Wednesday, 27 February 2019

విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ముస్లింలు నిలబెట్టుకుంటారా?



Vijayawada West and Muslims

విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ముస్లింలు నిలబెట్టుకుంటారా?


విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత వుంది. ఆంధ్రా కోస్తా ప్రాంతంలో దీన్ని ముస్లింల నియోజకవర్గం అంటారు. ముస్లింలు  ఇప్పటికి ఐదుసార్లు నియోజకవర్గం నుండి గెలిచారు.

ఆసిఫ్ పాషా, ఎంకే బేగ్, జలీల్ ఖాన్, నాసర్ వలీ లను నియోజకవర్గం ప్రజలు గెలిపించి శాసనసభకు పంపించారు. జలీల్ ఖాన్ రెండుసార్లు గెలవగా ఆసిఫ్ పాషా, ఎంకే బేగ్ రాష్ట్ర మంత్రులుగానూ పనిచేశారు.

2009 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  టిడిపి అభ్యర్థిగా జలీల్ ఖాన్, కాంగ్రెస్ అభ్యర్ధిగా  మల్లికా బేగం, పీఆర్పి  అభ్యర్ధిగా వేలంపల్లి శ్రీనివాస్ బరిలో దిగారు. వైయఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నారు లగడపాటి రాజగోపాల్ విజయవాడ ఎంపిగా రెండవసారి పోటీ చేస్తున్నారు. మల్లికా బేగం విజయావకాశాలు మెరుగ్గా వున్నాయి.

అప్పుడు మల్లికా బేగంను దెబ్బతీయడానికి జామియా మసీద్ ఇమాం అబ్దుల్ ఖాదర్ రాజ్మీ రంగప్రవేశం చేశారు. ముస్లిం మహిళలు రాజకీయాల్లో ప్రవేశించడానికి ఇస్లాం అంగీకరించదంటూ ఒక తీవ్రమైన ఫత్వా జారీ చేశారు. జలీల్ ఖాన్ ప్రోద్భలంతోనే ఇమాం ఆ ప్రకటన చేశారని అంటారు. ఎన్నికల్లో ముస్లిం అభ్యర్ధులైన మల్లికా బేగం, జలీల్ ఖాన్ ఇద్దరూ ఓడిపోగా పిఆర్పి అభ్యర్థి వేలంపల్లీ శీనివాస్ గెలిచారు.

2014 ఎన్నికల్లో వేలంపల్లి శ్రీనివాస్ బిజెపి అభ్యర్ధిగా పోటీచేయగా, జలీల్ ఖాన్ వైసిపి అభ్యర్ధిగా పోటీ చేశారు. ఎన్నికల్లో వేలంపల్లి శ్రీనివాస్  మీద జలీఖాన్ మూడు వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.  తరువాత జలీల్ ఖాన్ వైసిపిని వదిలి టిడిపిలోనికి మారగా,  వేలంపల్లి శ్రీనివాస్  బిజేపిని వదిలి వైసిపి లోనికి వెళ్ళారు.

2014 ఎన్నికల్లో జలీల్ ఖాన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బిజెపి అభ్యర్థి వేలంపల్లీ శ్రీనివాసరావు దాదాపు కోటి రూపాయలు మలికా బేగంకు ఇవ్వజూపారని ఒక బలమైన ప్రచారంవుంది. అయితే ఆమె దాన్ని స్వీకరించలేదని అంటారు.  


అప్పట్లో జలీల్ ఖాన్ అనుసరించిన తప్పుడు విధానాలవల్ల  మలైకా బేగం అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. 2009 ఎన్నికల ఖర్చుల కోసం ఆమె భారీగా అప్పులు చేశారు.  తరువాత అప్పుల్ని తీర్చడం కోసం స్వంత ఇంటిని అమ్ముకుని ప్రస్తుతం అద్దె ఇంట్లో నివాసం వుంటున్నారు.

జలీల్ ఖాన్ కు టిడిపిలో  మంత్రి పదవి దక్కకపోయినా రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి దక్కింది.  అయితే వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించాల్సిన సమయంలో వాటిని అమ్మడానికి ప్రయత్నించారని ఆయన మీద గట్టి ఆరోపణలున్నాయి. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ముస్లిం సమాజంలోని అత్యధికులు  ఇప్పుడు జలీల్ ఖాన్ కు వ్యతిరేకంగా వున్నారు.

స్వీయ సమాజం తన మీద గుర్రుగా వుందని జలీల్ ఖాన్ కు కూడా క్షుణంగా తెలుసు. వాళ్ళ అసంతృప్తిని చల్లార్చడానికి ఆయన కొత్త మార్గం ఎంచుకున్నారు. అమెరికాలో స్థిరపడిన తన కుమార్తె ఖాతూన్ ను తీసుకుని వచ్చి తెలుగుదేశం అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దించుతున్నారు. వైసిపి అభ్యర్థిగా వేలంపల్లి శ్రీనివాస్ కు తిక్కెట్టు ఖరారైపోయిందని గట్టిగా ప్రచారం ప్రచారుగుతోంది.  అలా మూడోసారి వేలంపల్లి శ్రీనివాస్, జలీల్ ఖాన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 

జలీల్ ఖాన్ వల్ల  మలైకా బేగంకు జరిగిన గాయాలు ఇంకా మానలేదు. సమయం వచ్చినపుడు జలీల్ ఖాన్ మీద ప్రతికారం తీర్చుకోవడానికి వారు సిధ్ధంగా వున్నారు. జలీల్ ఖాన్ కుమార్తెను రంగంలో దించడంతో మలైకా బేగం పాతగాయాల మీద కారం పూసినట్టయింది. గతంలో తన మీద జలీల్ ఖాన్ ప్రయోగించిన అస్త్రాన్నే ఇప్పుడు ఆయన మీద తిప్పికొట్టడానికి  మలైకా బేగం సిధ్ధపడ్డారు. ఇమాం అబ్దుల్ ఖాదర్ రాజ్మీని ఈసారి మలైకా బేగం రంగంలోనికి దించడం పెద్ద ట్విస్ట్. ముస్లిం మహిళలు రాజకీయాల్లో పాల్గొనరాదని ఇమాం మీడియా ముందు మరొక్కసారి గుర్తు చేశారు.

ఈసారి ఎన్నికల్లో జలీల్ ఖాన్ కుటుంబం ఓడిపోతే అక్కడ లాభపడేది వేలంపల్లి శ్రీనివాసే.  అంచేత మలైక బేగం వెనుక వేలంపల్లి శ్రీనివాస్ హస్తం వుందని ఇప్పుడు గట్టిగా వినబడుతోంది.

మలైకా బేగం ఆక్రోశం, జలీల్ ఖాన్ ను ఓడించాలనే విజయవాడ పశ్చిమ ముస్లిం సమాజపు భావోద్వేగాలు రెండూ సమంజసమైనవే. కావచ్చుకానీ, జలీల్ ఖాన్ మీద కోపంతో  ఏకంగాముస్లింఅసెంబ్లీ స్థానం’ను ముస్లింలకు కాకుండా చేసుకోవడం కూర్చున్న కొమ్మను నరుక్కునేంత  తెలివిమాలిన పని అవుతుంది.

జలీల్ ఖాన్ కుటుంబాన్ని మినహాయించి విజయవాడ వెస్ట్ నుండి మరో ముస్లిం మహిళకు టిక్కెట్టు ఇవ్వాలని టిడిపిని కోరాలి. రాష్ట్రంలో ముస్లింల నియోజకవర్గంగా పేరు వున్న విజయవాడ వెస్ట్ స్థానాన్ని ముస్లిమేతరులకు ఇచ్చి చిచ్చు పెట్టినందుకు వైసిపిని నిలదీయాలి. అక్కడి అభ్యర్ధిని మార్చి ఒక ముస్లిం మహిళ అభ్యర్ధిని పోటీకి దింపి తప్పును సరిదిద్దుకోమని వైయస్ జగన్ ను కోరాలి.

అంతిమంగా విజయవాడ వెస్ట్  నుండి 2019 ఎన్నికల్లో  ముస్లిం మహిళ గెలిచేలా వ్యూహ రచన  సాగాలి. అప్పుడు మాత్రమే, ముస్లిం శక్తితో పాటూ వాళ్ల ప్రగతిశీల ఆలోచనా విధానాలూ ప్రపంచానికి తెలుస్తాయి. ముస్లింలు ఛాందసులనే నిందను అణువణువున తిప్పికొట్టాలి. ముస్లిం ప్రగతిశీల విధానాలని అనుక్షణం చాటి చెపుతుండాలి. ముస్లింలు గెలిచే అవకాశంవున్న నియోజకవర్గాలను ముస్లిమేతరులకు కేటాయిస్తే ఈసారి కొరివితో తల గోక్కుంటారనే సంకేతాలను ప్రధాన  రాజకీయ పార్టీలకు బలం పంపించాలి. ముస్లిం మహిళలు రాజకీయాల్లో పాల్గొనరాదని చెప్పేవాళ్ళు ఎంతటివారైనా సరే వాళ్లను నడివీధిలో చెప్పులతో కొట్టాలని ముస్లిం ఆలోచనాపరులు ఫత్వా జారిచేయాలి.
//EOM//

Five Elements of My Life


పంచభూతాలు
Five Elements of My Life

నేలకు సలాములు!      
నరసాపురం కన్నది
విజయవాడ పెంచించి
చీరాల రాటుదేల్చింది 
హైదరాబాద్ ఆదరించింది.
రాడికల్ సోషలిజం నడిపించింది.

Success or Failure ?


సక్సెస్ అయినట్టా? ఫెయిల్ అయినట్టా?

నిన్న ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద మార్నింగ్ వాక్ చేసి వస్తున్న పాత మిత్రుడు ఒకడు  కనిపించాడు.
“ఎంత సంపాదించావూ?” అని అడిగాడు.
“ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. మానాన్న ఇచ్చిన ఇంటిని, మా మామ ఇచ్చిన పొలాన్ని పొగొట్టుకోలేదు. అంత వరకే ఆస్తి” అన్నాను.
“నువ్వు సక్సెస్ అయినట్టా? ఫెయిల్ అయినట్టా?” అనడిగాడు.
ఏం సమాధానం చెప్పాలో నాకు అర్ధం కాలేదు. “నా పధ్ధతిలో సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను” అన్నాను.
“అంత తెలివివున్నా సంపాదించలేకపోయావంటే జీవితంలో ఘోరంగా ఫెయిల్ అయినట్టే. అవునా? కాదా? ” అని నిలదీశాడు.
నేనేమీ చెప్పలేక పోయాను.
“వైట్ అడ్వాంటేజెస్, రెడ్ ప్రివిలేజెస్ అని వుంటాయి కదా? రెండోదాన్ని నేను అనుభవిస్తున్నాననే అనుకుంటాను” అని గట్టిగా చెప్పలేక నెమ్మదిగా గొణిగాను.
“నువ్వు బిగ్ పెయిల్యూర్” అని అతను గట్టిగా ప్రకటించి వెళ్ళిపోయాడు. //   

జర్నలిస్టులు వార్తల్ని సృష్టించరు; నివేదిస్తారు


జర్నలిస్టులు వార్తల్ని సృష్టించరు; నివేదిస్తారు

పాత్రికేయ వృత్తి అనేకాదు అన్ని వృత్తుల్లోనూ గత కాలపు విలువలు పడిపోయాయి. న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తులు న్యాయస్థానాల్లో  ఘోర అన్యాయాలు చేస్తున్నారు. ప్రాణాలు రక్షించాల్సిన డాక్టర్లు మనుషుల అవయవాలతో వ్యాపారాలు చేస్తున్నారు. జర్నలిజం కూడ పతనం అయిందిగానీ ఈ రేంజ్ లో పతనం అయిందని నేను అనుకోను. 

జర్నలిస్టులు వార్తల్ని సృష్టించరు; వార్తల్ని నివేదిస్తారు. ఇటీవల సంస్థాగత రాజకీయ అనుబంధాల కోసం వార్తల్ని కూడ సృష్టిస్తున్నారు. ఇదొక కోణం అయితే, ఇప్పటి అర్హతల ప్రాతిపదికలు మారిపోయాయి. గతంలో రచనానుభవం కలిగినవాళ్ళే ఈ రంగంలోనికి వచ్చేవారు. ఇప్పుడు రెవెన్యూ  తేగలిగినవాళ్ళకే ఈ రంగంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో ఎడిటర్ అంటే అగ్రపీఠం వేసేవారు. ఇప్పుడు సిఇఓ లదే అగ్రపీఠం. ఈ తేడాలను గుర్తించి మన అర్హతల్ని పెంచుకోవాలి. అన్నింటికి మించి ప్రతి జర్నలిస్టూ తనదైన ఒక ప్రత్యేకతను సాధించుకోవాలి. ఆర్ధిక విషయాల్లో మీడియా సంస్థలు ఎంతగా దిగజారినప్పటికీ  వివిధ రంగాల్లో నిపుణులకు ఎప్పుడూ ఎంతో కొంత స్థానం వుంటుంది.


Sunday, 10 February 2019

'సహచరులు' ఆవిష్కరణ 10-2-2019

'సహచరులు'  ఆవిష్కరణ  10-2-2019

వరవరరావు 1985-89 మధ్య కాలంలో ముషీరాబాద్ జైల్లో వున్నారు. అప్పట్లో జైలు నుండి వారు రాసిన పద మూడు లేఖల్ని పర్ స్పెక్టివ్ సంస్థ  'సహచరులు'  శీర్షికతో 1989లో పుస్తకరూపంలో ప్రచురించింది. ప్రస్తుతం వరవరరావు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పెట్టిన కేసులో పూనా ఎరవాడ జైలులో వున్నారు. ఈ సందర్భంగా నవోదయ ప్రచురణలు 'సహచరులు'  పుస్తకాన్ని మళ్ళీ అచ్చువేసింది.

కొత్త పుస్తకాన్ని  ఈరోజు విరసం నల్గొండ పాఠశాలలో నేను  ఆవిష్కరించాను.  మా ప్రసంగాన్ని బెర్తోల్ట్ బ్రెక్ట్ మాటలతో ముగించాను.

   ‘ద గుడ్ పర్సన్ ఆఫ్ షేజ్వాన్’ నాటకంలో  బ్రెక్ట్  ఒక వీధి వేశ్య మాటల్లో  నిర్లిప్త సమాజం మీద తన ఆక్రోశాన్ని ప్రదర్శిస్తాడు.


“ఓరీ మొద్దుబారిపోయిన మనుషుల్లారా! మీ సోదరుడి మీద మూకోన్మాదులు దాడి చేశారు.  మీరు కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు అతన్ని పొడిచి పారిపోయారు. మీరు మౌనంగా వుండిపోయారు. ఇదేమి నగరం? మీరేమి మనుషులు? ఒక ఘోరం జరిగినపుడు మనుషులు రగిలిపోవాలి. నగరమంతటా నిరసనలు వెల్లువెత్తాలి. మనుషుల్లో అలాంటి తిరుగుబాటు రాకుంటే చీకటి పడడానికి ముందే ఆ నగరం మంటల్లో మాడి బూడిదైపోవాలి”. 

Friday, 8 February 2019

Brief Profile of Danny


Brief Profile of Danny 


June, 2018

ఒక మీడియా సంస్థవారు నన్ను తమ సలహాదారుల్లో ఒకనిగా నియమించారు. ఆ సందర్భంగా నా  సంక్షిప్త పరిచయం అడిగారు. గతంలో ప్రముఖ జర్నలిస్టు తోట భావనారాయణ, రంగావఝ్ఝాల భరద్వాజ మరి కొందరు ఆయా సందర్భాల్లో తమదైన శైలిలో నా పరిచయాన్ని రాశారు.  అవన్నీ కలిపి కొత్తగా కొంత జోడించి ఇలా సంస్కరించాను.  



డానీ – సంక్షిప్త పరిచయం

సాంఘీక ఉద్యమాల నుండి పాత్రికేయ వృత్తి లోనికి వచ్చిస్కాలర్ జర్నలిస్టు”గా  సుపరిచితులయిన  డానీ పూర్తి పేరు అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ జర్రానీ. మీడియాలో ఇటు పత్రికా రంగంలోనూ అటు టీవీ రంగంలోనూ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లోనూ విజయవంతంగా పని చేసిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఉదయం పత్రికలో ఫ్రీలాన్సర్ గా  మొదలయిన డానీ పాత్రికేయ ప్రస్తానం మూడున్నర దశాబ్దాలు సాగింది. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్, ఏపీ టైమ్స్, రీడిఫ్ డాట్ కామ్, సీ-టీవీ, హెచ్ ఎంటీవీ, వనితా టివి, ఎన్-టీవీ, ఎక్స్ ప్రెస్ టీవీల్లో ఆయన చీఫ్ రిపోర్టర్, బ్యూరో చీఫ్,  స్పెషల్ కరస్పాండెంట్, అవుట్ పుట్ ఎడిటర్ స్థాయిల్లో    పనిచేశారు.  ఇండియన్  వారపత్రిక, జైకిసాన్ టీవీల్లో ఎడిటర్ బాధ్యతల్ని నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వతంత్ర పాత్రికేయునిగా,  డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా వుంటున్నారు. 

వర్తమాన రాజకీయాల్ని వ్యాఖ్యానించడంలోనూ, సమాజ పరిణామాల్ని విశ్లేషించడంలోనూ డానీ  నిపుణులు.

గోదావరి నది సముద్రంలో కలిసే చోట నరసాపురం డానీ పుట్టిన వూరు. పెట్టిబడిదారులు, ప్రభుత్వాలు నిర్వహించే అకడమిక్ విద్య మీద డానీకి సదభిప్రాయంలేదు. బానిస విద్యా విధానం నశించాలని నినదించిన తరం వారిది. చిలుక పలుకులు నేర్పే విశ్వవిద్యాలయాల్లో ఎప్పటికీ సమాజం అర్ధం కాదు; సమాజాన్ని అందులో జీవిస్తు మాత్రమే అర్ధం చేసుకోగలం అంటారాయన. తను స్వీయ విద్యావంతుల ((self-taught, autodidact, Heutagogy) విభాగానికి చెందుతానంటారాయన.

నివాసాన్ని విజయవాడకు మార్చి విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో పాతికేళ్ళు  క్రియాశీలంగా పనిచేశారు. కొండపల్లి   సీతారామయ్య,  త్రిపురనేని మధుసూదనరావు,  ఆర్ ఎస్ రావు వంటి ఉద్దండుల దగ్గర రాజకీయ, తత్త్వ, ఆర్ధిక శాస్త్రాల్లో మెళుకువలు నేర్చుకున్నారు. ముహమ్మద్ ప్రవక్త,  సయ్యద్ అహ్మద్ ఖాన్, కార్ల్ మార్క్స్, బీ ఆర్ అంబేడ్కర్ తనకు ఆదర్శం అంటారు డానీ. ఒక శూద్ర సమూహాన్ని ఆధిపత్య సామాజికవర్గంగా మార్చిన త్రిపురనేని రామస్వామి చౌదరి సంస్కరణోద్యమాన్ని అణగారిన సమూహాలన్నీ అధ్యయనం చేయాల్సిన అవసరం వుందంటారాయన. ప్రతి సమూహంలోని - ఆ మాటకు వస్తే   ప్రతి వ్యక్తిలోని- విప్లవ, విప్లవ ప్రతిఘాత దశల్ని, కోణాల్ని గుర్తించడమే చారిత్రక భౌతికవాద దృక్పథం అంటారాయన.    

1970-90 దశకాల్లో సాగిన అనేక ఉద్యమాల్లో డానీ క్రియాశీలంగా పాల్గొన్నారు. కారంచేడు దళిత ఉద్యమంలో పీపుల్స్ వార్ ప్రతినిధిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల సమాఖ్యకు అధ్యక్షునిగా వున్నారు. చినగంజాం ఉప్పు ఫ్యాక్టరీ, వాడరేవు షిప్ బ్రేకింగ్ యూనిట్ నిర్మాణానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాలకు  నాయకత్వం వహించారు. గడిచిన నాలుగు దశాబ్దాల్లో రెండు  తెలుగు రాష్ట్రాల్లో సాగిన ప్రతి ఉద్యమంతోనూ డానీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుబంధవుంది. భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆరంభమయిన షాహీన్ బాగ్ ఉద్యమంలోనూ,  ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం సాగిస్తున్న ఆందోళనలోనూ ఆయన స్వయంగా పాల్గొన్నారు. 

సాహిత్యరంగంలో డానీ కలం పేరు ఉషా యస్ డానీ. 1970లలో చనిపోయిన స్నేహితురాలు చొప్పరపు ఉషారాణి పేరును ఆయన తన కలం పేరులో చేర్చుకున్నారు. సమాజం, సాహిత్యం, రాజకీయాలపై వారు వందల కొద్ది విశ్లేషణాత్మక  వ్యాసాలు రాశారు. డజను కథలు రాశారు.  జూలియస్ ఫ్యూజిక్ (1981), వ్యంగ్యం (2011) ట్రిపుల్ తలాక్ (2018) మదరసా మేకపిల్ల (2019), నయా మనువాదం – నయా ఫాసిజం (2019) పుస్తకాలను ప్రచురించారు. 1986 నుండి  ఆయన  కొనసాగిస్తున్న ‘ముస్లిం సంవాదం’ వ్యాస సంకలనం మొదటి భాగం (తొలి అధ్యాయం)  త్వరలో మార్కెట్ లోనికి రానున్నది.

ప్రస్తుతం డానీ ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)కు రెండు తెలుగు రాష్ట్రాల  కన్వీనర్ గా, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజానికి కార్యదర్శిగా, బహుజన ప్రతిఘటన వేదికకు కో-కన్వీనర్ గా వుంటున్నారు.

సమాజంలోని అణగారిన సమూహాలన్నింటినీ ఏకం చేయాలనేది డానీ లక్ష్యం. అణగారిన సమూహాలు ప్రతి దానికీ తమవైన ప్రత్యేక కార్యక్రమాలు వుండడమేగాక వాటి మధ్య వైర్యుధ్యాలూ వుండడంతో వీటిని సమన్వయ  పరచడం నేటి సామాజిక కార్యకర్తలకు పెద్ద సవాలుగా మారిందంటారు డానీ. హిందూ అగ్రవర్ణాలు, పెత్తందారీకులాలతో మతసామరస్యం కోసం ప్రత్యేకంగా కృషి చేయడమే వర్తమాన ముస్లిం కార్యక్రమం అంటారాయన.  భారత ఆకాశంలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం పతాకాలు సమున్నతంగా ఎగరాలనేది వారి ఆకాంక్ష. లాల్ సలాం, నీల్ సలాం, హర్యాలీ సలాం అనేది వారి అభివాదం.
----