Agitations and Elections are not Synonyms
ఎన్నికల లెక్కలు వేరు!
-
-
డానీ
ఉత్తరప్రదేశ్
తో సహా ఐదు రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో
బీజేపి ఘనవిజయాన్ని సాధించడంకన్నా మణిపూర్ లో ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మీల ఘోర పరాజయం
పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో
ప్రజలు గెలిచేవాళ్లకే భారిమెజారిటీనిస్తారు; ఓడిపోయేవారికి ఘోర పరాజయాన్నిస్తారు అని
ఏకవాక్య తీర్మానంతో వదిలేయాల్సిన అంశం కాదిది. ఉద్యమాలకూ, ఎన్నికలకూ మధ్యవున్న సంబంధ్హాన్నీ
పునర్ నిర్వచించుకోవాల్సిన సందర్భం ఇది.
ఎన్నికల
వ్యాకరణం వేరు; ఉద్యమాల వ్యాకరణం వేరు. భారత పార్లమెంటరీ వ్యవస్థలో చీకటి కాలంగా భావించే
ఎమర్జెన్సీ ముగిసిన తరువాత 1977 మార్చిలో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు
అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మీద పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఘనవిజయం
సాధించగా ప్రజాకవి ధరావతు సొమ్మును కూడా కోల్పోయారు. ఇదంతా ఎన్నికల వ్యాకరణం ప్రకారమే
జరిగింది. నక్సలైట్ల మీద బూటకపు ఎన్ కౌంటర్లు మొదలెట్టి ఆంధ్రా ‘డయ్యర్’గా పేరుగాంచిన వెంగళరావు నాయకత్బంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి రాష్ట్రంలోని 42
లోక్ సభాస్థానాల్లో 41 చోట్ల ఘనవిజయం సాధించింది. నంధ్యాల స్థానాన్ని వెంగళరావు తన రాజకీయ గురువైన జనతాపార్టీ అభ్యర్ధి నీలం సంజీవరెడ్డికి ఉద్దేశ్య పూర్వకంగానే వదిలేశారు.
సంజీవ రెడ్డి రాష్ట్రపతిగా మారేక జరిగిన ఉపఎన్నికల్లో ఆ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో
పడిపోయింది. అంటే ఎమర్జెన్సీని విధించిన పార్టీకి
ఓట్లర్లు నూటికి నూరు శాతం సీట్లు కట్టబెట్టారు.
1994
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాన్షీరామ్ నాయకత్వంలోని బీయస్పీ ఒక వెలుగు
వెలిగింది. యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ, కొండొకచో కాపుసామాజికవర్గం కూడా ఏకమై ఒక ప్రభంజనంగా కనిపించారు. అప్పట్లో, మదరాసు వెళుతున్న
ఎస్. జైపాల్ రెడ్డిని విజయవాడ రైల్వేస్టేషన్లో కలిసిన ఓ సన్నిహితుడు కాన్షీరామ్
ప్రభంజనం గురించి చాలా ఉత్సాహంగా చెప్పాడు. అంతా విన్నాక ఆయన ఓ సందేహాన్నివెలిబుచ్చారు.
“కమ్మ, రెడ్డి, క్షత్రీయ, పెద్దకాపు సామాజికవర్గాలు కాన్షీరామ్ వెనక చేరాయా?” అని అడిగారు.
“లేదు” అని సన్నిహితుని సమాధానం. “వాళ్ల మద్దతు లేకుండా గెలవడంకష్టం కదా?” అని చల్లగా
సెలవిచ్చారు జైపాల్ రెడ్డి. వారు చెప్పినట్టే ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 స్థానాల్లోనూ
బియస్పీ అభ్యర్ధులు ఓడిపోయారు. పొన్నూరు నుండి పోటీ చేసిన కత్తిపద్మారావు ఒక్కరికి
మాత్రమే దరావత్తు సొమ్ము దక్కింది మిగిలినవాళ్ళకు ఆపాటి గౌరవమూ దక్కలేదు. అప్పటి వరకు
ఎన్నికల బహిష్కరణ రాజకీయాల్లోవున్న నక్సలైటు అగ్రనేత కేజీ సత్యమూర్తి / శివసాగర్ ఆ
ఎన్నికల్లో పాల్గొనడం అప్పట్లో పెద్ద సంచలనం. ముదినేపల్లి నుండి పోటీ చేసిన శివసాగర్ కు 1400 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇది కూడా
అప్పట్లో ఉద్యమాలకు జరిగిన ఘోర ఘోరపరాభవమే!
మణిపూర్
ఎన్నికల్లో ఇరోమ్ చాను షర్మీల ఓటమి మింగుడు పడక, ఆమెను ఓడించిన రాష్ట్ర ప్రజల్ని తప్పుపట్టలేక
అనేక వాదనలు ముందుకు వస్తున్నాయి. “మమ్మల్ని మన్నించు ఇరోమ్” అంటూ కొన్ని మీడియా సంస్థలు
కథనాలు కూడా ప్రచురించాయి. అనేకానేక స్వప్నాలు, సమస్యలు, పరిష్కారాలు, హామీలు, ఊరింపులు, బుజ్జగింపులు,
బెదిరింపులు, మచ్చికల సమాహారంగా ఎన్నికలు సాగుతాయి. ఉద్యమాలకు ఏదో ఒక లక్ష్యం మాత్రమే
వుంటుంది. అది ఎన్నికల విస్తృత కలల్ని నెరవేర్చదు.
మణిపూర్
లో సాయుధ దళాలు సాగించే దురాగతాలకు వ్యతిరేకంగా
ఇరోమ్ దాదాపు రెండు దశాబ్దాలుగా పోరాడుతోంది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) ను రద్దు చేయాలనేది ఆమె ప్రధాన డిమాండ్. దానికోసం ఆమె
రికార్డు స్థాయిలో పదహారేళ్ళు నిరాహార దీక్ష చేసింది. అయితే ఈ పదాహారేళ్ళలో మణిపూర్
లో చాలా మార్పులు వచ్చాయి. మొదటిది; సాయుధ
దళాలు గతంలోలా కాకుండా కొంచెం ఆచీతూచీ ప్రవర్తిస్తున్నాయి. ఆ మేరకు ఇరోమ్ ప్రాసంగీకత
తగ్గిపోయింది. రెండోది, మణిపూర్ ప్రజలు పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఇంకా చాలా వున్నాయి.
విద్యా, వైద్యం, మౌళికరంగం, ఆధునిక అభివృధ్ధి వగయిరాలు ఇందులో వున్నాయి. వీటికి ఇరోమ్
పరిధి సరిపోదు. సిట్టింగ్ సీయం ఓక్రోమ్ ఇబోబి సింగ్ ను రాజకీయంగా ఎదుర్కోవడం అంటే ఆయన్ని
ఆయన నియోజకవర్గం థౌబాల్ లోనే ఢీకొని ఓడించనవసరంలేదు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన
వ్యక్తికి ఎన్నికల నిర్వహణలో వుండే అపార అనుభవం, అందుబాటులో వుండే యంత్రాంగం, వనరులు
వీటన్నింటినీ ఆమె తక్కువగా అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్ లో అధికారాన్ని సాధించడానికి
బీజేపి 900 ప్రదర్శనల్ని, 10 వేల వాట్సప్ గ్రూపుల్నీ,
67 వేల మంది కార్యకర్తల్ని రంగంలోనికి దించిందని ఇప్పుడు గణాంకాలు బయటికి వచ్చాయి.
అంతగా కాకున్నా అందులో కొంతన్నా మణిపూర్ లో ఓక్రోమ్ ఇబోబి సింగ్ కూడా వాడి వుంటారుగా!
అలా కాకుండా, తన స్వంత తన నియోజకవర్గం ఖురై నుండి ఇరోమ్ పోటీ చేసి
వుంటే గెలిచినా గెలవకపోయినా ఇంత పరాభవం అయితే
జరిగి వుండేదికాదు. ఉద్యమకారులు “మేము కావాలా? వాళ్ళు కావాలా?” అంటూ ప్రజలకు ఛాయిస్ లేకుండా చేయకూడదు.
నిజానికి ప్రజలకు ఇద్దరూ కావాలి. ఒక్కర్నే
ఎన్నుకోవాల్సి వస్తే వారు తమ తక్షణ అవసరాల్ని తీర్చేవారినే ఎంచుకుంటారు. ఉద్యమకారులు కూడా తమ తక్షణ అవసరాల్ని తీరుస్తారు
అని నమ్మకం కుదిరిప్పుడే వాళ్ళను గెలిపిస్తారు. ఇలా అస్సాంలో ఒకసారి, ఢిల్లీలో ఒకసారి
జరిగింది కూడా.
ఉద్యమాలు,
నిరాహార దీక్షల్లో ఇరోమ్ చాను షర్మీలకూ, కేసిఆర్ కూ ఒక పోలిక వుంది. నిరాహార దీక్ష
కాలంలో ఇంఫాల్ లోని జే-నిమ్స్ లో ఇరోమ్ నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ఫీడింగ్ చేసేవారు.
కేసిఆర్ నిరాహార దీక్ష చేసినపుడు హైదరాబాద్ నిమ్స్ లో కూడా అదే పధ్ధతిని పాటించారని
అంటారు. అయితే, ఇద్దరికీ ఒక తేడా కూడా వుంది.
ఇరోమ్ కు ఉద్యమం మాత్రమే తెలుసు. కేసిఆర్ కు ప్రధాన స్రవంతి రాజకీయం తెలుసు; దాని కోసం
ఉద్యమించడం తెలుసు.
ఉద్యమాల
నుండి కేసిఆర్ రాజకీయాధికారాన్ని చేపట్టారనేది కూడా అర్ధ సత్యమే. తెలంగాణ ఉద్యమం రెండవ
దశకు ముందు కూడా కేసిఆర్ కు ప్రధాన స్రవంతి రాజకీయాల్లో అపార అనుభవం వుంది. ఆయన తొలిదశలో
కాంగ్రెస్ లోనూ, రెండవ దశలో తెలుగుదేశంలోనూ పార్లమెంటరీ రాజకీయాల్లో ఆరితేరారు. యన్టీ
రామారావును దించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు వైశ్రాయి హొటల్ లో సాగిన వ్యూహప్రతివ్యూహాల్లో
వారిది కీలకపాత్ర. 2004 ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు వెళ్ళగానే ఆయన తనకిచ్చిన మంత్రి
పదవిని కొన్నాళ్ళు త్యాగంచేసి సోనియాగాంధీ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. సోనియా
గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మారడానికి అప్పుడు పడ్డ పునాదే కారణమన్నా
అతిశయోక్తికాదు.
అలా
పార్లమెంటరీ రాజకీయాల అనుభవం లేకుండా కేవలం ఉద్యమాలనేనమ్ముకున్న వాళ్ళు ఇప్పుడెక్కడున్నారూ?
‘వరంగల్ డిక్లరేషన్’ సభ నిర్వాహకులెక్కడ? నాటి సభాధ్యక్షులు కాళోజీ, సభా నాయకులు ప్రొఫెసర్
జయశంర్ ఇప్పుడు మన మధ్య లేరు. ఆ సభ నిర్వహణ
సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ సాయిబాబా యావజ్జీవవ కారాగార శిక్షను అనుభవిస్తున్నారు.
(రచయిత
సమాజ విశ్లేషకులు)
మొబైల్:
9010757776
హైదరాబాద్
13
మార్చి 2017
ప్రచురణ
:
ఆంధ్రజ్యోతి
ఎడిట్ పేజీ మార్చి 15, 2017
http://www.andhrajyothy.com/artical?SID=382424
No comments:
Post a Comment