లైంగిక పరాయీకరణ!
డానీ
సమాజ సమస్యలకు
పరిష్కారం ప్రశ్నలతోనే మొదలవ్వాలిగాని ప్రశ్నల దగ్గరే ఆగిపోకూడదు. ఒక పరంపరగా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్న ఇటీవల తరచుగా వినబడుతోంది.
బాలికలపై అత్యాచారాలు చేసే నేరగాళ్ళకు ఉరి శిక్ష విధించేలా ఒక ఆర్డినెన్స్ ను తెచ్చినా
ఇలాంటి సంఘటనలు ఆగిపోవడంలేదెందుకనేది ఇంకో ప్రశ్న. సమాజవిశ్లేషకులు, సంఘసేవకులు ఈ ప్రశ్నలకు
సమాధానాలు వెతకాల్సిన సందర్భం ఇది.
సామాజిక రుగ్మతల్ని
చట్టాలు ఎన్నడూ నిర్మూలించలేవు. కఠినమైన చట్టాలు నేరస్తుల్ని కఠినంగా శిక్షించడానికి పనికి రావచ్చేమోగానీ దారుణ నేరాలు జరక్కుండా మాత్రం
ఆపలేవని గుంటూరు నగరంలో మే 15న ఓ బాలిక మీద జరిగిన అత్యాచారం చెప్పకనే చెప్పింది. బాలికల
మీద అత్యాచారం జరగడం ఇదే నెలలో గుంటూరు జిల్లాలో ఇది మూడోసారి.
కఠిన శిక్షల్ని
చూసి నేరస్తులు భయపడిపోతారు అనేది ఒక అపోహ
మాత్రమే. నేరస్వభావం కలిగినవాళ్ళు నిరంతరం చట్టం కళ్ళుగప్పే మార్గాలను అన్వేషిస్తుంటారు.
గతంలో అత్యాచారంతో ‘మాత్రమే’ ఆగిపోయే నేరాలు
కొత్త ఆర్డినెన్స్ రాకతో హాత్యాచారాలుగా మారే ప్రమాదం వుందని అనేక మంది సమాజశాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్న
ఆందోళనలు కొట్టివేయదగ్గవేమీకావు. ఉరి శిక్షపడి తాము చనిపోవడంకన్నా సాక్ష్యాన్ని చంపేయడమే
శ్రేయస్కరమని నేరస్తులు వికృతంగా ఆలోచించే అవకాశాలున్నాయి. మరో మాటల్లో చెప్పాలంటే
చట్టాలు కఠినంగా మారే కొద్దీ నేరాలు తగ్గక పోగా నేరాల తీవ్రత పెరుగుతూ వుంటుంది.
పరాయికరణవల్ల
మనిషి, మనిషిగా కాకుండా పోతున్నాడని కార్ల్ మార్క్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. దానికి కొనసాగింపుగా ఆస్ట్రియా దేశపు ప్రముఖ మనోవిశ్లేషకుడు
విల్ హెల్మ్ రైక్ (Wilhelm Reich) లైంగిక పరాయికరణను వివరించాడు. మనోవిశ్లేషణ రంగంలో సిగ్మండ్ ఫ్రాయిడ్
తరువాత అంతటివాడు రైక్. మనం ఇప్పుడు చర్చించాల్సింది నేరస్తుల్ని ఎలా శిక్షించాలని
కాదు; లైంగిక పరాయికరణకు దారి తీస్తున్న సామాజిక
పరిస్థితుల్ని ఎలా సరిదిద్దాలి అనేది.
ఆహారం, నిద్ర,
మైధూనాలు సృష్టిలో ప్రతి జీవికీ శరీర ధర్మాలు. జీవి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు
ఆహారం నిద్రలు నిరంతరం కొనసాగుతాయి. అయితే, మైధూనానికి ఒక పరిమితి వుంది. పునర్ ఉత్పత్తి
గ్రంధులు క్రియాశీలంగా మారినప్పటి నుండి అవి పనిచేయడం ఆగిపోయే వరకు శరీరానికి మైధూన
అవసరం వుంటుంది.
మనుషుల జీవితాల్లోనికి
రాజకీయార్ధిక అంశాలు అతిగా చొరబడిపోయినపుడు నిద్ర, మైధూనాలు మరుగున పడిపోయి ఆహార అంశం
మాత్రమే ప్రధానం అయిపోతుంది. ఆహారం అంటే తిండి
మాత్రమేకాదు; అది వస్త్రాలు, నివాసాలు, ఉపాధి, వ్యక్తిగత ఆస్తి, ఆదాయాలు, ప్రతిష్టల
సమాహారం. (రోటీ కపడా ఔర్ మకాన్!) కిలో బియ్యం రూపాయికే సరఫరా చేసేందుకు ప్రభుత్వ పథకాలున్నాయి.
కొన్ని వితరణ సంస్థలు పేదలు, రోగులకు ఉచిత అన్నదానం కూడా చేస్తుంటాయి. చౌక ధరకు పక్కా
ఇళ్ళు, ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి వంటి పథకాలను కూడా ప్రభుత్వాలు ప్రకటిస్తూ వుంటాయి. కానీ, నిద్ర, మైధూనాల
కోసం అలాంటి రాయితీలులేవు. ఎనిమిది గంటల నిద్ర ఒక రూపాయకే వంటి పథకాలను మనం ఎక్కడా చూసివుండం. బానిస ప్రభువులు సహితం
బానిసలకు రాత్రి వేళల్లో నిద్ర, మైధూన సౌకర్యాలు కల్పించేవారనడానికి చారిత్రక ఆధారాలున్నాయి.
అలనాటి బానిసలకున్న సౌకర్యం కూడా వర్తమాన నాగరీకులకు లేదు.
భూస్వామ్య
సమాజంలో ఆవిర్భవించిన దాంపత్య సాంప్రదాయంలో సంభోగానికి అనేక షరతులు, పరిమితులు వున్నాయి.
ఆ విధానంలో, భర్త ఆస్తిని అతని సంతానానికి
వారసత్వంగా అందించే బాధ్యత భార్యది. భర్త సంతానం, తన సంతానం ఒకటి కాదు. వాటి మధ్య కొండంత
తేడావుంది. ఆదిమ సమాజాల్లో, ముఖ్యంగా మాతృవంశావళీ
(matrilineal) వ్యవస్థలో స్త్రీలకు ‘తన సంతానం’ అనేది వుండేది. భూస్వామ్య
సమాజంలో అది కుదరదు. భూస్వామ్య దాంపత్య బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలంటే, భార్య,
పెళ్ళికాక ముందు కన్యత్వాన్నీ, పెళ్లయ్యాక
పాతివ్రత్యాన్నీ కఛ్ఛితంగా పాటించి తీరాలి!.
పెళ్ళికాని
స్త్రీలు కన్యత్త్వాన్నీ, పెళ్ళయిన స్త్రీలు పాతివ్రత్యాన్నీ పాటించే సమాజంలో పెళ్ళికాని పురుషుల లైంగిక అవసరాల్ని తీర్చడానికి వ్యభిచార వ్యవస్థ ఏర్పడింది.
భార్యల్ని కోల్పోయిన, భార్యల నుండి విడిపోయిన ‘సింగిల్’ పురుషులకు కూడా ఈ ఏర్పాటు అందుబాటులో
వుంటుంది. అంతర్ దహన యంత్రాల భాషలో చెప్పాలంటే
పాతివ్రత్య సమాజంలో వ్యభిచార వ్యవస్థ ఎగ్జాస్ట్
వాల్వ్ వంటిది. మునిసిపాలిటీ భాషలో చెప్పాలంటే డ్రైనేజ్ స్కీం లాంటిది. పాతివ్రత్యానికీ వ్యభిచార వ్యవస్థకూ అవినాభావ సంబంధం
వుంటుంది. మొదటిది లేకుండా రెండోది వుండదు. పెళ్ళి వ్యక్తిగత ఆస్తితో ముడిపడినట్టే
వ్యభిచార వ్యవస్థ కూడా వ్యక్తిగత ఆస్తితోనే ముడిపడి వుంటుంది.
పురుషులకు
మాత్రమే ఆస్తి హక్కువుండే కాలంలోనూ స్త్రీలకు
కూడా ఆస్తి హక్కు ఏర్పడిన కాలంలోనూ దాంపత్య నిబంధనలు, విలువలు, కట్టుబాట్లు ఒకేలా వుండడం
సాధ్యంకాదు. మరో వైపు వేశ్యావృత్తికి గత కాలపు సాంస్కృతిక గౌరవమర్యాదలు (గురజాడవారి
మధురవాణి) రద్దు కావడమేగాక, ఆ వృత్తి మీద అనేక ఆంక్షలు పెరుగుతున్నాయి. ఎగ్జాస్ట్ వాల్వ్
లేనపుడు యంత్రం బద్దలైపోతుంది. మురుగు కాల్వల్ని
ఆక్రమించేసి ఇళ్ళు కట్టేసుకుంటే ఒక రోజు మురుగు కట్టలు తెగి ఇళ్ళను ముంచేస్తుంది. అయితే, వాణిజ్య లైంగిక శ్రమను చట్టబధ్ధం చేయడం ఈ
సమస్యకు ఎలాగూ శాశ్విత పరిష్కారంకాదుకానీ తాత్కాలిక ఉపశమనం అవుతుంది.
పెట్టుబడీదారీ
సమాజం ప్రతిదాన్నీ సరుకుగా మార్చేసినట్టే సంభోగాన్ని
కూడా సరుకుగా మార్చేస్తుంది. అంటే, దాన్ని కొనుక్కోవాల్సిన వస్తువుగా మారుస్తుంది.
నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవాల్సిన నిద్ర, ప్రేమతో పొందాల్సిన మైధూనం చివరకు అంగడిలో కొనుక్కోవాల్సిన సరుకుగా
మారిపోతున్నాయి. పురుషులే కాకుండా భర్తల్ని
కోల్పోయిన, భర్తల నుండి విడిపోయిన ‘సింగిల్’ స్త్రీలు కూడా కొనుక్కోగలిగితే
ఈ సరుకు అందుబాటులో వుంటుంది. సరుకును డబ్బుపెట్టి కొనుక్కోలేనివారి పరిస్థితి ఏమిటనేది
ఇక్కడ అంతకన్నా కీలకమైన ప్రశ్న.
వ్యక్తిగత
ఆస్తి, వృత్తి నైపుణ్యాలు లేనివారికి పెళ్ళి కానట్టే, అవి రెండూ లేనివారికి వ్యభిచార
యోగం కూడా దక్కదు. పైగా, వ్యభిచార వ్యవస్థ అచ్చంగా నగదు వ్యాపారం. వాణిజ్య లైంగిక శ్రామికుల
దగ్గర స్వైపింగ్ మిషన్లు వుండవు. నగదురహిత సమాజం నగదులేమి సమాజంగా మారిపోయినపుడు లైంగిక
రంగంలో కూడా సంక్షోభం తీవ్రం అవుతుంది. అత్యాచార
సంఘటనలు పెరగడానికి పెద్ద నోట్ల రద్దు కూడా ఒక కారణమని మనం ఇంకా గమనించకపోవడం అన్యాయం!.
నిద్రా, మైధూనాలను
నిర్లక్ష్యం చేసినపుడు సమాజ నియమాలకూ, శరీర
ధర్మాలకు మధ్య ఒక అంతర్యుధ్ధం ఆరంభమవుతుంది. అది అనేక మానసిక వైకల్యాలకు దారి తీస్తుంది.
జీనవశైలి రోగాలంటే రక్తపోటు, మధుమేహం మాత్రమే చాలామందికి గుర్తుకు వస్తాయి. కుంగుబాటు
(Depression) కూడా ఈ జాబితాలో వుంది. నిద్రమాత్రల (Anti‑Depressant) అమ్మకాల గణాంకాలు తీస్తే, దేశంలో ఎంత మంది నిద్రలేమి (Insomnia)తో బాధపడుతున్నారో
సమాజంలో సంతోష ప్రమాణాలు ఎంత ఘోరంగా పతనం అయిపోతున్నాయో అర్ధం అవుతుంది. సంతోష ప్రమాణాలపై
ఐక్యరాజ్య సమితి రెండు నెలల క్రితం 156 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఇండియా 138 వ
స్థానంలోవుంది. సంతోష ప్రమాణాల్లో భారత దేశం గత ఏడాదికన్నా మరో 11 స్థానాలు దిగజారింది.
అత్యాచారం
అనేది మనిషి ఉన్మాదంలో చేసే చర్య అని మనకు తెలుసు. అయితే, ఏ సమూహాలు ఏ సమూహాల మీద అత్యాచారాలు
చేస్తుంటాయి? ఏ సమూహాలు అత్యాచారానికి బలవుతూ (vulnerability) వుంటాయీ? అనేవి ప్రాణప్రదమైన అంశాలు. ఉన్మాదానికి కూడా ఒక
విధానముంటుంది. There will be a method in one's madness. ఆ విధానం ఏమిటో తెలుసుకోకుండా దీనికి విరుగుడును
కనిపెట్టలేం.
మనది కుల మత
తెగ లింగ వర్గ సమాజం. అత్యాచారాలకు కూడా కుల మత తెగ లింగ వర్గ స్వభావం వుంటుంది. స్త్రీల
మీద పురుషులు, దళిత-బహుజనుల మీద పెత్తందారీ కులాలు. ఆదివాసుల మీద నగరవాసులు, మైనారిటీల మీద మెజార్టీలు, పేదల మీద ధనికులు అత్యాచారాలు సాగిస్తుంటారు. ఈ
క్రమంలో సాగుతున్నవే పిల్లల మీద పెద్దల అత్యాచారాలు. ఒక్కమాటలో చెప్పాలంటే, అణగారిన
సమూహాల మీద ఆధిపత్య సమూహాలు అత్యాచారాలు సాగిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇందుకు
విరుధ్ధంగానూ జరుగుతుంటాయిగానీ అవి చాలా చాలా అరుదైన సంఘటనలు మాత్రమే.
అత్యాచార సంఘటనల్లో
ఉన్మాదం, క్షణికోద్రేకాలకు మించిన అనేక కారణాలు వుంటున్నట్టు గమనించవచ్చు. కఠువాలో
ఎనిమిదేళ్ళ బాలిక ఆసిఫాబానో మీద సాగిన హత్యాచారానికి
సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్ధిక, ధార్మిక
కారణాలు సహితం వున్నాయని వెలుగులోనికి వచ్చింది. వ్యక్తిగతఆస్తి కోసం, ఒక సమూహాన్ని
తరిమేయడం కోసం పవిత్ర మందిరాల్లోనూ ప్రణాళికాబధ్ధంగా అత్యాచారాలు జరుగుతాయని ఈ కేసు చాటి చెప్పింది. జమ్మూ-కాశ్మీర్ లో ముస్లింలకు,
ఇతరులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని మాత్రమే ఇప్పటి వరకు బాహ్యప్రపంచం నమ్మేది. కాశ్మీర్
లో (ముస్లిం) ఆదివాసుల్ని అంతం చేసేందుకు ఒక
అమానవీయ వ్యూహం అమలవుతున్నదని ఆసిఫాబానో కేసు స్పష్టం చేసింది.
న్యాయస్థానాలకు
కూడా కుల మత తెగ లింగ వర్గ రాజకీయ స్వభావం వుంటుందంటే 20వ శతాబ్దంలో అనేకమంది ఒప్పుకునేవారుకాదు.
ధర్మాసనాల అవినీతి కథనాలు పరంపరగా బయటికి వచ్చేస్తున్నాయి కనుక ఇప్పుడు
వాళ్ళు అలా దబాయించే సాహసం చేయకపోవచ్చు. కుల
మత తెగ లింగ వర్గ రాజకీయ రంగాల్లో ప్రాబల్యంగల
సమూహాలకు చెందిన నేరస్తులు చట్టం కోరల నుండి సులువుగా తప్పించుకుంటుంటే, అలాంటి
ప్రాబల్యంలేని సమూహాలకు చెందిన నేరస్తులు చట్టం కోరల్లో చిక్కుకు పోతుండడాన్ని మనం
చూడవచ్చు. న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా లేనపుడు, అత్యాచార నిరోధక చట్టాల కోరలకు కొత్తగా
పెడుతున్న పదునంతా అణగారిన సమూహాలను శిక్షించడానికే ఉపయోగపడతాయి!.
మంచిదయినా,
చెడ్డదయినా ఏదో ఒక అవసరం, కారణం లేకుండా ఏదీ అస్తిత్వంలో వుండదు. మనం తరచూ సమస్యల్ని
తిట్టుకుంటామేతప్ప వాటిని సృష్టించిన వ్యవస్థను మార్చే ప్రయత్నం మాత్రం చేయం. అత్యాచారాలకు
కుల, మత, లింగ సమాజమే కారణం అని తెలిసినపుడు ఆ సమాజాన్ని సంస్కరించితీరాలి. కుల, మత,
లింగ సామరస్యాల్ని సాధించనంత కాలం మురుగు కాలవలు మనల్ని ముంచెత్తుతూనే వుంటాయి.
(రచయిత సమాజ
విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు)
మొబైలు
9010757776
రచన : హైదరాబాద్
, 18 మే 2018
ప్రచురణ :
మనతెలంగాణ తెలుగు డైలీ, 22మే 2018
అణగారిన వర్గాలపై తమ ఆధిపత్యం చూపేందుకు ఎంచుకునే ఒక దుర్మార్గం అత్యాచారాలు. హత్యలు. మీరన్నట్లు కుల, మత సమాజాల వ్యవహారమూ అంతే. దళిత-బహుజనులు కులసమాజాన్నీ, మైనార్టీలు మతసమాజాన్నీ, స్త్రీలు పురుషాధిక్య భావజాలాన్నీ నిర్మూలించే పనిలో సీరియస్ గా పడనంత కాలం ఈ మురుగుకాలవ మనల్ని ముంచెత్తుతూనే వుంటుంది.
ReplyDeleteవ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది.
చట్టాలు నేరాలను అదుపు చేయడమన్నది, చట్టాన్ని అమలు చేయడం కఠినంగా ఉన్నప్పుడే సాధ్యం. ఎంత కఠినమైన చట్టాలున్నా, అమలు జరగదన్న ధీమా ఉంటే నేరాలు ఆగవు. చట్టం ఖచ్చితంగా అమలయ్యే పరిస్థితి ఉంటే నేరాలు ఆగుతాయి. కాబట్టి.. కఠినమైన చట్టాల వల్ల నేరాలు తగ్గవు అనే వాదనలో ప్రధానమైన లోపం కఠినమైన చట్టం ఎంత కఠినంగా అమలవుతోందన్నది. చట్టం చేతులు పొడుగు అని చెప్పుకోవడమే కాని, కన్విక్షన్ రేటు ఎంత అనేది కూడా చాలా ముఖ్యం.
ReplyDelete..
ReplyDeleteడానీ గారు
అస్సలాము అలైకుమ్
.....
మీ వ్యాసం చదివాను.
సహజంగానే కొన్ని ప్రశ్నలు వచ్చాయి.
బహుశామీరు సమాజాన్ని
మార్క్స్ దృక్కోణం నుంచి విశ్లేషించడం కారణం కావచ్చు.
..
భూస్వామ్య వ్యవస్థ లో వేశ్యా వృత్తి పై ఆంక్షలు ఉన్నాయి అన్నారు.
కొంచెం విస్మయం కలిగింది.
అంటే మీ దృష్టిలో వేశ్యా వృత్తి సరైనదనా?
రాజ్యాంగం కూడా దానిని గుర్తించలేదు
ఇక ఇస్లాం వరకూ ఐతే
ఇస్లాం కన్యత్వాన్నీ, ప్రాతివత్యాన్ని కాపాడు కోమని చెప్పిన చోటే
ప్రాజ్ఞత రాగానే వివాహం చేసుకోమని చెప్పడం
అలానే భాగస్వామి మరణం, విడాకులు లాంటి పరిస్థితులలో పునర్వివాహం లాంటి అవకాశాలు ఇచ్చింది.
తద్వారా వ్యభిచార వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్నే లేకుండా చేసింది.
ఇక ఇస్లాం అత్యంత జుగుప్సాకరమైన అరబ్బు సమాజాన్నుండే ఈ సహజ సిద్ద విధానం ద్వారా వ్యభిచారాన్ని నిర్మూలించింది.
కనుక వ్యభిచార వ్యవస్థ అనేపదమే దానికి చట్టబద్దత కల్పించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని చెబుతుంది.అది ఎంతమేర సమాజోపయోగమో ఆలోచించగలరు.
వేశ్యావృత్తి పై ఆంక్షలు ఉన్నాయన్న మీ వివరణ
ఆంక్షలు తీసివేసి స్వేచ్ఛాయుత కామ క్రీడలకు అవకాశం ఉండాలని అనే అర్ధాన్నిస్తుంది.ఈ విశ్లేషణ కు కారణం మానవుడిని కేవలం ఒక జంతువుగా భావించే దృక్పథం కావచ్చు.
ఆ తర్వాత కూడా మైధునాన్ని కొనుక్కోవడం అనేవివరణ అలానే నోట్ల రద్దు లైంగిక రంగంలో సంక్షోభాన్ని సృష్టించింది
అనడం లో సామంజస్యత కనిపించడం లేదు.
ఇక సంతోష ప్రమాణాలను గురించి మాట్లాడారు.
అక్కడ ఇచ్చిన ర్యాంకింగ్ లైంగిక సంతోషం ఆధారంగా ఇచ్చినదా? అన్నది నా ప్రశ్న.
ఎవరు ఎవరిపై అత్యాచారం చేస్తారు? అనే దానిలో బలవంతులు, బలహీనులపై , అగ్రవర్ణాలు అధిక. వర్ణాలపై అంటూ మరికొన్ని విషయాలిచ్చారు.
మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ పెద్దగా ప్రభావితం చూపేవి కాదన్నారు.
కానీ domestic violence, women trafficking, casting couch తదితరాల ద్వారా అధిక సంఖ్య లోనే మహిళల పై అత్యాచారాలు సాగుతున్నై అనేది యధార్థ ం.
..
సంభోగానికి షరతులు
అనవసరం అనుకుందాం.ఈ భావన కారణంగానే కదా ఈ రోజు పాశ్చాత్య దేశాల్లో వివాహ వ్యవస్థ మృగ్యమైంది.
తల్లి లేని సంతానం ఉనికి లోకి వస్తుంది.
తల్లి శిక్షణ లేని కొత్త తరం ఉనికి లోకి వచ్చి తుపాకులతో పాఠశాలకు వెళ్తున్నారంటే కారణం
పటిష్ఠమైన కుటుంబ వ్యవస్థ లేమి కారణం కాదా???
పద్నాలుగేళ్ళకే షరతులు లేని లైంగిక వ్యవస్థ నేటి మానవ సమాజానికి ఆదర్శం అందామా??
....
పురుషులకు మాత్రమే హక్కులుండే కాలంలో దాంపత్య నిబంధనలుండాలి.
ప్రస్తుతం స్త్రీ జాతికి అన్ని హక్కులు వచ్చిన తర్వాత కన్యత్వం, ప్రాతివత్యం అనే నిబంధనలు , షరతులు వుండకూడదు అన్న మీ సూత్రీకరణ ఏమేర సమంజసమైనది.
సమాజోపయోగమైనది???
...
హిందూత్వ వాదులు
ప్రత్యేకించి సావర్కర్ ముస్లింలను అణచి వేయడానికి అత్యాచార మార్గాన్ని ప్రోత్సహించాడన్న విషయం అందరికీ తెలిసిందే అందుకే కథువా లాంటి అకృత్యాలు చూస్తున్నాం.
...
శిక్షల ద్వారా ఒక సమాజాన్ని మార్చలేము అనడం ఎంత యదార్ధమో
ఆంక్షలు లేని విచ్ఛలవిడి తనం ద్వారా కూడా సమాజాన్ని మార్చలేము అన్నదీ అంతే యదార్ధం.
ఇస్లాం ఈ రెండు అతివాదాలనూ కాదని మానవ నైజానికి అనుగుణైన శిక్షా స్మృతి ని తయారు చేసింది.
శిక్షలు విధించడానికి పూర్వం సమాజాన్ని ఉత్తమవిలువలు నేర్పింది.
చెడువైపు వెళ్ళే మార్గాలు నిషేధించింది.
ఐనా ఎవరైనా తప్పు చేస్తే అప్పుడు శిక్షిస్తుంది.
అంటే శిక్షలు మూడోదశలోనే తీసుకొచ్చింది. ఒకవేళ అలా కాక పోతే రోజూ మరణ శిక్ష విధించుకుంటూ కూర్చోవాల్సి వచ్చేది.
కానీ ఇస్లాం చూపిన సంస్కరణా విధానం ద్వారా నేరాల సంఖ్య తగ్గింది.
ఐనా ఎవడైనా తప్పు చేస్తే
అప్పుడు మాత్రమే తీవ్రమైన శిక్ష ఉంటుంది.మనదేశం లోఆవిధమైన సంస్కరణా మార్గాలు లేవు ఆమాట కొస్తే షరతులను శిక్షగా భావించే ఏ సమాజంలోనూ, విశృంఖలతను హక్కుగా భావించే ఏ సమాజం లోనైన కఠిన శిక్షల అమలుఅసాధ్యం.
....
మైనారిటీలు మతాన్ని నిర్మూలించాలి అన్న మీ సూత్రీకరణ, సాధారణీకరణ విస్మయాన్నే కాదు బాధని కూడా కలిగించింది.
ఇస్లాం ఒక సమగ్ర జీవన వ్యవస్థ, మానవ జీవన సమస్యలకు సరైన సమంజసమైన పరిష్కారాన్ని అందిస్తుంది అనడం లో ఏ విధమైన సందేహం లేదు.
దీనికి సాక్ష్యం ఆధునికు రాలైన బ్రిటీష్ జర్నలిస్టు Yvonne ridley ఉదంతమే .
మహిళకు ఇస్లాం ఇచ్చిన స్థానానికి ఆమే ప్రతీక.
ఒకవేళ మైనారిటీలు ఆ సమున్నత ధర్మ నిర్మూలనకు సీరియస్ గా ప్రయత్నం చేస్తే అంతకంటే దురదృష్టకరమైన రోజు మానవాళికి మరేదీ ఉండదు.
ఎందుకంటే పాశ్చాత్య సమాజం సమస్యల సుడిగుండం లో చిక్కుకుని ఊపిరాడని పరిస్థితులలో
ఇస్లాం వైపు చూస్తూ ఇస్లామీయ ఆర్ధిక వ్యవస్థ ను పరిష్కారంగా చూపిస్తుంటే ముస్లింలు
ఇస్లాం నిర్మూలనా నినాదాలివ్వడం మాత్రం ఈ కాలపు విషాదం కాక మరేమౌతుంది
...
Jazakallah
Muhammad Sharief గారూ !
ReplyDeleteఅస్సలామ్ అలేకుమ్ !
మీ కామెంట్ ను చదివాను. చాలా విలువైన సూచనలున్నాయి. మీరు దీన్ని నా blog లోనే post చేయండి. ఇతరులకు కూడా తెలుస్తుంది. తప్పొప్పులచర్చ బహిరంగంగా జరగడంవల్ల మేలేగానీ నష్టం ఏమీలేదు.
కులమత నిర్మూలనకు సంబంధించి నేను నా పాత అభిప్రాయాన్నే చెప్పానని నాకు కూడా అనిపించింది. గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు. దానిని తప్పకుండా సవరిస్తాను. ఆ విషయాన్ని పబ్లిషర్ కు కూడా తెలియపరుస్తాను. అది రేపు ప్రచురణ అవుతుంది. వివాదాస్పద అంశం కనుక ఇతరుల సూచనలు తెలుసుకోవడానికి దీన్ని ముందస్తుగా ఫేస్ బుక్ లో పెట్టాను. సాధారణంగా నేను అలా చేయను.
సంస్కరణలు అనేవి ఎన్నడూ శాశ్విత పరిష్కారాలు కావు. అవి తాత్కాలిక ఉపసమనాలు. వ్యభిచారాన్ని నేను మురుగు కాలవ అన్నాను; ఎగ్జాస్ట్ వాల్వ్ అన్నాను. వీటిని మీరు గమనించాలి.
ఇక సమాజ పరిణామాల విషయంలో నేను మతాన్ని యధాతధంగా అనుసరించను. ఎందుకంటే సమాజంలో ఒక్క మతమే వుండదు. అనేక మతాలుంటాయి. పైగా మత నిబంధనల్ని కూడా గొప్ప విశ్వాసులు సహితం ఆచరించరని నా అవగాహన. మనిద్దరి అవగాహనలో ఆ వ్యత్యాసం ఎలాగూ వుంటుంది.
అభినందనలతో
- డానీ
మీ స్పందన కి సంతోషం ,మీ నిబద్ధత, నిజాయితీ బాగున్నాయి.
ReplyDeleteఎగ్జాస్ట్ వాల్వ్ నిగూర్చి మీ కోణం లో చదవలేదు.
మీ కామెంట్ పై ఖాళీ దొరికిన తర్వాత స్పందిస్తాను.
Jazakallah
"సంస్కరణ "
ReplyDeleteఅనే పదాన్ని నేను "మానవుడిని తీర్చిదిద్దడం" అనే అర్ధం లో వాడాను.
ఇస్లామీ దృక్కోణం లో వ్యక్తి సంస్కరణ, అలాంటి వ్యక్తుల సమాజాన్ని రూపొందించడం వాటి ఆధారంగా రాజకీయ వ్యవస్థ నిర్మాణం అనేవి కీలక అంశాలు.
ఇస్లాం ని మామూలు అర్ధం లో మతం లా కాక ఈ విశాల దృక్కోణం లో జీవన వ్యవస్థ గా ప్రవక్త (స) రూపొందించారు.
అందులో ఈ సంస్కరణ ద్వారానే ఎన్నో సామాజిక చెడులు అంతమయ్యాయి.
సంస్కరణ ద్వారా మానవుని భావాలు పరివర్తన చెంది సమాజంలోని చెడులు దూరమౌతాయనేది ఇస్లాం నిర్మించిన ఆచరణాత్మక సమాజం లో చూస్తాము.
ఆ తర్వాత చేయబడిన చట్టాలు సత్ఫలితాలను ఇచ్చింది. ప్రస్తుతం అలాంటి సంస్కరణ జరగకుండా, జరిపే పటిష్టమైన ఏర్పాట్లు లేకపోవడం చేత చట్టాలు విఫలమౌతున్నాయి అనేది మా అవగాహన.
మతం పై మీ అభిఫ్రాయాన్ని గౌరవిస్తాను.
ఐతే మత నిబంధనలను చాలా మంది ఆచరించరన్నది యధార్ధమే
ఆ మాట కొస్తే ఇస్లామే కాదు ప్రపంచంలో మార్క్సిజం లాంటి గొప్ప గొప్ప సిద్ధాంతాలను కూడా ఆచరించని అనుయాయులు చాలా మందే ఉంటారు. ఆ పరిమితులు ప్రతిచోటా ఉండేవే.
//వేశ్యా వృత్తి మీద ఆంక్షలు పెరుగుతున్నాయి.ఎగ్జాస్ట్ వాల్వ్ లేనపుడు
యంత్రం బద్దలై పోతుంది.
మురుగు కాల్వల్ని ఆక్రమించేసి ఇళ్ళు కట్టేసుకుంటే ఒక రోజు మురుగు కట్టలు తెగి ఇళ్ళను ముంచేస్తుంది.
అంచేత ,వాణిజ్య లైంగిక శ్రమను చట్టబద్ధం చేయడం ఈ సమస్య కు శాశ్వత పరిష్కారం కాకున్నా తాత్కాలిక ఉపశమనం అవుతుంది//
ఈ అంశం చదివి నపుడు మానవుని మైధున అవసరం తీరడానికి
వ్యభిచారాన్ని చట్టబధ్ధం చేయవలసిన అవసరాన్ని చెప్పినట్లు అనిపిస్తుంది.
ఇప్పటికీ వేశ్యా వృత్తి (చట్ట బధ్ధం కాకున్నా)అమలులో ఉన్నదన్నది యధార్ధం కూడా, ఐనా అత్యాచారాలు తగ్గకపోడం ఇంకా హేతుబధ్ధమైన పరిష్కారాల కోసం మనం ఆలోచించవలసి ఉందన్న అవసరాన్ని ఎత్తిచూపుతుందన్నది నా అభిప్రాయం.
.......
ధన్యవాదాలతో
ముహమ్మద్ షరీఫ్
నేను కొన్ని వందల వ్యాసాలు రాసివుంటాను. కానీ, ఈ వ్యాసం రాసినప్పుడు ఎక్కడో కొంత భయం వేసింది. సమాజాన్ని అధ్యయనం చేసేవాళ్ళు తాము కనుగొన్న అంశాన్ని / సత్యాన్ని బయటికి చెప్పితీరాలి. ఆ నియమానికి కట్టుబడే ఈ వ్యాసాన్ని ప్రచురించాను. పాఠకుల నుండి మంచి స్పందన వస్తోంది. చాలా మంది నా వ్యాసాన్ని సరైన దృక్పధంలో అర్ధం చేసుకున్నారు. అనేక మంది ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. ఆనందంగా వుంది.
ReplyDeleteఏ అంశం మీదయినా ఎప్పుడూ కొందరితో కొన్ని బేధాభిప్రాయాలు వుంటాయి. ఇండియా మార్కు కమ్యూనిస్టులతో ఈ అభిప్రాయ బేధాలు కొంచెం ఎక్కువగా వుంటాయి. వాళ్ళు నిరంతరం ఒక పరిశుధ్ధ సమాజాన్ని నిర్మించేపనిలో వున్నట్టుంటారు. అనేక సందర్భాలలో వాళ్లు తమ ఆదర్శాలకు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. విప్లవకారులతో ఒక సమస్య వుంటుంది. వాళ్ళు విప్లవాన్ని పూర్తిచేయలేరు; సంస్కరణల్ని ఆమోదించలేరు. జీవితంలోనికి మతాన్ని అవసరానికి మించి ఆహ్వానించేవారితోనూ ఈ ఇబ్బంది వుంటుంది.
అయితే, సమాజానికి తనవైన చలన సూత్రాలుంటాయి. వాటి ప్రకారం అది ముందుకు సాగిపోతుంది. వాటిని కనుగొనడమే సమాజ విశ్లేషకుల పని. ఈ ప్రయత్నంలో కొన్ని తప్పులు, ప్రమాదాలు, వైఫల్యాలు జరగవచ్చు. అయినప్పటికీ పరిశోధనలు కొనసాగుతూ వుండాల్సిందే.