Tuesday 17 May 2016

Laws of Arthur DUNKEL

డంకెల్ ధర్మశాస్త్రం
- ఉషా యస్ డానీ
1
ప్రజలు వేరు; పౌరులు వేరు. వీరి భిన్నత్త్వంలో ఏకత్వాన్ని చూడడం పొరపాటు. అమెరికా, ఐఎంఎఫ్, ప్రపంచ వాణిజ్య సంస్థ సమానార్ధకాలు. వీటి ఏకత్త్వంలో భిన్నత్త్వాన్ని చూడడం అంతకన్నా పొరపాటు.

వాణిజ్యము, సుంకాల సాధారణ ఒప్పందం (GATT) వల్ల భారత పౌరుల్లో కొందరికి మేలు కలగవచ్చు, అట్లే ప్రపంచదేశాల్లో కొన్నింటికి కొన్నో అనేకమో ప్రయోజనాలు వుండవచ్చు. అంతమాత్రాన భారతీయులందరికీ, ప్రపంచ దేశాలన్నింటికీ గాట్ ఒప్పందవల్ల మేలు జరిగిపోతుందని తీర్మానించడం అనేది ఒక పాక్షిక సత్యాన్ని సంపూర్ణ సత్యంగా వక్రీకరించడమే అవుతుంది. అనుమానంవున్నవాళ్ళు కేంద్ర ఆహారమంత్రి కల్పనాధ్ రాయ్ దీనగాధను చూసైనా నేర్చుకోవచ్చు.  అందని ద్రాక్షపళ్ళు పుల్లన అవునోకాదోగానీ ధర పెరిగిన పంచదార మహాచేదు అని ఇప్పుడు భారతదేశంలో ఏ గృహిణిని అడిగినా చెపుతుంది.  పంచదారను ఎగుమతి చేసినపుడయినా, దిగిమతి చేసుకున్నప్పుడయినా 'ఒకే ప్రపంచ కుటుంబం' లోని 'మరింత సమానులైన' దేశాల సిండికేట్ భారత ప్రజలకు మిగిల్చింది చేదు అనుభవం మాత్రమేననేది మరింత చేదు నిజం.

పుట్టబోయే ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO)కు ప్రస్తుత పిండరూపమే గాట్. నూతన ఆర్ధిక విధానం , గోల్డెన్ హ్యాండ్ షేక్, డీ-కంట్రోల్, డీ-లైసెన్సింగ్, ప్రైవేటీకరణ, ప్రపంచ మార్కెట్ ఏకీకరణ, సబ్సిడీల రద్దు, బలహీనవర్గాలకు రిజర్వేషన్ల ఉపసంహరణ  వగయిరాలు అన్నీ అమెరికా సప్తమ నౌకాదళం (సెవెంత్ ఫ్లీట్) కు పర్యాయ పదాలే.

ప్రజల్నీ పౌరుల్నీ ఒకేగాటన కట్టడం, అమెరికాను, గాట్ ను ఒకే గాటన కట్టకపోవడం కేవలం అమాయకత్వం మాత్రమేకాదు; అపచారం కూడా.

వాణిజ్య సంబంధ మేధోసంపత్తి హక్కులు (ట్రిప్స్),  ట్రిమ్స్, గ్యాట్ ల గురించి గాట్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆర్ధర్ డంకెల్ చాలాకాలం చాలా రకాలుగా చాలాచాలా రాసేడు. డంకెల్ ప్రతిపాదనల మీద కూడా చాలామంది చాలాకాలం  చాలాచాలా రాసేరు.  ప్రజల భాషవేరు; పాలకుల భాషవేరు. ఒకరిభాష మరొకరికి అర్ధం కాదు.

ప్రజలు శాస్త్రాన్ని చదవరాదని మునుపు ఒక శాసనం వుండేది. ఆ శాసనాన్ని అతిక్రమించి శాస్త్రాన్ని చదివినవాడి నాలుకను కత్తిరించేవారు. శాస్త్రాన్ని విన్నవాడి చెవుల్లో సీసం కరిగించిపోసేవారు. అది, మధ్యయుగాల రాజుల కాలం కనుక అలా చెల్లింది. ఇప్పుడు కాలం మారింది. ప్రజల్లో అందరూ కాకపోయినా  కొందరయినా శాస్త్రాలు చదవగలరు.  చదవడానికి వీల్లేదని చెప్పడం అస్సలు కుదరదు. ప్రజలు చదివినా అర్ధం కాని భాషలో రాయడమే ఇక పాలకులకు మిగిలిన ఏకైక మార్గం. డకెల్ ప్రతిపాదనలు ఆ కోవకు చెందుతాయి. వీటిని డీ-కోడ్ చేయడమే ఇప్పుడు ప్రజామేధావులు నిర్వర్తించాల్సిన కర్తవ్యం.

 2
అప్పటి బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలా 1757  జూన్ 23న  ప్లాసీ సమీపంలోని మామిడితోటల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాల్ని ఎదుర్కొన్నాడు. ఆ యుధ్ధంలో మీర్ జఫర్ వంటి విశ్వాసఘాతకుల సహకారంతో బెంగాల్ నవాబును ఓడించి క్రూరంగా చంపిన (ట్రైటర్స్ గేట్)  తరువాతగానీ మన దేశంలో వలస పాలన ప్రవేశించలేకపోయింది. ఇప్పుడు కాలం మారింది. బెంగాల్ నవాబు లేడు. ప్రత్యక్ష సైనికదాడులులేవు. వలస సైన్యాల్ని మామిడితోటల్లో ఎదుర్కోవడాలూ లేవు. దురాక్రమణలు లేవు. యుధ్ధాలు లేవు. ఆత్మహత్యలేతప్ప హత్యలు లేవు. నెత్తురు చిందడాలులేవు. అంతా రక్తరహిత వ్యవహారం. మామిడిపండ్లను అమెరికాకు ఎగుమతి చేసినట్లే బెంగాలి బాబు ప్రణబ్ ముఖర్జీ మొరాకోలోని  మరకేష్ వెళ్ళి ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందంపై సంతకం చేసి “మమ్మల్ని టోకుగా ఏలుకోండి మహాప్రభూ!” అంటూ కొత్త వలసవాదుల్ని ఆహ్వానించడం చరిత్రలో చిత్రమైన పారడాక్సీ!.  “చరిత్ర మొదటిసారి విషాదంగానూ రెండవసారి ప్రహసనంగానూ పునరావృతమవుతుంది” అన్నాడు కార్ల్ మార్క్స్. (థ్యాంక్ గాట్ ! ఈ కొటేషన్ పై మార్క్స్ కు మేధోసంపత్తి హక్కులు లేవు).

3
శ్రామికులు, ప్రజలు సమానార్దకాలు. ఆస్థి, ఆధికారం, అంతస్తు (అ-త్రయం)ల్లో భాగస్వామ్యం లేనందువల్ల బతకడానికి తమ శ్రమశక్తిని ఇతరులకు అమ్ముకోకతప్పని వేతన కూలీలే ప్రజలు. మనదేశం వంటి కులమతవర్గ సమాజంలో శ్రామికులతోపాటూ, ఎస్ టి, ఎస్ సీ, బిసి, మైనారిటీలు, స్త్రీలు వంటి సామాజిక, లింగ శ్రామికవర్గాల్ని (సోషల్ అండ్ జెండర్ ప్రొలెటేరియట్) నిర్ధిష్ట అర్ధంలో ప్రజలు అనాల్సివుంటుంది. వర్గానికి భౌతికరూపం కులం. కులానికి తాత్విక రూపం వర్గం. కులం సామాజిక ప్రత్యయం. అది నిర్దిష్టమైనది. వర్గం తాత్విక ప్రత్యయం. అది అమూర్తమైనది.

ప్రజలందరూ పౌరులుకావచ్చుగానీ పౌరులందరూ ప్రజలుకారు. పౌరుల్లో ప్రజలతోపాటూ పాలకులూ వుంటారు. హిందూస్తాన్ ఫెరొడో సంస్థ తన పేరును హిందూస్తాన్ కాంపోజిట్స్ గా మార్చుకున్నట్టు, తమ పేరును పౌరులుగా మార్చుకోవడమే ఇప్పట్లో పాలకుల మోడెస్టీ!. ఇబ్బంది లేనపుడు ’ప్రామినెంట్ సిటిజన్స్ ’ అనుకోవచ్చు. అందువల్ల పౌరులు అనే మాటను ఎవరు ఎప్పుడు ఏ అర్ధంలో ప్రయోగిస్తున్నారో తెలుసుకోకుంటే వర్తమాన రాజకీయార్ధిక పరిణామాల్ని అర్ధం చేసుకోవడం సాధ్యంకాదు.

స్వంతఆస్తి లేనందువల్ల శ్రమించడమే ప్రజల ప్రధాన కార్యకలాపం. కనీస జీవితావసరాల్ని నెరవేర్చుకోకుండా శ్రమించడం సాధ్యంకాదు కనుక ప్రజల హక్కు కనీస జీవితావసరాల్ని పొందేవరకే పరిమితం అవుతుంది. పాలకుల హక్కు అంతకన్నా విస్తృతమైనది. అది కనీస జీవితావసరాల పరిధిని అధిగమించి విస్తరిస్తుంది. అలాంటి విస్తరణ సహజంగా సామాజిక ఘర్షణకు దారితీస్తుంది. ఇలాంటి విస్తరణను బాహాటంగా సమర్ధించడానికి నిన్న మొన్నటి వరకు మన పాలకులు సహితం సాహసించేవారుకాదు. మొగమాటానికైనాసరే   సమసమాజం రావాలని అంటుండేవారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించిన హస్తంతోనే రాజ్యాంగ ప్రవేశికలో ’సోషలిస్ట్’ ఆదర్శాన్నికూడా చేర్చింది. వివిధ ప్రాంతాల మధ్యనేకాకుండా ఒకే ప్రాంతంలోని విభిన్న వ్యక్తుల మధ్య కూడా అసమానతల్ని తొలగించడానికి ప్రభుత్వం కృషిచేయాలనే అదేశిక సూత్రం కూడా రాజ్యాంగంలో వచ్చి చేరింది.

ఇప్పుడు పరిస్థితి మరలా మారింది. పౌరుల జీవన ప్రమాణలను పెంచాలంటే ప్రజలు సమాజంలో అసమానత్వాన్ని ఓపిగ్గా భరించక తప్పదని మన సరికొత్త పాలకులు బాహాటంగానే ప్రచారం ఆరంభించారు.  నూతన ఆర్ధిక విధానం రూపశిల్పి మన్ మోహన్‍ సింగ్ మాటల్లో చెప్పాలంటే “భారతదేశం ప్రపంచ దేశాల మధ్య న్యాయమైన తన స్థానాన్ని సాధించుకోవాలంటే అది బలమైన పారిశ్రామిక దేశంగా రూపొంది తీరాలి. మనదేశం బలమైన పారిశ్రామిక దేశంగా అభివృధ్ధి చెందాలంటే మన ‘ప్రజలకు’ కనీస జీవనసౌకర్యాలను కల్పిస్తూనే, మరోవైపు, ‘పౌరుల’ జీవనప్రమణాలు వేగవంతంగా పెరిగేందుకు అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చి తీరాలి.” (మే 30, 1994 నాగార్జున విశ్వవిధాలయం స్నాతకోపన్యాసం).

అధికసంఖ్యాక మతవర్గాల ఆర్ధిక విధానాన్ని బీజేపి అగ్రనాయకులు    ఎల్ కే అద్వానీ ‘రథయాత్ర’ సందర్భంగా ముమ్మరంగా ప్రచారం చేశారు. దేశంలోని మత అల్పసంఖ్యాకవర్గాలకు ప్రాధమిక విద్యను అందిస్తామనీ, జ్వరమో, జబ్బో వస్తే సర్కారు దవాఖానాలో వైద్య సౌకర్యం కల్పిస్తామనీ ఆయన అనేవారు. అంతకు మించి, మరే ఇతర సౌకర్యాలనూ, హక్కులనూ మైనార్టీలు కోరరాదని ఆయన ఆంక్షలు విధించేవారు.

ప్రజలకు కనీస సౌకర్యాలను (మాత్రమే) కల్పిస్తామనడం అంటే  ప్రజలకు వ్యక్తిగత ఆస్తిని నిరాకరించడం తప్ప మరేమీకాదు. ప్రజలు ఆయా సందర్భాలలో తమ హక్కుల కోసం  జరిపే ప్రజాస్వామిక ఉద్యమాలన్నీ సారాంశంలో వ్యక్తిగత ఆస్థి హక్కు కోసం జరిపే ఉద్యమాలే. ఏదో ఒక నెపంతో ఈ హక్కును కాలరాయడమే ఇప్పుడు పాలకవర్గాలు చేస్తున్న పని. పరికించి చూస్తే రాజకీయార్ధిక వ్యవహారాల్లో అద్వానీ, మన్ మోహన్ సింగ్ ల మధ్య పెద్ద తేడా ఏమీలేదని ఎవరికయినా సులువుగానే అర్ధం అవుతుంది. అద్వానీ మతవాద మన్ మోహన్ సింగ్ అయితే, మన్ మోహన్ సింగ్ మితవాద అద్వాని!

4
మేధో సంపత్తిపై  హక్కులు పొందే సాంప్రదాయం భారదేశానికి కొత్తకాదు.  ఒకవిధంగా ఇలాంటి సాంప్రదాయానికి భారతదేశమే పుట్టినిల్లు. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో మనువు మేధోరంగంపై బ్రాహ్మణులకు, ప్రభుత్వపాలన వ్యవహారాలపై  క్షత్రీయులకూ, వాణిజ్య వ్యవహారాలపై వైశ్యులకూ, సేవారంగంపై శూద్రులకూ శాశ్విత పేటెంట్ హక్కులు రాసి ఇచ్చేశాడు. ఈ నాలుగువర్ణాలు చేయలేని, చేయరాని వెట్టి చాకిరీని చేసి తీరాల్సిన బాధ్యతను చాతుర్వర్ణ చట్రానికి బయటనున్న పంచములకు అప్పచెప్పాడు. ఆదివాసులకు అదీ ఇవ్వలేదు. నోరెత్తితే ఖాండవదహనమే వాళ్లకు!

మనుస్మృతి అమల్లోనికివచ్చి రెండు వేల సంవత్సరాలు దాటినా, తొలినాటి పేటెంటు హక్కుల్లో మౌలికమైన మార్పులేమీ రాలేదు. నిలువు చలనం (వర్టికల్‍ మొబిలిటి)  కొంత ఎగువకూ కొంత దిగువకూ సాగినప్పటికీ కింది కులాలకు  వ్యక్తిగత ఆస్తి నిరాకరణ అనే నియమానికి సారాంశంలో ఎలాంటి గుణాత్మక మార్పూ జరగలేదు. 

సమాజంలో మార్పులు వచ్చినప్పుడెల్లా మనుస్మృతి కొత్త రూపంలో కొనసాగింది. పరిపాలనా వ్యవస్థలో నాలుగు అంతస్తుల చట్రం అన్ని కాలాల్లోనూ వర్ధిల్లింది. ఇప్పుడు అలాంటి వ్యవస్థనే  ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా రూపొందించాలని ఆర్ధర్ డంకెల్ ఆశిస్తున్నాడు. మనువు జాతీయ డంకెల్ అయితే, డంకెల్ అంతర్జాతీయ మనువు.

చరిత్రలో మనువు, డంకెల్ లకు మరో పోలిక కూడా వుంది. సమాజంలో బహుకొద్ది మందిని శాశ్వితపాలకులుగానూ, అత్యధికుల్ని శాశ్విత సేవకులుగానూ నిలబెట్టిన సనాతనధర్మంపై తిరుగుబాటుగా “బహుజన హితం” లక్ష్యంగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బౌధ్ధం ఆవిర్భవించింది. చాతుర్వర్ణ వ్యవస్థ పునాదుల్ని బౌధ్ధం కుదిపివేసింది. భిన్న రాజ్యాలకు, భిన్న ప్రాంతాలకు, భిన్న భాషలకు చెందినవాళ్లు భారీ సంఖ్యలో భౌధ్ధమతాన్ని స్వీకరించడంతో అది తొలి ప్రపంచమతంగా మారింది. ఒకవైపు, విస్తరిస్తూ మహసామ్రాజ్యాన్ని నిర్మిస్తూనే మరోవైపు అంతర్గత చీలికలో కూరుకుపోయి బౌధ్ధం సతమతమౌతున్న సమయంలో మనువు రంగప్రవేశం చేశాడు. వర్ణవ్యవస్థపై భవిష్యత్తులో మరో తిరుగుబాటు జరగడానికి ఎలాంటి అవకాశమూ ఇవ్వని  విధంగా దూరాలోచనతో ఒక స్మృతిని రూపొందించాడు.

వైదీక ధర్మానికి బౌధ్ధం నుండి ఏర్పడిన ముప్పఉవంటిదే 19వ శతాబ్దపు రెండవ భాగంలో పెట్టుబడీదారీ వ్యవస్థకు కమ్యూనిస్టు ‘భూతం’ నుండి ఏర్పడింది. “శ్రామికులకు రాజ్యాధికారం” కావాలన్నాడు కార్ల్ మార్క్స్. దాదాపు అదే సమయంలో, భారత దేశంలో బహుజనోద్యమానికి నాందీ పలికాడు జ్యోతిబాఫూలే. మరో శతాబ్దం గడవక ముందే దళితులకు రాజ్యాధికారం కావాలన్నాడు అంబేడ్కర్.  

ఇర్వయ్యో శతాబ్దపు రెండవ దశకంలో ప్రపంచపటంపై తొలి సోషలిస్టు దేశం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుధ్ధంలో నాజీ-ఫాసిస్టు మూకల్ని ఓడించిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా సోషలిస్టు పవనాలు వీచాయి. రెండవ, మూడవ ప్రపంచ దేశాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. పలుదేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అనేక వలస దేశాలు స్వతంత్ర దేశాలుగా మారాయి. ఈమేరకు తొలి ప్రపంచ మతంగా బౌధ్ధానికీ, తొలి సోషలిస్టు దేశంగా యూఎస్ ఎస్ ఆర్ కూ ఒక పోలిక వుంది.

ప్రపంచ మార్కెట్ పునఃపంపకాలను సుస్థిరం చేయడానికి వీలుగా ప్రపంచ వాణిజ్యసంస్థను నెలకొల్పాలని పెట్టుబదీదారీ దేశాలు చేసిన ప్రయత్నాలను అప్పట్లో సోషలిస్టు దేశాలు అడ్డుకున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థకు సూక్ష్మరూపంగా 1948లో వాణిజ్యము, సుంకాల  సాధారణ ఒప్పందం (గాట్) ఏర్పడింది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు గాట్ పెరిగి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) గా మారడానికి 47 ఏళ్ళు ఆగాల్సి వచ్చింది.

సోవియట్‍ రష్యా సోషల్ సామ్రాజ్యవాదంగా మారుతున్న కాలంలోనే అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. రష్యాలోనూ, తూర్పు యూరప్ లోనూ తలెత్తిన అంతర్గత సంక్షోభం, పెట్టుబడీదారీ దేశాల్లో తిరిగి కొత్త ఆశలు రేకెత్తించింది. సరిగ్గా ఈ దశలోనే ఆర్ధర్ డంక్ల్ 1986 సెప్టెంబరు 20న ఉరుగ్వే రౌండ్ చర్చలు ఆరంభించాడు. 

వైదీక ఫ్యూడల్ సమాజాన్ని పరిరక్షించడానికి మనువు రూపొందించిన కవచాన్నే  ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదానికి అనువుగా డంకెల్ మార్చాడు. మరోమాటల్లో చెప్పాలంటే మోడిఫైడ్ మనుధర్మశాస్త్రమే నేటి డంకెల్ ధర్మశాస్త్రం. ఇప్పుడు డబ్ల్యూటీవో చట్రంలో డంకెల్ ఇమడ్చిన ప్రపంచదేశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్ర వర్ణాలేకాదు, దళిత, ఆదివాసీ కులాలు, తెగలు కూడా కనిపిస్తాయి. 

ప్రపంచ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఆదిమ ఆర్యజాతిని పునఃసృష్టించాలని నాటి నాజీ సైంటిస్ట్ జోసెఫ్ మెంగెలేకర్ జెనెటిక్ ఇంజనీరింగ్ లో కొన్ని ప్రయోగాలు నిర్వహించాడు. మెంగెలేకర్ కొత్త అవతారమే డంకెల్. మెంగెలేకర్ తాను ‘సృష్టించిన మనుషులతో’ సాధించలేకపోయినదాన్ని ఇప్పుడు డంకెల్  మొక్కలు, విత్తనాలతో సాధించదలిచాడు. ఆ మేరకు డంకెల్ మొక్కలు విత్తనాల నాజీ.

మనుస్మృతికి గ్లోబల్ రూపమే ప్రపంచ వాణిజ్య సంస్థ కనుక, మనుస్మృతి బాధితుల్ని పీడించడం ప్రపంచ వాణిజ్య సంస్థకు మరింత సులువు. మరోవైపు, రెండు వేల సంవత్సరాలుగా మనుస్మృతిని ఎదుర్కొంటున్న అపార అనుభవమున్న భారత ప్రజలకు ప్రపంచ వాణిజ్య సంస్థను ఎదుర్కోవడమూ అంతే సులువు.

ఇప్పుడు వ్యక్తిగత ఆస్థి హక్కు కోసం ప్రజలు సాగిస్తున్న ప్రజాస్వామిక ఉద్యమాలన్నీ  విస్తృత అర్ధంలో ప్రపంచ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా జరిపే ఉద్యమాలే అవుతాయి. అట్లే, ప్రపంచ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా ఉద్యమించే శక్తులన్నీ జాతీయంగా సాగుతున్న ప్రజాస్వామిక ఉద్యమాలను బలపరచాల్సే వుంటుంది. అలాంటి క్రమం ఒకటి ఇప్పుడిప్పుడే మన సమాజంలో రూపుదిద్దుకుంటున్నది.

సుఫియాకుటీరం, విజయవాడ
జూన్ 15, 1994


ప్రచురణ : ‘చూపు’ మాసపత్రిక, జులై 1994

No comments:

Post a Comment