Muslim - From Oppression to Progress
అణిచివేత
నుండి అభివృధ్ధి దిశగా
వర్తమాన ప్రపంచంలో
ఉద్రవాదం అనేది హాట్ టాపిక్. ప్రపంచ మార్కెట్
సృష్టించే భీభత్సం నుండే ఉగ్రవాదాలు పుట్టుకొచ్చాయని ఇప్పుడు- అందరూ కాకున్నా- అత్యధికులు అంగీకరిస్తున్న
అంశం. ప్రతిహింసను సమర్ధించే మతాలు మొదలు అహింసను ప్రవచించే మతాలవరకు దాదాపు అన్ని మతసమూహాల్లోనూ ఉగ్రవాద
పోకడలు తరతమ స్థాయిల్లో కొనసాగుతున్నాయి. వీరిలో ఎక్కువ అప్రతిష్టను
కూడగట్టుకుంటున్నది మాత్రం ముస్లింలే. ముస్లింలని
ఉగ్రవాదులంటూ ప్రచారం చేయడం కొన్ని దేశాలకు, కొన్ని సమూహాలకు రాజకీయార్ధిక అవసరంగా
మారింది. బయటి నుండి అణిచివేత లోపలి నుండి నైరాశ్యం వున్న వాతావరణంలో కొందరు
ముస్లిం యువకులు ఉగ్రవాదులుగా మారుతున్న విషయం కూడా వాస్తవం. దానికి కారణాలు
ముస్లిం సమాజానికేకాదు ముస్లిమేతర సమాజాలకు కూడా తెలుసు.
శిలాజ ఇంధనం (Fossil Fuel)
అయిన బొగ్గు కోసం అలనాడు బ్రిటీష్
సామ్రాజ్యవాదం అనేక దేశాల్ని వలసలుగా మార్చుకుంది. ఇప్పుడు మరో శిలాజ ఇంధనం అయిన చమురు
కోసం అమెరికన్ సామ్రాజ్యవాదం అనేక దేశాల్ని బానిసలుగా మార్చుతోంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించినవాళ్ళను
అనాగరీకులుగా, ఉగ్రవాదులుగా చిత్రిస్తోంది. మనం తరచుగా మరచిపోతున్న విషయం ఏమంటే
అప్పట్లో బ్రిటీష్ వలసపాలకులు కూడా భారతీయుల్ని అనాగరీకులుగానూ, భగత్ సింగ్ వంటి దేశభక్తుల్ని ఉగ్రవాదులుగానూ
చిత్రించేవారు. ఆ రెండు నిందల్ని మోయడానికి ఇప్పుడు ముస్లింల వంతు వచ్చింది!.
ఉగ్రవాదులు కఠినంగా,
క్రూరంగా, కర్కశంగా ప్రవర్తిస్తున్నట్టు అనేక వార్తలు నిత్యం వస్తున్నాయి. సామ్రాజ్యవాదుల
మీడియాల్లో వచ్చే ఆ వార్తల్లోని నిజానిజాల్నీ అతిశయోక్తుల్నీ పక్కన పెడితే, అవన్నీ ఒక చర్యకు ప్రతిచర్యగా, ఒక దాడికి
ప్రతిదాడిగా జరుగుతున్న పరిణామాలు అనడంలో ఎవరికీ సందేహం వుండాల్సిన పనిలేదు.
దాడిని ఖండించనివాళ్ళకు ప్రతిదాడిని తప్పుపట్టే నైతిక హక్కు వుండదని మనం తరచూ
మరచిపోతుంటాం.
ముస్లింలు
అంతర్జాతీయంగానేకాక తరచూ స్థానికంగానూ
నిందల్ని ఎదుర్కొంటున్నారు. ఈ నిందల నుండి బయటపడే ప్రయత్నం ఇప్పుడు ముస్లిం సమాజం
గట్టిగానే చేస్తున్నది. ఇస్లాం ఒక్కదానికేకాదు ప్రపంచ మతాలన్నింటికీ – ఆమాటకు
వస్తే – కమ్యూనిజం వంటి ప్రపంచ సిధ్ధాంతాలకూ -ప్రాంతీయ ప్రభావాలు, ప్రత్యేకలు అనేకం
వుంటాయి. అంత మాత్రాన వాటి మౌలిక సూత్రాలేమీ మారిపోవు. దక్షణాది నాలుగు రాష్ట్రాల్లో
ముస్లింలు సాంప్రదాయంగా (శంకు మార్కు) గళ్ళ లుంగీలు కడతారు. నిజాం సంస్థానానికి చెందిన ముస్లింలు
షేర్వాణీలు, చుడీదార్లు తొడుగుతారు. స్థానిక ప్రభావం అంతవరకే.
అఫ్సర్ , స్కైబాబా
వంటివాళ్ళు తరచుగా లోకల్ ఇస్లాం గురించి చేస్తున్న వాదనలు కొన్ని సందేహాలను
కలిగిస్తున్నాయి. వీరు లోకల్ ఇస్లాం పేరుతో యాంటి ఇస్లాంకు ఆమోదాంశాన్ని కలిగిస్తున్నారేమో అనిపిస్తోంది.
ఇస్లాం ఏకేశ్వరోపాసన
మతం. అక్కడ ఆరాధన అర్హత అల్లా ఒక్కనికే వుంటుంది.
మహాప్రవక్త ముహమ్మద్ (వారికి శాంతి కలుగుగాక) గారికి కూడా ఆరాధనల్ని అందుకునే
అర్హత లేదు. అల్లా పక్కన మరో దేవుడ్నో, ప్రవక్తనో, ముల్లానో, పీర్ నో, హజ్రత్ నో,
సేయింట్ నో పెట్టి ఆరాధిస్తామంటే అది ఇస్లాంకాదు. ఈ విషయంలో అరబిక్ ఇస్లాం,
ఇండియన్ ఇస్లాం, నరసాపురం ఇస్లాం, నల్గొండ ఇస్లాం, చింతకాని
ఇస్లాం అనే తేడా లేనేలేదు.
మరో వైపు, ఇతర మత
సమూహాలతో కలిసి పనిచేయవద్దని ఎవరు చెప్పినా అది కూడా యాంటి ఇస్లామే. మనం ఇతర మత సమూహాల
కష్టాల్లో భాగం పంచుకోవాలి. వాళ్ల విముక్తి కోసం తెగించి పోరాడాలి. ఆక్రమంలో
ఇస్లాం గొప్పతనాన్ని కూడా చాటాలి. అలాయిబలాయి సంస్కృతి, గంగాజమున తెహజీబ్ లకు అర్ధం కలిసిమెలసి
ఉండాలనేగానీ యాంటి ఇస్లాంగానో మరొకటిగానో మారమనికాదు. ముస్లింలుగా వుంటూనే, ఇస్లాంలో ప్రాణప్రదమైన
అంశాలను విడవకుండానే ఇతర మత సమూహాలతో
కలిసి పనిచేయడం సుసాధ్యమే. (కారంచేడు ఉద్యమం దీనికి ఒక ఉదాహరణ).
హిందూఅణగారిన సమూహాల
వర్తమాన కార్యాచరణ విషయంలోనూ ముస్లింలకు స్పష్టమైన అవగాహన వుండాలి. హిందూ అణగారిన సమూహాల ఉద్దీపనకు రాజ్యాంగ
ప్రతిపత్తి స్పష్టంగావుంది. ముస్లింల ఉద్దీపనకు రాజ్యాంగంలో స్పష్టమైన
ప్రతిపత్తిలేదు. భారత రాజ్యాంగానికి కుల తెగ స్వభావమేగాక మత స్వభావం కూడా వుంది. రాజ్యాంగం
కొన్ని మతాలకు రిజర్వేషన్ కల్పిస్తూనే ముస్లిం సమాజాన్ని పక్కన పెట్టింది. భారత
రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్లను ఆమోదించదు అనే ఒక తప్పుడు అభిప్రాయం మన సమాజంలో
ఇప్పటికీ బలంగా వుంది.
ముస్లింలకు ఉద్దీపన చర్యల ప్రతిపాదన
వచ్చినప్పుడెల్లా దాన్ని వీధుల్లోనూ, న్యాయస్థానాల్లోనూ బలంగా అడ్డుకుంటున్నది
హిందూ అణగారిన సమూహాలే. ఈ వైరుధ్యానికి పరాకాష్టే గుజరాత్ అల్లర్లు. గత ఏడాది
దేశాన్ని భయపెట్టిన అసహన వాతావరణానికి
కీరీటధారులు, సూత్రధారులు ఎవరయినప్పటికీ పాత్రధారుల్లో అత్యధికులు హిందూ
అణగారిన సమూహాలే. ఇదొక వాస్తవం.
మరోవైపు, హిందూ అణగారిన సమూహాల్లో సామ్యవాద, దళిత,
బహుజన, లౌకిక భావాలు కలవారు ముస్లింలకు మద్దతుగా నిలుస్తున్న వాస్తవాన్ని కూడా మనం
మరచిపోకూడదు. వారిలో కేవలం సంఘీభావాన్ని తెలిపేవారు మాత్రమేగాక కొన్ని త్యాగాలకు
సిధ్ధపడగలిగిన గట్టి మద్దతుదారులు సహితం వున్నారు. అయితే, వారి మద్దతు తమ సమాజపు
ప్రధాన స్రవంతిని సవరించ గలిగేదీకాదు; నిలువరించ గలిగేది కూడా కాదు. ఇది దాని పరిమితి. హిందూ అణగారిన సమూహాల్లో
సామ్యవాద, దళిత భావాలు కలవారు ముస్లింలకు ఇస్తున్న మద్దతును స్కైబాబా వంటివారు -
సహృదయంతోనే కావచ్చుగానీ- అతిగా అంచనా వేస్తున్నారని పిస్తోంది. అయినప్పటికీ ఇతర
అణగారిన వర్గాలతో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ముస్లిం సమాజానికి వుంది. ఎందుకంటే
ఇతర అణగారినవర్గాలకు లౌకికవాదం ఒక దృక్పధం మాత్రమే; భారత ముస్లింలకు అది ప్రాణరక్షణ
ఔషధం.
ముస్లింలు అంతర్గతంగానూ
అవగాహనను పెంచుకోవాల్సిన అంశాలు అనేకం వున్నాయి. అందులో కీలకమైనది కులసమస్య. కులం
అనేది భారత సమాజపు వాస్తవికత. ధార్మికంగా సమర్ధన
వున్నా లేకపోయినా భారత ముస్లిం సమాజంలో కులాలున్నాయి. పైగా ఇవి ఆష్రాఫ్,
అజ్లాఫ్, అర్జాల్. అనే మూడు సామాజిక దొంతరల్లో వున్నాయి. భారత ముస్లింలలోని సమస్త కులాల మధ్య ఒక అవగాహన రావాలి.
హిందూ సమాజంలోని కమ్మ, కాపు సామాజికవర్గాల్లో
ఇటీవలి కాలం వరకూ కొన్ని ఉపకులాలుండేవి. అవన్నీ ఇప్పుడు ఏక కులంగా మారడం మన
కళ్ళముందు జరిగిన పరిణామాలు. దళిత, గిరిజన, హిందూ వెనుకబడిన కులాల్లోనూ అనేక
ఉపకులాలున్నాయి. వాళ్లంతా ఒక ఐక్య సమూహంగా మారడాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాంటి
ఏకీకరణ ముస్లిం సమాజంలో తక్షణం జరగాల్సి వుంది.
భవిష్యత్తులో ఒకవేళ మత ప్రాదిపదికన రిజర్వేషన్లను పొందడం సాధ్యంకాని
పరిస్థితే వస్తే, కులప్రాతిపదికన
అయినాసరే భారత ముస్లిం సమాజం
రిజర్వేషన్లను సాధించుకోవడానికి వీలుగా ఈ ఏకీకరణ జరగాలి.
పేదరికంవల్ల కొంత, ప్రభుత్వాల నిరాదరణలవల్ల
మరికొంత, నిరాశ నిస్పృహలవల్ల ఇంకొంత ముస్లిం సమాజం ఆధునికవిద్యకు దూరం అవుతోంది. ఈ
నేపథ్యంలో ముస్లిం బాలబాలికల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాల్సిన బాధ్యత ఆలోచనాపరుల
మీద వుంది. ముస్లిం విద్యార్ధులు
ప్రధానంగా రాజకీయార్ధిక శాస్త్రాలు, బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో పట్టు
సాధించాలి. విద్యాధికులయిన ముస్లింలు తమ తరువాతి తరానికి అనియత విద్యగా
అకౌంటెన్సీని, ఆర్ధిక క్రమశిక్షణనీ నేర్పాలి.
అన్నింటికన్నా కీలకమైనది
ఆర్ధికరంగం మీద పట్టును సాధించడం. తమది మతాతీత, కులాతీత అభివృధ్ధి దృక్పథమని
ప్రభుత్వాధినేతలు తరచూ ప్రకటించుకుంటున్నప్పట్టికీ వాళ్ళు చేపట్టే అభివృధ్ధి
ప్రాజెక్ట్లు, సంక్షేమ పథకాలు అన్నీ
కొన్ని మతాలకు, కొన్ని కులాలకు మాత్రమే మేలు చేకూరుస్తుంటాయి. ప్రభుత్వ ప్రాయోజిత నీటిపారుదలా
ప్రాజెక్టులు, రుణమాఫీ పథకాలు, వ్యవసాయ
సబ్సీడీల ద్వార భూములున్నవారికి మాత్రమే మేలు జరుగుతుంది. భూములున్న ఆర్ధిక సమూహంలో ముస్లీంల శాతం
చాలాచాలా తక్కువ కనుక ఆ ప్రాజెక్ట్లు, పథకాలు, సబ్సిడీల ప్రయోజనాలని వాళ్ళు
పొందలేరు. ముస్లింలు ఇప్పుడు వ్యవసాయరంగం లోనికి విస్తరించాలి. అలాగే, ఎక్స్
ప్రెస్ హైవేల నిర్మాణాల వల్ల ప్రైవేటు ట్రాన్స్
పోర్ట్ ఆపరేటర్లు
లబ్దిపొందుతుంటారు. అలాంటి రంగాల్లో ముస్లింలు ప్రవేశించాలి. ఒక్క మాటలో
చెప్పాలంటే, ప్రభుత్వం పెట్టుబడులు పెడుతున్న రంగాలన్నింటిలోను ముస్లింలు
చొరవగా ప్రవేశించాలి. ఇలాంటి
వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించడానికి ముస్లిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
(మిక్కీ) ఒకటి ఏర్పడాలి.
ప్రైవేటు రంగం
సమర్ధంగానూ, ప్రభుత్వరంగం అసమర్ధంగానూ పనిచేస్తుందనే అభిప్రాయం ఒకటి మనలో బలంగా
వుంటుంది. అది నిజంకాదు. ప్రభుత్వ (రంగ) మద్దతుతోనే ప్రైవేటు రంగం లాభాలను
అర్జిస్తుంది. అందుకు ప్రభుత్వంతో లాబీ చేసే వ్యవస్థ ఒకటి వుండాలి. దానికోసం
ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాతినిధ్యం వుండి తీరాలి. దాని కోసం ప్రత్యేక
కృషిచేయాలి.
ఇతర అణగారిన సామాజికవర్గాలతోపోలిస్తే ముస్లిం
సామాజికవర్గంలో లాబీయింగ్ నైపుణ్యం తక్కవ మాత్రమే కాదు అలాంటి
ఆసక్తి, స్పృహ కూడా తక్కువే. ఈ లోటును అధిగమించాలి. ఇతర సామాజికవర్గాల్లో
ఆలోచనాపరులు, వాణిజ్య వేత్తలు సమైక్యంగా ముందుకు సాగడాన్ని మనమ గమనిస్తున్నాము.
ముస్లిం సమాజంలో ఆలోచనాపరులు, వాణిజ్య వేత్తలు తలో దిశగా ప్రయాణిస్తున్నారు. ఈ ధోరణివల్ల
ఎవరి ప్రయోజనాలూ నెరవేరవు. వాళ్ళకు ఒక
ఉమ్మడి వేదిక ఏర్పడాలి.
భారత ముస్లిం సమాజం
ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి కీలకమైనది నాయకత్వ సమస్య. స్వాతంత్ర్యానంతరం తమకు ఒక
అగ్రనాయకుడు వుండాలన్న అంశాన్ని భారత ముస్లిం సమజం ఇప్పటి వరకు గుర్తించినట్టులేదు. ఈ అంశం
పరిష్కారం కానంత వరకు ముస్లిం సమాజ వికాసం ఆరంభమయినట్టుకాదు.
A.m. Khan Yazdani
Danny అప్పట్లో Face Book లో ఉగ్రవాదం మీద పెట్టిన కొన్ని కామెంట్లను జత చేసి
పై వ్యాసాన్ని మరికొంత పెంచాలనుకున్నాను. కానీ బద్దకించాను. ఇప్పుడు ఆ COMMENTS ను
జతచేసి చదువుకోవాల్సిందిగా పాఠకుల్ని కోరుతున్నాను.
1.
We have
SAFFRON and GREEN
Terrorists
- March 9, 2017
2.
ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలి
విప్లవవాదాన్ని ఆహ్వానించాలి
-February 20, 2017
3.
ఉగ్రవాదం విప్లవవాదం ఒకటికాదు
- February 20, 2017
4.
ఉగ్రవాదం పుట్టుకకు ఉండే సమర్ధన
దాని చర్యలకు వుండదు.
- February 20, 2017
5.
US and IS
Both are International enemies of Muslims
- February 20, 2017
6.
US and IS
ఇద్దరూ ముస్లిం సమాజానికి అంతర్జాతీయ శత్రువులు
- February 20, 2017
7.
All Terrorists are Cowards !
ఉగ్రవాదులందరూ పిరికిపందలే!
June, 8, 2017
-
ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)
సమాజ విశ్లేషకులు
మొబైల్ - 9010757776
హైదరాబాద్
6 ఫిబ్రవరి 2017
ప్రచురణ :
చమన్ వెబ్ పత్రిక మార్చి 26, 2017
http://chaman.co.in/2017/03/%E0%B0%85%E0%B0%A3%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A4-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A7%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF/
No comments:
Post a Comment