంతేకాదు, ట్రంప్ విదేశాంగ విధానాల మీద  తమ ప్రతిస్పందనఐక్యంగా, సముచితంగా ఉంటుంది.” అన్నారు. ఇది కేవలం ఆర్థిక ప్రకటన కాదు. ఇది ఒక రాజకీయ సంకేతం ప్రపంచ యుధ్ధానంతరం ఏర్పడిన  ప్రపంచ కూర్పును  కాపాడుకోవాలన్న  సంకల్పం అందులో వుంది. చరిత్రకారుడు టోనీ జడ్ అన్నట్లు, “1945 తరువాత ఏర్పడిన ప్రపంచ వ్యవస్థ కూర్పు సంపూర్ణం కాకపోవచ్చు; కానీ అది లేకపోతే ప్రపంచం మరింత ప్రమాదకరంగా మారుతుంది.”

డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు  చేస్తున్నారు. అక్కడి వీధుల్లో వినిపిస్తున్న స్వరాలు కూడ ఇప్పుడు ప్రపంచానికి  ముఖ్యమే. “అమెరికాకు పూర్వ వైభవాన్ని తెద్దాం”  అనే నినాదాన్ని ట్రంప్ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇంగ్లీషులో దీన్ని “Make America Great Again (MAGA)’’ అంటున్నారు. డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్, గ్రీన్ ల్యాండ్ ముఖ్యపట్టణం నూక్ నగరాల్లో ప్రదర్శనకారులు  ట్రంక్ నినాదానికి కొత్త అర్ధం ఇచ్చారు. వాళ్ళు కూడ MAGA అంటున్నారు. కానీ, వాళ్ళ నినాదం పూర్తిగా అమెరికాకు వ్యతిరేకం. వాళ్ళు “Make America Go Away” అని నినదిస్తున్నారు. ఈ నినాదం పైకి కొంచెం వ్యంగ్యంగా కనిపించినా, దాని వెనక ఉన్న భయం నిజమైనది. సామ్రాజ్యవాద భాషను పాలకులకన్నా ముందే సామాన్య ప్రజలే గుర్తిస్తారని చరిత్ర పదే పదే నిరూపించింది.

ప్రపంచం యుద్ధాల దిశగా సాగేటప్పుడు ఇలాంటి కీలక సంకేతాలు కనిపిస్తాయని అమెరిక చరిత్రకారిణి హన్నా ఆరెండ్ గమనించారు. కీడుకి ఒక సామాన్య లక్షణం ఉంటుందని ఆమె చెప్పారు. దానిని ఆమె *‘Banality of Evil’*గా నిర్వచించారు. బాధ్యతగల స్థానాల్లో ఉన్నవారు తాము తీసుకునే నిర్ణయాల పర్యవసానాలను బేరీజు వేసుకునే ఇంగితజ్ఞానాన్ని కోల్పోయిన ప్రతిసారీ, ప్రపంచ స్థాయిలో తీవ్రమైన కీడు చోటు చేసుకుందని ఆమె హెచ్చరించారు.

ఇక్కడ కార్ల్ మార్క్స్ చేసిన ఒక ప్రసిద్ధ వ్యాఖ్య గుర్తుకు వస్తుంది. చరిత్ర మొదట విషాదంగానూ, తరువాత ప్రహసనంగానూ తిరిగి వస్తుందనే అర్ధంలో ఆయనోమాట అన్నాడు. చరిత్ర యధాతథంగా పునరావృతం కాకపోయినా, చరిత్రలోని ధోరణులు మళ్ళీ మళ్ళీ వివిధ స్థాయిల్లో మన ముందుకు వస్తాయని దీనికి అర్ధం చెప్పుకోవచ్చు.

మీడియా పాత్ర ఈ సమయంలో అత్యంత కీలకం. భయాన్ని పెంచకుండ పరిస్థితిని విశ్లేషించడం మీడియా బాధ్యత. కానీ దురదృష్టవశాత్తు, అనేక గ్లోబల్ మీడియా సంస్థలు ప్రపంచానికి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని వినోదంగా మార్చే ధోరణితో వ్యవ్హరిస్తున్నాయి. ఇది ప్రజల్ని  అప్రమత్తం చేయాల్సిన సమయంలో, మత్తులోకి నెట్టే ప్రమాదం.

ఇది తీర్పు కాదు; ఒక హెచ్చరిక. వ్యక్తుల మీద కాదు, ప్రమాదకర ధోరణుల మీద చర్చ. సార్వభౌమత్వం అంటే శక్తివంతుడి ఇష్టాఇష్టాలు కాదు; అది ప్రజల హక్కు. ఈ సూత్రాన్ని చిన్న చూపు చూస్తే  చిన్న దేశాల భవిష్యత్తే కాక  మొత్తం ప్రపంచ శాంతే కనుమరుగై పోతుంది.

చరిత్ర మౌనంగా ఉండదు. అది వర్తమాన ప్రపంచాన్ని నిద్ర లేపుతుంది. నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి నిలదీస్తుంది. అప్రమత్తంగా వున్నవాళ్ళు, సమూహ బాధ్యతలు తెలిసిన వాళ్ళు మాత్రమే చరిత్ర           విసిరిన సవాలుకు సమాధానం ఇవ్వగలరు.

రచన : 21 జనవరి 2026

No comments:

Post a Comment