చరిత్ర
జిన్నా, రూటీ, బొంబాయి
- ఒక ప్రేమ కథ
- ఉషా యస్ డానీ
https://www.blogger.com/blog/post/edit/7435539703073908345/5050402726436190440
ఉగ్రవాదానికి
నీతి, జాతి, మతం, దేశం, వర్ణం ఏదీ వుండదని ముంబాయి ముట్టడికి పాల్పడ్డ
ముష్కరులు మరోసారి నిరూపించారు.
టెర్రరిస్టు
చర్యల తీవ్రతను అంచనా వేయడానికి, చాలామంది, ఆ సంఘటనల్లో జరిగిన ఆస్థినష్టాన్ని కొలమానంగా తీసుకుంటుంటారు. నిజానికి, ఉగ్రవాదుల
లక్ష్యం ఆస్తినష్టంకన్నా అనేక రెట్లు ప్రమాదకరమైంది. ఉగ్రవాదుల రంగుల్లో విబేధాలు,
గమనంలో తేడాలు వుంటాయేమోగానీ, వాళ్లందరి గమ్యం
మాత్రం ఒక్కటే; సామాజికవర్గాల మధ్య వైషమ్యాన్ని
రెచ్చగొట్టడం.
ముంబాయి ముట్టడిలో మిగిలిన
ఏకైక సజీవదోషి, అజ్మల్ కసబ్ అనేకసార్లు
తనకుతాను 'పాకిస్తాన్ దేశభక్తుడి'గా
చిత్రించుకుంటున్నాడు. ఇదొక బూటకపు ప్రయత్నం. ఉగ్రవాదులకు ద్వేషంతప్ప, దేశమూ ఉండదు, భక్తీ వుండదు. పాకిస్తాన్ నుండి వచ్చిన ముష్కర మూకకు నిజంగా 'దేశభక్తే' వుంటే, వాళ్ళు
ముంబాయిని లక్ష్యంగా చేసుకునేవారేకాదు. టాటాలకు చెందిన తాజ్
హోటల్ వైపు కనీసం కన్నెత్తి కూడా
చూసేవారేకాదు.
బొంబాయి ప్రేమికుడు!
భారతీయులు
మహాత్మాగాంధిని జాతిపితగా భావించినట్టు, పాకిస్థానీయులు
ముహమ్మదాలీ జిన్నాను తమ జాతిపిత (బాబా ఏ
ఖౌమ్) గా భావిస్తారు. జిన్నా పుట్టింది కరాచీలోనే అయినా, పెరిగింది,
చదివింది, ఉద్యోగం చేసిందీ, ఉద్యమాలు నడిపింది, ప్రేమాయణం సాగించిందీ, పెళ్లి చేసుకున్నది అన్నీ బొంబాయిలోనే. ఒక్కమాటలో చెప్పాలంటే, 72 యేళ్ల సుదీర్ఘ జీవితకాలంలో, పుట్టినపుడు ఓ మూడేళ్ళు, చనిపోవడానికి ముందు ఓ పదమూడు
నెలలు మాత్రమే జిన్నా కరాచీలో వున్నాడు.
మిగిలిన జీవితకాలంలో, అత్యధిక భాగం ఆయన బొంబాయిలోనే
వున్నాడు. జిన్నా బొంబాయి ప్రేమికుడు!
గాంధీజీ
అప్పట్లో, బిర్లా, బజాజ్ కుటుంబాలతో
సన్నిహితంగా వుంటే, టాటా కుటుంబంతో జిన్నా అత్యంత
సన్నిహితంగా వుండేవాడు. జిన్నా భార్య రతన్ బాయి; రతన్ జీ
దాదాభాయి టాటాకు మనమరాలు. అంటే, జే.ఆర్.డి. టాటాకు మేనకోడలు. (అయితే, మేనకోడలికన్నా
మేనమామే నాలుగేళ్ళు చిన్నవాడు)
పదహారేళ్ళకే పెళ్ళి
అంతకుముందు,
పిన్నవయసులోనే జిన్నాకు పెళ్లయింది. బారిస్టర్ చదువుకు వెళ్లడానికి ముందు, 1892లో,
జిన్నాను అతని దాయాది ఇవిూ బాయితో పెళ్ళిచేశారు. అప్పుడు జిన్నా
వయస్సు 16 సంవత్సరాలు, అయన భార్య
వయస్సు 14 సంవత్సరాలు. భార్య కాపురానికి రాక ముందే జిన్నా
ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. జిన్నా ఇంగ్లండ్ లో వుండగానే, ఆయన తల్లి, భార్య ఇద్దరూ జబ్బుబారినపడి చనిపోయారు. ఈ సంఘటనతో కృంగిపోయిన జిన్నా, దాదాపు ఇరవై యేళ్ళు మళ్ళీ పెళ్ళి జోలికి పోలేదు. బారిస్టర్ గా, రాజకీయ నాయకుడిగా సుప్రసిధ్ధుడైపోయాక, నలభయ్యవ పడిలో
జిన్నా మళ్ళీ ప్రేమలో పడ్డాడు.
విద్యార్ధి
దశలోనే జిన్నా ఉదారవాద రాజకీయాలపట్ల ఆసక్తి పెంచుకున్నాడు. భారత రాజకీయాల
కురువృధ్ధుడు దాదాభాయి నౌరోజీ అంటే అతనికి వల్లమాలిన అభిమానం. జిన్నా బారెట్లాలో
చేరిన సంవత్సరమే దాదాభాయి నౌరోజీ, బ్రిటిష్ హౌస్ ఆఫ్
కామన్స్ కు, తొలిభారతీయుడిగా, ఎన్నికయ్యారు.
లండన్ లో, రాజకీయ ప్రచారం, ఎంపీ
కార్యాలయ నిర్వహణ తదితర విషయాల్లో దాదాభాయి నౌరోజీకి జిన్నా సహాయకుడిగా వుండేవాడు.
బారిస్టరై
ఇండియాకు తిరిగివచ్చాక, బొంబాయిలో, సర్ ఫిరోజ్ షా మెహతా దగ్గర
చేరాడు జిన్నా. 1905 నాటి బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్
ఎన్నికల్లో, అకౌంటెంట్ జనరల్ సి.హెచ్. హారిసన్ నాయకత్వంలోని 'కాకస్', కుట్రపూరిత పధ్ధతుల్లో, ఫిరోజ్ షా మెహతాను
ఓడించింది. 'కాకస్
కేసు'ను ప్రతిష్టాత్మకంగా చేపట్టి గెలిచాడు జిన్నా. 'కాకస్' సభ్యుడ్ని అనర్హుడిగా ప్రకటించి, ఆ స్థానంలో,
ఫిరోజ్ షా మెహతాను మున్సిపల్
కార్పొరేషన్ సభ్యుడిగా నియమించాలని బొంబాయి హైకోర్టు చారిత్రాత్మక
తీర్పునిచ్చింది. దానితో బొంబాయి బార్
కౌన్సిల్ లోనే కాక, జాతియోద్యమంలోనూ జిన్నా పేరు
మార్మోగింది. ఈ కేసులో జిన్నావల్ల
అనర్హత వేటుకు గురైన 'కాకస్' సభ్యుడు సులేమాన్ అబ్దుల్ వాహేద్ ముస్లిం
కావడం ఇంకో విశేషం.
జిన్నా ప్రత్యక్ష గురువులు , దాదాభాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా,
ఇద్దరూ పార్శీలు కావడంతో, ఆ సామాజికవర్గంతో అతనికి విస్తృత సంబంధాలు ఏర్పడ్డాయి.
తిలక్‌తో విభేదాలున్నా...
లోకమాన్య బాలగంగాధర తిలక్‌తో జిన్నాకు సైద్ధాంతిక విభేదాలు
ఉండేవన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ వృత్తి విషయంలో జిన్నా అలాంటి వ్యక్తిగత
విభేదాలను అస్సలు పట్టించుకునేవాడు కాదు. న్యాయవాది అయిన తిలక్ 1897,
1908లలో తన మీద పెట్టిన రాజద్రోహం కేసుల్ని తనే వాదించుకున్నాడు. అయితే ఈ
రెండు కేసుల్లోనూ ఆయనకు భారీగా జైలుశిక్షలు పడ్డాయి. 1916లో తిలక్‌పై
మూడోసారి రాజద్రోహం కేసు పెట్టినప్పుడు, జిన్నా ఒంటిచేత్తో ఆయన్ను నిర్దోషిగా
బయటపడేశాడు. జిన్నా లౌకికతత్వానికి తిలక్ కేసు ఒక ఉదాహరణ.
జిన్నా
పాకిస్తాన్ నిర్మాతేగానీ, అతను ఎన్నడూ మతతత్వవాదికాదు.
లౌకికవాదిగానే జీవించాడు. ప్రజాస్వామికవాదిగానే మరణించాడు. అతను ప్రజాస్వామిక
పాకిస్తాన్ కావాలని కోరుకున్నాడేతప్పా, మతరాజ్యాన్ని
నిర్మించాలనుకోలేదు. ప్రజాస్వామిక భారతదేశంలో హిందువులు మెజారిటీగా వున్నట్లే,
ప్రజాస్వామిక పాకిస్తాన్ లో ముస్లింలు మెజారిటీగా వుంటారు అన్నంత
వరకే అతను ఆశించాడు.
జీవితాన్ని
సంపూర్ణంగా ఆస్వాదించాలనేది జిన్నా అభిలాష. జిన్నా రాజకీయాలు, సంభాషణా చాతుర్యం, న్యాయవాదవృత్తి విశేషాలు, వేసుకున్న సూట్లు, వాడిన కార్లు, పెంచుకున్న కుక్కల గురించి చాలా
కథనాలున్నాయి. కానీ, జిన్నా కళాసాహిత్యాభిమానం, సౌందర్యపిపాస, సునిసితత్వం గురించి బయటి ప్రపంచానికి
తెలిసింది చాలా తక్కువ.
పాల్ రాబ్సన్ సంగీతం
షేక్స్
పియర్, జాన్ మిల్టన్ రచనలకు జిన్నా వీరాభిమాని. లండన్ లో వున్నప్పుడు దాదాపు ప్రతిరోజూ నాటక
ప్రదర్శనలకు వెళ్ళేవాడు. ఒక దశలో, షేక్స్ పియరియన్
కంపెనీలో చేరి, నాటకాలు వేయడానికి కూడా సిధ్ధమయ్యాడు. ఆఫ్రో-అమెరికన్ పౌరహక్కుల నేత, సోషలిస్టు, ప్రజాగాయకుడు, పాల్ రాబ్సన్ సంగీతమంటే జిన్నాకు చాలా ఇష్టం. రాబ్సన్ పాట 'ద ఎండ్ ఆఫ్ ఏ పెర్ఫెక్ట్ డే' అంటే అతనికి ప్రాణం. (శ్రీశ్రీ
కవిత్వమూ, పాల్ రాబ్సన్ సంగీతమూ ఒక్కటే అన్న చెలం
యోగ్యతాపత్రం గుర్తుందిగా!)
తిలక్, అనీ బీసెంట్ లతో కలిసి, హోం రూల్ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు జిన్నా. ఆ ఉద్యమం, 1916లో,
జాతీయ కాంగ్రెస్ లో విలీనం అయిపోయాక కాస్త సేదతీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది
అతనికి. అప్పటి, జిన్నా
క్లయింట్లలో జౌళీరంగ దిగ్గజం సర్ దిన్
షా పెటిట్ ముఖ్యుడు. బోంబే ప్రెసిడెన్సీలో సంపన్న పారశీ కుటుంబం వాళ్లది. దిన్
షా పెటిట్ భార్య, సైలా టాటా; జే.ఆర్.డీ. టాటాకు స్వయాన
పెద్దక్క.
దిన్
షా పెటిట్ వేసవి విడిది డార్జిలింగ్ లో వుండేది. ముంబాయి ఎండ తీవ్రతని తప్పించుకోడానికి, కొన్ని
రోజులు డార్జిలింగ్ వచ్చి వుండమని, 1916 వేసవిలో, జిన్నాను ఆహ్వానించాడు దిన్ షా. జిన్నా డార్జిలింగ్ లో వేసవి శెలవులు గడుపుతున్న సమయంలోనే, దిన్ షా పెటిట్ కుమార్తె రతన్ బాయి పరిచయం అయింది.
లేటు వయసులో ఘాటు ప్రేమ
రతన్
బాయిని సన్నిహితులు ముద్దుగా 'రూటీ' అని
పిలిచేవారు. శౌందర్యం, ఐశ్వర్యం, మేధస్సు,
జాతీయభావాలు, సంఘసంస్కరణాభిమానం కలగలిసిన
అపురూప వ్యక్తిత్వం రూటీది. ఆమెకు 'ద ఫ్లవర్ ఆఫ్ బొంబాయి' అనే బిరుదు కూడా వుంది.
జిన్నా
వ్యక్తిత్వం రూటీని విపరీతంగా ఆకర్షించింది. జిన్నాను ఆమె ’జే’ అని పిలిచేది.
మరోవైపు రూటీ అందాన్ని, ఆలోచనల్ని చూసి జిన్నా మైమరిచిపోయాడు. గాఢంగా ప్రేమలో
పడిపోయాడు. అప్పుడు జిన్నాది 40 ఏళ్ళ లేటు వయస్సు.
రూటీది 16 ఏళ్ళ లేత వయస్సు.
లవ్ స్పాట్
తాజ్ హోటల్
జిన్నా, రూటిల పెళ్ళికి దిన్ షా పెటిట్
ఒప్పుకోనప్పటికీ, పెటిట్ అత్తవారైన టాటాలు మాత్రం జిన్నాతో
పాత సాన్నిహిత్యాన్ని కొనసాగించారు. తండ్రిని ఎదిరించి జిన్నాని
పెళ్ళిచేసుకోడానికి రూటి సిధ్ధమైంది. అయితే, ఆమెకు యుక్త
వయస్సు రావడానికి అప్పటికి ఇంకా రెండేళ్ళుంది. ఈ రెండేళ్ళూ టాటాలకు చెందిన బొంబాయి తాజ్ హోటల్
ఆ ప్రేమికులకు 'లవ్ స్పాట్' గా మారింది. అప్పటికి, జె.ఆర్.డి. టాటా పన్నెండేళ్ల ముక్కుపచ్చలారని కుర్రాడు.
రూటీకి
కూడా పాల్ రాబ్సన్ అంటే మహాభిమానం. ప్రతిరోజూ రాత్రి వీడ్కోలు తీసుకోవడానికి
ముందు, ప్రేమికులిద్దరూ, తాజ్ హోటల్ బ్యాండ్ మాస్టర్ ను
ప్రత్యేకంగా కోరి, 'ద
ఎండ్ ఆఫ్ ఏ పెర్ఫెక్ట్ డే' ను పాడించుకునేవాళ్ళు.
మొదటి
నుండీ బొంబాయిలో జిన్నా సాయంకాలాలు తాజ్ హోటల్ లోనే
గడిచేవి. ఆనాటి జాతియోద్యమ అగ్రనేతలు తాజ్ హోటల్ లోనే జిన్నాను కలిసేవాళ్ళు. జిన్నాతో అలా తాజ్ హోటల్ లో సుదీర్ఘ సాయంకాలాలు పంచుకున్నవాళ్ళలో
సరోజినీ నాయుడు పేరును ప్రముఖంగా చెప్పుకుంటారు. రూటీ మేజర్ గా మారిన ఫిబ్రవరి 20,
1918 రాత్రి, జిన్నాతో నిశ్ఛితార్ధం కూడా తాజ్ హోటల్ బాల్ రూం లోనే జరిగింది.
మరియమ్ బాయి
పెళ్ళికి
ముందు రూటీ ఇస్లాం మతాన్ని స్వీకరించి, తన పేరును మరియమ్ గా
మార్చుకుంది. జిన్నా బొంబాయి నివాసం సౌత్ కోర్ట్ లో 1918
ఏప్రిల్ 19న మరియమ్, జిన్నాల వివాహం
జరిగింది. మహమూదాబాద్ మహరాజు సర్ ముహమ్మద్ అలీ ముహమ్మద్ ఖాన్ స్వయంగా దగ్గరుండి పెళ్ళి వేడుకలు
నిర్వహించాడు.
జిన్నా, రూటీల మధ్య ఇంత ప్రేమ విరబూసినా వాళ్ళ దాంపత్యం మాత్రం సజావుగా
సాగలేదు. అప్పటికే జిన్నా, రాజకీయాల్లో తలమునకలై వున్నాడు.
పెళ్లయ్యే నాటికే జిన్నా బ్రిటీష్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్
సభ్యుడు. భార్యా, పిల్లల
కోసం ఎక్కువ సమయం వెచ్చించలేకపోయేవాడు. 'ప్రేమికుడు జిన్నా'ను 'రాజకీయ
జిన్నా' మింగేయడం మొదలెట్టాడు. మరోవైపు, అనుక్షణం జిన్నా తన పక్కనే వుండాలని రూటీ ప్రగాఢంగా కోరుకునేది.
ముస్లింలీగ్ ఆఫీసును ఢిల్లీకి మార్చడంతో, జిన్నా తన
కుటుంబానికి దాదాపుగా దూరమై పోయాడు. రూటీ తన నివాసాన్ని శాశ్వితంగా తాజ్ హోటల్ కు మార్చుకుంది. ఒంటరితనంతో అనారోగ్యం
పాలయ్యి, 29వ యేట,
20 ఫిబ్రవరి 1929న తను పుట్టినరోజునే
శాశ్వితంగా కన్ను మూసింది.
ఉద్వేగాన్ని ఆపుకోలేక..
జిన్నా
స్వతహాగా అంతర్ముఖుడు. వ్యక్తిగత ఉద్వేగాలని ఇతరులతో పంచుకునేవాడుకాదు. అయితే,
రూటీ చనిపోయినపుడు, ముంబాయి మజ్ గావ్ లోని
ఖోజా షియా శ్మశానంలో, జిన్నా వెక్కివెక్కి ఏడ్చాడు. దేశవిభజన
ఖరారయ్యాక, పాకిస్తాన్ వెళ్లడానికి ముందు, 1947 ఆగస్టు మొదటి వారంలో, జిన్నా రూటీ సమాధిని చివరిసారి సందర్శించాడు. అప్పుడూ ఆతను ఉద్వేగాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చేశాడు.
జిన్నా జీవితకాలంలో, వ్యక్తిగత ఉద్వేగంతో బహిరంగంగా ఏడ్చిన
సందర్భాలు ఇవి రెండే అని ముహమ్మదాలి కరీం
(ఎం.సీ.) చాగ్లా వంటి ఆయన సన్నిహితులు తమ అనుభవాల్లో రాసుకున్నారు. .
రూటీ
చనిపోయాక జిన్నా ప్రతివారం మజ్ గావ్
శ్మశానానికి వెళ్ళేవాడు. రూటీ సమాధి ముందు నిలబడి, గతించిన
ప్రియురాలి కోసం, 'ద
ఎండ్ ఆఫ్ ఏ పెర్ఫెక్ట్ డే' పాటను 'కూనిరాగం'
తీసేవాడు.
జే ఆర్ డి అనుబంధం
రూటీ
మరణం తరువాత కూడా జిన్నా, టాటాల అనుబంధం కొనసాగింది. జిన్నా
ఏకైక సంతానం దీనా వాడియా, ఆమె సంతానం సస్లీ వాడియా (బాంబే
డయింగ్ అధినేత), డయానా వాడియాలకు జే.ఆర్.డీ. టాటా
సంరక్షకుడిగా వున్నాడు. జిన్నా ఆరోగ్య విషయాలను కూడా జే.ఆర్.డీ.
పట్టించుకునేవాడు. భారతదేశాన్ని వదిలి
వెళ్ళడానికి ముందు, జిన్నాకు ఢిల్లీలో ఫిజీషియన్ డాక్టర్
జాల్ పటేల్, రేడియాలజిస్ట్ డాక్టర్ జాల్ దాయేబూవ సమగ్ర
వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో, బొంబాయి-ఢిల్లీ-కరాచీల మధ్య జిన్నా ప్రయాణ
అవసరాల కోసం టాటా ఎయిర్ లైన్స్ ప్రత్యేక
విమానాన్ని ఏర్పాటు చేసింది. ఆ విమాన
సంస్థే తరువాతి కాలంలో,
జాతీయమై, ఎయిర్ ఇండియాగా మారింది.
పాక్ లోనూ అదే పాట
జిన్నా,
1947 ఆగస్టు 14న, పాకిస్తాన్
తొలి గవర్నర్ జనరల్ గా పదవీ స్వీకారం చేశాడు. ఆ మరునాడు, ఆయన గౌరవార్ధం, కరాచీ క్లబ్ లో విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో బ్యాండు వాయించడానికి,
ముంబాయి తాజ్ హోటల్ బ్యాండ్
మాస్టర్ కెన్ మాక్ బృందాన్ని ప్రత్యేక విమానంలో పంపించాడు జే.ఆర్.డీ. ఆ రాత్రి
అతిథులంతా వెళ్ళిపోయాక, కెన్ మాక్ తో, 'ద ఎండ్ ఆఫ్ ఏ పెర్ఫెక్ట్ డే'
పాటను ప్రత్యేకంగా పాడించుకుని విన్నాడట జిన్నా.
పాల్ రాబ్సన్ షష్టిపూర్తి ఉత్సావాలు
భారత
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కూడా పాల్ రాబ్సన్ అభిమాని.
1958లో, రాబ్సన్ షష్టిపూర్తి
ఉత్సావాలు జరపాలని భావించిన నెహ్రు, ఆ బాధ్యతను అప్పటి
బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.సీ. చాగ్లాకు అప్పచెప్పారు. నెహ్రు
నిర్ణయం రెండు విధాలుగా సాహసోపేతమైనది. ఒకవైపు, 'కమ్యూనిస్టు'
పాల్ రాబ్సన్ పట్ల అప్పట్లో అమేరికా చాలా గుర్రుగా వుంది. మరోవైపు, చాగ్లాకు, జిన్నా అనుచరుడనే పేరుంది. అయినప్పటికీ, పాల్
రాబ్సన్ - జిన్నాల అనుబంధం గురించి తెలిసిన నెహ్రు, ఉత్సవ
నిర్వహణ బాధ్యతల్ని
నిర్వర్తించడానికి చాగ్లాయే సరైన వ్యక్తి
అని భావించారు.
ఆయన నెత్తివిూద
దేశవిభజన నింద వుందికనుక, జిన్నా జీవితచరిత్రపై భారతదేశంలో
కొనసాగుతున్న ప్రఛ్ఛన్న నిషేధాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ పాకిస్తానీయులకు ఏం
రోగం? 'ప్రేమికుడు
జిన్నా' గురించి వాళ్లకూ తెలియక పోవడం ఆశ్చర్యం. ముంబాయి
విూద ముష్కర దాడి చేసినందుకు మాత్రమేకాదు,
వాళ్ళ జాతిపిత 'ప్రేమమందిరం' విూద నెత్తురు చిందించినందుకు కూడా కసబ్
అదనపు శిక్షకు అర్హుడు!.
హైదరాబాద్
4 సెప్టెంబరు 2012
- ఉషా యస్ డానీ, 90102 34336