Monday, 28 May 2018

Iftar and the Unity of Muslims and Dalits


దళితులతో ముస్లింల ఇఫ్తార్ !

ఏ యం ఖాన్ యజ్దానీ (డానీ)



తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటీఎఫ్) ఇప్పుడొక సాంఘీక శక్తి.  ఏడాది కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో  ‘అణగారిన సమూహాల ఆత్మగౌరవ సదస్సులు’ నిర్వహిస్తున్న ఎంటీఎఫ్,  మే 15నాటి కాకినాడ సదస్సులో ముస్లింలు దళితులు కలిసి ఇఫ్తార్ విందులు జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది. ఇలాంటి పిలుపుల్ని దిగువ స్థాయి శ్రేణులు అర్ధం చేసుకుని ఆచరించడానికి సహజంగానే కొంత సమయం పడుతుంది. అయితే, ఎంటీఎఫ్ నిర్వాహకులు ఊహించినదానికన్నా  వేగంగా ఈ పిలుపు వుభయ సామాజిక శ్రేణుల్లోనికి చొచ్చుకునిపోయింది. ఢిల్లీ ఆర్చ్ బిషప్ అనిల్ జోసెఫ్ థామస్ కౌటో ఆందోళన వ్యక్తం చేసినట్టు దేశంలో ఒక ‘సంక్షుభిత వాతావరణం’ కమ్ముకుని వుండడం కూడా ఈ వేగానికి  కారణం కావచ్చు.  కష్టకాలంలో మనుషులు ఏకం అవుతారు!.

సుర్యోదయానికి ముందే ఆరంభించి సూర్యాస్తమయం ముగిసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కఠిన  ఉపవాసం చేసే ముస్లింలు ప్రతిరోజూ లాంఛనంగా తమ దీక్షను విరమించడాన్ని ఇఫ్తార్ అంటారు. ఎండలు మండిపోతున్న ఈ ఏడాది ఉపవాస దీక్షా సమయం  ఏకంగా 17 గంటలు.  ఉపవాస దీక్ష చేసేవారికి తొలి ఆహారాన్ని అందించడం గొప్ప పుణ్యకార్యంగా ముస్లింలు భావిస్తారు. దీక్ష విరమణ్స చేస్తున్న వారికి (అన్నార్తులకు) తమ శక్తి మేరకు ఒక పండునో, పలహారాన్నో ప్రేమతో అందిస్తారు.

ముస్లిమేతరులు సహితం ఇఫ్తార్ విందులు నిర్వహించే సాంప్రదాయం చాలా కాలంగా వుంది. గవర్నర్లు, ముఖ్యమంత్రులు వున్నతాధికారులు మొదలు కొన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, వృత్తిసంఘాలు, వాణిజ్యసంఘాలు కూడా ఇఫ్తార్ విందులు నిర్వహించి మతసామరస్యాన్ని చాటుకుంటుంటాయి. ముస్లింలు దళితులతో కలిసి ఇఫ్తార్ విందులు జరుపుకోవాలనేది సామాజికంగా ఒక కొత్త ఆలోచన.

ఎంటీఎఫ్ పిలుపుకు ముందుగా స్పందించింది కాకినాడ రేచర్లపేటకు చెందిన షెడ్యూల్డ్ కాస్ట్స్ సమాజం. అక్కడి దళిత బహుజన మిత్రులు నగరంలోని ముస్లింలకు ఇఫ్తార్  విందు ఇవ్వడమేగాక, నమాజ్ కూడా నిర్వహించారు. ఆ ప్రేరణతో హిందూపురంలో దళిత, బహుజన, ముస్లింలు ఇఫార్ విందులు నిర్వహించారు. గుంటూరులోనూ అలాంటి సన్నాహాలు సాగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ వంతు వచ్చింది.  సాలార్ జంగ్ మ్యూజియం పక్కన వుండే మినార్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో   రెయిన్ బో షాపింగ్ ఫెస్టివల్ నిర్వాహకులు  రంజాన్ నెల ముఫ్ఫయి రోజులూ ఇఫ్తార్ విందు జరుపుతుంటారు. వీటికి అతిథిగా మే 22న ప్రముఖ దళిత నాయకురాలు, రచయిత్రి అరుణ గోగులమండను ఆహ్వానించారు.

సంకుచిత  స్వభావం కలిగినవారు అన్ని రంగాల్లోనూ వుంటారు; రాజకీయాల్లో కొంచెం ఎక్కువగా వుంటారు. వాళ్ళు ఇప్పుడు  ముస్లిం దళిత ఐక్యతను ఒక సంకుచిత  రాజకీయ అవకాశవాదంగా చిత్రించే వీలు లేకపోలేదు. ఇప్పుడు జరుగుతున్నది ముస్లిం దళిత ఐక్యతల పునరుధ్ధరణ మాత్రమే. నిజానికి ప్రవక్త ముహమ్మద్ (వారికి శాంతి కలుగుగాక) కాలంలోనే ఇలాంటి ఐక్యతకు  పునాదులు పడ్డాయి. తొలి మసీదును నిర్మించి తొలి అజా (నమాజ్ కు పిలుపు) ఇచ్చే  మహత్తర అవకాశాన్ని నల్లజాతీయులకు చెందిన పూర్వబానిస అయిన హజ్రత్ బిలాల్ గారికి ఇచ్చినపుడే, ప్రవక్త ముహమ్మద్, ఒక సాంఘీక విప్లవానికి నాందీ పలికారు. ఆ సాంప్రదాయమే ప్రపంచ వ్యాప్తంగా అన్నార్తుల్ని, అణగారిన సమూహాలనీ ఇస్లాంకు దగ్గర చేసింది; చేస్తున్నది. 

కార్ల్ మార్క్స్ 1848లో “శ్రామికులకు రాజ్యాధికారం కావాలి” అని ప్రకటించాడు. సరిగ్గా అదే సంవత్సరం భారత దేశంలో జ్యోతిరావ్   గోవిందరావ్ ఫూలే “శ్రామిక కులాలకు రాజ్యాధికారం కావాలి” అని ప్రకటించాడు. ఆ ఏడాది అణగారిన కులాల బాలికల కోసం స్వగ్రామంలో ఒక చిన్న పాఠశాలను ఏర్పాటు చేసినందుకు ఫూలేను సొంత కులస్తులే వెలివేశారు. అప్పుడు మహాత్మా ఫూలేను  ఆదుకున్నది, ఆశ్రయం ఇచ్చిందీ, స్కూలు పెట్టుకోవడానికి తమ ఇంటిని ఇచ్చింది, ఫూలే జీవిత భాగస్వామి సావిత్రీ బాయి ఫూలేతో కలిసి పాఠశాల నడిపిందీ మియా ఉస్మాన్ షేక్, ఫాతిమా షేక్ అనే ముస్లిం అన్నాచెల్లెలు.  భారత దేశపు  ఆధునిక విద్యారంగంలో తొలితరం ముస్లిం అధ్యాపకురాళ్ళలో ఫాతిమా షేక్ ప్రముఖులు. ఆవిధంగా,  ఆధునిక భారత సామాజిక ఉద్యమాల తొలి అధ్యాయంలోనే  ముస్లింలకు నిండుగా ఒక పేజీ వుంది!.

దళిత మహానేత బీఆర్ అంబేడ్కర్ కు 1920లలో లండన్ లో బారిస్టర్ చదువు కోసం ఆర్ధిక సహాయాన్ని అందించిన సంఘసంస్కర్త కొల్హాపూర్ సాహు మహారాజ్ కు కూడా ఒక ముస్లిం అనుబంధం వుంది. అతని పూర్వికుడైన ఛత్రపతి సాహూ (శివాజీ మనవడు) 1680-90లలో  మొఘల్ దర్బారులో  చక్రవర్తి ఔరంగజేబ్, అతని కుమార్తె జీనత్ ఉన్నీసాల  ఒళ్ళో  ఒక దత్తపుత్రునిగా  పెరిగినవాడే. (అవును. మీరు విన్నది నిజం!).

అప్పటి వైశ్రాయి లార్డ్ ఇర్విన్ తో ముహమ్మద్ ఆలీ జిన్నాకు వున్న సాన్నిహిత్యాన్ని దౌత్యంగా మార్చిన ఫలితంగానే  బ్రిటీష్ ప్రధానమంత్రి రామ్సే మెక్ డోనాల్డ్ 1929లో రౌండ్ టేబుల్ సమావేశాలు మొదలెట్టాడు. అణగారిన సమూహాలకు ప్రత్యేక రాజకీయ హక్కులు కావాలని, ఆ సమావేశాల్లో, అంబేడ్కర్ కోరినపుడు (మహాత్మాగాంధీజీ నాయకత్వంలోని)  కాంగ్రెస్‍ ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లిం లీగ్ నాయకులైన సర్ ఆగా ఖాన్ - 3, ముహమ్మద్ ఆలీ జిన్నా ఇద్దరూ  అంబేడ్కర్ కు  గట్టి మద్దతుగా నిలిచారు.

భారత రాజ్యంగ రూపకల్పన బాధ్యతను అంబేడ్కర్ కు మహాత్మా గాంధీయో,  జవహర్ లాల్ నెహ్రూయో  అప్పగించారని ఇప్పటికీ చాలామంది నమ్ముతుంటారు. నిజానికి అంబేడ్కర్ కు రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశాన్ని కల్పించింది  జిన్నాయే అంటే అతిశయోక్తికాదు. “దళితులు హిందువులుకారు” అని అంబేడ్కర్ ఇచ్చిన పిలుపు కాంగ్రెస్‍ అగ్రనేతలకు రుచించేదికాదు. అది రాజకీయ వైరంగా మారింది. 1946 మార్చి నాటి బొంబాయి  ప్రావెన్షియల్ అసెంబ్లీ ఎన్నికల్లో అంబేడ్కర్ నూ, ఆయన పార్టి షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (ఎస్ సి ఎఫ్)నూ పనిగట్టుకుని చిత్తుగా ఓడించింది కాంగ్రెస్‍. దానితో అంబేడ్కర్ కు రాజ్యాంగ పరిషత్ లోనికి ప్రవేశించే మార్గమే లేకుండాపోయింది.

సరిగ్గా అప్పుడు జిన్నా రంగప్రవేశం చేశారు. ముస్లిం లీగ్ ఆధీనంలోవున్న  తూర్పు బెంగాల్ లోని జెస్సోర్ – ఖుల్నా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న  తమ పార్టీ అభ్యర్ధి చేత రాజీనామ చేయించారు.  అక్కడి నుండి అంబేడ్కర్ ను  గెలిపించి భారత రాజ్యాంగ పరిషత్తుకు పంపించారు. తన జీవిత కాలం మొత్తంలో అంబేడ్కర్ ఎన్నికల్లో గెలిచిన సందర్భం అదొక్కటే.

అంబేడ్కర్ ను రాజ్యాంగ పరిషత్తుకు పంపించడం  కోసం జెస్సోర్ – ఖుల్నా నియోజకవర్గ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ కూడా ప్రముఖ దళిత నేత. జిన్నా అనుసరించిన మతసామరస్య విధానాలకు ఆయన వీరాభిమాని. పెత్తందారీ కులాల నాయకత్వంలో 1946లో బెంగాల్ లో చెలరేగిన మతకల్లోలాల్లో దళితులు పాల్గొనరాదంటూ మండల్  ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. పాకిస్తాన్ ఏర్పడ్డాక జిన్నా తోపాటూ అక్కడికి వెళ్ళిపోయారు. జిన్నా ఆయన్ను ప్రభుత్వంలో నెంబర్-టూ గా  మార్చారు. భారత ప్రభుత్వంలో అంబేడ్కర్ నిర్వర్తించిన కీలక బాధ్యతలన్నింటీనీ జోగేంద్ర నాధ్ మండల్ పాకిస్తాన్ ప్రభుత్వంలో నిర్వర్తించారు. పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తు ఛైర్మన్ గా, న్యాయ, కార్మిక శాఖల మంత్రిగా  పనిచేశారు. కామన్ వెల్త్, కాశ్మీర్ వ్యవహారాలు కూడా జోగేంద్ర నాధ్ మండల్ ఆధీనంలోనే వుండేవి.

“విప్లవం వర్ధిల్లాలి”, “సంపూర్ణ స్వాతంత్రం” వంటి  నినాదాలు భారత జాతియోద్యమ చరిత్రను మహత్తర మలుపు తిప్పినట్టు అందరికీ తెలుసు.  వీటిని రూపొందించిన సుప్రసిధ్ధ ఉర్దూ కవి, జాతియోద్యమ నాయకుడు  మౌలానా హస్రత్  మొహానీ గురించి మాత్రం ఈ తరంలో చాలా మందికి తెలిసివుండకపోవచ్చు.  దళిత్-ముస్లిం ఇఫ్తార్  సాంప్రదాయాన్ని మొదలు పెట్టింది ఆయనే. అంబేడ్కర్ చేతితో ఇచ్చిన నీళ్ళను ముట్టుకోవడానికి కూడా జాతీయోద్యమ మహానాయకులు సహితం వెనుకాడుతున్న కాలం అది. అప్పుడు మౌలానా హస్రత్  మొహానీ ఇఫ్తార్ విందుకు అంబేడ్కర్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఒకే పళ్ళెంలో ఆయనతో కలిసి భోజనం ఆరగించారు. ఇప్పుడు కొనసాగాల్సింది ఆ సాంప్రదాయమే.

(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైల్ – 9010757776


రచన : హైదరాబాద్, 23-5-2018
ప్రచురణ :  ఆంధ్రజ్యోతి డైలీ, 30-5-2018
http://www.andhrajyothy.com/artical?SID=585505

Friday, 25 May 2018

Danny Notes 25-5-2018


Danny Notes 25-5-2018

1.     You and I neglected our job.

2.     Despite their arrogance earlier dictators do have a sense of shame. But the present day dictators have only arrogance and there no trace of sense of shame.

3.     Modi is just a propagandist and real powers are concentrated with Amit Shah.

4.     BJP has only 31% of Votes. 69 % are with others. We should see there should be only one candidate against BJP in every constituency.  

Saturday, 19 May 2018

Alienation of Sex and the Social Perversities

లైంగిక పరాయీకరణ!

డానీ  


సమాజ సమస్యలకు పరిష్కారం ప్రశ్నలతోనే మొదలవ్వాలిగాని ప్రశ్నల దగ్గరే ఆగిపోకూడదు. ఒక పరంపరగా అత్యాచారాలు  ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్న ఇటీవల తరచుగా వినబడుతోంది. బాలికలపై అత్యాచారాలు చేసే నేరగాళ్ళకు ఉరి శిక్ష విధించేలా ఒక ఆర్డినెన్స్ ను తెచ్చినా ఇలాంటి సంఘటనలు ఆగిపోవడంలేదెందుకనేది ఇంకో ప్రశ్న. సమాజవిశ్లేషకులు, సంఘసేవకులు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన సందర్భం ఇది.
                                                                        
సామాజిక రుగ్మతల్ని చట్టాలు ఎన్నడూ నిర్మూలించలేవు. కఠినమైన చట్టాలు నేరస్తుల్ని కఠినంగా శిక్షించడానికి  పనికి రావచ్చేమోగానీ దారుణ నేరాలు జరక్కుండా మాత్రం ఆపలేవని గుంటూరు నగరంలో మే 15న ఓ బాలిక మీద జరిగిన అత్యాచారం చెప్పకనే చెప్పింది. బాలికల మీద అత్యాచారం జరగడం ఇదే నెలలో గుంటూరు జిల్లాలో ఇది మూడోసారి.  

కఠిన శిక్షల్ని చూసి  నేరస్తులు భయపడిపోతారు అనేది ఒక అపోహ మాత్రమే. నేరస్వభావం కలిగినవాళ్ళు నిరంతరం చట్టం కళ్ళుగప్పే మార్గాలను అన్వేషిస్తుంటారు. గతంలో అత్యాచారంతో ‘మాత్రమే’  ఆగిపోయే నేరాలు కొత్త ఆర్డినెన్స్ రాకతో హాత్యాచారాలుగా మారే ప్రమాదం వుందని  అనేక మంది సమాజశాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు కొట్టివేయదగ్గవేమీకావు. ఉరి శిక్షపడి తాము చనిపోవడంకన్నా సాక్ష్యాన్ని చంపేయడమే శ్రేయస్కరమని నేరస్తులు వికృతంగా ఆలోచించే అవకాశాలున్నాయి. మరో మాటల్లో చెప్పాలంటే చట్టాలు కఠినంగా మారే కొద్దీ నేరాలు తగ్గక పోగా నేరాల తీవ్రత పెరుగుతూ వుంటుంది.

పరాయికరణవల్ల మనిషి, మనిషిగా కాకుండా పోతున్నాడని కార్ల్‍ మార్క్స్ ఆవేదన వ్యక్తం చేశాడు.  దానికి  కొనసాగింపుగా ఆస్ట్రియా దేశపు ప్రముఖ మనోవిశ్లేషకుడు విల్‌ హెల్మ్ రైక్‌ (Wilhelm Reich) లైంగిక పరాయికరణను  వివరించాడు. మనోవిశ్లేషణ రంగంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ తరువాత అంతటివాడు రైక్. మనం ఇప్పుడు చర్చించాల్సింది నేరస్తుల్ని ఎలా శిక్షించాలని కాదు; లైంగిక పరాయికరణకు దారి తీస్తున్న  సామాజిక పరిస్థితుల్ని ఎలా సరిదిద్దాలి అనేది.  

ఆహారం, నిద్ర, మైధూనాలు సృష్టిలో ప్రతి జీవికీ శరీర ధర్మాలు. జీవి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆహారం నిద్రలు నిరంతరం కొనసాగుతాయి. అయితే, మైధూనానికి ఒక పరిమితి వుంది. పునర్ ఉత్పత్తి గ్రంధులు క్రియాశీలంగా మారినప్పటి నుండి అవి పనిచేయడం ఆగిపోయే వరకు శరీరానికి మైధూన అవసరం వుంటుంది. 

మనుషుల జీవితాల్లోనికి రాజకీయార్ధిక అంశాలు అతిగా చొరబడిపోయినపుడు నిద్ర, మైధూనాలు మరుగున పడిపోయి ఆహార అంశం మాత్రమే ప్రధానం అయిపోతుంది.  ఆహారం అంటే తిండి మాత్రమేకాదు; అది వస్త్రాలు, నివాసాలు, ఉపాధి, వ్యక్తిగత ఆస్తి, ఆదాయాలు, ప్రతిష్టల సమాహారం. (రోటీ కపడా ఔర్ మకాన్!) కిలో బియ్యం రూపాయికే సరఫరా చేసేందుకు ప్రభుత్వ పథకాలున్నాయి. కొన్ని వితరణ సంస్థలు పేదలు, రోగులకు ఉచిత అన్నదానం కూడా చేస్తుంటాయి. చౌక ధరకు పక్కా ఇళ్ళు, ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి వంటి పథకాలను కూడా  ప్రభుత్వాలు ప్రకటిస్తూ వుంటాయి. కానీ, నిద్ర, మైధూనాల కోసం అలాంటి రాయితీలులేవు. ఎనిమిది గంటల నిద్ర ఒక రూపాయకే వంటి  పథకాలను మనం ఎక్కడా చూసివుండం. బానిస ప్రభువులు సహితం బానిసలకు రాత్రి వేళల్లో నిద్ర, మైధూన సౌకర్యాలు కల్పించేవారనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. అలనాటి బానిసలకున్న సౌకర్యం కూడా వర్తమాన నాగరీకులకు లేదు.

భూస్వామ్య సమాజంలో ఆవిర్భవించిన దాంపత్య సాంప్రదాయంలో సంభోగానికి అనేక షరతులు, పరిమితులు వున్నాయి. ఆ విధానంలో,   భర్త ఆస్తిని అతని సంతానానికి వారసత్వంగా అందించే బాధ్యత భార్యది. భర్త సంతానం, తన సంతానం ఒకటి కాదు. వాటి మధ్య కొండంత తేడావుంది. ఆదిమ సమాజాల్లో, ముఖ్యంగా  మాతృవంశావళీ (matrilineal) వ్యవస్థలో   స్త్రీలకు ‘తన సంతానం’ అనేది వుండేది. భూస్వామ్య సమాజంలో అది కుదరదు. భూస్వామ్య దాంపత్య బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలంటే, భార్య, పెళ్ళికాక ముందు కన్యత్వాన్నీ, పెళ్లయ్యాక  పాతివ్రత్యాన్నీ కఛ్ఛితంగా పాటించి తీరాలి!.

పెళ్ళికాని స్త్రీలు కన్యత్త్వాన్నీ, పెళ్ళయిన స్త్రీలు పాతివ్రత్యాన్నీ పాటించే సమాజంలో  పెళ్ళికాని పురుషుల లైంగిక  అవసరాల్ని తీర్చడానికి వ్యభిచార వ్యవస్థ ఏర్పడింది. భార్యల్ని కోల్పోయిన, భార్యల నుండి విడిపోయిన ‘సింగిల్’ పురుషులకు కూడా ఈ ఏర్పాటు అందుబాటులో వుంటుంది.  అంతర్ దహన యంత్రాల భాషలో చెప్పాలంటే పాతివ్రత్య సమాజంలో వ్యభిచార వ్యవస్థ  ఎగ్జాస్ట్ వాల్వ్ వంటిది. మునిసిపాలిటీ భాషలో చెప్పాలంటే డ్రైనేజ్ స్కీం లాంటిది.  పాతివ్రత్యానికీ వ్యభిచార వ్యవస్థకూ అవినాభావ సంబంధం వుంటుంది. మొదటిది లేకుండా రెండోది వుండదు. పెళ్ళి వ్యక్తిగత ఆస్తితో ముడిపడినట్టే వ్యభిచార వ్యవస్థ కూడా వ్యక్తిగత ఆస్తితోనే ముడిపడి వుంటుంది.

పురుషులకు మాత్రమే ఆస్తి హక్కువుండే కాలంలోనూ  స్త్రీలకు కూడా ఆస్తి హక్కు ఏర్పడిన కాలంలోనూ దాంపత్య నిబంధనలు, విలువలు, కట్టుబాట్లు ఒకేలా వుండడం సాధ్యంకాదు. మరో వైపు వేశ్యావృత్తికి గత కాలపు సాంస్కృతిక గౌరవమర్యాదలు (గురజాడవారి మధురవాణి) రద్దు కావడమేగాక, ఆ వృత్తి మీద అనేక ఆంక్షలు పెరుగుతున్నాయి. ఎగ్జాస్ట్ వాల్వ్ లేనపుడు యంత్రం బద్దలైపోతుంది.  మురుగు కాల్వల్ని ఆక్రమించేసి ఇళ్ళు కట్టేసుకుంటే ఒక రోజు మురుగు కట్టలు తెగి ఇళ్ళను ముంచేస్తుంది.  అయితే, వాణిజ్య లైంగిక శ్రమను చట్టబధ్ధం చేయడం ఈ సమస్యకు ఎలాగూ శాశ్విత పరిష్కారంకాదుకానీ తాత్కాలిక ఉపశమనం అవుతుంది.

పెట్టుబడీదారీ సమాజం ప్రతిదాన్నీ సరుకుగా మార్చేసినట్టే  సంభోగాన్ని కూడా సరుకుగా మార్చేస్తుంది. అంటే, దాన్ని కొనుక్కోవాల్సిన వస్తువుగా మారుస్తుంది. నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవాల్సిన నిద్ర, ప్రేమతో పొందాల్సిన  మైధూనం చివరకు అంగడిలో కొనుక్కోవాల్సిన సరుకుగా మారిపోతున్నాయి. పురుషులే కాకుండా భర్తల్ని  కోల్పోయిన, భర్తల నుండి విడిపోయిన ‘సింగిల్’ స్త్రీలు కూడా కొనుక్కోగలిగితే ఈ సరుకు అందుబాటులో వుంటుంది. సరుకును డబ్బుపెట్టి కొనుక్కోలేనివారి పరిస్థితి ఏమిటనేది ఇక్కడ అంతకన్నా కీలకమైన ప్రశ్న.

వ్యక్తిగత ఆస్తి, వృత్తి నైపుణ్యాలు లేనివారికి పెళ్ళి కానట్టే, అవి రెండూ లేనివారికి వ్యభిచార యోగం కూడా దక్కదు. పైగా, వ్యభిచార వ్యవస్థ అచ్చంగా నగదు వ్యాపారం. వాణిజ్య లైంగిక శ్రామికుల దగ్గర స్వైపింగ్ మిషన్లు వుండవు. నగదురహిత సమాజం నగదులేమి సమాజంగా మారిపోయినపుడు లైంగిక రంగంలో కూడా సంక్షోభం తీవ్రం అవుతుంది.  అత్యాచార సంఘటనలు పెరగడానికి పెద్ద నోట్ల రద్దు కూడా ఒక కారణమని  మనం ఇంకా గమనించకపోవడం అన్యాయం!.

నిద్రా, మైధూనాలను నిర్లక్ష్యం చేసినపుడు సమాజ నియమాలకూ,  శరీర ధర్మాలకు మధ్య ఒక అంతర్యుధ్ధం ఆరంభమవుతుంది. అది అనేక మానసిక వైకల్యాలకు దారి తీస్తుంది. జీనవశైలి రోగాలంటే రక్తపోటు, మధుమేహం మాత్రమే చాలామందికి గుర్తుకు వస్తాయి. కుంగుబాటు (Depression) కూడా ఈ జాబితాలో వుంది. నిద్రమాత్రల (AntiDepressant) అమ్మకాల గణాంకాలు తీస్తే, దేశంలో  ఎంత మంది నిద్రలేమి (Insomnia)తో బాధపడుతున్నారో సమాజంలో సంతోష ప్రమాణాలు ఎంత ఘోరంగా పతనం అయిపోతున్నాయో అర్ధం అవుతుంది. సంతోష ప్రమాణాలపై ఐక్యరాజ్య సమితి రెండు నెలల క్రితం 156 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఇండియా 138 వ స్థానంలోవుంది. సంతోష ప్రమాణాల్లో భారత దేశం గత ఏడాదికన్నా మరో 11 స్థానాలు దిగజారింది.

అత్యాచారం అనేది మనిషి ఉన్మాదంలో చేసే చర్య అని మనకు తెలుసు. అయితే, ఏ సమూహాలు ఏ సమూహాల మీద అత్యాచారాలు చేస్తుంటాయి? ఏ సమూహాలు అత్యాచారానికి బలవుతూ (vulnerability) వుంటాయీ?  అనేవి ప్రాణప్రదమైన అంశాలు. ఉన్మాదానికి కూడా ఒక విధానముంటుంది. There will be a method in one's madness.  ఆ విధానం ఏమిటో తెలుసుకోకుండా దీనికి విరుగుడును కనిపెట్టలేం. 

మనది కుల మత తెగ లింగ వర్గ సమాజం. అత్యాచారాలకు కూడా కుల మత తెగ లింగ వర్గ స్వభావం వుంటుంది. స్త్రీల మీద పురుషులు, దళిత-బహుజనుల మీద పెత్తందారీ కులాలు. ఆదివాసుల మీద నగరవాసులు, మైనారిటీల  మీద మెజార్టీలు,  పేదల మీద ధనికులు అత్యాచారాలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో సాగుతున్నవే పిల్లల మీద పెద్దల అత్యాచారాలు. ఒక్కమాటలో చెప్పాలంటే, అణ‌గారిన సమూహాల మీద ఆధిప‌త్య సమూహాలు అత్యాచారాలు సాగిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇందుకు విరుధ్ధంగానూ జరుగుతుంటాయిగానీ అవి చాలా చాలా అరుదైన సంఘటనలు మాత్రమే. 

అత్యాచార సంఘటనల్లో ఉన్మాదం, క్షణికోద్రేకాలకు మించిన అనేక కారణాలు వుంటున్నట్టు గమనించవచ్చు. కఠువాలో ఎనిమిదేళ్ళ బాలిక  ఆసిఫాబానో మీద సాగిన హత్యాచారానికి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక,  ఆర్ధిక, ధార్మిక కారణాలు సహితం వున్నాయని వెలుగులోనికి వచ్చింది. వ్యక్తిగతఆస్తి కోసం, ఒక సమూహాన్ని తరిమేయడం కోసం పవిత్ర మందిరాల్లోనూ ప్రణాళికాబధ్ధంగా  అత్యాచారాలు జరుగుతాయని  ఈ కేసు చాటి చెప్పింది. జమ్మూ-కాశ్మీర్ లో ముస్లింలకు, ఇతరులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని మాత్రమే ఇప్పటి వరకు బాహ్యప్రపంచం నమ్మేది. కాశ్మీర్ లో  (ముస్లిం) ఆదివాసుల్ని అంతం చేసేందుకు ఒక అమానవీయ వ్యూహం అమలవుతున్నదని ఆసిఫాబానో కేసు స్పష్టం చేసింది.

న్యాయస్థానాలకు కూడా కుల మత తెగ లింగ వర్గ రాజకీయ స్వభావం వుంటుందంటే 20వ శతాబ్దంలో అనేకమంది ఒప్పుకునేవారుకాదు. ధర్మాసనాల అవినీతి కథనాలు పరంపరగా బయటికి వచ్చేస్తున్నాయి కనుక    ఇప్పుడు వాళ్ళు అలా దబాయించే సాహసం చేయకపోవచ్చు.  కుల మత తెగ లింగ వర్గ రాజకీయ రంగాల్లో ప్రాబల్యంగల  సమూహాలకు చెందిన నేరస్తులు చట్టం కోరల నుండి సులువుగా తప్పించుకుంటుంటే, అలాంటి ప్రాబల్యంలేని సమూహాలకు చెందిన నేరస్తులు చట్టం కోరల్లో చిక్కుకు పోతుండడాన్ని మనం చూడవచ్చు. న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా లేనపుడు, అత్యాచార నిరోధక చట్టాల కోరలకు కొత్తగా పెడుతున్న పదునంతా అణగారిన సమూహాలను శిక్షించడానికే ఉపయోగపడతాయి!.

మంచిదయినా, చెడ్డదయినా ఏదో ఒక అవసరం, కారణం లేకుండా ఏదీ అస్తిత్వంలో వుండదు. మనం తరచూ సమస్యల్ని తిట్టుకుంటామేతప్ప వాటిని సృష్టించిన వ్యవస్థను మార్చే ప్రయత్నం మాత్రం చేయం. అత్యాచారాలకు కుల, మత, లింగ సమాజమే కారణం అని తెలిసినపుడు ఆ సమాజాన్ని సంస్కరించితీరాలి. కుల, మత, లింగ సామరస్యాల్ని సాధించనంత కాలం మురుగు కాలవలు మనల్ని ముంచెత్తుతూనే వుంటాయి.  
                               
(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు)
మొబైలు 9010757776

రచన : హైదరాబాద్‍ , 18 మే 2018  
ప్రచురణ : మనతెలంగాణ తెలుగు డైలీ,  22మే 2018 


Friday, 18 May 2018

'వికీ డోనర్ '

'వికీ డోనర్ ' 

A.m. Khan Yazdani Danny
May 18, 2012 ·
పెద్దాపురం, అమలాపురం, రాజమండ్రి మేరకవీధిలొ ఒకప్పుడు పెద్ద సంఖ్యలోవున్న కళావంతుల సామాజికవర్గానికి చెందిన మహిళలు ఎర్రగా, ఎత్తుగా, మధురవాణిలా, చాలా అందంగా వుండేవారు. వుభయ గోదావరీ, ఉత్తరాంధ్ర ప్రాంత క్షత్రీయులు, వెలమదొరల సంపర్కంవల్ల వాళ్ళకా అందం వచ్చిందని చెప్పుకునేవారు.

తెలుగునాట 'నల్లగా' వుంటారని పేరుపడ్డ ఒక అగ్రకులం, 'తెల్లబడ్డం' కోసం, కలావంతుల మహిళలతో పిల్లలు కనేవారని ఒక ప్రచారం వుండేది. ఇప్పటి సర్రోగసీకి కి అది సాంప్రదాయ రూపం అన్నమాట.

భారత ముస్లిం సమాజంలో, అరబ్, ఆఫ్ఘన్ సంతతిపట్ల, ఇప్పటికీ ఒకరకం క్రేజ్ వుంటుంది. బాలివుడ్ ను ఏలుతున్న 'ఖాన్ దాన్ ' లలో చాలా మంది ఆఫ్ఘన్ సంతతివారే.

సాంప్రదాయాన్ని వాణిజ్యంగా మార్చి, ఉత్పత్తిని వుధృతం చెసి, వీధుల్లొ కుప్పలుగా పొసి అమ్మడమే మార్కెట్ చేసేపని.

1960లలొ వచ్చిన నవలల్లో కథానాయకుడు ఆరడుగుల అందగాడు. అతనికి పడవలాంటి చవర్లే(ట్) కారు వుండేది. అప్పట్లో చవర్లే కారంటే అంత గొప్ప. ఇప్పుడు చవర్లే చిన్న విషయం. ఆడీ వంటి లగ్జరీ కార్లు నిముషానికి రెండు చొప్పున హైదరాబాద్ రోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి. మరి పెరట్లొ ఆడీ కార్లు వచ్చాక చావిట్లో ఆరడుగుల అందగాడు కూడా రావాలిగా?

పది శాతం లాభం కోసం పెట్టుబడీదారుడు ఉరికంభం ఎక్కడానికి కూడా సిధ్ధపడతాడు అని కార్ల్ మార్క్స్ అన్నాడు. మార్కెటింగ్ కోసం మనుషులు తమ జాతిని కూడా అమ్ముకుంటారని మార్క్సుకు కూడా తెలిసివుండదు.

ఇక ముందు మన సారే (జెహజ్)లో 'వికీ డోనర్ ' కూడా వుంటుందేమో!!

Thursday, 10 May 2018

Karl Marx Bicentenary celebrations


Karl Marx Bicentenary celebrations
కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలు

వల్లెవేత కాదు;  అన్వయం కావాలి
డానీ

                  రెండు శతాబ్దాల తరువాత కూడా కార్ల్ మార్క్స్ ను స్మరించడం మహత్తర విషయమే కావచ్చుగానీ, రెండు  వందల సంవత్సరాల తరువాత కూడా సమాజం ఇలాగే వుంటున్నందుకు మార్క్స్ ఆత్మ తప్పక క్షోభిస్తూ వుంటుంది!!. మార్క్స్ అభిమానులు ఇప్పుడు ఆలోచించాల్సింది తప్పును ఎలా సరిదిద్దాలని.   

          వర్షపు చినుకు ముత్యపు చిప్పలో పడినపుడే ముత్యం అవుతుంది. ఎడారిలో పడినపుడు ఇసుకలో ఇంకిపోతుంది. భారత ఉపఖండంలో మార్క్సిజం అనే గతితార్కిక చారిత్రక భౌతికవాదం మనుగడ కూడా అలాగే సాగింది. అవసరంవున్న వాళ్ల చేతుల్లో తాత్త్విక ఆయుధంగా వుండాల్సిన   మార్క్సిజం అవసరంలేని వాళ్ళ దగ్గర అలంకారపు వస్తువుగా వుండిపోయింది. సామాజిక నేపథ్యం రీత్యా మార్క్సిజంతో అవసరంలేనివాళ్ళు కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించారు.  కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం చేసిన చారిత్రక అపచారానికి మార్క్సిజం ఇప్పటికీ పరిహారం చెల్లిస్తూనేవుంది.

కార్ల్ మార్క్స్ కుగానీ, ఆయన సహ సిధ్ధాంతవేత్త ఫ్రెడ్రిక్  ఏంగిల్స్ కు గానీ ఆసియా తరహా ఉత్పత్తి విధానం (ఏఎంపి) గురించి సమగ్ర సమాచారం లేదని కొందరు కమ్యూనిస్టు, సోషలిస్టు మేధావులు ఇప్పటికీ పెదవి విరుస్తుంటారు. 1850ల నాటి లండన్ లైబ్రరీలో భారత దేశం గురించి వున్న పుస్తకాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రచురించే గెజెట్లు, లండన్ లో తను కలుసుకున్న భారతీయులే మార్క్స్ ఏఎంపీ సూత్రీకరణకు ఆధారాలు. ఆ రోజుల్లో లండన్ లో మార్క్స్ ను  కలవగల భారతీయులు నిస్సందేహంగా అగ్రకులాలవాళ్ళే అయ్యుంటారు. నిజానికి మార్క్స్ చాలా నిజాయితీగల నిరాడంబర ఆలోచనాపరుడు. తన చారిత్రక, భౌగోళిక పరిమితులు తనకు తెలుసు. ఆ పరిమితుల్ని ఆయన కొన్నిచోట్ల నిజాయితీగా చెప్పుకున్నాడు కూడా.

మార్క్స్ పరిమితులు సరే; మార్క్స్ పరిమితుల గురించి మాట్లాడే వాళ్ళ పరిమితుల సంగతేమిటీ? భారత దేశంలో ఉత్పత్తి సంబంధాలు కుల సంబంధాల రూపంలో వ్యక్తం అవుతాయని ప్రధాన కమ్యూనిస్టు పార్టీల అగ్రనాయకుల్లో ఒక్కరంటే ఒక్కరయినా ఇప్పటి వరకు చెప్పారా? కార్మికుల ఎర్రజెండా, దళితుల నీలం జెండా కలిసి పనిచేయాలని చెప్పడానికి భారత కమ్యూనిస్టులకు శతాబ్ద కాలం పట్టింది. భారత దేశంలో శ్రామికులంటే ఆదివాసులు, దళితులు, మతమైనారిటీలు, అతి శూద్రులు ‘మరియూ’ అగ్రవర్ణాలు, పెత్తందారీ కులాలలోని కొందరు నిరుపేదలు అని తేల్చి చెప్పడానికి  కమ్యూనిస్టు పార్టీలకు ఇంకో శతాబ్ద కాలం పట్టవచ్చు.

భారత సమాజ అస్తిత్త్వమే కులం. కులాలు రెండే రకాలు శ్రామిక కులాలు, యజమాని కులాలు.  యజమాని కులాల్లోనూ కొందరు నిరుపేదలు వుంటారనే వంకతో అసలు కుల సమస్యనే పట్టించుకోకుండా, కులమత అస్తిత్వాల్ని గుర్తించకుండా కమ్యూనిస్టు పార్టీలు శతాబ్ద కాలం గడిపేశాయి. దేశ జనాభాలో యజమాని కులాల శాతం ఎంత? అందులో నిరుపేదల శాతం ఎంత? అది మొత్తం దేశజనాభాలో ఎంత శాతం? అనే గణాంకాలను తేల్చడానికి కమ్యూనిస్టు నేతలకు ఇప్పటికీ తీరిక దొరకలేదు !.

నిజం చెపితే కొందరు అపార్ధం చేసుకుంటారుగానీ, దేశంలో శ్రామికుల్ని గుర్తించడంలో కమ్యూనిస్టు పార్టీల నేతలకన్నా హిందూత్వవాదులు చాలా ముందున్నారు!. అనుమానం వున్నవాళ్ళు గత నాలుగేళ్ళలో దేశంలో గోగ్రవాదుల  హతుల, బాధితుల జాబితాను పరిశీలిస్తే చాలు.

నూరేళ్ళ చరిత్రలో భారత కమ్యూనిస్టు పార్టి సాయుధ పోరాటం చేసింది కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే. 1947 సెప్టెంబరులో మొదలెట్టి  1948 సెప్టెంబరులో విరమించింది. ఆ ఒక్క ఏడాది సాయుధ పోరాటాన్ని కూడా దేశంలోని ఇతర ప్రాంతాలు, సంస్థానాల్లో కాకుండా కేవలం నిజాం సంస్థానంలో మాత్రమే సాగించింది. 

కమ్యూనిస్టు పార్టీలోని అతివాదులు నిజాం మీద సాయుధ పోరాటం చేయాలన్నారు. నిజాం గద్దె దిగగానే మితవాదులు సాయుధ పోరాట విరమణ చేయాలన్నారు. కమ్యూనిస్టు అతివాదులు, మితవాదులు ఇద్దరిదీ స్వామీ రామానంద తీర్ధ అనే హిందూత్వవాది మార్గమే. మరోమాటల్లో చెప్పాలంటే; ‘ముస్లిం నిజాం సంస్థానాన్ని ’హిందూ ఇండియన్ యూనియన్ లోనికి విలీనం చేయాలనే ’హిందూత్వ కార్యక్రమానికి ఆర్యసమాజ్ సూత్రధారిగా వుంటే కమ్యూనిస్టు పార్టీ పాత్రధారిగా వుండింది. ఇది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వపు అమాయికత్వమనో? లేక ఒక కుట్రపూరిత చర్య అనో మాత్రమే మనం నిర్ధారించగలం. ఇప్పుడు అలాంటి నిర్ధారణలవల్ల ప్రయోజనం లేదు.  కమ్యూనిస్టు పార్టీలలోనూ కీరీటధారులు, సూత్రధారులు, చక్రధారులు, పాత్రధారులు వుంటారు. పార్టీ శ్రేణుల్లో దిగువన వుండే పాత్రధారులకు ఎలాగూ ఈ కుట్రలు కుహకాలు  తెలియవు. పాపం వాళ్ళు తెలంగాణలో రైతురాజ్య స్థాపన కోసం ఇంకో మూడేళ్ళు పోరాడుతూనే వుండిపోయారు.   

కేరళలో సాగిన మోఫ్లా ముస్లిం కౌలు రైతుల వుద్యమాన్ని కొందరు కమ్యూనిస్టులు తమ సాయుధపోరాట ఖాతాలో వేస్తుంటారు. అది తప్పు. ఖిలాపత్ ఉద్యమం మీద బ్రిటీష్ పాలకులు సాగించిన క్రూర అణిచివేత మోఫ్లా ముస్లింల తిరుగుబాటుకు తక్షణ ప్రధాన కారణం. బ్రిటీష్ ఇండియాలో కమ్యూనిస్టులు 1925 తరువాతనే ఒక పార్టీగా ఏర్పడ్డారు. మోఫ్లా వుద్యమం 1922 ఫిబ్రవరిలోనే ముగిసింది. అప్పటికి భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టనూలేదు; దానికి సాయుధ పోరాట పంథానూ లేదు.

వర్గ దృక్పధం నుండి కుల అస్తిత్త్వాన్ని గుర్తించడానికి కమ్యూనిస్టు పార్టీలకు వందేళ్ళు పట్టింది.  కుల అస్తిత్త్వం నుండి వర్గ దృక్పధాన్ని గుర్తించడానికి  బీ.ఆర్. అంబేడ్కర్ కు  ఐదేళ్ళే పట్టింది.  1930లో  అణగారిన వర్గాల సమాఖ్య (DCF)ను ఆరంభించిన అంబేడ్కర్ ఐదేళ్ల లోపునే 1935లో స్వతంత్ర కార్మిక పార్టి (ILP)ను ఆరంభించి ఎర్రజెండా ఎత్తి పట్టుకున్నారు.

ఐ.ఎల్.పి. 1938లో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీతో కలిసి కొంకణ్- బొంబాయి కౌలురైతుల పాదయాత్ర నిర్వహించింది. అదే సంవత్సరం ఐ.ఎల్.పి. కమ్యూనిస్టు పార్టీతో కలిసి బొంబే జౌళీ కార్మికుల మహత్తర సమ్మెలో పాల్గొంది. కార్మికుల సమ్మె హక్కును ఐ.ఎల్.పి. బొంబాయి శాసన సభలోనూ గట్టిగా సమర్ధించింది. కుల విభజన అనేది కేవలం  శ్రమ విభజన మాత్రమేకాదు శ్రామికుల విభజన కూడా అనే సూత్రీకరణను అంబేడ్కర్ ఈ దశలోనే చేశారు.

అయితే, అంబేడ్కర్ ఎర్రజెండాను ఎత్తి పట్టుకోవడం అప్పటి కమ్యూనిస్టు అగ్రనేతలు  యం. యన్. రాయ్, శ్రీపాద అమృత డాంగే లకు నచ్చలేదు. సాంఘీక పరిభాషలో చెప్పాలంటే దళితులు కమ్యూనిస్టులు కావడం బ్రాహ్మణీయ కమ్యూనిస్టులకు నచ్చలేదు. “అంబేడ్కర్ కార్మికుల్ని కుల ప్రాతిపదిక మీద చీలుస్తున్నాడని” కమ్యూనిస్టు నేతలు విమర్శించేవారు. “దళితుల మానవ హక్కుల్ని కమ్యూనిస్టులు గుర్తించడంలేద”ని అంబేడ్కర్ ఖడించేవారు. ఈ తగవు ఏడేళ్ళు సాగింది. దానితో విసిగిపోయిన అంబేడ్కర్ 1942లో ఐ.ఎల్.పి.ను రద్దు చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడెరేషన్ (ఎస్.సి.ఎఫ్)ను ఆరంభించారు.  స్వాతంత్ర్యానంతర కాలంలో అంబేడ్కర్ ఆరంభించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఇది మాతృక.

మార్క్స్ చాలా విస్తృతంగా సిధ్ధాంత గ్రంధాలు రాశాడు. వాటిల్లో, సమాజ పరిణామానికి సంబంధించి మూడు మూడు అద్భుతమైన నిర్ధారణలు చేశాడు. వాటిల్లో మొదటిది; వర్గ సంఘర్షణలో శ్రామికవర్గం నిర్వర్తించే పాత్రే సమాజ చలనశక్తి అనేది.  రెండవది; సమాజంలో ప్రతి సమూహం తన ఉనికిని కాపాడుకోవాలనుకుంటుంది. కానీ, కార్మికవర్గం మాత్రం తనను తాను రద్దుచేసుకోవడం ద్వార వర్గ సమాజాన్నే రద్దు చేస్తుంది. మూడోది; పెట్టుబడీదారీ నియంతృత్వానికి విరుగుడుగా కార్మికవర్గ నియంతృత్వాన్ని బలపరచినపుడే వర్గరహిత సమాజం ఏర్పడుతుంది. ఈ మూడు సూత్రాల్నీ, ముఖ్యంగా మూడో సూత్రాన్ని ఆమోదించే  కమ్యూనిస్టు పార్టీ ఏదైనా వుందా?

భారత శ్రామికవర్గం అంటే ఎవరూ? అనే వందేళ్ళ క్రితపు ప్రశ్న ఇప్పటికీ మనల్ని వెంటాడుతోంది. బాధితులు, పీడితులు, కష్టజీవులు, కష్టాల్లోవున్నవారు, ఆపదల్లోవున్నవారు, అణగారిన సమూహాలు, బలహీనవర్గాలు అనే విసృత అర్ధంలో శ్రామికవర్గాన్ని చూడాలి. మరోమాటల్లో చెప్పాలంటే; ఆదివాసులు, దళితులు, మత అల్పసంఖ్యాకవర్గాలు, బహుజనులు, మరియూ అగ్రవర్ణాలు, పెత్తందారి కులాల్లోని నిరుపేదల్ని వర్తమాన భారత శ్రామికులు అని అన్వయించాలి. మార్క్సిజం అంటే ఒక పుస్తకాన్ని చదవడమో, వల్లెవేయడమో కాదు; సమాజానికి శాస్త్రాన్ని అన్వయించడం. ఇప్పుడు ఈ భారత నయా శ్రామికవర్గానికి  మార్క్స్ మూడు సమాజ సూత్రాలను అన్వయించి చూడండి. సరికొత్త విప్లవం ఆరంభమవుతుంది!!   

(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు )
మొబైల్ : 9010757776

హైదరాబాద్
10 మే 2018

ప్రచురణ :
మన తెలంగాణ దిన పత్రిక, 11 మే 2018
http://epaper.manatelangana.news/1652284/Mana-Telangana-City-Main/11-05-2018#page/4/3

Tuesday, 8 May 2018

Conspiracy of Sangh Parivar under the guise of Protecting Sufism


సూఫీల చాటున సంఘీయుల కుట్ర

అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)



మనిషికీ సృష్టికర్తకూ మధ్య సంబంధాన్ని సరళతరం చేసిన ధార్మిక సిధ్ధాంతం ఇస్లాం. విశ్వాసులు ఎవరయినాసరే సృష్టికర్తతో నేరుగా  మొర పెట్టుకోవచ్చు; శాంతి సౌభాగ్యాలను కోరుకోవచ్చు. మధ్యలో పూజారివర్గం అనేది లేదు.

సూఫీ తత్వం ఇస్లాంకు ఒక ఉపశాఖ. ఇస్లాం పరిభాషలో సూఫీ తత్వాన్ని తసవ్వుఫ్ అంటారు. అది ఇస్లాంను సంగీతమయం, నాట్యభరితం చేసింది.  చరిత్రకారుడు  తారా చంద్ మాటల్లో చెప్పాలంటే “ సూఫీ తత్త్వం అనేది ప్రగాఢ భక్తి పారవశ్యం. ప్రేమ దాని లక్ష్యం. కవిత్వం, సంగీతం, నృత్యం దాని ఆరాధన మాధ్యమాలు. దేవునితో ఏకత్వాన్ని పొందడం దాని ఆదర్శం. (Influence of Islam on Indian Culture 1922).

సఫ్, సూఫ్ అనే రెండు పదాల నుండి సూఫీ అనే మాట పుట్టింది. సఫ్ అంటే తివాచీ,  సూఫ్ అంటే వున్ని. సూఫీ ముర్షిద్ లు, పీర్లు వున్నితో చేసిన తివాచీలు, కంబళీలను ధరించి నిరాడంబర జీవితాన్ని గడిపేవారు.  కనుక జనం వారిని  సూఫీలు అనేవారు. సూఫీ తత్త్వం ఒక విధంగా మార్మిక ఆరాధనగా కనిపిస్తుంది.  ఇస్లాంకు చెందిన షియా శాఖలోనూ సూఫీ విభాగం కొంత వున్నప్పటికీ సున్నీ శాఖలోనే సూఫీ తత్వం అత్యధికంగా వుంది.

సూఫీ తత్త్వం మూలాల గురించి అనేక వాదనలున్నాయి.  ప్రవక్త ముహమ్మద్ (వారికి శాంతి కలుగుగాగక) కాలంలోనే సూఫీ తత్త్వం వుందని కొందరంటే, తొలి ఖలీఫా హజ్రత్ అబూబకర్ సిధ్ధీఖీ కాలంలో ఆరంభమయిందని మరికొందరంటారు.  షియా ముస్లింలు భావించినట్లే, సూఫీ గురువులు కూడా  నాలుగవ ఖలీఫా హజ్రత్ ఆలీ ఇబ్నె అబు తాలీబ్  ను తమ మూల పురుషునిగా భావిస్తారు. ఆ వాదనలు ఎలావున్నా, పన్నెండవ శతాబ్దపు మధ్య ఆసియాకు చెందిన అబ్దుల్ ఖాలిఖ్ ఘిజ్దువాని బోధనలతో సూఫీ తత్వం వుధృతంగా విస్తరించిందని చెప్పవచ్చు.

ఇస్లాం ఏడవ శతాబ్దం ఆరంభంలో పుట్టింది. ప్రవక్త ముహమ్మద్ కాలంలోనే అది భారత ఉపఖండంలోనికి విస్తరించింది. ఇస్లాంను స్వీకరించిన అరబ్బు వ్యాపారులు మొదట కేరళలోని మలబారు తీరానికీ,  ఆ తరువాత కొంకణ్ – గుజరాత్ తీరానికి చేరుకున్నారు. 

హిందూ సాంఘీక వ్యవస్థలో ఒక కులం మరో కులాన్ని హీనంగా చూసే సాంప్రదాయంవుంది. దానివల్ల నిమ్నకులాలు, తెగలు తీవ్రమైన సాంఘీక, ఆర్ధిక అణిచివేతను ఎదుర్కొనేవి. కొన్ని కులాలతో వ్యవహరించే సమయంలో అస్పృశ్యతను కూడా పాటించేవారు. నిజానికి ఈ సాంప్రదాయాలు ఏదో ఒక స్థాయిలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంటే, ఏడవ శతాబ్దంలో ఈ సాంఘీక అణిచివేత ఎంతటి తీవ్ర స్థాయిలో వుండేదో ఊహించుకోవచ్చు. 

దేవుని సృష్టిలో  మానవుడు అత్యున్నత జీవి అని ఇస్లాం బోధిస్తుంది. మనుషులు కలిసినపుడు ఒకరినొకరు మర్యాదగా  ఆలింగనం చేసుకోవడం ఇస్లాం సాంప్రదాయం. కుల అణిచివేతకూ, అస్పృశ్యతకూ గురవుతున్న సమూహాలకు ఇస్లాం ఆలింగనం స్వర్గలోక ప్రవేశద్వారంగా కనిపించింది.  సమూహాలు సమూహాలుగా భారత నిమ్నకులాలు ఇస్లాంను స్వీకరించడం మొదలెట్టాయి.  ఇస్లాం విశ్వాసులకు సాధికారతను ఇస్తుంది. అది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది.  

భారత ఉపఖండంలో  కత్తి మొన మీద ఇస్లాం విస్తరించిందని కొందరు చరిత్రను వక్రీకరిస్తుంటారు. ఇస్లాం ఆత్మగౌరవ నినాదంతో  విస్తరించింది.  ఎనిమిదవ శతాబ్దంలో ముహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ ప్రాంతం మీద దండెత్తడానికి  వందేళ్ళు ముందే మలబారు ప్రాంతంలో హిందూ సమాజపు శూద్ర కులాలు పెద్ద ఎత్తున ఇస్లాంను స్వీకరించి మో పిళ్ళాలు (మా అళ్ళుళ్ళు) గా మారారు. కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా,  కొడుంగల్లూరు తాలూక,  మేథల గ్రామంలో 629లోనే చేరమన్ జుమ్మా మసీదును నిర్మించారు. దాదాపు ఆ కాలంలోనే గుజరాత్ ప్రాంతంలో మరి కొన్ని మసీదులు వెలిశాయి. 

సూఫీ గురువులు పన్నెండవ శతాబ్దంలో భూమార్గాన భారత ఉపఖండంలోనికి ప్రవేశించారు. తొలి తరం సూఫీ గురువులైన హజ్రత్ బహదుద్దీన్ జకారియా (ముల్తాన్, ఇప్పటి పాకిస్తాన్),  హజ్రత్ ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తి ( అజ్మీర్), హజ్రత్ నిజాముద్దీన్ అవులియా  (ఢిల్లీ) ల ప్రభావంతో భారత ఉపఖండంలోనేగాక దక్షణాసియా దేశాల్లోనూ సూఫీ తత్వం వేగంగా విస్తరించింది.  జలాలుద్దీన్ మొహమ్మద్ రూమీ, (1207-1273) అమీర్ ఖుస్రో  (1253 – 1325) వంటి వాగ్గేయకారులు  సృష్టించిన ఖవ్వాలీలు, గజళ్ళు సామాన్య ప్రజానీకాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇస్లాం ఆత్మగౌరవ నినాదానికి సూఫీల ప్రేమతత్వం తోడు కావడంతో భారత  ఉపఖండంలో   ఇస్లాం విస్తరణ మరింత వేగంగా సాగింది. హిందూ ముస్లీం సమూహాల మధ్య అపోహల్ని తొలగించి  దిగువ శ్రేణుల్లో రెండు మత సమూహాల ఐక్యతకు సూఫీ తత్వం గొప్పగా తోడ్పడింది. మరోమాటల్లో చెప్పాలంటే, బౌధ్ధ, హిందూ మతాల ప్రభావం కలిగిన ఇస్లాంగా సూఫీ తత్త్వం కొనసాగింది.

దేవుని ఐక్యత, ప్రేమ తత్త్వాలతో సాగిన భారత భక్తి ఉద్యమంపై సూఫీ ప్రభావం ఏమేరకు వుందో పరిశోధనలు జరపాల్సి వుంది.  శిక్కుమత వ్యవస్థాపకులు గురునానక్ మీద సూఫీ ప్రభావం ప్రత్యక్షంగానే వుంది. 

సూఫీ గురువుల మరణానంతరం వాళ్ళ మజార్లు (సమాధులు) దర్గాలుగా వెలుస్తాయి. సహజంగానే ప్రతి దర్గాకూ ఒక పవిత్ర చరిత్ర వుంటుంది.   దర్గాలకు వెళ్ళేవారిలో ముస్లింలు, హిందువులు దాదాపు సమానంగా వుంటారు. కొన్ని దర్గాలకు హిందువులు ధర్మకర్తలుగానూ వుంటారు. మస్తానయ్య, మస్తానమ్మ, హజరత్తయ్య, బీబీ, రసూల్ వంటి ముస్లిం పేర్లను హిందూ సమాజంలోనూ చూడవచ్చు. ఫలితంగా దర్గాల దగ్గర హిందూ కర్మకాండలు ఎక్కువగా కనిపిస్తాయి. దర్గాలోని హజ్రత్ ను మొక్కుకోవడం, మొక్కులు తీర్చుకోవడం, తల నీలాలు సమర్పించుకోవడం, ప్రసాదాలు పంచడం మొదలుకుని భూతవైద్యం, పూనకాల వరకు  సమస్తం అక్కడ వుంటాయి. వీరిని మనం నయా సూఫీవాదులు అనవచ్చు. 

అల్లా, ప్రవక్త ముహమ్మద్ లతోపాటూ ఖురాన్,  హదీస్ వంటి గ్రంధాలనూ తీర్పు దినాన్నీ విశ్వసించడం ముస్లింల ప్రాధమిక విధి. దీనినే ఇమాన్ అంటారు. ఆ తరువాత నమాజ్, రోజా, జకాత్, హజ్ అనే మరో నాలుగు విధులుంటాయి. ఈ ఐదు అంశాలు ఇస్లాం ధార్మిక మూల స్థంభాలు.  నయా సూఫీలు నమాజ్, రోజా, జకాత్, హజ్ విధుల్ని పెద్దగా పాటించరు. వాటికి ప్రత్యామ్నాయంగా దర్గాలకు వెళ్ళి పైన చెప్పిన కర్మకాండల్ని నిర్వహిస్తుంటారు.

నిజానికి దర్గాలకు వెళ్ళడం దానికదే తప్పుకాదు. ఇస్లాం సేయింట్లు (సూఫీ గురువులు) చనిపోయిన చోట వెలసిన ఆలయాలు కనుక దర్గాలు ముస్లింలు అందరికీ పవిత్ర స్థలాలు. వాటిని సందర్శించవద్దని ఎవరు చెప్పినా తప్పే. మన పూర్వికుల్ని ఖననం చేసిన ఖబ్రస్తాన్ లను సందర్శించడం నిజానికి ఒక గొప్ప మానవీయ  సాంప్రదాయం. అయితే, దర్గాలు, ఖబ్రస్థాన్ లను సందర్శించడానికీ, అక్కడ మజార్లలో  (సమాధుల్లో) వున్నవారిని ఆరాధించడానికీ మధ్య ధార్మికంగా ఒక సూక్ష్మ వైరుధ్యం వుంది. నయా సూఫీలు దర్గాల మజార్లలో వున్నవారిని ఆరాధిస్తారు. ఇస్లాం ఏకేశ్వరోపాసన మతం. అల్లాను తప్ప మరొకర్ని ఆరాధించడం ఇస్లాం మతాచారం ప్రకారం అపరాధం. బయటి సమాజాలు తరచూ అపోహ పడుతున్నట్టు ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ ను కూడా ఆరాధించరు; ఆరాధించ కూడదు. పైగా, ప్రతి నమాజ్(ప్రార్ధన)లోనూ విధిగా  ప్రవక్త ముహమ్మద్ కు శాంతి కలుగ జేయాలని అల్లా ను వేడుకుంటారు. 

ఈ నేపథ్యంలో  ఇరువైపులా రెండు రకాల అతివాదాలు  ముందుకు వచ్చాయి. సాంప్రదాయ ముస్లిం అతివాదులు అసలు దర్గాలకు వెళ్లడమే తప్పు అంటారు.  నయా సూఫీ అతివాదులు దర్గాలకు వెళితే నమాజ్, రోజాలు చేస్తున్నట్టే అంటారు.

ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన క్రమంలో స్థానిక మతాల కర్మకాండల ప్రభావాలకు లోనైంది. చాపకింద నీరులా, పరోక్షంగా  బహుదేవతారాధన కూడా రంగప్రవేశం చేసింది. దానితో ఇస్లాం మౌలిక సిధ్ధాంతమైన ఏకేశ్వరోపాసన (తౌహీద్)కే ముప్పు వచ్చిందనే ఆందోళన 18వ శతాబ్దంలో మొదలయ్యింది. సాంప్రదాయ ఇస్లాంను పునరుధ్ధరించడానికి   కాలుష్య నివారణ చర్యలు చేపట్టడానికంటూ సలాఫీ ఉద్యమం ఆరంభమయింది. సౌదీ అరేబియాకు చెందిన ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వాహబ్ దీని సిధ్ధాంతకర్త.  ఇస్లాం పునరుధ్ధరణ ఉద్యమాన్ని వారి పేరునే వాహబ్బీ ఉద్యమం అంటారు. ఇతర మతాల ప్రభావాల నుండి పరిరక్షించి పరిశుధ్ధ ఇస్లాంను పునరుధ్ధరించాలనేది వాహబ్బీ ఉద్యమ ప్రకటిత లక్ష్యం.

19వ శతాబ్దం మధ్యలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా బెంగాల్ లో వహబ్బీ, ఫరైజీ పేరిట సాగిన  రైతాంగ ఉద్యమాలకు, మొదటి ప్రపంచ యుధ్ధం తరువాత కేరళలో మోప్లాల పేరిట సాగిన కౌలు రైతుల ఉద్యమాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రేరణగా వున్నది వహబ్బీ భావజాలమే.. అయితే,  వర్తమాన నయా - వహాబ్బీ ఉద్యమానిది అతివాద తత్వం.

క్రీస్తును అనుసరించేవారు క్రైస్తవులు అయినట్టు, ప్రవక్త ముహమ్మద్ ను అనుసరించేవారు ముహమ్మదీయులు. సున్నీలు ముహమ్మద్ ప్రవక్తకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రవక్త ముహమ్మద్ జన్మదినోత్సవాన్ని సున్నీలు మిలాద్- ఉల్ - నబీ గా చాలా ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలో  మిలాద్ ఉల్ నబీ జాతీయ సెలవు దినం. వహబ్బీ తత్త్వం ప్రవక్త ముహమ్మద్ (వారికి శాంతి కలుగుగాక) ప్రాధాన్యతను తగ్గిస్తున్నదనే అసంతృప్తి సున్నీలలో కనిపిస్తుంది.

స్వల్ప తేడాలున్నప్పటికీ నేటి తబ్లిగీ జమాత్, అహ్లె హదీస్ సంస్థలు దాదాపు వహబ్బీ దృక్పథంతో కొనసాగుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులతోపాటూ, మీడియా కూడా తెలియక  జమాతే ఇస్లాం ఏ హింద్, జమాతే ఉలేమా ఏ హింద్ లను సహితం ఛాందసవాద వహబ్బీ సంస్థలుగా భావించి ఆరెస్సెస్ తో పోల్చుతుంటారు. నిజానికి అవి రెండూ ఉదారవాద రాజకీయార్ధిక దృక్పధంగల సంస్థలు. జాతియోద్యమ కాలంలో జమాతే ఉలేమా సంస్థ కాంగ్రెస్ తో చాలా సన్నిహితంగా వుండేది. ఆ సంస్థ అగ్రనేత పద్మభూషణ్ మౌలాన సయ్యద్ హుసేన్ అహ్మద్ మదాని పాకిస్తాన్ ఏర్పాటును  తీవ్రంగా వ్యతిరేకించారు. భారత ముస్లింలు పాకిస్తాన్ కు వలస వెళ్ళాల్సిన పనిలేదని ఫత్వా జార్తీచేశారు. తబ్లిగీ జమాత్ ఇహలోక (దునియాదారీ) విషయాలను తాను పట్టించుకోనని ప్రకటించి పరలోక (దీన్ దారీ) విషయాలను మాత్రమే పట్టించుకుంటుంది. అందుకు భిన్నంగా  జమాతే ఇస్లాం, జమాతే ఉలేమాలు  సామాజిక, రాజకీయ అంశాలను పట్టించుకుంటాయి.

విభజించి పాలించు అనే ఉపాయాన్ని బ్రిటీష్ వాళ్ళు కనిపెట్టారని కొందరు అమాయికంగా అంటుంటారు. హిందూ సాంప్రదాయంలోనే బేధోపాయం అనాదిగా వుంది.  సంఘ్ పరివారపు మేధోసరోవరాలు, సాంఘీక, అసాంఘీక మీడియా విభాగాలు ముస్లిం సమాజం మీద బేధోపాయాన్ని గట్టిగానే ప్రయోగిస్తున్నాయి. సున్నీల మీద షియాల్ని, వహబ్బీల మీద సూఫీలని, ముస్లిం పురుషుల మీద ముస్లిం స్త్రీలని ఉసిగొల్పే ప్రయత్నాలు ప్రణాళిక బధ్ధంగా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. హైదరాబాద్ మక్కా మసీదు, అజ్మీర్‍ దర్గాల్లో పేళుల్లు ఈ వ్యూహంలో భాగంగా జరిగినవే అంటే అతిశయోక్తికాదు.  అభినవ్ భారత్ సంస్థ మసీదులు, దర్గాల మీద పేలుళ్ళు జరిపి ఆ నేరాన్ని వహబ్బీ సమర్ధకుల మీద మోపి, ముస్లిం సమాజంలోని అతివాదులు (వహబ్బీలు), మధ్యేవాదులు (సున్నీలు) అతి ఉదారవాదులు (సూఫీలు)ల మధ్య ధార్మిక వివాదాలు రేపడానికి  బరితెగించి ప్రయత్నించింది.

సామాన్య సున్నీల మీద సూఫీలను ఉసి గొల్పే పనిని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా భుజాలకు ఎత్తుకున్నారు. దాద్రీలో అక్లాఖ్ ను గోగ్రవాదులు చంపేసిన ఆరు నెలల తరువాత, హర్యాణ రైల్లో జునైద్ ను క్రూరంగా చంపేయడానికి ఒక ఏడాది ముందు 2016 మార్చి 18న  ఢిల్లీలో ప్రపంచ సూఫీ వేదిక సదస్సు జరిగింది. అందులో ప్రారంభోపన్యాసాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. “వర్తమాన ప్రపంచం మీద హింస చీకట్లు కమ్ముకున్న ఈ సందర్భంలో మీరు ఆశల వెలుగుగా కనిపిస్తున్నారు” అంటూ సూఫీ గురువుల్ని పొగడ్తలతో ముంచెత్తారు.  

ప్రధాని పేర్కొన్న ‘హింస చీకట్లు’  గోగ్రవాదుల గురించి కాదు. దేశాన్ని కమ్ముకున్న అసహన వాతావరణం గురించి కాదు. మూక హంతకుల (లించింగ్) గురించి కాదు. వారు ప్రఅస్తావించింది వహబ్బీ ఇస్లాం గురించి!.

ఇండియా టుడే సీనియర్ సంపాదకుడు, నరేంద్ర మోదికి పరమ భక్తుడు అయినా ఉదయ్ మధుర్కర్  నయాసూఫిలు, సున్నీల మధ్య వైరాన్ని పెంచడానికి నిరంతర కలం సేవ చేస్తున్నారు.  “వహబ్బీలు చేపట్టిన ఉగ్రవాద మార్గానికి  ఉదారులైన సూఫీలు బలయి పోతున్నార”ని సూత్రీకరిస్తూ వారు సిధ్ధాంత వ్యాసాలు ప్రచురిస్తున్నారు. గోధ్రాలో కరసేవకుల్ని చంపింది వహబ్బీ ముస్లింలు అయితే, దానికి ప్రతీకారంగా హిందువులు సాగించిన గుజరాత్ నరమేధంలో బలయిపోయింది ప్రధానంగా సూఫీలే”నని వారు కొత్తగా ‘నిజనిర్ధారణ’ నివేదికల్ని కూడా సమర్పిస్తున్నారు!.

పాకిస్తాన్ ఏర్పడినపుడు ముస్లింలలో అత్యధికులు భారత దేశంలోనే వుండిపోయారని ఉదయ్ మధుర్కర్ కూడా   గుర్తిస్తారు.  అయితే అది దేశం మీద ప్రేమతో కాకుండా సువిశాల భారతదేశంలోని హిందువులను ఇస్లాం లోనికి మతమార్పిడి చేసుకోవాలనే దురాలోచనతోనే ముస్లింలు ఇక్కడ వుండిపోయారని ఒక వితండవాదం చేస్తారు. వర్తమాన భారత సమాజంలో వహబ్బీల నుండి  సూఫీలను కాపాడే “రక్షకుడు “నరేంద్ర మోదీ ఒక్కరే అనేది ఉదయ్ మధుర్కర్ బోధనల సారాంశం.

సంఘీయులు గతంలో “ముస్లింలందరూ టెర్రరిస్టులే!” లేదా “టెర్రరిస్టులందరూ ముస్లిములే” అనే నిందల్ని ప్రచారం చేసేవారు. ఇప్పుడు “టెర్రరిస్టులందరూ వహబ్బీలే” అని కొత్త ప్రచారం మొదలెట్టారు. పసిపిల్లలపై హత్యాచారాల్ని కూడా రాజకీయార్ధిక లబ్దిగా మార్చుకుంటున్న ‘హిందూ టెర్రర్’ గురించిగానీ, ‘కాషాయ ఉగ్రవాదం’ గురించిగానీ ఈ కాషాయ మేధావులు మాట్లాడరు. ముస్లిం సమాజాన్ని అన్ని రంగాలలో అణిచివేయడమేగాక, అణగారిన సమూహాల్లో చిచ్చుపెట్టడానికి కాషాయ సైన్యం  చాలా వేగంగా పావులు కదుపుతోంది. కొంచెం జాగరూకతతో వుండండి!

 (రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైల్ :  9010757776

(25 ఏప్రిల్ 2018న ఉస్మానియా విశ్వవిద్యాలయం ICSSR సమావేశమందిరంలో ఈ అంశంపై ప్రాధమికంగా  ప్రసంగించాను) 


హైదరాబాద్
6 మే 2018
ప్రచురణ :
ఎడిట్ పేజి, ప్రజాపాలన దినపత్రిక,  9, 10  మే 2015

Friday, 4 May 2018

Chandrababu Should Answer to Muslims


చంద్రబాబు సమాధానం చెప్పాలి
డానీ  ( యం ఖాన్ యజ్దానీ)


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరహా హోదాతోపాటూఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం -2014 అమలు  కోసం  ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు ముస్లిం ఆలోచనాపరుల వేదిక సంపూర్ణ మద్దతు  తెలుపుతోంది.

అయితే ముస్లిం సమాజానికి  తెలుగుదేశం  ప్రభుత్వం చేసిన, చేస్తున్న  అన్యాయాల్ని  సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం వుంది.

యన్టీ రామారావు హయాంలో ముస్లింలు తెలుగు దేశం పార్టీ మీదఅభిమానంతోవుండేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రి  అయ్యాక సన్నివేశం మారిపోయింది. 1998 మార్చి మూడవ వారంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా హైదరాబాద్ నుండి బయలుదేరిన చంద్రబాబు ఢిల్లీలో ఎన్డీఏ కన్వీనర్ గా రాజకీయాంతీకరణ గావించి ఏబి వాజ్ పాయిని ప్రధాని చేయడంలో కీలక పాత్ర వహించారు. చంద్రబాబు హిందూ మతతత్త్వ శక్తులతో చేతులు కలిపినందుకు మనస్తాపం చెందిన బహిరుద్దీన్ బాబూఖాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

2002లో గుజరాత్ లో ముస్లింల మీద నరమేధం జరిగినప్పటికీ చంద్రబాబు బీజేపీకి మద్దతునుఉపసంహరించుకోలేదు. వాజ్ పాయి  పాలనను ఓడించాలనే  లక్ష్యంతో ముస్లింలు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ కు  మద్దతు   పలికారుమతతత్త్వ శక్తులతో చేతులు కలిపిన   చంద్రబాబు  పాలన   ఆంధ్రప్రదేశ్ లో అంతం కావడానికి తమ వంతు కృషి చేశారు. 2009  ఎన్నికల్లోనూ  ముస్లింలు  టిడిపిని విశ్వసించలేదు.

2011 టిడిపి మహానాడు సభా వేదిక నుండియన్ టి రామారావు జయంతి అయిన మే 28న చంద్రబాబు  ముస్లిం  సమాజానికి  తనంతట తానుగా  క్షమాపణలు  చెప్పారు.ఎన్డీఏ పాలనకు మద్దతు ఇవ్వడం నా తప్పుఇంక ఎన్నడూ ఎట్టి పరిస్థితుల్లోనూ మతతత్త్వశక్తులతోచేతులు కలపను అని హామీ ఇచ్చారు. వారు  క్షమాపణలు చెప్పి ఊరుకోలేదు.  2012  సెప్టెంబరు  28  శుక్రవారం  నాడు  చంద్రబాబు ముస్లింల మీద వరాల  జల్లు  కురిపించారు.  తాము  అధికారానికి రాగానే రూ. 2500 కోట్ల రూపాయలతో ముస్లిం సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఏర్పాటు చేసిన మరో ప్రత్యేక సదస్సులో ముస్లింలకు రాజకీయవిద్యాఉపాధిరంగాలతోపాటూ , సాలీన రాష్ట్ర బడ్జెట్ లో 8 శాతం కోటా  కల్పిస్తామన్నారు. 24 మంది  ముస్లిం  అభ్యర్ధులకు  టిడిపి  టిక్కెట్లు  ఇవ్వడగాక  కనీసం 15 మంది అభ్యల్ని గెలిపించుకునే బాధ్యతను తాను వుక్తిగతంగా స్వీకరిస్తానన్నారు. రాష్ట్రంలో జస్టిస్ సచార్ కమిటీ సిఫార్సుల్ని అమలు పరుస్తా మన్నారు.

అప్పటికి బీజేపి ప్రధానమంత్రి అభ్యర్ధిగా వున్న నరేంద్రమోదీ 2013  జులై  నెలలో ఒక టీవీ ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ  గుజరాత్ నరమేధాన్ని  కారు కింద పడిన కుక్కపిల్ల గా పోల్చారు.  అప్పుడు చంద్రబాబు  ఇలాంటి వ్యక్తి  దేశప్రధాని పదవికి పనికి రాడు అని ప్రకటించారు. తరువాత , మోదీని  భావి భారత మహానాయకునిగా చిత్రిస్తూ కార్పొరేట్ కంపెనీలు సాగించిన బూటకపు  ప్రచారానికి చంద్రబాబు కూడా లొంగిపొయారు.

 ప్రధానిగా మోదీ వస్తే దేశం బాగుపడుతుందని  పార్టీతో పొత్తు పెట్టుకున్నాం  అని ఇప్పుడుచంద్రబాబు అంటున్నారుదీని అర్ధం ఏమిటీ?

మతతత్త్వశక్తులతో పొత్తులు పెట్టుకోమువిద్యాఉపాధిరాజకీయరంగాల్లో ముస్లిం ప్రాతినిధ్యాన్నిపెంచుతాంసచార్ కమిటీ  సిఫార్సుల్ని  అమలు  చేస్తాం అన్న చంద్రబాబు వాగ్దానాలన్నీ కాలి బూడిదై పోయాయి. ముస్లింలకు  8 శాతం రిజర్వేషన్లు, 15 మంది ఎమ్మెల్యేలు కాదు కదా గుజరాత్  నరమేధ  కిరీటధారినరేంద్ర మోదీ మనోభావాలు దెబ్బతింటాయని రాష్ట్ర  కేబినెట్  లో  ఒక్క  ముస్లింకు కూడా స్థానంకల్పించలేదు.

నరేంద్ర మోదీ తనను నాలుగేళ్ళు మోసం చేశారని చంద్రబాబు ఇప్పుడు ఆరోపిస్తున్నారుఈనాలుగేళ్ళు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలను ఘోరంగా మోసం చేస్తూ వచ్చారు.

మోదీ చేసిన మోసానికి నిరసనగా చంద్రబాబు ఇప్పుడు  పుట్టిన రోజు దీక్షలుధర్మపోరాటాలుచేస్తున్నారుమరి చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా ముస్లింలు ఎలాంటి నిరసనలు తెలపాలీ? తనవల్ల  ముస్లిం  సమాజానికి  జరిగిన  నష్టానికి  పరిహారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ఇప్పుడయినా చంద్రబాబు ప్రకటించాలి.

చంద్రబాబును విమర్శిస్తున్నామంటే జగన్ ను సమర్ధిస్తున్నట్టుకాదుజగన్ ఢిల్లీలో నరేంద్ర మోదీతోరహాస్య రాజకీయ అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్టు  ముస్లిం  సమాజం అనుమానిస్తున్నదిఅదేనిజమయితే నంద్యాల ఉప ఎన్నికల  అనుభవాన్నే రేపు 2019 అసెంబ్లీ, లోక్ సభా ఎన్నికల్లో జగన్ చవిచూస్తారు. ఈలోపు చంద్రబాబు గతంలో తాను ప్రకటించిన ముస్లిం సబ్ ప్లాన్ ను అమలు చేయాలి.

(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) కన్వీనర్)

Vijayawada
3 May 2018  

ప్రచురణ :
ప్రజాపాలన, 4 మే 2018