Tuesday, 8 May 2018

Conspiracy of Sangh Parivar under the guise of Protecting Sufism


సూఫీల చాటున సంఘీయుల కుట్ర

అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)



మనిషికీ సృష్టికర్తకూ మధ్య సంబంధాన్ని సరళతరం చేసిన ధార్మిక సిధ్ధాంతం ఇస్లాం. విశ్వాసులు ఎవరయినాసరే సృష్టికర్తతో నేరుగా  మొర పెట్టుకోవచ్చు; శాంతి సౌభాగ్యాలను కోరుకోవచ్చు. మధ్యలో పూజారివర్గం అనేది లేదు.

సూఫీ తత్వం ఇస్లాంకు ఒక ఉపశాఖ. ఇస్లాం పరిభాషలో సూఫీ తత్వాన్ని తసవ్వుఫ్ అంటారు. అది ఇస్లాంను సంగీతమయం, నాట్యభరితం చేసింది.  చరిత్రకారుడు  తారా చంద్ మాటల్లో చెప్పాలంటే “ సూఫీ తత్త్వం అనేది ప్రగాఢ భక్తి పారవశ్యం. ప్రేమ దాని లక్ష్యం. కవిత్వం, సంగీతం, నృత్యం దాని ఆరాధన మాధ్యమాలు. దేవునితో ఏకత్వాన్ని పొందడం దాని ఆదర్శం. (Influence of Islam on Indian Culture 1922).

సఫ్, సూఫ్ అనే రెండు పదాల నుండి సూఫీ అనే మాట పుట్టింది. సఫ్ అంటే తివాచీ,  సూఫ్ అంటే వున్ని. సూఫీ ముర్షిద్ లు, పీర్లు వున్నితో చేసిన తివాచీలు, కంబళీలను ధరించి నిరాడంబర జీవితాన్ని గడిపేవారు.  కనుక జనం వారిని  సూఫీలు అనేవారు. సూఫీ తత్త్వం ఒక విధంగా మార్మిక ఆరాధనగా కనిపిస్తుంది.  ఇస్లాంకు చెందిన షియా శాఖలోనూ సూఫీ విభాగం కొంత వున్నప్పటికీ సున్నీ శాఖలోనే సూఫీ తత్వం అత్యధికంగా వుంది.

సూఫీ తత్త్వం మూలాల గురించి అనేక వాదనలున్నాయి.  ప్రవక్త ముహమ్మద్ (వారికి శాంతి కలుగుగాగక) కాలంలోనే సూఫీ తత్త్వం వుందని కొందరంటే, తొలి ఖలీఫా హజ్రత్ అబూబకర్ సిధ్ధీఖీ కాలంలో ఆరంభమయిందని మరికొందరంటారు.  షియా ముస్లింలు భావించినట్లే, సూఫీ గురువులు కూడా  నాలుగవ ఖలీఫా హజ్రత్ ఆలీ ఇబ్నె అబు తాలీబ్  ను తమ మూల పురుషునిగా భావిస్తారు. ఆ వాదనలు ఎలావున్నా, పన్నెండవ శతాబ్దపు మధ్య ఆసియాకు చెందిన అబ్దుల్ ఖాలిఖ్ ఘిజ్దువాని బోధనలతో సూఫీ తత్వం వుధృతంగా విస్తరించిందని చెప్పవచ్చు.

ఇస్లాం ఏడవ శతాబ్దం ఆరంభంలో పుట్టింది. ప్రవక్త ముహమ్మద్ కాలంలోనే అది భారత ఉపఖండంలోనికి విస్తరించింది. ఇస్లాంను స్వీకరించిన అరబ్బు వ్యాపారులు మొదట కేరళలోని మలబారు తీరానికీ,  ఆ తరువాత కొంకణ్ – గుజరాత్ తీరానికి చేరుకున్నారు. 

హిందూ సాంఘీక వ్యవస్థలో ఒక కులం మరో కులాన్ని హీనంగా చూసే సాంప్రదాయంవుంది. దానివల్ల నిమ్నకులాలు, తెగలు తీవ్రమైన సాంఘీక, ఆర్ధిక అణిచివేతను ఎదుర్కొనేవి. కొన్ని కులాలతో వ్యవహరించే సమయంలో అస్పృశ్యతను కూడా పాటించేవారు. నిజానికి ఈ సాంప్రదాయాలు ఏదో ఒక స్థాయిలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంటే, ఏడవ శతాబ్దంలో ఈ సాంఘీక అణిచివేత ఎంతటి తీవ్ర స్థాయిలో వుండేదో ఊహించుకోవచ్చు. 

దేవుని సృష్టిలో  మానవుడు అత్యున్నత జీవి అని ఇస్లాం బోధిస్తుంది. మనుషులు కలిసినపుడు ఒకరినొకరు మర్యాదగా  ఆలింగనం చేసుకోవడం ఇస్లాం సాంప్రదాయం. కుల అణిచివేతకూ, అస్పృశ్యతకూ గురవుతున్న సమూహాలకు ఇస్లాం ఆలింగనం స్వర్గలోక ప్రవేశద్వారంగా కనిపించింది.  సమూహాలు సమూహాలుగా భారత నిమ్నకులాలు ఇస్లాంను స్వీకరించడం మొదలెట్టాయి.  ఇస్లాం విశ్వాసులకు సాధికారతను ఇస్తుంది. అది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది.  

భారత ఉపఖండంలో  కత్తి మొన మీద ఇస్లాం విస్తరించిందని కొందరు చరిత్రను వక్రీకరిస్తుంటారు. ఇస్లాం ఆత్మగౌరవ నినాదంతో  విస్తరించింది.  ఎనిమిదవ శతాబ్దంలో ముహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ ప్రాంతం మీద దండెత్తడానికి  వందేళ్ళు ముందే మలబారు ప్రాంతంలో హిందూ సమాజపు శూద్ర కులాలు పెద్ద ఎత్తున ఇస్లాంను స్వీకరించి మో పిళ్ళాలు (మా అళ్ళుళ్ళు) గా మారారు. కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా,  కొడుంగల్లూరు తాలూక,  మేథల గ్రామంలో 629లోనే చేరమన్ జుమ్మా మసీదును నిర్మించారు. దాదాపు ఆ కాలంలోనే గుజరాత్ ప్రాంతంలో మరి కొన్ని మసీదులు వెలిశాయి. 

సూఫీ గురువులు పన్నెండవ శతాబ్దంలో భూమార్గాన భారత ఉపఖండంలోనికి ప్రవేశించారు. తొలి తరం సూఫీ గురువులైన హజ్రత్ బహదుద్దీన్ జకారియా (ముల్తాన్, ఇప్పటి పాకిస్తాన్),  హజ్రత్ ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తి ( అజ్మీర్), హజ్రత్ నిజాముద్దీన్ అవులియా  (ఢిల్లీ) ల ప్రభావంతో భారత ఉపఖండంలోనేగాక దక్షణాసియా దేశాల్లోనూ సూఫీ తత్వం వేగంగా విస్తరించింది.  జలాలుద్దీన్ మొహమ్మద్ రూమీ, (1207-1273) అమీర్ ఖుస్రో  (1253 – 1325) వంటి వాగ్గేయకారులు  సృష్టించిన ఖవ్వాలీలు, గజళ్ళు సామాన్య ప్రజానీకాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇస్లాం ఆత్మగౌరవ నినాదానికి సూఫీల ప్రేమతత్వం తోడు కావడంతో భారత  ఉపఖండంలో   ఇస్లాం విస్తరణ మరింత వేగంగా సాగింది. హిందూ ముస్లీం సమూహాల మధ్య అపోహల్ని తొలగించి  దిగువ శ్రేణుల్లో రెండు మత సమూహాల ఐక్యతకు సూఫీ తత్వం గొప్పగా తోడ్పడింది. మరోమాటల్లో చెప్పాలంటే, బౌధ్ధ, హిందూ మతాల ప్రభావం కలిగిన ఇస్లాంగా సూఫీ తత్త్వం కొనసాగింది.

దేవుని ఐక్యత, ప్రేమ తత్త్వాలతో సాగిన భారత భక్తి ఉద్యమంపై సూఫీ ప్రభావం ఏమేరకు వుందో పరిశోధనలు జరపాల్సి వుంది.  శిక్కుమత వ్యవస్థాపకులు గురునానక్ మీద సూఫీ ప్రభావం ప్రత్యక్షంగానే వుంది. 

సూఫీ గురువుల మరణానంతరం వాళ్ళ మజార్లు (సమాధులు) దర్గాలుగా వెలుస్తాయి. సహజంగానే ప్రతి దర్గాకూ ఒక పవిత్ర చరిత్ర వుంటుంది.   దర్గాలకు వెళ్ళేవారిలో ముస్లింలు, హిందువులు దాదాపు సమానంగా వుంటారు. కొన్ని దర్గాలకు హిందువులు ధర్మకర్తలుగానూ వుంటారు. మస్తానయ్య, మస్తానమ్మ, హజరత్తయ్య, బీబీ, రసూల్ వంటి ముస్లిం పేర్లను హిందూ సమాజంలోనూ చూడవచ్చు. ఫలితంగా దర్గాల దగ్గర హిందూ కర్మకాండలు ఎక్కువగా కనిపిస్తాయి. దర్గాలోని హజ్రత్ ను మొక్కుకోవడం, మొక్కులు తీర్చుకోవడం, తల నీలాలు సమర్పించుకోవడం, ప్రసాదాలు పంచడం మొదలుకుని భూతవైద్యం, పూనకాల వరకు  సమస్తం అక్కడ వుంటాయి. వీరిని మనం నయా సూఫీవాదులు అనవచ్చు. 

అల్లా, ప్రవక్త ముహమ్మద్ లతోపాటూ ఖురాన్,  హదీస్ వంటి గ్రంధాలనూ తీర్పు దినాన్నీ విశ్వసించడం ముస్లింల ప్రాధమిక విధి. దీనినే ఇమాన్ అంటారు. ఆ తరువాత నమాజ్, రోజా, జకాత్, హజ్ అనే మరో నాలుగు విధులుంటాయి. ఈ ఐదు అంశాలు ఇస్లాం ధార్మిక మూల స్థంభాలు.  నయా సూఫీలు నమాజ్, రోజా, జకాత్, హజ్ విధుల్ని పెద్దగా పాటించరు. వాటికి ప్రత్యామ్నాయంగా దర్గాలకు వెళ్ళి పైన చెప్పిన కర్మకాండల్ని నిర్వహిస్తుంటారు.

నిజానికి దర్గాలకు వెళ్ళడం దానికదే తప్పుకాదు. ఇస్లాం సేయింట్లు (సూఫీ గురువులు) చనిపోయిన చోట వెలసిన ఆలయాలు కనుక దర్గాలు ముస్లింలు అందరికీ పవిత్ర స్థలాలు. వాటిని సందర్శించవద్దని ఎవరు చెప్పినా తప్పే. మన పూర్వికుల్ని ఖననం చేసిన ఖబ్రస్తాన్ లను సందర్శించడం నిజానికి ఒక గొప్ప మానవీయ  సాంప్రదాయం. అయితే, దర్గాలు, ఖబ్రస్థాన్ లను సందర్శించడానికీ, అక్కడ మజార్లలో  (సమాధుల్లో) వున్నవారిని ఆరాధించడానికీ మధ్య ధార్మికంగా ఒక సూక్ష్మ వైరుధ్యం వుంది. నయా సూఫీలు దర్గాల మజార్లలో వున్నవారిని ఆరాధిస్తారు. ఇస్లాం ఏకేశ్వరోపాసన మతం. అల్లాను తప్ప మరొకర్ని ఆరాధించడం ఇస్లాం మతాచారం ప్రకారం అపరాధం. బయటి సమాజాలు తరచూ అపోహ పడుతున్నట్టు ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ ను కూడా ఆరాధించరు; ఆరాధించ కూడదు. పైగా, ప్రతి నమాజ్(ప్రార్ధన)లోనూ విధిగా  ప్రవక్త ముహమ్మద్ కు శాంతి కలుగ జేయాలని అల్లా ను వేడుకుంటారు. 

ఈ నేపథ్యంలో  ఇరువైపులా రెండు రకాల అతివాదాలు  ముందుకు వచ్చాయి. సాంప్రదాయ ముస్లిం అతివాదులు అసలు దర్గాలకు వెళ్లడమే తప్పు అంటారు.  నయా సూఫీ అతివాదులు దర్గాలకు వెళితే నమాజ్, రోజాలు చేస్తున్నట్టే అంటారు.

ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన క్రమంలో స్థానిక మతాల కర్మకాండల ప్రభావాలకు లోనైంది. చాపకింద నీరులా, పరోక్షంగా  బహుదేవతారాధన కూడా రంగప్రవేశం చేసింది. దానితో ఇస్లాం మౌలిక సిధ్ధాంతమైన ఏకేశ్వరోపాసన (తౌహీద్)కే ముప్పు వచ్చిందనే ఆందోళన 18వ శతాబ్దంలో మొదలయ్యింది. సాంప్రదాయ ఇస్లాంను పునరుధ్ధరించడానికి   కాలుష్య నివారణ చర్యలు చేపట్టడానికంటూ సలాఫీ ఉద్యమం ఆరంభమయింది. సౌదీ అరేబియాకు చెందిన ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వాహబ్ దీని సిధ్ధాంతకర్త.  ఇస్లాం పునరుధ్ధరణ ఉద్యమాన్ని వారి పేరునే వాహబ్బీ ఉద్యమం అంటారు. ఇతర మతాల ప్రభావాల నుండి పరిరక్షించి పరిశుధ్ధ ఇస్లాంను పునరుధ్ధరించాలనేది వాహబ్బీ ఉద్యమ ప్రకటిత లక్ష్యం.

19వ శతాబ్దం మధ్యలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా బెంగాల్ లో వహబ్బీ, ఫరైజీ పేరిట సాగిన  రైతాంగ ఉద్యమాలకు, మొదటి ప్రపంచ యుధ్ధం తరువాత కేరళలో మోప్లాల పేరిట సాగిన కౌలు రైతుల ఉద్యమాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రేరణగా వున్నది వహబ్బీ భావజాలమే.. అయితే,  వర్తమాన నయా - వహాబ్బీ ఉద్యమానిది అతివాద తత్వం.

క్రీస్తును అనుసరించేవారు క్రైస్తవులు అయినట్టు, ప్రవక్త ముహమ్మద్ ను అనుసరించేవారు ముహమ్మదీయులు. సున్నీలు ముహమ్మద్ ప్రవక్తకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రవక్త ముహమ్మద్ జన్మదినోత్సవాన్ని సున్నీలు మిలాద్- ఉల్ - నబీ గా చాలా ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలో  మిలాద్ ఉల్ నబీ జాతీయ సెలవు దినం. వహబ్బీ తత్త్వం ప్రవక్త ముహమ్మద్ (వారికి శాంతి కలుగుగాక) ప్రాధాన్యతను తగ్గిస్తున్నదనే అసంతృప్తి సున్నీలలో కనిపిస్తుంది.

స్వల్ప తేడాలున్నప్పటికీ నేటి తబ్లిగీ జమాత్, అహ్లె హదీస్ సంస్థలు దాదాపు వహబ్బీ దృక్పథంతో కొనసాగుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులతోపాటూ, మీడియా కూడా తెలియక  జమాతే ఇస్లాం ఏ హింద్, జమాతే ఉలేమా ఏ హింద్ లను సహితం ఛాందసవాద వహబ్బీ సంస్థలుగా భావించి ఆరెస్సెస్ తో పోల్చుతుంటారు. నిజానికి అవి రెండూ ఉదారవాద రాజకీయార్ధిక దృక్పధంగల సంస్థలు. జాతియోద్యమ కాలంలో జమాతే ఉలేమా సంస్థ కాంగ్రెస్ తో చాలా సన్నిహితంగా వుండేది. ఆ సంస్థ అగ్రనేత పద్మభూషణ్ మౌలాన సయ్యద్ హుసేన్ అహ్మద్ మదాని పాకిస్తాన్ ఏర్పాటును  తీవ్రంగా వ్యతిరేకించారు. భారత ముస్లింలు పాకిస్తాన్ కు వలస వెళ్ళాల్సిన పనిలేదని ఫత్వా జార్తీచేశారు. తబ్లిగీ జమాత్ ఇహలోక (దునియాదారీ) విషయాలను తాను పట్టించుకోనని ప్రకటించి పరలోక (దీన్ దారీ) విషయాలను మాత్రమే పట్టించుకుంటుంది. అందుకు భిన్నంగా  జమాతే ఇస్లాం, జమాతే ఉలేమాలు  సామాజిక, రాజకీయ అంశాలను పట్టించుకుంటాయి.

విభజించి పాలించు అనే ఉపాయాన్ని బ్రిటీష్ వాళ్ళు కనిపెట్టారని కొందరు అమాయికంగా అంటుంటారు. హిందూ సాంప్రదాయంలోనే బేధోపాయం అనాదిగా వుంది.  సంఘ్ పరివారపు మేధోసరోవరాలు, సాంఘీక, అసాంఘీక మీడియా విభాగాలు ముస్లిం సమాజం మీద బేధోపాయాన్ని గట్టిగానే ప్రయోగిస్తున్నాయి. సున్నీల మీద షియాల్ని, వహబ్బీల మీద సూఫీలని, ముస్లిం పురుషుల మీద ముస్లిం స్త్రీలని ఉసిగొల్పే ప్రయత్నాలు ప్రణాళిక బధ్ధంగా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. హైదరాబాద్ మక్కా మసీదు, అజ్మీర్‍ దర్గాల్లో పేళుల్లు ఈ వ్యూహంలో భాగంగా జరిగినవే అంటే అతిశయోక్తికాదు.  అభినవ్ భారత్ సంస్థ మసీదులు, దర్గాల మీద పేలుళ్ళు జరిపి ఆ నేరాన్ని వహబ్బీ సమర్ధకుల మీద మోపి, ముస్లిం సమాజంలోని అతివాదులు (వహబ్బీలు), మధ్యేవాదులు (సున్నీలు) అతి ఉదారవాదులు (సూఫీలు)ల మధ్య ధార్మిక వివాదాలు రేపడానికి  బరితెగించి ప్రయత్నించింది.

సామాన్య సున్నీల మీద సూఫీలను ఉసి గొల్పే పనిని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా భుజాలకు ఎత్తుకున్నారు. దాద్రీలో అక్లాఖ్ ను గోగ్రవాదులు చంపేసిన ఆరు నెలల తరువాత, హర్యాణ రైల్లో జునైద్ ను క్రూరంగా చంపేయడానికి ఒక ఏడాది ముందు 2016 మార్చి 18న  ఢిల్లీలో ప్రపంచ సూఫీ వేదిక సదస్సు జరిగింది. అందులో ప్రారంభోపన్యాసాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. “వర్తమాన ప్రపంచం మీద హింస చీకట్లు కమ్ముకున్న ఈ సందర్భంలో మీరు ఆశల వెలుగుగా కనిపిస్తున్నారు” అంటూ సూఫీ గురువుల్ని పొగడ్తలతో ముంచెత్తారు.  

ప్రధాని పేర్కొన్న ‘హింస చీకట్లు’  గోగ్రవాదుల గురించి కాదు. దేశాన్ని కమ్ముకున్న అసహన వాతావరణం గురించి కాదు. మూక హంతకుల (లించింగ్) గురించి కాదు. వారు ప్రఅస్తావించింది వహబ్బీ ఇస్లాం గురించి!.

ఇండియా టుడే సీనియర్ సంపాదకుడు, నరేంద్ర మోదికి పరమ భక్తుడు అయినా ఉదయ్ మధుర్కర్  నయాసూఫిలు, సున్నీల మధ్య వైరాన్ని పెంచడానికి నిరంతర కలం సేవ చేస్తున్నారు.  “వహబ్బీలు చేపట్టిన ఉగ్రవాద మార్గానికి  ఉదారులైన సూఫీలు బలయి పోతున్నార”ని సూత్రీకరిస్తూ వారు సిధ్ధాంత వ్యాసాలు ప్రచురిస్తున్నారు. గోధ్రాలో కరసేవకుల్ని చంపింది వహబ్బీ ముస్లింలు అయితే, దానికి ప్రతీకారంగా హిందువులు సాగించిన గుజరాత్ నరమేధంలో బలయిపోయింది ప్రధానంగా సూఫీలే”నని వారు కొత్తగా ‘నిజనిర్ధారణ’ నివేదికల్ని కూడా సమర్పిస్తున్నారు!.

పాకిస్తాన్ ఏర్పడినపుడు ముస్లింలలో అత్యధికులు భారత దేశంలోనే వుండిపోయారని ఉదయ్ మధుర్కర్ కూడా   గుర్తిస్తారు.  అయితే అది దేశం మీద ప్రేమతో కాకుండా సువిశాల భారతదేశంలోని హిందువులను ఇస్లాం లోనికి మతమార్పిడి చేసుకోవాలనే దురాలోచనతోనే ముస్లింలు ఇక్కడ వుండిపోయారని ఒక వితండవాదం చేస్తారు. వర్తమాన భారత సమాజంలో వహబ్బీల నుండి  సూఫీలను కాపాడే “రక్షకుడు “నరేంద్ర మోదీ ఒక్కరే అనేది ఉదయ్ మధుర్కర్ బోధనల సారాంశం.

సంఘీయులు గతంలో “ముస్లింలందరూ టెర్రరిస్టులే!” లేదా “టెర్రరిస్టులందరూ ముస్లిములే” అనే నిందల్ని ప్రచారం చేసేవారు. ఇప్పుడు “టెర్రరిస్టులందరూ వహబ్బీలే” అని కొత్త ప్రచారం మొదలెట్టారు. పసిపిల్లలపై హత్యాచారాల్ని కూడా రాజకీయార్ధిక లబ్దిగా మార్చుకుంటున్న ‘హిందూ టెర్రర్’ గురించిగానీ, ‘కాషాయ ఉగ్రవాదం’ గురించిగానీ ఈ కాషాయ మేధావులు మాట్లాడరు. ముస్లిం సమాజాన్ని అన్ని రంగాలలో అణిచివేయడమేగాక, అణగారిన సమూహాల్లో చిచ్చుపెట్టడానికి కాషాయ సైన్యం  చాలా వేగంగా పావులు కదుపుతోంది. కొంచెం జాగరూకతతో వుండండి!

 (రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైల్ :  9010757776

(25 ఏప్రిల్ 2018న ఉస్మానియా విశ్వవిద్యాలయం ICSSR సమావేశమందిరంలో ఈ అంశంపై ప్రాధమికంగా  ప్రసంగించాను) 


హైదరాబాద్
6 మే 2018
ప్రచురణ :
ఎడిట్ పేజి, ప్రజాపాలన దినపత్రిక,  9, 10  మే 2015

3 comments:

  1. very informative article on basic aspects of Islam.Such articles need a wide circulation.

    ReplyDelete
  2. కాశ్మీరులో పాకిస్తానులో బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై జరిగిన జరుగుతున్న ఆరాచకాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి ఎప్పుడైనా ప్రసంగించావా బయ్యా. All religions have their merits and limitations. Hinduism has its shortcomings. Hinduism greatest merit is its catholicity. It believes All paths are equally good. So acceptance for other faiths is in built in Hinduism. Can you say the same about islam and christianity. No. They say only my way or no way.please don't spread divisive thoughts.

    ReplyDelete