Saturday, 22 April 2017

Row Over Affirmative Action For Muslims

Row Over Affirmative Action For Muslims

   
ముస్లిం కోటాపై ఎందుకీ గగ్గోలు?

-        ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)

స్వాతంత్రానంతర భారతదేశం ఉత్పత్తిరంగంలో అద్భుతమైన విజయాలు సాధించింది.  ఇంతటి సంపదను సృష్టించినపుడు అది సహజంగానే సామాజికశాంతికి దోహదపడి వుండాల్సింది.  కానీ, అలా జరగలేదు. లోపభూయిష్టమైన పంపిణీ వువస్థ అనేక అనర్ధాలకు దారితీసింది. సహజ వనరులకు, మానవశ్రమను జోడించినపుడు సంపద సృష్టి అవుతుంది. సహజవనరుల్లో దేశప్రజలందరికీ సహజహక్కు వుండడమేగాక, ఉత్పత్తి క్రమానికి అవసరమయిన శ్రమలోనూ  అందరి భాగస్వామ్యం తరతమ స్థాయిల్లో వుంటుంది గనుక ఉత్పత్తి అయిన సంపదలోనూ అందరికీ భాగస్వామ్యం వుండాలి. కానీ అలా జరగడంలేదు. సృష్టి అవుతున్న సంపద అంతా కొన్ని కులాల,  నిజానికి కులాలు కూడా కాదు, కొన్ని కుటుంబాల చేతిల్లోనికి వెళ్ళిపోతున్నది. దానితో ఒకవైపు, ప్రపంచం స్థాయి ఐశ్వర్యవంతుల సంఖ్య భారతదేశంలో పెరుగుతుంటే మరోవైపు ప్రపంచంలో మరెక్కడా లేనంతగా పేదప్రజల జనాభా  మన దేశంలో పెరుగుతోంది. ఈ క్రమం  ఓ పాతికేళ్ళుగా చాలా వేగవంతగా సాగుతోంది. అభివృధ్ధి అంటే పెరుగుదల కాదనే ఆర్ధిక సిధ్ధాంతాలు  ఈ  నేపథ్యంలోనే ముందుకు వచ్చాయి.

ప్రభుత్వ ఆలంబన లేకుండా ఆదివాసీలు, దళితులు మనుగడ సాగించలేరని మన రాజ్యాంగ నిర్మాతలు భావించారు. వారి కోసం ఉద్దీపన చర్యల్ని చేపట్టారు.  దీనినే మనం సాధారణ భాషలో రిజర్వేషన్లు అంటున్నాం. స్వాతంత్రం వచ్చిన పదేళ్ళ తరువాత ఆదివాసీలు, దళితుల సామాజిక, ఆర్ధిక పరిస్థితి మెరుగు పడిపోతుందనీ, అప్పుడు ఉద్దీపన చర్యల్ని ఉపసంహరించుకోవచ్చని కూడా వారు భావించారు. పదేళ్ళుకాదుకదా డెభ్భయి ఏళ్ళయినా  ఆదివాసీలు, దళితులు సామాజికార్ధిక పరిస్థితి మెరుగుపడలేదు. అంతేకాదు, సామాజికార్ధిక రంగాలలో కిందికి దిగజారుతున్న ప్రజాసమూహాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాళ్ళంతా రిజర్వేషన్ల గుమ్మం ముందు నిలబడడం మొదలెట్టారు.  ముందు హిందూ సమాజంలోని నిమ్నకులాలు చేరాయి. ఆ వెనక, సంపద అసమాన పంపిణీ ఫలితంగా రోడ్డున పడుతున్న అనేక సమూహాలు ఇప్పుడు రిజర్వేషన్ల తలుపుతడుతున్నాయి.

గుజ్జార్లు రిజర్వేషన్ల తలుపుతడితే అందరికీ సమంజమే అనిపించింది. జాట్లు, పటేళ్ళు కూడా రిజర్వేషన్ల గుమ్మం ముందు నిలబడినపుడు పెద్దగా అభ్యంతరం రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో కాపులు సహితం రిజర్వేషన్ల గుమ్మం తలుపులు బద్దలగొడుతుంటే జాలిపడ్డారుగానీ ఎవరూ అడ్డుపడలేదు. అలా  హిందువులు, బైధ్ధులు, శిక్కులు, క్రైస్తవులు ఈ రిజర్వేషన్ ప్రసాదాన్ని ఎంతో కొంత అందుకున్నారు. చివర్న, ముస్లింలు కూడా వచ్చి రిజర్వేషన్ల గుమ్మం ముందు నిలబడగానే మిన్ను విరిగి మీద పడ్డట్టు దాదాపు  అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఇలా కొన్ని మాతాల ప్రజాసమూహాలకు ఉద్దీపన ఉపశమనాన్ని కల్పించి  కొన్ని మతాలకు నిరాకరించడం భారతరాజ్యంగ  లౌకిక స్పూర్తికి  భంగకరమని ఒక్కరంటే ఒక్కరికీ తోచడంలేదు.

డెబ్భయి ఏళ్ళుగా  ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసిఆర్, తాము అధికారంలోనికి వస్తే ముస్లింలలోని వెనుకబడినవర్గాలకు ఇప్పుడున్న రిర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని 2014 ఎన్నికల్లో  వాగ్దానం చేశారు. మీడియావాళ్ళు రాత సౌలభ్యం కోసం ముస్లిం రిజ్ర్వేషన్ గా దాన్ని పేర్కొన్నారుగానీ సాంకేతికంగా అది ముస్లిం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్.

 అధికారంలోనికి వచ్చిన తరువాత కేసిఆర్  ముస్లీంల సామాజిక స్థితి గతుల్ని పరిశీలించడానికి సుధీర్ కమిటీని వేశారు.  ముస్లిం వెనుకబడిన కులాలకు ఇప్పుడున్న రిజర్వేషన్ల శాతానికి మరో ఆరు శాతం కలపవచ్చని ఆ కమిటీ సిఫారసు చేసింది. దాన్నీ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమీషన్ కూడా ఆమోదించడంతో ముస్లిం వెనుకబడిన కులాలకు ఇస్తున్న రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి రంగం సిధ్ధమైంది. ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఏప్రిల్ 16న శాసన మండలి, శాసనసభ ఆమోదం తెలుపడంతో రాష్ట్ర స్థాయిలో  దీనికి సంబంధించిన ప్రక్రియలు, లాంఛనాలు అన్నీ పూర్తి అయినట్టే. ఇక తదుపరి ప్రక్రియ పార్లమెంటులో సాగుతుంది.  

హిందూత్వ ఓటు బ్యాంకు రాజకీయాల మీద ఆధారపడే బీజేపి నాయకులు ముస్లిం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ పెంపును అడ్దుకోవడానికి భూమ్యాకాశాలను ఏకం చేస్తున్నారు. పొంతనలేని వాదనలను ప్రవేశపెడుతున్నారు.  ముస్లిం వెనుకబడిన తరగతులకు ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్లు ఏమీ ఇవ్వడంలేదనే ఒక వాస్తవాన్ని ప్రజల దృష్టి నుండి  మళ్ళించడానికి అనేక తంటాలు పడుతున్నారు.

రాష్ట్ర ఓబీసీ జాబితా బీసీ-ఏ లో  మెహతర్ (39) వెనుకబడిన తరగతికీ, బీసీ-బీలో  దూదేకుల, లద్దాఫ్, పింజారి, నూర్ బాషా (5) వెనుకబడిన తరగతులకు  నాలుగు దశాబ్దాలుగా రిజర్వేషన్ సౌకర్యం వుంది. 2007లో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఓ పధ్నాలుగు ముస్లిం వెనుకబడిన తరగతులను బీసీ-ఇ లోచేర్చి 4 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. కేసిఆర్ ప్రభుత్వం ఒక్క ముస్లిం సామాజికవర్గానికి కూడా  కొత్తగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించలేదు. పాత సామాజికవర్గాలకే వున్న కోటాను పెంచారు. బీసీ-ఏ, బీసీ-బీ లో ఒకశాతం, బీసీ-ఇ లో 4 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ముందే వున్నాయి. కేసిఆర్ పెంచింది ఇంకో 7 శాతం.

ముస్లిం వెనుకబడిన తరగతులకు 12 శాతం కోటా ఇవ్వడంపై కూడా ఒక  వివాదం నడుస్తోంది.  దేశజనాభాలో ముస్లీంలు 12 శాతం మాత్రమే వున్నప్పుడు వారికి అంత కోటా ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏళ్ళ తరబడి ముస్లిం వెనుకబడిన తరగతులను కోటాకు దూరంగా వుంచి చేసిన అన్యాయన్ని సరిదిద్దడానికి కోటాను పెంచడం ధర్మమే. అసమాన వివక్షకు గురైనవారికి అసమాన న్యాయం చేయడం కూడా ఒక న్యాయమే.

ముస్లిం వెనుకబడిన సామాజికవర్గాలకు ఉద్దీపన చర్యల్ని అడ్డుకోవడానికి సంఘ్ పరివారం ముందుకు తెచ్చిన  వాదన సారాంశం ఏమంటే, రిజర్వేషన్లను కులాల ప్రాతిపదినకనే ఇస్తారు కనుక, హిందూమతంలో మాత్రమే కులాలు వుంటాయి కనుక రిజర్వేషన్లు మొత్తంగా హిందువులకు మాత్రమే చెందాలి అని. చూస్తుంటే వీరంతా భారత రాజ్యాంగానికీ మనుధర్మశాస్త్రానికీ తేదాలేకుండా చేసేస్తున్నారనిపిస్తోంది.

భారత దేశంలోని అన్ని మత సమూహాలలోనూ విభిన్న సామాజికవర్గాలున్నాయని తెలియనివారు ఇప్పుడు ఎవ్వరూ వుండరు. పైగా, దాదాపు స్మస్త మతాల సామాజికవర్గాలకు ఇప్పుడు కులప్రాతిపదికన రిజర్వేషన్లు వున్నాయి.  “ఇస్లాంలో కులాలు వుండవవి ముల్లాలే చెపుతుంటే ముస్లింలు కులప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఎలా కోరుతారని  బీజేపి శాసనపక్ష నేత కిషన్ రెడ్డి గడుసుగా అడుగుతున్నారు. ముస్లిం పేదల కంట్లో  ఇస్లాం వేలితో పొడిచే ప్రయత్నమిది. ముల్లాల వరకు దేనికీ? ఏ హిందూ పీఠాధిపతిని  అడిగినా తమ మతంలో వివక్షలేదనీ హిందువులందరూ సమానులే అని చెపుతారు. దాన్ని ఆధారం చేసుకుని హిందూ సామాజికవర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారా?

మరోవైపు, బీజేపి జాతీయనేత  వెంకయ్య నాయుడు ముస్లిం సమాజంలోనూ కులాలున్నాయని గట్టిగా చెపుతున్నారు. అక్కడ కూడా వివక్ష వున్నప్పుడు మతం మారడం దేనికని వారు హిందూ నిమ్నకులాలకు హితవు చెపుతున్నారు. వెంకయ్య నాయుడు ఈ మాటలు అంటున్నపుడు కిషన్ రెడ్డి ఆ పక్కనే వున్నారు. ఏవిధంగా నయినా ముస్లింల అభివృధ్ధిని అడ్డుకోవడమే వాళ్ళ లక్ష్యంలా వుంది.

ఇంతకీ బీసీ రిజర్వేషన్లకు కులం మాత్రమే ప్రాతిపదిక కాదు. యస్ సీ లో ‘సి’ అంటే క్యాస్ట్ అయినట్టు బీసీలో ‘సీ’ అంటే క్యాస్ట్ కాదు.  క్లాసెస్, కేటగరీస్, వర్గం, తరగతి, సమూహం అని అర్ధం. ఏ సమూహమైనసరే సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడివుంటే వాళ్లను ఆదుకోవడానికి బ్యాక్ వర్డ్ క్లాసెస్ గుర్తింపునిచ్చి ఉద్దీపన చర్యలు చేపట్టాలనేది  రాజ్యంగ భావన.

ముస్లిం రిజర్వేషన్లతో హిందూ-ముస్లింల ఐక్యత దెబ్బతింటుందని వెంకయ్యనాయుడు వంటివారు ఇప్పుడు కొత్త హెచ్చరికలు చేస్తున్నారు. ఇది నిరాధారమైన తప్పుడు ఆందోళన. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన ప్రజాసమూహాలను ప్రభుత్వాలు ఆదుకుంటే, సామాజిక భద్రత మెరుగుపడి, పరస్పర విశ్వాసాలు పెరిగి, హిందూ-ముస్లింల ఐక్యత బలపడి,  సామాజిక శాంతి నెలకొంటుంది. ముస్లిం పేదవర్గాల కోసం చేపట్టే ఉద్దీపన చర్యల్ని అడ్డుకుంటేనే  వెంకయ్య నాయుడు చెప్పినట్టు హిందూ-ముస్లింల ఐక్యత దెబ్బతింటుంది.
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 9010757776

హైదరాబాద్
22 ఏప్రిల్ 2017

ప్రచురణ :
మనతెలంగాణ దినపత్రిక, 23-4-2017

http://epaper.manatelangana.news/1180908/Mana-Telangana-Daily/23-04-17#page/5/2

No comments:

Post a Comment