Saturday, 1 February 2014

మూజువాణీ వ్యూహాన్ని కేంద్రమూ అనుసరిస్తే!

మూజువాణీ వ్యూహాన్ని కేంద్రమూ అనుసరిస్తే!
. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

భారత రాజ్యాంగాన్ని  మయసభ అనుకోవచ్చు. అందులో అనేక అంశాలు వున్నవి లేనట్టుగానూ, లేనివి వున్నట్టుగానూ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ శాసన సభ గురువారం  మూజువాణీ ఓటింగుతో చేసిన  తీర్మానాన్ని ప్రియదర్శిని అనుకోవచ్చు, అందులో, ఎవరికి నచ్చింది వారికి కనిపిస్తుంది. విభజనవాదులూ, సమైక్యవాదులూ ఎవరికి తోచిన అన్వయాన్ని వాళ్ళు చేసుకుని, అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ  సంబరాలు చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పై రాష్ట్ర శాసన సభ అభిప్రాయాలు, సవరణలు తెలుసుకోవాలనే రాజ్యాంగ ప్రక్రియ మొత్తం ఏడువారాలు సాగి గురువారం ముగిసింది. సినిమావాళ్ళ భాషలో ఏడు వారాలంటే 50 రోజుల బొమ్మ. సినిమాల స్క్రీన్ ప్లేలకు  ఒక నిర్ధిష్ట చట్రం వుంటుంది. ఏర్పాటు, ఘర్షణ, పరిష్కారం అనే మూడు స్థూల అంకాలతోపాటూ, మిడ్ పాయింట్, పించ్ పాయింట్, ప్లాట్ పాయింట్ వంటి ఓ డజను మెలికలు అందులో వుంటాయి. ఇలాంటి సందర్భాల్లో  సిడ్ ఫీల్డ్ ను చాలామంది స్క్రీన్ ప్లే గురు అంటుంటారు. శాసనసభలో చర్చ అచ్చం సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే పారడిమ్ ప్రకారమే నడిచింది. మిడ్ పాయింట్ వరకు  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరక్కుండా సీమాంధ్ర ప్రతినిధులు అడ్డుకున్నారు. మిడ్ పాయింట్ తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కరణ తీర్మానంపై ఓటింగు జరక్కుండా తెలంగాణ ప్రతినిధులు అడ్డుకున్నారు. వాళ్ళు వీళ్ళు అయ్యారు. వీళ్ళువాళ్ళు అయ్యారుతప్ప యాక్షన్ ఒక్కటే! చివరకు విభజన బిల్లుపై చర్చ ముగియడమూ, తిరస్కరణ తీర్మానం ఆమోదం పొందడమూ రెండూ కొన్ని క్షణాల తేడాలో జరిగిపోయాయి.

        ఈ సినిమాలో నాటకీయ మలుపు అద్భుతంగా పండింది.  సిడ్ ఫీల్డ్ భాషలో దీన్ని ప్లాట్ పాయింట్ – 2  అంటారు. బిల్లు పేరుతో శాసనసభకు వచ్చింది చిత్తుప్రతి మాత్రమే అని ప్రకటించి కిరణ్ కుమార్ రెడ్డి పెను సంచలనం రేపారు. నేరం రుజువయ్యి శిక్షపడేంత వరకు దోషిని నిందితుడు లేదా ఆరోపితుడు అనాలి అన్నట్టు  చట్టసభల ఆమోదం పొందనంతవరకు ప్రతిపాదిత చట్టాన్ని డ్రాఫ్ట్  లేదా బిల్లు అనాలి.  డ్రాఫ్ట్ కాపీని తెలుగులో చిత్తుప్రతి, ముసాయిదా వగయిరా పేర్లతో వ్యవహరిస్తుంటారు.  దాని అర్ధం వాటికి ఎలాంటి విలువ లేదనికాదు. కేంద్ర హోంశాఖ మీద ప్రత్యక్షంగానూ, రాష్ట్రపతి మీద పరోక్షంగానూ ముఖ్యమంత్రి సంధించిన విమర్శల్లో నిజానిజాలెలావున్నా, వారు ఆశించిన సంచలనాన్ని మాత్రం అద్భుతంగా సాధించారు. మీడియాలోగానీ, రాజకీయాల్లోగానీ  సంయమనం కన్నా సంచలనాలకే ఎక్కువ ఆకర్షణ వుంటుంది.

        విభజన బిల్లు అసెంబ్లీ దశను కూడా దాటేసిందని తెలంగాణ నేతలు   సంబరాలు చేసుకుంటే,  ఏకంగా బిల్లునే తిరస్కరించేశామని సీమాంధ్ర నేతలు మిఠాయిలు పంచుకున్నారు.  రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు కొడుకుల తండ్రిపాత్ర పోషిస్తున్న చంద్రబాబు కూడా చాలా ఆనందపడివుంటారు, శాసనసభలో సమన్యాయ సిధ్ధాంతాన్ని వివరించాల్సిన ఇబ్బంది తప్పినందుకు. ముఖ్యమంత్రి అయ్యాక భారీ విజయాలు లేని కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా సీమాంధ్రలో సూపర్ స్టార్ అయిపోయారు. 

        ఇంతకీ ఏడు వారాల వ్యవధిలో అసెంబ్లీ సాధించిందేమిటీ? రాష్ట్ర విభజన కోసం సర్వశక్తులు పెట్టి పోరాడుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు ఒక్కరంటే ఒక్క సీమాంధ్ర ప్రజాప్రతినిధిని కూడా తమ వాదంతో ఒప్పించలేకపోయారు. సమైక్యవాదాన్ని పదేపదే వల్లించే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఒక్కరంటే ఒక్క తెలంగాణ ప్రజాప్రతినిధి మనసును కూడా దోచుకోలేకపోయారు.  దీని అర్ధం ఏమిటీ? రెండు ప్రాంతాల మధ్య మానసిక విభజన మరింత కరడుగట్టింది. తెలంగాణ ప్రజాప్రతినిధులది ఎలాగూ విభజనవాదమే కనుక ఇది వారి విజయం. ఆ మేరకు ఇది సమైక్యవాదుల పరాజయం!  

శాసన సభలో సమైక్యవాదులు మూటగట్టుకున్న పరాజయాలు అంతటితో ఆగలేదు. రాష్ట్రం విడిపోతే, నష్టపరిహారంగా సీమాంధ్ర ప్రజలకు ఏం కావాలో ఒక్కరంటే ఒక్కరూ సభలో అడగలేదు. పోలవరం, పులిచింతల ముంపు ప్రాంతాల్ని సీమాంధ్రలో చేరిస్తే కృష్ణా, గోదావరి డెల్టా రైతులకు భద్రత వుంటుందని ఎవ్వరూ అనలేదు. రేపటి సీమాంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ స్థాయి విద్యా, వైద్య సౌకర్యాల గురించిగానీ, ఉపాధికల్పన గురించిగానీ ఎవ్వరూ నోరు మెదపలేదు. పార్టీలకు అతీతంగా సిమాంధ్ర ప్రజా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా  చేసింది ఒక్కటే;  జీవనాధారమైన ఆర్ధిక అంశాల్ని పక్కన పెట్టి ప్రజల్లో భావోద్వేగాల్ని మరింతగా రెచ్చగొట్టడం. రాష్ట్ర విభజనను నిలిపివేసినట్టు ఒక బూటకపు ప్రచారాన్ని ఇప్పుడు వాళ్ళు ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమకు  చేసిన అన్యాయాన్ని గుర్తించడానికి సీమాంధ్ర ప్రజలకు పెద్ద సమయం పట్టకపోవచ్చు. సమీప భవిష్యత్తులోనే ప్రజల తిరస్కారాన్ని ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరూ చవి చూస్తారు. బహుశ, వచ్చే అసెంబ్లీ, లోక్ సభ జమిలి ఎన్నికల్లోనే దీని ప్రభావం వుంటుంది.

అసెంబ్లీకి వచ్చిన బిల్లునే పార్లమెంటులో పెట్టాలనీ, అది  ఆమోదం పొందితే రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ కొత్త సవాలు విసురుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి.  ఇది బొత్తిగా అర్ధంలేని సవాలు. అసెంబ్లీకి వచ్చిన బిల్లునే పార్లమెంటులో ఎలా ప్రవేశపెడతారూ? బిల్లు మీద శాసనసభలో 86 మంది మాట్లాడారు. దాదాపు శాసనసభ్యులందరూ తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా సమర్పించారు. ఇవికాక, బిల్లులోని వివిధ క్లాజులపై దాదాపు వెయ్యి సవరణలు, సూచనల్ని సభ్యులు  లిఖితపూర్వకంగా అందజేశారు, వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పరిగణన లోనికి తీసుకోకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నరని పిస్తోంది. శాసన సభలో ఏడు వారాలు సాగిన  చర్చను కేంద్ర ప్రభుత్వం పరిగణన లోనికి  తీసుకుంటే, పార్లమెంటులో  ప్రవేశపెట్టడానికి ముందు బిల్లులో అనివార్యంగా మార్పులు చేయాల్సి వుంటుంది. అది సహజ ప్రక్రియ.

బిల్లు సభకు రాకముందే ఫలితం అందరికీ తెలుసు. 119 నియోజకవర్గాల తెలంగాణ  ప్రతినిధులు బిల్లును ఆహ్వానిస్తారనీ, 175 నియోజకవర్గాల సీమాంధ్ర ప్రతినిధులు బిల్లును వ్యతిరేకిస్తారనీ. ఒకరిద్దరు సభ్యులు తప్ప మిగిలినవారందరూ ముందుగా ఊహించినట్టే ప్రవర్తించారు.  రాష్ట్రాన్ని కలిపివుంచడంపై సీమాంధ్ర ప్రజాప్రతినిధుల మధ్య చెప్పుకోదగ్గ చీలిక వచ్చినా,  రాష్ట్రాన్ని విభజించడంపై తెలంగాణ ప్రజాప్రతినిధుల మధ్య చెప్పుకోదగ్గ చీలిక వచ్చినా ఫలితాలు మారేవేమో. గానీ, శాసనసభ్యులందరూ తమ ప్రాంతపు భావోద్వేగాలకే కట్టుబడివున్నప్పుడు  ఫలితంలో మార్పు వచ్చే అవకాశాలు లేవు.

ప్రజాస్వామ్యం అంటే సంఖ్యాబలమే కనుక,  119కన్నా 175 పెద్ద సంఖ్య కనుక విజయం తమదే అని సీమాంధ్ర నాయకులు కొందరు అతి ఉత్సాహంతో వున్నారు.  వివాదం వచ్చినపుడు సంఖ్యాబలాన్ని అలా చూడరు. వివాద ప్రాంతంలో సంఖ్యాబలాన్ని మాత్రమే చూస్తారు. అలా చూస్తే తెలంగాణ ప్రాంతంలో విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ఒక్కరు మాత్రమే మాట్లడారు. వారు కూడా విభజన అనివార్యం అన్నారు. ఆ ప్రాంతపు మిగిలిన సభ్యులందరూ విభజనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.  అదే అంతిమ ప్రమాణం! 

చివరి బంతిని కిరణ్ కుమార్ భారీ షాట్ కొట్టి సోనియా మూతి పగులగొట్టారని ముఖ్యమంత్రి అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కిరణ్ కొట్టిన షాట్ తమకు అనుకోని వరమని కాంగ్రెస్ అధిష్టానం కూడా  ఆనందిస్తోందని వారికి తెలిసి వుండకపోవచ్చు. రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించిన మూజువాణీ వ్యూహాన్నే రేపు  పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు బిల్లును ఆమోదింప చేసుకోడానికి యూపియే  ఛైర్  పర్సన్ సోనియా గాంధి అనుసరించినా ఆశ్చర్యపడాల్సిన ఆవసరం లేదు. పైగా, శాసనసభలో ఇప్పుడు సీమాంధ్ర ప్రతినిధులు వ్యవహరించిన తీరు కాంగ్రెస్ అధిష్టానం రేపు పార్లమెంటులో అనుసరించే వ్యూహానికి నైతిక సమర్ధన ఇస్తుంది.


 (రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
1 ఫిబ్రవరి  2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి

1 ఫిబ్రవరి  2014

No comments:

Post a Comment