Wednesday, 4 June 2014

A Copy Story

ఒక కాపీకథ
డానీ

యాభై యేళ్ల క్రితం ఒక  నకిలీ కవి వుండేవాడు. పాత పత్రికల్లోని కవితల్ని వెతికి పట్టుకుని తన పేరుతో ప్రచురించుకునేవాడు. ఆ పనికి ఒక సహాయకుడిని పురమాయించి కొన్ని మార్గదర్శకాలు చెప్పాడు. మనం ఎంపిక చేసే కవిత  అనాధ అయివుండాలి. అది అనాధ కవిత అని తేల్చడానికి నాలుగు సూత్రాలు వున్నాయి. దాన్ని రాసిన వారి పేరు పైనగానీ, కిందగానీ, అటుపక్కగానీ, ఇటుపక్కగానీ వుండకూడదు అని చెప్పాడు.

పాతపత్రికల్లో అనాధ కవిత దొరికినప్పుడెల్లా సహాయకుడు దాన్ని పట్టుకుని కవి దగ్గరికి వచ్చేవాడు. కవిగారు పైనా, కిందా, ఇరుపక్కలా పరిశీలించి నమ్మకం కుదిరాక సహాయకుడుకి కూలీ డబ్బులు  ఇచ్చి పంపేవాడు.

అలా ప్రచురణ కోసం పంపిన కవిత ఒకసారి తిరిగి వచ్చింది. కవిగారు హతాశులయ్యారు. దాని అసలు కాపీని తీసి పరిశీలించారు. కళ్ళు పెద్దవి చేసుకుని  పైనా, కిందా, ఇరుపక్కలా గాలించినా కవి పేరు కనిపించలేదు. ఆ ముక్కే సంపాదకుడికి రాశారు. నా నాలుగు సూత్రాల ప్రకారం ఇది అనాధ కవిత. దీన్ని నేను దత్తత తీసుకున్నాను అని గడుసుగా రాశారు.

ఈసారి సంపాదకులవారు ఘాటుగా లేఖ రాశారు. పైనా, కిందా, ఆ పక్క, ఈ పక్క చూస్తే సరిపోదు.  మధ్యలో కూడా చూడండి అని హెచ్చరించారు.

కవులవారు మళ్ళీ ఆ కవితను అక్షరం అక్షరం జాగ్రత్తగా చదివారు.  ఇష్క్ పర్ జోర్ నహీ / యే ఆతిష్ హై గాలిబ్/ కే బనాయే న బనే / కే బుఖాయే న బుఝే అని వుంది.

అమ్మ గాలిబో! నీ పేరును మధ్యలో ఇరికించేస్తే నే పట్టుకోలేనా? అని కొలంబస్ అమెరికాను కనుగొన్నంత ఆనందంగా ఊపిరి పీల్చుకున్నారు కవిగారు. సహాయకుడ్ని పిలిచి అనాధ కవితకు ఐదో సూత్రాన్ని గట్టిగా చెప్పారు.

(ఇదొక కాపీకథ అని ముందే చెప్పాను గాబట్టి ఈ కథ మీద నాకు ఎలాంటి వాణిజ్య సంబంధమైన మేధో సంపత్తి హక్కులు లేవని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ కథని ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా రాసేశారు. కావాలంటే మీ వెర్షన్ ను మీరూ రాయవచ్చు.)


4 జూన్  2014

No comments:

Post a Comment