"నాట్
బిఫోర్ మీ"
డానీ
గరటయ్యను నిందితుల బోనులో చూసి హైకోర్టు విస్తృత ధర్మాసనం కాస్సేపు
కంపించింది. గరటయ్యకు ఘనమైన చరిత్రవుంది. పోలీసు రికార్డుల్లో అది ఇప్పటికీ
భద్రంగావుంది. విజయవాడ రైల్వే యార్డులో పాత ఇనప ముక్కలు దొంగిలించాడని ముఫ్ఫయి
యేళ్ల క్రితం అతని మీద ఆర్పీయఫ్ వాళ్ళు కేసు నమోదు చేశారు. పోలీసులు అతని మీద ఆ
కేసు పెట్టకుండా వుండివుంటే, జడ్జిగారు అతనికి వారం రోజుల శిక్ష వేయకుండా
వుండివుంటే, గరటయ్య ఇప్పటికీ రైల్వే యార్డుల్లో పాత ఇనపముక్కలు ఏరుకుంటూ బతుకు
వెళ్ళబోసుకుంటూ వుండేవాడు. పోలీసులు కేసుపెట్టి, న్యాయస్థానం శిక్షవేసి, గరటయ్య జీవితాన్ని
మార్చేశారు. ఆర్పీయఫ్ వాళ్ళు పట్టుకుని, రైల్వే కోర్టు బోనులో నిలబెట్టినపుడు
గరటయ్యకు పౌరుషం వచ్చింది. జడ్జీగారు
శిక్ష వేసినపుడు పట్టుదల వచ్చింది. అంతే, పదేళ్ళు తిరక్కుండానే ఏపీలో ఓ అరడజను,
పొరుగురాష్ట్రాల్లో మరో అరడజను మినీ స్టీలు ప్లాంటులు కట్టేసి, మినీ
లక్ష్మీమిట్టల్ గా అవతరించాడు గరటయ్య.
పేదరికంలో మనుషులకు కులమతాలు వుండవు.
వుండవంటే వుండవనీకాదు. అలా మన్ను తిన్న వానపాములా ఓ పక్కన పడివుంటాయి. మనుషులకు డబ్బు వచ్చేకొద్దీ కులా, మతాలకు మంచి
ఎరువుపడి, వానపాములు కాస్తా త్రాచుపాములుగా మారి బుసలు కొడుతాయి. అలా డబ్బు
సంపాదించే క్రమంలో గరటయ్య ఓ రోజు గరటయ్య నాయుడు అయిపోయాడు. అతని వ్యాపార సంస్థ
’జీయన్’ గా మారిపోయింది. ’జీయన్’ అంటే షేర్ మార్కెట్లో అదో ఇది.
దొంగ సొత్తు త్వరగా పోతుందని పాతకాలంవాళ్ళు అంటారుగానీ, ఇప్పుడు దేశంలో,
కాలుష్యంకన్నా, దొంగసొత్తే వేగంగా పెరిగిపోతోంది. కార్పొరేట్ దిగ్గజంగా మారేక
గరటయ్యనాయుడు విశ్వరూపం ప్రదర్శించాడు.
అంటే, వ్యాపారంలో ప్రపంచ ఆటగాళ్లతో జట్టుకట్టాడు. గత ప్రభుత్వ హయాంలో రెండు
గ్యాస్ బేస్డ్ పవర్ ప్రాజెక్టులు, అంతకుముందున్న ప్రభుత్వంలో రెండు ధర్మల్ పవర్
ప్రాజెక్టులు తన ఖాతాలో వేసుకున్నాడు.
నాయుడి పేరుతోనో, నాయుడి బినామీల పేరుతోనో, రాష్ట్రంలోనూ, ఇతర
రాష్ట్రాల్లోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులు, సెజ్జులు చెరో అరడజను వెలిశాయి.
మార్కెట్లోకి కొత్తగా దిగే లగ్జరీ మోడలు కార్లన్నీ తన గ్యారేజీలో హాజరు
వేయించుకోవాలనిన్నూ, శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగే సెలబ్రెటీలందరూ ఒక పూటైనా తన ఆతిథ్యం
స్వీకరించాలనిన్నూ, గరటయ్యనాయుడు ఓ జీవో జారీ చేశాడు. జీవో అనగా ’గవర్నమెంటు
ఆర్డరు’ అనిగాక, "గరటయ్యనాయుడి ఆజ్ఞ" అన్ని కొన్ని పత్రికలు తెలుగులో
తర్జుమా కూడా చేశాయి.
తన అరచేతిలో ధన రేఖను గీసిన కోర్టువారన్నా, తన నెత్తి మీద లక్ష్మీకటాక్షాన్ని
కురిపించిన పోలీసువారన్నా గరటయ్యనాయుడుకు చాలా గౌరవం. గరటయ్యనాయుడి ఆతిథ్యం
స్వీకరించేవారిలో, ముందు పోలీసు అధికారులే వుండేవారు. ఆ తరువాత అతిథుల పరిధి
పెరిగింది. మంత్రులు, సినిమా హీరోలు, క్రికెటర్లు, మీడియా టైకూన్లు చేరారు. ఇటీవల
హైకోర్టు న్యాయమూర్తులకు కూడా అతిథుల జాబితాలో చోటు కల్పించాడు గరటయ్యనాయుడు.
సరిగ్గా ఈ సమయంలోనే గరటయ్య నాయుడి కథ మలుపు తిరిగింది. ప్రభుత్వాధినేతలతో
గరటయ్యనాయుడు పనులు చేయుంచుకునేవాడేతప్ప, ఎవరితోనూ, ఎప్పుడూ మరీ పూసుకు
తిరిగేవాడుకాదు. మనిషి ఎదగాలంటే, కుర్చీ ప్రధానం, కుర్చీలో కూర్చున్నవాడు అప్రధానం
అనేది అతని పాలసీ. కానీ, గత ప్రభుత్వంలో అతను ఒకే ఒకసారి పాలసీ తప్పాడు. గత సీయం
రాష్ట్రాన్ని కనీసం ఇరవై యేళ్ళు ఏలుతాడని నమ్మేశాడు. ఆ సీయంను భుజాలమీదేకాక ఏకంగా నెత్తిమీదే
పెట్టేసుకున్నాడు. కానీ, ప్రభుత్వం పడిపోతుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతను
అనుకోనిది జరిగిపోయింది.
కొత్త ప్రభుత్వం గరటయ్యను బధ్ధశత్రువుగా భావించింది. గత సీయం మీదున్న కసినంతా,
గరటయన్నాయుడి మీద తీర్చుకోవాలనుకుంది. అలా అనుకోవడమే తరువాయి, సిబీఐ చురుగ్గా కదిలింది.
ముఫ్ఫయేళ్ళుగా గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్ళను బయటికి తీసి, వాటి బూజు కూడా దులపకుండా
గరటయ్య నాయుడి నెత్తిన పడేసింది.
మనిషి మహత్తర విజయం సాధించడానికి ఒక్క మలుపు చాలు. మనిషి పతనాన్ని శాసించడానికి
ఒక్క తప్పు చాలు.
ఫ్లాష్ బ్యాక్ ను వదిలేసి మల్లా వర్తమానానికి
వచ్చేస్తే, ఆలా హైకోర్టు బోనులో నిలబడ్డాడు. ఆ షాకు నుంచి అందరికన్నా ముందుగా తేరుకుని
ఆత్మపరిశీలన చేసుకున్నది ప్రధాన న్యామూర్తులంవారే. "జీయన్ సంస్థలో నాకు లక్షన్నర
షేర్లున్నాయి. కనుక ఈ కేసును నేను విచారించడం సమంజసం కాదు. నాట్ బిఫోర్ మీ" అంటూ
ఓక ప్రకటన చేసి, ధర్మాసనం దిగి, గౌను సర్దుకుంటూ, చకచకా వెళ్ళిపోయారువారు.
గరటయ్య నాయుడు జీవితంలో ప్రతి మెట్టులోనూ కోర్టు వాజ్యాలు ఎదుర్కొన్నాడు. ఏ కేసునూ
అతను ఆషామాషీగా తీసుకోలేదు. ప్రతిదానికీ పెద్ద లాయర్లనే పెట్టాడు. విజయాలు సాధించాడు. ఆ పెద్ద లాయర్లంతా ఇప్పుడు న్యాయమూర్తులయ్యారు. అదియునూకాక, దేశంలోని ప్రధాన
రాజకీయ పార్టీలన్నింటికీ గరటయ్య నాయుడు, తనవైన సేవలు అందించాడు. హైకోర్టు న్యాయమూర్తుల్లో,
ఎక్కువమంది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రాజకీయపార్టి సిఫారసుతో నియమితులైనవాళ్ళే. అదలావుంచినా,
ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న లాయర్లలో చాలా మంది, ప్రస్తుత న్యాయమూర్తుల
వద్ద ఒకప్పుడు జూనియర్లుగా పనిచేసినవారే.
మనం అంతగా గమనించంగానీ, ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఘరానా దొంగలు, పెద్ద పోలీసు
ఆఫీసర్లూ, పేరుమోసిన న్యాయవాదులూ, ప్రధాన రాజకీయపార్టీల నాయకులు, తీర్పు చెప్పే న్యాయమూర్తులూ
అంతా ఒకే సామాజికవర్గానికి చెందివుంటారు. లేకుంటే,
ఒకే ఆర్ధికవర్గానికి చెందివుంటారు. సమాజాన్ని యేలేవాళ్ళే సాధారణంగా న్యాయస్థానాల్నీ
ఏలుతారు.
కోర్టులో అందరూ ఒకసారి ఒకరిముఖాలు ఓకరు చూసుకున్నారు. ధర్మాసనం మీది న్యాయమూర్తులకూ, ధర్మాసనం కింది న్యాయవాదులకూ,
బోనులో నిలబడ్డ నిందితునికీ మధ్య ఎదో కనిపించని నూలుపోగు సంబంధం వుందని అందరికీ హఠాత్తుగా
తెలిసివచ్చింది. అలా తోచిందే తడవుగా, న్యాయమూర్తులందరూ ధర్మాసనం దిగి, గౌన్లు సర్దుకుంటూ
వెళ్ళి పొయారు. ఆ వెనుక న్యాయవాదులు కూడా కోర్టు హాలు వదిలి వెళ్ళిపోయారు.
ఈ పరిణామాల్ని చూసి, గరటయ్య నాయుడు ఖిన్నుడయ్యాడు. "కడిగిన ముత్యంలా, సానబెట్టిన వజ్రంలా బయటికి
వస్తాను" అని అతను భీకర ప్రతిజ్ఞ చేసి వచ్చాడు. ముప్పయి యేళ్ళుగా న్యాయస్థానం మీద అతను పెంచుకున్న నమ్మకం అలాంటిది.
"నన్ను వదిలి వెళ్లవద్దు" అని అతను అందర్నీ బతిమాలుకున్నాడు. ఎవ్వరూ అతని
మాటల్ని వినలేదు. దానితో గరటయ్యనాయుడిలో పౌరుషం
పెల్లుబికింది. "నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే వరకు ఈ నిందితుడి బోనులో నుండి
కదలనుగాక కదలను" అని అతను ఇంకో శపథం చేశాడు.
హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచీలు, డివిజన్ బెంచీలు, ఫుల్ బెంచీలు, హాఫ్ బెంచీలు,
క్వార్టర్ బెంచీలు అంటూ అనేక ధర్మాసనాలుంటాయి. ధర్మాసనం అన్నాక న్యాయమూర్తులుంటారు.
న్యాయమూర్తుల్లో తప్పనిసరిగా మనుషులు వుంటారు. మనుషులన్నాక కులాలు, మతాలు, తెగలు, ప్రాంతాలు,
భాషలు, సంస్కృతీ-సాంప్రదాయాలు, వాణిజ్య-వ్యాపార ఆసక్తులు అన్నీ వుంటాయి.
అయితే, వాళ్ళందరికీ గరటయ్యనాయుడితో, నేరుగా సంబంధాలున్నాయని అనడమూ తప్పే. గరటయ్యనాయుడితో
మానవ సంబంధాలులేనివాళ్ళు హైకోర్టులో చాలామందే
వున్నారు. ముచ్చటపడి జీయన్ సంస్థలో షేర్లు
కొనుక్కున్న కారణాన వాళ్లకు అతనితో మార్కెట్
అనుబంధం మాత్రమే వుంది. ఏదైనా సంబంధం
సంబంధమేకదా! భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే.
హైకోర్టులోని బెంచీలన్నీ గరటయ్యనాయుడి కేసును విచారించడానికి తిరస్కరించడంతో, నాయుడి
మనస్సు చివుక్కుమంది. అతను, ఆ విస్తృత ధర్మాసనం
ముందున్న బోనులో దాదాపు ఇరవై నాలుగు గంటలు తిండీతిప్పలులేక అలా నిలబడిపోయాడు.
నిందితుడు బోనులోనూ, న్యాయమూర్తులు ధర్మాసనం బయటనూ వుండిఫోవడంతో న్యాయవ్యవస్ద్థలోనే సరికొత్త సంక్షోభం తలెత్తింది. పరిస్థితిని చక్కదిద్దడానికి,
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హుటాహుటిన రాష్ట్రపతి భవనానికి చేరుకున్నారు. దేశంలోని న్యాయవేత్తలందరితో, అర్ధరాత్రి వరకు మేధోమధనం
సాగించిన రాష్ట్రపతి, చివరాఖరికి నాయుడి సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు.
"ఈ కేసు, ఈ దేశపు ధర్మాసనాలు విచారించదగినదికాదు. ధర్మాసనాల పరిధిలోనికిరాని
నేరాలేవీ నేరాలు కావు. ప్రస్తుతం అమల్లో వున్న చట్టాల ప్రకారం గరటయ్య నాయుడు సంపూర్ణ
నిర్దోషి. అతను నిందితుల బోనును వదిలిపెట్టి, స్వేఛ్ఛగా ఇంటికి వెళ్ళిపోవచ్చు"
అంటూ హైకోర్టు రిజిస్ట్రార్ వారు మరునాడు ఒక అధికార ప్రకటన చేశారు.
హైకోర్టు రిజిస్ట్రారువారి ప్రకటన అసలు ప్రతిని అందుకున్నాక మాత్రమే, గరటయ్య నాయుడు
సగర్వంగా తల ఎగిరేసి, బోను వదిలి బయటను నడిచాడు.
(కక్షిదారులతో భావబంధాలున్న న్యాయమూర్తులు కేసుల్ని విచారించడం సమంజసం కాదన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ లోకూర్ గారికి అభినందనలతో)
హైదరాబాద్
5 May 2013