గురుకులం
అహ్మద్ మోహిద్దీన్ ఖాన్ యజ్దాని (డానీ) ]
టేలర్ పేట బోర్డు స్కూల్లో పుష్పలత టీచర్,
యూసుఫ్ మాస్టారు వల్ల నాకు తెలుగు భాష మీద ఆసక్తి పెరిగింది. దానికి మెరుగులు దిద్దిందీ,
తెలుగు భాషకున్న సౌలభ్యాన్ని నేర్పిందీ మిషన్ హైస్కూలులో మా విద్వాన్ పేరి రామారావుగారే.
వారు పద్యం పాడుతుంటే, సెలయేరు ప్రవహిస్తున్న శబ్దం వచ్చేది. ఇవ్వాళ నా జీవనోపాధి రాతే.
"విధిరాత అంత గొప్పగా లేకున్నా, చేతిరాత మాత్రం బాగుంది" అని నా మీద నేనే
ఛలోక్తి విసురుకుంటా. అది పేరి రామారావు మాస్టారి దయే. దూరదర్శన్, 1991 లో, ప్రసారం చేసిన ’చాణక్య’ హిందీ
సీరియల్ ను ఆంధ్రజ్యోతిలో నేను తెలుగు అనువాదం చేసేవాడ్ని. పౌరాణికగాథ కావడాన ఆ హిందీలో
సంస్కృత పదాలు విపరీతంగా వుండేవి. తెలుగు పరిష్కారం ఒక సవాలుగా మారేది. నేను ఆ సవాలును
అవలీలగా అధిగమించాను. సంపాదకులు నండూరి రామ్మోహనరావుగారు ఒకసారి నన్ను పిలిచి
"ఎలా రాయగలుగుతున్నారూ?" అనడిగారు ప్రశంసాపూర్వకంగా. "మీరు ముస్లింకదా?"
అనే ధ్వని అందులోవుంది. "విద్వాన్ పేరి రామారావుగారి శిష్యుడ్నండి. తెలుగులో గట్టి పునాదే వుంది" అన్నాను.
ఒకసారి క్లాసులో ద్విరుత్త టకార సంధి సూత్రం చెప్పమన్నారు మాస్టారు. ఎవరూ చెప్పలేదు.
ఆరోజు ఏ కళన వున్నాడోగానీ, మా తెలుగు అతిరధి, కూనపరెడ్డి భగవన్నారాయణ కూడా చెప్పలేదు.
ఇప్పుడు మా "సాయిబుశాస్త్రులు చెపుతాడు"
అన్నారు మాస్టారు. బహుశ అది నా రోజై వుంటుంది. "ఎవ్రి డాగ్ హాజ్ ఇట్స్ డే"
అనేమాట ఎలాగూ వుందిగా. నేను సూత్రం, ఉదాహరణ రెండూ చెప్పాను. అలా నేను ’సాయిబుశాస్త్రులు’
గా స్థిరపడిపోయాను.
నాలుగు రోజుల క్రితం ఒకచోట చర్చ వచ్చింది. ఇంగ్లీషులో ’ఫస్ట్ పర్సన్’ కు ఒకాయన ’ప్రధమ పురుష’ అని అనువదించాడు. నేను ఒకసారి రామారావు
మాస్టార్ని తలుచుకుని, "తను ఉత్తమ. ఎదుట
మధ్యమ, ఎక్కడెక్కడో ప్రధమ" అని సూత్రం చెప్పి, ఓ మెచ్చుకోలు కొట్టేశాను.
ఒక కూలీ రోజుకు ఐదు ఘనపు అడుగుల గోడ కడితే, ఇద్దరు కూలీలు, ఐదు రోజుల్లో ఎంత గోడ
కడతారు? ఇదీ ప్రశ్న. దీనికి జవాబు యాభై అని ఎవరైనా రాస్తే, కేఎన్నార్ అనబడే మా కే. నరసింహ రావు మాస్టారు
డస్టరుతో కొడతారు. "పిడకలా? గేదెలా?" అని ఆన్సర్ షీటు మీద రెడ్డింకుతో రాస్తారు.
"50 ఘనపు అడుగులు" అనేది సరైన సమాధానం. ఏ ప్రకటన అయినా సమగ్రంగా వుండాలని కేఎన్నార్
మాస్టారి దగ్గర నేర్చుకున్నా. ఈ సూత్రం తెలియనివాళ్ళు జీవితంలో ’’వ్యక్తీకరణ లోపం’తో’ ఇబ్బంది పడతారు. కేఎన్నార్
మాస్టారి దగ్గర నేర్చుకోవాల్సిన మరో లక్షణం సమయపాలన. "మనం చేరాల్సిన గమ్యానికి
పది నిముషాల ముందే చేరుకుని, ఆ పరిసరాల్లో సేదదీర్చుకుని, సరిగ్గా చెప్పిన సమయానికి
వాళ్ళ తలుపు కొట్టాలి" అనేవారు. "ముందుగా వెళ్లడమూ తప్పే. ఆలస్యంగా వెళ్లడమూ
తప్పే" అని హెచ్చరించేవారు.
మాది తెలుగు మీడియం చదువు. అయినా మా తరానికి ఇంగ్లీషు అంటే అంతగా భయం వుండేదికాదు.
ఇంగ్లీషు భాషాశాస్త్రంలో ప్రసిధ్ధులైన బీ. థియోడర్ మాస్టారు మిషన్ హైస్కూలు లోనే పాఠాలు
చెప్పేవారు. ఎం. సంజీవ రావు మాస్టారైతే, "ఈవెన్ ద డాగ్స్ బార్క్ ఇన్ ఇంగ్లిష్
ఇఫ్ ఐ వుడ్ టీచ్ దెమ్ ఫర్ ఏ వీక్" అనేవారు. ఆ మాటలు మాకు తెగ ఉత్తేజాన్నిచ్చేవి.
థామస్ హ్యూజెస్ రాసిన టామ్ బ్రౌన్ స్కూల్ డేస్, ఛార్లెస్ డికెన్స్ రచనలు ఆలివర్ ట్విస్ట్,
డెవిడ్ కాపర్ ఫీల్డ్ మాకు నాన్-డిటెయిల్డ్ గా వుండేవి. అప్పట్లోనే నేను ఛార్లెస్ డికెన్స్ ప్రేమలో పడ్డాను. సంజీవరావు మాస్టారి
శరీరధారుఢ్యం కూడా ఒక ఆదర్శం. ఆయనో కండల వీరుడు.
పాలకొల్లు నుండి స్కూలుకు ఇరవై నిముషాల్లో వచ్చేసేవారు. బూటు మునివేళ్లమీద లేచి
స్ప్రింగులా ఊగుతూ వారు పాఠం చెప్పే ముద్రలు ఇప్పటికి మరిచిపోలేనివి. ఆయన ఉఛ్ఛారణలో
విపరీతమైన ఆత్మవిశ్వాసం వుండేది.
సాంకేతిక విజ్ఞానశాస్త్రాన్ని జేవీ అని పిలిచే జోస్యుల వేంకటేశ్వర రావు మాస్టారు,
చెప్పినంత ఆసక్తికరంగా పాఠం చెప్పగల టీచరు మరొకరు వుండరు. పాఠం చెప్పడంలో వారిదొక ప్రదర్శన
కళ. అధ్యయనం అనేది ఒకరు చెప్పడం ఇంకొకరు వినడంకాదు. గురువు, విద్యార్ధులు కలిసిచేసే
విద్యాయజ్ఞం.
ఎడమ చేతి చూపుడు వేలిని పైకి లేపి, "ఇదేమిట్రా" అని అడిగితే క్లాసు క్లాసంతా
"టెస్ట్ ట్యూబ్" అనేది.
అందులో కుడి చేత్తో , ఉత్తుత్తినే, డైల్యూటెడ్
హైడ్రో క్లోరిక్ యాసిడ్ పోసేవారు. ఆ తరువాత అందులో జింకు ముక్క (యశదం), అదీ ఉత్తుత్తినే,
వేసేవారు. మధ్యలో ఇంకో ప్రశ్న; "జింకు
ఎక్కడ దొరుకుతుందీ?" అని.
"డ్రై బ్యాటరీ సెల్లుకు వుంటుంది" అని అందరి జవాబు.
ఈలోపులో. ఆ ’చూపుడువేలు టెస్ట్ ట్యూబు’ వైపు కంగారుగా చూసి, "బుసబుసబుస
... ఏదో గ్యాస్ వస్తోందిరోయ్" అనేవారు.
అలా వస్తున్న గ్యాస్ ను కుడిచేయి పిడికిట్లో బంధించి , "ఏమిటీ గ్యాస్?"
అని అడిగేవారు.
క్లాసులో సస్పెన్సు! జెవీ మాస్టారు బ్లాక్
బోర్డు దగ్గరికి వెళ్ళి, ఈక్వేషన్ రాసేవారు.
"హెచ్ సిఎల్ ప్లస్ జింక్ ఇజ్ ఈక్వల్ టూ జింక్ క్లోరైడ్ ప్లస్ క్యాపిటల్ హెచ్. జింక్ క్లోరైడ్ పక్కన బాణం గుర్తు కిందికి. క్యాపిటల్
హెచ్ పక్కన బాణం గుర్తు పైకి".
"ఈ క్యాపిటల్ హెచ్ ఏమిటీ?" మళ్ళీ ప్రశ్న.
"హైడ్రోజన్" అని కొందరి జవాబు.
"ఇది హైడ్రోజన్ అని ఎలా చెపుతారూ?" ఇంకో ప్రశ్న.
"అగ్గిపుల్ల పరీక్ష" మరికొందరి జవాబు.
"అయితే అగ్గిపుల్ల తెండి. అగ్గిపెట్టె లేదా? సిగరెట్లు కాల్చడం వచ్చు. అగ్గిపెట్టె
పెట్టుకోవడం తెలీదా?" అంటూ మధ్యలో ఓ చురక!
ఎవరో ఒకరు ముందుకు వెళ్ళి, ఉత్తుత్తి అగ్గిపుల్ల వెలిగించినట్టు నటించేవారు.
"భుస్. అగ్గిపుల్ల ఆరిపోయి గ్యాస్ మండిపోతోంది. ఇది ఏం గ్యాసూ?". ఇంకో
ప్రశ్న.
"హైడ్రోజన్! హైడ్రోజన్!" క్లాసంతా
అరిచేది.
"అగ్గిపుల్ల మండితే ఏం గ్యాసూ?"
"ఆక్సిజన్! ఆక్సిజన్" మళ్ళీ క్లాసంతా అనేది.
అప్పుడు మాస్టారు, పరకాయ ప్రవేశం నుండి బయటికి వచ్చి, "ఇక నోట్స్ రాసుకోండి.
ప్రయోగశాలలో హైడ్రోజను తయారు చేయు విధానము" అనేవారు.
అలా ఎవరైనా క్లాసు చెపితే దాన్ని జీవితాంతం మరిచిపోవడం ఎవరికైనా సాధ్యమా?
లాజరస్ మాస్టారు భౌగోళికశాస్త్రం చెప్పేతీరు కూడా ప్రత్యేకంగా వుండేది. "పెరంబూరు,
రైలుపెట్టెలు. పెట్టెలు పెరంబూరు. పెపె" అనేవారు. రైలు ఇంజను, చిత్తరంజను, ఇంజను,
రంజను" అనేవారు. అలా ప్రాసతో గుర్తుంచుకోవడం నేర్పేవారు. కాశ్మీర్ రాష్ట్రం మనిషి తలలా వుంటుందనీ, మధ్యప్రదేశ్ గొర్రెలా వుంటుందనీ,
యునైటేడ్ కింగ్ డం కుక్క కాలులా వుంటుందని జాన్ మాస్టారు మ్యాప్ పాయింటింగ్ చెప్పేవారు.
అబ్రహాం మాస్టారు మాతో ఆప్యాయంగా వుండేవారు. అప్పుడే కొత్తగా పట్టా తీసుకుని, ఫిజిక్స్
టిచర్ గా వచ్చిన ఎస్.బి. భాస్కరరావు మాస్టారు,
అప్పుడు, ఆ తరువాత కూడా మాతో సరదాగా వుండేవారు.
చివరగా, గురుకులాధిపతి బూల అజరయ్యగారి గురించి చెప్పుకోవాలి. అజరయ్యగారి ఔన్నత్యం
స్కూలును వదిలిన తరువాత నాకు ఇంకా బాగా అర్ధం అయింది. వారికీ మా నాన్నగారికీ బాల్య
పరిచయం ఏదో వుంది. వారు నా మీద అలాంటి వాత్సల్యాన్ని కూడా కనపరిచేవారు. తెలివైనవాడు పాడైపోతున్నాడని, వారికి నా మీద అసహనంగా
వుండేది. ఎస్సెస్సెల్సీ అంతిమ పరీక్షలకు నెల
రోజుల ముందు నన్ను తన గదికి పిలిచి, పేక బెత్తేంతో
అరచేతిపై గట్టిగా కొట్టారు. టామ్ బ్రౌన్ స్కూల్ డేస్ లోని హెడ్మాస్టరు థామస్ ఆర్నాల్డ్
కూ అజరయ్యగారికి చాలా పోలికలున్నాయి. టామ్ బ్రౌన్
ను జార్జ్ ఆర్ధర్ అనే తెలివైన విద్యార్ధితో కలిసి చదువుకునే ఏర్పాటు చేస్తాడు థామస్ ఆర్నాల్డ్. మా స్కూల్లోనూ, అజరయ్యగారు, విద్యైకంగా భిన్నస్థాయిల్లో వున్నవాళ్లతో కంబైన్డ్
స్టడీస్ టీమ్స్ ను ప్రోత్సహించేవారు.
అజరయ్యగారు మమ్మల్ని అనుక్షణం కనిపెడుతూ వుండేవారని తరువాతి కాలంలో తెలిసింది. అప్పటి, సెకండరీ స్కూలు
లీవింగ్ సర్టిఫికేట్ కేవలం మార్కుల షీటు మాత్రమేకాదు. అదో డజను పేజీల పుస్తకం. విద్యార్ధి
చదువుకు సంబంధించి నాలుగేళ్ళ వివరాలన్నీ అందులో వుండేవి. విద్యార్ధుల ప్రవర్తన గురించి
హెడ్మాస్టరు అభిప్రాయం వుండేది.
అప్పట్లో, మార్కుల షీటుతప్ప మిగిలిన పేజీల్ని నేనూ ఎప్పుడూ తిరగెయ్యలేదు. ఇరవై
యేళ్ల తరువాత ఒకసారి సరదాగా నా సర్టిఫికేటును తిరగేశాను. నేను విజ్ఞానశాస్త్రాల్లో
ప్రయోగాలుచేస్తాననీ, సంఘసేవకుడ్ని అవుతానని అందులో రాసుంది. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా
వుంటుంది. మా గురువులు మమ్మల్ని అంత నిశితంగా గమనించేవారా? అని. అలా తలుచుకున్నప్పుడు
వాళ్ల మీద గౌరవం మరింతగా పెరుగుతుంది.
వాళ్ళు మమ్మల్మి ప్రేమించారు, దారి తప్పుతున్నప్పుడు బుజ్జగించారు, కసురుకున్నారు,
తిట్టారు, కొన్ని సందర్భాల్లో కొట్టారు. ఏమిచేసినా, ఒక బాధ్యతగా మా డొక్కల్లో నాలుగు
అక్షరాలు రాయడానికే తపనపడ్డారు.
(నా గురువులందరికీ వినమ్రంగా)
Mayday, 2013
హృద్యంగా రాశారు, మీ గురువుల జ్ఞాపకాలను! జేవీ, లాజరస్ మాస్టార్ల బోధన పద్ధతి చాలా ఆసక్తికరంగా, గొప్పగా ఉంది.
ReplyDelete>> వాళ్ళు మమ్మల్మి ప్రేమించారు, దారి తప్పుతున్నప్పుడు బుజ్జగించారు, కసురుకున్నారు, తిట్టారు, కొన్ని సందర్భాల్లో కొట్టారు. >> గ్రేట్ ట్రిబ్యూట్!