నా
సహాధ్యాయులు
అహ్మద్
మోహిద్దీన్ ఖాన్ యజ్దాని (డానీ)
నరసాపురమన్నా, మిషన్ హైస్కూలన్నా, అల్లూరి
శ్రీరామరాజన్నా నాకు వెర్రి అభిమానం. ఈ వెర్రి గురించి నన్ను ఆట పట్టించినవాళ్ళూ
వున్నారు. అదుపు చేసుకోలేని వుద్వేగంతో తప్పా,
నేను వీటి గురించి మాట్లాడలేను. ఇది నాకు నయంకాని జబ్బు!
తరువాతి కాలంలో, వైయన్ కాలేజీ, మైసూరు యూనివర్శిటీల్లో నేను
చదివినప్పటికీ, నా గురుకులం నరసాపురం
మిషన్ హైస్కూలే. నా మీద మా అమ్మి ప్రభావం ఎంతగావుందో, మా మిషన్ హైస్కూల్ ప్రభావం
అంతకన్నా ఎక్కువగావుంది. జీవితాన్ని అర్ధం చేసుకోవడం, ఆస్వాదించడం రెండూ అక్కడే
మొదలెట్టాను.
జాతియోద్యమానికీ, నరసాపురం విద్యా సంస్థలకూ ఒక
అవినాభావ సంబంధంవుంది. నరసాపురం టేలర్ హైస్కూలులో
అల్లూరి శ్రీరామరాజు చదవగా, మిషన్ హై స్కూలులో చిలకమర్తి లక్ష్మీనరసింహం
చదివారు.
టేలర్ పేట బోర్డు స్కూలులో ఏయిత్ స్టాండర్డ్
చదివిన తరువాత, 1964 లో
నేను మిషన్ హైస్కూల్ లో, తొమ్మిదో తరగతిలో చేరాను. అప్పట్లో
పదకొండవ తరగతి పాసైన వాళ్లకు సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్
(ఎస్.ఎస్.ఎల్.సి.) ఇచ్చేవారు. మాది 1967 ఎస్.ఎస్.ఎల్.సి. బ్యాచ్.
స్కూల్లో ఏ సెక్షన్ అంటేనే అదో దర్జా!.
అందులోనూ మాది ముందు బెంచి. అదొక చిన్న సైజు భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం. నాకు
ఎడమపక్క అమ్మనమంచి కృష్ణశాస్త్రి. కుడిపక్క కాల్విన్ విక్టర్ బాబ్. మధ్యలో నేను;
అహ్మద్ మొహిద్దీన్ ఖాన్. అదో అద్భుత మతసమ్మేళనం. స్వభావాల్లోనూ మా మధ్య విపరీతమైన
వైవిధ్యం. పక్కన పిడుగు పడినా చలించేవాడుకాదు కాల్విన్. కృష్ణశాస్త్రి తనే ఒక పిడుగు. ఎప్పుడూ
రగిలిపోతూ వుండేవాడు. కోపం వస్తే, ముఖం ఎర్రగా కంద గడ్డలా మారిపోయేది. అప్పడతన్ని
ఎదుర్కోవడం ఎవరితరంకాదు. ఒకడు మంచు కొండ. ఇంకొకరు అగ్నిపర్వతం. కాల్విన్ నీటుగా
తలదువ్వుకుని ఎప్పుడూ చిరునవ్వుతో వుండేవాడు. శాస్త్రి తల దువ్వేవాడేకాదు. నేను ఇద్దరి మధ్యన మూడేళ్ళు వున్న
కారణంగా, సగం శాస్త్రిగానూ, సగం కాల్విన్
గానూ వుండేవాడ్ని. కాల్విన్, నేనూ సిగ్గరులం. శాస్త్రీ మాత్రం అమ్మాయిలతో చొరవగా
మాట్లాడేవాడు. వాడ్ని చూస్తే మాఇద్దరికీ అదో ఇది! అది అసూయా కావచ్చూ. ప్రశంసా
కావచ్చు. అసూయతోకూడిన ప్రశంసా కావచ్చు.! ప్రశంసాపూర్వక అసూయా కావచ్చు!!
మా సెక్షన్ కురు సైన్యంలా అతిరథ, మహారథులతో
క్రిక్కిరిసిపోయివుండేది. ఒక్కొక్కడూ ఒక్కోరంగంలో నిపుణుడు. కాంపోజిట్ మ్యాథ్స్
లో పివి నాయుడు మహారథి. మాస్టారు
బోర్డుమీద ఈక్వేషన్ రాయడం పూర్తిచేయక ముందే నాయుడు జవాబురాసి పరుగెత్తేవాడు. ముందు
రోజే ఆ ఈక్వేషన్ నాయుడుకు ’లీక్’ అయిపోయేదేమోనని నాకు తెగ అనుమానంగా వుండేది.
హిందీలో మేకా సూర్యప్రకాశరావు మహారథి. తెలుగులో కూనపరెడ్డి భగవన్నారాయణ అతిరథుడు.
క్లాసులో కోడి వీరవెంకట సత్యనారాయణ కురువృధ్ధుడు. పల్లి అశోక్ జాన్ లోకం చుట్టిన
వీరుడు. మేము పదేళ్ల తరువాత చేయబోయే సరదా పనులన్నీ అతను అప్పటికే చేసేసి, మళ్ళీ
బుధ్ధిగా తిరిగివచ్చి స్కూల్లో చేరిన ’బొంబాయి బాబూ’. స్టైల్లో అశోక్ ఒక
దశాబ్దం ముందుండేవాడు. మా తరానికి నేరో
కట్ ట్రౌజర్ ను పరిచయం చేసింది అతనే. పువ్వాడ
కృష్ణమూర్తి, గౌస్ మొయినుద్దీన్ కామెడీ పండించడంలో అతిరథులు. సన్నివేశం
అనుమతించినా, అనుమతించకున్నా వాళ్ళు తెగ
నవ్వించేవారు. "మేరా దిల్ కుడి భుజం మే హై" అంటూ తిరిగేవాడు పువ్వాడ.
జాన్ మాస్టారిని మ్యాప్ పాయింటింగ్ క్లాసులో పువ్వాడ ఆటపట్టించడడం నాకు ఇప్పటికీ
గుర్తు. ఒకరోజు జాన్ మాస్టారు యమునా నదిని
చూపిస్తున్నారు. పువ్వాడ లేచి, "జమున ఎక్కడ మాస్టారూ?" అని గంభీరం
అడిగారు. జాన్ మాస్టారిది అదోలోకం. వారికి సినిమా
పరిజ్ఞానం అస్సలు వుండేదికాదు. జమున అని ప్రముఖ హీరోయిన్ వున్నట్టు కూడా ఆయనకు
తెలీదు. పాపం ఆయన మ్యాపులో జమునను వెతికేపనిలో పడ్డారు. మమ్మల్నందరినీ ఒక కంట
కనిపెట్టేపనిలో ఐవీకేయం లీలాప్రసాద్ వుండేవాడు. అతని చూపులు చిత్రంగా వుండేవి. మా
గురించి అతను రోజూ హెడ్మాస్టరుకు రిపోర్టు ఇస్తాడని నాకు అనుమానంగావుండేది. ప్రతిరోజూ లంచ్ అవర్ కు ముందు మాకు ప్రత్యేక
బైబిల్ క్లాసు వుండేది. మేమంతా లాంఛనంగా దానికి హాజరయ్యేవాళ్ళం. అయితే, ఆ
వయసులోనే ప్రగాఢమైన ఆధ్యాత్మిక భావాలు కలిగినవాళ్ళూ మా క్లాసులో
వుండేవారు. బూసి భానుమూర్తి, కొమనాపల్లి ప్రతాప్ సిన్హ, వంగలపూడి కృపాల్ ఈ కోవలోకి
వస్తారు.
మూడేళ్ళూ మాది అమ్మాయిలు లేని సెక్షన్.
కాంపొజిట్ మ్యాథ్స్ పీరియడ్‌కు మాత్రం ఇతర సెక్షన్ల నుండి ఓ డజను మంది అమ్మాయిలు
వచ్చేవారు. జోస్యుల ముత్యం మా స్కూలు బ్యూటీ. నిరాడంబరతతో విపరీతంగా ఆకట్టుకునే
స్వభావం జవదల విజయలక్ష్మిది. టెన్నిస్ క్రీడాకారిణి విజయలక్ష్మి అప్పట్లో మాకు
ప్రత్యేక ఆకర్షణ.
క్లాసుల్లో సంగతి ఎలావున్నా, ప్లే గ్రౌండులో
మాత్రం సూపర్ హీరో నేలపూడి శ్యాంబాబు. వాడు ఈ మూల నుండి బాల్ ను తంతే గ్రౌండులో ఆ
మూలకు వెళ్ళి పడేది. ఆ విన్యాసం చూడ్డానికి రెండుకళ్ళూ సరిపోయేవికావు. స్కూలుకు ఒక మంచి ఫుట్ బాల్ టీమ్ ను తయారు చేయాలని తెగ సరదా పడేవాడు. ప్లే
గ్రౌండ్ పక్కనే స్కూలు కరస్పాండెంట్ బంగళా వుండేది. అప్పట్లో, డిబీ బర్ట్ సంతతికి
చెందిన వారు ఇంగ్లండ్ నుండి ఇక్కడికి వచ్చి స్కూలు వ్యవహారాలు స్వయంగా
చూసుకునేవారు. దొరవారి కుటుంబీకుల వచ్చీరానీ తెలుగుని శ్యాంబాబు ఆటపట్టించేవాడు. "హాయ్
వెంకన్నా! అయ్యగారి గదిలో గడ్డపార పెట్టు" అని దొరసాని అంటే మా శ్యాంబాబు
దాన్ని ద్వందార్ధంతో పలికి హాస్యం పండించేవాడు.
ఒకసారి
కరస్పాండెంటు కొడుకు గ్రౌండులో ఆడుకుంటూవుంటే, టెన్నిస్ బాల్ ఇంట్లోకి పోయింది. బాల్ వెనుక పరుగెట్టిన
ఆ కుర్రడి తల గుమ్మానికి డీకొంది. పిల్లాడి తలకు గాయమై రక్తం కారడంతో దొరసాని
కంగారు పడిపోయింది. అంతలో బయటికి వచ్చిన దొర
ప్రశాంతంగా "ఇదేంటి గుమ్మం పగిలిపోయింది" అన్నాడు. ఆ మాట
వినగానే, ఆ కుర్రాడు గాయం బాధను కూడా మరిచిపోయి ఎక్కడ డ్యాడ్?" అంటూ లేచి
నిలబడ్డాడు. దొరవారి సమయస్పూర్తి మాకు చాలా వింతగా అనిపించింది.
చదువుతోపాటు విద్యార్ధుల్లో సేవాభావాన్ని కూడా
పెంపొందించాలని అప్పటి స్కూలు నిర్వాహకులు భావించేవారు. మా మిషన్ హైస్కూలును
గోదావరి డెల్టా మిషన్ (జీడీయం) సేవా సంస్థ నడిపేది. ఆ సంస్థే నరసాపురంలో
సుప్రసిధ్ధ మిస్సమ్మ ప్రసూతి హాస్పిటల్, సీతారాంపురంలో బెత్వా లెప్రసీ హాస్పిటల్
నిర్వహించేది. ఎస్.ఎస్.ఎల్.సి. అంతిమ పరీక్షలకు ముందు మా కందరికీ బెత్వా లెప్రసీ
హాస్పిటల్ చీఫ్ డాక్టర్ షార్ట్ తో కుష్టురోగం మీద అవగాహన తరగతులు నిర్వహించారు.
మా బ్యాచిలో ముఖ్యంగా చెప్పాల్సింది మా దళపతి
పెదగాడి చిదంబరం గురించి. ఆరడుగుల అందగాడు. కళాకారుడు. మేధావి. స్థిత ప్రజ్ఞుడు.
అతను మాకు సహజ నాయకుడు. ఎస్పియల్ కూడా.
అప్పట్లో, నేను కూడా బొమ్మలు వేసేవాడ్ని. కానీ, చిదంబరం వేసే అద్భుతమైన బొమ్మల్ని
చూసేక, వేరేదారి చూసుకోవడం శ్రేయస్కరం అనుకున్నాను. నేను రాత మీద దృష్టి
మళ్ళించడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. చివర్లో సైన్స్ ప్రాక్టికల్స్ కు
చిదంబరం డార్విన్ చిత్రపటాన్ని గీశాడు. నేను మానవుని జీర్ణమండలం రబ్బరు మోడల్
తయారు చేశాను. ఓ ఇరవై యేళ్ల తరువాత నేను ఒకసారి మా స్కూలు ల్యాబ్ కు వెళ్ళాను.
చిదంబరం గీసిన చిత్రపటం, నేను చేసిన మోడల్ రెండూ అక్కడ ప్రదర్శనలో వున్నాయి.
స్కూలు వదిలిన తరువాత నా సహాధ్యాయులతో నా
సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. నాకు దూరపు
బంధువు కూడా కావడాన పాఛ్ఛా షరీఫ్ (జంషీద్)తో నా సంబంధాలు కొంతకాలం కొనసాగాయి. నేను
విజయవాడలో స్థిరపడిన కారణంగా, కృష్ణశాస్త్రీ అక్కడ పనిచేసినపుడు తరచూ కలుసుకునేవాళ్ళం.
మిషన్ హైస్కూలులో చదివే రోజుల్లోనే మేము ’విశాఖ
ఉక్కు-ఆంధ్రుల హక్కు’ ఉద్యమంలో చురుగ్గా
పాల్గొన్నాం. నిరాహార దీక్షలు కూడా చేశాం.
ఉపాధ్యాయుల దినాన్ని మేము చాలా వేడుకగా జరుపుకునేవాళ్ళం. 1971-72 ల నాటి జైఆంధ్రా ఉద్యమంలో నేనూ కృష్ణశాస్త్రి క్రియాశీలంగా పాల్గొన్నాం.
అప్పటి ఆంధ్రా నిరుద్యోగుల సంఘానికి కృష్ణశాస్త్రీ అధ్యక్షుడు, నేను కార్యదర్శి.
(ఇప్పుడు మామధ్య లేకుండాపోయిన నా సహాధ్యాయుల స్మృతిలో)
హైదరాబాద్
మేడే, 2013
Danny, your attempt to script your experiences during school days is quite interesting and makes readers race through it. I know there is a good writer in you. Childhood is sweet, whether it is your own or anybody's.
ReplyDeleteyou continue the effort. But see that each piece is not so lengthy. Neegurinchi Satish garu chesina comment really heart-touching. kashtalanu lopala dachukuna gunamata. ade `in-shirt cheyadam.
Thank you very much nagaraja.
ReplyDelete