The Rising State
ఉదయిస్తున్న రాష్ట్రం
ఉషా యస్ డానీ
దాని ఇబ్బందులు దానికి వున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్
ఇప్పుడు ఉదయిస్తున్న రాష్ట్రం. గుజరాత్ తరువాత అంతటి సముద్రతీరం వున్న రాష్ట్రం
అంధ్రప్రదేశ్. తడ నుండి ఇచ్చాపురం రోడ్డు మార్గం 970 కిలో మీటర్లుగానీ, సముద్రతీరం అంతకన్నా 70 కిలోమీటర్లు ఎక్కువ.
భౌగోళికంగా గుజరాత్ లో సూర్యుడు అస్తమిస్తాడు. ఆంధ్రప్రదేశ్ లో సూర్యుడు
ఉదయిస్తాడు. జపనీయులు తమది ఉదయిస్తున్న సూర్యుDiడి దేశం అనుకున్నట్టు తెలుగువాళ్ళు
తమది ఉదయిస్తున్న సూర్యుడి రాష్ట్రం అనుకోవచ్చు.
కొత్త చారిత్రక సందర్భాల్లో కొత్త ప్రభుత్వాలు
వచ్చినపుడు కట్టడాలు, ఊర్ల పేర్లేకాదు రాష్ట్రాల పేర్లు కూడా మారిపోతుంటాయి.
హైదరాబాద్, తెలంగాణ లేని ఆంధ్రప్రదేశ్ కు అదే పేరును కొనసాగించుకోవచ్చు. లేదా
డొక్క మాణిక్య వరప్రసాద్ తదితరులు ప్రతిపాదిస్తున్నట్టు తెలుగునాడు అనుకోవచ్చు. ఏ
పేరు పెట్టినా ఉత్తర, మధ్య, దక్షణ తీరాంధ్రా, రాయలసీమ ప్రజలకు ఆమోదయోగ్యంగా
మాత్రమేగాక కొత్త ఉత్తేజాన్నిచ్చేదిగా
వుండాలి. ఇంగ్లీషులో రెసిడ్యూయల్ అనే పదానికి ఇబ్బందికర తెలుగు అనువాదంగా
అవశేషాంధ్ర అనకుండా వుంటే చాలు.
ఒక రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరించేటప్పుడో, పునర్ నిర్మించేటప్పుడో రెండు రకాల అభివృధ్ధి
మోడల్స్ మన ముందుంటాయి. వీటిల్లో మొదటిది,
మానవాభివృధ్ధి నిర్మితి (Human Development Paradigm). రెండోది, పెరుగుదల అధారిత నిర్మీతి (growth – Based
Paradigm). ఉద్యమ పార్టీలయితే తమకు సాధ్యం అయినా కాకపోయినా పటిష్టంగా మానవాభివృధ్ధి నిర్మితిని
అమలు చేస్తామని ప్రకటిస్తుంటాయి. ఎలక్టోరల్ పార్టీలకు అలా ప్రకటించడం కూడా
కుదరదు. పెరుగుదల అధారిత నిర్మీతిని
ఆశ్రయించకుండా అవి మనుగడ సాగించలేవు.
పెరుగుదల అధారిత నిర్మీతిని పాటించకపోతే పెట్టుబడులు రావు. స్థూల జాతీయ
ఉత్పత్తి పెరుగుదల రేటు ప్రస్పుటంగా కనిపించదు. అయితే, మానవాభివృధ్ధి నిర్మితిని
పాటించకపోతే విశాల ప్రజానీకం మద్దతు, ఆమోదాంశం ప్రభుత్వానికి లభించదు. అంచేత ప్రభుత్వాలు
సందర్భాన్నిబట్టి ఈ రెండు రకాల నిర్మీతుల్లో ఏదో ఒకదాన్ని ఆశ్రయిస్తుంటాయి. ఒక్కోసారి రెండింటినీ ఒకేసారి కూడా
ఆశ్రయిస్తుంటాయి.
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార
మహోత్సవం ఈ రెండు రకాల నిర్మితులకు పట్టం కట్టనుంది. రైతుల రుణాల్ని మాఫీ చేస్తూ
తొలి సంతకం చేయబోతున్న చంద్రబాబు అదే వేదిక మీద నుండి కార్పొరేట్ సంస్థలకు భారీగా
రాయితీలు ప్రకటించే అవకాశాలున్నాయి. ఆదానీ, అంబానీ, సింఘానియా సంస్థలకు ఆహ్వానాలు
పంపడం అందుకే కావచ్చు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా ముఖేష్ అంబానీ,
గౌతమ్ ఆదానీ, సునీల్ మిట్టల్. అశోక్ హిందూజా వంటి కార్పొరేట్ దిగ్గజాలు
హాజరయ్యారు. అలాంటి సన్నివేశాన్ని మళ్ళీ మనం మంగళగిరిలో చూసే అవకాశం వుంది.
తెలంగాణలో రైతు రుణాల మాఫీకి కేసిఆర్ అనుసరించబోయే విధివిధానాల గురించి కొన్ని
వార్తలు బయటికి పొక్కాయి. అంతే ఇదే అదనుగా,
విపక్షాలు వీధికెక్కాయి. ఈ వివాదం
ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే పరిణామాలకు కూడా ఒక సంకేతం కావచ్చు.
ఎలాంటి షరతులు, ప్రమాణలు లేకుండా రైతుల మొత్తం రుణాలు ఎత్తివేయడమో, ఎత్తివేయాలని
కోరడమో ఎంత వరకు సమంజసమో పౌర సమాజం చర్చించాల్సిన అవసరం వుంది. రైతుల్లో పేద, సన్నకారు,
మధ్యతరగతి, ధనిక అనే నాలుగు వర్గాల రైతులు
వుంటారు. అలాగే రైతులు తీసుకున్న రుణాల్లో పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, వాణిజ్య,
పారిశ్రామిక రుణాలు, రీ-షెడ్యూల్డు రుణాలు వగయిరాలు వుంటాయి. వాస్తవానికి వ్యవసాయం
చేసే వాళ్లలో అత్యధికులు పేద, సన్నకారు రైతులు. మధ్యతరగతి, ధనిక రైతుల్లో
అత్యధికులు వ్యవసాయం చేయరు. మూడు దశాబ్దాల క్రితం యన్టీ రామారావు హయాంలో రైతు రుణాలను
మాఫీ చేసినపుడు పేద, సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేశారు. వ్యవసాయానికి
ప్రాణప్రదమైన వాళ్ళు పొలం దున్నే వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు. ప్రభుత్వ రాయితీ
ఏదైన ముందుగా వాళ్లకు దక్కాలి. రుణమాఫీ పథకం విధివిధానాల్లో ఈ అంశం స్పష్టంగా
వుండాలి.
సాధారణంగా మధ్యతరగతి, ధనిక రైతులు పొలాల మీద రుణం తీసుకుని పట్టణాల్లోనో,
నగరాల్లోనో వ్యాపారాలు, పరిశ్రమలు నడుపుతుంటారు. వాళ్ళ రుణాలనూ మాఫీ చేయడం అంటే వున్నవాళ్లకే
మళ్ళీ పెట్టడం అవుతుంది. ఇది ధనవంతుల్ని మరింత
ధనవంతుల్ని చేస్తుంది. ఆ మేరకు పేదలకూ ధనవంతులకు మధ్య అంతరం మరింతగా
పెరిగిపోతుంది. ఇలాంటి పరిణామాలు సమాజ ప్రశాంతతకు ఏవిధంగానూ వాంఛనీయం కాదు.
సమాజ శాంతిని కోరే ప్రభుత్వాలు చేయాల్సిన మొదటి పని సంపద ఒకేచోట పోగుపడిపోకుండా
జాగ్రత్తలు తీసుకోవడం. అది వ్యక్తుల స్థాయిలో కావచ్చు, సంస్థల స్థాయిలో కావచ్చు,
ప్రాంతాల స్థాయిలో కావచ్చు సంపద ఒకే చోట పోగుపడిపోతుండడం అనర్ధాలకే దారితీస్తుంది.
ప్రాంతాల మధ్య సమానాభివృధ్ధిని సాధించాలంటే సీమాంధ్రను నాలుగు జోన్లు
చేయాలి. రాయలసీమ నాలుగు జిల్లాలు మొదటి జోన్, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు రెండవజోన్, మధ్యాంధ్ర
మూడు జిల్లాలు మూడవ జోన్, దక్షణాంధ్ర మూడు జిల్లాలు నాలుగవ జోన్.
మొదటి రెండు జోన్లను వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపునిస్తామని
ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో పేర్కొన్నారు. వాటికి కేంద్రం నుండి భారీ పన్ను
రాయితీలు, ఇతర ఆర్ధిక ప్యాకేజీలు వుంటాయి. తరువాతి
రెండు జోన్లకూ కూడా ప్రత్యేక ప్యాకేజి ఇవ్వనున్నట్టు ఆ చట్టంలోనే
పేర్కొన్నారు.
అభివృధ్ధి పథకం ఏదైనా నాలుగు జోన్లకూ పంచాలి. సచివాలయం
ఒకచోట వుంటే హైకోర్టు ఇంకోచోట వుండాలి. రెగ్యులర్ శాసనసభా సమావేశాలు ఉష్ణ మండలంలో జరిగితే వేసవి
సమావేశాలు హార్స్ లీ హిల్స్ లో జరగాలి. కొన్ని సమావేశాల్ని అరుకులో కూడా
జరపవచ్చు. ప్రతి జిల్లాలోనూ కేంద్ర స్థాయి విద్యాలయం వుండాలి. కేంద్ర, రాష్ట్ర
కార్పొరేషన్లు అన్నింటీనీ స్థానిక ప్రత్యేకతల్నిబట్టి అన్ని జిల్లాలకూ పంచేయాలి. ఫారెస్టు
డెవలప్ మెంట్ కార్పొరేషన్ దండకారణ్యంలోనో, నల్లమల
అడవుల్లోనో వుండాలి. పెట్రోలు ఉత్పత్తులకు సంబంధించిన కార్యాలయాలన్నీ కేజీ
బేసిన్ లోనే వుండాలి. మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషస్ రాయలసీమలోనో, ఉత్తరాంధ్రలోనో
వుండాలి. దేనికి ఎక్కడ అవసరం ఎక్కువగా వుంటుందో ఆ కార్యాలయం అక్కడ వుండాలి.
సీమాంధ్రలో మళ్ళీ అసమాన అభివృధ్ధి కొనసాగితే
ఇప్పుడు జరిగిందే పునరావృతమౌతుంది. సీమాంధ్రకు ఇది కొత్త జన్మ. అది అందరికీ
ఆదర్శంగా వుండాలన్నదే ఆశ!
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
6 జూన్ 2014
ప్రచురణ :
ఆంధ్రప్రభ డైలీ, ఎడిట్ పేజీ, 7 జూన్ 2014
http://www.prabhanews.com/specialstories/article-446152
అవశేషాంధ్ర అనకుండా వుంటే చాలు కాదు కాకుండా ఉండాలి.
ReplyDeleteరెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సందర్భం ఇది. రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలి అని కోరుకుందాం!