Saturday 7 March 2015

తూర్పుకు నడిపించే ’సొంత సంతకం’

తూర్పుకు నడిపించే  సొంత సంతకం’ 
మన మెదళ్లను పశ్చిమ వ్యామోహం ఏలుతున్న కాలంలో తూర్పు దిక్కుకు చూడండి అని చెప్పిన కొద్ది మందిలో జాన్ సన్ చోరగుడి ఒకరు.ఇప్పుడు తూర్పుకు చూడడం కొత్త ట్రెండుగా మారిందిగానీ ఈ విషయంలో జాన్ సన్ చాలా ముందున్నారు.

తెలుగు పత్రికల ఎడిట్ పేజీల్లో వామపక్షభావాలు విరబూస్తున్న కాలంలో ప్రవేశించిన విభిన్న సంతకం జాన్ సన్ చోరగుడి. ఆయన  వామపక్షంకాదు. జహ్నవీలా కుడిపక్షం కాదు, అరవిందరావులా ధార్మికపక్షమూకాదు. వారిది ఉపయోగితావాదం. అందులోకూడా వారు జెరిమీ బెంథామ్. జాన్ స్టూవర్ట్ మిల్ లా సాంప్రదాయిక ఉపయోగితావాది కూడా కాదు. యుటిలిటేరియనిజానికీ, కాన్సిక్వెన్షియలిజానికి (Consequentialism - "the ends justify the means")  మధ్యేమార్గం తన ప్రాపంచిక దృక్పధం అని ఆయనే స్వయంగా చెప్పుకున్న సందర్భాలున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే  జాన్ సన్ మత అల్పసంఖ్యాకవర్గాల ఉపయోగితావాది. క్రైస్తవ ఉపయోగితావాది. ఆసియా ఖండంలో పుట్టిన క్రైస్తవం ఆసియా క్రైస్తవంలానో, ఇండియా క్రైస్తవంలానో వుండాలనేదిది జాన్ సన్ అభిలాష. యూరప్ కో, అమెరికాకో వెళ్ళి సూటూ బూటూ హ్యాటు పెట్టుకునివచ్చిన క్రైస్తవం వారికి నచ్చదు.

లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్.పి.జి) విధానాలని వామపక్షాలు సూత్రప్రాయంగా వ్యతిరేకిస్తాయి. సంక్షేమ పథకంవల్ల నూటికి ఐదుగురికి అన్యాయం జరిగినా వామపక్షాలు విమర్శిస్తాయి. సంక్షేమ పథకాలవల్ల ఐదుగురు పేదలకు మేలు జరిగినా మంచిదేగా అనేది జాన్ సన్  తత్వం. ప్రభుత్వపథకాల లోటుపాట్లను పక్కనపెట్టి, వాటిని దళితాభ్యుదయానికి ఏమేరకు ఉపయోగించవచ్చు అని నిరంతరం ఆలోచిస్తూ వుంటారు ఆయన.

ఆంధ్రప్రదేశ్ విడిపోతే సీమాంధ్ర భవిష్యత్తు అంధకారం కాబోతోందని అనేకమంది పెద్ద గొంతుతో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నపుడు, రాష్ట్రం విడిపోయినా సీమాంధ్ర మరింత వేగంగా అభివృధ్ధిని సాధిస్తుందని భౌగోళిక మ్యాపులు గీసి మరీ చెప్పిన బహుకొద్దిమందిలో జాన్ సన్ ఒకరు.

ప్రభుత్వాలు కోల్పోతున్న ఆమోదాంశానికి తిరిగి జీవంపోయడానికి ఐక్యరాజ్యసమితి చేపట్టిన కార్యక్రమం సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్).  అయితే, భారతదేశంలో  ఈ కార్యక్రమాన్ని క్రిస్మస్ రోజున మొదలెట్టడం మీద  నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సందర్భంగా జాన్ సన్  భిన్నంగా ఆలోచించారు. క్రిస్మస్ గౌరవాన్ని భారత ప్రభుత్వం పెంచినట్టు భావించారాయన.  ఏసుక్రీస్తు బోధనల్లోనే Eight Elements of Good Governance వున్నాయని రీ గుర్తు చేశారు.  వారి వ్యాససంపుటి సొంత సంతకంలో కూడా ప్రజలు, ప్రాంతము, ప్రభుత్వము, సమాజము, ప్రపంచము, విశ్వాసము, కాలము, మీడియా అనే ఎనిమిది అధ్యాయాలుండడం విశేషం. సమాజము-సరళీకరణ-సమకాలీనత అనేది దీనికి ట్యాగ్ లైన్. 

జాన్ సన్ వ్యాసాల విస్తృతి కూడా పెద్దదే. నెహ్రు-అంబేద్కర్ కార్టూను దుమారం, నలందా విశ్వవిద్యాలయం పునరుధ్ధరణ మొదలు ఇజ్తాయిల్-పాలస్తీన వివాదం వరకు  అనేక వర్తమాన అంశాలపై  సొంత దృక్పథంతో రాసిన వ్యాసాలు ఇందులో వున్నాయి.

అప్పుడప్పుడు పత్రికల్లో అచ్చయ్యే వ్యాసాలు చదివి రచయిత మీద ఏర్పరచుకునే అభిప్రాయాలు పాక్షికమైనవి. వాటిని ఒక సంకలనంగా చదివినపుడు మాత్రమే ఏ  రచయితను అయినా  సమగ్రంగా అర్ధం చేసుకునే అవకాశం వుంటుంది. అలాంటి అవకాశాన్నిసొంత సంతకంఇస్తుంది. వర్తమాన ప్రపంచం తూర్పుకు చూడాల్సిన అవసరాన్నీ, దాని ప్రయోజనాలనీ తెలుసుకోవాల్సినవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకంసొంత సంతకం’. సొంత ఆసక్తి వున్నా లేకపోయినా గ్రూపు సర్విసు పరీక్షల్లో నెట్టుకురావడం కోసమైనా సమాజ శాస్త్రాలను చదువుతున్న కొత్త తరానికి ఇది హ్యాండ్బుక్కు అవుతుంది
-     డానీ

సొంత సంతకం
412 పేజీలు
జాన్ సన్ చోరగుడి
అబా మీడియా ప్రచురణ, విజయవాడ
వెల250 రూపాయలు




No comments:

Post a Comment