Sunday, 15 May 2016

‘కట్టుకథ’ ఇంకా కాటేస్తూనే ఉంది

కట్టుకథ’ ఇంకా కాటేస్తూనే ఉంది

ఉషా యస్ డానీ


పుట్టుమచ్చ’కు పాతికేళ్లు

బ్రిటీష్ ఇండియా చివరితరం ముస్లింలు దేశ విభజన శిలువను మోయాల్సి వచ్చింది. నిజానికి పాకిస్థాన్  వెళ్ళిపోయినవారి కన్నా వెళ్ళని ముస్లింలే అనేక రెట్లు ఎక్కువ. రిపబ్లిక్‌ ఇండియాలో వుండిపోయిన ముస్లింలు పాకిస్థాన్ వెళ్ళడానికి నిరాకరించినవాళ్ళు అనే వాస్తవాన్ని గానీ, భారతదేశాన్నే స్వదేశంగా భావించినవాళ్ళు అనే భావోద్వేగాల్ని గానీ గుర్తించేవాళ్ళు క్రమంగా కరువయ్యారు. స్వతంత్రానంతర భారతదేశంలో పుట్టిన ముస్లింల మీద కూడా వివక్ష కొనసాగింది. కవి అబ్దుల్‌ ఖాదర్‌ మొహియుద్దీన్‌ స్వతంత్ర భారత దేశంలో పుట్టాడు. తన తరం ముస్లిం సమాజపు భుజాల మీదకు కట్టుకథలతో  దేశవిభజన శిలువను ఎక్కించడానికి హిందూత్వ శక్తులు చేస్తున్న ప్రయత్నాలను సహించలేకపోయాడు.

బీజేపీ అప్పటి అధ్యక్షులు ఎల్‌.కె.ఆడ్వాణీ 1990 సెప్టెంబరులో రామ్‌ రథయాత్ర మొదలెట్టారు. టొయోటా వ్యానులో ముస్లిం సమాజం మీద మొదలెట్టిన ఆధునిక అశ్వమేధయాగం దేశసామాజిక వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చివేసింది. భారత ముస్లిం సమాజం ప్రాణభయంతో వణికిపోయింది. యాగాశ్వాన్ని నిలవరించడం చాలా పెద్దమాట. కనీసం భాధను వెళ్ళగక్కుకునే అవకాశం కూడా దానికి లేకుండా పోయింది. అణగారిన జీవులకు మతం ఒక నిట్టూర్పు వంటిది అని కార్ల్‌ మార్క్స్‌ అన్నాడు. అణగారిన భారత ముస్లిం సమాజానికి ఒక చారిత్రక దశలో ఒక నిట్టూర్పు అవకాశం ఇవ్వడానికి ఖాదర్‌ నడుం బిగించాడు. అదే ‘పుట్టుమచ్చ’ దీర్ఘకవిత. బాధాతప్త  భారత ముస్లింసమాజపు నిట్టూర్పు  'పుట్టుమచ్చ'.  

పుట్టుమచ్చ’ ఒక చారిత్రక సందర్భంలో ఆవిర్భవించడమేకాక తెలుగు కవిత్వరంగంలో తానే ఒక కొత్త చరిత్రను సృష్టించింది. ఖాదర్‌ ఇచ్చిన ధైర్యంతో వందల మంది తెలుగు ముస్లిం కవులు తమ కలాలకు పదునుపెట్టారు. ఇలాంటి ఒక మహాస్రవంతికి పునాది వేసిన కవిని యుగకవి, మహాకవి అనవచ్చో లేదో నాకు తెలీదు గానీ, తెలుగు ముస్లిం సమాజానికి పుట్టుమచ్చ మహాకావ్యం; ఖాదర్‌ ఆదికవి అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ వుండాల్సిన పనిలేదు.

పుట్టుమచ్చ’ కవిత కవి వ్యక్తిగత గోడుతో మొదలై క్రమంగా సామాజికస్థాయికి ఎదుగుతుంది. సబ్జెక్ట్‌ నుండి ఆబ్జెక్ట్‌కు, వ్యక్తి నుండి వ్యవస్థకు, సమకాలీనత నుండి సర్వకాలీనతకు ఎదగడం గొప్ప రచనల లక్షణం. లక్షణాలన్నీ పుష్టిగా వున్నాయి గాబట్టే ‘పుట్టుమచ్చ’ రజతోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇప్పుడు దాని అవసరం ప్రాసంగికత మరింతగా పెరిగింది.

ఆలోచనాపరుల మీద మనకు కలిగే గౌరవం వాళ్ళ స్వీయ సామాజికవర్గాలకు కూడా విస్తరిస్తుంది. కొన్ని కులాల మీద మనకు గౌరవం కలుగుతున్నదంటే కులాల్లో పుట్టిన కవులు, కళాకారులు, ఆలోచనాపరులు మనల్ని ప్రభావితం చేస్తున్నారని అర్థం. జాషువా, గురజాడ, త్రిపురనేని రామస్వామి చౌదరి, కట్టమంచి రామలింగారెడ్డి, తాపీ ధర్మారావు, మఖ్దుం మొహియుద్దీన్‌ల మీద మనకు గౌరవం కలిగినపుడు వాళ్ళ వాళ్ళ సామాజికవర్గాల మీద కూడా గౌరవం కలుగుతుంది. ఆలోచనాపరుల్ని సృష్టించుకోలేని, ఆదరించుకోలేని సామాజికవర్గాలు ఇతర సామాజికవర్గాల నుండి నైతిక మద్దతును కోల్పోయి పతనదిశగా ప్రయాణిస్తాయి. ఆలోచనాపరులు తాము పుట్టిన సామాజికవర్గాలకు ఒక ఆమోదాంశాన్ని (లెజిటిమసీ) కల్పిస్తారు.

ఆలోచనాపరులు సృష్టించే ఆమోదాంశం తాలూకు ప్రభావం స్థాయిలో వుంటుందో అంతర్జాతీయంగా రెండు ఉదాహరణలు ఇస్తాను. ట్విన్‌ టవర్స్‌ మీద అల్‌ఖైదా దాడి చేసిన తరువాత అమెరికా పాలకులు పెద్దఎత్తున ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టారు. సద్దాం హుస్సేన్‌, ఒసామా బిన్‌లాడెన్‌లను అమెరికాకు ప్రధాన శత్రువులుగా ప్రచారంచేశారు. అయితే, అమెరికా ప్రజలు (కనీసం మెజారిటీ ప్రజలు)  భిన్నంగా ఆలోచించారు. సగం సద్దామ్‌ హుస్సేన్‌, సగం ఒసామా బిన్‌లాడెన్‌ల పేర్లతో పోలిన పేరుతో ముస్లిం సమాజంలో పుట్టిన బారక్‌ హుస్సైన్‌ ఒబామాకు అమెరికా రాజ్యాంగం అనుమతించినన్నిసార్లు దేశాధినేతగా పట్టంకట్టారు. ఇదొక చారిత్రక అద్భుతం. ఇలాంటి అద్భుతాలెన్నో ఆలోచనాపరులు సాధించగలరు.

ఇప్పుడు యూకే వ్యవహారం చూద్దాం. అబద్ధాలు ప్రచారం చేసి అమెరికాను ఇరాక్‌ మీదకు యుద్ధానికి పురికొల్పినవాడు టోనీ బ్లెయిర్‌. రాడికల్‌ కమ్యూనిజం, రాడికల్‌ ఇస్లాం ప్రపంచ శత్రువులు అని ప్రచారం చేసిన ఘనుడు అతను. లండన్‌ మహానగరంలో రెండు నెలల క్రితం ఒక సంఘటన జరిగింది. సిటీ బస్సులో బుర్ఖాతో ప్రయాణిస్తున్న ఒకామె మీద నలుగురు మహిళలు దాడిచేసి, కొట్టి బస్సు నుండి గెంటేశారు. లండన్‌లో స్థాయిలో ముస్లిం వ్యతిరేకత కొనసాగింది. మరి లండన్‌ ప్రజలు ఏం చేశారూ? టోనీ బ్లెయిర్‌ పార్టీలోనే అతని వ్యతిరేకవర్గానికి చెందిన ఒక ముస్లిం సాదిఖ్‌ ఖాన్‌కు ఏకంగా పదకొండు లక్షల ఓట్ల ఆధిక్యతనిచ్చి మేయర్‌ సింహాసనం మీద కూర్చోబెట్టారు. లండన్‌ చరిత్రలో ఇంతటి  మెజారిటీ సాధించిన మేయర్‌ మరొకరు లేరు. అద్భుతాన్ని బ్రిటీష్‌ ముస్లిం ఆలోచనాపరులు, వాళ్లకు సంఘీభావాన్ని ప్రకటించిన ముస్లిమేతర ఆలోచనాపరులు కలిసి సాధించారు.

పుట్టుమచ్చ’ ప్రచురణలోనే మతసామరస్యం వుంది. దాన్ని రాసింది ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఖాదర్‌, ప్రచురించినవాళ్ళు హిందూ సామాజికవర్గానికి చెందిన త్రిపురనేని శ్రీనివాస్‌, రావి రాంప్రసాద్‌. ముస్లిం అస్తిత్వ వాదాన్ని చర్చకు పెట్టిన ‘పుట్టుమచ్చ’ కవితను అంకితం చేసింది రావి శేషయ్యగారికి. ఇదీ మనం కోరుకునే భారత సమాజం. మత సామరస్యం మన ప్రాణవాయువు. మీకోసం మేము. మా కోసం మీరు. దేశప్రజల కోసం మనందరం.

పాతికేళ్ళు ప్రయాణించి వర్తమానానికి వద్దాం. ఇటీవల మన సమాజంలో మత అసహన వాతావరణం పెరిగినపుడు స్పందించినవాళ్ళు ముస్లింలు మాత్రమేకాదు, ముస్లిమేతరులు కూడా. ప్రభుత్వ విధానాలకు నిరసనగా అవార్డులు, బిరుదుల్ని తిరిగి ఇచ్చేసినవాళ్లలో అత్యధికులు ముస్లిమేతరులు. వాళ్ళకు ముస్లిం సమాజం రుణపడే వుంటుంది. భారత ముస్లిం సమాజానికి అలాంటి ఆమోదాంశాన్ని సాధించి పెట్టిన ముస్లిం ఆలోచనాపరుల్లో ఖాదర్‌ ఒకడు.


 (పుట్టుమచ్చ  ఖాదర్ కు  ప్రజ్వలిత సంస్థ  సాహితీ సేవామూర్తి  పురస్కారం - 2015 ను తెనాలిలో మే 8 అందచేసి సన్మానించింది. సందర్భంగా  చేసిన  ప్రసంగపాఠం ఇది. )

హైదరాబాద్
9 మే 2016

ప్రచురణ :
వివిధ సాహిత్య పేజి, ఆంధ్రజ్యోతి దినపత్రిక, 16  మే 2016

http://www.andhrajyothy.com/Artical?SID=241526
https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-241526

1 comment: