Monday, 15 August 2016

స్కైబాబా అసందర్భ గందరగోళం

ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు -1

ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

-        డానీ

ప్రవేశిక
ప్రపంచ పరిణామాల్ని గమనించేవారెవరికయినా సులువుగా అర్ధం అయ్యే విషయం ఏమంటే ఇప్పుడు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న ప్రజాసమూహాలు ముస్లింలు, ఆదివాసులు అని. ఒకరికాళ్ల కింద చమురువుంది, మరొకరి పరిసరాల్లో ఖనిజాలున్నాయి. ప్రపంచ మార్కెట్‍ అధిపతులకు ఇవి రెండూ కావాలి. వాటిని దక్కించుకోవాలంటే ముస్లింలు, ఆదివాసుల్ని వాళ్ల స్థానాల నుండి తొలగించాలి. వాళ్ళను నిర్వాశితుల్ని చేయాలి. అలా చేయాలంటే చంపదలిచిన కుక్కను పిచ్చిదని ప్రచారం చేయాలి. ఇప్పుడు ముస్లింలు, ఆదివాసుల గురించి ప్రపంచ మార్కెట్‍ అధిపతులు జరుపుతున్న ప్రచారం ఇదే. ఈ పరిణామాలన్నింటినీ ఇప్పుడు మనం నిత్యం డిజిటల్ డిస్ ప్లేలో చూస్తూనేవున్నాం. ఇంకా  అనుమానం వున్నవాళ్ళు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టి అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్  రెచ్చిపోయి చేస్తున్న ఉపన్యాసాలు విని నిర్ధారణ చేసుకోవచ్చు. 

ముస్లింసమాజానికి బాహ్యాత్మక ముప్పు ముంచుకు వస్తున్నదని ప్రపంచం గుర్తించినప్పుడెల్లా  రచయిత స్కైబాబా ఒక కొత్త ఆరోపణతో  ముందుకు వస్తుంటారు. ముస్లిం సమాజానికి వచ్చిన ముప్పు అంతర్గతమైనది అనేది వారి ఆరోపణల సారాంశం.  వర్తమాన భారత ముస్లిం సమాజపు దుస్థితి వాళ్ళ స్వయంకృతాపరాధమనేది వారి అభిప్రాయం. 

భారత ముస్లిం సమాజపు వెనుకబాటుతనానికి కారణాలు వాళ్ళు అనుసరిస్తున్న ఆచారాల్లోనే అంతర్గతంగా వున్నాయని  తాము రాసినప్పుడు ముస్లిమేతర మిత్రులు కొందరు తమను సంఘసంస్కర్తలుగా పేర్కొని పొగిడేవారు అనే అర్ధం వచ్చేలా కొన్నేళ్ళ క్రితం ఆయనే స్వయంగా ఒక వ్యాసంలో రాసుకున్నారు. బహుశ బయటివాళ్ళ పొగడ్తలు కోరుకున్నప్పుడెల్లా స్కైబాబా ఇలా ‘అంతర్గత ముప్పు’  సిధ్ధాంతాన్ని బయటికి తెస్తుంటారని మనం అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల సోషల్ మీడియాలో ఆరు మరోసారి అంతర్గత ముప్పు ఆరోపణలు చేశారు.  వాటికి కొనసాగింపుగా చేటు చేసే ముస్లింవాదుల మౌనం’  వ్యాసం రాశారు. (సాక్షి దినపత్రిక, 18 జులై 2016) 

అస్థిత్వవాద ఉద్యమాలకు  ప్రాణప్రదమైనవి రాజకీయార్ధిక అంశాలు. స్కైబాబా వ్యాసంలో వీటి ప్రస్తావనేలేదు. భారత ముస్లిం సమాజానికి బయటి నుండి ముంచుకు వస్తున్న ఉపద్రవాన్ని వారు తెలివిగా కప్పిపుచ్చేశారు. అంతేకాక, మొత్తం వ్యాసంలో ‘బయటి నుండి’ ‘బాహ్యాత్మక’, వంటి పదాలు సహితం ఎక్కడా కనిపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. స్కైబాబా వాదానికీ ముస్లిం అస్థిత్వవాదానికీ సంబంధమేలేదు.

ముస్లిం సామాజిక సముదాయంలో అందరూ ఒకే స్థాయిలో మతాచారాల్ని ఆచరించరు. వాళ్ళల్లో మతాన్ని నిష్టగా పట్టించుకునేవారు, అతిగా పట్టించుకునేవారు,   అప్పుడప్పుడు మాత్రమే పట్టించుకునేవారు, అస్సలు పట్టించుకోనివారు మతాతీతంగా వ్యవహరించేవాళ్ళు వుంటారు. అయితే, బయటి నుండి ముప్పు పెరిగినపుడు సహజంగానే  మొత్తం భారత ముస్లిం సమాజం అప్రత్తమై ప్రత్యర్ధివర్గాన్ని నిలవరించే పనిలో నిమగ్నమై పోతుంది. నిజానికి అంతా సవ్యంగావున్న కాలంలోకంటే ఆపద ముంచుకొచ్చిన కాలంలోనే  ముస్లిం సామాజిక సముదాయంలో  సంఘీభావం స్థాయి చాలా ఎక్కువగా వుంటుంది. మతాచారాల్ని ఆచరించనివారు, పట్టించుకోనివారు, మతాతీతంగా వ్యవహరించేవాళు సహితం కష్టకాలంలో దగ్గరయిపోతారు. ఇతర మతసమూహాల్లోని ఉదారవాదులు సహితం కష్టాల్లోవున్న ముస్లిం సామాజిక సముదాయం మీద సానుభూతిని ప్రకటిస్తుంటారు. మతవ్యతిరేకులు కూడా కొందరు వుంటారుగానీ వాళ్ళకూ మత సముదాయపు అస్థిత్వ ఉద్యమానికీ సంబంధం వుండదు.

గత ఏడాది చివర్లో దేశమంతటా చెలరేగిన అసహన వాతావరణాన్ని మనం ఇంకా మరచిపోలేదు. ఆ వాతావరణాన్ని ఎవరు ఏ ప్రయోజనాల్ని ఆశించి సృష్టించారో కూడా మనకు తెలుసు. ఈరోజు సాక్షాత్తు భారత ప్రధాని పది మెట్లు దిగివచ్చి “భారత సమాజాన్ని అన్ని రకాలుగా చీల్చాలనుకుంటున్న కొందరు గోసేవకుల పేరుతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే దుకాణాలు తెరిచారు”  అనాల్సివచ్చిందంటే భారత ముస్లిం సమాజం, దానికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్న అనేక ఇతర ప్రజాసమూహాలూ- మరీ ముఖ్యంగా దళితులు- సమిష్టిగా ఏ స్థాయిలో పాలకవర్గాల్ని నిలువరించాయో అర్ధం చేసుకోవచ్చు. 

భారత ముస్లిం సమాజం రాజకీయార్ధిక లక్ష్యాల సాధన కోసం బాహ్యాత్మక  పోరాటం సాగిస్తున్న సమయంలో స్కైబాబా  ధార్మిక, సాంస్కృతిక అంశాలను చర్చకు తెచ్చారు. పైగా అవి అంతర్గత ముప్పు అంటూ ఇంటాబయటా గందరగోళాన్ని సృష్టించారు. బయటి ముప్పును ఎదుర్కోవడానికి  స్వీయసమాజం చేస్తున్న ప్రయత్నాలని వారి రచనలు నిస్సందేహంగా  దెబ్బ తీస్తాయి.

ఇలాంటి గందరగోళాన్ని తెలియక చేస్తే అజ్ఞానం అవుతుంది. తెలిసిచేస్తే కుట్ర అవుతుంది. ఈ పనుల్ని తెలిసి చేసినా తెలియకచేసినా నష్టపోయేది మాత్రం భారత ముస్లిం సమాజమే. ఇది ముస్లింవాదానికి అంతర్గత చేటు. పదేళ్ళ క్రితం ఇలాంటి సందర్భంలోనే స్కైబాబాను ఒకసారి మందలించాను. అప్పట్లో నేను వాడిన పదం కొంచెం కటువుగా వుందని  కొందరు మిత్రులు అన్నారు. కష్టకాలంలో స్వీయసమాజం మీద నిందలు వేసేవారిని ఏమనాలో ఇప్పుడు ఆలోచనాపరులు చెప్పాలి.

(రచయిత సమాజ విశ్లేషకులు )
మొబైల్ : 9010757776

ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు -2
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

ఒక వివరణ
            చేటు చేసే ముస్లింవాదుల మౌనం’ వ్యాసంలో స్కైబాబా ప్రగతిశీల, స్త్రీ, దళిత, తెలంగాణవాద ఉద్యమాలను ప్రస్తావించి వాటిల్లో వేటిలోనూ లేని వైపరీత్యం ఒక్క ముస్లిం సమాజంలోనే దాపురించిందన్నారు. వారి అభిప్రాయాలతో విభేదించేవారు ఎవరయినా రెండు పనులు చేయాల్సివుంటుంది. మొదటిది, ప్రగతిశీల, అభ్యుదయ వాదాల్ని అధిగమించి ఆధునికానంతర వాదాలు పుట్టుకొచ్చాయని నిరూపించాలి. రెండోది, దళితవాద తెలంగాణవాద తదితర ఉద్యమాల్లో జరిగినవే ముస్లింవాద ఉద్యమాల్లోనూ జరుగుతున్నాయని వివరించాలి.  ఆ ప్రకారం ఒక విస్తార వ్యాసం రాసి ప్రతిపాదన వ్యాసాన్ని ప్రచురించిన సాక్షి పత్రిక్కే పంపించాను. దాని మీద వాళ్ళు నిడివి విషయంలోనూ, ఉద్యమాల ప్రస్తావనలు ఉటంకింపుల విషయంలోనూ  కొన్ని అభ్యంతరాలు చెప్పారు. ప్రతిపాదనలో అనుమతించిన అంశాల్ని సమాధానంలో అనుమతించకపోవడంలోవున్న విచక్షణని  మనం ప్రశ్నించలేం గనుక వాళ్ళ సూచనల మేరకు ‘ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు’ పేరుతో ఒక ప్రవేశికను రాసి పంపించాను. అది ఈరోజు సాక్షిలో వస్తుందనుకున్నాను. స్వాతంత్ర దినోత్సవ సంచిక కారణంగా కావచ్చు  ఈవారం సాహిత్యపేజీయే లేదు. వచ్చేవారం నా వ్యాసాన్ని ప్రచురిస్తారని అశిస్తాను.

సాక్షికి పంపిన వ్యాసం కాకుండా స్కైబాబా వంటివారు చేస్తున్న వాదనల మీద మరికొన్ని వ్యాసాలు రాయాల్సి వచ్చింది. సాక్షి  వ్యాసం అచ్చయ్యాక వాటిని విడుదల చేద్దామనుకున్నాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది గనుక మిగిలిన వ్యాసాలను ఈరోజు నుండి సోషల్ మీడియాలో చర్చకు పెడుతున్నాను. సాక్షికి రాసిన వ్యాసానికి ఇవి కొనసాగింపు. ఆ వ్యాసం వీటికీ ఫ్రంట్ రన్నర్ గా, ప్రియాంబుల్ గా  వుంటుంది.


ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 3
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

సాంకేతిక విశ్లేషణ
స్కైబాబా వ్యాసం చేటు చేసే ముస్లింవాదుల మౌనం’  (సాక్షి దినపత్రిక, 18 జులై 2016)  లోని పదమూడు వాక్యాల్లో  ధార్మిక, సాహిత్య-సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన అంశాలు  వరుసగా 7, 4, 2 చొప్పున వున్నాయి. వారి ప్రాధాన్యతా రంగాలను అర్ధం చేసుకోవడానికి ఈ వర్గీకరణ తోడ్పడుతుంది. 

భారత ముస్లీం సమాజపు అభ్యున్నతికి సంబంధించి నేను ఎంచుకున్న కార్యక్షేత్రాలు రాజకీయార్ధిక రంగాలు. ముస్లింల ధార్మిక వ్యవహారాలకు సంబంధించి నాకున్న పరిజ్ఞానం చాలా పరిమితమైనది. ప్రధాన స్రవంతి మాధ్యమాల్లో ముస్లిం సమాజం మీద సాగుతున్నదాడుల వల్ల దానివారి  రాజకీయార్ధిక ప్రయోజనాలకు భంగం కలుగుతున్నదని భావించినపుడు మాత్రమే  అయిష్టంగా అనివార్యంగా ఆ  పరిమితి మేరకే అయినా ధార్మిక అంశాల్ని కూడా పట్టించుకోవాల్సి వస్తున్నది.

ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 4
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

ఆరోపణలు - ముస్లిం సమాజం మీద 

1.            అస్తిత్వవాదాలలో ఇతర వాదాలకు ఉన్న వెసులుబాటు ముస్లింవాదానికి లేదు.

2.            స్త్రీ, దళిత, తెలంగాణవాదులను వారి మాతృ సమూహాలు ఓన్ చేసుకున్నాయి. కాని ముస్లింవాదులకు పరిస్థితి లేదు.

3.            తెలుగులో రాయడంవల్ల వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది.

4.            అంతర్గత వెనుకబాటుతనాలపై రాయడం వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది.

5.            ముస్లింల జీవితాలను కథలుగా మలచాలంటే, నవలీకరించాలంటే అందులోని అన్ని పార్శ్వాలూ రికార్డు అయ్యే వాతావరణం, వెసులుబాటు ఉండాలి.

6.            తమ సమాజంలోని మంచీ చెడూ, విశ్వాసమూ అవిశ్వాసమూ, పాజిటివ్ అంశాలూ నెగెటివ్ అంశాలూ, అన్నీ రాయగలిగే, చర్చించగలిగే వాతావరణం ఉండాలి.

7.            నిజానికి ముస్లిం సమాజం ప్రపంచవ్యాప్తంగానే కాదు, ఇండియాలోనే కాదు, అంతర్గతంగానూ పెను ప్రమాదంలో ఉంది.

8.            కొన్ని జమాత్ (మత సంస్థలు) ముస్లింలను మరింత మౌఢ్యంలోకి నెడుతున్నాయి.

9.             మొత్తంగా ఇండియన్ ఇస్లాం (లోకల్ ఇస్లాం)ను రద్దు చేస్తూ అరబిక్ ఇస్లాంను రుద్దుతున్నారు.

10.       ఉదాహరణకు దర్గాల దగ్గరకు వెళ్లడం, పీర్ల పండుగ చేయడం, ఖబ్రస్తాన్లకు వెళ్లడం, ఫాతెహాలివ్వడం చేయకూడదని విశ్వాసుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.

11.       చస్తే శవంపై కాఫిర్ నీడ పడకూడదనే తీవ్ర వాదనలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి.

12.       పరలోక జ్ఞానం తప్ప లోకజ్ఞానం లేకుండా చేస్తూ ముస్లిం సామాజిక జీవనానికి గుదిబండ కడుతున్నారు.

13.       వీటన్నింటివల్ల నాన్ ముస్లింలకూ, ముస్లింలకూ మధ్య దూరం పెరుగుతోంది

14.       నిజాలు విప్పి చెబుతూ, సామాజిక విషయాలు పట్టించుకునేలా ఒక ముస్లిం సామాజిక ఉద్యమం రావలసిన అవసరముంది.

ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 5
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

ఆరోపణలు - డానీలాంటి వాళ్ళ మీద 

15.       పరిస్థితిని చక్కదిద్దడానికి ముస్లింవాద పెద్దలు పూనుకొని కొంత సరళం చేసే అవకాశముండిందికానీ వారెవరూ దీనికి సుముఖంగా లేకపోవడం వైచిత్రి.
16.       విశ్వాసులు కానివారు ముస్లింవాదులు ఎలా అవుతారని వాదించడం కొందరికి ఫ్యాషన్గా మారింది.

17.       ప్రగతిశీలురుగా మొదలైన సాహిత్యకారులు కొత్తగా మత ఆచారాలను పాటించడం, విశ్వాసులుగా ప్రవర్తిస్తున్నారు.

18.       ఇలాంటి వైపరీత్యం ఒక్క ముస్లిం చైతన్యవంతులు, సాహిత్యకారుల్లోనే దాపురించింది.

19.       అలాకాకుండా తాము కదలకుండా, తర్వాతి తరాన్ని కదలనివ్వకుండా చెయ్యడం.



డానీ  ప్రతిస్పందన

ఆరోపణలు

ఆరోపణలు – ముస్లిం సమాజం మీద

20.       అస్తిత్వవాదాలలో ఇతర వాదాలకు ఉన్న వెసులుబాటు ముస్లింవాదానికి లేదు.

21.       స్త్రీ, దళిత, తెలంగాణవాదులను వారి మాతృ సమూహాలు ఓన్ చేసుకున్నాయి. కాని ముస్లింవాదులకు పరిస్థితి లేదు.

22.       తెలుగులో రాయడంవల్ల వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది.

23.       అంతర్గత వెనుకబాటుతనాలపై రాయడం వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది.

24.       ముస్లింల జీవితాలను కథలుగా మలచాలంటే, నవలీకరించాలంటే అందులోని అన్ని పార్శ్వాలూ రికార్డు అయ్యే వాతావరణం, వెసులుబాటు ఉండాలి.

25.       తమ సమాజంలోని మంచీ చెడూ, విశ్వాసమూ అవిశ్వాసమూ, పాజిటివ్ అంశాలూ నెగెటివ్ అంశాలూ, అన్నీ రాయగలిగే, చర్చించగలిగే వాతావరణం ఉండాలి.

26.       నిజానికి ముస్లిం సమాజం ప్రపంచవ్యాప్తంగానే కాదు, ఇండియాలోనే కాదు, అంతర్గతంగానూ పెను ప్రమాదంలో ఉంది.

27.       కొన్ని జమాత్ (మత సంస్థలు) ముస్లింలను మరింత మౌఢ్యంలోకి నెడుతున్నాయి.

28.        మొత్తంగా ఇండియన్ ఇస్లాం (లోకల్ ఇస్లాం)ను రద్దు చేస్తూ అరబిక్ ఇస్లాంను రుద్దుతున్నారు.

29.       ఉదాహరణకు దర్గాల దగ్గరకు వెళ్లడం, పీర్ల పండుగ చేయడం, ఖబ్రస్తాన్లకు వెళ్లడం, ఫాతెహాలివ్వడం చేయకూడదని విశ్వాసుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.

30.       చస్తే శవంపై కాఫిర్ నీడ పడకూడదనే తీవ్ర వాదనలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి.

31.       పరలోక జ్ఞానం తప్ప లోకజ్ఞానం లేకుండా చేస్తూ ముస్లిం సామాజిక జీవనానికి గుదిబండ కడుతున్నారు.

32.       వీటన్నింటివల్ల నాన్ ముస్లింలకూ, ముస్లింలకూ మధ్య దూరం పెరుగుతోంది

33.       నిజాలు విప్పి చెబుతూ, సామాజిక విషయాలు పట్టించుకునేలా ఒక ముస్లిం సామాజిక ఉద్యమం రావలసిన అవసరముంది.


ఆరోపణలు – డానీ వంటివారి  మీద

34.       పరిస్థితిని చక్కదిద్దడానికి ముస్లింవాద పెద్దలు పూనుకొని కొంత సరళం చేసే అవకాశముండిందికానీ వారెవరూ దీనికి సుముఖంగా లేకపోవడం వైచిత్రి.
35.       విశ్వాసులు కానివారు ముస్లింవాదులు ఎలా అవుతారని వాదించడం కొందరికి ఫ్యాషన్గా మారింది.

36.       ప్రగతిశీలురుగా మొదలైన సాహిత్యకారులు కొత్తగా మత ఆచారాలను పాటించడం, విశ్వాసులుగా ప్రవర్తిస్తున్నారు.

37.       ఇలాంటి వైపరీత్యం ఒక్క ముస్లిం చైతన్యవంతులు, సాహిత్యకారుల్లోనే దాపురించింది.

38.       అలాకాకుండా తాము కదలకుండా, తర్వాతి తరాన్ని కదలనివ్వకుండా చెయ్యడం.





డానీ  ప్రతిస్పందన

1.                ప్రవేశిక
2.                ఒక వివరణ
3.                సాంకేతిక విశ్లేషణ
4.                ఆరోపణలు – ముస్లిం సమాజం మీద
5.                ఆరోపణలు – డానీ వంటివారి మీద
6.                లోకస్ స్టాండీ – సగం ముసల్మాన్
7.                సందర్భం
8.                సంవాదం ఆరంభం
9.                ముస్లిం అస్థిత్వవాదం
10.           ఇస్లాంవాద బాలారిష్టం
11.           మేక-పులివాదాలు
12.           పిర్యాదివాదం
13.           ధార్మికసిధ్ధాంతం  – కర్మకాండ
14.           స్కైబాబా బ్రాండు హేతువాదం
15.           సామ్యవాదం నుండి అస్థిత్వవాదానికి 
16.           గతించిన నాస్తిక-హేతువాదాలు 
17.           ముస్లిం సమాజంలో సంస్కరణలు

సంవాదం ఎలా సాగాలి? ఎలా ముగియాలీ? .

Legal Procedure

మిత్రులారా! ముస్లీంవాదంపై సాగుతున్న చర్చలో ఒక లీగల్ విధానాన్ని పాటిస్తునట్టు మీకు ఈపాటికే అర్ధం అయివుంటుంది.

ఈ కేసులో స్కైబాబా complainant / plaintiff  నేను respondent / Defendant.

1.            ముందు స్కైబాబా  Complainant / Plaintiff గా   కొన్ని నిర్ధిష్ట ఆరోపణలు చేశారు.
2.            ఆ ఆరోపణలు నిరాధారం అని Respondent / Defendantగా నేను వాదిస్తున్నాను; ప్రవేశిక ఒక వ్యాసం సాక్షిలో, కొనసాగింపు సోషల్ మీడియాలో.  ఈ క్రమం ఇంకో వారం సాగినా సాగవచ్చు.
3.            ఆ తరువాత పిర్యాదులో తాను చేసిన నిర్ధిష్ట ఆరోపణల్ని నిరూపించాల్సిన (Burden of Proof) బాధ్యత Complainant / Plaintiff  అయిన స్కైబాబాదీ. వాటిని వారు సాక్షిలోనూ చేయవచ్చు; సోషల్ మీడియాలోనూ చేయవచ్చు.
4.            మళ్ళీ అవి  నిరాధారం అని వాదించే హక్కు Respondent / Defendant గా నాది. ఆ పనిని నేను వీలునుబట్టి సాక్షిలోగానీ, సోషల్ మీడియాలో గానీ చేస్తాను.
5.            అంతటితో వాదిప్రతివాదులు చెరో రెండుసార్లు తమ వాదోపవాద అవకాశాల్ని వాడుకున్నట్టు అవుతుంది. అలా వాదోపవాదాల  పర్వం ముగుస్తుంది. 
6.            ఇక న్యాయమూ ర్తులు తమ  తీర్పు చెపుతారు.
7.            మన కేసులో  నియత న్యాయమూర్తులు లేరు. FB  మిత్రులే న్యాయమూర్తులు. వాళ్ళు కూడా ఒక అవగాహనతో Legal Procedure ను అనుసరిస్తారని ఆశిస్తాను. అలా కాకుండా వచ్చే Comments  ను మనం ఎలాగూ పట్టించుకోము.
8.            స్కైబాబా వద్ద అనేక కొత్త ఆరోపణలు వుండవచ్చు. అవి ఈ కేసు పరిధిలోనికి రావు.  వాటి కోసం వారు భవిష్యత్తులో వేరే కేసు పెట్టుకోవచ్చు.




ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 6
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

లోకస్ స్టాండీ - సగంముసల్మాన్
          సంవాదాన్ని ఆరంభించే ముందు రచయిత లోకస్ స్టాండిని ప్రకటించడం ఒక మంచి సాంప్రదాయం.  మహాకవి గాలిబ్ ఒక సందర్భంలో తన మతవిశ్వాసాన్ని వివరిస్తూ  “ నేను సగం ముసల్మాన్ ను. మద్యం సేవిస్తాను; పందిమాంసం ముట్టను” అన్నాడు. ఈ వివరణ యధాతథంగా ఈ వ్యాసకర్తకు  సరిపోతుంది. 

ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 7
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం


సందర్భం
2007 జూన్  నెలలో  ‘ముస్లీం సాహిత్యంలో కోవర్టుల పుట్టుక’  వ్యాసాన్ని రాశాను. ఆ తరువాత గడిచిన తొమ్మిదేళ్ళలో వారితో సంవాదమేతప్ప సంఘర్షణలేదు. పైగా ముస్లీం సమాజపు వేదికల మీదనేగాక, తెలంగాణ ఉద్యమంలోనూ వారితో సత్సంబంధాలనే కొనసాగించాను.  

        ఆంధ్రజ్యోతి నుండి వారు బయటికి వచ్చినప్పుడు బతకనేర్చినవాళ్ళు యజమాన్యం పక్షం వహించారు. లౌక్యం తెలిసినవాళ్ళు మౌనంగా వుండిపోయారు. నేను ఆ రెండు పనులూ చేయలేదు. ఆంధ్రజ్యోతితో నా అనుబంధాన్ని పక్కన పెట్టి, ఒక విధంగా రిస్క్ కూడా తీసుకుని,  కష్టాల్లోవున్న స్కైబాబాకు సంఘీభావాన్ని తెలుపుతూ నా బ్లాగ్ లో పెద్ద వ్యాసమే రాశాను. అది తనకు గొప్ప నైతిక బలాన్ని ఇచ్చిందని వారు స్వయంగా షుక్రియాలు కూడా తెలిపారు.

          సాన్నిహిత్యం సాఫీగానే సాగుతున్నదనుకుంటున్న దశలో ఇలా హఠాత్తుగా సోషల్ మీడియాలో వారు నా మీద అసందర్భ అవాస్తవ వ్యాఖ్యలు చేయడంతో  దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇప్పుడు ఇలా రాయాల్సిన అవసరం ఏమిటో తనను రెచ్చగొట్టిన తక్షణ అంశం ఏమిటో వివరించమంటూ  చాలా సంయమనంతో అడిగాను. దానికి వారు వివరాలు చెప్పకుండా వ్యాసం రాశారు. ఇమ్మీడియట్ ప్రోవకేషన్ ఏమిటో ఇప్పటికీ వారు చెప్పనప్పటికీ నాకు నెమ్మది మీద అర్ధం అయింది.   

         తెలంగాణ ఉద్యమ నాయక సమితిలో స్కైబాబా ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహించారు.  భవిష్యత్తులో ఏర్పడే తెలంగాణ విషయంపై  2011-12 సంవత్సరాలలో మా మధ్య కొంతకాలం సంవాదం నడిచింది. దాని సారాంశం ఏమంటే :-
  
                నాటి నిజాం వ్యతిరేక పోరాటంలో తొలి అమరుడు బందగీ, చివరి అమరుడు షోయబుల్లా ఖాన్. ఇద్దరూ ముస్లింలే. నాటి కమ్యూనిస్టు పోరాటానికి మేధోసరోవరంలా పనిచేసిన కామ్రేడ్స్ అసోసియేషన్ లోనూ దేవులపల్లి వేంకటేశ్వరరావు వంటి ఒకరిద్దరుతప్ప మిగిలినవాళ్ళందరూ ముస్లింలే. షోయబుల్లా ఖాన్ హత్యను సాకుగా తీసుకునే నిజాం సంస్థానం మీద ఇండియన్ యూనియన్ పోలీస్(సైనిక)చర్య జరిపింది. అయితే, ఆ పోరాటాల నికర ఫలితం ఏమిటీ? పోరాట ఫలాలు ముస్లింలకు దక్కకపోగా, ముస్లింల ఆస్తులు పరాధీనం అయిపోయాయి.  పోలీస్ యాక్షన్ సందర్భంగా వేలాది (బహుశ లక్షలాది) మంది ముస్లింలు ధనమానప్రాణాలను కోల్పోయారు.  నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేశాక నిజాం వ్యతిరేక హిందూసామాజికవర్గం మాత్రమేగాక నిజాం అనుకూల హిందూసామాజికవర్గం సహితం లబ్ది పొందింది. మరోవైపు, నిజాం అనుకూల ముస్లింలు మాత్రమేగాక నిజాం వ్యతిరేక ముస్లీంలు సహితం నష్టపోయారు.

               భావి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సామాజిక దారుణం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్కైబాబాను హెచ్చరించాను. ముస్లింల సంక్షేమానికి హామీగా ఉద్యమ అగ్రనేతలతో ఒక పెద్దమనుషుల ఒప్పందం చేసుకోవాలని సూచించాను. భవిష్యత్తులో ప్రభుత్వాధినేతలకు గుర్తు చేయడానికి పెద్ద మనుషుల ఒప్పందాలు ఒక ఆధారంగా వుంటాయి. కోస్తా, రాయలసీమల మధ్య, ఆంధ్రా, తెలంగాణల మధ్య అలాంటి పెద్ద మనుషుల ఒప్పందాలు వున్నాయి. ఎన్నో అవకాశాలు వున్నప్పటికీ వారు అలాంటి ప్రయత్నం కొంచెమైనా  చేయలేదు. పైగా అలాంటి సూచనలు చేసినందుకు నా ఆంధ్రా ప్రాంతీయతను శంకించారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న టీఆర్ ఎస్ వాగ్దానంతో సంపూర్ణంగా సంతృప్తి  చెందిపోయారు.  

     తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యి రెండేళ్ళు దాటింది. ముస్లిం సమాజపు ఆర్ధిక పురోగతికి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీలేదు. మరో వైపు, టీఆర్ ఎస్ నేతలు గుజరాత్ నరమేధం కిరీటధారి నరేంద్ర మోదీతో పొలిటికల్ హనీమూన్ మొదలెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ వ్యవహారం అటక ఎక్కిందన్న సంకేతాలు వెలువడ్డాయి.    

          ఇలాంటి సందర్భంలో స్కైబాబా తెలంగాణలో ముస్లిం  రిజర్వేషన్ ఉద్యమాన్ని మొదలెట్టి వుండాల్సింది. అది వారి మీదున్న నైతిక బాధ్యత.  దాని ఆధారంగా తెలంగాణ ముస్లింలకు ఎన్నో మేళ్ళు చేయుంచుకునే అవకాశం దక్కేది. వారు ఆ పనీ చేయలేదు.

            వారు చేయాల్సిన పనులు చేయకున్నా ఫరవాలేదు. కానీ, వారు చేయరాని పనులు మూడు చేశారు. మొదటిది, విద్యా, ఉపాధిరంగాల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించమని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో ముస్లిం పిల్లల్ని స్కూళ్ళకు  పంపనివ్వడంలేదని  ముస్లిం ధార్మిక సంస్థ (జమాత్ )ల మీద  విరుచుకుపడ్డారు. రెండోది, తన  నైతికబాధ్యతను గుర్తుచేసి నిలదీస్తానని భయపడి నామీద వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారు. మూడోది, చర్చను రాజకీయార్ధికాంశాల నుండి ధార్మిక అంశాల మీదికి మళ్ళించారు. స్కైబాబా అతితెలివి ఏమంటే తన తప్పుల్ని ఇతరులు ఎత్తి చూపడానికి ముందే వాళ్ళ మీద నిందలువేసి ఆత్మరక్షణలో పడేయడం. ఇదీ వారి ప్రతిపాదన వ్యాసానికి సందర్భం!. ఇమ్మీడియట్ ప్రోవకేషన్!

ప్రతిపాదన వ్యాసంలో వారు ప్రతిపాదించిన  సంస్కరణల జాబితా ఇది : దర్గాలకు వెళ్ళాలి. ఖబ్రస్తాన్లకు వెళ్ళాలి. ఫాతెహాలు చేయాలి. పీర్ల పండుగలు జరపాలి. ఈ నాలుగు హక్కుల మీద అవగాహన కల్పించడానికి సాహిత్యాన్ని సృష్టించాలి. వీటి కోసం ఒక కొత్త మతసంస్థ (జమాత్) ఏర్పాటు చేయాలి.  

స్కైబాబా సంస్కరణల లక్ష్యాలు ఇవే అయితే వారు అసలు ఉద్యమం చేయాల్సిన అవసరమేలేదు. వీటిని ఆచరిస్తున్న జమాత్  లు ఇప్పటికే కొన్ని వున్నాయి. వారు వాటిల్లో చేరవచ్చు. కావాలంటే అలాంటి ఇంకో జమాత్ పెట్టుకోవచ్చు. నిజానికి నేను కూడా వీటిని పాటిస్తాను; కాకపోతే కొంచెం భిన్నంగా. ఇది వైవిధ్యమేగానీ వైరుధ్ధ్యం కాదు. భావోద్వేగమేగానీ భావోద్రేకంకాదు. భిన్నాభిప్రాయమేగానీ వ్యతిరేకాభిప్రాయం కాదు. అయితే టీకప్పులో తుఫానులా వారు ఇంత చిన్న అంశాన్ని పట్టుకుని మొత్తం ముస్లిం సమాజాన్ని సంస్కారహీనంగా చిత్రించి అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బూటకాన్నీ, దాని వెనుక పొంచివున్న ప్రమాదాన్నీ పట్టించుకోవాల్సి వస్తున్నది.

కేవలం స్కైబాబా కోసమేకాక, వారు రాసిన ప్రతిపాదన వ్యాసం కోసమే కాక, ఒక దశాబ్ద కాలంగా వారు రాస్తున్న వ్యాసపరంపరల కోసమేగాక, ముస్లిం సమాజం మీద వారిలా అపవాదులేసే గతకాలపు ఆలోచనాపరులు, వర్తమాన ఆలోచనాపరుల కోసమేగాక  భవిష్యత్తులోనూ ఇలాంటి ఆపవాదులేసే ఆలోచనాపరుల కోసమూ ఈ వ్యాస్యాన్ని రాయాల్సివస్తున్నది. నా వ్యాసాన్ని చదివి స్కైబాబాయో వారిలాంటి మరికొందరో  రాత్రికి రాత్రి మారిపోతారని నేను అనుకోను.

సాహిత్యానికి సన్నివేశాల ద్వార సమాచారాన్ని చేరవేసే అవకాశం, భావోద్వేగాల ద్వార కొన్ని సూచనలు చేసే సౌలభ్యం మాత్రమే వుంటాయిగానీ వాటిని నిర్బంధంగా అమలు చేయించే ఎన్ ఫోర్సింగ్ అధికారం వుండదు.
                                                 
అయితే, ముస్లిమేరత సమూహాల్లోనేగాక  ముస్లిం సమూహాల్లోనూ తమ సంస్కృతీ సాంప్రదాయాల గురించి, వాటి ఆర్ధిక కోణాల గురించీ అవగాహన లేనివాళ్ళు అనేకులు వుంటారు. వాళ్లకు ఈ వ్యాసం సమాచారంగా అయినా పనికి వస్తుంది. నిజానికి ఈ పనిని ఎప్పుడో చేసి వుండాల్సింది. అయితే స్కైబాబా వంటివారు వర్తమాన తెలంగాణ / ఆంధ్రప్రదేశ్  ముస్లిం సమాజంలో చేపట్ట దలచిన సంస్కరణల జాబితా సేకరణ కోసం కొంతకాలం ఆగాల్సి వచ్చింది. వారిప్పుడు జాబితాను ఇచ్చారు కనుక ఇక స్పందించడం నా వంతు అయింది.

రేపు 
స్కైబాబాతో సంవాదం ఆరంభం



ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 8
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

సంవాదం ఆరంభం
ఎదైనా ఒక విషయాన్ని సమర్ధంగా తిరస్కరించినా, సమర్ధించినా అవి వాదాలుగా అభివృధ్ధి అవుతాయి. ఒక విషయాన్ని సమర్ధిస్తూ మొదలెట్టి దాన్ని తిరస్కరిస్తూ ముగించినా, ఒక విషయాన్ని తిరస్కరిస్తూ మొదలెట్టి సమర్ధిస్తూ ముగించినా అది వాదంకాదు. వాదం అవ్వదు.

నాస్తిక-హేతువాద దృక్పధాలతో  విశ్వాసుల్ని ఎద్దేవ చేస్తూ మొదలైన స్కైబాబా వ్యాసం  దర్గాలు, ఖబ్రస్తాన్లకు వెళ్ళే, ఫాతెహాలు చేసే, పీర్ల పండుగలు జరిపే విశ్వాసుల కోసం ఒక కొత్త మతసంస్థ (జమాత్) రావలసిన అవసరాన్ని నొక్కి చెపుతూ ముగిసింది. గణితశాస్త్రంలో ఒకటి నుండి ఒకటి తీసేస్తే వచ్చే విలువే మేధోరంగంలో  స్కైబాబా వ్యాసానికి వుంటుంది. ఒకటి నుండి ఒకటి తీసేస్తే వచ్చే విలువ సున్నా అని తెలియనివాళ్ళు కూడా వుంటారని అనుకోలేం. క్రీడారంగంలో దీన్ని సెల్ఫ్ గోల్ అంటారు.

ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 9
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

ముస్లిం అస్థిత్వవాదం
అస్థిత్వం అంటే ఆర్ధికం. ఉద్యమం అంటే రాజకీయం. ఆస్థి లేకుండా ఆత్మగౌరవం వుండదు. ఏ అస్థిత్వవాద ఉద్యమమైనాసరే స్వీయసమాజపు ఆర్ధిక స్థితిగతుల్ని మెరుగు పరచుకోవడానికి  రాజకీయ చర్యను చేపడుతుంది. తెలంగాణ వుద్యమం ‘నీళ్ళు, నిధులు నియామకాలు’ అనే మూడు ఆర్ధిక లక్ష్యాలను ముందుకు తెచ్చింది. వాటిని సాధించడానికి చేపట్టిన  ఉద్యమంలో స్వీయసామాజిక సముదాయాన్ని కదలించడానికి ఆత్మగౌరవ నినాదాన్ని  ఇచ్చింది. ఆంధ్రా ప్రాంతపువారి వలసపాలన, ఆధిపత్యం, అణచివేతల కారణంగా తెలంగాణ ప్రజలు రాజకీయార్ధిక రంగాల్లో వెనుకబడిపోయారనే అవగాహన ఈ ఉద్యమానికి పునాది. అంతేతప్ప, తెలంగాణ ప్రజల వెనకబాటుతనానికి వాళ్ళు అంతర్గతంగా అనుసరిస్తున్న సాంస్కృతిక సాంప్రదాయాలే కారణం అని తెలంగాణ ఉద్యమ నాయకులు  ఎవరూ అనలేదు. అనకూడదు కూడా. కానీ ముస్లిం సమాజపు వెనకబాటుతనానికి వాళ్ళు అంతర్గతంగా అనుసరిస్తున్న సాంస్కృతిక సాంప్రదాయాలు కారణం అని స్కైబాబా అనగలరు. అస్థిత్వవాద ఉద్యమ  నియమాల గురించి వారికి కనీస అవగాహన కూడా లేదు.

భారత ముస్లిం సమాజ విముక్తి  సిధ్ధాంతమే ముస్లింవాదం. ఇది ఎంతమాత్రం ధార్మికవాదంకాదు; నూటికి నూటొక్కపాళ్ళు రాజకీయార్ధికవాదం. సహజ వనరుల్లోనూ, సామాజిక  వ్యవస్థల్లోనూ  ముస్లింలకు న్యాయమైన ప్రాతినిధ్యాన్ని సాధించడమే దీని కర్తవ్యం. దాని కోసం అది పాలకవర్గాలతో తలపడుతుంది. ప్రాణాలొడ్డి పోరాడుతుంది. ముస్లిం సమాజానికి ముస్లింవాదం తాత్విక ఆయుధం అయితే  ముస్లింవాదానికి ముస్లిం సమాజం భౌతిక ఆయుధం.

ఇంతకీ ముస్లింలు అంటే ఎవరూ? అనేది ఇక్కడ ప్రాణప్రదమైన అంశం. ఇస్లాం అనేది ఒక మతం.  దాన్ని ఆచరించేవాళ్ళు ముస్లింలు. ఇస్లాం అనేది ధార్మిక  ప్రత్యయం.  ముస్లిం అనేది సామాజిక ప్రత్యయం. ఇవి రెండూ అవిభాజ్యాలు. ఇస్లాంమతరహిత ముస్లింలు,. క్రైస్తవమతరహిత క్రైస్తవులూ, హిందూమతరహిత హిందూమతస్తులు వుండరు. అయితే, సమాజంలో మతవ్యతిరేక సమూహాలు కూడా కొన్ని వుంటాయి. వాళ్ళు నాస్తికులు, హేతువాదులు తదితర పేర్లతో కొనసాగుతుంటారు. వాళ్ళు మత సమూహాలకు బయట వుంటారు లేదా ఇంకో కొత్త మతంగా ఏర్పడుతారు.   

బాబ్రీ మసీద్ కూల్చివేత నేపథ్యంలో ముస్లిం పదాన్ని తద్వార ముస్లింవాదాన్నీ నిర్వచించాల్సిన అవసరం ముస్లిం ఆలోచనాపరుల ముందుకు వచ్చింది. అప్పట్లో అనేక సభల్లో నేను నా పధ్దతిలో ముస్లిం పదాన్నీ, ముస్లింవాదాన్నీ నిర్వచించాను. నా నిర్వచనం ప్రస్తావన  1994 (?) నాటి ‘అలావా’ కవితాసంకలనం ముందుమాటలో వుంది.

ముస్లింవాదం అనే పదప్రయోగాన్ని ముందుగా ఎవరు వాడారూ? అన్నది ఇప్పుడు చర్చకాదు. ముస్లింవాద నిర్వచనమే ఇక్కడ ప్రధాన అంశం. పదాన్ని నేనే ముందుగా వాడాను అనిగానీ, అవగాహనను నేనే ముందుగా నిర్వచించాననిగానీ నేను అనుకోవడంలేదు. రకమైన పోటీకి నేను దూరం. ఇలాంటి విషయాలని సాహిత్య పరిశోధకులో సమాజశాస్త్ర పరిశోధకులో తేలుస్తారు. బాధ్యతను నేను తీసుకోదలచలేదు.

“ముస్లిం సమూహాన్ని ముస్లింలు అని వ్యవహరిస్తున్నాం” అంటూ స్కైబాబా ఒక నిర్వచనం ఇచ్చారు. (పిడివాదాలు, ముడివాదాలు వద్దు, ముస్లిం సాహిత్యంపై చర్చ-2 వార్త దినపత్రిక, 18-11-2007). ఇంతటి అపహాస్యపు నిర్వచనాన్ని స్కైబాబా  మాత్రమే చేయగలరు. ఒక పదాన్నో, ఒక కాన్సెప్ట్ నో నిర్వచిస్తున్నపుడు ఆ పదాన్ని వాడడం నిషిధ్ధమనే కనీసపు నియమం కూడా వారికి తెలీదు. ముస్లిం పదాన్నే నిర్వచించడం చేతకానివాళ్ళు ముస్లింవాదాన్ని ముందుకు తీసుకుపోతున్నామంటూ గొప్పలు చెప్పుకోవడంకన్నా హాస్యాస్పదమైనది మరొకటి వుండదు.

వారు అంతటితో ఆగలేదు. నా నిర్వచనాన్ని మతపరిభాషగా పేర్కొన్నారు. అప్పుడు ఆయన మతప్రస్తావన లేకుండానే ముస్లింలను నిర్వచించి వుండాల్సింది. వారు ఆపనిని గత రెండు దశాబ్దాల్లో చేయలేదు; ఇకముందూ చేయలేరు. మత అల్పసంఖ్యాక (మైనారిటీ) వాదం అనాలన్నా, ముస్లీంవాదం అనాలన్నా  మతప్రస్తావన తప్పదు. దాన్ని వ్యతిరేకించాల్సిన పనీ లేదు.           

“ముస్లింలు అంటే ఇస్లాంను అనుసరించేవాళ్ళు. అయితే, ముస్లింవాద కార్యక్షేత్రం ధార్మికరంగంకాదు. సామాజిక, రాజకీయార్ధిక రంగాల్లో మాత్రమే అది పనిచేస్తుంది” అని ప్రకటించి ఎవరయినా ఈ సమస్యను చాలా సులువుగా పరిష్కారం చేసుకోవచ్చు. అలాంటి పరిష్కారాలకు  స్కైబాబా సిధ్ధంగాలేరు. నిర్వచనం దగ్గర వారు ధార్మిక కోణాన్ని నిరాకరిస్తారుకానీ మొత్తం కార్యాచరణను ధార్మిక రంగం మీదే కేంద్రీకరిస్తారు. తాత్వికరంగంలో వారిది కుప్పిగంతుల వ్యవహారం.

ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 10
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

ఇస్లాంవాద బాలారిష్టం

స్కైబాబా వంటివారికి పోటీగా అన్నట్టు అప్పట్లో కరీముల్లావంటి కొందరు కవులు ఇస్లాంవాదం అంటూ  కొంత హడావిడి చేశారు. ఇదొక అతివాద బాలారిష్టం.  తప్పుకు తప్పు ఎప్పుడూ ఒప్పు అవ్వదు. స్కైబాబాది మితవాదం అయితే కరీముల్లాది అతివాదం. రెండు వాదాలూ భారత ముస్లిం సమాజానికి చేటు చేస్తాయి. తరువాతి కాలంలో  కరీముల్లా కూడా తన తప్పుని సరిదిద్దుకుని ఇస్లాంవాదం అనే ప్రయోగాన్ని ఉపసంహరించుకున్నారుకనుక ఆ ఘట్టం ముగిసింది అనుకోవచ్చు.  ఇప్పుడు వారు ప్రగతిశీల ముస్లీం సాహిత్యోద్యమాన్ని నిర్వహిస్తున్నారు.  


ముస్లింవాదం పోరాడేది ఇతర ప్రజాసమూహాల ధార్మిక విశ్వాసాలతో కానేకాదు. మతం నెపంతో రాజకీయార్ధిక రంగాల్లో  ముస్లిం సమాజాన్ని అణిచివేస్తున్న శక్తులతో మాత్రమే ముస్లింవాదం పోరాడుతుంది.  భక్తులు, విశ్వాసులు ఏ మతసమూహానికి చెందినవారైనాసరే వారితో  ముస్లింవాదానికి ఏ స్థాయిలోనూ వివాదంలేదు. భక్తులు, విశ్వాసులు సున్నిత మనస్కులు, అమాయకులు. వాళ్ళల్లో అత్యధికులు నిస్సహాయులు. ఇతర మతస్తుల విశ్వాస చిహ్నాలను మనం కూడా గౌరవించాలి. మతం, మతవిశ్వాసాలు  వేరు; మతవాదం మతతత్త్వంవేరని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మతం ధార్మికం; మతతత్త్వం రాజకీయార్ధికం. మనం తలపడేది మతతత్త్వంతోనే.

నా వ్యాస పరంపర మరో వారం రోజ్లు సాగుతుంది.

రేపు
మేక-పులివాదాలు


ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 11
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

మేక-పులివాదాలు
               అడవుల్లో పులులుమేకల గుంపులు సహజీవనం చేస్తుంటాయి. వాటి మధ్యవైరమూ కొనసాగుతూ వుంటుంది.  మేకల్ని తినేసే అవకాశం పులులకు సహజంగా వున్నట్టు,పులుల్ని తినేసే అవకాశం మేకలకు సాధారణంగా వుండదు.

కాళ్ళకు గోళ్ళుదవడలకు కోరలు, తినడానికి మాంసం లేక బక్కచిక్కిన జీవాలు కూడాపులుల గుంపులో కొన్ని వుంటాయి. అంతమాత్రాన పులుల గుంపు అడవి మీద అధికారాన్ని కోల్పోదు. అలాగే బాగా బలిసిన జీవాలు కూడా మేకలగుంపులో కొన్ని వుంటాయిఅంతమాత్రాన మేకలగుంపుకు అడవి మీద అధికారం దక్కదు.

           పులులే అధికారంలో వుంటాయికనుక పులులదే అడవి అనే అభిప్రాయమే బలంగా ప్రచారంలో వుంటుంది. తమను తినే పులులు బతుకుతున్నాయన్న మేకల ఆక్రందనలు పులుల గాండ్రింపుల మధ్య బయటికి వినిపించవు.

తాము మేకల్ని తినడం ప్రకృతి ధర్మం అని పులుల గుంపు అంటుంది. ఇది పులులవాదం. పులుల నుండి తమకు రక్షణ కావాలని మేకల గుంపు అంటుంది. అది మేకలవాదం. పులులది దాడివాదం. మేకలది ఆత్మరక్షణవాదం.

మేకల మీద దాడిచేసి తింటున్నపుడు పులులు మౌనంగా వుంటాయి. మేకలు మాత్రం ప్రాణ భయంతో గావు కేకలు పెడుతుంటాయి. ఇది పులుల గుంపుకు శబ్దకాలుష్యంలా వుంటుంది. జపాన్ తరహాలో మేకలు శబ్దం లేకుండా నిరసన తెలపాలని పులులు ఆదేశిస్తుంటాయి.

పులులు ప్రజాస్వామ్యబధ్ధంగా అడవిలో ఎన్నికలు కూడా  నిర్వహిస్తుంటాయి. మేకలకు కూడా ఎన్నికల్లో పోటే చేసే స్వేఛ్ఛ ఇస్తాయి. అయితే  మేకవాదం చేసే మేకలు ఎన్నికల్లో ఓడిపోతుంటాయి. పులివాదం చేసే పులులు గెలుస్తుంటాయి. వాటితోపాటూ పులివాదం చేసే కొన్ని మేకలు కూడా గెలుస్తుంటాయి. అలా గెలిచిన మేకలు వీలున్నప్పుడెల్లా పులుల ఔదార్యం గురించి మాట్లాడుతుంటాయి.

అడవిలో అధికార మాధ్యమాలన్నీ పులుల చేతుల్లోనే వుంటాయి.   మేకలు కూడా తమ లాగ  ప్రశాంతంగా జీవించాలని  ఆ మాధ్యమాల్లో మేధోపులులు హితోక్తులు పలుకుతుంటాయి. పులి మీసాలు ఎంతో గంభీరంగా వుంటాయనీ మేకల గడ్డాలు పరమ చికాకుగా వుంటాయని అవి ఒకేసారి ఆత్మస్తుతి  పరనింద చేస్తుంటాయి.

కొన్ని పులులు ఇంకో అడుగు ముందుకేసి మేకలకు కొత్తగా కొమ్ములు పుట్టుకొస్తున్నాయనీ ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. కొత్తగా వచ్చిన కొమ్ములతో మేకలు  తమ  మీద దాడులు చేస్తున్నాయని సోషల్ మీడియాలో వింత  ఆరోపణలు చేస్తుంటాయి. పులులే పెట్టుకున్న రక్షణ వ్యవస్థ మేకలకు శాంతివచనాలు వల్లిస్తూ, పులులకు భద్రత కల్పిస్తూ వుంటుంది. మేకలు పళ్ళు కొరుకుతున్నాయనో,  గిట్టల్ని పదును పెడుతున్నాయనో మేకల గుంపుల మీద పులులు తరచూ తనీఖీలు జరుపుతుంటాయి. కార్డన్  అండ్ సెర్చ్!

పులుల గుంపులోనూ సమవర్తి పులులుంటాయి. అవి పులుల్ని మేకల్ని సమానంగా చూస్తాయి. పులులు మేకల మధ్య పోటీల్ని కామన్ కండీషన్లతో నిర్వహించాలంటాయి. పోటీలో పాల్గొనే పులులకు కొమ్ములు లేనపుడు మేకలకు కూడా కొమ్ములు వుండకూడదంటాయి.  మేకల కొమ్ముల్ని విరిచేసినపుడే సమన్యాయం సాధ్యం అవుతుంది అంటాయి. రెండు గుంపులకు సమన్యాయం ఇచ్చినావాటితో సమదూరం పాటించినా కొన్నాళ్ళకు అడవిలో మేకలుఅంతరించిపోయి పులులు మాత్రమే మిగులుతాయనీ ఈ సమవర్తి పులులకు కూడా తెలుసు. పోటీలో మేకలు ఓడిపోతున్నాయంటే మేకవాదం ఓడిపోయినట్టేనని ఇవి తీర్పులు చెపుతుంటాయి.   

టవీ సంపదను, అధికారాన్నీ పులులు మేకలకు సమానంగా కాకపోయినా జనాభా దామాషా ప్రకారం అయినా పంచుదామన్న ప్రతిపాదన ముందుకు రాగానే ఈ సమవర్తి పులులు పారిపోయిరాతియుగపు గుహల్లో దాక్కుంటాయి.   పులులు నిజంగానే  తినేయాలనుకుంటే అడవిలో ఒక్క మేక అయినా  మిగులుద్దా? అని ఆ గుహల్లో నిలబడి హూంకరిస్తాయి. అడవిలో ఇంకా మేకలు బతికి గడ్డి మేయగలుగుతున్నాయంటే అది  పులుల దయాగుణం వల్లనే అంటూ దర్పం ఒలకబోస్తాయి.

అడవిలోని న్యాయస్థానాల్లో పులులే న్యాయమూర్తులుగా వుంటాయి. అవి చాలా ధర్మబధ్ధంగా పులి న్యాయాన్ని ఆచరిస్తుంటాయి. మేక నిందుతుల్ని కఠినాతికఠినంగా శిక్షీస్తూ, పులి నిందితుల్ని ఉదరాతిఉదారంగా నిర్దోషులంటూ వదిలేస్తూ వుంటాయి. 

పులుల గుంపులో దయాగుణంగల పులులు, ఉదారవాద పులులు కూడా వుంటాయి.  పులివాదంతో విభేధించే పులుల్ని అసమ్మతి పులులంటారు. ఇవి పులివాదాన్ని ఖండిస్తాయి.  వీటిల్లో కొన్ని పులులు మేకలపక్షం వహిస్తాయి. మేకల కోసం సాటి పులులతో నిజాయితీగా పోరాడుతాయి. ఆ పోరాటంలో కొన్ని సందర్భాల్లో ప్రాణాల్ని సహితం కోల్పోతాయి. అవి పుణ్యపులులు. అలాంటి పులుల్ని మేకలు  కూడా సదా స్మరిస్తూ వుంటాయి.

మేకలగుంపులోనూ అతివాద మేకలు, మితవాద మేకలు, మేకవాదంతో విభేధించే మేకలు కొన్ని వుంటాయి. అయితే, పులివాదంతో విభేధీంచే పులుల్ని అసమ్మతిపులులు అన్నట్టు, మేకవాదంతో విభేదించే మేకల్ని అసమ్మతిమేకలు అనరు; మేకద్రోహులు అంటారు.  ఎందుకంటే పులులది పీడకజాతి; మేకలది పీడిత జాతి. మానవ సమాజంలో అయినా  జంతు ప్రపంచంలో అయినా  ఏది పీడక జాతి, ఏది పీడిత జాతీ అనేది తేల్చుకోవడమే ముఖ్యం. 


పుణ్య పులుల కోసం మేకలు స్మారక స్తూపాలు కడుతాయి. కొంత కాలానికి పులులు కూడా అక్కడికి వచ్చి అమరవీర పులులకు నివాళులు అర్పించడం మొదలు పెడతాయి. పుణ్య  పులుల కీర్తిని తమ ఖాతాలో వేసుకుంటాయి.  అసమ్మతి మేకలకు మేకలు గుంపు ఎలాగూ స్మారక స్తూపాలు కట్టదు. పులులు కూడా అసమ్మతి మేకల్ని ఎన్నడూ తలుచుకోవు. పాపం అసమ్మతి మేకల ప్రభుసేవ అలా ఎవరికీ చెందక కాలగర్భంలో కలిసిపోతుంది. 

ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 12
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

పిర్యాదివాదం

స్కైబాబాకు దృగ్విషయాల మీద సైధ్ధాంతిక అవగాహనలేదు. సమాజశాస్త్రంలో ఒక సిధ్ధాంత వ్యాసం రాసే స్తోమత వారికి ఎన్నడూ లేదు. ప్రాధమిక అనుభవాల డేటా (ముడిసమాచారం)ను పిర్యాదుల రూపంలో ఏకరువు పెట్టగలరుగానీ వాటి నుండి ఒక సూత్రీకరణ  చేయడం అనేది వారి శక్తికి మించిన పని. ఎంతగా జూమ్ చేసి చూసినా కూడా సిధాంత స్థాయిగల వాక్యం ఒక్కటి కూడా వారి రచనల్లో కనిపించదు. అయన పిర్యాదివాది. ఇతరుల్లో తప్పుల్ని వెతకడంతప్ప పిర్యాదివాదులకు స్వంతవాదన వుండదు. వాళ్ళు తరచుగా తమ తప్పుల్నే ఇతరుల తప్పులుగా చిత్రీకరించడానికి తంటాలు పడుతుంటారు.

సిధ్ధాంత వ్యాసాలు అనుకుని స్కైబాబా చేసే రచనలు  అర్ధనిరక్షరాశ్యులు పోలీసు స్టేషన్లలో రాసి ఇచ్చే పిర్యాదుల్ని తలపిస్తాయి.  ఒక చారిత్రక సందర్భంలో ఒక సవాలుగా తీసుకుని, శక్తులన్నీ ధారబోసి రాసినప్పటికీ డొల్లతనాన్ని పోగొట్టుకోని ఈ  వ్యాసమే  దానికి సజీవ సాక్ష్యం. ఈ పదమూడు వాక్యాల చిన్న వ్యాసంలోనే ఇన్ని పరస్పర విరుధ్ధమైన అంశాలు రాసి, కుప్పిగంతులు వేస్తే దాన్ని మేధోదారిద్ర్యం అనికాక మరేమంటారూ?

ముస్లిం అస్థిత్వవాదానికి అంతర్గత చేటు - 13
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం

ధార్మికసిధ్ధాంతం  – కర్మకాండ

ముస్లిం సమాజంలోని జమాత్ ల గురించి తెలియని వారికి ఛాందసవాదం మీద స్కైబాబా భీకర పోరాటం చేస్తున్నారనే అభిప్రాయం కలగవచ్చు. బయటి సమాజాల్లో అలాంటి అభిప్రాయాన్ని కలిగించడానికి వారు శతవిధాలా తంటాలు పడుతుంటారు.

మతసమూహాలు అన్నింటిలోనూ  ధార్మికసిధ్ధాంతం (డాక్ట్రిన్ ) – కర్మకాండ (రిచువల్స్) అనే రెండు దొంతరలు వుంటాయి. ఇస్లాం అనేది ఏకేశ్వరోపాసన మతం కనుక ముస్లిం సమాజంలో ధార్మిక సిధ్ధాంతం మేరకు పెద్దగా వైవిధ్యం లేదు.

 అయితే,  ప్రతిదేశంలోనూ, ఆయా దేశాల్లోని ప్రతి ప్రాంతంలోనూ విశ్వాసులు స్థానికంగా పాటించే కర్మకాండల విషయంలో ముస్లింసమాజంలో అపార వైవిధ్యం వుంటుంది. వీటి ఆధారంగా అనేక జమాత్ లు పుట్టుకొస్తుంటాయి. జమాత్ లను మతసంస్థలు అనలేంగానీ మతఉపశాఖలు అనవచ్చు. కొద్దిపాటి వైవిధ్యంతో ప్రతి జమాత్ కొన్ని ప్రత్యేకమయిన  కర్మకాండల్ని పాటిస్తూ వుంటుంది. ఇలాంటి మతఉపశాఖలు (డినామినేషన్స్)  ఇతర మతసమూహాల్లోనూ వుంటాయి.

ముస్లిం సమాజంలో ప్రస్తుతం అసంఖ్యాక జమాతులు వున్నాయి. వాటిమధ్య తరచూ కర్మకాండల విషయంలో వాదోపవాదాలు జరుగుతూనే వుంటాయి. వీటిల్లో అతివాదాలు, మితవాదాలు, మధ్యేవాదాలు, ఉదారవాదాలు, ఆచరణాత్మకవాదాలు వగయిరాలన్నీ వుంటాయి. ఇవి సూక్ష్మ అంశాల నుండి సంక్లిష్టమైన అంశాల వరకు ముస్లింలు అనుసరించాల్సిన విధానాల్ని చర్చిస్తుంటాయి.

అయితే, ఇటీవలి కాలంలో  జమాతుల మధ్య వివాదాలు చాలా వరకు  తగ్గిపోయాయి. స్థానిక కర్మకాండల మంచిచెడుల గురించి చర్చించడం కూడా తగ్గిపోయింది. కర్మకాండల వ్యవహారాన్ని స్థానిక విశ్వాసుల ఇష్టాఇష్టాలకు వదిలివేయడమే మంచిదని జమాతులు భావిస్తున్నాయి. వీటిలో,  దర్గాలు, ఖబ్రస్తాన్లకు వెళ్ళేవారు, ఫాతెహాలు ఇచ్చేవారు, పీర్ల పండుగ చేసేవారు సభ్యులుగా వుండే జమాత్ లు కూడా వున్నాయి. అవన్నీ ముస్లిం సమాజంలో సమాన భాగస్వాములే.  

8 comments:

  1. అద్భుతమైన వ్యాసం. మరిన్ని వ్యాసాల కోసం ఎదురుచూస్తున్నాను. పనిలో పనిగా, ఈమధ్య మేధావుల ముసుగులో religious profiling చాలా తెలివిగా చేస్తున్నవారు ముందుకు వస్తున్నారు. ముస్లింలలో సంస్కరణల గురించి మాట్లాడుతూ ఈ ప్రొఫైలింగ్ జరుగుతోంది. ఈ విషయమై కూడా మీ వ్యాసాల్లో స్పర్శిస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. Thank you for the complement and suggestion

    ReplyDelete
  3. Great article sir... love to read more from you

    ReplyDelete
  4. మతాన్ని విమర్శించే వ్యాసాలు ప్రచురించడం చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం. పాఠకుల మనోభావాల్ని గాయపరిచారనే అపవాదుతోపాటు కోర్టుకేసుల్ని కూడా ఎదుర్కోవలసి రావచ్చు. కానీ ఓ మినహాయింపు ఏమిటంటే, రచయిత కూడా అదేమతానికి చెందిన వాడై, అతని మతాన్ని అతనే విమర్శించుకుంటే ఈ రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది. పైగా, మతాన్ని ఉద్దరించాలనే సదుద్దేశంతో ప్రచురించామని ఫోజు కూడా కొట్టొచ్చు. ఇక ఆ రచయితకు కూడా సంస్కరణవాదిగా, అభ్యుదయవాదిగా బోలెడాన్ని లైకులు, అవార్డులూ, రివార్డులూ కూడా రావచ్చు. ఆ విమర్శలో అసలు విషయం ఎంత అనే అంశం అంతగా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే, రాసింది ఆ మతం వ్యక్తే కాబట్టి అదంతా నిజమే అయ్యుండొచ్చులే అని ఓ నిర్ధారణకు వచ్చేస్తారు.
    ఎవరైనా తన మతాన్ని తాను విమర్శించుకోవడాన్ని చదవడంలో మాంచి కిక్ ఉంటుంది. మా మతం మంచిదని ఎవరైనా రాసుకుంటే, అది చదవడంలో ఆ కిక్ ఉండదు. బహుశా సాక్షి మీ వ్యాసాన్ని ప్రచురించక పోవడానికి ఇది కూడా ఓ కారణమేమోనని నా అణుమానం.

    లైకులు, అవార్డుల్ని దృష్టిలో పెట్టుకుని 'అలాంటి' వ్యాసం రాసిఉంటే, ఆయనకు నా అభినందనలు.
    కానీ, ఇస్లాం ని, ముస్లింలనీ ఉద్దరించాలని రాసుంటే మాత్రం, వారికి ప్రగాడ సానుభూతి. ఎందుకంటే, ముస్లింలకు సంబంధించినంతవరకు- సృష్టికర్త పంపిన గ్రంధం ఖురాన్, ప్రవక్త బోధనలూ వీటి తర్వాతే ఇంకేదైనా. ఎవరైనా మతం గురించి చెప్పాలనుకుంటే, వీటి ఆధారంగానే చెప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా, ఖురాన్ ని పక్కన పెట్టి రండి, నేను మీకు ~గ్నానోదయం కలిగిస్తానంటే, ముస్లింలు ఎవ్వరూ రారు. ముస్లిం సాంప్రదాయాల్ని గుడ్డిగా విమర్శించే వాల్లు చెబితే అసలుకే వినరు. వాల్లకి కేవలం టైం వేస్ట్ తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.

    బై.ది.వే. గతంలో ఈ బ్లాగ్లోనే మీరు ఇస్లాం-కమ్యూనిజం ల సారూప్యతల గురించి రాసిన గొప్ప వ్యాసం నాకు ఇంకా గుర్తుంది. మీరు ఉదహరించిన "శ్రామికుడి చమట చుక్క ఆరక ముందే, అతని కూలీ డబ్బుని చెల్లించండి", "ప్రళయ దినం నాడు నేను పీడిత వ్యక్తి తరుపున వాదిస్తాను" వంటి ప్రవక్త సూక్తులు, కూడా నాకు బాగా గుర్తున్నాయి. మీకు, రాసే అంశం పైన లోతైన అవగాహన ఉందని వీటి ద్వారా అర్థమవుతంది. Keep it up, Sir.

    ReplyDelete
  5. Thank you. I have decided to bell the cat.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. పిల్లి మెడలో గంట కట్టే పని ఎలాగూ పెట్టుకున్నారు.. అభినందనలు. పులిమేక న్యాయం చాలా బాగుంది. మేకల కొమ్ములపై చర్చలు జరుగుతాయే కాని, పులుల గోళ్ళపై, కోరలపై చర్చలు జరగవు. మేకల పళ్లూడి నోట్లో రక్తం కనబడితే, ఆ రక్తం ఎక్కడిదన్న విచారణలు, పరిశోధనలు జరగొచ్చు కాని, పులుల నోట్లో రక్తం సహజలక్షణం. సమాజంలో పులులు, మేకలు ఎప్పుడు ఉంటాయి. అద్భుతమైన పంక్తులు. సమాజశాస్త్రం మరోసారి చదివించారు.

    ReplyDelete
  8. పులి-మేక అనాలజీ అద్భుతం. మేక ద్రోహులను మేల్కొలిపేలా చాలా చక్కగా వివరించారు.
    -మహమ్మద్ హనీఫ్.

    ReplyDelete