Wednesday, 18 May 2016

America’s God’s Country and Advani’s RamaRaj

Americas God’s Country and Advani’s RamaRaj
అమెరికా  దేవుని రాజ్యం! అద్వానీ రామరాజ్యం!!
ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ)

బక్ పత్రికలు చదవదు” అంటూ ఆరంభమౌతుంది జాక్ లండన్ నవల ’ప్రకృతి పిలుపు’. బక్ పత్రికలు చదవగలిగితే అలాస్కాలో బంగారం గనులు బయటపడ్డాయని దానికి తెలిసి వుండేది. బంగారం వేటగాళ్ళ స్లెడ్జి బండ్లు లాగడానికి దొరికిన ప్రతి కుక్కనూ పట్టుకుపోతున్నారని ముందుగా తెలిసి జాగ్రత్తపడి వుండేది.  బక్ ఒక కుక్క గనుక పత్రికలు చదవడం రానందుకు దాన్ని తప్పు పట్టనవసరంలేదు.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డాలర్ వేట ఆరంభమయింది. పాలకులేకాదు పాలితులు సహితం డాలర్ డ్రీమ్ లో మునిగితేలుతున్నారు. స్లెడ్జి బండ్లు లాగడానికి ఇప్పుడు ముస్లింలకు బక్ పాత్ర మిగిలింది. అప్పుడు అక్షరజ్ఞానం లేదుగనుక బక్ పత్రికలు చదివేదికాదు. అదేం వైపరీత్యమోగానీ పొట్టలో నాలుగు అక్షరాలున్న ముస్లింలెవ్వరూ దేశంలో ఇప్పుడు పత్రికలు చదవడంలేదు. సాయంత్రం టీవీలో ప్రసారం అవ్వాల్సిన వార్త ఉదయమే లీక్ అయిపోతోంది. రాత్రివచ్చిన పీడకల  తెల్లారితే పత్రికల్లో వార్తగా ప్రత్యక్షమవుతోంది. ముస్లింలకు ఇప్పుడు వార్తల ఫోబియో పట్టుకుంది. అందులోనూ గుజరాత్ వార్తలంటే మరీ భయంగా వుంటోంది.

ఇస్లాం ధర్మం ప్రకారం ముస్లీంలు చనిపోయాక వాళ్ళ ఆత్మలు తీర్పు దినం కోసం సమాధుల్లో ఎదురుచూస్తుంటాయి. అంతేతప్ప భూతాల్లా మారిపోవు. కానీ, గుజరాత్ ముస్లింల ఆత్మలు మనల్ని పగలూరేయి భూతాల్లా వెంటాడుతున్నాయి. ఇది ఇస్లాంకు వ్యతిరేకమని వాటికి తెలిసినట్టులేదు.

నలుగురం కలిసి నవ్వుకోవడం ఎలాగూ సాధ్యంకావడంలేదు. కనీసం నలుగురు కలిసి ఏడవగలిగినా బాగుండును. సమిష్టి విలాపం కూడా ఇప్పుడు భారత ముస్లింలకు విలాస వ్యవహారం అయిపోయింది. ఈ విషాదానికి కనీసం వంద శిశిరాల వయస్సుంది. అంతర్జాతీయంగా 1973 నాటి చమురు సంక్షోభంలో దీనికి మూలాలున్నాయి.

ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా కేవలం మూడు శాతం మాత్రమే. ప్రపంచ చమురు వినియోగంలో అమెరికా వినియోగం ఏకంగా 25 శాతం. చమురు ఎగుమతి చేసే ఒపెక్ దేశాల్లో అగ్రస్థానం సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఇ, కువైట్, ఇరాన్ లది అయితే చమురు దిగుమతిచేసుకునే దేశాల్లో అగ్రస్థానం అమెరికాది.

నేటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ షేనీ పూర్వాశ్రమంలో ఓ బహుళజాతి చమురు కంపెనీ సిఇఓ. కరుణామయుడైన భగవంతుడు ప్రజస్వామ్య విరుధ్ధమైన దేశాల్లో అపార చమురు నిల్వలు పెట్టి, అమెరికాలోనూ అమెరికావంటి ప్రజాస్వామ్య దేశాల్లోనూ చమురు నిల్వలు పెట్టలేదని ఆయన వాపోయేవాడు. చమురు అవసరాలను తీర్చుకోవడానికి ’ప్రజాస్వామ్య వ్యతిరేక దేశాలు’ వేటిలోనయినాసరే ’ప్రజాస్వామ్య అమెరికా’ కాలు మోపాలనేది ఆయన సిధ్ధాంతంగా వుండేది. మరోవైపు, బహుళజాతి చమురు కంపెనీలే పెట్రో డాలర్లు కురిపించి జూనియర్ బుష్ ను అమెరికా అధ్యక్షునిగా గెలిపించుకున్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరూ చమురు కంపెనీల ముద్దుబిడ్డలే కావడంతో డిక్ షైనీ సిధ్ధాంతం ఇప్పుడు అమెరికాలో ’ఎనర్జీ బిల్లు’గా మారింది. చమురు ఉత్పత్తి చేసే ఇస్లామిక్ దేశాలను నయాన్నో భయాన్నో లొంగదీసుకోవడం ఈ బిల్లు లక్ష్యం. ఎనర్జీ బిల్లుకు అనుకూలంగా అమెరికా ప్రజల మద్దతునేకాకుండా, అమెరికా మిత్రదేశాల మద్దతును కూడా కూడగట్టేందుకు ’నాగరీకతల పోరు’ సిధ్ధాంతానికి ప్రాణం పోశారు అమెరికా పాలకులు.

డిక్ షేనీ ఎలాగూ దేవుని ప్రస్తావన ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాల్సి వున్నది.   ఇస్లామిక్ గ్రంధాల ప్రకారం ప్రవక్త ఇబ్రాహిం (అబ్రహాం) తొలి భార్య సంతానం తదనంతర కాలంలో క్రైస్తవులుగా మారితే , రెండవ భార్య సంతానం తదనంతర కాలంలో ముస్లిములుగా మారారు. ఆ మేరకు, ఇస్లాంకు క్రైస్తవంతో మరేమతంకన్నా ఎక్కువ అనుబంధం వుంది. చమురు ఎగుమతి చేసే దేశాలు ఇస్లామిక్ దేశాలు కావడం, చమురు దిగుమతి చేసుకునే దేశం క్రైస్తవ దేశం కావడం కేవలం యాధృఛ్ఛికం. కానీ, చమురు ఎగుమతులు దిగుమతుల మధ్య సాగుతున్న పచ్చి వాణిజ్య ఫొరుని అమెరికా ’నాగరీకతల పోరు’గా మార్చి తటస్థంగా వుండాల్సిన దేశాల్ని సహితం ఈ వివాదం లోనికి బలవంతంగా లాగింది. ఈ నేపథ్యంలోనే ’సెప్టెంబరు 11’ దాడులు జరిగాయి. ఏది చర్య? ఏది ప్రతిచర్య?

గుజరాత్ మారణ హోమంలో ముస్లింలది చర్య హిందువులది ప్రతిచర్య అంటున్నాడు ప్రచారక్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ. రామసేవకుల సజీవ దహనం ఒక అమానుష చర్య. గోధ్రా దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిందే; వాళ్ళు ముస్లింలు అయినా సరే. గోధ్రా దోషుల నిర్ధారణ ప్రక్రియ ముగియక ముందే (నిజానికి ఆరంభం కాకముందే) గుజరాత్ లో ముస్లింల నరమేధం  ఆరంభమయిపోయింది. పైగా ఇది గుజరాత్ ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం అట!. ఒక వ్యక్తి నేరం చేస్తే అతని తెగ నంతటినీ శిక్షించే మధ్యయుగాల ధర్మం ఇప్పుడు గుజరాత్ లో పునరావృతమవుతోంది.  అమన్ చౌక్, షా ఆలం రక్షణ శిబిరాల్లోంచి చెవులు హోరెత్తేలా వినిపిస్తున్న ఆర్తనాదాలు ’క్రియాశీల’ రాశ్ట్రపతి భవనాన్ని తాకకపోవడం ఆశ్చర్యకరం. గుజరాత్ మారణహోమంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగం తగులబడిపోయిందేమో మనకు తెలీదు. ప్రాణభయంతో రక్షణ కోసం పరుగున వచ్చిన ముస్లిం శరణార్ధుల్ని చూసి సబర్మతీ ఆశ్రమం తలుపులు మూసేశారట!. “ఈశ్వర్ అల్లా తేరే నామ్” ఓ మహర్షీ!  ఓ మహాత్మా! వింటున్నావా?

ప్రతీ చర్యకూ సమానమైన తద్వెతిరేకమైన ప్రతిచర్య వుంటుందనేది న్యూటన్ కనుగొన్న చలన సూత్రం.  అరవాయ్ శవాలకు ఆరువేల శవాలు, ఆరు లక్షల నిర్వాశితులు అనేది మోదీ రూపొందించిన సాంస్కృతిక యుధ్ధ వ్యూహం. మనమ్ ఆందోళన్ చెందాల్సింది దేనికంటే ప్రతిచర్యకు కూడా ఇంకో ప్రతిచర్య వుంటుందని మనకు తెలిసినందుకే!

భింద్రేన్ వాలా బాహాటంగా శిక్కు నాయకుడు అయినట్టు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధి బాహాటంగా హిందూ నాయకురాలుకాదు.  ఇందిరాగాంధీని ఇద్దరు శిక్కు అంగరక్షకులు కాల్చి చంపేశారు. దానితో కోపోద్రేకులయిన హిందువులు ఢిల్లీలో దాదాపు ఐదు వందల మంది శిక్కులపై ఊచకోత సాగించారు. విచిత్రం ఏమంటే స్వర్ణదేవాలయంపై దాడి జరిగినపుడూ, భింద్రేన్ వాలాను కాలి చంపినపుడూ శిక్కులెవ్వరూ పంజాబ్ లోని హిందువులపై దాడులు జరపలేదు. పైగా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ళల్లో దాక్కున్నారు. ఢిల్లీలో పనిచేసిన న్యూటన్ సూత్రం పంజాబ్ లో పనిచేయలేదు. చలన సూత్రాలు ప్రకృతిలో ఎప్పుడూ ఒకలా వుంటాయి. కానీ, సమాజంలో మాత్రం అవి సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. విజ్ఞాన శాస్త్రాలకు జాతి స్వభావంతో పాటూ మత స్వభావం కూడా వుంటుందని మనకు తెలియక పోవడమే విషాదం. కచ్ లో భుజ్ లో భూకంపం వచ్చినపుడు అంతటి వితరణ చూపిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపొయారూ? ప్రకృతి వైపరిత్యాలకేతప్ప సామాజిక వైపరిత్యాలకు మనం చలించలేమా?

మహారథి హోంమంత్రి అద్వానీకీ గుజరాత్ అంటే మహా ఇష్టం. మహాత్ముని రాష్ట్రాన్ని మనువు రాష్ట్రంగా మార్చడం ఆయన ఆశయం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన తన ఆశయాలని చాలసార్లు వివరించారు. ఏడేళ్ల క్రితం ఢిల్లీలో బీజేపి అధికారానికి వచ్చినపుడు “నేడు మినీ భారత్ రేపు మహా భారత్” అంటూ ఆ పార్టి నేతలు  ఆశాభావం వ్యక్తం చేసేవారు. వాళ్ల కోరిక ఫలించింది. కేంద్రంలో ప్రస్తుతం బీజేపి నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలో వుంది. వాళ్లకు అది చాలదు. ఇంకేదో కావాలి. ఇప్పుడు ’గుజరాత్ ప్రయోగం” జయప్రదమయ్యాక సంఘ్ పరివార్ అప్పుడే “నేడు గుజరాత్ రేపు మహాభారత్” అంటూ హెచ్చరికలు చేస్తోంది.

మరో కోణంలో చూస్తే, ఈ హెచ్చరికకు గట్టి నేపథ్యమే వుంది. గుజరాత్ కు కార్పొరేట్ రాజధానిగా పేరుంది. గుజరాత్ కార్పొరేట్ సంస్థలే తొలి నుండీ భారత స్టాక్ మార్కెట్ ను నియంత్రిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ’అప్పుల ఉచ్చు” పరచుకున్నాక  అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుండి అత్యధిక వడ్డీ రేటుకు అప్పుతెచ్చిన రాష్ట్రం గుజరాత్. యూసె ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేటును 4  శాతానికి తగ్గించినా ప్రపంచ బ్యాంకుకు గుజరాత్ 18 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఆర్ధికరంగంలో ఏర్పడిన లోటు సంక్షోభంగా మారి, సహజంగానే సామాజిక ఘర్షణగా మారింది. గుజరాత్ మారణహోమాన్ని ఘర్షణ అనడంకన్నా ఏకపక్ష యుధ్ధం అనడం మరింత సమంజసంగా వుంటుంది. కార్పొరేట్ రంగంలో క్రమంగా నిలదొక్కుకుంటున్న భోరా ముస్లింల ఫ్యాక్టరీల్ని, కార్యాలయాల్నీ, నివాసభవనాల్నీ ప్రత్యేకంగా గుర్తించి మరీ భస్మీపటలం చేసేశారు. విధేశీ ఆర్ధిక సంస్థల నుండి అప్పులు తెచ్చుకోని రాష్ట్రం ఇప్పుడు దేశంలో ఏదీలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు గుజరాత్ లో జరుగుతున్నది రేపు మరో రాష్ట్రంలో జరగదన్న నమ్మకం ఏమీలేదు. ఆ మేరకు గుజరాత్ సంక్షోభానికి అంతర్జాతీయ ప్రాముఖ్యత, అమెరికా లింకు రెండూ వున్నాయి.అప్పుడే, శివసెన అధినేత బాల్ థాక్రే మహారాష్ట్రలో రక్తపాత అంతర్యుధ్ధానికి సిధ్ధంకందని పిలుపు ఇచ్చేశారు.

ప్రభుత్వమే నేరుగా ప్రజల్ని నాగరీకత పేరునో, సంస్కృతి పేరునో రెండు శిబిరాలుగా చీల్చి, ఒకవర్గంపై ఏకపక్షంగా దాడులు నిర్వహిస్తున్నపుడు ప్రజలు ఏం చేయాలీ? విదేశాల నుండి తెచ్చిన నిధులు, ఆయుధాలు, పరికరాలు, సిధ్ధాంతాలతోనో అగ్రరాజ్యాల వత్తిడి మేరకు చేసిన చట్టాలతోనో ప్రభుత్వం తమ మీద దాడి చేస్తున్నదని స్పష్టమైపోయినపుడు ఆదేశ ప్రజలు కూడా నిధులు, ఆయుధాలు, పరికరాలు, సిధ్ధాంతాల కోసం విదేశాల వైపుకు చూడాల్సి వచ్చే ప్రమాదం లేకపోలేదు. చారిత్రకంగా ఇలాంటి నేపథ్యంలోనే టెర్రరిజం పుట్టుకు వస్తుంది. ఏది చర్య? ఏది ప్రతి చర్య?

అయినప్పటికీ ప్రతిచర్యగా కూడా టెర్రరిజం సమర్ధనీయం కాదు. ఎన్నడూ ఎక్కడా టెర్రరిజం విజయాన్ని సాధించిన దాఖలాలులేవు. అంతేకాదు, టెర్రరిజం ఏ లక్ష్యాలను సాధిస్తానని ఆరంభం అవుతుందో సరిగ్గా ఆ లక్ష్యాలకు విరుధ్ధంగా అది అంత మౌతుంది. అనుమానం వున్నవాళ్ళు కాశ్మీర్ ను చూడండి. అక్కడ ఇస్లామిక్ టెర్రరిస్టుల చేతుల్లో చనిపోతున్నవాళ్ళలో అత్యధికులు ముస్లింలు.
ఇండియాలో టెర్రరిస్టుల ప్రస్తావన వచ్చినపుడు సహజంగానే పాకిస్తాన్ ప్రస్తావన కూడా వస్తుంది. స్వదేశంలో తమ మతస్తులు అనుభవిస్తున్న క్రూర అణచివేతని చూసి కలతచెందిన ముస్లింలలో కొందరికి “ఆదుకుంటుందేమో” అని పాకిస్తాన్ మీద ఆసక్తి కలుగుతుంది. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే పాకిస్తాన్ వేగులు కాచుకు కూర్చొని వున్నారు. భారత ముస్లింలలో కొందర్ని పావుల్ని చేసి తన రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చుకోవాలని పాకిస్తాన్ ఆశిస్తోంది. అంతేతప్ప భారత ముస్లీంలను మతాభిమానంతో ఆదుకోవాలనే తలంపు పాకిస్తాన్ కు లేదు. ఆదేశానికి అంతటిశక్తీ లేదు. నిజానికి పాకిస్తాన్ తన రాజకీయార్ధిక ప్రయోజనాల కోసం భారతదేశంలో ముస్లింలను మాత్రమేకాదు ముస్లిమేతరుల్ని కూడా ఉవయోగించుకుంటుంది.

మతాభిమానమే కావాలనుకుంటే ముస్లింలకు ప్రపంచంలో అనేక దేశాలున్నాయి. విషయం ఇంత స్పష్టంగా వున్నప్పటికీ కొందరు భారత ముస్లిం యువకులు నిస్పృహతో పాకిస్తాన్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇలాంటి చర్యలు మొత్తం భారత ముస్లీంలకు మచ్చ తెస్తాయని వాళ్ళు గుర్తించాలి. దేశంలోని ముస్లింలందరూ టెర్రరిస్టులు కానట్లే, టెర్రరిస్టులందరూ ముస్లింలుకారు!. మనదేశంలోని పాకిస్తాన్ ఏజెంట్లలో ముస్లీంలకన్నా ముస్లిమేతరులే ఎక్కువ అని ఇటీవలి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రజల ధన మాన ప్రాణలను పరిరక్షించడానికి ప్రతి రాష్ట్రంలోనూ పోలీసు వ్యవస్థ వుంటుంది. ఆపైన కేంద్ర ప్రభుత్వానికి కుడా మరో పోలీసు వ్యవస్థ వుంటుంది. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏటా ఇరవాయ్ వేల కోట్ల రూపాయల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్నాయి. ఇదంతా ప్రజాధనమే. ప్రజల నడ్డి విరిచి వసూలు చేసిన పన్నుల్లో భాగమే. శాంతిభద్రతల పరిరక్షణ కోసం విదేశాల నుండి ఆయుధాలేకాదు అప్పులు కూడా తేవాల్సివస్తున్నదని ప్రభుత్వాలు పదేపదే గగ్గోలు పెడుతున్నాయి. గుజరాత్ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించినా మనం ఇంతగా బాధపడాల్సిన అవసరం వుండేదికాదేమో! సంఘ్ పరివారానికి చెందిన అల్లరి మూకల్ని గుజరాత్ పోలీసులు వెన్నుతట్టి, ప్రోత్సహించి, దగ్గరుండి మరీ ముస్లింలపై  దాడులు జరిపించారని వస్తున్న వార్తలే ప్రజాస్వామ్యవాదుల్ని మరింతగా కలవరపెడుతున్నాయి. గుజరాత్ పోలీసుల్నీ, ముఖ్యమంత్రి నరేంద్రమోదీనీ వదిలేసి మరెవరిపై ప్రయోగించడనికి ఎన్డీయే ప్రభుత్వం పొటాపోటీగా పోటాను సంధించిందనే అనుమానం ఈ సందర్భంగా ఎవరికయినా రాకుంటే వాళ్ల నిజాయితీని శంకించాల్సిందే!

నాగరీకతల యుధ్ధాన్ని ఆరంభించిన అమెరికా ప్రపంచ ప్రజల్ని రెండు సాంస్కృతిక శిబిరాలుగా చీల్చి వేస్తోంది. ఇప్పుడు సాంస్కృతిక వైవిధ్యమున్న ప్రతి దేశంలోనూ అణగారినవర్గాలు రెండు రకాల అణచివేతల్ని చవిచుస్తున్నాయి. వాటిల్లో మొదటిది; జాతీయ అణచివేత. రెండోది; అంతర్జాతీయ అణచివేత. తన ఆధీనంలో ప్రపంచరాజ్య స్థాపన చేయాలని అమెరికా ఉవ్విళ్ళూరుతోంది. దీనినే దైవరాజ్యస్థాపన అని నమ్మించి క్రైస్తవులను రెచ్చగొట్టాలని కుడా అమెరికా ఆశిస్తోంది. అమెరికా ప్రత్యక్షంగా దాడిచేస్తే ఆ దేశం ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది. పరోక్షంగా దాడులు చేస్తే ఆ రాష్ట్రం గుజరాత్ అయిపోతుంది. మేడ్ ఇన్ ఇండియా జిల్లెట్ ట్విన్ బ్లేడ్లూ, మేడ్ ఇన్ యూఎస్ ఏ జిల్లెట్ ట్విన్ బ్లేడ్లూ ఒకే సూపర్ బజార్లో దొరుకుతున్నట్లే మనకు ఇప్పుడు జాతీయ మెజారిటీ మతతత్త్వమూ, అంతర్జాతీయ మెజారిటీ మతతత్త్వమూ చెట్టాపట్టాలేసుకుని దర్శన మిస్తున్నాయి.

ఇప్పటి వరకు మనం ఆయుధాల యుధ్ధాన్ని చూశాం. ఇక అక్షరాల యుధ్ధాన్ని కాస్సేపు పరికిద్దాం. రక్తం చిందలేదన్న మాటేగానీ క్రూరత్వంలో ఆయుధాల యుధ్ధానికి ఏమాత్రం తీసిపోదు అక్షరాల యుధ్ధం. ముస్లింలను అనుక్షణం ఏదో ఒక వివాదంలోనికి లాగి వాళ్లని నిరంతరం ఊపిరి ఆడని స్థితిలో వుంచడం ఈ యుధ్ధతంత్ర లక్ష్యం.

దేశంలో కొనశాగుతున్న కాషాయీకరణను ఈమధ్య ఒకాయన లోక్ సభలో గట్టిగా సమర్ధించారు. జాతీయ జెండాలోనే కాషాయం రంగు వుందని సమయానుకూలంగా గుర్తు చేశారు. ఆయన కన్వీనియంట్ గా గుర్తు చేయని అంశాలు మరో రెండున్నాయి. మన జాతీయ జెండాలో మూడు మతాలకు ప్రతీకగా మూడు రంగులున్నాయి. అంతేకాదు, ఆ మూడు రంగులకూ జెండాలో సమాన స్థానముంది. జాతీయ జెండాలో కాషాయ రంగు వుండడాన్ని ఎవరూ వ్యతిరేకించడంలేదు. ఆమాటకొస్తే కాషాయరంగు మీద భారతీయ ముస్లీంలకూ అభ్యంతరం లేదు. అభ్యంతరం ఒక్కటే, కాషాయ రంగు మిగిలిన రెండు రంగుల్ని మింగేయడానికి చేస్తున్న ప్రయత్నాలే. మూడు రంగులు ఉమ్మడి కుటుంబంగా కొనసాగడం కుదరదని సంఘ్ పరివారం భావిస్తూ వుండవచ్చు. అదే చర్య అయితే దానికి ప్రతిచర్య ఏమైవుంటుందీ? ఈ చర్య ప్రతి చర్యలే దేశాన్ని మునుపు ఒకసారి చీల్చాయి. కాషాయం రంగు వేరు. కాషాయీకరణ వేరు. 

ఇలోపున మరో సంఘ్ పరివారకుడు రష్యా దేశస్తుల్ని రష్యన్లు, చైనా దేశస్తుల్ని చైనీయులు, పర్షియన్ దేశస్తుల్ని పర్షియన్లు అన్నట్టు హిందూదేశస్తుల్ని హిందువులని పేర్కొనాలని ప్రతిపాదించారు. నిజానికి ఈ ప్రతిపాదనలో కొత్తదనంగానీ, వివాదంగానీ ఏమీలేవు. భారత ముస్లింలు భారతదేశంలో ముస్లింలేగానీ బయటి దేశాలకు ఇండియన్లు, భారతీయులు. ఈ రెండు పదాలకు రాజ్యాంగ ప్రతిపత్తి వుంది. అయితే, హిందూ పదానికి  రాజ్యాంగ ప్రతిపత్తిలేదు. అయినప్పటికీ  హిందూ పదం మీద కూడా భారత ముస్లింలకు అభ్యంతరం ఏమీలేదు. “మేము హిందువులం. మనది హిందూ దేశం” అనడానికి ఇండియన్ ముస్లింలకు అభ్యంతరం ఏమీలేదు. “సారే జహా సే అచ్చా హిందూసితా హమారా” అన్న మహాకవి ఇక్బాల్ ముస్లిమేనని సంఘ్ పరివారకులు మరచిపోయినట్టున్నారు. కొందరికి ఆశ్చర్యకరంగా వుండొచ్చేమోగానీ ముస్లిం ఛాందసవాద సంస్థగా నిందలు మోస్తున్న జమాతే ఇస్లాం సంస్థ పూర్తిపేరు జమాత్ ఏ ఇస్లామీ ఏ హింద్.

నిజానికి వివాదం హిందూ పదంలో లేదు; హిందూ పదానికి ఇస్తున్న భాష్యంలో వుంది. రష్యా అనేది దేశం పేరు, రష్యన్ అనేది జాతిపేరు. పాకిస్తాన్ అనేది దేశం పేరు, పాకిస్తానీ అనేది జాతిపేరు. ఆఫ్ఘనిస్తాన్ అనేది దేశం పేరు, ఆఫ్ఘనీ అనేది జాతిపేరు. హిందూ అనేది కూడా జాతి పేరే అయితే అసలు వివాదం ఏముందనీ? వివాదం ఎప్పుడు మొదలవుతుందంటే హిందూ పదానికి మతపరమైన భాష్యం చెప్పినపుడే. హిందూ జాతిగా ప్రతిపాదించి దాన్ని హిందూ మతంగా మార్చడం ఇందులో మొదటి దశ. హిందూ దేశంలో హిందువులకుతప్ప మరో మతస్తులకు స్థానం లేదని తేల్చడం రెండో దశ. ఇది అతివ్యాప్తి దోషం. ఈ అతివ్యాప్తి దోషం దేశం పేరుకో, జాతి పేరుకో, జాతీయ జెండా రంగుకో, రాజకీయాలకో పరిమితమైలేదు. పాఠ్యపుస్తకాలకు, విజ్ఞానశాస్త్రాలకూ, కళాసాహిత్య రంగాలకూ విస్తరించింది.  దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఈనాడు కుల మత వర్గ పీడనకు గురవుతున్న వాళ్ళందరిపైనావుంది. దళిత బహుజన మేధావులపైనా వుంది. సంఘ్ పరివారం ప్రస్తుతం ముస్లింలపై గురి నిలపడంతో దేశంలో మిగిలిన అణగారినవర్గాలు సేదదీరుతున్నట్టున్నాయి. తుర్కల వ్యవహారాన్ని తుర్కలకు వదిలి పెట్టేసినట్టున్నారు!!.

సమస్త రంగాలలో ముస్లింలపై దాడికి సంఘ్ పరివారం సన్నధ్ధం కావడం ఒక విషాదమైతే సహజ మిత్రులు అనుకున్న సోషలిస్టులు, అంబెడ్కరిస్టులు సహితం ముస్లీంలను ఒంటరిగా వదిలివేయడం అంతకన్నా విషాదం. సోషలిస్టు జంట జార్జి ఫెర్నాండేజ్, జయా జైట్లీలు ఇప్పుడు తమ శక్తియుక్తుల్ని నరేంద్ర మోడీని సమర్ధించడానికి ఉపయోగిస్తున్నారు. మరోవైపు భారత సమాజానికి మత స్వభావమే లేదంటున్నారు ఆంధ్రా అంబేడ్కరిస్టు ఊ. సాంబశివరావు. గుజరాత్ మారణహోమం పాత్రధారుల్ని వెనకేసుకువచ్చే పనిలో కంచ ఐలయ్య వున్నారు. ఇవన్నీ చూస్తుంటే సోషలిస్టు సిధ్ధాంతాన్నీ, అంబేడ్కర్ రచనల్నీ మత కోణంలో సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందనిపిస్తోంది.  

భారత సమాజంలో హిందూ అతివ్యాప్తి దోషానికి రాజ్యాంగ రచనా సమయంలోనే బీజాలుపడ్డాయి. ఈలోపం కుప్పుస్వామిదో, అంబేడ్కర్ దో, మరొకరిదో తేల్చాల్సిన అవసరం ఇప్పుడు ముందుకు వచ్చింది. ఎస్సీలు, ఎస్టీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రక్షణ కల్పించిన రాజ్యాంగం ముస్లింల వ్యవహారాన్ని దాదాపు గాలికే వదిలేసింది. వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇవ్వకుంటే దేశం నుండే విడిపోతామని ఇ.వి. రామసామి నాయకర్ హెచ్చరిస్తే ఆ వ్యవహారాన్ని రాష్ట్రాల జాబితాలో చేర్చారు  జవహర్ లాల్ నెహ్రు. యాభై యేళ్ల చరిత్ర గమనాన్ని ఒకసారి పరికిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజాల్లో ఉర్ధ్వముఖ చలనం సాగిందనీ, ముస్లిం సమాజంలో అధోముఖ చలనం సాగిందనీ ఎవరికైనా తెలిస్తోంది. దళిత బహుజనుల్లోని విద్యాధిక ధనికవర్గం భద్రజనులుగా మారి క్రమమ్గా హుందూ సాన్నిహిత్యాన్ని పెంచుకుంటుంటే భద్రత కరువైన ముస్లిం సమాజం ’ఆరవవర్ణం”గా మారిపోతున్నది.

ఒక విశాలసమూహాన్ని సరికొత్త బానిసవర్గంగా మార్చడం అనేది ఒక్క రోజులో పూర్తయ్యే వ్యవహారంకాదు. వాళ్లకు చదువులేకుండా చేయాలి. మీడియాలో వాళ్ళ మాటకు విలువలేకుండా చేయాలి. రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేకుండా చేయాలి. శాసన నిర్మాణంలో, వాళ్లకు చోటు లేకుండా చేయాలి. వాళ్లకు స్వంత ఆస్తి లేకుండా చేయాలి. వాళ్లకు ఆయుధాలు దక్కకుండా చేయాలి. వాళ్ల సంస్కృతి నీచమైనదని ప్రచారం చేయాలి. వాళ్ల నెత్తురు అపవిత్రమైనదని బుకాయించాలి. వాళ్ల సామాజిక విలువల్ని ధ్వంసం చేయాలి. వాళ్ల వైభవాన్ని చాటిచెప్పే ప్రతీదాన్నీ తుడిచిపెట్టేయాలి. చరిత్ర గ్రంధాల్లో వాళ్లను పరమ అనాగరీకులుగా చిత్రించాలి. సహజవనరుల్లో, సామాజిక వ్యవస్థల్లో వాళ్ళకు వాటా లేకుండా చేయాలి. వాళ్ళ స్త్రీలకు మానం లేకుండా చేయాలి. వాళ్ల పిల్లలకు కలలు లేకుండా చేయాలి. దేశ నిర్మాణంలో వాళ్ళు నిర్వర్తించిన కర్తవ్యాలను నిరాకరించాలి. అన్నింటికీ మించి వాళ్లకు దేశం లేకుండా చేయాలి. ఇవన్నీ ఇప్పుడు మూకుమ్మడిగా గుజరాత్ లో నిరాఘాటంగా సాగుతున్నాయి. నోరెత్తే వాళ్ళేరీ?  ఒక సంఘ్ పరివారకుడు అన్నట్టు ఇప్పుడు నిజంగానే “ముస్లీంల మనుగడ హిందువుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడివుంది”!!.

ఇతర రంగాలతో పోలిస్తే కళాసాహిత్యరంగాలకు మానవీయ స్పందన ఎక్కువ. ఇన్నాళ్ళూ అనేకానేక ప్రగతిశీల స్రవంతుల్లో ఏపుగా పెరిగిన తెలుగు సాహిత్యం సహితం ముస్లిం వ్యవహారం వచ్చేసరికి ఎందుకో మూగబోయింది. సాహిత్యంలో మత వివక్ష రెండు రకాలుగా కొనసాగుతుంది. ఒకవైపు అది ముస్లింలను సాహిత్యరంగం నుండి వెలివేస్తుంది.  ఎక్కడా వాళ్ల గురించిన ప్రస్తావన కూడా చేయదు. ఈరోజు మనదేశంలో ఏకైక తిపెద్ద సామాజికవర్గం (సింగిల్ లార్జెస్ట్ సోషల్ గ్రూప్) ముస్లింలు. దేశ జనాభాలో 15 శతం వున్న ముస్లీంలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఎలాగూలేదు. సాహిత్యరంగంలోనూ ప్రాతినిధ్యం లేకుండా చేయడం హీనమైన పాపం. మరోవైపు ముస్లీంలను ప్రస్తావించినపుడు సాహిత్యం వాళ్ళను నెహటివ్ ధోరణిలో చిత్రిస్తుంది. అమాయకపు దేశభక్తులుగానో, మొరటు లారీ డ్రైవర్లు, వీధి గూండాలుగా తప్ప సభ్యసమాజపు వ్యక్తులుగా సాహిత్యంలో మనకు ముస్లింలు కనిపించరు. అననుకూల పరిస్థితుల్లోనూ, తీవ్రమైన అణిచివేతలోనూ ముస్లీంలు సాధించిన విజయాలు అనేకం వున్నాయి. అమెరికాలో వర్ణమైనారిటీలయిన వల్లవాళ్ళే (ఆఫ్రో-అమెరికన్స్) ఈ విషయంలో భారత ముస్లీంలకు సాటి. తెలుగు సాహిత్యం వాటిని రికార్డు చేసిన దాఖలాలు చాలాచాలా తక్కువ.

ఈ క్షణాన ఎటునుండి కూడా స్నేహ హస్తం అందనంతమాత్రాన హిందువులందరినీ ఒకేగాటనకట్టి శత్రువులుగా భావించడం మరో చారిత్రక నేరం అవుతుంది. అభ్యతరం వుండాల్సింది హిందూమతోన్మాదం మీదనేగానీ, హిందూమతస్తుల మీద కానేకాదు. పరలోక భావనల్ని రెచ్చగొట్టి ఇహలోక రాజకీయార్ధిక ప్రయోజనాలను సాధించుకోవడమే మతతత్త్వం. ఏ మతమైనా దీనికి వ్యతిరేకమే. హిందువులలో అయినా, ముస్లింలలో అయినా చాలాచాలా తక్కువ మంది మాత్రమే మతోన్మాదులు. ఇరు సమాజాల్లోనూ అత్యధికులు మతసామరస్యవాదులు. హిందువులలో సాధారణ భక్తులతోపాటూ ఉదారులు, ప్రగతిశీలురు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, హేతువాదులు, సామ్యవాదులు, కమ్యూనిస్టులు, కులనిర్మూలనవాదులు, మత సామరస్యవాదులు, మానవాతావాదులు అనేకులున్నారనే వాస్తవాన్ని ఈ బాధాకర సమయంలో సహితం మరచిపోవడం సమంజసం కాదు. మధ్యయుగాలలో హిందూ ముస్లింలు రాజులు ఎలా ఘర్షణ పడ్డారనేది కాదు మనకు కావలసింది. రానున్న కాలంలో హిందూ ముస్లిం ప్రజాసమూహాలు ఎలా కలిసి జీవించాలనేదే మన ముందున్న ప్రశ్న. ఎందుకంటే, ఉపస్రవంతి గుండెల మీద చిచ్చు పెట్టిన ప్రధాన స్రవంతికి కూడా ప్రశాంతత కరువైపోతుంది. అంతర్గత శాంతిని సాధించని ఏ దేశం కూడా అభివృధ్ధి చెందదు. భిన్న సంస్కృతుల మధ్య ఏకత్వం నేటి అవసరం. మతసామరస్యం అనేది మనదేశంలోని ఇతర సామాజిక సమూహాలకు ఒక ఆదర్శం అయితే కావచ్చుకానీ ముస్లింలకు అది ప్రాణవాయువు.

కారుచీకటిలో కాంతి కిరణాలను వెదకడం నేర్చుకోవాలి. గుజరాత్ లో కొనసాగుతున్న ముస్లింయాగాన్ని చూసి కలత చెందిన ఆ రాష్ట్ర ఐఏఎస్ అధికారులు ఇద్దరు ఏకంగా తమ పదవులకే రాజీనామాలు చేశారు. వాళ్ళు ముస్లీంలు కాదు; హిందువులు. అలాంటివాళ్ళు సమీప భవిష్యత్తులో వందల్లో వేలల్లో కాదు లక్షల్లో కోట్లల్లో వెలుగులోనికి వస్తారు. ఇప్పటికి అదే ఆశ.

అల్లహుమ్మ సల్లి/ అలా ముహమ్మదీన్‌/ వాఅలాఆలి ముహమ్మదీన్‌/  కమా సల్లైత /
అలా ఇబ్రాహీమా/ వాఅలాఆలి ఇబ్రాహీమా/ ఇన్నక  హమీదు మ్మజీద్/

అల్లహుమ్మ బారిక్ / అలా ముహమ్మదీన్‌/ వాఅలాఆలి  ముహమ్మదీన్‌/ కమా బారక్త/ అలా ఇబ్రాహీమా/ వాఅలాఆలి  ఇబ్రాహీమా/ ఇన్నక హమీదు మ్మజీద్/

”పరమపవిత్రుడు, సకలస్తోత్రాలకూ అర్హుడైనఅల్లా!  అబ్రహామ్  ప్రవక్తకూ,  ఆయన  అనుయాయులకూ  ప్రసాదించిన శాంతిని ముహమ్మద్  ప్రవక్తకూ ఆయన   అనుయాయులకూ  ప్రసాదించు.

పరమపవిత్రుడు, సకలస్తోత్రాలకూ అర్హుడైనఅల్లా!  అబ్రహామ్  ప్రవక్తకూ, ఆయన  అనుయాయులకూ  ప్రసాదించిన శుభాలను ముహమ్మద్ ప్రవక్తకూఆయన    అనుయాయులకూ  ప్రసాదించు.


సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్, విజయవాడ
9 ఏప్రిల్ 2002

ప్రచురణ : ప్రజాతంత్ర ప్రత్యేక సంచిక, మే 2002

2 comments:

  1. 9/11 America meedha attack ni prathi charya gaa bhaviddaam
    Mari Afghanistan lo Talibans buddhudi vigrahanni kulchadam deni meedha prathi charya

    ReplyDelete
  2. Ledha Kabah lo Prophet Mohammed vandhala koladi vigrahalani kulcyadam adarsam gaa talibans teesukunnara

    ReplyDelete