Thursday 10 May 2018

Karl Marx Bicentenary celebrations


Karl Marx Bicentenary celebrations
కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలు

వల్లెవేత కాదు;  అన్వయం కావాలి
డానీ

                  రెండు శతాబ్దాల తరువాత కూడా కార్ల్ మార్క్స్ ను స్మరించడం మహత్తర విషయమే కావచ్చుగానీ, రెండు  వందల సంవత్సరాల తరువాత కూడా సమాజం ఇలాగే వుంటున్నందుకు మార్క్స్ ఆత్మ తప్పక క్షోభిస్తూ వుంటుంది!!. మార్క్స్ అభిమానులు ఇప్పుడు ఆలోచించాల్సింది తప్పును ఎలా సరిదిద్దాలని.   

          వర్షపు చినుకు ముత్యపు చిప్పలో పడినపుడే ముత్యం అవుతుంది. ఎడారిలో పడినపుడు ఇసుకలో ఇంకిపోతుంది. భారత ఉపఖండంలో మార్క్సిజం అనే గతితార్కిక చారిత్రక భౌతికవాదం మనుగడ కూడా అలాగే సాగింది. అవసరంవున్న వాళ్ల చేతుల్లో తాత్త్విక ఆయుధంగా వుండాల్సిన   మార్క్సిజం అవసరంలేని వాళ్ళ దగ్గర అలంకారపు వస్తువుగా వుండిపోయింది. సామాజిక నేపథ్యం రీత్యా మార్క్సిజంతో అవసరంలేనివాళ్ళు కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించారు.  కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం చేసిన చారిత్రక అపచారానికి మార్క్సిజం ఇప్పటికీ పరిహారం చెల్లిస్తూనేవుంది.

కార్ల్ మార్క్స్ కుగానీ, ఆయన సహ సిధ్ధాంతవేత్త ఫ్రెడ్రిక్  ఏంగిల్స్ కు గానీ ఆసియా తరహా ఉత్పత్తి విధానం (ఏఎంపి) గురించి సమగ్ర సమాచారం లేదని కొందరు కమ్యూనిస్టు, సోషలిస్టు మేధావులు ఇప్పటికీ పెదవి విరుస్తుంటారు. 1850ల నాటి లండన్ లైబ్రరీలో భారత దేశం గురించి వున్న పుస్తకాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రచురించే గెజెట్లు, లండన్ లో తను కలుసుకున్న భారతీయులే మార్క్స్ ఏఎంపీ సూత్రీకరణకు ఆధారాలు. ఆ రోజుల్లో లండన్ లో మార్క్స్ ను  కలవగల భారతీయులు నిస్సందేహంగా అగ్రకులాలవాళ్ళే అయ్యుంటారు. నిజానికి మార్క్స్ చాలా నిజాయితీగల నిరాడంబర ఆలోచనాపరుడు. తన చారిత్రక, భౌగోళిక పరిమితులు తనకు తెలుసు. ఆ పరిమితుల్ని ఆయన కొన్నిచోట్ల నిజాయితీగా చెప్పుకున్నాడు కూడా.

మార్క్స్ పరిమితులు సరే; మార్క్స్ పరిమితుల గురించి మాట్లాడే వాళ్ళ పరిమితుల సంగతేమిటీ? భారత దేశంలో ఉత్పత్తి సంబంధాలు కుల సంబంధాల రూపంలో వ్యక్తం అవుతాయని ప్రధాన కమ్యూనిస్టు పార్టీల అగ్రనాయకుల్లో ఒక్కరంటే ఒక్కరయినా ఇప్పటి వరకు చెప్పారా? కార్మికుల ఎర్రజెండా, దళితుల నీలం జెండా కలిసి పనిచేయాలని చెప్పడానికి భారత కమ్యూనిస్టులకు శతాబ్ద కాలం పట్టింది. భారత దేశంలో శ్రామికులంటే ఆదివాసులు, దళితులు, మతమైనారిటీలు, అతి శూద్రులు ‘మరియూ’ అగ్రవర్ణాలు, పెత్తందారీ కులాలలోని కొందరు నిరుపేదలు అని తేల్చి చెప్పడానికి  కమ్యూనిస్టు పార్టీలకు ఇంకో శతాబ్ద కాలం పట్టవచ్చు.

భారత సమాజ అస్తిత్త్వమే కులం. కులాలు రెండే రకాలు శ్రామిక కులాలు, యజమాని కులాలు.  యజమాని కులాల్లోనూ కొందరు నిరుపేదలు వుంటారనే వంకతో అసలు కుల సమస్యనే పట్టించుకోకుండా, కులమత అస్తిత్వాల్ని గుర్తించకుండా కమ్యూనిస్టు పార్టీలు శతాబ్ద కాలం గడిపేశాయి. దేశ జనాభాలో యజమాని కులాల శాతం ఎంత? అందులో నిరుపేదల శాతం ఎంత? అది మొత్తం దేశజనాభాలో ఎంత శాతం? అనే గణాంకాలను తేల్చడానికి కమ్యూనిస్టు నేతలకు ఇప్పటికీ తీరిక దొరకలేదు !.

నిజం చెపితే కొందరు అపార్ధం చేసుకుంటారుగానీ, దేశంలో శ్రామికుల్ని గుర్తించడంలో కమ్యూనిస్టు పార్టీల నేతలకన్నా హిందూత్వవాదులు చాలా ముందున్నారు!. అనుమానం వున్నవాళ్ళు గత నాలుగేళ్ళలో దేశంలో గోగ్రవాదుల  హతుల, బాధితుల జాబితాను పరిశీలిస్తే చాలు.

నూరేళ్ళ చరిత్రలో భారత కమ్యూనిస్టు పార్టి సాయుధ పోరాటం చేసింది కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే. 1947 సెప్టెంబరులో మొదలెట్టి  1948 సెప్టెంబరులో విరమించింది. ఆ ఒక్క ఏడాది సాయుధ పోరాటాన్ని కూడా దేశంలోని ఇతర ప్రాంతాలు, సంస్థానాల్లో కాకుండా కేవలం నిజాం సంస్థానంలో మాత్రమే సాగించింది. 

కమ్యూనిస్టు పార్టీలోని అతివాదులు నిజాం మీద సాయుధ పోరాటం చేయాలన్నారు. నిజాం గద్దె దిగగానే మితవాదులు సాయుధ పోరాట విరమణ చేయాలన్నారు. కమ్యూనిస్టు అతివాదులు, మితవాదులు ఇద్దరిదీ స్వామీ రామానంద తీర్ధ అనే హిందూత్వవాది మార్గమే. మరోమాటల్లో చెప్పాలంటే; ‘ముస్లిం నిజాం సంస్థానాన్ని ’హిందూ ఇండియన్ యూనియన్ లోనికి విలీనం చేయాలనే ’హిందూత్వ కార్యక్రమానికి ఆర్యసమాజ్ సూత్రధారిగా వుంటే కమ్యూనిస్టు పార్టీ పాత్రధారిగా వుండింది. ఇది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వపు అమాయికత్వమనో? లేక ఒక కుట్రపూరిత చర్య అనో మాత్రమే మనం నిర్ధారించగలం. ఇప్పుడు అలాంటి నిర్ధారణలవల్ల ప్రయోజనం లేదు.  కమ్యూనిస్టు పార్టీలలోనూ కీరీటధారులు, సూత్రధారులు, చక్రధారులు, పాత్రధారులు వుంటారు. పార్టీ శ్రేణుల్లో దిగువన వుండే పాత్రధారులకు ఎలాగూ ఈ కుట్రలు కుహకాలు  తెలియవు. పాపం వాళ్ళు తెలంగాణలో రైతురాజ్య స్థాపన కోసం ఇంకో మూడేళ్ళు పోరాడుతూనే వుండిపోయారు.   

కేరళలో సాగిన మోఫ్లా ముస్లిం కౌలు రైతుల వుద్యమాన్ని కొందరు కమ్యూనిస్టులు తమ సాయుధపోరాట ఖాతాలో వేస్తుంటారు. అది తప్పు. ఖిలాపత్ ఉద్యమం మీద బ్రిటీష్ పాలకులు సాగించిన క్రూర అణిచివేత మోఫ్లా ముస్లింల తిరుగుబాటుకు తక్షణ ప్రధాన కారణం. బ్రిటీష్ ఇండియాలో కమ్యూనిస్టులు 1925 తరువాతనే ఒక పార్టీగా ఏర్పడ్డారు. మోఫ్లా వుద్యమం 1922 ఫిబ్రవరిలోనే ముగిసింది. అప్పటికి భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టనూలేదు; దానికి సాయుధ పోరాట పంథానూ లేదు.

వర్గ దృక్పధం నుండి కుల అస్తిత్త్వాన్ని గుర్తించడానికి కమ్యూనిస్టు పార్టీలకు వందేళ్ళు పట్టింది.  కుల అస్తిత్త్వం నుండి వర్గ దృక్పధాన్ని గుర్తించడానికి  బీ.ఆర్. అంబేడ్కర్ కు  ఐదేళ్ళే పట్టింది.  1930లో  అణగారిన వర్గాల సమాఖ్య (DCF)ను ఆరంభించిన అంబేడ్కర్ ఐదేళ్ల లోపునే 1935లో స్వతంత్ర కార్మిక పార్టి (ILP)ను ఆరంభించి ఎర్రజెండా ఎత్తి పట్టుకున్నారు.

ఐ.ఎల్.పి. 1938లో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీతో కలిసి కొంకణ్- బొంబాయి కౌలురైతుల పాదయాత్ర నిర్వహించింది. అదే సంవత్సరం ఐ.ఎల్.పి. కమ్యూనిస్టు పార్టీతో కలిసి బొంబే జౌళీ కార్మికుల మహత్తర సమ్మెలో పాల్గొంది. కార్మికుల సమ్మె హక్కును ఐ.ఎల్.పి. బొంబాయి శాసన సభలోనూ గట్టిగా సమర్ధించింది. కుల విభజన అనేది కేవలం  శ్రమ విభజన మాత్రమేకాదు శ్రామికుల విభజన కూడా అనే సూత్రీకరణను అంబేడ్కర్ ఈ దశలోనే చేశారు.

అయితే, అంబేడ్కర్ ఎర్రజెండాను ఎత్తి పట్టుకోవడం అప్పటి కమ్యూనిస్టు అగ్రనేతలు  యం. యన్. రాయ్, శ్రీపాద అమృత డాంగే లకు నచ్చలేదు. సాంఘీక పరిభాషలో చెప్పాలంటే దళితులు కమ్యూనిస్టులు కావడం బ్రాహ్మణీయ కమ్యూనిస్టులకు నచ్చలేదు. “అంబేడ్కర్ కార్మికుల్ని కుల ప్రాతిపదిక మీద చీలుస్తున్నాడని” కమ్యూనిస్టు నేతలు విమర్శించేవారు. “దళితుల మానవ హక్కుల్ని కమ్యూనిస్టులు గుర్తించడంలేద”ని అంబేడ్కర్ ఖడించేవారు. ఈ తగవు ఏడేళ్ళు సాగింది. దానితో విసిగిపోయిన అంబేడ్కర్ 1942లో ఐ.ఎల్.పి.ను రద్దు చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడెరేషన్ (ఎస్.సి.ఎఫ్)ను ఆరంభించారు.  స్వాతంత్ర్యానంతర కాలంలో అంబేడ్కర్ ఆరంభించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఇది మాతృక.

మార్క్స్ చాలా విస్తృతంగా సిధ్ధాంత గ్రంధాలు రాశాడు. వాటిల్లో, సమాజ పరిణామానికి సంబంధించి మూడు మూడు అద్భుతమైన నిర్ధారణలు చేశాడు. వాటిల్లో మొదటిది; వర్గ సంఘర్షణలో శ్రామికవర్గం నిర్వర్తించే పాత్రే సమాజ చలనశక్తి అనేది.  రెండవది; సమాజంలో ప్రతి సమూహం తన ఉనికిని కాపాడుకోవాలనుకుంటుంది. కానీ, కార్మికవర్గం మాత్రం తనను తాను రద్దుచేసుకోవడం ద్వార వర్గ సమాజాన్నే రద్దు చేస్తుంది. మూడోది; పెట్టుబడీదారీ నియంతృత్వానికి విరుగుడుగా కార్మికవర్గ నియంతృత్వాన్ని బలపరచినపుడే వర్గరహిత సమాజం ఏర్పడుతుంది. ఈ మూడు సూత్రాల్నీ, ముఖ్యంగా మూడో సూత్రాన్ని ఆమోదించే  కమ్యూనిస్టు పార్టీ ఏదైనా వుందా?

భారత శ్రామికవర్గం అంటే ఎవరూ? అనే వందేళ్ళ క్రితపు ప్రశ్న ఇప్పటికీ మనల్ని వెంటాడుతోంది. బాధితులు, పీడితులు, కష్టజీవులు, కష్టాల్లోవున్నవారు, ఆపదల్లోవున్నవారు, అణగారిన సమూహాలు, బలహీనవర్గాలు అనే విసృత అర్ధంలో శ్రామికవర్గాన్ని చూడాలి. మరోమాటల్లో చెప్పాలంటే; ఆదివాసులు, దళితులు, మత అల్పసంఖ్యాకవర్గాలు, బహుజనులు, మరియూ అగ్రవర్ణాలు, పెత్తందారి కులాల్లోని నిరుపేదల్ని వర్తమాన భారత శ్రామికులు అని అన్వయించాలి. మార్క్సిజం అంటే ఒక పుస్తకాన్ని చదవడమో, వల్లెవేయడమో కాదు; సమాజానికి శాస్త్రాన్ని అన్వయించడం. ఇప్పుడు ఈ భారత నయా శ్రామికవర్గానికి  మార్క్స్ మూడు సమాజ సూత్రాలను అన్వయించి చూడండి. సరికొత్త విప్లవం ఆరంభమవుతుంది!!   

(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు )
మొబైల్ : 9010757776

హైదరాబాద్
10 మే 2018

ప్రచురణ :
మన తెలంగాణ దిన పత్రిక, 11 మే 2018
http://epaper.manatelangana.news/1652284/Mana-Telangana-City-Main/11-05-2018#page/4/3

No comments:

Post a Comment