Wednesday, 18 June 2014

వ్యంగ్యం - వెకిలి

వ్యంగ్యం - వెకిలి
డానీ

పాపంలో నాక్కూడా కొంత భాగం వుంది. ఒక విధంగా తెలుగు న్యూస్ ఛానళ్లలో రాజకీయ వ్యంగ్య కార్యక్రమాలు ఊపందుకోవడానికి నేనూ ఒకానొక కారణంఅంతకు ముందు సినిమా పాటలతో నడిపేవికటకవి వంటి ఒక నిముషం హాస్య కార్యక్రమాలు వుండేవి. సంభాషణలతో ఒక ఆరు నిముషాల  రాజకీయ ప్రహసనాల ప్రసారాలని  మొదలెట్టింది సీ - ఛానల్ఆ సంస్థ ఎడిటర్ పొలిశెట్టి అంజయ్య ప్రోత్సాహంతో  2004 మే నెలలోకథేంటంటే...” అనే సీరియల్ మొదలెట్టాను. రంగవఝ్ఝుల భరద్వాజ, తుమ్మలపల్లి రఘురాములు, ’ఈనాడు రమణ మా టీమ్ లో సభ్యులు.
యాధృఛ్ఛికంగాకథేంటంటే...” తొలి ఎపిసోడ్ లో  కేంద్ర బిందువు  కేసిఆరే. సముద్రమేలేని తెలంగాణ నాయకులైన కేసిఆర్ కు కేంద్ర  కేబినెట్ లో ఓడలు, రేవుల శాఖ కేటాయించడమే మా తొలి ప్రహసనానికి ముడిసరుకు. రాజకీయాల్లో భీభత్స రసం ఎక్కువైపోవడంతో  ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న టీవీ ప్రేక్షకులకు  రాజకీయ వ్యంగ్య కార్యక్రమాలు కొద్ది సేపు తేలిగ్గా నవ్వుకునే అవకాశం కల్పించాయి. తరువాత న్యూస్ ఛానళ్లన్నీ డ్రామా, యానిమేషన్ రెండు రూపాల్లోనూ అనేక కార్యక్రమాలు మొదలెట్టాయి. నిజానికి కొత్త న్యూస్  ఛానళ్లకు రాజకీయ వ్యంగ్య కార్యక్రమాలే తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు తెస్తున్నాయంటే అతిశయోక్తికాదు.

ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని యాంకరుడిగా పెట్టి తుమ్మలపల్లి రఘురాములు సాక్షి న్యూస్ ఛానల్ లో రూపొందించినడింగ్ డాంగ్ కార్యక్రమం సంస్థకు మంచి గుర్తింపు తెచ్చింది. వనితా టీవీలోమధురవాణి ముచ్చట్లు తో మళ్ళీ వ్యంగ్య కార్యక్రమాన్ని మొదలేట్టిన నేను, 2009 ఎన్నికలకు ముందు ఎన్టీవీలో  ’లల్లూ బ్రదర్స్  మొదలెట్టాను.

ప్రింట్ మీడియాకూ, విజవల్ మీడియాకూ ఒక తేడా వుంటుంది. ప్రింట్ మీడియాలో  రచయిత ఏకాపాత్రాభినయం చేస్తాడు. అది సోలో పాట. విజవల్  మీడియాలో అలా అసలు కుదరనే కుదరదు. ముందూ వెనక చాలామంది పనిచేయాలి. ఇది కోరస్ సాంగ్! బృందగానం!

లల్లూ బ్రదర్స్ రేటింగ్స్ ప్రమాణాల్లో పెద్ద హిట్టు  అవ్వడమేగాక, ఛానల్ కు అంతకుమించిన గుర్తింపు తెచ్చింది. ప్రేక్షకులకు సెటైర్ కార్యక్రమాల మీద ఆసక్తి పెరగడంతో ఒక్కో ఛానల్ రెండు మూడు పొలిటికల్ కామెడీ కార్యక్రమాలు ప్రసారం చేయడం మొదలెట్టాయిదానితో, వాటిని రాసేవాళ్లకూ గిరాకీ పెరిగింది. గిరాకీ పెరిగినపుడు రాశి పెరిగి వాసి తగ్గి  నాసిరకం సరుకు కూడా సంతలోకి వచ్చేస్తుంది. టీవీ న్యూస్  ఛానళ్ళూ, వాటిల్లోని రచయితలూ  దీనికి మినహాయింపేమీ కాదు.

సాల్టికోవ్ షడ్రిన్ నో, ఆంటన్ చెఖోవ్ నో, రిచర్డ్ ఆర్మర్ నో, లూసన్ నో కనీసం ఆర్ట్ బుష్ వాల్డ్  నో  చదవనందుకు ఎవర్నీ మనం తప్పుపట్టాల్సిన పనిలేదు. బీబీసీలో స్పిట్టింగ్ ఇమేజినోయస్ మినిస్టర్, యస్ ప్రైమ్ మినిస్టర్ సీరీస్ లనోకెనడియన్ టెలివిజన్ లో దిస్ అవర్  హ్యాస్ 22  మినిట్స్ నో చూడనందుకూ ఎవర్నీ తప్పు పట్టాల్సిన పనిలేదు. తెలుగులో గురజాడ కన్యాశుల్కాన్నీ, కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాధ శాస్త్రి, భమిటిపాటి రాధాకృష్ణ, ముళ్లపూడి వేంకట రమణ  రచనల్ని చదవకుండాకనీసం విజయావారి  ’మిస్సమ్మ సినిమా కూడా చూడకుండా హాస్యమో వ్యంగ్యమో ప్రహసనమో రాసేస్తామని వచ్చే వాళ్లని తప్పక తప్పుపట్టాలి.

అనేకమంది టీవీ హాస్యరచయితలకు హాస్యానికీ వ్యంగ్యానికి తేడా కూడా తెలీదంటే అతిశయోక్తికాదు. తెలిసిందల్లా వెకిలి! ఇలాంటి వెకిలితనం ఐ-న్యూస్ లోదాదాటైమ్స్తో మొదలయ్యి, అనేక ఛానళ్ళు తిరిగి ఇప్పుడు టివీ-9లో  ’బుల్లెట్ న్యూస్ గా రూపాతరం చెందిందిటొరంటో సిటీ టీవీ అర్ధరాత్రినేకేడ్ న్యూస్అనే బులిటిన్ నడుపుతుంది. దీన్ని ఒక వెబ్ సైట్ తయారు చేస్తుంది. అందులో యాంకరిణులు పూర్తి నగ్నంగా కెమేరా ముందుకు వచ్చి వార్తలు చదువుతారు.” ప్రోగ్రాం విత్ నథింగ్ టు హైడ్అనేది దీని క్యాప్షన్నగ్నత్వాన్ని సగం తగ్గించి, వెకిలితనాన్ని రెట్టింపు చేసి, రచయితలు, నిర్మాతలు సిగ్గు. లజ్జా వదిలేసి తయారుచేసిన కార్యక్రమంబుల్లెట్ న్యూస్.

ఇలాంటి సందర్భాల్లో తప్పుపట్టాల్సింది అచ్చంగా సదరు రచయితల్ని మాత్రమే కాదు. వాళ్ల మీద వున్న వత్తిడిని కూడా తప్పుపట్టాలి. రోజుకు మూడు వేల పదాలు (పదహారు వేల క్యారెక్టర్స్) రాయాలంటే మాటలుకాదు. అదీ సృజనాత్మక రచన. అప్పుడు అందులో పెరటి మార్గం ద్వార  వెకిలితనమే ప్రవేశిస్తుంది.  దాన్నే ఇప్పుడు మనం చూస్తున్నాం.

అధికారంలోవున్నవాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపెట్టడం పాత్రికేయ ధర్మం.  దాన్ని హాస్యపూరకంగా చూపెట్టడానికి  ’యస్ ప్రైమ్ మినిస్టర్ సీరీస్ ప్రయత్నించింది. అందులోని ఒక ఎపిసోడ్ లో ప్రధాన పతిపక్షనేత  బొగ్గు గనుల కుంభకోణంపై  ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తాడు. ఫలానా కమిటీ సమర్పించిన నివేదికను బహిర్గతం చేయకుండా అధికారపక్షం నిరంకుశ పధ్ధతుల్లో తొక్కిపెట్టిందిఅని ఆరోపిస్తాడు. దానికి ప్రధానమంత్రి సమాధానం చెపుతూ, “మేము నియంతృత్వ పోకడల్ని మీకన్నా తీవ్రంగా వ్యతిరేకిస్తాము. నివేదికను పార్లమెంటులో ప్రవేశ పెట్టకూడదని మంత్రివర్గ సమావేశం పక్కా ప్రజాస్వామికంగా నిర్ణయించింది అంటాడు. పాలకుల వెధవాయిత్వాన్ని చూపెట్టడానికి  రచయిత వెకిలివేషాలు వేయాల్సిన పనిలేదు అనడానికి ఇది మంచి ఉదాహరణ. ఇప్పుడు రకం వ్యంగ్యాన్ని రాస్తేఆడియన్స్ కు అందదు. తల మీద నుండి వెళ్ళిపోతుంది. మన ప్రోగ్రాం పక్కా మాస్ గా వుండాలిఅని స్క్రిప్టు రచయితలకు  ఆదేశాలొస్తాయి. కానీ, రేటింగ్స్ అనే  వెంపర్లాట మొదలయ్యాక మాస్ అనేది ఎక్కడికయినా వెళ్ళిపోతుంది. దానిముందు ఇంకే వాదనలూ నిలబడవు. అది ఇష్టం లేకపోతే స్క్రిప్టు రచయితలు  ఉద్యోగాలు వదిలి వీధిన పడాల్సిందే!

1980 దశాబ్దంలో  ’యస్ ప్రైమ్ మినిస్టర్ సీరీస్ నడుస్తున్నపుడు బ్రిటన్ ప్రధానిగా మార్గరెట్ థాచర్ వున్నారుఆమె టోరీ సభ్యురాలు. టోరీ అంటే బ్రిటన్ లో ఛాందసవాద (కన్జర్వేటివ్) పార్టి. పైగా థాచర్ కు ఉక్కు మహిళ అనే పేరు వుందిఆమె మీద జోకులు పేల్చడం అంటే మాటలు కాదుయస్ ప్రైమ్ మినిస్టర్రచయిత, దర్శకుడు, సహనిర్మాత జోనథాన్ లెన్న్  ప్రతి ఎపిసోడుకూ కత్తి మీద సాము చేసేవాడు. విచిత్రం ఏమిటంటే సీరీస్ ను మార్గరెట్ థాచర్ కూడా  గొప్పగా ఆస్వాదించేది విషయాన్ని ఆమె బాహాటంగా చెప్పేది. అంతేకాదు, ఒకసారి  జోనథాన్ లెన్న్ ను ఆడిగి ఒక ఎపిసోడ్ లో ఏకంగా ప్రధాన మంత్రి పాత్రను స్వయంగా థాచర్ పోషించింది.   ఆసమయంలో బ్రిటన్ లో లేబర్ పార్టి ప్రధాన ప్రతిపక్షంగా వుంది.   ఇంకో సందర్భంలో అయితే ప్రధానే వచ్చి నటించినందుకు లెన్న్  ఎగిరి గంతులేసేవాడేమోగానీ, థాచర్ నటించడంవల్ల తన సీరీస్ పై కన్జర్వేటివ్ పార్టీ ముద్ర పడుతుందని భయపడ్డాడటా!

'నావార్తలు నాయిష్టం' సీరీస్ ను  అందులోని పాత్రలైన రాజకీయ నాయకులు  చాలామంది ఆస్వాదించేవారు. కొన్ని మినహాయింపులు ఎప్పుడూ
వుంటాయి. అలాంటివి ఒకటి, రెండు సందర్భాల్లో మాత్రమే  జరిగాయి. అవీ కూడా  నేరుగా నావరకు రాలేదు. "మీ ప్రోగ్రాములో న్యూస్ రీడరుగా కాకపోయినా  లైవ్ ఇన క్యారక్టర్లుగా అయినా మమ్మల్ని పెట్టవచ్చుగా?"  అని  నన్ను కోరిన రాజకీయ నాయకలు చాలా మంది వుంటారు

2009 ఎన్నికల్లో   ప్రజా రాజ్యం పార్టీ నాయకులు బీ ఫారాలు (టిక్కెట్లుఅమ్ముకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అప్పుడు 'లల్లూ బ్రదర్స్' లో అల్లు అరవింద్ పాత్ర "టిక్కెట్టు అని పేరు పెడితేనే దాన్ని అమ్మకానికి  పెట్టారని అర్ధం. టిక్కెట్టు అన్నాక దానికో ధర వుంటుందిధర అన్నాక  గిరాకీ లేనపుడు  వైటులో ఒక రేటు వుంటుంది. గిరాకీ వున్నప్పుడు బ్లాకులో ఇంకో రేటు వుంటుంది. సినీఫీల్డులో టిక్కెట్టు అమ్మడమే ముఖ్యం. టిక్కెట్లు అమ్మగలగడమే సామర్ధ్యం" అంటుంది ఎన్నికల్లోనేచంద్రబాబు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టారు. పథకాన్ని తన కొడుకు లోకేష్ విదేశాల్లో అధ్యయనం చేసి రూపొందించాడని అన్నారుఅప్పటి లల్లూ బ్రదర్స్ లో వైయస్ రాజశేఖర రెడ్ది పాత్ర చంద్రబాబుతో " మీ అబ్బాయి లోకేష్ కన్నా మా అబ్బాయి జగన్ గొప్పవాడయ్యామావాడని చెప్పుకోవడం కాదుగానీ నగదు బదిలీ విషయంలో  జగన్ ను మించినవాళ్ళు లేరంటే నమ్ము" అంటుంది. అప్పటికి జగన్ మీద సిబీఐ కేసులు లేవు.
బుల్లెట్ న్యూస్  వ్యవహారాన్ని కేసిఆర్ శాసన సభలో ప్రస్తావించిన తరువాత స్పీకర్ నిర్ణయం  ఎలా వుంటుందని అందరూ ఉత్కంఠగా  ఎదురుచూస్తున్నారు. ఈలోపులో టీవీ ప్రసారాల పంపిణీ సంస్థలు (ఎమ్ ఏస్  ఓ) తెలంగాణలో టీవీ-9తోపాటూ మరో న్యూస్  ఛానల్ ప్రసారాలు బంద్ చేయాలని నిర్ణయించాయి. దానితో ఒక మీడియా రంగంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మీడియా తన లక్ష్మణ రేఖను దాటడాన్ని ఎవరూ ఉపేక్షించాల్సిన పనిలేదు. వెకిలి రచనల్ని వ్యంగ్యంగా చెలామణీ చేసే ప్రయత్నాలని గట్టిగా అరికట్టాల్సిందే. అలాంటివాళ్ళను నిరభ్యంతరంగా శిక్షించాల్సిందేఅయితే, దానికో విధివిధానం కావాలికానీ, యంఎస్ వోలు చట్టాన్ని తమచేతుల్లోనికి తీసుకుని  నిషేధాలు విధించిభయోత్పాదాన్ని సృష్టించడం మొదలుపెడితే, అధికారంలో వున్నవాళ్ల తప్పుల్ని ఎత్తిచూపాలనే పాత్రికేయ వృత్తి ధర్మమే భయంతో  చచ్చిపోతుంది. ఎందుకంటే "జో  లోగ్ దూధ్ సే జల్ జాతే హై వో ఛాంచ్ కో భీ ఫూంక్ ఫూంక్  కర్ పీతే హై".  (పాలతో నోరు కాల్చుకున్నవాళ్ళు చల్లను కూడా ఊదిఊది తాగుతారు). 

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
18  జూన్  2014

ప్రచురణ :

http://www.andhraprabha.com/columns/sataires-in-tv-shows/18850.html

No comments:

Post a Comment