Sunday, 18 July 2021

Answer to Ravi Narla

 ఆచరణాత్మక అంశాల్ని భావోద్వేగ అంశాలుగా మార్చకండి. 

డానీ

 

ఆచరణాత్మక అంశాల్ని భావోద్వేగ అంశాలుగా మార్చడం ఫ్యూడలిజం లక్షణం. ఈ విద్యలో ‘విప్లవ’ ప్రతినిధులు ఆరితేరారు.

          హరిభూషణ్‌, సారక్క  లకు నివాళి అర్పిస్తూ పాణీ రాసిన  అస్తిత్వ పరిధులు దాటి కార్మిక వర్గ ప్రతినిధులై...’  (ఆంధ్రజ్యోతి, జులై 2)  మీద నేను స్పందిస్తూ  ఎన్డీఎ కూటమిని 2024  ఎన్నికల్లో ఓడించడానికి ఏం చేయాలీ?’ (ఆంధ్రజ్యోతి, జులై 7)  అని అడిగాను. దీని మీద రవి నర్ల స్పందిస్తూ  ‘విప్లవోద్యమాన్ని అవహేళన చేయకండి’ అని రాశారు (ఆంధ్రజ్యోతి, జులై 16) . నా స్పందన తొలి వాక్యంలోనే “వారిద్దరి త్యాగం చాలా గొప్పది. అందులో ఎవరికీ సందేహం వుండాల్సిన పనిలేదు” అన్నాను. ఇందులో రవికి  అవహేళన ఎక్కడ కనిపించిందో  తెలీదు.

 

          నిజానికి పాణీ నివాళీలో వాళ్ళిద్దరి విప్లవాచరణ గురించి ఒక్క వాక్యం  కూడ లేదు. వాళ్ళిద్దరికి నివాళులర్పించే వంకతో ఆయన అస్తిత్వ సమూహాల మీద దాడి చేయదలిచారు.  దానినే నేను తప్పుపట్టాను.

 

          భారత అణగారిన సమూహాలు కమ్యూనిస్టులకు వందేళ్ళ సమయం ఇచ్చాయి. అంటే నాలుగయిదు తరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలకు తమ కార్యక్రమం మీద స్పష్టమైన అవగాహనలేదు. కార్యక్రమం మీదనే స్పష్టమైన అవగాహనలేనపుడు అవి చేయగలిగింది ఏమీవుండదు.

 

          కార్ల్ మార్క్స్ చెప్పిన సాంప్రదాయ సోషలిజాన్ని తమ దేశాలకు అనువుగా మోడిఫై చేసుకోవడంవల్లనే లెనిన్ రష్యాలో, మావో చైనాలో, హోచిమిన్ వియత్నాంలో విప్లవాలను సకాలంలో విజవంతం చేసుకోగలిగారు. అలాంటి సృజనాత్మకత మన కమ్యూనిస్టు పార్టీలకు ఎన్నడూలేదు. అయితే రష్యానో, కాకుంటే చైనానో కాపీ కొట్టారు. వర్తమాన సమాజాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోగలిగినవారే దానికి పరిష్కారంగా ఒక సృజనాత్మక   కార్యక్రమాన్ని రూపొందించుకోగలరు. లేకుంటే 1929 నాటి చైనా కార్యక్రమాన్ని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ వుంటారు.

 

          మన సమాజం అర్ధ వలస, అర్ధ భూస్వామ్యమనేది కమ్యూనిస్టుల పురాతన అవగాహన. దానిని బట్టే ‘వ్యవసాయ విప్లవం ఇరుసుగాగల నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనే కార్యక్రమం  రూపొందుకుంది. అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఓ ఇరవై ఏళ్ళుగా విప్లవ పార్టీలు   దీన్ని “బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం“ అంటున్నాయి. “మన దేశంలో రాజ్యం, రాజ్యవ్యవస్థలు హిందూత్వవాదులకు దన్నుగా నిలుస్తున్నాయనీ, మత మైనారిటీలపై ముఖ్యంగా,  ముస్లింలపై చాలా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయనీ అందువల్ల హిందూ మతతత్వం ప్రధాన ప్రమాదకారిగా పరిణమించిందని 1990 లలోనే బిజేపి అధికారంలోకి రాక ముందు రెండున్నర దశాబ్దాల క్రితమే విశ్లేషించి అందుకనుగుణంగా కార్యక్రమాలను రూపొందించుకున్నది” అని రవి నర్ల అంటున్నారు.  వారు చెప్పిన తేదీ నుండే లెఖ్ఖలు వేసుకున్నా, గడిచిన 30 సంవత్సరాలలో “ముస్లింలపై చాలా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న” సమాజానికి విరుగుడుగా వాళ్ళు చేసిందేమిటీ?  అస్తిత్వ సమూహాల జాబితా నుండి ముస్లింలను మినహాయించడం తప్ప. చెపుతున్నదానికీ చేస్తున్నదానికీ ఏదైనా పొంతన వుందా? సమాజ స్వభావం మారిందని మీరే అంటున్నపుడు పార్టీ కార్యక్రమం వ్యూహాలు, ఎత్తుగడలు మారాలిగా? మీ కార్యక్రమం మారలేదని తప్పుపడితే ‘విప్లవోద్యమాన్ని అవహేళన చేయకండి’ అంటారా?

         

భారత కమ్యూనిస్టు పార్టీ తొలినాళ్ళలో ఎంతో మంది ముస్లింలు నాయకత్వ స్థానానికి ఎదిగినప్పటికీ ఆ సమాజం నుండి వచ్చిన వారు ఇప్పుడు లేరని రవి నర్ల అన్నారు. ఇది వాస్తవాన్ని తప్పుదోవ పట్టించే ప్రకటన. 1921లో తాష్కెంట్ లో భారత కమ్యూనిస్టు పార్టిని స్థాపించించిందే ముస్లింలు. అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో 90 శాతం మంది ముస్లింలు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి థింక్ ట్యాంక్ గా పనిచేసిన ‘కామ్రేడ్స్ అసోసియేషన్’ లో మళ్ళీ 90 శాతం మంది ముస్లీంలు. తెలంగాణ సాయుధపోరాటాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించింది మాత్రం ముస్లీంలు కాదు. పోరాటం పీక్ సమయంలో ఆయుధాలను దించివేయడం మూలంగా తెలంగాణలో కొన్ని వేల మంది ముస్లింలు చనిపోయారు.  ఎలా నమ్మేదీ?

 

“(అర్ధ భూస్వామ్య అర్ధ వలస వ్యవస్థ అయినా, పెట్టుబడీదారీ వ్యవస్థ అయినా) ప్రస్తుతం దేశ ప్రజానీకంపై జరుగుతున్న ఫాసిస్టు దాడులను ప్రతిఘటించడానికి కలిసి పనిచేయడానికి ఆటంకం కావలసిన అవసరం లేదు. ఇంకా ఎన్నో రైతాంగ, కార్మిక, విద్యార్థి, ఆదివాసీ, మహిళా సమస్యలపై గానీ, మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా కానీ ప్రజా పోరాటాలు నిర్మించడానికి గానీ, సంయుక్తంగా కలిసి పని చేయడానికి గానీ అడ్డు రావలసిన పని లేదు”. “..... అందులోనూ ముఖ్యంగా ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్య అని ప్రస్తావించి వీటి గురించి వైఖరి చేపట్టాలి, చర్యలు చేపట్టాలి అని (విప్లవోద్యమం) విస్పష్టమైన వైఖరితోనే ఉంది” వంటి అతిశయాలు రవి నార్ల ఉపన్యాసంలో వున్నాయి. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ పేటలో  విప్లవోద్యమం ఈ “స్పష్టమైన వైఖరిని” అమలు చేసిందో  ఒక్క ఉదాహరణ చెప్పినా ముస్లీం సమాజం విని ఆనందిస్తుందిగా!

 

ముస్లింలకు ప్రధాన సమస్య ఎన్డిఏ. దాన్ని ఓడించే ఎత్తుగడ మీకేమయినా ఉందా? అని నేను సూటిగా అడిగాను. “ఎన్డి కూటమిని ఓడించడానికి ఒక పార్లమెంటరీయేతర ఉద్యమంగా విప్లవోద్యమం ప్రత్యక్షంగా చేయగలిగేది లేదు” అని రవి నర్ల కూడ సూటిగా సమాధానం చెప్పారు. అందుకు వారికి ధన్యవాదాలు.  అయితే ఈ ‘పార్లమెంటరీయేతర ఉద్యమం’ అనే మాట ఏమాత్రం నిజాయితీగా లేదు. మీకు నచ్చినపుడు ఎన్టీఆర్ కు మద్దతు ఇచ్చారు. చెన్నారెడ్డికి మద్దతు ఇచ్చారు. రాజశేఖర రెడ్డికి మద్దతు ఇచ్చారు. కేసిఆర్ కు మద్దతిచ్చారు.   ముస్లింల అంశం ఎజెండా మీదకు రాగానే  మాది పార్లమెంటరీయేతర ఉద్యమం’ అంటారా?  గ్రేట్.  ముస్లింల సమస్యను పరిష్కరించాలనే నిజాయితీ మీకు లేదు. ఈ ముక్కే మీనోటితో చెప్పించదలిచాను. మీరు చెప్పారు. అందుకు ధన్యవాదాలు.

 

18 జులై 2021

No comments:

Post a Comment