Wednesday 12 February 2014

మైకు ముక్క, పెప్పర్ స్ప్రే


మైకు ముక్క, పెప్పర్ స్ప్రే 
కాదేది ప్రతిదాడికి అనర్హం?  

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)


మైకు ముక్క, పెప్పర్ స్ప్రే
కాదేది ప్రతిదాడికి అనర్హం?

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

సాంప్రదాయబధ్ధంగానో,  సాంప్రదాయ విరుధ్ధంగానో  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు - 2013 లోక్ సభలో ప్రవేశించేసింది. ఆ  విషయం లోక్ సభ అధికారిక  వెబ్ సైట్ లో  నమోదు అయిపోయింది. ఈ బిల్లు  పుట్టుక ఏమిటోగానీ దాని ప్రతీ కదలికాలోను మార్మికత  పుష్కలంగా  విస్తరిస్తోంది. రాష్ట్ర శాసనసభలో  బిల్లు పెట్టినపుడూ ఇలాంటి గందరగోళమే  చెలరేగింది. లోక్ సభలో బిల్లుపెట్టినపుడు అది పునరావృతమైంది. అయితే, రెండు సంఘటనల మధ్య ఒక గుణాత్మక తేడా వుంది. శాసనసభలో బిల్లును పెట్టినట్టు ప్రకటించిన  అప్పటి శాసన సభావ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఇద్దరూ  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, బిల్లును   ప్రవేశపెట్టినట్టు ప్రకటించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  కమల్ నాథ్,  బిల్లు ప్రవేశాన్ని ధృవీకరించిన  లోక్  సభా స్పీకర్ మీరా కుమార్ ముగ్గురూ  యూపియే ఛైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి ఆశిస్సుల్ని  టోకుగా అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు మహాత్యం ఏమిటోగానీ దాని దెబ్బకు రాజకీయరంగం  అతలాకుతలమైపోతోంది. రాజకీయ పార్టీలు పార్టీల్లా వుండడంలేదు. రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల్లా వుండడంలేదు. దీనికి వామపక్షం, కుడిపక్షం అనే తేడాలేదు. ఏ పార్టీ అయినా ఒక్కటే. బీజేపి జాతీయ నాయకుడు యం. వెంకయ్య నాయుడిపై ఆ పార్టి తెలంగాణ శాసనసభ్యుడు యెన్నెం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు,  కమలవంశ భీష్ముడు  లాల్ కిషన్ అడ్వాణీ, రాజ్ నాధ్ సింగ్ ల మధ్య సాగుతున్న ప్రఛ్ఛన్న యుధ్ధం దీనికి తాజా ఉదాహరణైతే,  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టినపుడు జరిగిన ముష్టియుధ్ధం దీనికి పరాకాష్ట.. ఎస్_కాంగ్రెస్, టి_కాంగ్రెస్  యంపీలు సోనియా గాంధి సాక్షిగా తలపడ్డారు. టీ_తమ్ముళ్ళు, ఎస్_తమ్ముళ్ళు తలపడ్డారు.

భారత పార్లమెంటు ప్రజాస్వామ్య చరిత్రలో ఫిబ్రవరి 13 బ్లాక్ డే అనడంలో ఎవ్వరికీ వీసమెత్తు అనుమానం కూడా లేదు. కానీ, ఆరోజు దాడి చేసిందెవరూ? దాడిపై  ప్రతిదాడి చేసిందెవరూ? అనే విషయంలో విభనవాదులు, సమైక్యవాదులిద్దరిదీ పొంతన కుదరని వాదన. విత్తు ముందా? చెట్టుముందా? అనేది తాత్విక సమస్య. కొందరికి చెట్టే ముందు అనిపించవచ్చు మరికొందరికి విత్తే ముందు అనిపించవచ్చు. ఎవరి దృక్పథం వారిది.  వాస్తవ నివేదిక ప్రకారం అయితే,  ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెడుతున్న సుశీల్ కుమార్ షిండేను అడ్డుకోవడానికి ప్రయత్నించిన సీమాంధ్ర ఎంపీలు, మంత్రుల్ని తెలంగాణ ఎంపీలు, మంత్రులు అడ్డుకున్నారు. ఈ అడ్డుకోవడం శృతిమించి కొట్టుకున్నారు. ద్వంద్వ యుధ్ధాలు, ముష్టి యుధ్ధాలు చేసుకున్నారు.

మొదటి నుండీ సమైక్యవాదానికి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విజయవాడ యంపి లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు  పెప్పర్ స్ప్రేకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు.   పాతికేళ్ల క్రితం రాజీవ్ గాంధి హత్యకు గురైనపుడు ఆర్డీయస్ తో పాటూ లొట్టో రన్నింగ్ షూస్ ప్రాచూర్యంలోనికి వచ్చాయి. ఇప్పుడు బ్లాక్ డే సంఘటనతో పెప్పర్ స్ప్రేకు ఎక్కడలేని ప్రచారం వచ్చింది. నిర్భయ కేసు సందర్భంగా కూడా పెప్పర్ స్ప్రేకు రానంత ప్రచారాన్ని లగడపాటి పార్లమెంటు సాక్షిగా  కల్పించారు. రాజగోపాల్ క్రీడా సంఘాల్లోనూ క్రియాశీలంగా వున్నారు. వారు పార్లమెంటులో చెడుగుడు ఆడతామని ముందుగానే ప్రకటించారు. చెడుగుడులో కూత ఆపి  పెప్పర్ స్ప్రే చల్లవచ్చని ఇక ముందు కొత్త నిబంధనలూ రావచ్చు!

తెలంగాణ డిమాండు ముందుకు వచ్చాక అనేక వివాదాస్పద విలువలు పుట్టుకు వస్తున్నాయి. తెలంగాణ తల్లి బిడ్డలమైన తాము తెలుగు తల్లిని గౌరవించాల్సిన పనిలేదని (వీలైతే అవమానిస్తామని) టీ_జేయేసి ఛైర్మన్ కోదండరామ్ ఏడెనిమిదేళ్ళ క్రితం ఒక సంచలన ప్రకటన చేశారు. దానికి తార్కిక కొనసాగింపే ట్యాంకుబండ్ పై సీమాంధ్ర మహాపురుషుల విగ్రహల విధ్వంసం. తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు అసలు భారతదేశంలో ఎందుకు కలిసుండాలి? అని ఎస్_ తమ్ముళ్ళు కొత్త ప్రశ్నను లేవనెత్తుతున్నారు. భారత దేశం నుండి విడిపోయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్,  లా కొత్త దేశం ఏర్పాటు చేసుకుని, స్వంత పార్లమెంటు పెట్టుకుంటామని కూడా వాళ్ళంటున్నారు. "తెలంగాణపై యూ_టర్న్ లేదు. పార్టీ అధ్యక్షుడిగా చెపుతున్నాను. విభజన బిల్లుకు మేము మద్దతిస్తాము" అని కుండబద్దలుగొట్టిన బీజేపి అధినేత  రాజ్ నాథ్ సింగ్ పైన కూడా వాళ్ళు నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదలయిన సమైక్యవాదం చివరకు దేశవిభజన వరకు చేరుకుంది. అతివాదం మితవాదం రెండూ ఒకటే అనడానికి ఇంతకన్నాగొప్ప ఉదాహరణ ఇంకేముంటుందీ?  భారత దేశం నుండి విడిపోతామని ఇంకెవరయినా ప్రకటించివుంటే కమలనాధులు ఈపాటికి ఉగ్రనరసింహులు అయిపోయేవారు. ఈసారి వాళ్ళు ఎస్_తమ్ముళ్లకు రాయితీ ఇచ్చినట్టున్నారు! వియ్యం పొందాలనుకున్నప్పుడు కొన్నింటిని సహించక తప్పదు. కొన్నింటిని వదులు కోకతప్పదు.

తొలుత వివాదాస్పందంగా కనిపించే ఇలాంటి డిమాండ్లు మారిన కాలంలో కొత్త విలువలుగానూ మారవచ్చు. తాము అణిచివేతకు గురవుతున్నామని భావించే ఏ సామాజికవర్గం కూడా ఇతర సామాజికవర్గాలను ప్రశాంతంగా వుండనివ్వదు. దానికి ఒక్కటే పరిష్కారం; అణిచివేతను అణిచివేయడం. అధికారంలో వున్నవాళ్ళకు అంతటి ఔదార్యం వుండదు. వాళ్ళు అణిచివేతను అణిచివేయడానికి బదులు అణగారిన వర్గాలని అణిచివేస్తారు.

రాష్ట్ర విభజన ఉద్యమంలో మొదటి ఘట్టంలో  జరిగిందే చివరి ఘట్టంలోనూ జరుగుతోంది. విభజనవాదుల మధ్య సమైక్యత పరిఢవిల్లుతుండగా, సమైక్యవాదుల మధ్య విభజన కొనసాగుతోంది. గురువారం లోక్ సభలో సాగిన భీభత్స ఘట్టంలోనూ, ఈ తేడా ప్రస్పుటంగా కనిపించింది. "తెలుగు ప్రజలు సమైక్యంగా వుంటే గెలుస్తారు; విడిపోతే ఓడిపోతారు అని పదేపదే చెప్పే సీమాంధ్ర నాయకులు ఆ విషయం తమకూ వర్తిస్తుందని గుర్తిస్తున్నట్టులేదు.

నాయకత్వంలో చీలిక వున్నప్పుడు ప్రజల్లో నిర్లిప్తత ప్రబలుతుంది. లోక్ సభలో తమ ప్రాంత ఎంపీల బహిష్కరణకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవోల సంఘం ఇచ్చిన బంద్ పిలుపుకు సీమాంధ్ర ప్రజల నుండి నామమాత్రపు స్పందన మాత్రమే వచ్చింది. ప్రజల నిర్లిప్తత కారణంగా శుక్రవారం నాటి బంద్ కొన్ని పార్టూలు, సంఘాలు, నాయకుల సంస్థాగత వ్యవహారంగా మాత్రమే సాగింది. పైగా ఈ బంద్ లో నాయకుల మీద  కొన్ని ప్రతికూల సంకేతాలు కూడా వెలువడ్డాయి. ఎస్ _కాంగ్రేస్ ప్రజాప్రతినిధులు తమ టీమ్ కెప్టెన్ గా భావిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను పలుచోట్ల టిడిపి నేతలు దహనం చేశారు.  కేంద్రమంత్రుల దిష్టి బొమ్మల్ని ఏయూ విద్యార్ధి జేయేసి నేతలు తగలబెట్టారు.  ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతల స్వంత జిల్లా మాత్రమేగాక, ఇటీవల జగన్ రెండు నెలలపాటు సమైక్య శంఖారావాన్ని పూరించి వచ్చిన చిత్తూరు జిల్లాలో బంద్ కు నామమాత్రపు స్పందన కూడా రాలేదు.  లోక్ సభ సంఘటనతొ పెప్పర్ స్ప్రే వీరునిగా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ స్వంత నియోజకవర్గం విజయవాడలో బంద్ పాక్షికం అనదగ్గ స్థాయిలో కూడా జరగలేదు. దీనిని్బట్టి సీమాంధ్ర నాయకుల చేష్టలతో ప్రజలు ఎంతగా విసిగిపోయారో అర్ధం చేసుకోవచ్చు. ప్రజల నిర్లిప్తకు మరో కారణం కూడా వుండవచ్చు. విభజన బిల్లు లోక్ సభలో ప్రవేశించకుండా తమనాయకులు అడ్డుకుంటారని సీమాంధ్ర ప్రజలు నమ్మకంతో వున్నారు. బిల్లు లోక్ సభలో ప్రవేశించడంతో ఇక సమైక్య అధ్యాయం ముగిసిందని కూడా వాళ్ళు ఓక నిర్ణయానికి వచ్చివుండవచ్చు.

సుబ్బి పెళ్ళి వెంకి చావుకు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్ సభ ప్రవేశం  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నిష్క్రమణకు ద్వారం తెరిచింది. . రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన  బిల్లునే పార్లమెంటులో పెడితే ముఖ్యమంత్రి పదవికి తక్షణం రాజీనామా చేస్తానని వారు భీషణ ప్రతిజ్ఞ చేసివున్నారు. పంతం కోసమే కావచ్చుగానీ, రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన  బిల్లునే కామా, ఫుల్ స్టాప్ కూదా మార్చకుండా లోక్ సభలో ప్రవేశపెట్టించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి. ఇక ముఖ్యమంత్రి తన  ప్రతిజ్ఞను పాటించడం\మే తరువాయి!

నాలుగు రోజులుగా కిరణ్ కుమార్ రాజీనామా వ్యవహారం "గోడమీద రేపు" గా  సాగుతోంది. ముఖ్యమంత్రి వికెట్టు కూడా పడేసుకుంటే వెంటనే  పిచ్ మీద స్టంపులు పీకేసి ఆట అయిపోయింది అని ప్రకటించేస్తారని ఎస్_కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు స్పష్టంగా తెలుసు. అందుకే వాళ్ళు సీయం కుర్చీని మాత్రం వదలవద్దని కిరణ్ కుమార్ ను కోరుతూ వుండవచ్చు.

సరిగ్గా ఈ సంధి దశలోనే  సీమాంధ్రలో సరికొత్త రాజకీయం ఊపిరి పోసుకునే అవకాశం వుంది. ఏందుకంటే, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహనరెడ్డి, చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు సీమాంధ్రలో తమకుతామే సమైక్య వీరులమని ప్రచారం చేసుకుంటూ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునే పనిలో వున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేనపుడు ప్రజల దృష్టిలో వీరులుకాస్తా, పరాజితులు అవుతారు. చరిత్ర ఎప్పుడూ విజేతలనే గుర్తుపెట్టుకుంటుంది. పరాజితుల్నికాదు! పరాజితులు ముందు తాము ఓడిపోయి, తమను నమ్మినవాళ్లనూ ఓడిస్తారు.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
14  ఫిబ్రవరి  2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
16   ఫిబ్రవరి  2014

No comments:

Post a Comment