Friday, 2 July 2021

What should be done to defeat NDA in 2024 elections

For publication in edit page of Andhrajyothi daily.

ఎన్డీఎ కూటమిని 2024  ఎన్నికల్లో ఓడించడానికి ఏం చేయాలీ?

డానీ 

హరిభూషణ్‌, సారక్క  లకు పాణీ నివాళి ‘అస్తిత్వ పరిధులు దాటి కార్మిక వర్గ ప్రతినిధులై...’  (ఆంధ్రజ్యోతి, జులై 2)  శ్రధ్ధగా చదివాను. వారిద్దరి త్యాగం చాలా గొప్పది. అందులో ఎవరికీ సందేహం వుండాల్సిన పనిలేదు. అయితే నాకు కొన్ని సందేహాలున్నాయి.

 వారు ఏ విప్లవోద్యమంలో పాల్గొన్నారూ? అది వ్యవసాయిక విప్లవమా? నూతన ప్రజాస్వామిక విప్లవమా? మరేదయినా విప్లవమా?

 నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కాన్సెప్టూ 1920వ దశకంలో చైనాలో పుట్టింది. నాలుగు వైరుధ్యాలు, ప్రధాన వైరుధ్యం. నూతన ప్రజాస్వామిక విప్లవంలో అంతర్భాగంగా వ్యవసాయ విప్లవాన్ని పూర్తి చేయడం. ముందు గ్రామాలను విముక్తి చేయడం. తరువాత పట్టణాలను విముక్తి చేయడం వగయిరాలు దీని రోడ్ మ్యాప్. గడిచిన శతాబ్ద కాలంలో నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమం ఈ రోడ్ మ్యాప్ లో ఎన్నిమైలు రాళ్ళను  దాటిందీ? మిగిలిన  మైలురాళ్ళను ఇంకెన్ని శతాబ్దాల్లో దాటుతుందీ? 

వందేళ్ళ క్రితపు విప్లవోద్యమ నమూనా నేటి భారత  సమాజానికి   వర్తిస్తుందా? అర్ధ వలస అర్ధ భూస్వామ్య వ్యవస్థకు పరిష్కారంగా నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కాన్సెప్టూ రూపుదిద్దుకుంది. ఇప్పటి సమాజాన్ని కూడా హరిభూషణ్‌, సారక్క వంటి వారు అర్ధ వలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ గా పరిగణిస్తున్నారా? 

కొందరు మావోయిష్టులు ఇటీవల వర్తమాన సమాజాన్ని  “బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం” “హిందూ మత రాజ్యం” అంటున్నారు.  అర్ధ వలస అర్ధ భూస్వామ్య వ్యవస్థకు పరిష్కారంగా రూపుదిద్దుకున్న నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కాన్సెప్టూ “బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం” “హిందూ మత రాజ్యం” లకు కూడా  వర్తిస్తుందా? నాలుగు వైరుధ్యాలు, ప్రధాన వైరుధ్యం మారదా? ఇది హిందూమత రాజ్యం, “బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం” అయితే ప్రధాన వైరుధ్యం ఏ ఏ సమూహాలమధ్య వుంటుంది? దానికి పరిష్కారంగా హరిభూషణ్‌, సారక్కలు చూపిన మార్గం ఏమిటీ? ఈ సందేహాలకు జవాబులు పాణీ నివాళీలో ఎక్కడా కనిపించలేదు. 

               సాంఘీక అస్తిత్వ సమూహాలైన ఆదివాసులు, దళిత బహుజనులు, మహిళల ప్రస్తావన వుందిగానీ మతమైనార్టీల ప్రస్తావన విప్లవోద్యమంలో వున్నట్టు ఈ వ్యాసంలో కనిపించలేదు.  మైనారిటీల ప్రస్తావన లేకపోవడం అంటే “బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం” “హిందూ మత రాజ్యం” మీద పోరు విప్లవోద్యమ అజెండాలో లేదని అర్ధం. 

గురజాడ కన్యాశుల్కంలో జట్కావాలకు వచ్చిన సందేహంలాంటిది నాకూ ఒకటుంది. ఎన్డీఎ కూటమిని 2024  ఎన్నికల్లో ఓడించడానికి ఏం చేయాలీ? అని. అలాంటి కార్యక్రమం ఏదైనా వుందా?  లేకుంటే, బాఖీ సబ్ బక్వాస్. 

2 జులై 2021

7 జులై 2021

https://andhrajyothy.com/telugunews/what-should-be-done-to-defeat-the-nda-in-the-coming-elections-192107071226630


No comments:

Post a Comment