Communalism in Literature
సాహిత్యంలో మతతత్త్వం
ఉషా యస్
డానీ
జాతీయవాదం
మతవాదం రెండూ ఆధునిక భావనలు. 18 వ శతాబ్దం తరువాత మనదేశం ఆర్ధికంగా, రాజకీయంగా
పరిపాలనా పరంగా ఐక్యమవుతున్న క్రమంలోనే జాతీయవాదం మతవాదం పుట్టుకువచ్చాయి.
ప్రజల్ని
సులభంగా ఉత్తేజపరచడంకోసం, రాజకీయ ఉద్యమాలలో సమీకరించడం కోసం జాతీయవాదులు గతం మీద
ఆధారపడవచ్చు. గత భావజాలంతో, గత ఉద్యమాలతో, గత చరిత్రతో సంబంధాలు పెట్టుకోవాలని
ప్రయత్నించవచ్చు. అంతమాత్రాన జాతీయవాదాన్నీ, మతవాదాన్నీ గత కాలానికి చెందినవని
చెప్పడం సరికాదు. అవి అచ్చంగా ఆధునిక భావనలు. మన దేశంలో ఆధునిక భావాలకూ
వలసవాదానికీ విడదీయ్యలేని సంబంధం వుంది. ముందు వలస పాలన వచ్చి తరువాత ఆధునిక భావనలు వచ్చాయి. అంచేత మన ఆధునిక
భావనలకు పుట్టుకతోనే అబ్బిన గుణం వలసతత్త్వం.
భారత ఉపఖండంలో బ్రిటీష్ వాళ్ళు అధికారానికి వచ్చాక సామాజిక అంశాలన్నీ వలస
అనుకూలతను సంతరించుకున్నాయి. వాటిని వాళ్ళు అట్లా మార్చేశారు. దేశీయ అదనపు
ఉత్పత్తిని నాశనం చేసి, వలసలకు అనుగుణంగా అదనపు ఉత్పత్తిని ప్రవేశపెట్టారు. నవ్వడం ఏడ్వడం నేర్పడమేగాక ఎప్పుడు నవ్వాలో
ఎప్పుడు ఏడ్వాలో మనకు వలసవాదులే నేర్పారంటే అతిశయోక్తికాదు. వలసవాదులు తమ
పరిపాలనను సుస్థిరంగా వుంచగలిగే పధ్ధతులన్నింటినీ మనకు ఉగ్గుపాలతోనే కలిపి
పట్టించారు. వాళ్ళు అంతటితో ఊరుకోలేదు. ముందుముందు పుట్టుకువచ్చేవాళ్ళ ప్రమాదాన్ని
కూడా ముందే ఊహించి ఈ దేశపు మేధో
గర్భసంచులకు కూడా విషాన్ని పట్టించేశారు. వలసవాదులకు దురాలోచనలేకాదు దూరాలోచనలూ ఎక్కువే. వలసవాదులు ఇన్ని జాగ్రత్తలు
తీసుకోవడంలో నిజానికి విశేషం ఏమీలేదు. విశేషమల్లా మన్ం ఇవ్వాల్టికీ బుధ్దిగా
వాళ్ళు నేర్పినట్టు నడుచుకోవడమే.
పారిశ్రామిక
విప్లవం యూరప్ ను అనేక చారిత్రక మార్పులకు
లోనుచేసింది. మనిషి తాను సృష్టించిన ఉత్పత్తి నుండి తానే పరాయివాడయిపోయాడు. ఈ
పరిణామాలు యూరప్ ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. వాళ్ళు పారిశ్రామిక
విప్ల్వన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఊహాజనిత
సమాజాన్ని అన్వేషించారు. వారిలో చాలామందికి తూర్పుదేశాల ప్రాచీన సంస్కృతిలో వాళ్ళు
ఆశిస్తున్న ’స్వర్గం’ కనిపించింది. దానితో, వైదీక భావజాలాన్ని ఆకాశానికి
ఎత్తేశారు. ప్రాచీన భారతీయులు ఆదర్శ జనపద సమాజంలో జీవించినట్టు ఆనాటి యూరప్ ప్రజలు
భ్రమించారు. ప్రాచీన భారత్ సంస్కృతినీ, యూరప్ సంస్కృతినీ ఏకం చేయాలనే ప్రయత్నాలు
మొదలయ్యాయి. ఆ రెండు సంస్కృతుల ఆద్యులు ఒకటేననే ఊహాగానాలు కొనసాగి,
భవిష్యత్తులో భారత ఉపఖండం విభజనకూ,
జర్మనీలో నాజిజం ఆవిర్భావానికీ దారితీస్తాయని వాళ్ళు కలలోనైనా ఊహించి ఉండక
పోవచ్చు. వాళ్ల ఊహాగానాల్ని నిజం చేసే దిశలో సాగే కృషిని క్రమబధ్ధం చెయ్యడానికి ’రాయల్
ఏషియాటిక్ సొసైటి’ ఏర్పడింది. మాక్స్ ముల్లర్ తన పేరును మోక్షములుడుగా మార్చుకునేంత వరకు వెళ్ళాడు. యూరప్ ప్రజల
కల్పనలు, ఊహలు రెండు కారణాలవల్ల భారతీయ హిందువులకు తెగ నచ్చాయి. మొదటిది, వేదాలు,
వాటికి సంబంధించినవి ఏవైనా గొప్పవని సాంప్రదాయిక హిందువులు నమ్ముతారు. రెండోది,
వలస పాలనలో నలిగిపోతున్నవాళ్ళకు కనీసం తమ
గతమెంతో గొప్పదనుకుని తృప్తిపడే ఒక అవకాశం
దక్కింది. ఈ పరిస్థితిని బ్రిటీష్ ఉపయోగితావాద తత్వవేత్తలు తమకు అనుకూలంగా
ఉపయోగించుకున్నారు. వాళ్ళలో చెప్పుకోదగిన వ్యక్తి జేమ్స్ మిల్.
జేమ్స్ మిల్
రాసిన ’బ్రిటీష్ ఇండియా చరిత్ర’ (1817) పుస్తకం గురికి అనుకున్నదానికన్నా
బలంగానే తాకింది. ఆ పుస్తకం మన చరిత్రను హిందూ నాగరీకత, ముస్లిం నాగరీకత ,
బ్రిటీష్ నాగరీకత అని మూడు దశలుగా యుగ విభజన చేసింది. జేమ్స్ మిల్ చేసిన యుగవిభజన
అశాస్త్రీయమైనది. ఆవాస్తవమైనది. దాన్నలా వుంచి హిందూ ముస్లిం నాగరీకతల మధ్య
హెచ్చుతగ్గులున్నాయని చెప్పడంవల్ల జేమ్స్ మిల్ ద్విజాతి సిధ్ధాంతానికి ’చారిత్రక
సమర్ధ” ఇచ్చాడు. దీన్ని ప్రచారం చేయడంలో వలసవాదులకు రెండు రకాల ప్రయోజనాలున్నాయి.
మొదటిది, ద్విజాతి సిధ్ధాంతం ద్వార పాలితుల్ని విభజించి పాలించవచ్చు. రెండోది,
భారతీయులకు ఆధ్యాత్మిక చింతనే ప్రధానమనీ, వాళ్లకు భౌతిక వ్యవహారాల్ని
నిర్వహించుకోగల సామర్ధ్యంలేదనీ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం వంటి ఆధునిక రాజకీయ
ప్రమాణాలకు వాళ్ళు తగరనీ ప్రచారం చెయ్యడం ద్వార తమ వలసపాలనకు సమర్ధననీ,
ఆమోదాంశాన్నీ సాధించుకోవచ్చు. మన వేలితో మన కంటిని పొడిపించే ప్రయత్నంలో వలసవాదులు
మన చరిత్రనే మనపై ప్రయోగించారు. గమనించాల్సిన అంశం ఏమంటే మొదటి రెండు అధ్యాయాలకు
హిందూనాగరీకత, ముస్లింనాగరీకత అని పేర్కొని మూడవ అధ్యాయాన్ని క్రైస్తవ నాగరీకత అని
పేర్కొనక బ్రిటీష్ నాగరీకత అని
పేర్కొనడంలోనే జేమ్స్ మిల్ లౌక్యం, లౌకికం
వున్నాయి.
జేమ్స్ మిల్ యుగవిభజనను తీవ్రంగా
ఎదుర్కోవాల్సిన భారతీయ చరిత్రకారులు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇబ్బందిలో పడిపోయి
యుధ్ధరంగం నుండి రథాల్ని వెనక్కి మళ్ళించేశారు; ముందు తమ (హిందూ-ముస్లిం) సంగతి
తేల్చుకోవాలని. సరిగ్గా వలసవాదులు ఆశించిందీ ఇదే.
ఐరోపా చరిత్రను చదువుకున్న భారతీయులు అక్కడి కాథలిక్-ప్రొటెస్టెంట్ల
ఫొరాటాల్ని చూసి దేశీయంగా హిందూ-ముస్లిం పోరాటాల్ని ఊహించుకున్నారు. ఐరోపా
జాతియోద్యమాల నుండి స్వర్ణయుగం భావన దిగుమతి అయ్యింది. దానికి నకలుగా తమతమ
స్వర్ణయుగాల అన్వేషణ మొదలయింది.
ఈ నేపథ్యంలోనే భారతదేశ
సాంస్కృతికరంగంలో మతతత్త్వం మొదటి దశ ఆరంభమయింది. హిందూ మతవాదులు గుప్తుల
కాలాన్ని స్వర్ణయుగంగా ఎంచుకున్నారు. ఈ
స్వర్ణయుగం పెత్తందారీకూలాల ఆధిపత్యభావాల మీద ఆధారపడి ఊహించింది. దళితులు,
ఆదివాసీలు తమ చరిత్రను తామే రాయాల్సి వచ్చినపుడు వాళ్ళు ముందుగా దండెత్తేది ఈ
స్వర్ణయుగం భావనల మీదే. హిందువుల స్వర్ణయుగానికి ప్రతిగా, చదువుకున్న ముస్లింలు,
పశ్చిమాసియా దేశాల్లో అరబ్బులు సాధించిన స్వర్ణయుగం కథల్ని ప్రచారం చేశారు.
మతప్రమాణాలతో చూసినా ఆయా కాలాలు, ఆయా మతాలకైనా స్వర్ణయుగాలేనా? అనేది ఇప్పటికీ
ప్రశ్నే. ఈ దశలో మతతత్త్వ చరిత్రకారులు ఒకరికొకరు ఎదురుపడకుండానే తమ యుధ్ధాన్ని
కొనసాగించారు. తమ రచనల్లో ఎదుటిపక్షాన్ని ప్రస్తావించకుండానే తమతమ
మతవైభవాల్ని ప్రచారం చేసుకున్నారు. దానికి
అనుగుణంగానే తమ రచనా వస్తువు కాలాన్ని ఎన్నుకున్నారు. ఇస్లాం ప్రభావం భారతదేశానికి
ఇంకా చేరని కాలాన్ని హిందువులు ఎంచుకుంటే, హిందువులతో సంబంధంలేని అరబ్బుల
స్వర్ణయుగాన్ని ముస్లింలు ఎన్నుకున్నారు. ఈ దశలో మతవాదానికి బీజాలు
మొలకెత్తాయిగానీ అవి అప్పటికి ఇంకా వైషమ్యాల స్థాయికి చేరుకోలేదు.
పంతొమ్మిదో శతాబ్దం మధ్యలో
నీటిపారుదల ప్రాజెక్టులు, కాల్వలు వచ్చాయి. మరో అర్ధశతాబ్దం తరువాత అవి తమ వలసవాద
బాధ్యతల్ని నెరవేర్చడం మొదలెట్టాయి. వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు అదనపు
ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి. ఉత్పత్తితోపాటూ పంపకాల్లోనూ మార్పులు వచ్చాయి. అదనపు
ఉత్పత్తి మీద ఆధిపత్యం కోసం జరిగినపోటీలో కులవ్యవస్థ ఆధునిక రూపాన్ని
సంతరించుకుంది. ఈక్రమంలో లాభపడ్ద కులాలు స్థానికంగా బలపడి రాజకీయాధికారం కోసం
పారిశ్రామికవర్గంతో పోటికివచ్చి చేరాయి.
అంతవరకు ఊగిసలాడుతూ అయినా సరే వలసవాదులతో ఎంతోకొంత ఘర్షణపడుతూ వచ్చిన దేశీయ
పారిశ్రామికవర్గం అటు వలసవాదులతో, ఇటు స్థానికంగా కొత్తగా బలపడిన
భూస్వామ్యంతో రాజీపడిపోయింది. మొదటి
ప్రపంచ యుధ్ధానంతర పరిణామాల్నీ, రష్యాలో అక్టోబరు విప్లవ విజయాన్నీ చూసి భయపడడం ఈ
రాజీకి ఒక అంతర్జాతీయ కారణం. అంతకన్నా ముఖ్యంగా, స్వభావరీత్యా భారత కొత్త
భూస్వామ్యవర్గం అయినా, పారిశ్రామికవర్గం అయినా వలసపాలన నీడన పుట్టి పెరగడమే అసలు
కారణం.
వలసపాలకులతో పోరాటాన్ని విరమించిన
జాతీయవాదులు తమ ఉబలాటాన్ని తీర్చుకోవడానికి ఎక్కడో మధ్యయుగాలకు వెళ్ళి అక్కడ
ఊహల్లో ఒక జాతీయపోరాటాన్ని ఆరంభించారు! ఈ నేపథ్యంలో మన సాంస్కృతికరంగంలో మతతత్త్వం
రెండవదశ మొదలయింది. ఆధునిక దేశాలు ఏర్పడడానికి ముందు జాతులు ఏర్పడడంగానీ జాతీయభావాలు వుండడంగానీ చారిత్రికంగా అసాధ్యం.
మధ్యయుగాల్లో ఇరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్యగానీ, ఇరువురు పాలకుల
మధ్యగానీ జరిగిన ఘర్షణల్ని జాతీయ పోరాటాలుగా చిత్రించడం, వాళ్ళను జాతీయవాదులుగా
కీర్తించడం చరిత్రశాస్త్రంలో తీవ్రాపచారం. “ఔరంగజేబు జాతీయవీరుడుకాకపోతే శివాజీ కూడా జాతీయవీరుడుకాదు. వాస్తవానికి
అనుభవశూన్య చరిత్రలో వారిని తప్పుగా ’జాతీయవీరులు’గా చిత్రించి ఈనాటి జాతివ్యతిరేక
విఛ్ఛిన్నతా చర్యలకు దోహదం చేస్తున్నాం” (బిపిన్ చంద్ర). చరిత్ర స్వభావంలో
జయచంద్రుడు, ముస్సోలిన్ లకు సంబంధంలేనట్లే, పృధ్వీరాజ్ చౌహాన్, ఓమర్ ముఖ్తార్ లకూ
సంబంధంలేదని గ్రహించాలి. చరిత్రకారుల అజ్ఞానంవల్ల, జాతీయవాదుల బలహీనతలవల్ల జాతీయవాదంతో ఏమాత్రం సంబంధంలేని మధ్యయుగాల
ప్రముఖులు చరిత్ర పుస్తకాల్లో, సాహిత్యంలో హఠాత్తుగా జాతీయవీరులైపోయారు. రాణాప్రతాప్
సింగ్ నో, శివాజీ భోంస్లేనో, గురుగోవింద సింగ్ నో జాతీయవీరుల్ని చేయడం కోసం
ముస్లీంలను విదేశీయులుగా, విదేశీ పాలకులుగా చిత్రించడం మొదలుపెట్టారు. (పంజాబ్ లో
కహ్లిస్తాన్ ఉద్యమం మొదలయ్యాక గురుగోవింద్ సింగ్ ను జాతీయవీరుల జాబితాలోంచి
తీసేశారేమో తెలుసుకోవాల్సివుంది!)
మొదటి దశ మతతత్త్వ
చరిత్రకారులు, సాహితీవేత్తలు ఎదుటిపక్షాన్ని ప్రస్తావించకుండానే మతతత్త్వాన్ని
ప్రోత్సహిస్తే రెండో దశ మతతత్త్వ
చరిత్రకారులు సాహితీవేత్తలు ఎదుటిపక్షాన్ని ప్రస్తావించి ద్వేషించడం ద్వార
మతతత్త్వాన్ని రెచ్చగొట్టారు. అయితే వాళ్ళందర్నీ ఒకే గాటనకట్టి మతతత్త్వవాదులు
అనడం సరికాదు. తాము మతతత్త్వాన్ని రెచ్చగొడుతున్నామని వాళ్లలో కొందరికి
తెలిసివుండకపోవచ్చు. నిరక్షరాశ్యులు అధికంగావున్న మన దేశంలో వలసవాద వ్యతిరేక
జాతీయవాద చైతన్యాన్ని దైనందిన జీవితానికి అన్వయించి అభివృధ్ధి చేయడం వాళ్ళకు కష్టమనిపించి వుండవచ్చు. సులభమార్గంగా
పాత మతచైతన్యం మీదే ప్రజల్ని జాతియోద్యమంలో కదిలించాలని కొందరు ప్రయత్నించి
వుండవచ్చు. ఓ కోవకు చెందినవాళ్ళే బాలగంగాధర తిలక్, మొదటితరం టెర్రరిస్టులు.
మహాత్మా గాంధీ కూడా ఈ దారినే ప్రయాణం చేశారు.
భారతదేశ చరిత్రకారులు చరిత్ర
పుటల్లోకి ’వీరోచితంగా’ వెనక్కి విసిరే పది రాళ్ళలో ఏదో ఒకరాయి తిరిగివచ్చి తమకే తగలవచ్చని వలస పాలకులు అప్రమత్తంగానే
వున్నారు. ఆధునిక జాతీయ భావాల్ని ప్రేరేపించే ’నీల్ దర్పణ్’ నాటకాన్ని ప్రదర్శించనివ్వలేదు. దాన్ని అచ్చేసి
పుస్తకంగా అమ్మనివ్వలేదు. శివాజీని ముస్లిం వ్యతిరేక వీరునిగా చిత్రించడాన్ని
అనుమతించిన వలస పాలకులు అదే శివాజీని తిలక్ బ్రిటీష్ వ్యతిరేక భావాలను
కలిగించే ఉత్తేజకర చిహ్నంగా ఉపయోగించడానికి ప్రయత్నించినపుడు నిర్భంధాన్ని
ప్రయోగించారు. ఈ దశ చరిత్రకారుల్ని, రచయితల్ని వాళ్లపై ఆనాడున్న నిర్భంధం దృష్ట్యా
సానుభూతితో అర్ధం చేసుకోవచ్చేమోగానీ వాళ్ల రచనా స్వభావాన్ని అలా అర్ధం చేసుకోలేం.
జాతీయవీరుల్ని ఎంచుకునే సమయంలో, బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా తీవ్రపోరాటం
సాగించినవాళ్లని వాళ్ళు ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారు. వాళ్ల
రచనలకు బహదూర్ షా జాఫర్, ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియా తోప్, హజ్రత్
మహల్ వంటి వాళ్లను ఎంచుకోలేదు. భారత ప్రధమ స్వాతంత్ర పోరాటాన్ని సాగించిన నాయకులు
ముస్లింలో, ముస్లిం చక్రవర్తిని తమ నాయకునిగా గుర్తించవాళ్ళో కావడమే దానికి కారణం.
బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడినవాళ్ళను పక్కనపెట్టారంటే ఆ రచయితలకు
జాతీయపోరాటంకన్నా బ్రిటీష్ రాజభక్తే ప్రధానమని అనుకోవాల్సి వుంటుంది. వీర్
సావర్కర్ వంటివాళ్ళు దీనికి మినహాయింపు. ఆ మేరకు వాళ్ళు నిర్బంధాలకు కూడా
గురయ్యారు.
మతపరమైన మానవ సమూహాలు వాటికవే
జాతులుకాలేవు. స్వజాతి చరిత్రకారుల ’దయవల్ల’ భారతదేశంలో పుట్టి పెరిగిన ద్విజాతి
సిధ్ధాంతం దేశవిభజన తరువాత కూడా సమసిపోలేదు.
ఆ తరువాతి కాలంలోనూ ముస్లిం సంస్కృతి ప్రాముఖ్యాన్ని తగ్గించడానికో,
కించపరచడానికో, అది విదేశీయమైనదని చెప్పడానికో ప్రయత్నాలు సాగుతూనే వున్నాయి.
మతతత్త్వ సాంస్కృతికరంగంలో ఇది మూడవ దశ.
స్వాతంత్ర్యానంతర సాహిత్యం, చరిత్ర
రచన మొత్తం మతతత్త్వంతో కుళ్ళిపోయిందని నిందించడం సరికాదు. అలా నిందించదంవల్ల ఆ
రెండు రంగాల్లో ఇటీవలి కాలంలో సాధించిన అభివృధ్ధినేకాక చారిత్రక సహజ పరిష్కార క్రమాన్ని కూడా
నిరాకరించడమే అవుతుంది. మనం చేయాల్సిందల్లా ఇలాంటి పరిష్కార క్రమాన్ని వేగవంతం
చేయడమే. మతతత్త్వం ఈనాడు తన కార్యక్రమాల్ని సాంస్కృతిక రంగంలో ఎలా
కొనసాగిస్తున్నదో తెలుసుకోకుండా, దాన్ని ఎదుర్కోకుండా సహజ పరిష్కార క్రమాన్ని
వేగవంతం చేయడం సాధ్యంకాదు. మతవాద వైఖరి
ప్రతిసారీ పైకి కనిపించేంత స్పష్టంగా వుండకపోవచ్చు. ఎందులోపడితే అందులో
ప్రవేశించి ఎలాకావాలంటే అలా మారే స్వభావం మతతత్త్వానికి
వుంటుంటుంది. అంచేత రచయిత ఏమాత్రం
అజాగ్రత్తగావున్నా తనకు తెలియకుండానే మతతత్త్వానికి లోనయ్యే ప్రమాదం ఎప్పుడూ వుంటుంది. మతతత్త్వ ప్రమాదం ఇవ్వాళ ఎంత
తీవ్రంగా వుందంటే అది అరుదుగానైనాసరే, శ్రామికవర్గ సాహిత్యంలో సహితం చొరబడిన
సందర్భాలున్నాయి.
మూడవ దశకు చెందిన మతతత్త్వ చరిత్రకారులు, సాహిత్యకారులు కేవలం తమ ముందుకాలపు
మతతత్త్వవాదుల్ని హీనంగా అనుకరించేవాళ్ళే. వాళ్ళు మొదటి దశ మతతత్త్వ
చరిత్రకారులకుమల్లే తమ రచనల్లో మైనారిటీలను ప్రస్తావించరు. వాళ్ల అస్థిత్వాన్ని
పూర్తిగా నిరాకరిస్తారు. ఇలాంటి రచనలు
రచయిత ఇష్టాఇష్టాలతో పనిలేకుండానే ‘హిందూరాజ్యస్థాపన’ భావాల్ని
బలపరుస్తాయి. ఒకవేళ వాళ్ళు తమ రచనల్లో మైనారిటీలను ప్రస్తావించారో – రెండవదశ
మతతత్త్వవాదులకుమల్లే – మైనారిటీలను కించపరచడానికి ప్రయత్నిస్తారు. తమ రచనల్లో
మైనారిటీలను ప్రస్తావించడం ద్వారా, ప్రస్తావించకపోవడం ద్వారా కూడా వాళ్ళు మెజారిటీ
మతతత్త్వాన్ని ప్రచారం చేస్తారు.
ఉద్దేశ్యపూర్వకంగా మతతత్త్వాన్ని రెచ్చగొట్టేవాళ్ల విషయాన్ని అలావుంచినా, వాళ్ళ భావాల ‘హేంగోవర్’ ను పసిగట్టి దాన్ని
వదిలించుకోవడానికి నిరంతర కృషిచేయని శ్రామికవర్గ రచయితలు సహితం అలాంటి భ్రమలకు
లోనయ్యే ప్రమాదం లేకపోలేదు.
“దయ్యపు గుండా గోయలు తుర్కలు
కయ్యమునకు మనపైబడి వచ్చిరి
ఇయ్యర మెయ్యర వెయ్యర బడితను
కుయ్యో మొర్రన కొయ్యర చురికతో
చియ్యలు ప్రయ్యలు మేయగ గద్దలు”
అని రాశారు ‘ప్రజాకవి’ సుద్దాల
హనుమంతు. తెలంగాణ పోరాటంలో హిందూ-ముస్లిం పేదరైతాంగం సమైక్యంగా పాల్గొన్నారని
తెలిసినవాళ్ళు సహితం ఈ పాటను విమర్శించినట్టు కనిపించదు. కొందరు ఆనాటి ఉద్వేగ
మనఃస్థితిని కళ్లకుగట్టిన పాటగా దీన్ని భావిస్తే, మరికొందరు కవి దృష్టిలో తుర్కలు
అంటే రజాకార్లు అనే పరిమిత అర్ధమే వున్నదని సమర్ధించపూనారు. ఇందులో రెండోది పరమ
నిరంకుశవాదన. (1948 నాటి) రజాకార్లను ఎంత తీవ్ర పదజాలంతో విమర్శించినా అది
తక్కువే. నిజమేకానీ, మత అర్ధంలో అయినా, రాజకీయ అర్ధంలో అయినాసరే వాళ్లను తుర్కలు అనడం ఓ ప్రజాకవికి తగిన
పనేమీకాదు. కొందరికే సేవచేస్తూ అందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నామనడం ఎంత
నిరంకుశత్వమో కొందరి తప్పును అందరికీ రుద్దడం అంతే నిరంకుశత్వం.
చరిత్ర అధ్యయనంలో, రచనలో,
వ్యాసకర్తలు కొంత విశాల దృక్పధాన్ని అనుసరిస్తే మతతత్త్వం పూర్తిగా అదృశ్యమయ్యే
అవకాశం వుంటుంది. మతం సరిహద్దుల్లో ఇమడని వర్గప్రయోజనాలను, వర్గసంఘీభావాన్నీ,
వర్గవైరుధ్యాలనూ వివరించే అవకాశం ఏర్పడుతుంది. సమస్యను మతం దృష్టి నుండి కాకుండా
ఆర్ధికదోపిడీ నుండి చూడగలిగితే ఒకే మతాన్ని అనుసరించేవాళ్ళ మధ్య సంఘీభావం, సమనత్వం
వుంటాయనే తప్పుడు భావజాలాన్ని వదిలించుకోవడం కష్టమేమీకాదు. అదనపు విలువ
ఉత్పత్తిదారులుకు, అదనపు విలువ దోపిడీదారులకూ మధ్య సమాజాన్ని విభజించి చూస్తే,
రేఖకు అటైనా ఇటైనా విభిన్న మతస్తులు
కలగలిసిపోయిన విశాల సమూహాలు కనిపిస్తాయి.
వర్తమాన
సాహిత్యంలో మైనారిటీలను ప్రస్తావించి కించపరిచే సాహిత్యంకన్నా అసలు మైనారిటీల ప్రస్తావనేలేని సాహిత్యమే చాలా
ఎక్కువగా వుంటోంది. తెలుగు సాహిత్యంలో సాధారణంగా మైనారిటీలు కనిపించరు. సాహిత్యం
ద్వార ఎవరయినా తెలుగు ప్రజల్ని, తెలుగు సమాజాన్నీ చూడదలిస్తే తెలుగుప్రజల్లో
మైనారిటీలు లేరనే అభిప్రాయానికి రావల్సివుంటుంది. కళాసాహిత్యకారులకు
శ్రామికపక్షపాతం ఉండాలనేవాళ్ళ రచనలూ ఇందుకు మినహాయింపుకాకపోవడం నిజంగా విచారకరమే. దీనికి
భిన్నంగావచ్చే సాహిత్యం కూడా లేకపోలేదుగానీ అది అపురూపమే. సుంకర సత్యనారాయణ
‘మాభూమి’ నాటకం బందగీ సమాధివద్ద ఆరంభం కావడం అలాంటి అపురూపమైన ఉదాహరణల్లో ఒకటి.
సుద్దాల, సుంకర రచనలకు నేపథ్యం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే అయినప్పటికీ ముస్లింల
విషయంలో వాళ్ళిద్దరూ పరస్పర విరుధ్ధమైన
దృక్పధాల్ని అవలంభించడం గమనార్హం.
మనుషులు, అద్దంలో తమనుతాము చూసుకుని తలను సంస్కరించుకున్నట్టు, సాహిత్యంలో తమనుతాము చూసుకుని చైతన్యాన్ని పెంచుకుంటారు.
తెలుగు మాతృభాషగావున్న మైనారిటీలకు అలా చైతన్యాన్ని పెంపొందించుకునే అవకాశాన్ని ఏ మేరకు
కల్పించారో సాహితీవేత్తలు ఓసారయినా ఆత్మవిమర్శ చేసుకోవాల్సే వుంది.
(తోడ్పడిన గ్రంధం :
పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ 1969 లో ప్రచురించిన Communalism
and the Writing of Indian History పుస్తకంలో
రోమిలా థాపర్, హర్బన్స్ ముఖియా, బిపిన్ చంద్ర రాసిన వ్యాసాలు.)
విజయవాడ
11 డిసెంబరు 1987
ప్రచురణ : ధ్వని పేజీ, ఉదయం దినపత్రిక, 3 ఫిబ్రవరి 1988
ముస్లిం సంవాదం సంకలనం త్రిపురనేని శ్రీనివాస్ కు అంకితం
భారత ముస్లిం అస్థిత్వవాద
దృక్పథంతో దాదాపు మూడు దశాబ్దాలుగా నేను రాస్తున్న వ్యాసాలను ’ముస్లిం సంవాదం”
పేరుతో సంకలనంగా తేవాలని అనుకుంటున్నాను.
ఈ కోవలో నా తొలి వ్యాసం ’సాహిత్యంలో మతతత్త్వం”
ఉదయం దినపత్రిక, ధ్వని పేజీలో 3 ఫిబ్రవరి 1988న అచ్చయింది. ఆ వ్యాసాన్ని (అప్పట్లో
కొంచెం సాహసంతో) ప్రచురించినవాడు త్రిపురనేని శ్రీనివాస్. ముస్లిం సంవాదం
సంకలనాన్ని త్రిపురనేని శ్రీనివాస్ కు అంకితం ఇవ్వాలనుకుంటున్నాను.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి ఓ పరిశోధకుడు షా ఇబ్రాహీం షేక్ రెండు రోజులుగా నా వ్యాసం ’సాహిత్యంలో మతతత్త్వం” కావాలని కోరుతున్నాడు. రాత్రి
దాన్ని వెదికి పట్టుకున్నాను. ఆ సందర్భంగా దాన్ని ప్రచురించిన త్రిపురనేని శ్రీనివాస్ గుర్తుకు
వచ్చాడు. అంకితం ఇవ్వడానికి తనే సరైన వ్యక్తి అనుకున్నాను. ఇక గౌరవానికి సంబంధించి
ఫూలే, అంబేడ్కర్ అనే ఏమిటీ నాకు కార్ల్
మార్క్స్, ముహమ్మద్ ప్రవక్త, చారు మజుందార్, కొండపల్లి సీతారామయ్య, మాక్సిమ్ గోర్కి, జాక్ లండన్, చెహోవ్, లూసన్,
ఛార్లెస్ డికెన్స్, ఇమ్లీ డర్క్ హేమ్ వగయురాలంటే చాలాచాలా ఇష్టం. అన్నట్టు మా
అమ్మానాన్న అన్నా నాకు చాలా ఇష్టం.
అయినా, అంకితం ఎవరికి ఎందుకు ఇచ్చాం అనేదే వుంటుందిగానీ, ఎవరెవరికి ఎందుకు
ఇవ్వలేదు అని వుండదు.
No comments:
Post a Comment