Tuesday, 10 June 2014

The Era of Identity Movements

అస్థిత్వ ఉద్యమాల యుగం
డానీ
అస్థిత్వ ఉద్యమాల కాలం ఇది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు  ఆచీతూచీ అడుగులు వేయాల్సిన రోజులివి. ఏమాత్రం తేడా వచ్చినా ప్రజలు నిలదీస్తారు. ఓట్లు వేసి గెలిపించిన చేతులతోనే మెడ పట్టుకుంటారు. 

 అనేక అస్థిత్వాలు కలిసి సాగిన తెలంగాణ ఉద్యమ లక్ష్యం సాకారమవ్వడాన్ని ఇటీవలే చూశాం.  కొత్త రాష్ట్రం ఆవిర్భావ సంబురాలు ఇంకా జరగనేలేదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఏమివ్వబోతోందో ఇంకా తేలనేలేదు. అప్పుడే  కేసిఆర్ ఢిల్లీ వెళ్ళి ఏపీకి ఏమిచ్చినా తెలంగాణకూ ఇవ్వాల్సిందే అని ప్రధానికి మరీ చెప్పివచ్చారు. అస్థిత్వాల వ్యవహారం అంత సున్నితంగా మారింది.

తెలంగాణ తొలి రోజే అస్థిత్వాల పంచాయితీ మొదలయ్యింది. ఆ రోజుల్లో రాజా కిషన్ పర్షాద్ ను నిజాం నవాబ్ ప్రధానిగా నియమిస్తే ఈ రోజుల్లో తనను కేసిఆర్ ఉప ముఖ్యమంత్రిగా నియమించారని ఎండీ మహమూద్ అలీ ఒప్పొంగిపోయారు.  భారత జాతిపిత గాంధీజీ అయితే తెలంగాణ జాతిపిత కేసిఆర్ అంటూ తన పేషీలో  వాళ్ళిద్దరి ఫోటోలు పక్కపక్కనే పెట్టి పరవశించిపోయారు. ఈలోపులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగోలో ఉర్దూ లేదంటూ సీనియర్ కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీ నిరసనకు దిగారు.  

మరోవైపు, చంద్రబాబు మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసీ చేయగానే ఆయన కేబినెట్ లో సామాజికవర్గాల సమీకరణల డీఎన్ ఏ అన్ని ప్రధాన పత్రికల్లోనూ ప్రముఖంగా వచ్చేసింది. మొత్తం పంతొమ్మిది మంది మంత్రుల్లో  కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య, కొప్పుల వెలమ, తూర్పు కాపు, గౌడ, యాదవ, మత్స్యకార, మాల, మాదిగ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది. త్వరలో  ఎస్టీ అభ్యర్ధికి స్థానం కల్పిస్తారని వార్తలొచ్చాయి.  

తెలంగాన లోగోలో ఉర్దూకు ప్రాతినిథ్యం లేకపోతే, చంద్రబాబు మంత్రివర్గంలో ఏకంగా ముస్లిం సామాజికవర్గానికే ప్రాతినిథ్యం లేకుండా పోయింది. తెలంగాణలో షబ్బీర్ అలీ చేసినట్టు వాళ్ళు నిరసన తెలిపే స్థితిలో లేరు కనుక లోలోపల మదనపడే అవకాశం మాత్రమేవుంది. మంత్రివర్గంలో ముస్లింలకు స్థానం దక్కకపోవడానికి టిడిపిలో ఆ సామాజికవర్గం నుండి ఒక్క శాసనసభ్యుడు కూడా లేకపోవడం దీనికి కారణం అని చెపుతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఏదీ కాకపోయినా పొంగూరు నారాయణకు మేధావుల కోటాలో స్థానం కల్పించారు.

ప్రమాణ స్వీకారాల తరువాతి ఘట్టం ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలుపరచడం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతల్ని ఒకే అంశం కలవరపరుస్తుండడం విశేషం. అది రైతు రుణమాఫీ! ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తున్నపుడు  నాయకుల చేతికి ఎముక వుండదు. కళ్ళ ముందు ఓట్ల వర్షం కురుస్తూ వుంటుంది. ఎన్నికల తరువాత వాళ్లకు కొండలు, గుట్టలు కనిపిస్తాయి. ఇప్పుడు తెలంగాణ చంద్రుడూ, ఆంధ్రప్రదేశ్ చంద్రుడు ఇద్దరికీ వింధ్యాపర్వతంలా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కనిపిస్తోంది. రైతు రుణమాఫీ విధివిధానాల రూపకల్పన కోసం కేసిఆర్ కొంచెం గడువు కోరితే, ఆ అంశాన్ని పరిశీలించడానికి చంద్రబాబు ఒక కమిటీని వేశారు. అలా ఇద్దరూ వాగ్దానం చేసిన తొలి సంతకాన్ని పెట్టీ పెట్టనట్టు పెట్టారు.

కేసిఆర్ ముందున్న సమస్యలు,  సవాళ్ళకన్నా చంద్రబాబు ముందున్న సమస్యలు సంఖ్య రీత్యా ఎక్కువ. తీవ్రత రీత్యా పెద్దవి. అందులోనూ రాజధాని నగరం వంటి సంక్లిష్ట సమస్యను పరిష్కరించడం మరీ కష్టం. నిజానికి  కేసి శివరామకృష్ణన్ కమిటి  తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేంత వరకు  ఈ అంశాన్ని వాయిదా వేసే అవకాశం చంద్రబాబుకు వుంది.  అయినా, ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే  రాజధాని నగరంపై చంద్రబాబు ప్రకటన చేయడం సాహసమనే చెప్పాలి. విజయవాడ – గుంటూరు మధ్యన రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నట్టు వారు ప్రకటించారు. ఒకవేళ భూసేకరణకు అక్కడి రైతులు సహకరించకపోతే మరో చోటికి వెళతామన్నారు. ఆ ప్రాంతం కూడా ఆ సమీపంలోనే వుంటుందన్నారు.  గుంటురు-విజయవాడ మధ్యన కుదరకపోతే విజయవాడ- ఏలూరు మధ్యన వుంటుందని ఇది సంకేతం కావచ్చు.

చంద్రబాబు అన్నట్టు రాజధాని నగరం మృతదేహంలా ఉండకూడదన్నది నిజమేగానీ, ప్రపంచంలోకెల్లా అందమైన నగరం నిర్మించాలనుకుని దాన్ని మరో హైదరాబాద్ లా తయారు చేస్తే పాత సమస్యలే పునరావృతమయ్యే ప్రమాదం వుంటుంది. కేంద్రంలో వున్నది మిత్రపక్షమేకాక, పట్టణాభివృధ్ధిశాఖా మంత్రి వెంకయ్యనాయుడు సహితం రాష్ట్రానికి చెందిన నాయకుడే కనుక  జిల్లాకో  స్మార్ట్ సిటీలను కట్టే అవకాశం వుంది. జిల్లాలు, ప్రాంతాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవడం అన్నింటికన్నా ప్రాణప్రదమైన ప్రమాణం!
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
10 జూన్ 2014
ప్రచురణ :

No comments:

Post a Comment