Wednesday, 27 February 2019

విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ముస్లింలు నిలబెట్టుకుంటారా?



Vijayawada West and Muslims

విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ముస్లింలు నిలబెట్టుకుంటారా?


విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత వుంది. ఆంధ్రా కోస్తా ప్రాంతంలో దీన్ని ముస్లింల నియోజకవర్గం అంటారు. ముస్లింలు  ఇప్పటికి ఐదుసార్లు నియోజకవర్గం నుండి గెలిచారు.

ఆసిఫ్ పాషా, ఎంకే బేగ్, జలీల్ ఖాన్, నాసర్ వలీ లను నియోజకవర్గం ప్రజలు గెలిపించి శాసనసభకు పంపించారు. జలీల్ ఖాన్ రెండుసార్లు గెలవగా ఆసిఫ్ పాషా, ఎంకే బేగ్ రాష్ట్ర మంత్రులుగానూ పనిచేశారు.

2009 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  టిడిపి అభ్యర్థిగా జలీల్ ఖాన్, కాంగ్రెస్ అభ్యర్ధిగా  మల్లికా బేగం, పీఆర్పి  అభ్యర్ధిగా వేలంపల్లి శ్రీనివాస్ బరిలో దిగారు. వైయఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నారు లగడపాటి రాజగోపాల్ విజయవాడ ఎంపిగా రెండవసారి పోటీ చేస్తున్నారు. మల్లికా బేగం విజయావకాశాలు మెరుగ్గా వున్నాయి.

అప్పుడు మల్లికా బేగంను దెబ్బతీయడానికి జామియా మసీద్ ఇమాం అబ్దుల్ ఖాదర్ రాజ్మీ రంగప్రవేశం చేశారు. ముస్లిం మహిళలు రాజకీయాల్లో ప్రవేశించడానికి ఇస్లాం అంగీకరించదంటూ ఒక తీవ్రమైన ఫత్వా జారీ చేశారు. జలీల్ ఖాన్ ప్రోద్భలంతోనే ఇమాం ఆ ప్రకటన చేశారని అంటారు. ఎన్నికల్లో ముస్లిం అభ్యర్ధులైన మల్లికా బేగం, జలీల్ ఖాన్ ఇద్దరూ ఓడిపోగా పిఆర్పి అభ్యర్థి వేలంపల్లీ శీనివాస్ గెలిచారు.

2014 ఎన్నికల్లో వేలంపల్లి శ్రీనివాస్ బిజెపి అభ్యర్ధిగా పోటీచేయగా, జలీల్ ఖాన్ వైసిపి అభ్యర్ధిగా పోటీ చేశారు. ఎన్నికల్లో వేలంపల్లి శ్రీనివాస్  మీద జలీఖాన్ మూడు వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.  తరువాత జలీల్ ఖాన్ వైసిపిని వదిలి టిడిపిలోనికి మారగా,  వేలంపల్లి శ్రీనివాస్  బిజేపిని వదిలి వైసిపి లోనికి వెళ్ళారు.

2014 ఎన్నికల్లో జలీల్ ఖాన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బిజెపి అభ్యర్థి వేలంపల్లీ శ్రీనివాసరావు దాదాపు కోటి రూపాయలు మలికా బేగంకు ఇవ్వజూపారని ఒక బలమైన ప్రచారంవుంది. అయితే ఆమె దాన్ని స్వీకరించలేదని అంటారు.  


అప్పట్లో జలీల్ ఖాన్ అనుసరించిన తప్పుడు విధానాలవల్ల  మలైకా బేగం అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. 2009 ఎన్నికల ఖర్చుల కోసం ఆమె భారీగా అప్పులు చేశారు.  తరువాత అప్పుల్ని తీర్చడం కోసం స్వంత ఇంటిని అమ్ముకుని ప్రస్తుతం అద్దె ఇంట్లో నివాసం వుంటున్నారు.

జలీల్ ఖాన్ కు టిడిపిలో  మంత్రి పదవి దక్కకపోయినా రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి దక్కింది.  అయితే వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించాల్సిన సమయంలో వాటిని అమ్మడానికి ప్రయత్నించారని ఆయన మీద గట్టి ఆరోపణలున్నాయి. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ముస్లిం సమాజంలోని అత్యధికులు  ఇప్పుడు జలీల్ ఖాన్ కు వ్యతిరేకంగా వున్నారు.

స్వీయ సమాజం తన మీద గుర్రుగా వుందని జలీల్ ఖాన్ కు కూడా క్షుణంగా తెలుసు. వాళ్ళ అసంతృప్తిని చల్లార్చడానికి ఆయన కొత్త మార్గం ఎంచుకున్నారు. అమెరికాలో స్థిరపడిన తన కుమార్తె ఖాతూన్ ను తీసుకుని వచ్చి తెలుగుదేశం అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దించుతున్నారు. వైసిపి అభ్యర్థిగా వేలంపల్లి శ్రీనివాస్ కు తిక్కెట్టు ఖరారైపోయిందని గట్టిగా ప్రచారం ప్రచారుగుతోంది.  అలా మూడోసారి వేలంపల్లి శ్రీనివాస్, జలీల్ ఖాన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 

జలీల్ ఖాన్ వల్ల  మలైకా బేగంకు జరిగిన గాయాలు ఇంకా మానలేదు. సమయం వచ్చినపుడు జలీల్ ఖాన్ మీద ప్రతికారం తీర్చుకోవడానికి వారు సిధ్ధంగా వున్నారు. జలీల్ ఖాన్ కుమార్తెను రంగంలో దించడంతో మలైకా బేగం పాతగాయాల మీద కారం పూసినట్టయింది. గతంలో తన మీద జలీల్ ఖాన్ ప్రయోగించిన అస్త్రాన్నే ఇప్పుడు ఆయన మీద తిప్పికొట్టడానికి  మలైకా బేగం సిధ్ధపడ్డారు. ఇమాం అబ్దుల్ ఖాదర్ రాజ్మీని ఈసారి మలైకా బేగం రంగంలోనికి దించడం పెద్ద ట్విస్ట్. ముస్లిం మహిళలు రాజకీయాల్లో పాల్గొనరాదని ఇమాం మీడియా ముందు మరొక్కసారి గుర్తు చేశారు.

ఈసారి ఎన్నికల్లో జలీల్ ఖాన్ కుటుంబం ఓడిపోతే అక్కడ లాభపడేది వేలంపల్లి శ్రీనివాసే.  అంచేత మలైక బేగం వెనుక వేలంపల్లి శ్రీనివాస్ హస్తం వుందని ఇప్పుడు గట్టిగా వినబడుతోంది.

మలైకా బేగం ఆక్రోశం, జలీల్ ఖాన్ ను ఓడించాలనే విజయవాడ పశ్చిమ ముస్లిం సమాజపు భావోద్వేగాలు రెండూ సమంజసమైనవే. కావచ్చుకానీ, జలీల్ ఖాన్ మీద కోపంతో  ఏకంగాముస్లింఅసెంబ్లీ స్థానం’ను ముస్లింలకు కాకుండా చేసుకోవడం కూర్చున్న కొమ్మను నరుక్కునేంత  తెలివిమాలిన పని అవుతుంది.

జలీల్ ఖాన్ కుటుంబాన్ని మినహాయించి విజయవాడ వెస్ట్ నుండి మరో ముస్లిం మహిళకు టిక్కెట్టు ఇవ్వాలని టిడిపిని కోరాలి. రాష్ట్రంలో ముస్లింల నియోజకవర్గంగా పేరు వున్న విజయవాడ వెస్ట్ స్థానాన్ని ముస్లిమేతరులకు ఇచ్చి చిచ్చు పెట్టినందుకు వైసిపిని నిలదీయాలి. అక్కడి అభ్యర్ధిని మార్చి ఒక ముస్లిం మహిళ అభ్యర్ధిని పోటీకి దింపి తప్పును సరిదిద్దుకోమని వైయస్ జగన్ ను కోరాలి.

అంతిమంగా విజయవాడ వెస్ట్  నుండి 2019 ఎన్నికల్లో  ముస్లిం మహిళ గెలిచేలా వ్యూహ రచన  సాగాలి. అప్పుడు మాత్రమే, ముస్లిం శక్తితో పాటూ వాళ్ల ప్రగతిశీల ఆలోచనా విధానాలూ ప్రపంచానికి తెలుస్తాయి. ముస్లింలు ఛాందసులనే నిందను అణువణువున తిప్పికొట్టాలి. ముస్లిం ప్రగతిశీల విధానాలని అనుక్షణం చాటి చెపుతుండాలి. ముస్లింలు గెలిచే అవకాశంవున్న నియోజకవర్గాలను ముస్లిమేతరులకు కేటాయిస్తే ఈసారి కొరివితో తల గోక్కుంటారనే సంకేతాలను ప్రధాన  రాజకీయ పార్టీలకు బలం పంపించాలి. ముస్లిం మహిళలు రాజకీయాల్లో పాల్గొనరాదని చెప్పేవాళ్ళు ఎంతటివారైనా సరే వాళ్లను నడివీధిలో చెప్పులతో కొట్టాలని ముస్లిం ఆలోచనాపరులు ఫత్వా జారిచేయాలి.
//EOM//

No comments:

Post a Comment