Thursday, 18 August 2016

మా నాన్నేనాకు వస్తాద్ !

మా నాన్నేనాకు వస్తాద్ !

నాకు చిన్నప్పుడే ఆస్తమా లక్షణాలు కనిపించాయి. చీకటి పడితే ఊపిరి ఆడేదికాదు. మాట ముద్దముద్దగా వచ్చేది.   చుట్టకాల్చి వాతపెట్టడం వంటి నాటు వైద్యాలు అప్పట్లో వుండేవి. అలా చేయడం మానాన్నకు ఇష్టంలేదు. ఆయనకు వ్యాయామం వచ్చు.  నాకు వ్యాయామం నేర్పేవారు. దానితో మా దాయాదులతోపాటూ మూడు వీధుల పిల్లలు కూడా వచ్చి చేరేవారు. అలా అప్పట్లో చిన్న వ్యాయామశాల మా ఇంట్లో నడిచింది. ఆ తరువాత ఆయనే మాకందరికీ గోదాట్లోనో, కాలవలోనో ఈత నేర్పేవారు. ఇవన్నీ సూర్యోదయానికి ముందే పూర్తి చేసేసేవాళ్ళం.


ఇప్పుడయితే వ్యాయామాల్లో చాలా రకాలు వచ్చాయిగానీ అప్పట్లో బస్కీలు, గుంజీలు, దండీలు మాత్రమే మాకు తెలుసు. వెయిట్ లిఫ్టర్లది వేరే విభాగం.  మాది బాడీ బిల్డర్ల విభాగంలో కింది తరగతి.  ఒక్కోసారి కాలేజీ గ్రౌండ్ కు వెళ్ళి బార్ మీద కొన్ని కసరత్తులు చేసేవాళ్ళం.


మా పూర్వికులకు మేలుజాతి గుర్రాలు, గుర్రాలశాల కూడా వుండేది. మా నాన్నకు గుర్రపుస్వారీ, కర్రసాము కూడా వచ్చు. నాకూ కొంచెం నేర్పారు. అయితే నేను శిక్షణ పొందిన గుర్రాలు మేలుజాతి గుర్రాలేమీకావు. మా వెనుక దొడ్లో వుండే నాటుజాతి  జట్కా గుర్రాలు. వాటిలో నాకు ప్రావీణ్యం అబ్బలేదుగానీ ఈత, వ్యాయామం మాత్రం నేర్చుకున్నాను.


గుర్రం కొనాలనే సరదా నాకు పెద్దయ్యాక కూడా వుండేది. నంద్యాల పరిసరాల్లో 1980 ప్రాంతంలో వెయ్యి,  పదిహేను వందలకు కూడా నాటుగుర్రాలు అమ్మేవారు. కొనాలని చాలాసరదా పడేవాడ్ని. బేరసారాలు కూడా సాగించాను. వాటిని తెచ్చుకుని విజయవాడలో ఎక్కడ పెంచాలో, ఎక్కడ స్వారీ చేయాలో అర్ధం అయ్యేదికాదు. అలా ఆ కోరిక నెరవేరలేదు. మోళీ చేసేవాళ్ళ పిల్లలు వీధుల్లో గుర్రాల మీద పోతూ కనిపించినపుడు  ఈమాత్రం కోరిక నెరవేర్చుకోలేక పోయానని చాలా దిగులుగా అసూయాగా వుంటుంది.


మన శరీర ఆకృతీ, నిర్మితీ మన పూర్వికుల నుండి మనకు సంక్రమించినట్టు, వాళ్లకు వచ్చిన జబ్బులు కూడా మనకు సంక్రమించే అవకాశాలుంటాయి. ఆవిధంగా, మనం పుట్టినపుడే మన శరీరం ఏఏ జబ్బులకు అనుకూలమైనదో (susceptible) నిర్ణయం అయిపోతుంది. దీనినే వైద్య పరిభాషలో హెల్త్ హిస్టరీ అంటారు. ఈ జబ్బులకు కారకమైన క్రిములు, వాతావరణం మన శరీరంలో  నిద్రావస్థలో వుంటాయని దాని అర్ధం. అవి పెరిగి క్రియాశీలంగా మారకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వుండాలి. అదే ఆరోగ్య యాజమాన్యం అంటే. మనం ఏమరుపాటుగా వుంటే అవి రెచ్చిపోతాయి.  మనం విషాదంలో వున్నప్పుడు శరీరాన్ని, ఆరోగ్య యాజమాన్యాన్నీ నిర్లక్ష్యంచేస్తాం. ఒక్కోసారి అది సరిదిద్దుకోలేని తప్పుగా మారవచ్చు.


అస్తమా రోగులు రాత్రుళ్ళు ఆరుబయట గాలిలో తిరగరాదు. దుమ్మూ ధూళీకి దూరంగా వుండాలి. ఘాటు వాసనలు పీల్చరాదు. ఫర్ వుండే జంతువులను దగ్గరకు తీసుకోరాదు. సెకండ్ షో సినిమాలకు వెళ్లరాదు. క్లోజ్డ్ డోర్లు వున్న బార్లలో మందు కొట్ట కూడదు. సిగరెట్టుపొగకు ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తవచ్చు.  ఇలా మరికొన్ని జాగ్రత్తలున్నాయి.


ఆరోగ్యానికి సంబంధించి నేను చేసిన ప్రధాన తప్పు సిగరెట్లు కాల్చడం. కాలేజీలో ప్రవేశించింది మొదలు దాదాపు నలభై యేళ్ళు సిగరెట్ కాల్చాను.  దాని ప్రభావం 2008లో బయట పడింది. 25 శాతం ఊపిరితిత్తులు పనిచేయడం లేదన్నారు. నిజానికి అప్పటికి మూడేళ్ల క్రితమే ఇంకో ఆరోగ్యజాగ్రత్తగా నేను సిగరెట్టు మానేశాను. అలా మానకుండావుండివుంటే 2008 కన్నా ముందే నా పని అయిపోయివుండేదట. అదో యాధృఛ్ఛికం.


బస్కీలు తీయడానికీ, దండీలు తీయడానికీ మానాన్న అప్పట్లో నాకు ఇచ్చిన రైల్వే పట్టా ముక్కలు, రాడ్డు; ట్రక్కు కింగ్ పిన్ లు ఇప్పటికీ జాగ్రత్తగా వున్నాయి. మానాన్న  కంపెనీ డిజైన్ద్ రెడీమేడ్‍ పరికరాలు కొనేవారుకాదు. స్వంతంగా తయారు చేసేవారు.  మెకానికల్ ఇంజినీరింగులో  వారికి అపార పరిజ్ఞానం వుండేది. బహుశ ఆయన అలవాటు  మా పెద్దాడికి వచ్చినట్టుంది. వాడూ అంతే పరికరాలను స్వంతంగా డిజైన్ చేస్తాడు. అయితే మానాన్నది మెకానికల్ రంగం; మా పెద్దాడిది ఎలక్ట్రానిక్స్ రంగం.


క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటు లేదుగానీ సమస్యలు ముంచుకొచ్చి, శరీరం బలహీనపడుతున్నదని అనుకున్నప్పుడు మాత్రం తక్షణం వ్యాయామం చేస్తాను. అయితే  జిమ్ముకూ వెళ్ళను, ఏ ఇన్ స్ట్రకటర్ నూ అడగను. ఆ పాత పరికరాలను బయటికి తీస్తాను.


బస్కీలు (పుష్ అప్స్) చేస్తే ఇంకా బాగుంటుంది. ఎబ్డామిన్ మీద ప్లేటు ఏర్పడుతుంది. గానీ ఆ పరికరాలు విజయవాడలో వుండిపోయాయి. అయినా బస్కీలు ఇప్పుడు కొంచెం కష్టం అనుకుంటాను. గుంజీలు (సిట్ అప్స్), దండీలు (డంబుల్స్)లతోపాటూ కొన్ని స్ట్రెచెస్ చేస్తున్నాను. యవ్వనంలో 20 ఎల్బీ ( 8 కెజీలు) డంబుల్స్ కూడా వాడేవాడిని. వయసు పెరిగే కొద్దీ  బరువును తగ్గిస్తూ  2-4 కేజీలకు తెచ్చాను.

రోజుకు ఒక గంట చొప్పున నాలుగు రోజులు  మానాన్న నేర్పిన వర్కవుట్ చేస్తే చాలు మళ్ళీ పాత శరీరం తిరిగి వచ్చేసింది అనిపిస్తుంది. ఆ ఉత్సాహంలో నేను అనేక విషాదాలను మరచిపోతాను.

థ్యాంక్యూ అబ్బా! 


(ఎవరికయినా పనికి వస్తుంది అనుకుంటే రేపు నా కసరత్తు వీడియో పెడతాను. )

No comments:

Post a Comment