Friday, 16 July 2021

Dissuade Slaughter Of Cows On Bakrid

బక్రీద్ కు ఆవుల్ని ఖుర్బానీ ఇయ్యవద్దు,

 

            నరసాపురం టేలర్ పేట మసీదు వీది మొత్తం ఒకటే కుటుంబం. ఐదు  తరాలు ఒకేచోట జీవించేవాళ్ళం. జనాభా వంద వరకు వుంటుంది. వందేళ్ల క్రితం ఆదిమ నాలుగు కుటుంబాలూ ఐశ్వర్యవంతులుగా జీవించారు. నా బాల్యం నాటికి చాలా మార్పులు వచ్చాయి. ఒకే ఒక కుటుంబం ఐశ్వర్యవంతులుగా వుండేది. మిగిలినవాళ్ళు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, నిరుపేదలుగా మారిపోయారు.

 

            ఐశ్వర్యవంతులయినా, నిరుపేదలయినా మా ఆహారపు అలవాట్లు  ఒకేలా వుండేవి. మాకు నాన్ వెజ్ అంటే సీఫుడ్, లేదా వేట మాంసం. మా సాంప్రదాయ జాబితాలో కోడిమాసం, బొమ్మిడాయిలు, కొర్రమేను చేపలు కూడ లేవు. బీఫ్ అసలేలేదు. ఐశ్వర్యాన్ని కోల్పోయి నిరుపేదలుగా మారిపోయి బంధువుల ఇళ్ళల్లో పాచీపనులు చేసుకుని తిరిగే కుటుంబం కూడ బీఫ్ తినేది కాదు.

            బీఫ్ అనేది అలవాటుకు సంబంధించిన అంశమేగానీ,  పేదరికానికి సంబంధించిన అంశంకాదు. నిజాం సంస్థానంలో ముస్లిం ధనవంతులు కూడ బీఫ్ తింటారు.  ఆంధ్రా ప్రాంతంలో ముస్లింలలో  30-40 శాతం మాత్రమే బీఫ్ తింటారు.  60-70 శాతం తినరు. మాకుటుంబాల్లో  మరో ప్రత్యేకత ఏమంటే ఎవ్వరూ మీసాలు తీసేసి, గడ్డాలు పెంచేవారు కాదు. మసీదు ఇమాం ఒక్కరే సాంప్రదాయ దుస్తుల్లో వుండేవారు. వారొక్కరికే మా వీధి మొత్తంలో గడ్డం వుండేది.

 

            కమ్యూనిస్టు పార్టీల్లో  సభలు జరిగినపుడు నాన్ వెజ్ గా బీఫ్ వండుతారు. అలవాటులేని వ్యవహారం కనుక తినడానికి నేను ఇబ్బంది పడేవాడిని. ఎస్సీ సమూహాల్లో పనిచేసే సందర్భాల్లోనూ బీఫ్ ను ఫేస్ చేయాల్సి వచ్చింది. సంస్థాగత వ్యవహారంగా మారినపుడు తినకతప్పదు. నాకు వీలున్న చోట అలవాటు లేదని చెప్పి తప్పించుకునేవాడిని.

 

            నాలుగు రకాల మాంసాల్ని మనం అందరం సాధారణంగా  బీఫ్ అంటాం. దున్నపోతు, గేదే,  ఎద్దు, ఆవు మాంసాలు ఈ జాబితాలో వస్తాయి.  మన దేశంలో బీఫ్ మీద ఒక వివాదం వుంది. నిజానికి ఈ వివాదం ఆవు (గో) మాసం మీద మాత్రమే. మిగిలిన మాంసాల మీద వివాదంలేదు. మాసం వ్యాపారులు కూడ సాధారణంగా ఆవును కోయరు.

 

            కేరళతో సహా  అనేక రాష్ట్రాల్లో దున్నపోతు, గేదే మాంసాల్ని బీఫ్ గా హొటళ్ళలో హాట్ కేకుల్లా అమ్ముతుంటారు. మళయాళం టీవీల వంటల కార్యక్రమాల్లో రకరకాల బీఫ్ వంటల గురించి వుంటాయి. మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్ సినిమాల్లోనూ బీఫ్ ప్రస్తావన వుంటుంది. హీరో చాలా ఇష్టంగా బీఫ్ తింటాడు. వివాదాల కారణంగా బీఫ్ బోర్డుల మీద ఇటీవల బ్రాకెట్లో  ‘బఫెలో మీట్’ అని రాస్తున్నారు. 

 

            బీఫ్ తింటారని ముస్లింల మీద బిజేపి కార్యకర్తలు అక్కడక్కడా  డాడులు చేస్తుంటారు. నిజానికి బీఫ్ మీద బిజేపికి ఒక జాతీయ విధానం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ ను నిషేధించాలని బిజేపి ఎన్నడూ అనదు. కేరళలో అయితే ఏకంగా తాము గెలిస్తే క్వాలిటీ బీఫ్ ను పంపిణీ చేస్తామని బిజెపి అభ్యర్ధులు ఎన్నికల్లో వాగ్దానం చేస్తుంటారు.

 

            బీఫ్ ఎగుమతి చేసే దేశాల్లో బ్రెజిల్, ఆస్ట్రేలియా, అమెరికా తరువాత భారత్ ది నాలుగవ స్థానం. అమెరికాతో దాదాపు సమానంగా భారత్ బీఫ్ ను ఎగుమతి చేస్తుంది.  బీఫ్ ను ఎగుమతి చేసే కంపెనీలన్నీ ముస్లింలవని చెప్పడం కూడ కుదరదు. ముస్లిమేతరులే ఈ వ్యాపారంలో పెద్ద సంఖ్యలో వున్నారు.

 

            నేను హైదరాబాద్ కు మారాక ఒక సంఘటన జరిగింది. నేను అప్పట్లో సి-టీవీలో సెక్రటేరియట్ రిపోర్టరుగా వున్నాను. ఒకరోజు ముస్లిం సాంప్రదాయ దుస్తుల్లోవున్న ఒకతను సిటీవీ ఆఫీసులో నా గదిలోనికి వచ్చాడు. అప్పటికి ఓ పది రోజుల్లో బక్రీద్ (బలిదానాల) పండుగ జరుగనుంది.

 

            వచ్చినవాడు తనను పరిచయం చేసుకుని “ఆవును ఖుర్బానీ వేస్తున్నాం; మీరు వాటా కలుస్తారా?”  అని అడిగాడు. అతని అతి చొరవకు నాకు చాల చిరాకు వేసింది.  ఓ నలుగురు ఛాందసుల్ని పోగేసి అందులో నాలుగు డబ్బులు కొట్టేయడానికి బయలుదేరిన బ్రోకర్ గా కనిపించాడు అతను. ఒక్కమాటలో “ఫో బయటికి” అని అతన్ని గెంటేయవచ్చు. కానీ, అతని మూర్ఖత్వాన్ని ఎండగట్టాలని అనిపించింది నాకు.

 

            “ఖుర్బానీ సాంప్రదాయం మా ఇంట్లోలేదు. మానాన్నగారి హయాంలో ఖుర్బానీ వేసేంత ఆర్ధిక స్తోమత మాకు లేదు.  నా హయాంలో, బక్రీద్ రోజు మా పేటలోవుండే ఓ నలుగురు పేదలకు భోజనం పెడతాము, బంధుమిత్రులతో కలసి భోజనం చేస్తాము. అంతేగానీ ఖుర్బానీ  ఎప్పుడూ ఇవ్వలేదు. నా వరకు పేదలకు భోజనం పెట్టడం ముఖ్యం. నా దగ్గర డబ్బులుంటే ఓ గొర్రె కొని ఖుర్బానీ వేస్తా. మధ్యలో ఈ ఆవులో వాటాల గోలేంటీ?” అన్నాను.

 

            “ఆవును ఖుర్బానీ ఇస్తే  పుణ్యం ఎక్కువ?” అన్నాడు అతను నన్ను ఊరించడానికి.  

            ‘ఎవరు చెప్పారూ?” అని అడిగాను.

            “హదీస్, సున్నత్”  అన్నాడతను.

నేను ఆంధ్రా ముస్లింని కనుక ఇస్లాం ధార్మిక అంశాల గురించి మాకు ఏమీ  తెలియదని అతని నమ్మకం.

 

            నాకు చిర్రెత్తు కొచ్చింది. ఖురాను, హద్దీస్, సున్నత్ లు  ఆమూలాగ్రం నాకు తెలుసని అనలేనుగానీ, నా ధార్మిక గురువు మా అమ్మీ మూలంగా ఇస్లాంలో కీలక అంశాల వరకు  నాకు కొంత పరిజ్ఞానం వుంది.

 

            “హదీస్, సున్నత్ లో ఎక్కడ వుందీ ఆవుమాసం తినాలనీ?” అని మళ్ళీ రెట్టించాను. ఒక ఆంధ్రా ముస్లిం ఇలా అడుగుతాడని అతను ఊహించలేదు. షాక్ తిన్నాడు.

 

అతనేదో చెప్పడానికి ప్రయత్నించాడు. నేను అతనికి అవకాషం ఇవ్వదలచలేదు.

 

            “చూడు భాయీ! నీకు రెండు విషయాలు తెలియాలి. మన భారతదేశ ఆవులు వేరు; అరేబియా ఆవులు వేరు. మన అవులకు మూపురం వుంటుంది. అక్కడి ఆవులకు మూపురం వుండదు. అక్కడి ఆవులు  తెల్ల గేదెల్లా వుంటాయి. అవి గేదెలతో సమానం. రెండోది; ఖురాన్ కథనం ప్రకారం ఆరోజు హజ్రత్ ఇబ్రాహీంగారు బలి ఇచ్చింది ‘దుంబా’ని.  అది మన గొర్రెల జాతికి చెందిందేగానీ, గొర్రె కాదు. ఖుర్బానీ వేస్తే దుంబాని వేయాలి; లేకుంటే గొర్రెను వేయాలి. మధ్యలో ఈ ఆవు ఎక్కడి నుండి వచ్చిందీ? “ అని నిలదీశాను. 

            అతనికి అప్పటికే కళ్ళు బైర్లుకమ్మాయి. వాదించడానికి అతని దగ్గర ధార్మిక అంశం లేదు.  టాపిక్ ను రాజకీయాల్లోనికి మార్చే ప్రయత్నం చేశాడు.

 

“బిజెపి, ఆరెస్సెస్, భజరంగ్ దళ్ వాళ్ళకు మనం బుధ్ది చెప్పాలి” అన్నాడు.

“ఇప్పుడు మీరు అసలు రూపానికి వచ్చారు. మీ రాజకీయం కోసం ఖురాను, హద్దీస్, సున్నత్ లను వాడకండి” అన్నాను.

 

“మరి వాళ్ళు చేస్తున్నది సరియినదేనా?” అన్నాడు.

 

“వాళ్ళూ కరెక్టుకాదు; మీరూ కరెక్టు కాదు. వాళ్ళు  ధార్మిక అంశాల్ని రాజకీయం చేస్తున్నారు. మీరు రాజకీయ అంశాన్ని ధార్మికంగా మారుస్తున్నారు. ఏంటీ తేడా? ” అన్నాను.

 

“వాళ్ళను అలా వదిలెయ్యాలా?”

 

“బిజెపి, ఆరెస్సెస్, భజరంగ్ దళ్ లను నిలవరించాల్సిందే; కానీ దానికి ఇది మార్గం కాదు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి.  బిజెపి, ఆరెస్సెస్, భజరంగ్ దళ్ కోసం ఆవును బలి ఇస్తే మొత్తం హిందువుల మనోభావాలు దెబ్బ తింటాయి. మీరు మీ చెత్త బుర్రలతో హిందువులందర్నీ ముస్లింలకు శత్రువులుగా మారుస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. నీకు డబ్బులు అవసరం అయితే వంద రూపాయలు కావాలని అడుగు; ఇస్తాను. నువ్వు ఆఫీసులో కొచ్చి మాట్లాడావుగాబట్టి వదిలేస్తున్నాను.  ఇదే మాట రోడ్డు మీద అనుంటే నిన్ను తన్ని వుండేవాడిని.” అన్నాను అవేశంగా.

 

అతను మాట్లాడకుండ వెళ్ళిపోయాడు.

ఇలాంటి వాళ్ళు అన్ని మతాల్లోనూ వుంటారు. అందరూ వాళ్ళను దూరంగా వుంచాలి.

 

            ఆహార సేకరణ కాలంలో ఆవులు గేదెలు మేకలు గొర్రెల్ని ఆహారం కోసమే పెంచేవారు. వ్యవసాయం అభివృధ్ధి చెందాక దృక్పధం మారిందని చరిత్రకారులు చెపుతారు. శంకరాచార్యుడు వచ్చే వరకు బ్రాహ్మణులు మాంసాహారులేనని కూడ చరిత్ర చెపుతోంది. వాళ్ళు గోమాంసం కూడ తినేవారని వేదాల్లో వుందని   కొందరు అంబేడ్కరిస్టులు అంటుంటారు. తాబేలు, చేప, సింహం,  వరాహం కూడ విష్ణుమూర్తి అవతారాల్లో వున్నాయి విఘ్నేశ్వరుడ్ని పూజించకుండ హిందూ సమాజం ఏ పనీ మొదలు పెట్టదు. ఆ జీవులన్నింటి మీద లేని వివాదం ఒక్క గోవు మీదనే ఎందుకని కొందరి సందేహం. 

 

            ఎవరి ఆహార అలవాట్లు వారివి. ఒకరి ఆహారపు అలవాట్లలో మరొకరి జోక్యం  అనవసరం అనే వాదనలూ వున్నాయి. బీఫ్ తినే హక్కును నిలబెట్టుకోవడానికి ఆ మధ్య ఉస్మానియా యూనివర్శిటీలో కొందరు అంబేడ్కరిస్టులు  బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు.  దానికి పోటీగా మరికొందరు ఆకతాయిలు పోర్క్ ఫెస్టివల్ జరిపారు. అదో ఫన్నీ వ్యవహారం.

 

            వాళ్ళు ఎలాగూ దాడి చేయదలచుకున్నారు కనుక ఒకవేళ ముస్లింలు బీఫ్ ను వదిలేసినా వాళ్ళ మీద దాడులు కొనసాగుతాయనే మాట కూడ వుంది. బీఫ్ సమస్యను పరిష్కరిస్తే ఇంకో సమస్యను ముందుకు తెస్తారు అన్నవాళ్ళూ వున్నారు. అవన్నీ నిజమేగానీ, వర్తమాన సమాజంలో సాధారణ హిందూ సామాజికవర్గాలు ఆవును గోమాతగా భావిస్తున్నాయి కనుక వాళ్ళ మనోభావాలను గౌరవించడమే మంచి సాంప్రదాయం. అదొక గుడ్ గెశ్చర్. పేదరికంవల్ల ప్రొటీన్ డైట్ గా బీఫ్ తినే సమూహాలకు ప్రత్యామ్నాయంగా బఫెలో మీట్ ఎలాగూ వుంది. ఇకముందు బీఫ్ అనవద్దు బఫెలో మీట్ అనండి సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది.  

 

            దీన్ని దృష్టిలో  పెట్టుకుని రేపు బక్రీద్ సందర్భంగా ఎట్టి పరిస్థితిలోనూ గోవుల్ని బలి ఇవ్వవద్దని ముస్లిం సమాజాన్ని కోరుకుంటున్నాను. కొన్నేళ్ళుగా అనేక ముస్లీం ధార్మిక సంస్థ (జమాత్)లు కూడా గోవధ వద్దంటున్నాయి. ఆ మేరకు ఫత్వాలున్నాయి. వాటిని గౌరవిద్దాం.

 

రచన 16 జులై 2021

ప్రచురణ 20 జులై 2021

ఆంధ్రజ్యోతి డైలీ

 

https://epaper.andhrajyothy.com/c/7BB70F5237F02D0B244B57CA49794958

https://www.andhrajyothy.com/telugunews/what-does-the-quran-say-about-bakrid-qurbani-192107200258259

No comments:

Post a Comment