తండ్రులులేని పిల్లలు !!
ఏ.యం. ఖాన్ యస్ డానీ
అరుణ్ సాగర్ - ఓరీ ఆర్యపుత్ర! (ఆంధ్రజ్యోతి 17 మే) సందర్భానుసారంగా వచ్చిన ఒక మంచి వ్యాసం.
"క్వాలిటీ స్పర్మ్ లేనివాళ్ళంతా వర్మ్ కాంపోస్టుకు కూడా పనికిరారు". అనే వాక్యం సరదాగా అనిపిస్తుంది. అర్ధం చేసుకుంటే భయం వేస్తుంది. అది మన మీద మన భయం మాత్రమే కాదు. మొత్తం మానవజాతి అంతరించిపోతుందని భయం.
పెద్దాపురం, అమలాపురం, రాజమండ్రి మెరకవీధిలో కళావంతుల సామాజికవర్గానికి చెందిన మహిళలు ఒకప్పుడు పెద్ద సంఖ్యలో వుండేవారు. వాళ్ళు, ఎర్రగా, ఎత్తుగా, గురజాడవారి మధురవాణిలా, చాలా అందంగా, చలాకీగా వుండేవారు. వుభయ గోదావరీ, ఉత్తరాంధ్ర ప్రాంత క్షత్రీయులు, వెలమదొరల సంపర్కంవల్ల వాళ్ళకు అంతటి అందం వచ్చిందని జనం చెప్పుకునేవారు.
ఆస్తిని సంపాదించిన తరువాత, అందం మీద దృష్టి పెట్టడం అనేది అనేక కుటుంబాల్లో కనిపిస్తుంది. నల్లగావుండే కొన్ని ధనిక కుటుంబాలు, కులాలు, 'తెల్లబడ్డం' కోసం, కళావంతుల మహిళలతో పిల్లలు కనేవారని ఒక ప్రచారం బలంగా వుండేది. ఇప్పటి సర్రోగసీకి కి అది సాంప్రదాయ రూపం అన్నమాట.
అందంగావున్న పేదింటి అమ్మాయిని, పెద్దింటివాళ్ళు, కట్నకానుకలు లేకుండానే, కొన్ని సందర్భాల్లో ఎదురుకట్నం కూడా ఇచ్చి, కోడలిగా తెచ్చుకొవడం ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూ వుంటుంది. ఇలాంటి పెళ్ళిళ్ళలో, అమ్మాయి అందంగా వుండాలనే షరతు వున్నప్పటికీ, కట్నకానుకల్ని తిరస్కరించడం అనే ఒక మానవత్వ అంశ కూడా వుంటుంది.
ఇక్కడ అందమంటే అమ్మాయి ఎర్రగా, ఎత్తుగా వుండాలని విడిగా చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్రికన్ జాతుల్లో, నలుపే శౌందర్య ప్రమాణంగా వుండేది. మరింత నల్లగా కనిపించడం కోసం మహిళలు తాపత్రయపడే సన్నివేశాలు మనకు ఆఫ్రికన్ సాహిత్యంలో కనిపిస్తాయి. అలెక్స్ హేలే 'రూట్స్ ' (ఏడుతరాలు) నవలలో నల్లటి ఆఫ్రికన్ మహిళలు మరింత నల్లటి గోరింటాకు పెట్టుకుని తమ అందాన్ని పెంచుకునే సన్నివేశం వుంటుంది; మనవాళ్ళు ఎర్రటి గోరింటాకు పెట్టుకున్నట్టు.
మనుషులు ఎర్రగా, ఎత్తుగా వుండాలనే శౌందర్య విలువ మన సమాజంలో బ్రిటీషువాళ్ళు రావడానికి ముందే మొదలైందో, ఆ తరువాతే మొదలైందో ఒక పరిశోధన జరగాల్సేవుంది. భారత సంతతిలో అత్యధికులైన హిందువులు పూజించే ప్రధాన దేవుళ్ళు 'నల్లవాళ్ళే' అయినప్పటికీ ఈ ఎరుపు వ్యామోహం ఎలా పుట్టిందో తెలుసుకోవడం ఒక ఆశక్తికర అంశమే.
సాంప్రదాయాన్ని వాణిజ్యంగా మార్చి, ఉత్పత్తిని వుధృతం చేసి, వీధుల్లొ కుప్పలుగా పొసి అమ్మడమే మార్కెట్ చేసేపని. సాంప్రదాయ ప్రక్రియల్లొ ఏదో ఒక స్థాయిలో వుండే మానవత్వ అంశను మార్కెట్ ముందుగానే చంపేస్తుంది.
1960లలో వుధృతంగా వచ్చిన కలల నవలల్లో కథానాయకుడు ఆరడుగుల అందగాడు. అతనికి పడవలాంటి చవర్లే(ట్) కారు వుండేది. అప్పట్లో చవర్లే కారంటే అంత గొప్ప. ఇప్పుడు చవర్లే కారు అనేది చిన్న విషయం. ఆడీ వంటి లగ్జరీ కార్లు నిముషానికి రెండు చొప్పున హైదరాబాద్ రోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి. మరి పెరట్లోకి ఆడీ కార్లు వచ్చాక చావిట్లోకి ఆరడుగుల అందగాడో / అందగత్తో కూడా రావాలిగా? అదే ఇప్పుడు 'వికీ డోనర్స్ ' పుట్టుకకు మూలం! గిరాకీనిబట్టి సరుకును తయారువేయడం పాతమార్కెట్ సూత్రం. ముందు సరుకును తయారుచేసి, దానికి గిరాకీని సృష్టించడం కొత్త మార్కెట్ సూత్రం.
భూస్వామ్య వ్యవస్థలో, సామాజిక ఏర్పాటు, ఉత్పత్తి రంగంలో సాంకేతిక స్థాయిని నిర్ణయిస్తుంది. పెట్టుబడీదారీ సమాజంలో,అందుకు భిన్నంగా, పారిశ్రామిక రంగంలో వచ్చే సాంకేతిక అభివృద్ధే సామాజిక ఏర్పాటును నిర్ధారిస్తుంది.
మనకు అమెరికాతో సంపర్కం పెరిగిన తరువాత, మన సౌందర్య ప్రమాణాల్లో చాలా మార్పులు వచ్చాయి. మనవాళ్ళు అమేరికాపోయి,అక్కడి దొరల్నో, దొరసానుల్నో పెళ్ళి చేసుకోవడంకన్నా, మనమే ఇండియాలొ దొరల్ని, దొరసానుల్ని ఉత్పత్తి చేయవచ్చనే ఆలోచనే 'వికీ డోనర్స్ ' కు దారితీస్తుంది. గిల్లెట్ బ్లేడుల్ని, నైక్ షూలనీ మనం ఇండియా యూనిట్లలో ఉత్పత్తి చేస్తున్నంత సులువుగా అమేరికా దొరలు, దొరసానుల్ని ఇక్కడే మన ఇళ్ళల్లొనో, కాకుంటే ఆసుపత్రుల్లోనో, ఉత్పత్తి చేయవచ్చు. అంతేకాదు, ఇక్కడ కారు చౌకగా ఉత్పత్తిచేసి, కావాలంటే ఇండియా దొరలు, దొరసానుల్ని అమెరికాకు కూడా ఎగుమతి చేయవచ్చు. రివర్స్ ఎక్స్ పోర్ట్ అన్నమాట. వాణిజ్య సమతుల్యం కూడా సరిపొతుంది!!
సంతానం లేనివాళ్ళు సంతానం కోసం తాపత్రయపడడం మొదటిదశ మాత్రమే. పుత్రకామేష్టి యాగాలకు ఆధునిక రూపంగా సంతానసాఫల్య కేంద్రాలు రంగప్రవేశం చేయడం రెండోదశ. పుట్టబోయే సంతానం రుపురేఖల్ని, వీలైతే భవిష్యత్తుని కూడా, నిర్ధారించడం (ప్రోగ్రామింగ్ చేయడం) మూడోదశ. విదేశీ జాతిని స్వదేశంలొ సృష్టించి, విదేశాలకు ఎగుమతి చేయడం నాలుగోదశ.
పది శాతం లాభం కోసం పెట్టుబడీదారుడు ఉరికంభం ఎక్కడానికి కూడా సిధ్ధపడతాడు అని కార్ల్ మార్క్స్ అన్నాడు. మార్కెటింగ్ కోసం మనుషులు తమ జాతిని కూడా అమ్ముకోగలరని మార్క్సుకు కూడా తెలిసివుండదు.
ఇప్పటికే మనం గౌరవించాల్సినవన్నీ గౌరవాన్ని కోల్పోయాయి. సమాజం కుటుంబస్థాయికీ, కుటుంబం దంపతుల స్థాయికీ కుచించుకుపొయాయి. ఆ దంపతుల వ్యవస్థను కూడా విచ్చిన్నం చేయడానికే ఈ ప్రయొగాలు. ఇక ముందు, పిల్లలకు, 'జన్మనిచ్చిన తండ్రీ (స్పెర్మ్ డోనర్) కనిపించడు. కనిపించే తండ్రి జన్మనిచ్చినవాడుకాదు. ఇంతటి వత్తిడిలొ పిల్లలు, తండ్రులు కూడా బతకాల్సివుంటుంది.
అమేరికాలో, ప్రస్తుతంవున్న చట్టాల ప్రకారం, 18 ఎళ్ళ వయస్సు వస్తేనేగానీ, పిల్లలు తమకు జన్మనిచ్చిన తండ్రి వివరాలు తెలుసుకోలేరు. అప్పటికి, ఆ పిల్లలు పెద్దాళ్ళయి, ఎలాగూ కుటుంబం నుండి విడిపొతారని అక్కడి శాసనకర్తలు భావించి వుండవచ్చు! ఈ అంశాన్ని తీసుకుని 2010లో 'ది కిడ్స్ ఆర్ ఆల్ రైట్ ' అనే సినిమా కూడా వచ్చింది.
పురుషుల్లొ టెస్టోస్టేరోన్ హార్మోను ఉత్పత్తి క్రమంగా తగ్గిపొతోందనీ, స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోను ఊత్పత్తి తగ్గి, టెస్టోస్టేరోన్ హార్మోను ఉత్పత్తి పెరుగుతున్నదని ఆధునిక పరిశోధనలు చెపుతున్నాయి. ఇలాంటి పరిణామాలు, ఆధునాతన మాతృస్వామ్య వ్యవస్థను నిర్మించవచ్చని కొందరు నమ్మవచ్చు. ఆ సంగతి ఎలావున్నా, పురుషజాతి మాత్రం అంతరించిపొతున్న జీవుల జాబితాలోకి ఇప్పటికే, చేరిపోయింది!
భగవంతుడా! తండ్రులులేని పిల్లల్ని నువ్వే కాపాడాలి!
హైదరాబాద్
18 మే 2012