రాష్ర్ట విభజన రాజకీయంలో నాలుగు స్తంభాలాట!
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై దేశరాజధానిలో నాలుగు స్థంభాలాట సాగుతోంది. రాష్ట్రపతి భవన్, ప్రధాని కార్యాలయం, కాంగ్రెస్ కేంద్రకార్యాలయం, బీజేపి కేంద్రకార్యాలయంల చుట్టూ విభజన వివాదం తిరుగుతోంది. విభజనవాదులు దీన్ని రాజకీయ అంశంగా భావించి, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపి అధ్యక్షులు రాజ్ నాధ్ సింగ్ లను నమ్ముకుని ముందుకు సాగుతుంటే, సమైక్యవాదులు దీన్ని రాజ్యాంగ ప్రక్రియగా భావించి రాష్ట్రపతి ప్రభన్ ముఖర్జీ పై వత్తిడి పెంచే పనిలో వున్నారు.
సీమాంధ్ర నేతల వ్యూహాలు ఎత్తుగడల్లో మొదటి నుండీ ఒక అసంబధ్ధత కనిపిస్తూవుంది. మబ్బుల్లో నీళ్లని చూసి వాళ్ళు ముందుగా ముంత వలకబోసుకుంటారు. అవి కురిసే మబ్బులు కావని ఆలస్యంగా తెలుసుకుని, ఒకలబోసుకున్న నీళ్లను ముంతలో నింపడానికి ఇసకను పిండుతుంటారు. అనుమానం వున్నవాళ్ళు నివృత్తి కోసం ఓ యాభై రోజులు వెనక్కి వెళితే చాలు. అంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు – 2013 రాష్ట్ర అసెంబ్లీకి చేరిన రోజు జరిగిన పరిణామాల్ని అప్పుడే ఎవరూ మరిచిపోయివుండరు. నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనలు, కుర్చీలు విరగొట్టడాలూ, వెల్ లోనికిపోవడాలూ, స్ఫీకర్ పోడియంను చుట్టుముట్టడాలూ, సభాకార్యక్రమాలను స్థంభింపచేయడాలు, స్పీకర్ మైకు విరగ్గొట్టడాలు ఎప్పుడూ జరిగేవే! ఆరో కొన్ని పరిణామాలు అదనంగా కొత్తగా జరిగాయి. సభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి పంపిన బిల్లు ప్రతుల్ని కొందరు కాళ్ల కిందపెట్టి తొక్కేశారు. కొందరు. కొందరు ప్రతుల్ని చించి గాల్లోకి ఎగరేశారు, కొందరు చించిన ముక్కల్ని స్పీకర్ మొఖాన్న కొట్టారు. కొందరయితే మీడియా పాయింట్ వద్ద బిల్లు ప్రతుల్ని తగలబెట్టారు.
ఇదేదో క్షణికోద్రేకంలో జరిగిన సంఘటనలు కావు. దాదాపు నెలరోజుల తరువాత జరిగే సంక్రాంతి పండగ సందర్భంగా బిల్లు ప్రతుల్ని భోగిమంటల్లో వేసి తగలబెట్టాలని. ఏపీ ఎన్జీవోల సంఘం అగ్రనేత పరుచూరి అశోక్ బాబు పిలుపునిచ్చారు. దాన్ని చాలామంది నాయకులు ఆచరించడమేగాక, తమ పోరాటశీలతను చాటుకోవడానికి మీడియా కవరేజీని కూడా జాగ్రత్తగా చేయించుకున్నారు.
సీమాంధ్రనాయకులు బిల్లు ప్రతులతో ఫుట్ బాల్, క్రికెట్ వగయిరా ఆటలు ఆడుతున్నప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లోనే శీతాకాల విడిది చేసివున్నారు. మీడియా ద్వారనే కాకుండా, తన సిబంది ద్వార కూడా సీమాంద్ర నాయకుల చేష్టలు రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు తెలిసే వుంటాయి. అందులో ఏదైనా కొరవ వుంటే బిల్లును స్వాగతించే తెలంగాణ నేతలు దాన్ని తీర్చు వుంటారు.
రాష్ట్రపతి పంపిన బిల్లుతో ఫుట్ బాల్ ఆడుకునీ, “మొదాలు బిల్లే తప్పు, అందులోనూ నకిలీ” అని అన్నవారికి ఇప్పుడు ఇప్పుడు పరిశుధ్ధాత్మ కలిగి,“రాష్ట్రపతి అనగా రాజ్యాంగ అధినేత” అని ఆదివాక్యం గుర్తుకు వచ్చింది. రాష్ట్రపతి హైదరాబాద్ లో వున్నప్పుడు ఆయన పంపిన బిల్లును రాచి రంపాన పెట్టినవాళ్ళు, ఇప్పుడు ఆదే బిల్లును ఆపాలంటూ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నంత కాలం సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగదని టీడీపీ సీమాంధ్ర ఎంపీలు ఇప్పుడు అంటున్నారు. రాజ్యాంగానికి పెద్ద దిక్కురాష్ట్రపతేననీ, ఐదు కోట్ల సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సింది కూడాఆయనేనని మరీ చెపుతున్నారు. అంటే, అంధ్రప్రదేశ్ ను సమైక్యంగా వుంచే బాధ్యత రాష్ట్రపతిదే అనేది వారి భావం. డిసెంబరుకూ ఫిబ్రవరికీ ఎంత తేడా!
వివిధ సామాజికవర్గాలు రాజ్యాంగాన్నో, రాజ్యాంగంలోని కొన్ని అధీకరణాలనో వ్యతిరేకించడం, చించిపారేయ్యడం, తగలబెట్టడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో కొత్తేమీ కాదు. వెనుకబడిన తరగతులకు రాజ్యాంగంలో ఉద్దీపన సౌకర్యం కల్పించనందుకు అలనాటి అవిభక్త మద్రాసు రాష్ట్రంలో ఇవీ రామస్వామి నాయకర్ నాయకత్వన చాలా పెద్ద ఉద్యమం జరిగింది. వాళ్ళు రాజ్యాంగ ప్రతుల్ని తగలబెట్టారు. రాజ్యాంగాన్ని సవరించే వరకు పోరాడారు. భారత రాజ్యాంగానికి మొదటి సవరణ వచ్చిందే ఆ ఫోరాటంవల్ల. ఆ పోరాటానికీ దిగి వచ్చిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు 1951 మే 10 న పార్లమెంటులో సవరణను ప్రతిపాదించగా 18 జూన్ న పార్లమెంటు దాన్ని ఆమోదించింది. నరేంద్ర మోదీ మైకంలో హిందూ వెనుకబడిన కులాల నాయకులు ఇప్పుడు బీజేపికి మద్దతు పలక వచ్చుగానీ, ఆ రోజు పార్లమెంటులో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించింది నేటి బీజీపికి మాతృక అయిన జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అప్పట్లో వారు కాంగ్రెస్ నుండి బయటపడి జనసంఘ్ ను నిర్మించే పనిలోవున్నారు. నెహ్రు ప్రతిపాదనను గట్టిగా సమర్ధించినవాడు బీఆర్ అంబేడ్కర్.
రాష్టాన్ని సమైక్యంగా వుంచడానికి దేనికైనా సిధ్ధమేనని సీమాంధ్ర నేతలు అంటున్నారు. ఇదొక నకిలీ సన్నధ్ధత. ఫేక్ ఎకాంప్లిస్! రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి సీమాంధ్ర నాయకులు చేయాల్సిన పని ఒక్కటే; తెలంగాణ ప్రజల నమ్మకాన్నీ, ప్రేమనూ పొందడం. కానీ, ఆ పని ఒక్కటితప్ప వాళ్ళు ఇతర పనులు చాలా చేస్తున్నారు. సీమాంధ్ర నాయకులు చేస్తున్న ప్రతి పనీ వాళ్లను తెలంగాణ ప్రజలకు మరింత దూరం చేస్తోంది. ఇలాంటి అనాలోచిత చర్యల ద్వార వాళ్ళు తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య బావోద్వేగాలను భావోద్రేకాలుగా మారుస్తున్నారనిపిస్తోంది.
మనకు నచ్చినా నచక పోయినా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే ఓట్లు, సీట్లే! సీమాంధ్ర నాయకుల్లో అగ్రగణ్యులయిన కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన రెడ్డి తెలంగాణ ఓట్ల మీద ఆశల్ని ఎప్పుడో వదులుకున్నారు. వాళ్ల దృష్టి అంతా ఇప్పుడు రాబోయే సీమాంధ్ర రాష్ట్రానికి సియం కావడం ఎట్లా అన్నదే! కొందరికి ఇది అతిశయోక్తిగా వుండవచ్చుగానీ వాళ్లదగ్గర మరో మార్గం లేదు.
సీమాంధ్ర రాజధానిని ఎక్కడ నిర్మిస్తున్నారో? ఎలా నిర్మిస్తున్నారో కూడా బిల్లులోనే పేర్కొనాలి. సీమాంధ్రకు ప్రకటించే ఆర్థిక ప్యాకేజీకి ప్రణాళికా సంఘం నుంచి అనుమతి పొందాలి. పన్నులు తదితర చెల్లింపుల విషయంలో పదేళ్లపాటు కొత్త రాష్ట్రానికి రాయితీలు కల్పించాలి. హైదరాబాద్ ఆదాయ పంపిణీని స్పష్టం చేయాలి. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సీమాంధ్ర విద్యార్థులు మరో పదేళ్లపాటు అక్కడ జరిగే అన్ని కాంపిటీటివ్ పరీక్షల్లో పాల్గొనేందుకు వారిని స్థానికులుగా పరిగణించాలి. హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మరో పదేళ్లపాటు సీమాంధ్రులకు వైద్యసౌకర్యం కల్పించాలి. రాయలసీమకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు ఇవ్వాలి. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు భద్రత కల్పించాలి. వంటి అనేక డిమాండ్లు సీమాంధ్ర నేతలు చెయ్యాల్సివుంది. కానీ, వాళ్ల కాళ్ల కింది కాలం ఎప్పుడో జారిపోయింది. వాళ్ళిప్పుడు ముందుకు పోలేరు. వెనక్కి రాలేరు! ఇదో ప్రతిష్టంభన.
“ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు” నినాదంతో ఆంధ్రప్రదేశ్ విభజనకు తొలుత గంట కట్టిన బీజేపి ఇప్పుడు తెలంగాణతో పాటూ సీమాంధ్రలోనూ కొన్ని ఓట్లు పోగేసుకోవాలను కుంటోంది. సీమాంధ్ర ప్రజలు కోరదలుచుకున్న ఓ పన్నెండు ఆంశాల కోర్కెల పట్టికను అది ముందుకు పెట్టింది. తను పొందాలనుకున్న ఖ్యాతిని బీజేపి తన్నుకుపోతుంటే కాంగ్రెస్ చూస్తూ వూరుకుంటుందా? ఊరుకోదనేదే సమాధానం! అప్పుడు బీజేపి కోరిన కోర్కెలన్నింటినీ సీమాంధ్ర మంత్రుల నోట చెప్పించే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టనం చేస్తోంది,. ఘనతంతా కాంగ్రేశ్ కొట్టేసి, నిందలు మాత్రం తమ మీద నెట్టేస్తే బీజేపి ఊరుకుంటుందా?
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మోబైల్ : 90102 34336
హైదరాబాద్
7 ఫిబ్రవరి 2014
ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
9 ఫిబ్రవరి 2014
No comments:
Post a Comment