Saturday, 22 April 2017

Row Over Affirmative Action For Muslims

Row Over Affirmative Action For Muslims

   
ముస్లిం కోటాపై ఎందుకీ గగ్గోలు?

-        ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)

స్వాతంత్రానంతర భారతదేశం ఉత్పత్తిరంగంలో అద్భుతమైన విజయాలు సాధించింది.  ఇంతటి సంపదను సృష్టించినపుడు అది సహజంగానే సామాజికశాంతికి దోహదపడి వుండాల్సింది.  కానీ, అలా జరగలేదు. లోపభూయిష్టమైన పంపిణీ వువస్థ అనేక అనర్ధాలకు దారితీసింది. సహజ వనరులకు, మానవశ్రమను జోడించినపుడు సంపద సృష్టి అవుతుంది. సహజవనరుల్లో దేశప్రజలందరికీ సహజహక్కు వుండడమేగాక, ఉత్పత్తి క్రమానికి అవసరమయిన శ్రమలోనూ  అందరి భాగస్వామ్యం తరతమ స్థాయిల్లో వుంటుంది గనుక ఉత్పత్తి అయిన సంపదలోనూ అందరికీ భాగస్వామ్యం వుండాలి. కానీ అలా జరగడంలేదు. సృష్టి అవుతున్న సంపద అంతా కొన్ని కులాల,  నిజానికి కులాలు కూడా కాదు, కొన్ని కుటుంబాల చేతిల్లోనికి వెళ్ళిపోతున్నది. దానితో ఒకవైపు, ప్రపంచం స్థాయి ఐశ్వర్యవంతుల సంఖ్య భారతదేశంలో పెరుగుతుంటే మరోవైపు ప్రపంచంలో మరెక్కడా లేనంతగా పేదప్రజల జనాభా  మన దేశంలో పెరుగుతోంది. ఈ క్రమం  ఓ పాతికేళ్ళుగా చాలా వేగవంతగా సాగుతోంది. అభివృధ్ధి అంటే పెరుగుదల కాదనే ఆర్ధిక సిధ్ధాంతాలు  ఈ  నేపథ్యంలోనే ముందుకు వచ్చాయి.

ప్రభుత్వ ఆలంబన లేకుండా ఆదివాసీలు, దళితులు మనుగడ సాగించలేరని మన రాజ్యాంగ నిర్మాతలు భావించారు. వారి కోసం ఉద్దీపన చర్యల్ని చేపట్టారు.  దీనినే మనం సాధారణ భాషలో రిజర్వేషన్లు అంటున్నాం. స్వాతంత్రం వచ్చిన పదేళ్ళ తరువాత ఆదివాసీలు, దళితుల సామాజిక, ఆర్ధిక పరిస్థితి మెరుగు పడిపోతుందనీ, అప్పుడు ఉద్దీపన చర్యల్ని ఉపసంహరించుకోవచ్చని కూడా వారు భావించారు. పదేళ్ళుకాదుకదా డెభ్భయి ఏళ్ళయినా  ఆదివాసీలు, దళితులు సామాజికార్ధిక పరిస్థితి మెరుగుపడలేదు. అంతేకాదు, సామాజికార్ధిక రంగాలలో కిందికి దిగజారుతున్న ప్రజాసమూహాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాళ్ళంతా రిజర్వేషన్ల గుమ్మం ముందు నిలబడడం మొదలెట్టారు.  ముందు హిందూ సమాజంలోని నిమ్నకులాలు చేరాయి. ఆ వెనక, సంపద అసమాన పంపిణీ ఫలితంగా రోడ్డున పడుతున్న అనేక సమూహాలు ఇప్పుడు రిజర్వేషన్ల తలుపుతడుతున్నాయి.

గుజ్జార్లు రిజర్వేషన్ల తలుపుతడితే అందరికీ సమంజమే అనిపించింది. జాట్లు, పటేళ్ళు కూడా రిజర్వేషన్ల గుమ్మం ముందు నిలబడినపుడు పెద్దగా అభ్యంతరం రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో కాపులు సహితం రిజర్వేషన్ల గుమ్మం తలుపులు బద్దలగొడుతుంటే జాలిపడ్డారుగానీ ఎవరూ అడ్డుపడలేదు. అలా  హిందువులు, బైధ్ధులు, శిక్కులు, క్రైస్తవులు ఈ రిజర్వేషన్ ప్రసాదాన్ని ఎంతో కొంత అందుకున్నారు. చివర్న, ముస్లింలు కూడా వచ్చి రిజర్వేషన్ల గుమ్మం ముందు నిలబడగానే మిన్ను విరిగి మీద పడ్డట్టు దాదాపు  అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఇలా కొన్ని మాతాల ప్రజాసమూహాలకు ఉద్దీపన ఉపశమనాన్ని కల్పించి  కొన్ని మతాలకు నిరాకరించడం భారతరాజ్యంగ  లౌకిక స్పూర్తికి  భంగకరమని ఒక్కరంటే ఒక్కరికీ తోచడంలేదు.

డెబ్భయి ఏళ్ళుగా  ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసిఆర్, తాము అధికారంలోనికి వస్తే ముస్లింలలోని వెనుకబడినవర్గాలకు ఇప్పుడున్న రిర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని 2014 ఎన్నికల్లో  వాగ్దానం చేశారు. మీడియావాళ్ళు రాత సౌలభ్యం కోసం ముస్లిం రిజ్ర్వేషన్ గా దాన్ని పేర్కొన్నారుగానీ సాంకేతికంగా అది ముస్లిం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్.

 అధికారంలోనికి వచ్చిన తరువాత కేసిఆర్  ముస్లీంల సామాజిక స్థితి గతుల్ని పరిశీలించడానికి సుధీర్ కమిటీని వేశారు.  ముస్లిం వెనుకబడిన కులాలకు ఇప్పుడున్న రిజర్వేషన్ల శాతానికి మరో ఆరు శాతం కలపవచ్చని ఆ కమిటీ సిఫారసు చేసింది. దాన్నీ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమీషన్ కూడా ఆమోదించడంతో ముస్లిం వెనుకబడిన కులాలకు ఇస్తున్న రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి రంగం సిధ్ధమైంది. ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఏప్రిల్ 16న శాసన మండలి, శాసనసభ ఆమోదం తెలుపడంతో రాష్ట్ర స్థాయిలో  దీనికి సంబంధించిన ప్రక్రియలు, లాంఛనాలు అన్నీ పూర్తి అయినట్టే. ఇక తదుపరి ప్రక్రియ పార్లమెంటులో సాగుతుంది.  

హిందూత్వ ఓటు బ్యాంకు రాజకీయాల మీద ఆధారపడే బీజేపి నాయకులు ముస్లిం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ పెంపును అడ్దుకోవడానికి భూమ్యాకాశాలను ఏకం చేస్తున్నారు. పొంతనలేని వాదనలను ప్రవేశపెడుతున్నారు.  ముస్లిం వెనుకబడిన తరగతులకు ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్లు ఏమీ ఇవ్వడంలేదనే ఒక వాస్తవాన్ని ప్రజల దృష్టి నుండి  మళ్ళించడానికి అనేక తంటాలు పడుతున్నారు.

రాష్ట్ర ఓబీసీ జాబితా బీసీ-ఏ లో  మెహతర్ (39) వెనుకబడిన తరగతికీ, బీసీ-బీలో  దూదేకుల, లద్దాఫ్, పింజారి, నూర్ బాషా (5) వెనుకబడిన తరగతులకు  నాలుగు దశాబ్దాలుగా రిజర్వేషన్ సౌకర్యం వుంది. 2007లో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఓ పధ్నాలుగు ముస్లిం వెనుకబడిన తరగతులను బీసీ-ఇ లోచేర్చి 4 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. కేసిఆర్ ప్రభుత్వం ఒక్క ముస్లిం సామాజికవర్గానికి కూడా  కొత్తగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించలేదు. పాత సామాజికవర్గాలకే వున్న కోటాను పెంచారు. బీసీ-ఏ, బీసీ-బీ లో ఒకశాతం, బీసీ-ఇ లో 4 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ముందే వున్నాయి. కేసిఆర్ పెంచింది ఇంకో 7 శాతం.

ముస్లిం వెనుకబడిన తరగతులకు 12 శాతం కోటా ఇవ్వడంపై కూడా ఒక  వివాదం నడుస్తోంది.  దేశజనాభాలో ముస్లీంలు 12 శాతం మాత్రమే వున్నప్పుడు వారికి అంత కోటా ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏళ్ళ తరబడి ముస్లిం వెనుకబడిన తరగతులను కోటాకు దూరంగా వుంచి చేసిన అన్యాయన్ని సరిదిద్దడానికి కోటాను పెంచడం ధర్మమే. అసమాన వివక్షకు గురైనవారికి అసమాన న్యాయం చేయడం కూడా ఒక న్యాయమే.

ముస్లిం వెనుకబడిన సామాజికవర్గాలకు ఉద్దీపన చర్యల్ని అడ్డుకోవడానికి సంఘ్ పరివారం ముందుకు తెచ్చిన  వాదన సారాంశం ఏమంటే, రిజర్వేషన్లను కులాల ప్రాతిపదినకనే ఇస్తారు కనుక, హిందూమతంలో మాత్రమే కులాలు వుంటాయి కనుక రిజర్వేషన్లు మొత్తంగా హిందువులకు మాత్రమే చెందాలి అని. చూస్తుంటే వీరంతా భారత రాజ్యాంగానికీ మనుధర్మశాస్త్రానికీ తేదాలేకుండా చేసేస్తున్నారనిపిస్తోంది.

భారత దేశంలోని అన్ని మత సమూహాలలోనూ విభిన్న సామాజికవర్గాలున్నాయని తెలియనివారు ఇప్పుడు ఎవ్వరూ వుండరు. పైగా, దాదాపు స్మస్త మతాల సామాజికవర్గాలకు ఇప్పుడు కులప్రాతిపదికన రిజర్వేషన్లు వున్నాయి.  “ఇస్లాంలో కులాలు వుండవవి ముల్లాలే చెపుతుంటే ముస్లింలు కులప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఎలా కోరుతారని  బీజేపి శాసనపక్ష నేత కిషన్ రెడ్డి గడుసుగా అడుగుతున్నారు. ముస్లిం పేదల కంట్లో  ఇస్లాం వేలితో పొడిచే ప్రయత్నమిది. ముల్లాల వరకు దేనికీ? ఏ హిందూ పీఠాధిపతిని  అడిగినా తమ మతంలో వివక్షలేదనీ హిందువులందరూ సమానులే అని చెపుతారు. దాన్ని ఆధారం చేసుకుని హిందూ సామాజికవర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారా?

మరోవైపు, బీజేపి జాతీయనేత  వెంకయ్య నాయుడు ముస్లిం సమాజంలోనూ కులాలున్నాయని గట్టిగా చెపుతున్నారు. అక్కడ కూడా వివక్ష వున్నప్పుడు మతం మారడం దేనికని వారు హిందూ నిమ్నకులాలకు హితవు చెపుతున్నారు. వెంకయ్య నాయుడు ఈ మాటలు అంటున్నపుడు కిషన్ రెడ్డి ఆ పక్కనే వున్నారు. ఏవిధంగా నయినా ముస్లింల అభివృధ్ధిని అడ్డుకోవడమే వాళ్ళ లక్ష్యంలా వుంది.

ఇంతకీ బీసీ రిజర్వేషన్లకు కులం మాత్రమే ప్రాతిపదిక కాదు. యస్ సీ లో ‘సి’ అంటే క్యాస్ట్ అయినట్టు బీసీలో ‘సీ’ అంటే క్యాస్ట్ కాదు.  క్లాసెస్, కేటగరీస్, వర్గం, తరగతి, సమూహం అని అర్ధం. ఏ సమూహమైనసరే సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడివుంటే వాళ్లను ఆదుకోవడానికి బ్యాక్ వర్డ్ క్లాసెస్ గుర్తింపునిచ్చి ఉద్దీపన చర్యలు చేపట్టాలనేది  రాజ్యంగ భావన.

ముస్లిం రిజర్వేషన్లతో హిందూ-ముస్లింల ఐక్యత దెబ్బతింటుందని వెంకయ్యనాయుడు వంటివారు ఇప్పుడు కొత్త హెచ్చరికలు చేస్తున్నారు. ఇది నిరాధారమైన తప్పుడు ఆందోళన. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన ప్రజాసమూహాలను ప్రభుత్వాలు ఆదుకుంటే, సామాజిక భద్రత మెరుగుపడి, పరస్పర విశ్వాసాలు పెరిగి, హిందూ-ముస్లింల ఐక్యత బలపడి,  సామాజిక శాంతి నెలకొంటుంది. ముస్లిం పేదవర్గాల కోసం చేపట్టే ఉద్దీపన చర్యల్ని అడ్డుకుంటేనే  వెంకయ్య నాయుడు చెప్పినట్టు హిందూ-ముస్లింల ఐక్యత దెబ్బతింటుంది.
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 9010757776

హైదరాబాద్
22 ఏప్రిల్ 2017

ప్రచురణ :
మనతెలంగాణ దినపత్రిక, 23-4-2017

http://epaper.manatelangana.news/1180908/Mana-Telangana-Daily/23-04-17#page/5/2

Triple Talaaq - Controvesy And Solution

Triple Talaaq -  Controvesy And Solution

తలాక్ వివాదం, పరిష్కారం

-        అహమ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)

మతాచారాలకు సంబంధించిన సున్నితమైన అంశాలను సామరస్యంగా  పరిష్కరించుకోవాలి.  ట్రిపుల్ తలాక్ మీద దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చ అందుకు భిన్నంగా జరుగుతోంది. పరస్పరం భావోద్వేగాలను రెచ్చగొట్టుకునే విధంగా చర్చ సాగుతోంది. ముస్లింలు స్త్రీల విషయంలో కౄరంగా వుంటారని ముస్లిమేతరులు ఆరోపిస్తుంటే,  అధికారాన్ని చేపట్టిన హిందూత్వ పార్టి తమ మత విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటున్నదని ముస్లీమ్లు ఆందోళన చెందుతున్నారు. కాలాను గుణంగా పర్సనల్ లా లో మార్పులు తేవాల్సిన మత పెద్దలు మీన మేషాలు లెక్కిస్తున్నారు.  
చర్చలోనికి ప్రవేశించడానికి ముందు మనం కొన్ని విషయాల్లో ఒక స్పష్టతను ఏర్పరచుకోవాలి. మినహాయింపు లేకుండా మతాలన్నీ ఫ్యూడల్ వ్యవస్థలో ఆవిర్భవించాయి. వాటిల్లో సహజంగానే పురుషాధిక్యత వుంటుంది. ఆ మేరకు స్త్రీల మీద అనేక రకాలుగా అదుపు వుంటుంది. దీనికి ఇస్లాం మినహాయింపేమీకాదు. అయితే, కొన్ని ఇతర మతసమూహాలతో పోలిస్తే ముస్లిం సమాజంలోని స్త్రీలకు కొన్ని అంశాల్లో హక్కులు ఎక్కువ. ఇస్లాంలో స్త్రీలకు ఆరవ శతాబ్దం నుండే ఆస్తి హక్కు వుంది. కొన్ని ఇతర మతాల్లో ఇటీవలి కాలం వరకూ స్త్రీలకు ఆస్థి హక్కు లేదు. స్త్రీలకు ఆస్తి హక్కు ఇస్తే అనర్ధాలు జరుగుతాయని వాదించిన వాళ్ళు మనకు సమీపగతంలోనే కనిపిస్తారు.  సంతానానికి జన్మ నివ్వడం ద్వార జాతి విస్తరణకు తోడ్పడం మాత్రమేగాక మతధర్మాలను తరువాతి తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా ముస్లిం  సమాజంలో స్త్రీలదే. కొన్ని మత సమూహాల్లో నిమ్నసమూహాలు మతగ్రంధాలను  చదవడంపై వున్న నిషేధం స్త్రీలకు కూడా వర్తిస్తుంది. దానికి భిన్నంగా ముస్లిం సమాజం మహిళలు నిర్బంధంగా మతగ్రంధాలను  చదవాలని ఆదేశిస్తుంది. బయటి సమాజం అంతగా గుర్తించక పోవచ్చుగానీ, ఉర్దూ, అరబ్బీలను అక్షరాశ్యతగా గుర్తిస్తే ముస్లిం సమాజంలో పురుషులకన్నా మహిళలే ఎక్కువ శాతం అక్షరాశ్యులు.  

వివాహానికి  సంబంధించి హిందూమత దృక్పథంలోనూ, ఇస్లాం మత దృక్పథంలోనూ విపరీతమయిన భిన్నత్వంవుంది.

శాస్త్రోక్తమైన హిందూ వివాహం సకలదేవతల సమక్షంలో జరిగే శాశ్విత బంధం. దాన్ని ఏడు జన్మల బంధంగానూ  భావిస్తారు.

ముస్లిం సమాజంలో పెళ్ళి అనేది ఇహలోక ఒప్పందం. చాలా మంది గమనించి వుండరు గానీ ముస్లిం వివాహంలో వధువు కన్యాగా వుండాలనే నియమం ఏమీలేదు. అది ఆమెకు పునర్వివాహం అయినా అభ్యంతరం వుండకూడదు. 

ముస్లిం వివాహంలో వధూవరులు కాకుండా కనీసం నలుగురు పెద్ద మనుషులు వుండాలి. ఒక ఖాజీ (పురోహితుడు), ఒక మధ్యవర్తి (వకీల్), ఇద్దరు సాక్షులు. ఒప్పందం అన్నప్పుడు అది ఎప్పుడు రద్దు (టెర్మినేషన్) అవుతుందో కూడా పేర్కొవాలి. పెళ్ళి సమయంలో “నాకు అంగీకారమే” (ఖుబూల్) అని మూడుసార్లు అన్నట్టే ఒప్పదం నుండి తప్పుకోవాలనుకున్నప్పుడు కూడా మూడుసార్లు “విడిపోతున్నాం” (తలాక్ / ఖులా) అని మూడుసార్లు చెప్పాలి. వీటిని హిందూ సాంప్రదాయంలో తాళికట్టడంతో పోల్చవచ్చు.  

లాంఛనాలకు ముందూ వెనక చాలా తతంగం వుంటుంది. కొన్ని సినిమాల క్లయిమాక్సుల్లో నాయకుడు ఫైటింగ్ చేస్తుండగా, ప్రతినాయకుడు ఏదో ఒక విధంగా నాయిక మెళ్ళో తాళీ కట్టేసే ప్రయత్నం చేస్తుంటాడు.  అలాగే మరికొన్ని సినిమాల్లో భార్య తాళి తెంచి భర్త ముఖాన కొట్టి వెళ్ళిపోయే దృశ్యాలూ వుంటాయి. ఇలా నిజజీవితంలోనూ జరుగుతుంటాయి. అయితే అవన్నీ లాంఛనాలే. లాంఛనాలే సమస్తం కాదు. లాంఛనాలను కొందరు దుర్వినియోగం చేస్తుంటారు. సమాజం వాటిని క్రమబధ్ధం చేస్తుండాలి.

స్త్రీ విద్య, స్త్రీలకు ఆస్తిహక్కు, వివాహ స్వేఛ్ఛ, విడాకులు తీసుకునే హక్కు  విధవాస్త్రీ పునర్ వివాహం, వంటి సంస్కరణలు ఇతర సమూహాల్లో 19, 20 శతాబ్దాల్లో మాత్రమే వచ్చాయి. ఈ ఐదు హక్కులూ ముస్లిం స్త్రీలకు 7వ శతాబ్దం నుండే వున్నాయి.

 ఆంధ్రప్రదేశ్ లో యన్టీ రామారావు హయాం మొదలయ్యే వరకు స్త్రీలకు ఆస్తి హక్కులేదు. స్త్రీలకు సమానత్వ హక్కు, ఆస్తిహక్కు, విడాకుల హక్కు కోసం 1951లో బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్లు మీద పార్లమెంటులో సాగిన హోరాహోరి పోరును ఒకసారి గుర్తు చేసుకుంటే వర్తమాన పరిణామాలను అర్ధం చేసుకోవడం సులువవుతుంది. అంబేడ్కర్ ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లుకు నిరసనగా హిందూమహాసభ ప్రతినిధి, పరిశ్రమలశాఖ మంత్రి శ్యామ ప్రసాద్ ముఖర్జీ తన మంత్రి పదవికి రాజీనామ చేశారు.  అపట్లో ఉధృతంగా సాగిన మహిళా ఉద్యమాల ఫలితంగా అనేక దశల్లో హిందూ కోడ్ బిల్లు సాకారం అయింది. అది తరువాతి చరిత్ర.

భర్తకు విడాకులు ఇచ్చే సమాన హక్కు ముస్లిం మహిళలకు కూడా వుంది. దీన్నే కులా అంటారు. అయితే విడాకుల సౌకర్యాన్ని దాదాపు అన్ని సమాజాల్లోనూ మహిళలకన్నా పురుషులే ఎక్కువగా వాడుతున్నారు. అతిగా వాడుతున్నారు. దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు ముస్లిం పురుషులు తలాక్ ను అపహాస్యం పాలు చేస్తున్నారు. తలాక్ సాంప్రదాయం మొదలయినపుడే ముస్లిం మత పెద్దల మధ్య పెద్ద సంవాదాలు  జరిగాయి. విడాకుల మీద సూత్రప్రాయంగా ఏకాభిప్రాయమే వున్నప్పటికీ అది దుర్వినియోగం అవుతుందనే ఆందోళన కూడా అప్పుడే వ్యక్తమయింది. దాంపత్యాన్ని నిలబెట్టడానికి ఎంతో నిగ్రహంతో ప్రయత్నించాలనీ, ఆ ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాకే   తలాక్ నిర్ణయం తీసుకోవాలనీ, మూడు విడతలుగా తలాక్ చెప్పాలనీ,  దీని కోసం కనీసం మూడు నెలల గడువు తీసుకోవాలని  రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ పారూఖ్ ఆదేశాలున్నాయి.

సైబర్ యుగంలో ట్రిపుల్ తలాక్  వెర్రి పుంతలు తొక్కుతోంది. ఒకేసారి “తలాక్ తలాక్ తలాక్” చెప్పేస్తే విడాకులు ఇచ్చేసినట్టే అని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి వాటిని మొదట్లోనే సభ్యసమాజం పట్టించుకోవాల్సి వుండింది. ఆర్ధిక రాజకీయ అభద్రతా బావంతో నలిగిపోతున్న భారత ముస్లిం సమాజం ఈరకం పెడధోరణుల్ని మొగ్గలోనే తుంచే బాధ్యతను మరచిపోయింది. దీని కోసం ప్రత్యేకంగావున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు ముందుగానే మేల్కొని ఒక్కసారిగా చెప్పే తలాకులు ఇస్లాం స్పూర్తికి విరుధ్ధం అని ప్రకటించి వుండాల్సింది. ఆ అంశం మీద స్పష్టతనిస్తూ ఫత్వాలు జారీచేసి వుండాల్సింది. అంతగా అవసరంలేని విషయాల మీద కూడా ఉత్సాహంగా ఫత్వాలు జారీచేసే ముస్లీం ధార్మిక సంస్థలు ఈ విషయంలో ఒక చారిత్రక  తప్పుచేశాయి. మొత్తం జాతిని ఒక ముద్దాయిగా నిలబెట్టాయి.

విడాకుల హక్కు అనేది ఒక ఆధునిక విలువ అనే భావం వెనక్కిపోయి అనాగరీక చర్యగా మారిపోయింది.  ఈ నిరాసక్తతను సాకుగా తీసుకుని కొందరు మరీ రెచ్చిపోయారు. ఎస్సెమ్మెస్, ఇమెయిల్, వాట్సప్, ఫేస్ బుక్కుల్లో కూడా ట్రిపుల్ తలాక్ మెసేజులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు పౌరస్మృతిలో న్యాయస్థానాలు, ప్రభుత్వాలు జోక్యం చేసుకునే పరిస్థితిని తెచ్చాయి. ఒక్కసారిగా చెప్పే ట్రిపుల్ తలాకులుగానీ, ఎస్సెమ్మెస్, ఇమెయిల్, వాట్సప్, ఫేస్ బుక్కుల్లో పెట్టే తలాక్ మెసేజులుగానీ ధర్మవిరుధ్ధం అంటూ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక ప్రటన విడుదల చేయాలి. దానికి ఏడాదో ఏడాదిన్నరో సమయం కోరడం సమంజసంకాదు. ఇప్పుడే ఈ క్షణమే .   

(రచయిత సమాజ విశ్లేషకులు)

మొబైల్ 9010757776
హైదరాబాద్
13 ఏప్రిల్ 2017

ప్రచురణ :
ఆంధ్రజ్యోతి దినపత్రిక
16-04-2017 00:57:51

Muslim - From Oppression to Progress

Muslim - From Oppression to Progress 
అణిచివేత నుండి అభివృధ్ధి దిశగా  

వర్తమాన ప్రపంచంలో ఉద్రవాదం అనేది హాట్ టాపిక్. ప్రపంచ మార్కెట్  సృష్టించే భీభత్సం నుండే ఉగ్రవాదాలు పుట్టుకొచ్చాయని ఇప్పుడు-  అందరూ కాకున్నా- అత్యధికులు అంగీకరిస్తున్న అంశం. ప్రతిహింసను సమర్ధించే మతాలు మొదలు అహింసను ప్రవచించే  మతాలవరకు దాదాపు అన్ని మతసమూహాల్లోనూ ఉగ్రవాద పోకడలు తరతమ స్థాయిల్లో కొనసాగుతున్నాయి. వీరిలో ఎక్కువ అప్రతిష్టను కూడగట్టుకుంటున్నది మాత్రం ముస్లింలే.  ముస్లింలని ఉగ్రవాదులంటూ ప్రచారం చేయడం కొన్ని దేశాలకు, కొన్ని సమూహాలకు రాజకీయార్ధిక అవసరంగా మారింది. బయటి నుండి అణిచివేత లోపలి నుండి నైరాశ్యం వున్న వాతావరణంలో కొందరు ముస్లిం యువకులు ఉగ్రవాదులుగా మారుతున్న విషయం కూడా వాస్తవం. దానికి కారణాలు ముస్లిం సమాజానికేకాదు ముస్లిమేతర సమాజాలకు కూడా తెలుసు.
శిలాజ ఇంధనం (Fossil Fuel) అయిన  బొగ్గు కోసం అలనాడు బ్రిటీష్ సామ్రాజ్యవాదం అనేక దేశాల్ని వలసలుగా మార్చుకుంది. ఇప్పుడు మరో శిలాజ ఇంధనం అయిన చమురు కోసం అమెరికన్ సామ్రాజ్యవాదం అనేక దేశాల్ని బానిసలుగా  మార్చుతోంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించినవాళ్ళను అనాగరీకులుగా, ఉగ్రవాదులుగా చిత్రిస్తోంది. మనం తరచుగా మరచిపోతున్న విషయం ఏమంటే అప్పట్లో బ్రిటీష్ వలసపాలకులు కూడా భారతీయుల్ని అనాగరీకులుగానూ,   భగత్ సింగ్ వంటి దేశభక్తుల్ని ఉగ్రవాదులుగానూ చిత్రించేవారు. ఆ రెండు నిందల్ని మోయడానికి  ఇప్పుడు ముస్లింల వంతు వచ్చింది!.  

ఉగ్రవాదులు కఠినంగా, క్రూరంగా, కర్కశంగా ప్రవర్తిస్తున్నట్టు అనేక వార్తలు నిత్యం వస్తున్నాయి. సామ్రాజ్యవాదుల మీడియాల్లో వచ్చే ఆ వార్తల్లోని నిజానిజాల్నీ అతిశయోక్తుల్నీ పక్కన పెడితే,  అవన్నీ ఒక చర్యకు ప్రతిచర్యగా, ఒక దాడికి ప్రతిదాడిగా జరుగుతున్న పరిణామాలు అనడంలో ఎవరికీ సందేహం వుండాల్సిన పనిలేదు. దాడిని ఖండించనివాళ్ళకు ప్రతిదాడిని తప్పుపట్టే నైతిక హక్కు వుండదని మనం తరచూ మరచిపోతుంటాం.

ముస్లింలు అంతర్జాతీయంగానేకాక  తరచూ స్థానికంగానూ నిందల్ని ఎదుర్కొంటున్నారు. ఈ నిందల నుండి బయటపడే ప్రయత్నం ఇప్పుడు ముస్లిం సమాజం గట్టిగానే చేస్తున్నది. ఇస్లాం ఒక్కదానికేకాదు ప్రపంచ మతాలన్నింటికీ – ఆమాటకు వస్తే – కమ్యూనిజం వంటి ప్రపంచ సిధ్ధాంతాలకూ -ప్రాంతీయ ప్రభావాలు, ప్రత్యేకలు అనేకం వుంటాయి. అంత మాత్రాన వాటి మౌలిక సూత్రాలేమీ మారిపోవు. దక్షణాది నాలుగు రాష్ట్రాల్లో ముస్లింలు సాంప్రదాయంగా (శంకు మార్కు) గళ్ళ లుంగీలు  కడతారు. నిజాం సంస్థానానికి చెందిన ముస్లింలు షేర్వాణీలు, చుడీదార్లు తొడుగుతారు. స్థానిక ప్రభావం అంతవరకే.

అఫ్సర్ , స్కైబాబా వంటివాళ్ళు తరచుగా లోకల్ ఇస్లాం గురించి చేస్తున్న వాదనలు కొన్ని సందేహాలను కలిగిస్తున్నాయి. వీరు లోకల్ ఇస్లాం పేరుతో యాంటి ఇస్లాంకు ఆమోదాంశాన్ని  కలిగిస్తున్నారేమో అనిపిస్తోంది.

ఇస్లాం ఏకేశ్వరోపాసన మతం.  అక్కడ ఆరాధన అర్హత అల్లా ఒక్కనికే వుంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ (వారికి శాంతి కలుగుగాక) గారికి కూడా ఆరాధనల్ని అందుకునే అర్హత లేదు. అల్లా పక్కన మరో దేవుడ్నో, ప్రవక్తనో, ముల్లానో, పీర్ నో, హజ్రత్ నో, సేయింట్ నో పెట్టి ఆరాధిస్తామంటే అది ఇస్లాంకాదు. ఈ విషయంలో అరబిక్ ఇస్లాం, ఇండియన్ ఇస్లాం, నరసాపురం ఇస్లాం, నల్గొండ ఇస్లాం, చింతకాని ఇస్లాం  అనే తేడా లేనేలేదు.

మరో వైపు, ఇతర మత సమూహాలతో కలిసి పనిచేయవద్దని ఎవరు చెప్పినా  అది కూడా యాంటి ఇస్లామే. మనం ఇతర మత సమూహాల కష్టాల్లో భాగం పంచుకోవాలి. వాళ్ల విముక్తి కోసం తెగించి పోరాడాలి. ఆక్రమంలో ఇస్లాం గొప్పతనాన్ని కూడా చాటాలి. అలాయిబలాయి సంస్కృతి, గంగాజమున తెహజీబ్లకు అర్ధం కలిసిమెలసి ఉండాలనేగానీ యాంటి ఇస్లాంగానో మరొకటిగానో మారమనికాదు. ముస్లింలుగా వుంటూనే, ఇస్లాంలో ప్రాణప్రదమైన అంశాలను విడవకుండానే ఇతర మత సమూహాలతో   కలిసి పనిచేయడం సుసాధ్యమే. (కారంచేడు ఉద్యమం దీనికి ఒక ఉదాహరణ).

హిందూఅణగారిన సమూహాల వర్తమాన కార్యాచరణ విషయంలోనూ ముస్లింలకు స్పష్టమైన అవగాహన వుండాలి.  హిందూ అణగారిన సమూహాల ఉద్దీపనకు రాజ్యాంగ ప్రతిపత్తి స్పష్టంగావుంది. ముస్లింల ఉద్దీపనకు రాజ్యాంగంలో స్పష్టమైన ప్రతిపత్తిలేదు. భారత రాజ్యాంగానికి కుల తెగ స్వభావమేగాక మత స్వభావం కూడా వుంది. రాజ్యాంగం కొన్ని మతాలకు రిజర్వేషన్ కల్పిస్తూనే ముస్లిం సమాజాన్ని పక్కన పెట్టింది. భారత రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్లను ఆమోదించదు అనే ఒక తప్పుడు అభిప్రాయం మన సమాజంలో ఇప్పటికీ బలంగా వుంది. 

          ముస్లింలకు ఉద్దీపన చర్యల ప్రతిపాదన వచ్చినప్పుడెల్లా దాన్ని వీధుల్లోనూ, న్యాయస్థానాల్లోనూ బలంగా అడ్డుకుంటున్నది హిందూ అణగారిన సమూహాలే. ఈ వైరుధ్యానికి పరాకాష్టే గుజరాత్ అల్లర్లు. గత ఏడాది దేశాన్ని భయపెట్టిన అసహన వాతావరణానికి  కీరీటధారులు, సూత్రధారులు ఎవరయినప్పటికీ పాత్రధారుల్లో అత్యధికులు హిందూ అణగారిన సమూహాలే. ఇదొక వాస్తవం. 

మరోవైపు,  హిందూ అణగారిన సమూహాల్లో సామ్యవాద, దళిత, బహుజన, లౌకిక భావాలు కలవారు ముస్లింలకు మద్దతుగా నిలుస్తున్న వాస్తవాన్ని కూడా మనం మరచిపోకూడదు. వారిలో కేవలం సంఘీభావాన్ని తెలిపేవారు మాత్రమేగాక కొన్ని త్యాగాలకు సిధ్ధపడగలిగిన గట్టి మద్దతుదారులు సహితం వున్నారు. అయితే, వారి మద్దతు తమ సమాజపు ప్రధాన స్రవంతిని సవరించ గలిగేదీకాదు; నిలువరించ గలిగేది కూడా కాదు.  ఇది దాని పరిమితి. హిందూ అణగారిన సమూహాల్లో సామ్యవాద, దళిత భావాలు కలవారు ముస్లింలకు ఇస్తున్న మద్దతును స్కైబాబా వంటివారు - సహృదయంతోనే కావచ్చుగానీ- అతిగా అంచనా వేస్తున్నారని పిస్తోంది. అయినప్పటికీ ఇతర అణగారిన వర్గాలతో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ముస్లిం సమాజానికి వుంది. ఎందుకంటే ఇతర అణగారినవర్గాలకు లౌకికవాదం ఒక దృక్పధం మాత్రమే; భారత ముస్లింలకు అది ప్రాణరక్షణ  ఔషధం.  

ముస్లింలు అంతర్గతంగానూ అవగాహనను పెంచుకోవాల్సిన అంశాలు అనేకం వున్నాయి. అందులో కీలకమైనది కులసమస్య. కులం అనేది భారత సమాజపు వాస్తవికత.  ధార్మికంగా సమర్ధన వున్నా లేకపోయినా భారత ముస్లిం సమాజంలో కులాలున్నాయి. పైగా ఇవి ఆష్రాఫ్, అజ్లాఫ్,  అర్జాల్.  అనే మూడు సామాజిక దొంతరల్లో వున్నాయి.  భారత ముస్లింలలోని సమస్త కులాల మధ్య ఒక అవగాహన రావాలి. హిందూ సమాజంలోని కమ్మ, కాపు సామాజికవర్గాల్లో  ఇటీవలి కాలం వరకూ కొన్ని ఉపకులాలుండేవి. అవన్నీ ఇప్పుడు ఏక కులంగా మారడం మన కళ్ళముందు జరిగిన పరిణామాలు. దళిత, గిరిజన, హిందూ వెనుకబడిన కులాల్లోనూ అనేక ఉపకులాలున్నాయి. వాళ్లంతా ఒక ఐక్య సమూహంగా మారడాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాంటి ఏకీకరణ ముస్లిం సమాజంలో తక్షణం జరగాల్సి వుంది.  భవిష్యత్తులో ఒకవేళ మత ప్రాదిపదికన రిజర్వేషన్లను పొందడం సాధ్యంకాని పరిస్థితే వస్తే,  కులప్రాతిపదికన అయినాసరే  భారత ముస్లిం సమాజం రిజర్వేషన్లను సాధించుకోవడానికి వీలుగా ఈ ఏకీకరణ జరగాలి.

పేదరికంవల్ల కొంత, ప్రభుత్వాల నిరాదరణలవల్ల మరికొంత, నిరాశ నిస్పృహలవల్ల ఇంకొంత ముస్లిం సమాజం ఆధునికవిద్యకు దూరం అవుతోంది. ఈ నేపథ్యంలో ముస్లిం బాలబాలికల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాల్సిన బాధ్యత ఆలోచనాపరుల మీద వుంది. ముస్లిం విద్యార్ధులు  ప్రధానంగా రాజకీయార్ధిక శాస్త్రాలు,  బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో పట్టు సాధించాలి. విద్యాధికులయిన ముస్లింలు తమ తరువాతి తరానికి అనియత విద్యగా అకౌంటెన్సీని, ఆర్ధిక క్రమశిక్షణనీ నేర్పాలి.

అన్నింటికన్నా కీలకమైనది ఆర్ధికరంగం మీద పట్టును సాధించడం. తమది మతాతీత, కులాతీత అభివృధ్ధి దృక్పథమని ప్రభుత్వాధినేతలు తరచూ ప్రకటించుకుంటున్నప్పట్టికీ వాళ్ళు చేపట్టే అభివృధ్ధి ప్రాజెక్ట్లు, సంక్షేమ పథకాలు  అన్నీ కొన్ని మతాలకు, కొన్ని కులాలకు మాత్రమే మేలు చేకూరుస్తుంటాయి. ప్రభుత్వ ప్రాయోజిత నీటిపారుదలా ప్రాజెక్టులు, రుణమాఫీ పథకాలు,  వ్యవసాయ సబ్సీడీల ద్వార భూములున్నవారికి మాత్రమే మేలు జరుగుతుంది.  భూములున్న ఆర్ధిక సమూహంలో ముస్లీంల శాతం చాలాచాలా తక్కువ కనుక ఆ ప్రాజెక్ట్లు, పథకాలు, సబ్సిడీల ప్రయోజనాలని వాళ్ళు పొందలేరు. ముస్లింలు ఇప్పుడు వ్యవసాయరంగం లోనికి విస్తరించాలి. అలాగే, ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణాల వల్ల ప్రైవేటు ట్రాన్స్  పోర్ట్  ఆపరేటర్లు లబ్దిపొందుతుంటారు. అలాంటి రంగాల్లో ముస్లింలు ప్రవేశించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రభుత్వం పెట్టుబడులు పెడుతున్న రంగాలన్నింటిలోను ముస్లింలు చొరవగా  ప్రవేశించాలి. ఇలాంటి వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించడానికి ముస్లిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కీ) ఒకటి ఏర్పడాలి.

ప్రైవేటు రంగం సమర్ధంగానూ, ప్రభుత్వరంగం అసమర్ధంగానూ పనిచేస్తుందనే అభిప్రాయం ఒకటి మనలో బలంగా వుంటుంది. అది నిజంకాదు. ప్రభుత్వ (రంగ) మద్దతుతోనే ప్రైవేటు రంగం లాభాలను అర్జిస్తుంది. అందుకు ప్రభుత్వంతో లాబీ చేసే వ్యవస్థ ఒకటి వుండాలి. దానికోసం ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాతినిధ్యం వుండి తీరాలి. దాని కోసం ప్రత్యేక కృషిచేయాలి.

ఇతర అణగారిన సామాజికవర్గాలతోపోలిస్తే ముస్లిం సామాజికవర్గంలో లాబీయింగ్ నైపుణ్యం తక్కవ మాత్రమే కాదు  అలాంటి  ఆసక్తి,  స్పృహ కూడా  తక్కువే.  ఈ లోటును అధిగమించాలి. ఇతర సామాజికవర్గాల్లో ఆలోచనాపరులు, వాణిజ్య వేత్తలు సమైక్యంగా ముందుకు సాగడాన్ని మనమ గమనిస్తున్నాము. ముస్లిం సమాజంలో ఆలోచనాపరులు, వాణిజ్య వేత్తలు తలో దిశగా ప్రయాణిస్తున్నారు. ఈ ధోరణివల్ల ఎవరి ప్రయోజనాలూ నెరవేరవు.  వాళ్ళకు ఒక ఉమ్మడి వేదిక ఏర్పడాలి.

భారత ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి కీలకమైనది నాయకత్వ సమస్య. స్వాతంత్ర్యానంతరం తమకు ఒక అగ్రనాయకుడు వుండాలన్న అంశాన్ని భారత ముస్లిం సమజం   ఇప్పటి వరకు గుర్తించినట్టులేదు. ఈ అంశం పరిష్కారం కానంత వరకు ముస్లిం సమాజ వికాసం ఆరంభమయినట్టుకాదు.

A.m. Khan Yazdani Danny అప్పట్లో Face Book లో ఉగ్రవాదం మీద పెట్టిన కొన్ని కామెంట్లను జత చేసి పై వ్యాసాన్ని మరికొంత పెంచాలనుకున్నాను. కానీ బద్దకించాను. ఇప్పుడు ఆ COMMENTS ను జతచేసి చదువుకోవాల్సిందిగా పాఠకుల్ని కోరుతున్నాను. 

1.
We have
SAFFRON and GREEN
Terrorists
- March 9, 2017

2. 
ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలి 
విప్లవవాదాన్ని ఆహ్వానించాలి
-February 20, 2017

3.
ఉగ్రవాదం విప్లవవాదం ఒకటికాదు
- February 20, 2017

4.
ఉగ్రవాదం పుట్టుకకు ఉండే సమర్ధన 
దాని చర్యలకు వుండదు.
- February 20, 2017

5.
US and IS
Both are International enemies of Muslims
- February 20, 2017

6. 

US and IS
ఇద్దరూ ముస్లిం సమాజానికి అంతర్జాతీయ శత్రువులు
- February 20, 2017


7.
All Terrorists are Cowards !
ఉగ్రవాదులందరూ పిరికిపందలే!

June, 8, 2017



-        ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)
సమాజ విశ్లేషకులు
మొబైల్ - 9010757776
హైదరాబాద్
6 ఫిబ్రవరి 2017

ప్రచురణ :
చమన్ వెబ్ పత్రిక మార్చి 26, 2017


http://chaman.co.in/2017/03/%E0%B0%85%E0%B0%A3%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A4-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A7%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF/

Agitations and Elections are not Synonyms

Agitations and Elections are not Synonyms

ఎన్నికల లెక్కలు వేరు!
-        
-       డానీ 

ఉత్తరప్రదేశ్ తో సహా  ఐదు రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపి ఘనవిజయాన్ని సాధించడంకన్నా మణిపూర్ లో ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మీల ఘోర పరాజయం పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది.  ఎన్నికల్లో ప్రజలు గెలిచేవాళ్లకే భారిమెజారిటీనిస్తారు; ఓడిపోయేవారికి ఘోర పరాజయాన్నిస్తారు అని ఏకవాక్య తీర్మానంతో వదిలేయాల్సిన అంశం కాదిది. ఉద్యమాలకూ, ఎన్నికలకూ మధ్యవున్న సంబంధ్హాన్నీ పునర్ నిర్వచించుకోవాల్సిన సందర్భం ఇది.

ఎన్నికల వ్యాకరణం వేరు; ఉద్యమాల వ్యాకరణం వేరు. భారత పార్లమెంటరీ వ్యవస్థలో చీకటి కాలంగా భావించే ఎమర్జెన్సీ ముగిసిన తరువాత 1977 మార్చిలో లోక్ సభ ఎన్నికలు జరిగాయి.  ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మీద పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఘనవిజయం సాధించగా ప్రజాకవి ధరావతు సొమ్మును కూడా కోల్పోయారు. ఇదంతా ఎన్నికల వ్యాకరణం ప్రకారమే జరిగింది. నక్సలైట్ల మీద బూటకపు ఎన్ కౌంటర్లు మొదలెట్టి  ఆంధ్రా ‘డయ్యర్’గా పేరుగాంచిన వెంగళరావు నాయకత్బంలో  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‍ కమిటి రాష్ట్రంలోని 42 లోక్ సభాస్థానాల్లో 41 చోట్ల ఘనవిజయం సాధించింది. నంధ్యాల స్థానాన్ని వెంగళరావు  తన రాజకీయ గురువైన జనతాపార్టీ అభ్యర్ధి  నీలం సంజీవరెడ్డికి ఉద్దేశ్య పూర్వకంగానే వదిలేశారు. సంజీవ రెడ్డి రాష్ట్రపతిగా మారేక జరిగిన ఉపఎన్నికల్లో ఆ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో పడిపోయింది. అంటే  ఎమర్జెన్సీని విధించిన పార్టీకి ఓట్లర్లు  నూటికి నూరు శాతం సీట్లు కట్టబెట్టారు.

1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాన్షీరామ్ నాయకత్వంలోని బీయస్పీ ఒక వెలుగు వెలిగింది. యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ, కొండొకచో కాపుసామాజికవర్గం కూడా ఏకమై ఒక  ప్రభంజనంగా కనిపించారు. అప్పట్లో, మదరాసు వెళుతున్న  ఎస్.  జైపాల్ రెడ్డిని  విజయవాడ రైల్వేస్టేషన్లో కలిసిన ఓ సన్నిహితుడు కాన్షీరామ్ ప్రభంజనం గురించి చాలా ఉత్సాహంగా చెప్పాడు. అంతా విన్నాక ఆయన ఓ సందేహాన్నివెలిబుచ్చారు. “కమ్మ, రెడ్డి, క్షత్రీయ, పెద్దకాపు సామాజికవర్గాలు కాన్షీరామ్ వెనక చేరాయా?” అని అడిగారు. “లేదు” అని సన్నిహితుని సమాధానం. “వాళ్ల మద్దతు లేకుండా గెలవడంకష్టం కదా?” అని చల్లగా సెలవిచ్చారు జైపాల్ రెడ్డి. వారు చెప్పినట్టే ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 స్థానాల్లోనూ బియస్పీ అభ్యర్ధులు ఓడిపోయారు. పొన్నూరు నుండి పోటీ చేసిన కత్తిపద్మారావు ఒక్కరికి మాత్రమే దరావత్తు సొమ్ము దక్కింది మిగిలినవాళ్ళకు ఆపాటి గౌరవమూ దక్కలేదు. అప్పటి వరకు ఎన్నికల బహిష్కరణ రాజకీయాల్లోవున్న నక్సలైటు అగ్రనేత కేజీ సత్యమూర్తి / శివసాగర్ ఆ ఎన్నికల్లో పాల్గొనడం అప్పట్లో పెద్ద సంచలనం.  ముదినేపల్లి నుండి పోటీ చేసిన  శివసాగర్ కు 1400 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇది కూడా అప్పట్లో ఉద్యమాలకు జరిగిన ఘోర ఘోరపరాభవమే!

మణిపూర్ ఎన్నికల్లో ఇరోమ్ చాను షర్మీల ఓటమి మింగుడు పడక, ఆమెను ఓడించిన రాష్ట్ర ప్రజల్ని తప్పుపట్టలేక అనేక వాదనలు ముందుకు వస్తున్నాయి. “మమ్మల్ని మన్నించు ఇరోమ్” అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు కూడా ప్రచురించాయి. అనేకానేక స్వప్నాలు,  సమస్యలు, పరిష్కారాలు, హామీలు, ఊరింపులు, బుజ్జగింపులు, బెదిరింపులు, మచ్చికల సమాహారంగా ఎన్నికలు సాగుతాయి. ఉద్యమాలకు ఏదో ఒక లక్ష్యం మాత్రమే వుంటుంది. అది ఎన్నికల విస్తృత కలల్ని  నెరవేర్చదు.

మణిపూర్ లో  సాయుధ దళాలు సాగించే దురాగతాలకు వ్యతిరేకంగా ఇరోమ్ దాదాపు రెండు దశాబ్దాలుగా పోరాడుతోంది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) ను  రద్దు చేయాలనేది ఆమె ప్రధాన డిమాండ్. దానికోసం ఆమె రికార్డు స్థాయిలో పదహారేళ్ళు నిరాహార దీక్ష చేసింది. అయితే ఈ పదాహారేళ్ళలో మణిపూర్ లో చాలా మార్పులు వచ్చాయి. మొదటిది; సాయుధ దళాలు గతంలోలా కాకుండా కొంచెం ఆచీతూచీ ప్రవర్తిస్తున్నాయి. ఆ మేరకు ఇరోమ్ ప్రాసంగీకత తగ్గిపోయింది. రెండోది, మణిపూర్ ప్రజలు పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఇంకా చాలా వున్నాయి. విద్యా, వైద్యం, మౌళికరంగం, ఆధునిక అభివృధ్ధి వగయిరాలు ఇందులో వున్నాయి. వీటికి ఇరోమ్ పరిధి సరిపోదు. సిట్టింగ్ సీయం ఓక్రోమ్ ఇబోబి సింగ్ ను రాజకీయంగా ఎదుర్కోవడం అంటే ఆయన్ని ఆయన నియోజకవర్గం థౌబాల్ లోనే ఢీకొని ఓడించనవసరంలేదు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎన్నికల నిర్వహణలో వుండే అపార అనుభవం, అందుబాటులో వుండే యంత్రాంగం, వనరులు వీటన్నింటినీ ఆమె తక్కువగా అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్ లో అధికారాన్ని సాధించడానికి బీజేపి 900 ప్రదర్శనల్ని, 10 వేల  వాట్సప్ గ్రూపుల్నీ, 67 వేల మంది కార్యకర్తల్ని రంగంలోనికి దించిందని ఇప్పుడు గణాంకాలు బయటికి వచ్చాయి. అంతగా కాకున్నా అందులో కొంతన్నా మణిపూర్ లో ఓక్రోమ్ ఇబోబి సింగ్ కూడా వాడి వుంటారుగా!
 అలా కాకుండా,  తన స్వంత తన నియోజకవర్గం ఖురై నుండి ఇరోమ్ పోటీ చేసి వుంటే  గెలిచినా గెలవకపోయినా ఇంత పరాభవం అయితే జరిగి వుండేదికాదు. ఉద్యమకారులు “మేము కావాలా? వాళ్ళు  కావాలా?” అంటూ ప్రజలకు ఛాయిస్ లేకుండా చేయకూడదు.  నిజానికి ప్రజలకు ఇద్దరూ కావాలి. ఒక్కర్నే ఎన్నుకోవాల్సి వస్తే వారు తమ తక్షణ అవసరాల్ని తీర్చేవారినే ఎంచుకుంటారు.  ఉద్యమకారులు కూడా తమ తక్షణ అవసరాల్ని తీరుస్తారు అని నమ్మకం కుదిరిప్పుడే వాళ్ళను గెలిపిస్తారు. ఇలా అస్సాంలో ఒకసారి, ఢిల్లీలో ఒకసారి జరిగింది కూడా.

ఉద్యమాలు, నిరాహార దీక్షల్లో ఇరోమ్ చాను షర్మీలకూ, కేసిఆర్ కూ ఒక పోలిక వుంది. నిరాహార దీక్ష కాలంలో ఇంఫాల్ లోని జే-నిమ్స్ లో ఇరోమ్ నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ఫీడింగ్ చేసేవారు. కేసిఆర్ నిరాహార దీక్ష చేసినపుడు హైదరాబాద్ నిమ్స్ లో కూడా అదే పధ్ధతిని పాటించారని అంటారు.  అయితే, ఇద్దరికీ ఒక తేడా కూడా వుంది. ఇరోమ్ కు ఉద్యమం మాత్రమే తెలుసు. కేసిఆర్ కు ప్రధాన స్రవంతి రాజకీయం తెలుసు; దాని కోసం ఉద్యమించడం తెలుసు.

ఉద్యమాల నుండి కేసిఆర్ రాజకీయాధికారాన్ని చేపట్టారనేది కూడా అర్ధ సత్యమే. తెలంగాణ ఉద్యమం రెండవ దశకు ముందు కూడా కేసిఆర్ కు ప్రధాన స్రవంతి రాజకీయాల్లో అపార అనుభవం వుంది. ఆయన తొలిదశలో కాంగ్రెస్ లోనూ, రెండవ దశలో తెలుగుదేశంలోనూ పార్లమెంటరీ రాజకీయాల్లో ఆరితేరారు. యన్టీ రామారావును దించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు వైశ్రాయి హొటల్ లో సాగిన వ్యూహప్రతివ్యూహాల్లో వారిది కీలకపాత్ర. 2004 ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు వెళ్ళగానే ఆయన తనకిచ్చిన మంత్రి పదవిని కొన్నాళ్ళు త్యాగంచేసి సోనియాగాంధీ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మారడానికి అప్పుడు పడ్డ పునాదే కారణమన్నా అతిశయోక్తికాదు.

అలా పార్లమెంటరీ రాజకీయాల అనుభవం లేకుండా కేవలం ఉద్యమాలనేనమ్ముకున్న వాళ్ళు ఇప్పుడెక్కడున్నారూ? ‘వరంగల్ డిక్లరేషన్’ సభ నిర్వాహకులెక్కడ? నాటి సభాధ్యక్షులు కాళోజీ, సభా నాయకులు ప్రొఫెసర్ జయశంర్ ఇప్పుడు మన మధ్య లేరు.  ఆ సభ నిర్వహణ సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ సాయిబాబా యావజ్జీవవ కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. 

(రచయిత సమాజ విశ్లేషకులు)

మొబైల్: 9010757776

హైదరాబాద్
13 మార్చి 2017

ప్రచురణ :
ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ మార్చి 15, 2017

http://www.andhrajyothy.com/artical?SID=382424 

Wednesday, 12 April 2017

ముస్లిం సాహిత్యం - ముస్లీంవాద సాహిత్యం - మతఅల్పసంఖ్యాకవాద సాహిత్యం

A.m. Khan Yazdani Danny
8 April 2017

 ముస్లిం జీవితాల్లోని పేదరికాన్నీ, దైన్యాన్నీ, సంధిగ్ధాన్నీ స్కైబాబా చాలా హృద్యంగా, సున్నితంగా చిత్రీకరిస్తాడు. తెలుగు కథా సాహిత్యంలో ముస్లిం జీవితాలను చిత్రించినందుకు ఎవరయినా స్కైబాబాను మొచ్చుకోవలసిందే. ముబారక్ చెప్పాల్సిందే. అయితే, స్కైబాబా కథలు ముస్లిం మైనారిటీల కథలేగానీ మత మైనారిటీల అస్థిత్వవాద కథలు కావు. ముస్లిం కథలకూ మతమైనారిటీల అస్థిత్వవాద కథలకు మధ్య తేడా స్కైబాబాకు తెలియని అంశం కూడా కాదు. స్కైబాబా ఇతర సందర్భాల్లో ప్రస్తావించే హిందూత్వ ముప్పు, ముస్లింల అభద్రత, దానితో ఘర్షణ ఆయన అధూరే కథల్లో కనిపించవు. ఇతర సమూహాలతో సంఘర్షణని చిత్రించని సాహిత్యాన్ని అస్థిత్వవాద సాహిత్యం అనలేం. దళిత అస్థిత్వవాద సాహిత్యం అంటే తప్పని సరిగా ఆధిపత్యకులాలతో సంఘర్షణని చిత్రించాలి అనే నియమం వున్నట్టే మత మైనారిటీ వాద సాహిత్యం తప్పనిసరిగా మతమెజారిటీ వాదంతో సంఘర్షణని చిత్రించాలి అనే నియమం కూడా వుంటుంది. స్కైబాబా కథలు ఇంకా అక్కడికి చేరలేదు. ముస్లింవాదం అనే పదం ప్రచారంలోనికి వచ్చేసిందిగానీ దీని మీద కూడా నాకు అభ్యంతరం వుంది. మతమైనారిటీవాదం అంటే సాంకేతికంగా సరిగ్గా వుంటుంది. హిందూత్వ మతమెజారిటీవాదంతో అణిచివేతకు గురవుతున్న శిక్కు, క్రైస్తవ తదితర సమూహాల ఇబ్బందులు కూడా మతమైనారిటీవాదం లోనికి వస్తాయి.
Like · Reply · 2 · April 8 at 10:12pm

Yousuf Baba Shaik
Yousuf Baba Shaik ''దళిత అస్థిత్వవాద సాహిత్యం అంటే తప్పని సరిగా ఆధిపత్యకులాలతో సంఘర్షణని చిత్రించాలి అనే నియమం వున్నట్టే'' -ఇలా ఎవరు చెప్పారు (A.m. Khan Yazdani) Danny గారూ మీతో ???!!! అన్నీ మీరే ఊహించుకుంటారులా ఉంది. అలాగే- ''మత మైనారిటీ వాద సాహిత్యం తప్పనిసరిగా మతమెజారిటీ వాదంతో సంఘర్షణని చిత్రించాలి అనే నియమం కూడా వుంటుంది.'' -ఇలా మీరు కాయం చేస్తున్నారా?! చిత్రంగా ఉంటుంది మీ వాదన! మీ తలుపుకు ఏది వస్తే అదే మీకు ఫైనల్ కావచ్చు. కానీ మాకు కాదని గమనించ మనవి.

12 April 2017

ముస్లిం సాహిత్యం - ముస్లీంవాద సాహిత్యం - మతఅల్పసంఖ్యాకవాద సాహిత్యం 



మిత్రులు స్క్కైబాబాగారికి!

''దళిత అస్థిత్వవాద సాహిత్యం అంటే తప్పని సరిగా ఆధిపత్యకులాలతో సంఘర్షణని చిత్రించాలి" అనే నియమాన్ని, నిర్వచనాన్ని నేనే రూపొందించాను. నాకన్నా ముందు కూడా ఇలాంటి నియమాన్ని మరికొందరు కూడా రూపొందించి వుండవచ్చు. అవి నా దృష్టికి రాలేదు.

 ''మత మైనారిటీ వాద సాహిత్యం తప్పనిసరిగా మతమెజారిటీ వాదంతో సంఘర్షణని చిత్రించాలి" అనే నియమాన్ని మాత్రం   ఖాయంగా నేనే  చేశాను.  ఖలిస్తాన్ ఉద్యమ నేపథ్యంలో 1984లో నేను శిక్కుల మీద  రాసిన 'కృపాణ్' కథ లోనే ఈ అంశాన్ని ప్రతిపాదించి ఆచరించాను. అప్పటికి తెలుగులో  దళిత సాహిత్యం ఇంకా ఆవిర్భవించలేదు. అప్పుడు మీరేం చేస్తున్నారో కూడా నాకు తెలీదు.

నా ఈ నిర్వచనాన్ని కొత్తగా మీ 'అధూరే' కథల కోసం చేయలేదు. నా సాహిత్య వ్యాసాల్లో చాలా చోట్ల ఈ అంశాన్ని వివరించాను. అనేక ఉపన్యాసాల్లోనూ ప్రస్తావించాను. 2015 మే 4న  ‘ప్రాతినిధ్య కథ-2014’ ఆవిష్కరణ ప్రసంగంలో మరోసారి ప్రస్తావించాను.  అందులో కొంత భాగాన్ని సాక్షి దినపత్రిక మే 24, 2015న ప్రచురించింది.

http://www.sakshi.com/news/opinion/writer-critic-danys-opinion-on-stories-242381

మీరు మంచి కథకులు. అందులో సందేహంలేదు. అయితే, నా నిర్వచనం ప్రకారం అధూరే కథల్లో  ముస్లిం పాత్రలుంటాయిగానీ అవి మత అల్పసంఖ్యాక (మైనారిటీ) వాద కథలు కావు. అసలు ముస్లీంవాదం అనవద్దు మత అల్పసంఖ్యాక (మైనారిటీ) వాదం అనమని ఇంకో కీలక ప్రతిపాదన చేశాను. దాన్నీ మీరు దాట వేశారు.

కథకు  (three-act structure) మూడు అంకాల నిర్మితి వుంటుందనిగానీ, అందులో  Confrontation  అతి పెద్దది, ప్రాణప్రదమైనది అనిగానీ మీకు బొత్తిగా తెలిసినట్టులేదు.

నా నిర్వచనాలని మీరు అంగీకరించాల్సిన పనిలేదు.  కానీ నా నిర్వచనాన్ని మీరు ఏ సామాజిక  ప్రయోజనాలను ఆశించి ఖండించదలిచారో చెప్పాల్సిన బాధ్యత మీ మీదవుంది.

మన సంవాదాల్లో కీలకమైన కొన్ని పారిభాషిక పదాల  మీద మీరు ఇప్పటి వరకు మీ అభిప్రాయాన్నిగానీ, నిర్వచనాలనుగానీ ఇవ్వలేదు.  ఈసారయినా ఈ కింది వాటికి మీ నిర్వచనాలు ఇస్తారని ఆశిస్తాను.

1. ముస్లింలు అంటే ఎవరూ?
2. ముస్లింల కథలకూ ముస్లింవాద కథలకూ ప్రధాన తేడా ఏమిటీ?
3.  ముస్లింవాద సాహిత్యం అనకుండా దాన్ని  మత అల్పసంఖ్యాక (మైనారిటీ) వాద సాహిత్యం అనడం సమంజసమా? కాదా?

మేధోరంగంలో పలాయనవాదాలు, దాగుడు మూతలు నాకు పరమ చిరాకు. మీరు తరచూ ఆపనే చేస్తున్నారు. ఇప్పుడయినా నిలబడి మాట్లాడుతారని ఆశిస్తాను.

మీరు వారం రోజులు సమయం తీసుకోండి. కావాలంటే ఈ నెలాఖరు వరకూ గడువు తీసుకోండి. చమన్ సంపాదకవర్గం, సలహావర్గం అభిప్రాయాలూ తీసుకోండి. కేవలం ఈ మూడు పదాలను నిర్వచించండి. చాలు.

- డానీ.


13-4-2017

స్కైబాబాగారూ!
రెడ్డొచ్చె సామెత మీకే వర్తిస్తుంది.  వయసులోనేగాక రచయితగా, ఉద్యమ కార్యకర్తగా నేను మీకన్నా ముందు నుండే వున్నాను. అంచేత కొత్తగా వచ్చిన రెడ్డి మీరే అవుతారు.

నిజానికి ఇది మన చర్చనీయాంశంకాదు. మన చర్చనీయాంశం మూడు కీలక విషయాల మీద.

1.   ముస్లింలు అంటే ఎవరూ?
2.     ముస్లింల కథలకూ ముస్లింవాద కథలకూ ప్రధాన తేడా ఏమిటీ?
3.     ముస్లింవాద సాహిత్యం అనకుండా దాన్ని మత అల్పసంఖ్యాక (మైనారిటీ) వాద సాహిత్యం అనడం సమంజసమా? కాదా? 

మీరుగానీ, మీ మిత్రబృదంగానీ, మీ చమన్ సంపాదకవర్గంగానీ, చమన్ సలహావర్గంగానీ ఈ మూడు అంశాలని ఎక్కడయినా నిర్వచించారా? ఒక వేళ నిర్వచించి వుంటే వాటిని మీరు కోట్ చేయగలరు.

చర్చను పక్కదోవ పట్టించే చవకబారు గారడీలు ఇకనైనా మానండి. చర్చకు సిధ్ధంకండి.   


-        డానీ



Indus Martin,  Rajitha Kommu గార్లకు,
అధూరే కథలు బాగుంటాయి, స్కైబాబా మంచి కథకుడు అని నేను సహితం మెచ్చుకున్న సంగతిని మీరిద్దరూ దాటవేయడం బాగోలేడు. చర్చ అధూరే కథల మీద కాదు.   సాహిత్య విమర్శకుడిగా స్కైబాబా ముస్లీంవాదం గురించి మట్లాడుతున్నాడు. అతనికి ముస్లీం అంటే నిర్వచనం  తెలీదు, ముస్లీంవాదం అంటే అంతకన్నా తెలీదు. రెండు విషయాలలే ఇక్కడ కీలకం.

ఇప్పుడు ముస్లింలకు పనికివచ్చేపనుల్లో తాను వున్నట్టు స్కైబాబా చెపుతున్నారో అదే ముస్లీంలకు పనికివచ్చే పనిలోనే మేమూ వున్నాము. దానికి కూడా నిర్వచనాలే ముఖ్యం. ముస్లింలు అంటే ఎవరో చెప్పలేని వారు ముస్లింల కోసం ఎలా పనిచేస్తారూ?

 మీ నోటేంట మూడు ముక్కలు వింటే అంశాల మీద ఒక స్పష్టత వస్తుందని అడుగుతుంటే పెద్ద మనిషి అలా దాట వేస్తారు దేనికీ? దాట వేయడం దాటి వెళ్లడం అవ్వదని స్కైబాబా గారికి చెప్పండి.

మీ ఇద్దరికీ తెలియాల్సిన విషయం ఇంకోటి వుంది. నిర్వచనం అడిగితే పుస్తకాల కేటలాగు ఇస్తారేమీటీ? అందులో ఖాదర్ మొహియుద్దీన్ 'అలావా' కు రాసిన ముందుమాటను కూడా పేర్కొన్నారు. ఇక్కడ విచిత్రం ఏమంటే ఖాదర్ ముందుమాటలో ముస్లింల నిర్వచనం ఇచ్చే సందర్భంలో నా మాటల్నే యధాతధంగా కోట్ చేశాడు. అంటే అది నా నిర్వచనమేస్కైబాబా  నా నిర్వచనాన్నే నన్ను చదువుకోమంటున్నారా? ఇంతకన్నా మేధోదివాళాకోరుతనం ఎక్కడయినా వుంటుందా

Indus Martin గారికి నిర్వచనాలే పడవుగనుక వారిని వారి మానాన వదిలేద్దాం. నిర్వచనాలతో పనిలేనివాళ్లతో నాకూ పనిలేదు.

నాకు నా  మతసమూహపు ప్రయోజనాల కోసం నిర్వచనాలు ప్రాణప్రదమైన అంశాలువారి పక్షాన వచ్చారు కనుక మీరయినా మూడు పదాలకు నిర్వచనం ఇస్తే తరువాత చర్చచేద్దాం. అంతేకానీ ముస్లీం అనే పదానికి నిర్వచనం తెలీకుండా, ముస్లీంవాదం అంటే అర్ధం తెలీకుండా  ముస్లింల కోసం పాటుపడుతున్నాం అనే తిప్పడి (బాలనాగమ్మ నాటకంకబుర్లు చెప్పవద్దని పెద్దమనీషికి చెప్పండి. అతని పక్షాన మీరు అర్ధాలు చెపుతామన్నా నాకేమీ అభ్యంతరంలేదు. మీరూ నిరక్షరాశ్యులే అయితే చర్చలో దిగవద్దు. ప్లీజ్.

I am not obsessed. Definitions are the dire need and lifeline of my community in the hours of crisis. The stark question is can you define it or not?


- డానీ