Tuesday, 3 June 2014

New Hopes and New Challenges

కొత్త ఆశలు, కొత్త సవాళ్ళు
డానీ

ముక్కోటి రతనాల వీణ తెలంగాణ
తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ కు
శతకోటి శుభాకాంక్షలు!

నూతన రాష్ట్ర ఆవిర్భావ దినాన
తెలంగాణ ప్రజలకు
సహస్ర కోటి శుభాకాంక్షలు!


తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారాన్ని చేపట్టడంతో కొత్త ఘట్టం మొదలయ్యింది. పార్టీ ప్రణాళికలో, ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని కొత్త ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. చాలా మంది గద్దెనెక్కగానే వాగ్దానాలను మరిచిపోతారుకేసిఆర్ పాలన అందుకు భిన్నంగా వుంటుందని ఆశిద్దాం.

కేసిఆర్ ప్రమాణ స్వీకారానికి పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పంపుతున్నట్టు రెండు రోజుల క్రితం వార్తల్లో వచ్చింది. కానీ, అలా జరగలేదని తరువాత తెలిసింది. అంధ్రప్రదేశ్ విభజనకు మద్దతుగా చంద్రబాబు నాయుడు 2008 లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాయడం తెలంగాణ ఉద్యమంలో ఒక మలుపు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ముఠామేస్త్రి టీఆరెస్సే అనుకున్నా కూలీలుగా  రాళ్ళెత్తిన పార్టీలు  టిడిపి, సిపిఐల దగ్గరి నుండి మావోయిస్టుల వరకు చాలానే వున్నాయితెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, పొరుగు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే అభివృధ్ధి ఫలాలు దక్కుతాయి.

మంత్రివర్గం ఏర్పడగానే సహజంగానే కులాలు, మతాలు, సంఘాలు, లింగాలు, జిల్లాలు వంటి సమీకరణలు ముందుకు వస్తాయి. అస్తిత్వవాద ఉద్యమాల ఫలితంగా అధికారాన్ని చేపట్టినపుడు ఇలాంటి సమీకరణలు మరింత కీలకంగా మారుతాయి. కేసిఆర్ తొలి విడత మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ నుండి సబితా ఇంద్రారెడ్డి, గీతా రెడ్డి, డికే అరుణ, కొండ సురేఖ, సునీత లక్ష్మారెడ్డిలకు ఒకేసారి మంత్రివర్గంలో స్థానం కల్పించిన వైయస్ రాజశేఖర రెడ్డి ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారుఇప్పటి నిబంధనల ప్రకారం 17 మంది వరకు తెలంగాణ మంత్రివర్గంలో వుండే అవకాశం వుంది గాబట్టి మహిళా మంత్రుల లోటును ఒకటి రెండు రోజుల్లో కేసిఆర్ సరిదిద్దు కుంటారని అనుకోవచ్చు. 

మంత్రివర్గంలో స్థానం దక్కక పోవడం ఒకరకం వివాదం అయితే, స్థానం దక్కించుకోవడం కూడ మరోరకం వివాదం. హరీష్ రావు, కేటిఆర్ లను మంత్రివర్గంలోనికి తీసుకోవడంతో వారసత్వ పాలన అనే విమర్శకు దారితీసింది. రాహుల్ గాంధీ వంటి మొద్దబ్బాయిని ప్రధానిని చేయాలనుకుంటే దాన్ని కుటుంబపాలన అనవచ్చుగానీ, హరీష్ రావును మంత్రివర్గంలోనికి తీసుకోవడాన్ని కుటుంబ పాలనగా పేర్కొనడం సరికాదు. పార్టీలో, నియోజకవర్గంలో, ఉద్యమంలో, ఎన్నికల్లో, అసెంబ్లీలో హరీష్ రావు తన సామర్ధ్యాన్ని చాలాసార్లు నిరూపించుకున్నారు. ఆ మాటకొస్తే కేటిఆర్, కవిత కూడా స్వయం సమర్ధులే!

కేసిఆర్ ఒక పుష్కర కాలం ఉద్యమకారునిగా వున్నారు. ఇటీవల రాజకీయ నాయకునిగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాధినేత  అయ్యారు. ఉద్యమకారులుగా వున్నప్పుడు ఎవరినైనా విమర్శించే సౌలభ్యం వుంటుంది. ఇప్పుడు అలా కాదు. చిన్న తేడా వచ్చినా  విమర్శలు పడాల్సి వుంటుంది. ఇది కేసిఆర్ కు కొత్త అనుభవమే!

తెలంగాణ ఏర్పడిన రోజే సాంకేతికంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడిన రోజు అవుతుంది. తెలంగాణలో సంబురాలు జరుపుకున్నట్టు  రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకునే భావోద్వేగాలు ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో లేవు. బహుశ జూన్ 8 సాయత్రం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అక్కడ ఒక ఉత్సాహపూరిత వాతావరణం రావచ్చు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం మిగిలిన ఆంధ్రప్రదేశ్ ఇక ముందు ఆంధ్రప్రదేశ్ గానే కొనసాగుతుంది. అయితే తెలంగాణ, హైదరాబాద్ లేని సగం రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అనవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిని వెంటాడుతోంది. అంచేత మిగిలిన ఆంధ్రప్రదేశ్ అనే మాట ముందుకు వచ్చింది. మిగిలిన అనేమాట నచ్చని వాళ్ళు సీమాంధ్ర అనే కొత్త పేరును విరివిగా వాడుతున్నారు. అయితే ఈ పేరులో ఆంధ్రా వున్నంత బలంగా రాయలసీమ లేదనే అసంతృప్తి కూడా వుంది. సీమాంధ్రను  1953-56 మధ్య కాలంలో ఆంధ్రరాష్ట్రం అనేవారు. ఇప్పుడు ఆ పేరునూ ఎవరూ పలకడంలేదు. రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలని కలిపి గౌరవప్రదంగా సంభోదించే పేరు ఒకటి ఇప్పుడు కావాలి.

తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీ అంత మెత్తనిదికాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీ. రాజధాని ఎక్కడో తేల్చకుండా అందులో సుఖాసీనులు  కావడం అంత సులువూకాదు. విజయవాడ గుంటూరు మధ్య నాగార్జున యునివర్శిటీ ఎదురుగా వున్న మైదానంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి దగ్గర్లోనే కొత్త రాజధాని వుంటుందని వారు సంకేతాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే విభక్త ఆంధ్రప్రదేశ్  కొత్త రాజధాని జాతీయ రహదారి - 5 మీదనే వుంటుంది. అది విజయవాడ గుంటూరు మధ్యన కావచ్చు. లేదా విజయవాడ ఏలూరు మధ్యన కావచ్చు. ఈ ప్రాంతం రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలకు కూడా దాదాపు మధ్యలో వుంటుంది

దక్షణాన కుప్పం నుండి ఉత్తరాన ఇచ్చాపురం  వరకు ఆంధ్రప్రదేశ్ పొడవు 1250 కిలోమీటర్లు. ఈ రహదారిపై విజయవాడ దాదాపు మధ్యలో 650 కిలోమీటర్ల వద్ద వుంటుంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లోనూ కుప్పం నుండి హైదరాబాద్ కూడా దాదాపు  650 కిలో మీటర్లే. విశేషం ఏమంటే తడ ఇచ్చాపురం 970  కిలో మీటర్ల జీయన్ టీ రోడ్డుపై ఏలూరు సరిగ్గా మధ్యలో వుంది ఆ పరిసరాల్లోవున్న పెద్ద నగరం కూడా విజయవాడేఏలూరు విజయవాడల మధ్య, హనుమాన్ జంక్షన్ వద్ద కొత్త రాజధాని నగరాన్ని నిర్మిస్తే అన్ని ప్రాంతాలకూ అనుకూలంగా వుంటుందనే వాదన బలపడుతోంది. రాష్ట్రంలో ఏ మూల నుండయినా రాజధాని నగరానికి ఒక రాత్రి ప్రయాణం (ఓవర్ నైట్) సరిపోతుంది. హనుమాన్ జంక్షన్ dదక్షణాన 24 కిలో మీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్ పోర్టు వుంటుంది. ఆగ్నేయాన 64 కిలో మీటర్ల దూరంలో మచిలీపట్నం సీ పోర్టు వుంటుంది.

అయితే, రాయలసీమ మారుమూల ప్రాంతాల నుండి విజయవాడకు వేగంగా చేరుకోవడానికి ప్రస్తుతం ఎక్స్ ప్రెస్ హైవే లేదు.  రాయలసీమలో కర్నూలు, హిందూపురంల మీదుగా 254  కిలో మీటర్ల మేర హైదరాబాద్ బెంగళూరు ఎన్ హెచ్ 7 / ఏషియన్ హైవే - 43 వెళుతుంది.   చిత్తూరు - కర్నూలు మధ్య  320  కిలో మీటర్ల ఎన్ హెచ్ -18 వెళుతుందికోస్తాంద్రాలో చెన్నై- కొల్ కతా ఎన్ హెచ్5  (జీ.యన్.టీ) 1000 కిలో మీటర్లు, మచిలీపట్నం పూనే ఎన్ హెచ్9  146 కిలో మీటర్లు మాత్రమే ఇప్పటికున్న హైవేలు. ఇందులోనూ 70 కిలో మీటర్ల మచిలీపట్నం విజయవాడ రీచ్ సంపూర్ణ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు.

కుప్పం - గుంటూరు కొత్త ఎక్స్ ప్రెస్ హైవేతోపాటూ  మడకశిర కడప హైవేను తక్షణం నిర్మిస్తే రాయలసీమ మారుమూల ప్రాంతాల నుండి కూడా కొత్త రాజధాని నగరానికి చేరుకునే ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది. పలమనేరు పుంగనూరు, రాయచోటి, కడప, బద్వేలు, పోరుమామిళ్ల, కంబం, వినుకొండ, నరసారావుపేటల మీదుగా 553 కిలో మీటర్ల కుప్పం గుంటూరు స్టేట్ హైవేను ఆరు లేన్ల ఎక్స్ ప్రెస్ హైవేగా మార్చాలిఅలాగే  పులివెందుల, కదిరి, గోరంట్ల, హిందూపురం, మీదుగా 240 కిలో మీటర్ల కడప - మడకశిర బ్రాంచ్ హైవే నిర్మించాలి.
కడప దగ్గర  మడకశిర హైవే పశ్చిమ దిక్కుకు, కుప్పం హైవే దక్షణ దిక్కుకు పోవడంతో అక్కడ వైజంక్షన్ ఏర్పడుతుంది, మొత్తం 8 వందల కిలో మీటర్ల ఈ హైవే ప్రాజెక్టును  వైహైవే అనవచ్చు. ఇందులో కొన్ని రీచుల్లో ఇప్పటికే హైవేలున్నాయి. ఆ మేరకు నిర్మాణ వ్యయం తగ్గుతుంది.

వాజ్ పాయి ప్రభుత్వం పన్నెండేళ్ల క్రితం జాతీయ రహదారుల అభివృధ్ధి పథకం (ఎన్ హెచ్ డిపి) కింద ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కోల్ కతా నగరాలను కలుపుతూ బంగారు చతుర్భుజి (Golden Quadrilateral) ని నిర్మించింది. మొత్తం  5, 846 కిలో మీటర్ల పోడవున్న ఈ ప్రాజెక్టును 60 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించారుదాదాపు 800 కిలో మీటర్ల కుప్పం-మడకశిర-గుంటూరు (కేయంజీ) ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు 12 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. కొత్త ఆంధ్రప్రదేశ్ లో ఇతర అంశాలకన్నా ఈ ప్రాజెక్టు నిర్మాణం ముందుగా చేపట్టాలి. అప్పటికిగానీ అభివృధ్ధికి ముందు షరతుగా  కావలసిన రవాణ సౌకర్యం ఏర్పడదు.
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు)
హైదరాబాద్
2 జూన్ 2014
ప్రచురణ :

http://www.andhraprabha.com/columns/a-column-by-danny/18250.html

No comments:

Post a Comment