Saturday, 22 April 2017

Triple Talaaq - Controvesy And Solution

Triple Talaaq -  Controvesy And Solution

తలాక్ వివాదం, పరిష్కారం

-        అహమ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)

మతాచారాలకు సంబంధించిన సున్నితమైన అంశాలను సామరస్యంగా  పరిష్కరించుకోవాలి.  ట్రిపుల్ తలాక్ మీద దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చ అందుకు భిన్నంగా జరుగుతోంది. పరస్పరం భావోద్వేగాలను రెచ్చగొట్టుకునే విధంగా చర్చ సాగుతోంది. ముస్లింలు స్త్రీల విషయంలో కౄరంగా వుంటారని ముస్లిమేతరులు ఆరోపిస్తుంటే,  అధికారాన్ని చేపట్టిన హిందూత్వ పార్టి తమ మత విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటున్నదని ముస్లీమ్లు ఆందోళన చెందుతున్నారు. కాలాను గుణంగా పర్సనల్ లా లో మార్పులు తేవాల్సిన మత పెద్దలు మీన మేషాలు లెక్కిస్తున్నారు.  
చర్చలోనికి ప్రవేశించడానికి ముందు మనం కొన్ని విషయాల్లో ఒక స్పష్టతను ఏర్పరచుకోవాలి. మినహాయింపు లేకుండా మతాలన్నీ ఫ్యూడల్ వ్యవస్థలో ఆవిర్భవించాయి. వాటిల్లో సహజంగానే పురుషాధిక్యత వుంటుంది. ఆ మేరకు స్త్రీల మీద అనేక రకాలుగా అదుపు వుంటుంది. దీనికి ఇస్లాం మినహాయింపేమీకాదు. అయితే, కొన్ని ఇతర మతసమూహాలతో పోలిస్తే ముస్లిం సమాజంలోని స్త్రీలకు కొన్ని అంశాల్లో హక్కులు ఎక్కువ. ఇస్లాంలో స్త్రీలకు ఆరవ శతాబ్దం నుండే ఆస్తి హక్కు వుంది. కొన్ని ఇతర మతాల్లో ఇటీవలి కాలం వరకూ స్త్రీలకు ఆస్థి హక్కు లేదు. స్త్రీలకు ఆస్తి హక్కు ఇస్తే అనర్ధాలు జరుగుతాయని వాదించిన వాళ్ళు మనకు సమీపగతంలోనే కనిపిస్తారు.  సంతానానికి జన్మ నివ్వడం ద్వార జాతి విస్తరణకు తోడ్పడం మాత్రమేగాక మతధర్మాలను తరువాతి తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా ముస్లిం  సమాజంలో స్త్రీలదే. కొన్ని మత సమూహాల్లో నిమ్నసమూహాలు మతగ్రంధాలను  చదవడంపై వున్న నిషేధం స్త్రీలకు కూడా వర్తిస్తుంది. దానికి భిన్నంగా ముస్లిం సమాజం మహిళలు నిర్బంధంగా మతగ్రంధాలను  చదవాలని ఆదేశిస్తుంది. బయటి సమాజం అంతగా గుర్తించక పోవచ్చుగానీ, ఉర్దూ, అరబ్బీలను అక్షరాశ్యతగా గుర్తిస్తే ముస్లిం సమాజంలో పురుషులకన్నా మహిళలే ఎక్కువ శాతం అక్షరాశ్యులు.  

వివాహానికి  సంబంధించి హిందూమత దృక్పథంలోనూ, ఇస్లాం మత దృక్పథంలోనూ విపరీతమయిన భిన్నత్వంవుంది.

శాస్త్రోక్తమైన హిందూ వివాహం సకలదేవతల సమక్షంలో జరిగే శాశ్విత బంధం. దాన్ని ఏడు జన్మల బంధంగానూ  భావిస్తారు.

ముస్లిం సమాజంలో పెళ్ళి అనేది ఇహలోక ఒప్పందం. చాలా మంది గమనించి వుండరు గానీ ముస్లిం వివాహంలో వధువు కన్యాగా వుండాలనే నియమం ఏమీలేదు. అది ఆమెకు పునర్వివాహం అయినా అభ్యంతరం వుండకూడదు. 

ముస్లిం వివాహంలో వధూవరులు కాకుండా కనీసం నలుగురు పెద్ద మనుషులు వుండాలి. ఒక ఖాజీ (పురోహితుడు), ఒక మధ్యవర్తి (వకీల్), ఇద్దరు సాక్షులు. ఒప్పందం అన్నప్పుడు అది ఎప్పుడు రద్దు (టెర్మినేషన్) అవుతుందో కూడా పేర్కొవాలి. పెళ్ళి సమయంలో “నాకు అంగీకారమే” (ఖుబూల్) అని మూడుసార్లు అన్నట్టే ఒప్పదం నుండి తప్పుకోవాలనుకున్నప్పుడు కూడా మూడుసార్లు “విడిపోతున్నాం” (తలాక్ / ఖులా) అని మూడుసార్లు చెప్పాలి. వీటిని హిందూ సాంప్రదాయంలో తాళికట్టడంతో పోల్చవచ్చు.  

లాంఛనాలకు ముందూ వెనక చాలా తతంగం వుంటుంది. కొన్ని సినిమాల క్లయిమాక్సుల్లో నాయకుడు ఫైటింగ్ చేస్తుండగా, ప్రతినాయకుడు ఏదో ఒక విధంగా నాయిక మెళ్ళో తాళీ కట్టేసే ప్రయత్నం చేస్తుంటాడు.  అలాగే మరికొన్ని సినిమాల్లో భార్య తాళి తెంచి భర్త ముఖాన కొట్టి వెళ్ళిపోయే దృశ్యాలూ వుంటాయి. ఇలా నిజజీవితంలోనూ జరుగుతుంటాయి. అయితే అవన్నీ లాంఛనాలే. లాంఛనాలే సమస్తం కాదు. లాంఛనాలను కొందరు దుర్వినియోగం చేస్తుంటారు. సమాజం వాటిని క్రమబధ్ధం చేస్తుండాలి.

స్త్రీ విద్య, స్త్రీలకు ఆస్తిహక్కు, వివాహ స్వేఛ్ఛ, విడాకులు తీసుకునే హక్కు  విధవాస్త్రీ పునర్ వివాహం, వంటి సంస్కరణలు ఇతర సమూహాల్లో 19, 20 శతాబ్దాల్లో మాత్రమే వచ్చాయి. ఈ ఐదు హక్కులూ ముస్లిం స్త్రీలకు 7వ శతాబ్దం నుండే వున్నాయి.

 ఆంధ్రప్రదేశ్ లో యన్టీ రామారావు హయాం మొదలయ్యే వరకు స్త్రీలకు ఆస్తి హక్కులేదు. స్త్రీలకు సమానత్వ హక్కు, ఆస్తిహక్కు, విడాకుల హక్కు కోసం 1951లో బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్లు మీద పార్లమెంటులో సాగిన హోరాహోరి పోరును ఒకసారి గుర్తు చేసుకుంటే వర్తమాన పరిణామాలను అర్ధం చేసుకోవడం సులువవుతుంది. అంబేడ్కర్ ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లుకు నిరసనగా హిందూమహాసభ ప్రతినిధి, పరిశ్రమలశాఖ మంత్రి శ్యామ ప్రసాద్ ముఖర్జీ తన మంత్రి పదవికి రాజీనామ చేశారు.  అపట్లో ఉధృతంగా సాగిన మహిళా ఉద్యమాల ఫలితంగా అనేక దశల్లో హిందూ కోడ్ బిల్లు సాకారం అయింది. అది తరువాతి చరిత్ర.

భర్తకు విడాకులు ఇచ్చే సమాన హక్కు ముస్లిం మహిళలకు కూడా వుంది. దీన్నే కులా అంటారు. అయితే విడాకుల సౌకర్యాన్ని దాదాపు అన్ని సమాజాల్లోనూ మహిళలకన్నా పురుషులే ఎక్కువగా వాడుతున్నారు. అతిగా వాడుతున్నారు. దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు ముస్లిం పురుషులు తలాక్ ను అపహాస్యం పాలు చేస్తున్నారు. తలాక్ సాంప్రదాయం మొదలయినపుడే ముస్లిం మత పెద్దల మధ్య పెద్ద సంవాదాలు  జరిగాయి. విడాకుల మీద సూత్రప్రాయంగా ఏకాభిప్రాయమే వున్నప్పటికీ అది దుర్వినియోగం అవుతుందనే ఆందోళన కూడా అప్పుడే వ్యక్తమయింది. దాంపత్యాన్ని నిలబెట్టడానికి ఎంతో నిగ్రహంతో ప్రయత్నించాలనీ, ఆ ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాకే   తలాక్ నిర్ణయం తీసుకోవాలనీ, మూడు విడతలుగా తలాక్ చెప్పాలనీ,  దీని కోసం కనీసం మూడు నెలల గడువు తీసుకోవాలని  రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ పారూఖ్ ఆదేశాలున్నాయి.

సైబర్ యుగంలో ట్రిపుల్ తలాక్  వెర్రి పుంతలు తొక్కుతోంది. ఒకేసారి “తలాక్ తలాక్ తలాక్” చెప్పేస్తే విడాకులు ఇచ్చేసినట్టే అని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి వాటిని మొదట్లోనే సభ్యసమాజం పట్టించుకోవాల్సి వుండింది. ఆర్ధిక రాజకీయ అభద్రతా బావంతో నలిగిపోతున్న భారత ముస్లిం సమాజం ఈరకం పెడధోరణుల్ని మొగ్గలోనే తుంచే బాధ్యతను మరచిపోయింది. దీని కోసం ప్రత్యేకంగావున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు ముందుగానే మేల్కొని ఒక్కసారిగా చెప్పే తలాకులు ఇస్లాం స్పూర్తికి విరుధ్ధం అని ప్రకటించి వుండాల్సింది. ఆ అంశం మీద స్పష్టతనిస్తూ ఫత్వాలు జారీచేసి వుండాల్సింది. అంతగా అవసరంలేని విషయాల మీద కూడా ఉత్సాహంగా ఫత్వాలు జారీచేసే ముస్లీం ధార్మిక సంస్థలు ఈ విషయంలో ఒక చారిత్రక  తప్పుచేశాయి. మొత్తం జాతిని ఒక ముద్దాయిగా నిలబెట్టాయి.

విడాకుల హక్కు అనేది ఒక ఆధునిక విలువ అనే భావం వెనక్కిపోయి అనాగరీక చర్యగా మారిపోయింది.  ఈ నిరాసక్తతను సాకుగా తీసుకుని కొందరు మరీ రెచ్చిపోయారు. ఎస్సెమ్మెస్, ఇమెయిల్, వాట్సప్, ఫేస్ బుక్కుల్లో కూడా ట్రిపుల్ తలాక్ మెసేజులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు పౌరస్మృతిలో న్యాయస్థానాలు, ప్రభుత్వాలు జోక్యం చేసుకునే పరిస్థితిని తెచ్చాయి. ఒక్కసారిగా చెప్పే ట్రిపుల్ తలాకులుగానీ, ఎస్సెమ్మెస్, ఇమెయిల్, వాట్సప్, ఫేస్ బుక్కుల్లో పెట్టే తలాక్ మెసేజులుగానీ ధర్మవిరుధ్ధం అంటూ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక ప్రటన విడుదల చేయాలి. దానికి ఏడాదో ఏడాదిన్నరో సమయం కోరడం సమంజసంకాదు. ఇప్పుడే ఈ క్షణమే .   

(రచయిత సమాజ విశ్లేషకులు)

మొబైల్ 9010757776
హైదరాబాద్
13 ఏప్రిల్ 2017

ప్రచురణ :
ఆంధ్రజ్యోతి దినపత్రిక
16-04-2017 00:57:51

No comments:

Post a Comment