Wednesday, 21 July 2021

Mega Self-respect Confederation is the need of the day ( Zoom Meeting on USAA )

USSA Zoom Meeting

24 July 2021Saturday 

 

Intro

ఈనాటి జూమ్ సమావేశం అధ్యక్షవర్గం సభ్యులు

చిగురుపాటి భాస్కరరావుగారికిపర్వతాలు గార్లకూ-

ప్రస్తుతం జూమ్ రూమ్ లో వున్న

ప్రతి ఒక్కరికీ

 

లాల్ సలామ్! జై భీం! జై మీమ్!

లాల్-నీల్- హర్యాలి వర్ధిల్లాలి!

 

ఉసా అనే ఉప్పుమావులూరి సాంబశివరావు నాకు చిరకాల మిత్రుడు, అనేక ఉద్యమాల్లో సహచరుడు.

 

ఉసా స్మారక ఉపన్యాసాల పరంపరలో నన్ను భాగస్తుడ్ని చేసినందుకు నిర్వాహక కమిటీకి ముందుగా కృతజ్ఞతలు.

 

రోజు నా ప్రసంగ అంశంలో  నాలుగు విభాగాలున్నాయి.

1. మత మైనారిటీలు,

2. జాతుల సమస్య

3. కాషాయ శక్తులు

4. ఉసా సమాజ విశ్లేషణ, ఆచరణ.

 

ప్రసంగ అంశాల విస్తృతి చాలా పెద్దది కనుక నాకు సాధారణ గంటకన్నా కొంచెం ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిందిగా నిర్వాహకుల్ని కోరుతున్నాను.

 

గత ఏడాది కాలంగా ఉసా మీద నిర్వహించిన జూమ్ మీటింగులు అన్నింటిలోనూ, ఉసా ప్రత్యేక సంకలనం కోసం రాసిన వ్యాసంలోనూ నేను కామన్ గా ఒక మాటను చెపుతూవచ్చాను. అదేమంటేమార్క్సిస్టు-అంబేడ్కరిస్టు శిబిరాల మధ్య వారధి ఉసాఅని

 

ఉసా మార్క్సిస్టు శిబిరంలో అంబేడ్కరిస్టు. అంబేడ్కరిస్టు శిబిరంలో మార్క్సిస్టు. ఉసా విశ్లేషణ శైలిని  అతని ఆచరణను నిర్దేశించింది రెండు సిధ్ధాంతాలే.

 

స్వల్ప ఉపోద్ఘాతంతో ఇక నేను అసలు విషయం లోనికి ప్రవేశిస్తాను.

 

 

 (మీకు ఒక చిన్న విన్నపం ఏమంటే నేను చాలా కాలంగా సివోపిడి పేషెంట్ ని. దానికితోడు ఇటీవల కోవిడ్ బారిన పడిలేచాను. వాతావరణం ముసురుగా

వున్నప్పుడు అనియంత్రిత చర్యగా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ప్రయత్న పూర్వకంగానూ శ్వాస తీసుకోవాల్సి వుంటుంది. అలాంటప్పుడు మాట కొంచెం ముద్దముద్దగా వస్తుంది. అందుకు నన్ను మన్నించండి).

 

 

ఇవ్వాల్టి ప్రసంగానికి నేను పెట్టుకున్న శీర్షిక

ఆత్మగౌరవ మహాకూటమి : నేటి చారిత్రక అవసరం.

 

1.           ఇది అస్తిత్వాల యుగం.

 

2.           మానవ సమూహాల వర్గేతర ఉనికిని మనం అస్తిత్వాలు అంటున్నాం.

 

3.      కులం, తెగ, జాతి, మతం, లింగం, వర్ణం, భాషా, ప్రాంత వగయిరాలన్నీ అస్తిత్వాలే. ఇటీవలి కాలంలో  వర్గాన్ని కూడ ఒక అస్తిత్వంగా పరిగణిస్తున్నారు.

 

4.      ప్రతిమనిషికీ బహుళ అస్తిత్వాలు వుంటాయి. వ్యక్తుల అస్తిత్వాన్ని బట్టే సామాజిక సమూహం ఏర్పడుతుంది. అయితే ప్రతి చారిత్రక దశలోనూ కొన్ని అస్తిత్వాలు క్రియాశీలంగా వుంటాయి. మిగిలినవి అలా నిద్రావస్థలో పడి వుంటాయి.

 

5.      ప్రతి అస్తిత్వంలోనూ ఒక సమూహం యజమానిగా వుంటుంది. మరో సమూహం శ్రామికునిగా వుంటుంది. ఒక సమూహం పీడకులుగా వుంటుంది. ఇంకో సమూహం పీడితులుగా వుంటుంది. ఒక సమూహం అణిచివేస్తూ వుంటుంది. ఇంకొకటి అణగారిన సమూహంగా వుంటుంది.

 

6.      అస్తిత్వాల మీద చర్చ శతాబ్దాలుగా  వుంది. అంతకన్నా ముందునుండే వుంది. యజమాని సమూహాలు ఒక్కో సందర్భంలో ఒక్కో అస్తిత్వం మీద దాడులు చేస్తుంటాయిఅప్పుడు మేధోరంగంలో నిర్ధిష్ట అస్తిత్వం మీద చర్చ క్రీయాశీలంగా మారుతుంది.

 

 

7.      జాతియోద్యమ కాలంలో భౌగోళిక /ప్రాదేశిక జాతీయవాద అస్తిత్వం చాలా బలంగా పనిచేసింది. అప్పుడు మిగిలిన అస్తిత్వాల మీద  స్థాయిలో చర్చ జరగలేదు.

 

8.  ప్రత్యక్ష వలస పాలన ముగిశాకస్వాతంత్ర్యం తెచ్చిన ఉత్సాహం తగ్గుముఖం పట్టాక, దేశీ భూస్వాములు, పెట్టుబడీదారుల దగ్గరకు తగినంత సంపద చేరాక, వాళ్ళు ఆత్యాశపరులుగా మారాక  అణిచివేతకు వ్యతిరేకంగా అనేక అస్తిత్వ సమూహాలు ఆందోళనలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

9.      1980 ఆరంభంలో ఈశాన్య రాష్ట్రాల్లో మెయిన్ ల్యాండ్ ఇండియా వనరుల అన్వేషణ విపరీతంగా పెరిగింది. అది భరించలేనంత  దోపిడిగా మారినపుడు ప్రాంతం తిరుగుబాటు చేసింది. మెయిన్ ల్యాండ్ ఇండియాకు సంబంధించి అది వనరుల అన్వేషణ  (exploration). ఈశాన్యరాష్ట్రాలకు సంబంధించి అది ప్రాంతీయ దోపిడి (exploitation).  ఎవరి భాష వారిది.

 

10.    అప్పట్లో ఆలోచనాపరుల వేదికలపై జాతుల సమస్య మీద చాలా విస్తృతంగా చర్చ సాగింది. ‘భారత దేశం జాతుల బందీఖాన అనే అవగాహన అప్పుడే బలపడింది.

 

11.    1980లో నాలుగవసారి ప్రధాని పదవిని చేపట్టిన ఇందిరాగాంధి వాయువ్య ప్రాంతం మీద కన్నేశారు. దానికి వ్యతిరేకంగా పంజాబ్ లో చాలా పెద్ద తిరుగుబాటు సాగింది. ‘ఆపరేషన్ బ్లూస్టార్ తో ఆందోళనను అణిచివేశారు.

 

12.    దానికి ప్రతీకారంగా శిక్కు ఆందోళనకారులు 1984 చివర్లో ఇందిరాగాంధిని హత్య చేశారుమళ్ళీ దానికి ప్రతీకారంగా ఢిల్లీతోపాటు  పరిసర రాష్ట్రాల్లో శిక్కుల మీద  ఊచకోత సాగింది.

 

13.    మనదేశంలో మెజారిటీ మతం స్థాయిలో  మైనారిటీ మత సమూహాల మీద నరమేధాన్ని సాగించగలదో చెప్పడానికి ఇది తొలి హెచ్చరిక.

 

14.    సరిగ్గా అప్పుడే యజమాని మతం, శ్రామికమతం అనే అవగాహన ముందుకు వచ్చింది.

 

15.    ఢిల్లీ అల్లర్లలో హిందూ సమూహం యజమానిమతం, శిక్కు సమూహం శ్రామికమతం.

 

16.    మన ఆలోచనాపరులు ఆనాడే అప్రమత్తమైవుంటే 2002లో మతం పేరిట గుజరాత్ లో సాగిన నరమేధాన్ని ఆపగలిగే ఆవకాశాలు ఎంతోకొంత వుండేవి.

 

17.    1985లో  కారంచెడులో శ్రామిక కులాల మీద యజమాని కులాలు సాగించిన హత్యాకాండ దళితులకు ఒక కనువిప్పు కలిగించింది. భవిష్యత్తులో కొత్త దారుల్ని వెతకాల్సిన అవసరాన్ని వాళ్ళు గుర్తించారుఅప్పుడే కులం సమస్య చర్చా వేదిక మీదికి వచ్చింది.

 

18.    కారంచేడులో దాడి జరిపింది యజమాని కులం, దాడికి గురయ్యింది శ్రామిక కులం.

 

19.    కులం సమస్య మీద  గతంలో చర్చ లేదనికాదు. 19 శతాబ్దం మధ్యలో ఇంగ్లండ్ లో కమ్యూనిస్టు ప్రణాళీక రూపొందుతున్న కాలంలోనే భారతదేశంలో  మహాత్మ జోతిబా ఫూలే కుల సమస్యను లేవనెత్తాడు. కారంచేడు తరువాత కులం సమస్య క్రియాశీలంగా మారిందని చెప్పడమే నా ఉద్దేశ్యం

 

20.    ఈశాన్యజాతులు, శిక్కు మైనారిటీలు, దళితుల తరువాతి వంతు ముస్లింలది. ఇదొక సామాజిక క్రమం.

 

21.    1990లో  నాటి బిజెపి అధ్యక్షుడు అద్వానీ రథ యాత్రను చేపట్టారు. దానిని  ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలతోపాటు వామపక్షాలు, విప్లవ కమ్యూనిస్టు పార్టీలు సహితం ఒక సాధారణ రాజకీయ కార్యక్రమంగా భావించాయి. ఆధునిక  అశ్వమేధాన్ని నాలుగు తిట్లు తిట్టి ఊరుకున్నాయి. దానిని అడ్డుకునే ప్రయత్నాలు ఏమీ చేయలేదు. దానితో,   తాము కొత్త దారుల్ని వెతుక్కోవాల్సిన అవసరాన్ని భారత ముస్లిం సమాజం గుర్తించింది.

 

22.    నేపథ్యంలోనే మేధోరంగంలో యజమాని మతం, శ్రామిక మతం అనే అవగాహన బలపడింది.

 

23.    యజమాని మతం, శ్రామిక మతం అనే సిధ్ధాంతానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానం కొత్త బలాన్నిచ్చింది.

 

24.    భారత సమాజాన్ని అంబేడ్కర్హిందూ మత రాజ్యం అన్నాడు. “నేను హిందువుగా  పుట్టినా హిందువుగా మరణించనుఅని శపథం చేశాడు.

 

25.    బౌధ్దులు తమ మతాన్ని త్యజించి హిందూమతంలో విలీనం కావాలని  కాషాయశక్తులు ఆదేశిస్తున్న రోజులవి. అంబేడ్కర్ ఆదేశాలను ధిక్కరించి తాను  హిందూమతాన్ని త్యజించి బౌధ్ధమతాన్ని స్వీకరించాడు. అలా అంబేడ్కర్ జీవితాచరణలోనే మతవర్గ విభజన  వుంది.

 

26.    హిందూమతాన్ని యజమాని మతంగానూ, బౌధ్ధమతాన్ని శ్రామిక మతంగానూ అంబేడ్కర్ ఆనాడే ప్రకటించాడు.

 

27.    మేధోమధనంలో రెండు స్థాయిలుంటాయి. మొదటిదిఅలనాడు కార్ల్ మార్క్సో, బీఆర్ అంబేడ్కరో వివిధ అంశాల మీద ఏం చెప్పారూ? అనేది. రెండోది; మన కాలపు మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులు మార్క్సిజానికీ, అంబేడ్కరిజానికీ ఎలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారన్నదిమేధోమధనంలో మొదటిదానికన్నా రెండోదే కీలక చర్చనీయాంశంగా మారుతుంది.

 

28.    మనం ఇప్పుడు ఎంతగా కోరుకున్నా మార్క్స్ తోనోఅంబేడ్కర్ తోనో నేరుగా సంవాదం సాగించలేం. అది చారిత్రకంగా అసాధ్యంమనం సంవాదం సాగించేది మన కాలపు మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులతో.

 

29.    సందర్భంగా ముస్లిం ధార్మిక సాంప్రదాయం ఒకదాన్ని మీతో పంచుకుంటాను. ప్రపంచ రాజకీయాల్ల ఇజ్రాయిల్-పాలస్తీన వివాదం గురించి మనందరికీ తెలుసు. యూదులు, ముస్లింలకు మధ్య గాజాస్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ లో  70 ఏళ్ళుగా తీవ్ర ఘర్షణ సాగుతున్నదనీ మనకు తెలుసు.

 

30.    యూదులు ప్రవక్త అబ్రహామ్ అనుయాయులు. రాజకీయ, సామాజిక, భౌగోళిక రంగాల్లో యూదులతో ఇంతటి  ఘర్షణ సాగుతున్నప్పటికీ భూమి మీద ఒక్క ముస్లిం కూడ  ప్రవక్త అబ్రహామ్ గురించి ఒక్క అక్షరం కూడ తప్పుగా మాట్లాడడు. వారిని ఇబ్రాహీం అలేహిస్సలాం అంటారు. అలేహిస్సలాం అనేది గౌరవవాచకం. Honorific. ‘వారికి శాంతి కలుగుగాక అని అర్థం. అలేహిస్సలాం అనకుండ ప్రవక్త ఇబ్రాహీం పేరును ఉఛ్ఛరించడం చాలా తప్పుగా ముస్లీంలు భావిస్తారు

 

31.    ఈమాట ఇక్కడ ఎందుకు చెపుతున్నానో మీకు ఈపాటికి అర్థం అయి వుంటుంది. కార్ల్ మార్క్స్, జోతిబా ఫూలే, అంబేడ్కర్ వంటి సమాజశాస్త్ర గురువుల (Masters of social thought) మీద మనకు అలాంటి  గౌరవభావం విధిగా వుండాలి.

 

32.    World is knowable. వందేళ్ళు, రెండు వందల ఏళ్ళు  ముందు కాలంకన్నా ఇప్పుడు మనకు తెలిసిన ప్రపంచం పెద్దది. రేపటి తరానికి మరింత పెద్ద ప్రపంచం తెలుస్తుంది. వినయం కూడ మనకు వుండాలి.

 

33.    కాలంతోపాటు వాస్తవాలేకాదు సత్యాలూ మారిపోతుంటాయి. అంతిమ సత్యం అంటూ ఏదీ వుండదు అనేదే అంతిమ సత్యం.

 

34.    సమాజశాస్త్ర గురువుల బోధనల్లో చారిత్రక పరిమితులు కొన్ని వుంటాయి. వాటిని పరిమితిలోనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళతో ఘర్షించి మనం సాధించేది ఏమీలేదు. మనం సంవాదం సాగించాల్సింది మన కాలపు వాళ్ళ అనుయాయులతో.

 

35.    భారత కమ్యూనిస్టు పార్టిల తప్పుల్ని ఎత్తిచూపినపుడు మార్క్స్ వ్యతిరేకి అనీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధవాలే  ఎన్దీఏలో చేరడాన్ని తప్పుపట్టినపుడు అంబేడ్కర్ వ్యతిరేకి అని మన మీద నిందలు వేసి మోరల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడేవాళ్ళు కొందరుంటారు. సంవాదం సాగించే స్తోమత లేక అంతరించిపోతున్న సమూహంగా వాళ్ళను చూసి జాలిపడాలి.

 

36.    తమ కాలం విసిరిన సవాళ్ళను ఎదుర్కొని నిలిచినవారే సమాజశాస్త్ర గురువులవుతారు.

 

37.    మేధోరంగంలోనూ యజమాని ఆలోచనలు, శ్రామిక ఆలోచనలు వుంటాయి. అప్పటికి అధికారంలో వున్న ఆలోచనలు  కొత్త ఆలోచనల్ని వేదిక మీదికి రానివ్వవు.

 

38.    కప్పను మింగుతున్నప్పుడు పాము మౌనంగా వుంటుంది; కప్ప అరుస్తూ ఉంటుంది. పిచ్చుకను ఎత్తుకుపోతున్నప్పుడు గ్రద్ద మౌనంగా వుంటుంది; పిచ్చుక అరుస్తూ ఉంటుంది. సామాజిక రంగంలోనూ ఇలాగే జరుగుతూ వుంటుంది. యజమాని మతాలు మౌనంగా వుంటాయి; శ్రామిక మతాలు అరుస్తూ వుంటాయి.

 

39.    1920లలో శ్రామికవర్గం వర్గ దృక్పధాన్ని ప్రతిపాదించినపుడు అప్పటి యజమాని ఆలోచనలు ఒప్పుకోలేదు. మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నారని విరుచుకు పడ్డాయి.

 

40.    1980లలో శ్రామిక కులాలు కుల దృక్పధాన్ని ప్రతిపాదించినపుడు కూడ యజమాని ఆలోచనలు ఒప్పుకోలేదు.

 

41.    1990లలో మైనారిటీలు మత దృక్పధాన్ని ప్రతిపాదించినపుడు కూడ యజమాని ఆలోచనలు ఒప్పుకోలేదు.

 

42.    మార్క్సిస్టులు వర్గ సమాజం అన్నారు.

 

43.    అంబేడ్కరిస్టులు కుల సమాజం అన్నారు.

 

44.    తమను తాము కల్తీలేని స్వఛ్ఛమైన అంబేడ్కరిస్టులుగా భావించేవారు ఇప్పటికీ వర్గాన్ని గుర్తించరు.

 

45.    అంబేడ్కరిస్టు - మార్క్సిస్టులు కులవర్గ సమాజం అన్నారు.

 

46.    మైనారిటీలు కులవర్గ మత సమాజం అంటున్నారు.

 

47.    మహిళలు కులవర్గ మత లింగ సమాజం అంటున్నారు.

 

48.    ఇలా కాలంతోపాటూ వివిధ చారిత్రక దశల్లో మన అవగాహన విస్తృతి లోతు పెరుగుతూ వుంటుంది. కొత్త అస్తిత్వాలు కొత్త దృక్పధాల్ని వేదిక మీదికి తెస్తూనే వుంటాయి. ఇదొక నిరంతర ప్రక్రియ.

 

49.    ఆస్ట్రేలియ మిషనరీ గ్రాంహాం స్టూవార్ట్ స్టేయిన్స్ ను ఓడిశా రాష్ట్రం ఖేంజోర్ జిల్లాలో 1999లో సంఘీయులు ఇద్దరు పిల్లలతో సహా సజీవంగా దహనం చేశారు. కేసులో ప్రధాన నిందితుడయిన దారాసింగ్ మయూర్ భంజ్ జిల్లాలో ముస్లీం వ్యాపారినీ హత్య చేశాడు

 

50.    క్రీస్టియన్, ముస్లిం మైనారిటీలకు పొంచివున్న లించింగ్ ముప్పుకు ఇవి తొలి సంకేతాలు. వాటిని మనం పట్టించు కోవాల్సినంతగా పట్టించుకోలేదు.

 

51.    తూప్రు యూరప్ లో సోషలిస్టు దేశాల పతనం, గాట్, ప్రపంచ వాణిజ్య సంస్థల ఆవిర్భావం, భారత్ లో ఆర్ధిక సంస్కరణలు, మెజారిటీ మతోన్మాద విజృంభణ అన్నీ ఒకే కాలంలో జరిగాయని మనకు తెలుసు. కానీ, ఇవన్నీ విడదీయడానికి వీల్లేని పరస్పర ప్రభావిత అంశాలని మనలో చాలామందికి తెలీదు

 

52.    శిక్కుల మీద ఊచకోత సాగిన ఎనిమిదేళ్ళకు బాబ్రీ మసీదును కూల్చి వేశారుబాబ్రీ మసీదును కూల్చేవేసిన పదేళ్ళకు గుజరాత్ మారణహోమం సాగింది. గుజరాత్ మారణహోమం జరిగిన పన్నెండేళ్ళకు కేంద్రంలో నయా మనువాద పాలన ఆరంభమయింది.

 

53.    “ముస్లింలను వేధిస్తాము; అణిచివేస్తాము; వాళ్ళను నయా బానిసలుగా మార్చేస్తాము; డిటెన్షన్ సెంటర్లలో బంధిస్తాము అంటూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో శపథాలు చేస్తున్నవాళ్ళు ప్రస్తుతం అధికారంలో వున్నారు.

 

54.    దేశంలో సాంస్కృతిక జాతీయవాద  నియంతృత్వం కొనసాగుతున్నది. దీనికి తొలి బాధితులు ముస్లింలు.

 

55.    పునాదీ ఉపరితలం వేరుకానట్టు, రాజకీయాలు ఆర్ధికం వేరుకాదు. సాంధ్రీభూత ఆర్ధిక వ్యక్తీకరణే రాజకీయం.

 

56.    సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వాన్నే మనం సులభ భాషలో ఫాసిజం అంటున్నాం. ఇది ఇటలీలో పుట్టిన రాజకీయార్ధిక పదం. జర్మనీలో దీనిని నాజిజం అనేవారు.

 

57.    రాజ్యాధికారానికి కార్పొరేట్ శక్తిని జోడించడమే ఫాసిజం అని ఇటలీ నియంత బెనిటో ముస్సోలిని అన్నాడు. ఇందులో ఒక తిరకాసు వుందివాస్తవాన్ని ముస్సోలిని తిరగేసి చెప్పాడు. నిజానికి కార్పొరేట్ శక్తికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమే ఫాసిజం.

 

58.    “కార్పోరేషన్ అంటే రాజ్యంగా మారుతున్న పౌరసమాజం అని కార్ల్ మార్క్స్ అన్నాడు. "The Corporation is civil society's attempt to become state”.

 

59.    ఆడానీలు, అంబానీలు తమకు కావాల్సిన అభ్యర్ధిని తెచ్చుకుని అధికార పీఠం మీద కూర్చోబెట్టుకున్నారు. అభ్యర్ధి కూడ కృతజ్ఞతాభావంతో ప్రభుత్వ విభాగాలయిన శాసన, పాలన, న్యాయ వ్యవస్థల్ని కార్పోరేట్ల సేవకు అంకితం చేశారు.

 

60.    శ్రామికుల చేత ఒక ఉన్మాదంతో కార్పొరేట్లకు ఊడిగం చేయించడం ఫాసిజానికి ఆర్ధిక లక్ష్యం.

 

61.    ఇది అంత సులువుగా సాగదు. కార్పొరేట్ల ప్రయోజనాలు శ్రామికుల ప్రయోజనాలు పరస్పర విరుధ్ధంగా వుంటాయి. తిరుగుబాటు చేయకుండ కార్మికుల్ని నిలువరించడం ఫాసిజానికి చాలా పెద్ద టాస్క్. దానికోసం   మైనార్టీలను బూచీలుగా చూపించి, మెజార్టీ మతసమూహంలో ఒక ఉన్మాదాన్ని  అది నూరిపోస్తుంది. ఇది ఫాసిజానికి  సాంస్కృతిక లక్ష్యం.

 

62.    మెజారిటీ సమూహాల్లో మతోన్మాదం, మైనారిటీలపట్ల ద్వేషం, రెండూ ఫాసిజం యొక్క సారం కాదు; అవి దాని ఉప ఉత్పత్తులు; బై ప్రాడక్ట్స్.

 

63.    మెజారిటీ సమూహాల్లో  మతోన్మాదాన్ని నూరిపోస్తే అది మైనార్టీల మీద, వాళ్ల సంపద మీద దాడులు చేస్తుంది. ఉన్మాదమే మెజారిటీ మత సమూహాలకు చెందిన కార్పొరేట్ల సంపదను అపారంగా పెంచడానికి దోహదం చేస్తుంది. ఇదే ఫాసిజం చేసే అసలు ఉత్పత్తి.

 

64.    ఇంతటి కరోన కఠిన ఆర్ధిక సంక్షోభ కాలంలోనూ ఆడానీ, అంబానీ కార్పొరేట్ల సంపద విప్రీతంగా పెరిగిపోతుండదాన్ని మనం చూస్తున్నాం.

 

65.    ప్రస్తుతం అంబానీ సంస్థ రిఫైనరీ, పెట్రో కమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలికాం రంగాల్లో ఉంది.

 

66.    ఆడానీ సంస్థ విద్యుచ్చక్తి (ఉత్పత్తి, సరఫరా, పంపిణీ), ఓడ రేవులు, విమానాశ్రయాలు,వంట నూనెలు, బొగ్గు రంగాల్లో ఉంది.

 

67.    ఇప్పుడువాళ్ళు సౌరవిద్యుత్తు తదితర రంగాల లోనికి విస్తరిస్తున్నారు.

 

68.    ప్రైవేటు రంగంలోవున్న అనేక సంస్థల్ని రెండు కార్పొరేట్లు నయాన్నోభయాన్నో వరుసగా హస్తగతం చేసుకుంటున్నాయి. దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తోంది.

 

69.    పరిస్థితి స్థాయికి వెళ్ళిపోయిందంటే పార్లమెంటు చట్టాన్ని తేవాలనుకున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు   భారీ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టినా, ప్రభుత్వరంగ సంస్థను అమ్మకానికి పెట్టినా అది ఆడానీ, అంబానీల కోసమే అని అనుమానించాల్సి వస్తున్నది.

 

70.    గతంలో భారీ పరిశ్రమలు మెజారిటీ మతసమూహం చేతుల్లో వుంటే అనుబంధ పరిశ్రమలు మైనారిటీ మత సమూహాల చేతుల్లో వుండేవి. ఇదొక దామాషా ఏర్పాటు. నూతన ఆర్ధిక సంస్కరణల ప్రవేశంతో ఏర్పాటు పోయింది

 

71.    ముస్లింలు ఆర్థికంగా నిలదొక్కుకున్న రంగాల్లో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి.

 

72.    గుజరాత్ అల్లర్లకు గోధ్రా సంఘటన తక్షణ ప్రేరణ అని మనందరికీ తెలుసుఅయితే, అహ్మదాబాద్, సూరత్ లలో ఆర్ధికంగా బలపడుతున్న ముస్లింలను చూసి ఓర్వలేకపోవడం గుజరాత్ అల్లర్లకు ఒక దీర్ఘకాల కారణం.

 

73.    గతంలో మతకల్లోలాల్లో అల్లరి మూకలు మాత్రమే పాల్గొని ముస్లింల సంపదను ధ్వంసం చేసేవి. ఇప్పుడు ప్రక్రియను ఆధునీకరించారు. సిబిఐ, ఎన్ , ఇడి, ఆర్ బిఐ, ఇసిలతోపాటు సుప్రీం కోర్టును కూడ తెలివిగా వాడుతున్నారు

 

74.    అధికారికంగా నాలుగు లక్షల మందిని అనధికారికంగా పది లక్షల మందిని కరోనా బలిగొన్నది, అయిప్పటికీ కరోనాను  జాతి విపత్తుగా గుర్తించి బాధితుల్ని ఆదుకోవడానికిగానీ, మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని ఇవ్వడానికిగానీ కేంద్ర ప్రభుత్వం  సిధ్ధంగాలేదు.

 

75.    కానీ, కార్పోరేట్లకు ఏడాదికి ఒక లక్షా 25 వేల కోట్ల రూపాయల పన్ను రాయితీని ప్రకటించడానికి మాత్రం అతి ఉత్సాహాన్ని చూపుతోంది.

 

76.    వాస్తవాల నుండి సామాన్య ప్రజల దృష్టిని మళ్ళించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక జిమ్మిక్కులు చేస్తున్నది.

 

77.    ప్రపంచ కుబేరులు మనోళ్ళే అనే వీరావేశంతో ఊగిపోండి అంటుంది ఫాసిజం దేశప్రజల్ని.

 

78.    ఫాసిజం; ఆర్ధికరంగంలో తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సాంస్కృతికరంగంలో మైనారిటీ లను బలిపశువుల్ని చేస్తుంది.

 

79.    1930-40లలో జర్మనీలో యూదుల మీద జరిగినట్టే ఇప్పుడు మనదేశంలో ముస్లిం మైనారిటీల మీద అణిచివేత కొనసాగుతోంది.

 

80.    ఉదారవాద, సామ్యవాద, సామాజిక న్యాయ, ప్రజాస్వామిక విలువలు, ఆదర్శాలను సిధ్ధాంత పరంగా  తన ప్రధాన శతృవులని ఫాసిజం భావిస్తుంది.

 

81.    తాను ప్రజాస్వామిక భావాల్ని వ్యతిరేకిస్తాననిగానీ, మతసామరస్య రాజ్యాంగాన్ని రద్దు చేస్తాననిగానీ, మనువాదాన్ని రాజ్యాంగంగా తెస్తాననిగానీ బహిరంగంగా ప్రకటించే నిజాయితీ ధైర్యం  ఫాసిజానికి లేదు

 

82.    ముస్లింలు, క్రైస్తవులవల్ల భారతదేశంలో హిందూమత ఉనికికే ముప్పు రాబోతున్నదనే ఒక తప్పుడు వాదాన్ని అది ప్రచారంలో పెడుతుంది. దానివల్ల మెజారిటీ సమూహంలో మైనారిటీల మీద  ఒక ద్వేషాన్నీ, ఉన్మాదాన్ని రెచ్చగొడుతుంది.

 

83.    అలా వాళ్ళను సాంఘీక రంగంలో తనకు మద్దతుదార్లుగానూ, రాజకీయ రంగంలో తనకు ఓటు బ్యాంకుగానూ మార్చుకుంటుంది.

 

84.    పార్లమెంటరీ ఎన్నికల రంగంలో వామపక్షాలు బలహీనంగావున్నా బౌధ్ధిక రంగంలో ఇప్పటికీ మార్క్సిస్టులదే  అగ్రస్థానం. తరువాతి స్థానం  అంబేడ్కరిస్టులది

 

85.    మైనారిటీ సమూహపు ఆలోచనాపరులు బౌధ్ధిక రంగంలో తమ ఉనికిని చాటుకోవడానికి  ఎలాగూ ఫాసిస్టు శక్తులతో తలపడకతప్పదు. పనిని వారు వాళ్ళ శక్తిమేరకు ముఫ్పై ఏళ్ళుగా చేస్తూనేవున్నారు

 

86.    విషాదం ఏమంటే, మైనారిటీ సమూహపు ఆలోచనాపరులు అప్పుడప్పుడు కమ్యూనిస్టు పార్టీలు, అంబేడ్కరిస్టులతోనూ తలపడాల్సి వస్తున్నది.

 

87.    ఫాజిజం మీద మైనారిటీల మీద కొందరు మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులకువున్న ప్రస్తుత అవగాహన సమస్యను పరిష్కరించడానికి దోహద పడకపోగా అడ్డంకిగానూ మారుతోంది.

 

88.    చాలాకాలం కులాన్ని గుర్తించ నిరాకరించిన మార్క్సిస్టులు ఇప్పుడు మతాన్ని గుర్తించడానికి కూడా అవే సాకులు చెపుతున్నారు. మతాన్నే గుర్తించనపుడు మతతత్వ నిరంకుశత్వాన్ని ఎలా గుర్తిస్తారూ? దాని మీద ఎలా పోరాడుతారూ?

 

89.    కొందరు అంబేడ్కరిస్టులు కూడ మతాన్ని ఒక విడి అస్తిత్వంగా చూడడానికి నిరాకరిస్తున్నారు.

 

90.    దేశంలో ప్రస్తుతం ఫాసిస్టు వ్యవస్థ నడుస్తున్నదంటే మనసాంప్రదాయ మార్క్సిస్టులు అంగీకరించడంలేదు. దేశాధినేతలు క్లీన్ షేవ్ చేసుకుని, మిలటరీ యూనిఫాం వేసుకుని, హిట్లర్ మీసాలు తగిలించుకుంటేనేగానీ దేశంలో ఫాసిస్టు పాలన వచ్చిందని ప్రకటించలేం అంటున్నారు.

 

91.    కొందరు కమ్యూనిస్టు ఆలోచనాపరులు ఫాసిజాన్ని వ్యతిరేకిస్తూ   తరచూ అనేక వ్యాసాలు రాసి ప్రచురిస్తుంటారు. అయితే, అవేమీ వాళ్ళపార్టీలైన్ కావు. అవి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.

 

92.    కొందరు అంబేడ్కరిస్టుల  రచనల్లోబ్రాహ్మణీయ హిందూ ఫాసిజం వంటి పదబంధాలు మనకు తరచూ  కనిపిస్తుంటాయి. అయితే, హిందూకు వ్యతిరేక శిబిరంమైనారిటీలు అని ఒప్పుకోవడానికి వాళ్ళు సిధ్ధంగా లేరు.

 

93.    ఇప్పుడున్నది ఫాసిస్టు వ్యవస్థ అని కమ్యూనిస్టు పార్టీలు  గుర్తిస్తే వాటి  కార్యక్రమం, వ్యూహాలు, ఎత్తుగడలు, ఐక్యసంఘటనలు మొత్తం సమూలంగా మారిపోయివుండేవి. కానీ దురదృష్టావశాత్తు అలా జరగడంలేదు

 

94.    మైనారిటీల సమస్యను చేపడితే తమకు హిందూ మద్దతుదారులు దూరమైపోతారనే భయం కూడ కమ్యూనిస్టు పార్టీల్ని వెంటాడుతోందేమో అనిపిస్తోంది.

 

95.    ముస్లింల ఆందోళనని గుర్తించడానికి కొందరు అంబేడ్కరిస్టులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ  హిందూ అస్తిత్వం కూడ దీనికి ఒక కారణం కావచ్చు.

 

96.    హిందూ బిసీ సమూహాల్లో ఇటీవల హిందూ మత అస్తిత్వం అతిశయిస్తున్న పోకడలు కనిపిస్తున్నాయి. కాషాయ కరసేవకుల్లో అత్యధికులు వెనుకబడిన తరగతులకు చెందినవారే.

 

97.    సందర్భంగా మతం గురించి కార్ల్ మార్క్స్ అభిప్రాయాల్ని  ఒకసారి పరికించడం అవసరం

 

98.    కులం గురించీ, మతం గురించి మార్క్స్ చాలా తక్కువ రాశాడన్నది వాస్తవం. వాటి మీద రాసిన  నాలుగు వాక్యాల్లోను చాలా లోతైన విషయాలు చెప్పాడు.

 

99.    వర్గ సమాజంలో మతం వుండాల్సిన భౌతిక అవసరాన్ని మార్క్స్ గొప్ప కవితాత్మకంగా వివరించాడు. పీడితులు, నిస్సహాయులకు మతం ఓదార్పు, నిట్టూర్పు, లేపనం, హృదయం, మనసు అన్నాడు. మన మిత్రులకు అవేవీ గుర్తుండవు; మతంమత్తుమందు అనే మాటతప్ప. దాన్నీ మనం సరిగ్గా అర్ధం చేసుకోలేదు. అదొక మత్తు; అదొక మందు అనే అర్ధంలో పదాన్ని వాడాడాయన.

 

100.  వర్గ వ్యవస్థ అంతరించిపోవడం గురించి చెప్పినట్టే మతవ్యవస్థ అంతరించిపోవడం గురించి కూడ చెప్పాడు. సుదూర భవిష్యత్తులో అంతిమ కమ్యూనిస్టు సమాజం ఏర్పడిన తరువాత వర్గ సమాజానికి చెందిన సమస్త  వ్యవస్థలు అంతరించిపోతాయి కనుక అప్పుడు మతం కూడ అంతరించి పోతుందనేది మార్క్స్ అవగాహన.

 

101.  అంతేగానీ, మత విశ్వాసాలు కలిగినవాళ్ళను కమ్యూనిస్టు పార్టీల గుమ్మం తొక్కనివ్వవద్దు అని మార్క్స్ చెప్పలేదు. మన కమ్యూనిస్టులు నాస్తికవాదానికి ఎక్కువ మార్క్సిజానికి తక్కువ.

 

102.  ఉసా అనేక ఉద్యమాల్లో క్రియాశీలంగా పనిచేశాడు. అంచేత, అభిమానులు అతన్నిఉద్యమాల ఉపాధ్యాయుడుఅంటుంటారు.

 

103.  ఇంతకీ ఉద్యమం అంటే ఏమిటీ? విప్లవం అంటే ఏమిటీ? చాలా మంది పదాలను చాలా అలవోకగా మాట్లాడుతున్నారు.

 

104.  ఒక పీడిత సమూహం మీద సాగుతున్న తక్షణ పీడనను తొలగించడానికి  చేసే ప్రయత్నమే ఉద్యమం.

 

105.  సమస్త పీడిత సమూహాల మీద సాగుతున్న సమస్త  పీడనల్ని తొలగించి వాళ్ళకు విముక్తిని కలిగించగలిగితే అది విప్లవం అవుతుంది.

 

106.  సమాజాన్ని పాక్షికంగా మారిస్తే అది ఉద్యమం. సమాజాన్ని సంపూర్ణంగా మారిస్తే అది విప్లవం.

 

107.  మార్చడం అనేది గతితార్కిక చారిత్రక భౌతికవాదంలో తొలి ఆదేశం.

 

108.  1845 నాటిజర్మన్ ఐడియాలజీ గ్రంధంలో లుడ్విగ్ ఫోయెర్ బా మీద కార్ల్ మార్క్స్ పదకొండు అంశాల నోట్స్ ఒకదాన్ని రాశాడు. అందులో చివరిది; “తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ చేయాల్సింది ప్రపంచాన్ని మార్చడం అనేది

 

109.  “The philosophers have only interpreted the world, in various ways. The point, however, is to change it”.

 

110.  ఒకవిధంగా రెండు వాక్యాల్ని కార్ల్ మార్క్స్ మొత్తం ఉపదేశాల సారం అనవచ్చు. 1883లో మార్క్స్ చనిపోయాక లండన్ హైగేట్ శ్మశానంలో అతని సమాధి మీద ఫ్రెడెరిక్ ఏంగిల్స్ రెండు వాక్యాల్నే రాయించాడు.

 

111.  సమాజాన్ని మార్చాలంటే  ముందు మనం సమాజాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే సమాజ నిర్దిష్ట స్వభావాన్ని బట్టే పరిష్కారాలుంటాయి.

 

112.  వందేళ్ళయినా మన దేశంలో విప్లవం ఎందుకు విజయవంతం కాలేదని? కమ్యూనిస్టు అభిమానులు తరచూ ఆవేదనతో ఆడుగుతుంటారువిప్లవం నిరంతరం వాయిదా పడుతూ ఉండడానికి ప్రధాన కారణం ఏమంటే; మన కమ్యూనిస్టు పార్టీల్లో ఒక్కటి కూడ ఇప్పటి వరకు భారత సమాజాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోలేదు. అంబేడ్కరిస్టుల పరిస్థితీ అంతే.

 

113.  అందరూ పాక్షిక అంశాల మీద పాక్షిక పోరాటాలు చేస్తున్నారు. ఇలా పరిమిత పోరాటాలు, ఉద్యమాలు నడిపేవాళ్ళు    ఒక దశ తరువాత ప్రధాన స్రవంతిలో కలిసిపోతారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే), లోక్ జనశక్తి పాశ్వాన్ చాలా కాలంగా   ఎన్డీఏ ఆశ్రయంలో వున్నారు.

 

114.  ఉసా కరోనాతో చనిపోయాడు. చనిపోవడానికి పది రోజుల ముందుమాస్టర్ కీ న్యూస్ ఛానల్ ప్రారంభ సభలో మాట్లాడుతూ, మన సమాజానికి ఏనాడో కరోనా సోకిందన్నాడు.

 

115.  “మెడికల్ కరోనాకన్నా సోషల్ కరోనా చాలా ప్రమాదకరమైనది అన్నాడు.

 

116.  కరోనా సోకినపుడు కొందరు దాన్ని జలుబు అనుకుంటారు. కొందరు దగ్గు అనుకుంటారు. కొందరు జ్వరం అనుకుంటారు. ఇంకాస్త లోతుకు వెళ్ళినవాళ్ళు  దాన్ని శ్వాసకోశ సమస్యగా గుర్తిస్తారు. అది కూడా సరిపోదు. రోగుల వయస్సు, వాళ్ళకు ఇంతకు ముందేవున్న బిపి, డయాబెటిక్, ఆస్థమా-సివోపిడి, హార్ట్, లివర్, కిడ్నీస్ సంబంధిత వ్యాధులన్నింటినీ సమగ్రంగా డయాగ్నైజ్ చేసిన వైద్యుడు మాత్రమే సరైన మందును ప్రిస్క్రైబ్  చేయగలడు. రోగాన్ని నయం చేయగలడు.

 

117.  సమాజాన్ని డయాగ్నైజ్ చేసే సమయంలోనూ ఇంతటి సమగ్రత అవసరం. దురదృష్టావశాత్తు మన సోషల్ సైంటిస్టుల్లో చాలామందికి ఇలాంటి సమగ్ర దృష్టిలేదు. తాము చూసిందే అంతిమ సత్యం అనుకుంటున్నారు. చూడాల్సింది ఇంకా చాలా వుంటుందనే ఆలోచన చేయడంలేదు.

 

118.  ఒక ప్రత్యేక చారిత్రిక పరిస్థితుల్లో, మార్క్స్ ఆర్ధిక అంశాల్నీ, అంబేడ్కర్ కుల అంశాన్ని నొక్కి చెప్పారు. అంతమాత్రాన మార్క్స్ ఆర్ధికేతర అంశాల్నీ, అంబేడ్కర్ కులేతర అంశాల్నీ పూర్తిగా నిరాకరించారని తీర్మానించడం అంటే చరిత్రను అడ్డంగా వక్రీకరించినట్టే.

 

119.  ఇప్పుడు కరోనాను అర్ధం చేసుకోవడంలో మనం చేస్తున్న తప్పుల్నే ఒక శతాబ్ద కాలంగా భారత సమాజం విషయంలో  అనేకులు చేస్తున్నారు.

 

120.  సమాజ కరోనాను ఒకరు వర్గంతో సరిపెడుతున్నారు. మరొకరు కులంతో సరిపెడుతున్నారు. ఇంకొకరు మతంతో సరిపెడుతున్నారు. కొందరు జాతితో, మరొకరు తెగ, ఇంకొక్రు లింగం మరొకరు మరొకదానితో సరిపెడుతున్నారు. ఇలా ఎవరికి వారు సమాజ లక్షణాలు, నియమాలని సింగిల్ పాయింట్ ఫార్మూలాగా మార్చేశారు.

 

121.  మన మెదళ్ళు చిన్నవైనంత మాత్రాన సమాజం చిన్నదైపోదు. సమాజ రుగ్మతల్ని ఒక సమాహారంగాఒక సిండ్రోమ్ గా అర్ధం చేసుకోవాలి.

 

122.  మైనారిటీలు, జాతుల సమస్యల్ని అర్ధం చేసుకోవడానికి మేధోరంగంలో ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్న అంశం (bone of contention) వర్గం.

 

123.  కుల, మత, జాతి తదితర అస్తిత్వ అంశాలువర్గ ప్రమాణాల్లో ఇమడవనే అభిప్రాయం చాలా మంది మార్క్సిస్టుల్లో ఇప్పటికీ చాలా బలంగావుంది.

 

124.  అమాయకత్వంతోనో, పరిమిత జ్ఞానంతోనో వాళ్ళు ఇలాంటి వాదనలు చేస్తున్నారనే అభిప్రాయం ఒకటుంది.

 

125.  కాదూ; ఒక కపటంతోనే వాళ్ళు ఇలాంటి వాదనలు చేస్తున్నారనే ఆరోపణ కూడ ఒకటుంది. తమ స్వీయ సామాజికవర్గాలకు ఇబ్బంది కలుగుతుందనే భయంతో కమ్యూనిస్టు పార్టీల నాయకులు కులమతాల్ని గుర్తించ నిరాకరించారనిది దీని అర్ధం

 

126.  బనియా-బ్రాహ్మణ  కాంబినేషన్ అలనాడు జాతీయ కాంగ్రెస్ కు నాయకత్వం వహించినట్టు, వ్యవసాయ శూద్ర కులాలు, (కమ్మ, రెడ్డి, కాపు) బ్రాహ్మణ కాంబినేషన్ కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించాయివాళ్ళ అస్తిత్వాల్లో యజమాని కులం అనేది కూడ ఒకటి.

 

127.  వాళ్ళలో కమ్యూనిస్టు చైతన్యం బలంగా పనిచేస్తున్నపుడు కుల అస్తిత్వం నిద్రావస్థలో వుంటుంది. కుల అస్తిత్వం బలంగా పనిచేసినపుడు కమ్యూనిస్టు చైతన్యం నిద్రావస్థలోనికి జారుకుంటుంది.

 

128.  కమ్యూనిస్టు పార్టీల నాయకుల్లో రెండు దశల్ని, రెండు రకాల్నీ కూడ మనం చూడవచ్చు. మినహాయింపులు ఎలాగూ వుంటాయి. వాళ్ళు యజమాని కులంలో  పుట్టినా జీవితకాలం కమ్యూనిస్టు చైతన్యంతో వుంటారు. దీనికి గొప్ప ఉదాహరణ మార్క్సిస్టు ఆదిగురువుల్లో ఒకడయిన ఏంగిల్స్ఆయన పెట్టుబడీదారుల కుటుంబంలో పుట్టాడుఅలాంటి వాళ్ళు మహాను భావులు.

 

129.  అస్తిత్వ అంశాలు చర్చకు వచ్చాక కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడిపోయాయని కొందరు బాధపడుతున్నారు. అసలు కమ్యూనిస్టు పార్టీలను బలహీనపరచడానికే అస్తిత్వ అంశాల్ని చర్చకు తెస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.   సమాజ వాస్తవికతను అర్ధం చేసుకోకూడదని కమ్యూనిస్టు పార్టీలకు ఎవరు చెప్పారూ?

 

130.  మతం అనేది కుల ప్రమాణాల్లో ఇమడదని అంబేడ్కరిస్టులుఅంబేడ్కరిస్టు-మార్క్సిస్టులు కూడ అంటున్నారు.

 

131.  గతంలో మార్క్సిస్టులు వర్గపోరాటంలో కులపోరాటం చేయాలని అన్నట్టుఇప్పుడు అంబేడ్కరిస్టులుఅంబేడ్కరిస్టు - మార్క్సిస్టులు కులపోరాటంలోనే మతపోరాటం చేయాలంటున్నారు.

 

132.  కుల అస్తిత్వాన్ని మార్క్సిస్టులు నిరాకరించినట్టు, మైనారిటీల  అస్తిత్వాన్ని అంబేడ్కరిస్టులు నిరాకరిస్తున్నారు.

 

133.  వర్గ పోరాటం అనేది పెట్టుబడీదారీ సమాజంలో ఫ్యాక్టరీ యజమానులకూ, కార్మికులకు మధ్యమాత్రమే వుంటుందని  కొందరు మార్క్సిస్టులు బలంగా వాదిస్తున్నారు.

 

134.  మరోవైపు, బలమైన  కులవ్యవస్థ వున్న కారణంగా భారత సమాజాన్ని మార్చడానికి వర్గపోరాట సిధ్ధాంతం పనికిరాదని కొందరు అంబేడ్కరిస్టులు వాదిస్తున్నారు.

 

135.  గుడ్డివాడు ఏనుగు చెవుల్ని పట్టుకుని చేటలా వున్నాయి అనడం ఏమాత్రం తప్పుకాదు. కానీ, కళ్ళున్నవాళ్ళు ఏనుగును చేట అనడం క్షమించరాని తప్పు.

 

136.  వర్గ పోరాటం పెట్టుబడీదారీ వ్యవస్థకు పరిమితమయిన అంశమని కార్ల్ మార్క్స్ ఎన్నడూ అనలేదు.

 

137.  “మనకు ఇప్పటి వరకు తెలిసిన సమాజాల లిఖిత చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే అనే ప్రకటనతో మొదలవుతుంది కమ్యూనిస్టు ప్రణాళిక.

 

138.  వేల వేల సంవత్సరాలుగా నిరాఘాటంగా వర్గపోరాటం కొనసాగుతున్నదని ఆయన తొలి వాక్యంలోనే ప్రకటించాడు.

 

139.  కమ్యూనిస్టు ప్రణాళికలో రెండో వాక్యం ఏమిటీ? “స్వతంత్రుడు - బానిస, కులీనుడు-సామాన్యుడు, ప్రభువు-భూదాసుడు, శ్రేణి పౌరుడు-చేతిపనివాడు ….. ఒక్క ముక్కలో చెప్పాలంటే పీడకుడు-పీడితుడు నిరంతరం ఒకరికొకరు ప్రత్యర్ధులుగా నిలబడి ఎడతెగకుండ ఒకప్పుడు ప్రఛ్ఛన్నంగానూ మరోకప్పుడు బహిరంగంగానూ, ప్రతిసారీ కూడ మొత్తం సమాజపు విప్లవకరమైన   పునర్ నిర్మాణంతోనో లేదా కలహవర్గాల సమిష్టి నాశనంతోనో పరిసమాప్తమొందే పోరాటాన్ని సాగిస్తూ వచ్చారు అంటుంది వాక్యం. ఇదీ వర్గపోరాటాల నేపథ్యం.

 

140.  భాగవతంలో బాలకృష్ణుని నోటిలో యశోద విశ్వాన్ని దర్శించినట్టు అర్ధం చేసుకునేవారికీ, అన్వయించుకునే వారికి కమ్యూనిస్టు ప్రణాళికలోని తొలి రెండు వాక్యాల్లోనే వర్గం విశ్వరూపం కనిపిస్తుంది.

 

141.  వర్గం, వర్గపోరాటాలు సర్వకాల సర్వావస్థల్లో వుంటాయి. వర్గం సర్వాంతర్యామి. Omnipresent.

 

142.  వర్గపోరాటం గురించి మార్క్స్ కొన్ని నిర్ధిష్ట ఉదాహరణల్ని చెప్పి ఊరుకోలేదు. పరిమిత జ్ఞానం కలవారి సౌకర్యార్ధం అమూర్తంగా  ‘పీడకుడు-పీడితుడు అని కూడ చెప్పాడు. కులానికి, మతానికి, జాతులకు, తెగలకు, లింగానికే కాదు ఎక్కడయినా సరే అమూర్త సూత్రాన్ని అన్వయించుకోవచ్చు.

 

143.  వైద్య ఆరోగ్య వ్యయస్థలో జనరల్ ఫిజీషియన్లతో పాటూ, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, వగయిరా వగయిరా స్పెషలిస్టులు అనేకులు వుంటారు.

 

144.  సమాజశాస్త్రంలోనూ అంతే. జోతిబా ఫూలే శూద్ర స్పెషలిస్టు. బీఆర్ అంబేడ్కర్ కుల స్పెషలిస్టు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింల స్పెషలిస్టు. కొమురం భీం ఆదివాసుల స్పెషలిస్టు. మరొకరు వుమెన్ స్పెషలిస్టు. అలా ప్రతి సామాజిక సమూహానికి కొందరు స్పెషలిస్టులు వుంటారు. మొత్తం సమాజాన్నిమార్చాలనుకునేవాళ్ళు ఒక జనరల్ ఫిజీషియన్ లా ఒక సమగ్ర దృక్పధాన్ని కలిగి వుండాలి.

 

145.  కులవ్యవస్థ అయినా, మత వ్యవస్థ అయిన సారాంశంలో వర్గ వ్యవస్థలే. అసలు వ్యవస్థ అంటేనే అందులో వర్గం వుందని అర్థం.

 

146.  మానవ సమూహాల మధ్య వైరుధ్యాల సారాంశం వర్గమే అనే విషయంలో బాబాసాహెబ్ కు కూడ అభ్యంతరం లేదని నా అభిప్రాయం.

 

147.  “కులం అనేది శ్రమ విభజన మాత్రమేకాదు శ్రామికుల విభజన Caste is not just a division of labour, it is a division of labourers” అన్నాడు బాబాసాహెబ్. కులానికి అంబేడ్కర్ ఇచ్చిన నిర్వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే అందులో వర్గ నియమం కనిపిస్తుంది. ఆయన శ్రామికుల గురించే మాట్లాడుతున్నాడు.

 

148.  సమస్యల్ని వర్గ నియతివాదం (Class determinism) దిశగా లాక్కొనిపోవడం మరో తప్పిదం అవుతుంది. వర్గ వైరుధ్యం పరిష్కారం అయ్యాక సమస్త వైరుధ్యాలు పరిష్కారం అవుతాయంటే కుదరదు. దానికోసం అస్తిత్వ సమూహం ఒక శతాబ్ద  కాలం ఆగదు.

 

149.  రిజర్వేషన్ల అంశం ముందుకు వచ్చినపుడు కొన్ని నక్సలైట్ గ్రూపులుకోటాలు కాదు; ఎర్రకోటా కావాలీ అనేవి. అలా ఎందుకనాలీ? ఇప్పుడు కోటాలు కావాలి. రేపు ఎర్రకోటా కావాలి అనవచ్చుగా.

 

150.  ముస్లింల నెత్తి మీద తక్షణం పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా వున్నాయి. వాళ్ళకు జనాభా దామాష ప్రకారం విద్యా, ఉపాధి, చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలి. జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ సిఫార్సుల్ని అమలుచేయాలి. ముస్లింలను వేధించడానికి ఉద్దేశించిన CAA, NPR, NRC తదితర చట్టాలను రద్దు చేయాలి.

 

151.  మార్క్సిస్టు మెథడాలజీని తమ సమాజపు ప్రత్యేక పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించడం వల్లనే రష్యాలో లెనిన్, చైనాలో మావో, వియత్నాంలో హో చి మిన్   తమ దేశాల్లో స్వల్ప కాలంలోనే విప్లవాలను విజయవంతం చేయలిగారు.

 

152.  అలాంటి సృజనాత్మక అన్వయం భారత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలకు చేతకాలేదు. కొన్నాళ్ళు రష్యాను ఇంకొన్నాళ్ళు చైనాను కాపీ కొడుతూ బతికేస్తున్నారు. వందేళ్ళలో ఆయా దేశాల్లో వంద మార్పులు వచ్చాయి. అవి మనోళ్ళకు పట్టవు.

 

153.  ఫ్యాక్టరీ వ్యవస్థలో యజమానులు, శ్రామికులు వున్నట్టు కుల వ్యవస్థలో యజమాని కులాలు, శ్రామిక కులాలు వుంటాయి. మతవ్యవస్థలో యజమాని మతాలు, శ్రామిక మతాలు వుంటాయి. తెగ వ్యవస్థలో యజమాని తెగలు శ్రామిక తెగలు వుంటాయి. జాతుల వ్యవస్థలో యజమాని జాతులు శ్రామిక జాతులు వుంటాయి.

 

154.  అలా ప్రతి వ్యవస్థలోనూ యజమాని-శ్రామిక సమూహాలు వుంటాయనే సత్యాన్ని గుర్తించి, తమ దేశ  ప్రత్యేక పరిస్థితులు, సాంస్కృతిక సాంప్రదాయాలకు  అన్వయించడానికి భారత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు తటపటాయించాయి. దానివల్ల అణగారిన కులాలకూ నష్టం జరిగింది. మైనారిటీలకు ఏకంగా ప్రాణాల మీదికే వచ్చింది.

 

155.కమ్యూనిస్టు పార్టీలు సృజనాత్మకంగా వ్యవహరించి వుంటే భారతదేశంలో హిందూసమాజం యజమాని మతసమూహం అని  మైనారిటీలు శ్రామిక మత సమూహాలు అని. ఏనాడో ప్రకటించివుండేవి.

 

156. మతానికీ, మతతత్వానికీ తేడా కూడ మనలో చాలామందికి అర్ధం కాలేదు.

 

157.  హిందూ సమాజంలో మతోన్మాదులు మూడు నాలుగు శాతానికి మించి వుండరు. అయితే, ఎన్నికల్లో వీళ్ళ ప్రభావం 37 నుండి 40 శాతం వరకు వుంటున్నది.

 

158. మూడు నాలుగు శాతం మతోన్మాదుల కోసం మొత్తం హిందూ సమాజాన్ని ఎందుకు దూరం చేసుకోవాలీ? అనేది అర్ధవంతమైన ప్రశ్న. మూడు నాలుగు శాతాన్ని మినహాయించి మిగిలిన మొత్తం హిందూ సమాజానికి దగ్గరయ్యే విధానాలను ఆచరించాలి.

 

159. హిందూ కులోన్మాదాన్ని బ్రాహ్మణీయ, బ్రాహ్మణవాదం అనీ, హిందూ మతోన్మాదాన్ని హిందూవాద, హిందూత్వ అని మనలో చాలా మంది చాలా కాలంగా వాడుతున్నాము. ఇవి మిత్రుల్ని కూడ శత్రువులుగా మార్చే పదాలు.

 

160.  మన పోరాటం మనువాదులతోనేగానీ హిందువులతోనూ, బ్రాహ్మణులతోనూ కాదు

 

161.  హిందూ కులోన్మాదాన్ని మతోన్మాదాన్ని ప్రస్తావించాల్సి వచ్చినపుడు మనువాదులు, నయా మనువాదులు అనడం అలవాటు చేసుకోవాలి.

 

162. నేను పాల్గొనే సభలు, సమావేశాల్లో ఎవరయినా హిందూ దేవుళ్ళ గురించి అవహేళనగా మాట్లాడితే నేను సహించను. మనం ఏమైనా హిందూ దేవుళ్ళతో పోరాడాలనుకుంటూన్నామా? దేవుళ్ళ పేరుతో మన మీద దాడి చేయాలనుకుంటున్న వారితో మాత్రమే మనకు పేచీ.

 

163. ముస్లింవాదం అనే పద ప్రయోగం కూడ సరైనది కాదు. ఇది హిందూవాదానికి నకలు పదం. మైనారీటీ చైతన్యం అనాలి లేదా ముస్లిం సంవాదం (Muslim discourse) అనాలి.

 

164.  ముస్లిం ఆలోచనాపరుల్లో మొదటి నుండీ కమ్యూనిజం ప్రభావం బలంగా కనిపిస్తుంది.

 

165.  తొలి భారత కమ్యూనిస్టు పార్టి 1921 అక్టోబరులో తాష్కెంట్ కొండల్లో ఏర్పడింది. దాని కార్యదర్శి మొహమ్మద్ షఫీక్.

 

166. అభ్యుదయ రచయితల సంఘం - Anjuman Tarraqi Pasand Mussanafin-e-Hind  - వ్యవస్థాపక సభ్యులు వందమందిలో 90 మంది ముస్లింలు.

 

167.  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు బందగీ ముస్లీం. పోరాటానికి థింక్ ట్యాంకుగా పనిచేసిన కామ్రేడ్స్ అసోసియేషనలో రాజ్ బహద్దూర్ గౌర్, దేవులపల్లి వేంకటేశ్వరరావు తప్ప మిగిలిన ఆలోచనాపరులందరూ ముస్లింలే.

 

168.  అయితే, ముస్లింలకు ఒక మినహాయింపు వుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ ప్రకటన ఇచ్చింది మాత్రం ముస్లింలు కాదు.

 

169.  దేశంలో సాయుధ పోరాటాన్ని చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టి 1948 ఫిబ్రవరిలో కలకత్తాలో జరిగిన రెండవ మహాసభలో తీర్మానించింది. సాయుధ పోరాటాన్ని విరమించాలని 1951 అక్టోబరు చివర్లో ఫైజ్ పూర్ లో  జరిగిన మూడవ మహాసభలో తీర్మానించింది.

 

170.   తెలంగాణలో 1946 జులై 4 సాయుధ పోరాటం ఆరంభం అయింది. 1948 సెప్టెంబరు 18 నిజాం సంస్థానం భారత్ లో విలీనం కాగానే కమ్యూనిస్టు పార్టి తెలంగాణ కమిటి నాయకుడు రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాట విరమణ ప్రకటన చేశారు.

 

171.  సాయుధ పోరాటం విషయంలో సిపిఐ కేంద్ర కమిటి తీర్మానాలకూ, సిపిఐ తెలంగాణ కమిటి తీర్మానాలకు సంబంధమేలేదు.

 

172.  కాంగ్రెసీయులయిన ముస్లింలలో కొందరు నిజాం సంస్థానాన్ని ఒక ప్రజాస్వామిక దేశంగా మార్చాలనుకున్నారు. కమ్యూనిస్టులయిన ముస్లింలురైతుకూలీ రాజ్యంను నెలకొల్పాలను కున్నారు. నిజాం సంస్థానాన్ని భారత దేశంలో ఒక రాష్ట్రంగా మార్చగానే పోరాట విరమణ ప్రకటన వచ్చింది.

 

173.  హఠాత్తుగా పోరాటాన్ని విరమించడంతో వేలాదిమంది ముస్లింలు తమ ప్రాణాల్ని కోల్పోవాల్సి వచ్చింది.

 

174.  అప్పటి నుండి కమ్యూనిస్టు పార్టి తమను ద్రోహం చేసిందనే అభిప్రాయం  ముస్లింలలో నాటుకుపోయింది.  

 

175.  నిజాం సంస్థానంలో కనీసంగా 40 వేల మంది నుండి గరిష్టంగా రెండు లక్షల మంది వరకు ముస్లింలను భారత సైన్యం చంపేసిందని పిడిఎఫ్ కూటమి (సిపిఐ) నేత   డాక్టర్ జయసూర్య తన నివేదికలో పేర్కొన్నారు.

 

176.  అంశం మీద   ప్రధాని నెహ్రు పంపించిన సుందర్ లాల్ కమిటీ కూడా డాక్టర్ జయసూర్య నివేదికను బలపర్చింది.

 

177. భారత కమ్యూనిస్టు పార్టి మూడవ మహాసభ రావి నారాయణ రెడ్డి నిర్ణయాన్ని సమర్ధించి, దాన్నే తన విధానంగా మార్చుకుని తీర్మానం చేసింది. సాయుధపోరాట పంధాను వదిలి పార్లమెంటరీ పంథాను చేపట్టింది.

 

178.  ముస్లింలేకాదు; ఎస్టీ, ఎస్సీ, బిసి, సమూహాల్లోని ఒక ప్రధాన భాగం అరవై యేళ్ళు కమ్యూనిస్టు పార్టీల్ని నమ్ముకుని వున్నాయి. తమ ప్రత్యేక తక్షణ సమస్యల్ని పరిష్కరించే ప్రత్యేక  కార్యక్రమం కమ్యూనిస్టు పార్టీల దగ్గర లేదని తేలిపోయాక ముస్లింలతోసహా సమూహాలు బయటికి పోవడం ఆరంభించాయి.

 

179. పార్టీ కార్యాలయాలు బోసిపోవడంతో అణగారిన సమూహాలను నిలబెట్టుకునేందుకు కమ్యూనిస్టులు కొన్ని ప్రయత్నాలు చేశారుగానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.

 

180.  ఉసా నాకు 1978 నుండి పరిచయం. అప్పట్లో తను తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలోని యూసిసిఆర్ఐ ఎంఎల్ (ఉక్రీ)లో వుండేవాడు. నేను కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని నక్సలైట్ గ్రూపులో వుండేవాడిని. అదే తరువాతి కాలంలో  పీపుల్స్ వార్ గా మారింది.

 

181.  మొదట్లో, ఉసా కార్యక్షేత్రం గుంటూరు జిల్లా చేనేత కార్మికులు. కొంతకాలం జనశక్తి పత్రిక కార్యాలయంలో పనిచేశాడు. తను కవి-గాయకుడు.పాటలు రాసేవాడు; పాడేవాడు. తూర్పుగోదావరి జిల్లా కుట్ర కేసులో అరెస్టయ్యి కొంతకాలం జైల్లో వున్నాడు.

 

182.  నాస్తికత్వం నుండి కమ్యూనిజానికి వచ్చినవాడు కనుక తొలి దశలోసాంప్రదాయ మార్క్సిస్టుల్లా కులాన్ని, మతాన్ని గుర్తించేవాడుకాదు. వర్గం ఒక్కటే నిలిచి వెలుగును అనేవాడు.

 

183.  ఢిల్లీ, లూధియానాలతో వ్యక్తిగత అనుబంధం కారణంగా 1984 నాటి శిక్కుల ఊచకోత ప్రభావం నా మీద బలంగా పడింది. అప్పటి నుండే నా దృష్టి మైనారిటీల సమస్య మీదకు మళ్ళింది. నయా మనువాదుల తదుపరి టార్గెట్ ముస్లింలే అనే ఒక ఆందోళన నాలో మొదలయింది.

 

184.  1985 నాటి కారంచేడు ఉద్యమంలో వ్యక్తిగత అనుభవం తరువాత నాలో మైనారిటీ అస్తిత్వం మరింతగా పెరిగింది.

185. ముస్లిం సమాజానిది  ప్రధానంగా మత సమస్య. అప్పట్లో, కుల సమస్యతో సతమత మౌతున్న పీపుల్స్ వార్ లో  నేను మత సమస్యను కూడ చర్చకు పెట్టాను. దానితో పార్టీ నాయకత్వం తీవ్ర అసహనానికి గురయ్యింది. మైనారిటీల వాదనను వినిపించడానికి  ఇంటాబయట చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 1986 నుండి నాలుగేళ్ళు ఘర్షణ కొనసాగింది.

 

186. అయితే, కమ్యూనిస్టు శిబిరంలో ముస్లింల మనోభావాల్ని ఆలకించినవారూ, ప్రోత్సహించినవారు కూడ వున్నారు. అప్పట్లో నేను రాసినసాహిత్యంలో మతతత్వం వ్యాసాన్ని త్రిపురనేని శ్రీనివాస్ ఉదయం దినపత్రికలో చాలా ప్రముఖంగా ప్రచురించాడు. అలాగే, ‘మరో జాతియోద్యమం వ్యాసాన్నిప్రజాసాహితి మాస పత్రిక సీరియల్ గా ప్రచురించింది

 

187.  మరోవైపు ఉసా కూడ 1986లోఉక్రీ నుండి బయటికి వచ్చాడు. అప్పటిఉక్రీ హైదరాబాద్ సిటీ కమిటీ 'కారంచేడు మాదిగలపై కమ్మ పెత్తందారుల దాడిఅనే మకుటంతో ఒక కరపత్రాన్ని రాసింది. దాన్ని పార్టీ అగ్ర నాయకత్వం నిలిపివేసింది. కరపత్ర రచన వెనుక ఉసా హస్తం వుంది.

 

188.  సామాజిక అస్తిత్వ సమూహాల సమస్యల మీద కమ్యూనిస్టు పార్టీల వ్యవహార శైలికి కరపత్ర వ్యవహారం ఒక గొప్ప ఉదాహరణ.

 

189.  'కారంచేడులో వ్యవసాయ కూలీల పై భూస్వాముల దాడిఅనేది కమ్యూనిస్టుల సాంప్రదాయ ప్రకటన. 'కారంచేడు దళితులపై పెత్తందారుల దాడిఅనేది కొంచెం ఉదార ప్రకటన. 'కారంచేడు మాదిగలపై పెత్తందారుల దాడిఅనేది మరికొంచెం ఉదార ప్రకటన. అంతేతప్ప,  'కారంచేడు మాదిగలపై కమ్మ పెత్తందారుల దాడిఅనడానికి మాత్రం కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం ఒప్పుకోదు. అటు మాదిగలు అన్నప్పుడు సమతుల్యత కోసం ఇటు కూడ  కులం పేరు చెప్పాలిగా అంటే  వాళ్ళు కుదరదు ఫో అంటారు.

 

190.  ముస్లీంల విషయంలోనూ ఇదే తంతు. మూకోన్మాదులు ముస్లింల మీద దాడి చేసినపుడుదాద్రీలో మూకోన్మాదుల దాడి అంటారు. లేదా, ‘దాద్రీలో ముస్లింల మీద మూకోన్మాదుల దాడి అంటారు. ‘దాద్రీలో ముస్లింల మీద హిందూ మూకోన్మాదుల దాడి అనడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోరు. అటు ముస్లిం అన్నప్పుడు సమతుల్యత కోసం ఇటు హిందూ ఆనాలికదా అని ఎవరయినా గుర్తు చేసినా అంగీకరించరు.

 

191.  1990 ఆరంభంలో దళిత రచయితలు, కవులు, మేధావుల (దరకమే) సమాఖ్య ఏర్పడిందిబిఎస్ రాములు, ఉసా, గుంటూరు లక్ష్మీనరసయ్య, ఖాదర్, నేను అందులో వ్యవస్థాపక సభ్యులం.

 

192. దాదాపు సమయంలోనే కేజి సత్యమూర్తి బయటికి వచ్చారు. మార్క్సిజంకు తోడుగా వారు అంబేడ్కరిజానికి కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఉసా తదితరులతో కలిసి సత్యమూర్తిఎదురీత పత్రికను నడిపారు.

 

193.  బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత 1993 జనవరిలో విరసంవిప్లవ సాహిత్యంలో మతతత్వం అనే అంశం మీద గుడివాడలో ఒక సదస్సు నిర్వహించింది. ఇది ఒక ఆత్మవిమర్శ ప్రయత్నం. నిజానికి ఇలాంటి ఆత్మవిమర్శల్ని విరసం వంటి ప్రజాసంఘం కాకుండా కమ్యూనిస్టు పార్టీలు చేసుకుని వుండాల్సింది.

 

194.  1994లో డెమోక్రాటిక్  ఫోరం ఫర్ దళిత్స్ అండ్ ముస్లిమ్స్ (డెఫోడమ్) ఏర్పడింది. దళిత్ముస్లీం ఐక్యత కోసం సంస్థ కొంత కాలం పనిచేసింది. అదొక మంచి ప్రయోగం.

 

195.   తరువాత ఆంధ్రప్రదేశ్  బలహీనవర్గాల సమాఖ్య వెలుగులోనికి వచ్చింది. వర్గ, కుల, మత, తెగలకు చెందిన అనేక  సంఘాల సమాఖ్య అది. అణగారిన సమూహాలతోపాటూ వాళ్ళమీద సానుకూల వైఖరిగల ఓసీలను కూడ కలుపుకున్న ప్రయోగం అది. సామాజిక రంగంలో అది మరొక ముందడుగుదానికి నేనే అధ్యక్షునిగా వున్నాను. బలహీనవర్గాల సమాఖ్య నిర్వహించిన కార్యక్రమాల్లో ఉసా తరచూ పాల్గొనేవాడు.

 

196.  వర్గంతోపాటూ కుల అస్తిత్వాన్ని కూడ  గుర్తించడంవల్ల దశలో ఉసా ఆలోచనలతో నాకు ఒక ఐక్యత వుండేది.

 

197.  మత వ్యవస్థలోనూ యజమాని -శ్రామిక వర్గ విభజన వుంటుందంటే ఉసా అప్పట్లో ఒప్పుకునేవాడుకాదు. గట్టిగా నిరాకరించేవాడు. కనుక

మేరకు మా మధ్య ఒక ఘర్షణ కూడ వుండేదిఅదొక దశ.

 

198.  మన అస్తిత్వాలే తరచూ మన జ్ఞాన పరిధిని నిర్ణయిస్తుంటాయి. తను బిసి కనుక కుల అణిచివేతను ముందుగా గుర్తించాడు. నేను ముస్లిం కనుక సహజంగానే మత అణిచివేతను మిగిలినవాళ్ళకన్నా ముందుగా గమనించాను.

 

199.  బాబ్రీమసీదు కూల్చివేత వంటి సంఘటనల్ని ఖండించిన వాళ్ళలో ఉసా కూడ వున్నాడుఅది అంత వరకే. ముస్లింలు శ్రామిక మతసమూహం అనే అభిప్రాయం అప్పటికి అతనికి లేదు. తాను దాన్ని మానవహక్కుల అంశంగా మాత్రమే చూసేవాడు.

 

200. మైనారిటీల సమస్యల మీద కమ్యూనిస్టుల వైఖరి కూడ ఇదే. ముస్లింల మీద దాడి జరిగినపుడు దాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన చేస్తారు. ఒక సభ పెడతారు. కానీ, సమస్యను  పరిష్కరించే భారాన్ని భుజాలకు ఎత్తుకోరుమైనారిటీల సమస్యను పార్టీ కార్యక్రమంలో భాగం చేయరు.

 

201.  సిఏఏ, ఎన్ పిఆర్, ఎన్ ఆర్సీ లకు వ్యతిరేకంగా, షాహీన్ బాగ్ ఆందోళన పేరిట ప్రజాస్వామికమతసామరస్య భారత రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం మొదలయిందిదానిని కేవలం ముస్లింల ఉద్యమంగా బిజెపి చిత్రించింది.

 

202.  విచిత్రం ఏమంటేకాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర విపక్షాలు కూడ దాన్ని ముస్లింల ఉద్యమంగానే భావించాయి. చుట్టపుచూపుగా వెళ్ళి పలకరించి వచ్చాయిగానీ, సిఏఏ, ఎన్ పి ఆర్, ఎన్ ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక మతసామరస్య భారత రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి పిలుపు ఇవ్వలేకపోయాయి

 

203.  గుజరాత్ మారణకాండ తరువాత ఉసా ఆలోచనల్లో క్రమంగా మార్పు వచ్చింది. శ్రామిక మతాన్ని యజమాని మతం అణిచివేస్తున్నదని గమనించాడు. ఆలోచనా రంగంలో ఇది చాలా పెద్ద మార్పు.

 

204.  తరువాతి కాలంలో మా మధ్య ఒక సంపూర్ణ ఐక్యత ఏర్పడింది. అది చివరి వరకు అంటేకాషాయ కార్పొరేట్ ఫాసిస్టు వ్యతిరేక వేదిక నిర్మాణం వరకూ కొనసాగింది.

 

205.  భారత ముస్లింల అణగారిన చరిత్రను స్థూలంగా అయినా అర్ధం చేసుకోవడానికి కొన్ని చారిత్రక సంఘటనల్ని గుర్తు చేసుకోవడం అవసరం. ఇదొక ముస్లీం కేలండర్.

 

206.  1857 సెప్టెంబరు 21.  సిపాయిల తిరుగుబాటు పరాజం పాలయ్యింది. తరువాత భారత ముస్లింల జీవితాలుపరాజితుల ఆక్రందనలుగా మారాయి

207.  1947 ఆగస్టు 15.  దేశవిభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. అత్యధిక ముస్లింలు భారతదేశాన్నే మాతృదేశంగా భావించారు. పాకిస్తాన్ ప్రాంతపు ముస్లీంలు కూడ అనేకమంది ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు.

 

208.  రెండో మూడో రాష్ట్రాల్ని ముస్లింలకు పడేస్తే మిగిలిన రాష్ట్రాలన్నీ హిందువులకే వుంటాయనే ఒక పథకం ప్రకారమే బ్రిటీష్ ఇండియాను విభజించారనే వాదన ఒకటుంది. ఇది కొట్టిపడేయాల్సిన అంశం ఏమీకాదు.

 

209.  ద్విజాతి సిధ్ధాంతాన్ని ప్రతిపాదించి చర్చకు పెట్టింది ముస్లింలు కారు; నయా మనువాదులు. అయినా విభజన శిలువను ముస్లీంల భుజాల మీద మోపారు. ముళ్ళ కిరీటాన్ని ముస్లింల తలకు చుట్టారు.

 

210. 1992 డిసెంబరు 6.  మధ్యయుగాల్లో ఒక సమూహాన్ని బానిసగా మార్చుకోవడానికి గుర్తుగా వాళ్ళ జాతిచిహ్నాల (టోటెమ్స్)ను ధ్వంసం చేసేవారు. సరిగ్గా అదే పధ్ధతిలో బాబ్రీ మసీదును కూల్చివేసి మీరిక మాకు బానిసలు అని ఒక అనధికార ప్రకటన చేశారు.

 

211.  బిఆర్ అంబేడ్కర్ వర్ధంతి నాడు కార్యాన్ని తలపెట్టడంలోనూ ఒక మతలబు వుంది. ప్రజాస్వామ్యాన్నీ మతసామరస్యాన్ని పరిరక్షించే భారత రాజ్యాంగాన్ని త్వరలో రద్దు చేయబోతున్నట్టు వాళ్ళొక బలమైన హెచ్చరిక చేశారు.

 

212.  2002 ఫిబ్రవరి 27. గుజరాత్ లో ముస్లిం నరమేధం ఆరంభం. 8 వందల మంది ముస్లీంలు చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. అనధికార నివేదికలు రెండు వేల మందికి పైగా చనిపోయారని లెఖ్ఖలు వేశాయి.

 

213.  కమ్యూనిస్టుల్ని నక్సల్బరి; రివిజనిజం మీద పోరాడమంది. దళితుల్ని కారంచేడు; మనువాదం మీద పోరాడమంది. ముస్లింలను గుజరాత్; మతసామరస్యం కోసం పోరాడమంది.

 

214.  ముస్లింలు కోరుకునే సామరస్యం హిందూ సమాజంతోనేగానీ ఆరెస్సెస్

తో కాదు.

 

215.  గుజరాత్ నరమేధంలో హిందూ సమాజంలోని శ్రామిక కులాల్లో ఒక భాగం కాల్బలంగా కరసేవకులుగా పనిచేసింది

 

216.  ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెఫర్డ్ వంటి ఫూలే-అంబేడ్కరిస్టులు దీనిని సమర్ధించడానికి చిత్రమైన వాదనల్ని ముందుకు తెచ్చారు. ముస్లింలు తమను కలుపుకోకపోవడం వల్లనే ఓబిసిలు నరమేధంలో పాల్గొన్నారన్నారు. బిసి సామాజికవర్గానికి చెందిన గుజరాత్ ముఖ్యమంత్రిని సమర్ధించడానికి వారు అప్పటి నుండి అనేక కుప్పిగంతులు వేస్తున్నారు.

 

217. గుజరాత్ నరమేధం శవాల మీదనే దేశంలో పీష్వాల సామ్రాజ్య పునరుధ్ధరణకు బీజాలుపడ్డాయి.

 

218.  2014 మే 26.  దేశంలో నయా పీష్వాల పాలన ఆరంభమయింది. సమాజంలో అసహన వాతావరణం నెలకొంది. మైనారిటీల మీద మూకోన్మాద దాడులు (Lynching) పెరిగాయి. నయా మనువాదాన్ని వ్యతిరేకించే ఆలోచనాపరుల్ని వరుసగా హత్యలు చేశారు.

 

219. ఇతర అణగారిన సమూహాలు విద్య, ఉపాధి, నివాసం, వైద్యం, అధికారంలో భాగస్వామ్యం వంటివి కోరుతుంటాయి. ముస్లింలు  ప్రాణ రక్షణ కోరే పరిస్థితిలో వున్నారు

 

220.  2019 మే 30. బలహీనవర్గాల హక్కుల రద్దుల పర్వం ఆరంభం. దాన్ని ముస్లింలతోనే మొదలెట్టారుపార్లమెంటులో  ఒక పరంపరగా ముస్లిం వ్యతిరేక చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయి.

 

221.  31 జులై 2019. ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ చట్టం చేశారు. ఐపిసి సెక్షన్ 497ను 2018 సెప్టెంబరులో సుప్రీం కోర్టు రద్దు చేశాక భారతదేశంలో యుక్త వయస్సు దాటిన స్త్రీపురుషులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవచ్చు. అది నేరం కాదుపౌర తప్పిదం మాత్రమేఅది నచ్చనివాళ్ళు పౌర పరిష్కారంగా విడాకులు తీసుకోవచ్చు. విడాకులు అనేది ఒక పౌర తప్పిదానికి పౌరపరిష్కారం అని  సుప్రీంకోర్టు విడమరచి చెప్పిందికానీ, ముస్లిం పురుషులు విడాకులిస్తే మూడేళ్ళు కఠిన కారాగార శిక్ష విధించేలా చట్టం తెచ్చారు. ఏమిటీ దీని అర్ధం? ముస్లింలకు పౌరహక్కులు చెల్లవు అని వారు పార్లమెంటు సాక్షిగా ప్రకటించదలచుకున్నారు.

 

222.  5 ఆగస్టు 2019 – జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్ర హోదాను రద్దు చేశారు. దానితోపాటూ ఆర్టికల్ 370. 35 Aలనూ రద్దు చేశారు. ముస్లిం జనాభామెజారిటీగావున్న ప్రాంతం ఒక రాష్ట్రంగా వుంటే అక్కడ సహజంగానే ముస్లిం అభ్యర్ధులు  ముఖ్యమంత్రులు అవుతారు. ముస్లింలకు అవకాశం ఇవ్వకూడదు అనేదే వాళ్ళ  వ్యూహంముస్లిం జనాభా అధికంగా వున్న మరో కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. ఇప్పుడు అక్కడ కూడ ముస్లింలకు అనేక సమస్యల్ని సృష్టిస్తున్నారు.

 

223. 9 నవంబరు  2019.  అయోధ్యలోని మసీదు వివాదంలో రామమందిరానికి అనుకూలంగా సుప్రీం కోర్టు నుండి తీర్పు తెచ్చుకున్నారు.

 

224. 11 డిసెంబరు 2019 మతప్రాతిపదిక మీద  పౌరసత్వాన్ని ఇచ్చే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. అది చాలనట్టు దేశ వ్యాప్తంగా NRC  నిర్వహిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

 

225.  12 డిసెంబరు 2019 –  ఢిల్లీ షాహీన్ బాగ్ లోభారత ప్రజాస్వామిక,

మతసామరస్య రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ఆరంభం అయింది.

 

226.  పార్లమెంటు సాక్షిగా ముస్లింలను వేధిస్తున్నపుడు ఇతర సమూహాలు దాదాపు మౌనంగా వున్నాయి. ముస్లింల తరువాత రైతుల మీద వేధింపులు మొదలయ్యాయి. తరువాత కార్మికుల మీద వేధింపులు మొదలయ్యాయి. ఎస్సీ, ఎస్సీలకు ఇప్పటి వరకు వున్న రిజర్వేషన్ల మీద పునరాలోచన జరిపే ప్రతిపాదనల్ని కూడ ముందుకు తెస్తున్నారు. ఈరోజు సమస్త అణగారిన సమూహాలు ఏదో ఒక విధంగా వేధింపులకు, అణిచివేతకూ గురవుతున్నాయి.

 

227.  సంఘీయులకు వాళ్ళ రోడ్ మ్యాప్ చాలా స్పష్టంగా వుంది. వాళ్ళు గురూజీగా భావించే మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ 1939లో We, or Our Nationhood Defined అనే పుస్తకాన్నీ, 1966లో  Bunch Of Thoughts అనే మరో పుస్తకాన్ని ప్రచురించారు.

 

228.  ఇవి రెండు పుస్తకాలు సంఘీయులకు ప్రణాళీక వంటివి. వీటిల్లోనే వాళ్ళ కార్యక్రమంతోపాటు దాన్ని సాధించే రోడ్ మ్యాప్ కూడ వుంది. దేశంలో సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వం ఏర్పడానికి  బేస్ పుస్తకాల్లో వుంది.

 

229. ఎటొచ్చి సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వాన్ని ఎదుర్కోవాల్సిన అణగారిన సమూహాల వద్ద అలాంటి రోడ్ మ్యాప్ ఇప్పటికీ లేదు. అదే పెద్ద విషాదం.

 

230. వ్యవస్థ సాగించే అణచివేత కారణంగా అణగారిన సమూహాల మధ్య ఒక ఐక్యత వుంటుంది. అయితే, అణగారిన సమూహాల్లోని వైవిధ్యం కారణంగా వాళ్ళ స్వీయ సమస్యలనుబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిష్కారాన్ని ఎంచుకుంటారు.

 

231. మత వివక్షకు నిరసనగా ముస్లింలు మతసామరస్యాన్ని ఎంచుకుంటున్నారు.

 

232.  ఎస్టి, ఎస్సీ, బిసి, ఇతర మైనారిటీ సమూహాలతో ముస్లింలకు ఒక సహజ అనుబంధం (ఆర్గానిక్ కనెక్షన్ఎలాగూ వుంటుంది.

 

233.   సహజ అనుబంధం వేరు మతసామరస్యం వేరు.

 

234.  హిందూ సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య వర్ణ-కులాలతో పాటు కమ్మ, రెడ్డి, వెలమ తదితర శూద్ర-వ్యవసాయ సామాజికవర్గాలతో మతసామరస్యం ముస్లీంల తక్షణ లక్ష్యం.

 

235.  అసహన వాతావరణం అంతమయ్యి మతసామరస్య వాతావరణం ఏర్పడినప్పుడే ముస్లింల న్యాయమైన  డిమాండ్లను సాధించుకోవడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

 

236. ముస్లింలు ఒక వైపు సోదర అణగారిన సమూహాలతో కలిసి పనిచేస్తూనే, మత సామరస్యాన్ని పెంచుకుంటూనే తమన్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి కృషిచేయాలి.

 

237. మూడు కర్తవ్యాలను ఒకే సందర్భంలో నెరవేర్చే నైపుణ్యాన్ని ముస్లిం సామాజికవర్గం అలవరచుకోవాలి.

 

238.  ప్రస్తుతం హిందూ ముస్లింల మధ్య సంబంధం వర్టికల్ స్ట్రాటిఫికేషన్ గా వుంది. అంటే నిచ్చెన మెట్లుగా నిలువు విభజన వుంది. దానిని హారిజాంటల్ స్ట్రాటిఫికేషన్ గా మార్చాలి. అంటే, ఎక్కువ తక్కువ అనే అంతస్తుల విభజనగా కాకుండ సమానస్థాయి కలిగి పక్కపక్కనే వుండే వైవిధ్యభరిత సమూహాలుగా కొనసాగాలి.

 

239.  హిందూ ముస్లిం సంస్కృతుల్ని మనం మూడు విభ్గాలుగా విడగొట్టవచ్చు. సారూప్యంగల అంశాలు, స్వల్ప విభేధాలుగల అంశాలు, తీవ్ర విబేధాలు గల అంశాలు.

 

 

 

240.   సారూప్యంగల అంశాల్ని ప్రోత్సహించాలి. స్వల్ప విభేధాలుగల అంశాల్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించాలి. తీవ్ర విబేధాలు గల అంశాల్ని రెండు సమూహాలూ పక్కనపెట్టాలి. అప్పుడు మతసామరస్యం వికసిస్తుంది.

 

241.  ఇప్పుడయితే పురాణ పురుషుడు శ్రీరాముడ్ని రాజకీయాల్లోనికి లాగి ఓట్ల కోసం ముస్లీంల మీదకు ఎగదోస్తున్నారు. 50 యేళ్ళ క్రితం ఇలా వుండేదికాదు.

 

242.  1960 దశాబ్దపు ఒక సంఘటనను ఈరోజు మీతో పంచుకుంటాను. నరసాపురం కుమ్మరి వీధిలో పెద్దరామాలయం వుండేది. పట్టణంలోని హిందూ ముస్లిం వ్యాపారులు కలిసి శ్రీరామ నవమి ఉత్సవాలు జరిపేవారు. ఆలయ ప్రాంగణంలో కొన్ని రోజులు భోగంమేళం పెట్టేవారు. ముస్లిం మహిళలు చూడడానికి వీలుగా ఒకరోజు పర్దాలు కట్టి ప్రత్యేకంగా  మేళం నిర్వహించేవారు. రామాలయం ఆలయ మర్యాదల్ని పాటిస్తూ ముస్లిం మహిళలు  ప్రాంగణం లోనికి ప్రవేశించేవారు. ముస్లీం మహిళల ఘోషా సంస్కృతిని గౌరవిస్తూ రామాలయంలో పరదాలు కట్టేవారు. అలాంటి మతసామరస్యానికి మనం మళ్ళీ ప్రాణం పోయాలి.

 

243.  దర్గాలలో  ముస్లీంల కన్నా హిందువులు ఎక్కువగా కనిపిస్తుంటారు. సాంప్రదాయాన్ని మరింతగా ప్రోత్సహించాలి.

 

244.  ఇన్ని విషయాలను చెప్పినపుడు మైనారిటీల టెర్రరిజం గురించి కూడ చెప్పాల్సిన అవసరంవుంది.

 

245. టెర్రరిజం అనేది ఏదేశంలో అయినా మెజారిటీ సమూహాల ప్రయోజనాలను నెరవేర్చడానికి మాత్రమే వుపయోగపడుతుంది.

 

246.   పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్ లలో మనం చూస్తున్నది మెజారిటీ టెర్రరిజం.

 

247.  న్యాయస్థానాలు కూడ మాలెగావ్ బాంబు పేలుడు కేసులో  సాధ్వీ పజ్ఞాసింగ్ ఠాకూర్ ను, మక్కా మసీదు, సంఝోత ఎక్స్ ప్రెస్ కేసుల్లో స్వామీ ఆసీమానంద వంటివారిని జీవకారుణ్య ప్రాతిపదిక మీద విడిచిపెడతాయి.

 

248.  దేవుడు కూడ మెజారిటీ సమూహాల టెర్రరిజాన్ని ఆశీర్వదిస్తాడు. తన మీద కేసు పెట్టిన యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే తన శాపం తగిలి చనిపోయాడని ప్రకటించడం సాధ్వీ పజ్ఞా సింగ్ ఠాకూర్ కు మాత్రమే చెల్లుతుంది.

 

249.  మైనారిటీ సమూహం టెర్రరిస్టు చర్యలకు పాల్పడితే అది సమస్యను పరిష్కరించకపోగా స్వీయ సమాజానికి తీవ్ర నైతిక సంక్షోభాన్ని సృష్టిస్తుంది. న్యాయస్థానాలు దయచూపవువాళ్ళ ప్రార్ధనల్ని దేవుడు ఆలకించడు.

 

250. భారత ముస్లిం సమాజంలోనూ పెట్టుబడీదారులు వున్నారు. వాళ్ళు హిందూ పెట్టుబడీదారుల్లాగానే వ్యవహరిస్తారు. అయితే, ఒక ప్రత్యేకత

         వుంటుంది. వాళ్ళు మైనారిటీ సమూహాల్లో పెట్టుబడీదారులుగా వుంటారు. పెట్టుబడీదారీ వర్గంలో మైనారిటీలుగా వుంటారు. మేరకు ఫాసిస్టు వ్యవస్థ పెట్టే  వేధింపులకు గురవుతుంటారు.

 

251. అణగారిన సమూహాల ఉద్యమాలు బలపడినపుడు ముస్లిం పెట్టుబడీదారులు అస్తిత్వ చైతన్యంతో సహకారాన్ని అందిస్తారుగుజరాత్ అల్లర్లు, షాహీన్ బాగ్ ఉద్యమంలోనేగాక ఢిల్లీలో రైతుల ఆందోళనలోనూ ముస్లిం భద్రలోకం సహకారం కనిపించింది.

 

252.  ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్  మూడు వారాల క్రితం అంటే జులై 4 ఘాజియాబాద్ లో ఒక ఆశ్చర్యకరమైన ప్రవచనం చేశారు.

 

253. “ప్రార్ధనా రీతులు వేరయినంత మాత్రాన హిందూ ముస్లీంలు వేరుకాదు. మనందరి డిఎన్ 40 వేల సంవత్సరాలుగా వర్ధిల్లుతోంది. మైనారిటీలు అంటే మనతోపాటు జీవిస్తూ వచ్చిన మన సోదరులు. అనాదిగా కలిసివుంటున్న వాళ్ళను మళ్ళీ కలపడం ఏమిటీ?” అంటూ వారు చాలా ప్రేమను చూపారు.

 

254.  “హిందూస్తాన్ లో ముస్లింలు వుండడానికి వీల్లేదని ఎవరయినా అంటే వాళ్ళు అసలు హిందువులే కాదు. “లించింగ్ చేసేవాళ్ళు హిందూమతానికి వ్యతిరేకులుఅన్నారు.

 

255. గురూజీ గోల్వాల్కర్ వేసిన బాట నుండి మోహన్ భగవత్ తప్పుకున్నారా? ఆరెస్సెస్ లో మోహన్ భగవత్ perestroika glasnost లను చేపట్టారా? అనేంత వరకు వారి ఉపన్యాసం మీద చర్చ జరుగుతోంది.

 

256.  గురూజీ గోల్వాల్కర్ ‘We Or Our Nationhood Defined’ గ్రంధంలో హిట్లర్ నూ, నాజీజాన్నీ తెగ మెచ్చుకోవడమే కాకుండా, జర్మనీలో యూదుల ప్రక్షాళన జరిగినట్టు భారత్ లో ముస్లింల ప్రక్షాళన జరగాలని చాలా గట్టిగా ప్రతిపాదించారు.

 

257. మరీ హిందూసమాజం కూడ ఆమోదించలేనంతటి వివాదాస్పద అంశాలు వుండడంతో, ‘We Or Our Nationhood Defined’ పుస్తకాన్ని

2006లో  ఆరెస్సెస్ ఉపసంహ రించుకుంది. గోల్వాల్కర్ రాసిన మరో      గ్రంధంబంచ్ ఆఫ్ థాట్స్ లోనూ సరిగ్గా ఇలాంటి అభిప్రాయాలే వున్నాయి. కాకపోతే, కొంచెం మెరుగు పెట్టిన భాషలో వున్నాయి. పుస్తకాన్ని ఆరెస్సెస్ ఇప్పటికీ తనకు ఆదర్శంగా భావిస్తోంది.

 

258.  భౌగోళిక జాతీయవాదాన్ని గోల్వాల్కర్ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగం ప్రతిపాదించిన పౌర జాతీయవాదం  కూడ వారికి కిట్టలేదు. ఇవి రెండూ సాంస్కృతిక జాతీయ వాదాన్ని బలహీన పరుస్తాయని ఆయన ప్రగాఢ అభిప్రాయం.

 

259.  ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు హిందూ జాతీయవాదానికి ప్రధమ, ద్వితీయ, తృతీయ శత్రువులు అనేది గోల్వాల్కర్ సిధ్ధాంతం. శిక్కు, బౌధ్ధజైన మత సమూహాలు కూడ తమ మతాల్ని

వదిలి హిందూ మతంలో విలీనం కావాలని వారు ఆదేశించారు.

 

260.  ఘాజియాబాద్ ఉపన్యాసం ఎన్నికల ఎత్తుగడ కాదని మోహన్ భగత్ అన్నారు. అయినప్పటికీ ముస్లిం ఓటర్లలో కొంత భాగాన్ని బిజెపి వైపుకు మళ్ళించాలనే ఆలోచనతో ఆయన ప్రసంగం సాగిందని అర్ధం అవుతోంది.

 

261. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పరిణామాలు స్పష్టంగా కనిపించాయి. మొదటిది; ముస్లిం సమాజం గంపగుత్తగా తృణాముల్ కాంగ్రెస్ కు ఓట్లేసి పార్టి ఘన విజయానికి తోడ్పడిందిరెండోది; కమలనాధులు  గంపెడు ఆశలు పెట్టుకున్న హిందూ ఓటు బ్యాంకులో  స్పష్టమైన చీలిక వచ్చింది.

 

262.  పెట్టుబడీదారీ వ్యవస్థ బూర్జువా వర్గాన్ని ప్రోత్సహించే  క్రమంలో తనకు తెలీకుండానే బూర్జువా వర్గాన్ని నాశనం చేసే కార్మికవర్గాన్ని కూడ సృష్టిస్తుందిసరిగ్గా అలాగేసాంస్కృతిక జాతీయవాద నియంతృత్వం కూడ కార్పోరేట్లను ప్రోత్సహించే క్రమంలో తనకు తెలీకుండానే కార్పొరేట్ స్వామ్యాన్ని తన్ని తరిమే సమూహాలను కూడ సృష్టిస్తుంది.

 

263.  ఇటలీలో ముస్సోలిని సృష్టించిన బ్లాక్ షర్ట్స్  మూకకు ఫాసిజం తమకు మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తున్నదని అర్ధం అయింది. జర్మనీలో హిట్లర్ సృష్టించిన షుడ్జ్ స్టాఫెల్ (ఎస్ ఎస్) ఆకతాయిలకూ నాజిజం తమకు మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తున్నదని అర్ధం అయింది

 

264.  ఇప్పుడు మన దేశంలోనూ సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వ పోకడల మీద హిందూ సమాజంలోనే ఒక  పునరాలోచన ఆరంభం అయింది. బెంగాల్, పంజాబ్, హర్యాణాల్లోనే గాక ఉత్తరప్రదేశ్, అస్సాంలలోనూ   సూచనలు కనిపిస్తున్నాయి.

 

265.  నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సంఘీయులకు ఒక అగ్ని పరీక్ష కానున్నాయి.

 

266.  ‘ఏకాత్మతా నినాదం హిందూ సమాజంలో గతంలోలా పనిచేయడం లేదనీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ, మతతత్వ విధానాలను  హిందూ సమాజంలోని వివేకవంతులు  ఈసడించు కుంటున్నారని సంఘీయులకు అర్ధం అయింది.

 

267.  విషయాన్ని మోహన్ భగత్ కూడ తన ప్రసంగంలో పరోక్షంగా ప్రస్తావించారు. “హిందువు తప్పు చేసినపుడు  హిందువులే విమర్శిస్తున్నారు అని వారన్నారు.

 

268.  సంఘీయులు ముస్లిం ఓట్లను కోరడం చాలా మందికి నమ్మశక్యంకాని విషయం. కానీ పార్టీ ఆధారిత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి వింతలు కొత్తకాదు.

 

269.  బహుజన సమాజ్ పార్టి; బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పుట్టింది. ఉత్తరప్రదేశ్ లో  2007 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి పార్టి బ్రాహ్మణ సమాజంతో సామాజిక పొత్తు పెట్టుకుంది.

 

270.  ప్రస్తుతం బిఎస్పీలో నెంబర్ టూగా వుంటున్న సతీష్ చంద్ర మిశ్రా, లోక్ సభ, రాజ్యసభల్లో పార్టి ఫ్లోర్ లీడర్లు అందరూ బ్రాహ్మణులు.

 

271. ఉత్తర ప్రదేశ్ ఎస్సీల్లో పెద్ద భాగం ఇప్పుడు మాయావతిని నమ్మడంలేదు.  2022 అసెంబ్లీ ఎన్నికల్లో లోటును పూరించడానికి  ఆమె బ్రాహ్మణ  ఓటర్లకు గట్టిగా గాలం వేస్తున్నారు. విష్ణుమూర్తి అవతారమైన పరశురామునికి ఎత్తైన విగ్రహాన్ని కట్టిస్తామంటున్నారు. అయోధ్యలో బ్రాహ్మణ మేళా నిర్వహించడానికి సిధ్ధం అవుతున్నారు.

272.  మోహన్ భగత్ నిజంగానే దేశాభివృధ్ధి కోసం, సమాజంలో అశాంతిని తొలగించడానికి మతసామరస్యాన్నికోరుకుంటుంటే దాన్ని తప్పక ఆహ్వానించాల్సిందే

 

273.  అయితే జరుగుతున్నదేమిటీ? ఆరెస్సెస్ అధినేత ముస్లీం సద్భావన ఉపదేశాలు ఇస్తున్న కాలంలోనే కేంద్ర ప్రభుత్వం మరో వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇతర అణగారిన సమూహాలను  ఆకర్షించి, సమాజంలో ముస్లీంలను ఏకాకుల్ని చేయడానికి పావులు కదుపుతోంది. కేంద్రమంత్రివర్గం కొత్త కూర్పులో అంశం ప్రస్పుటంగా కనిపించింది.

 

274.  78 మందితో కూడిన కేంద్ర మంత్రివర్గంలో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఒక్కరే ముస్లిం. 1.3 శాతం. మైనారిటీల సంక్షేమం అతని శాఖ. అది మైనారిటీలను వేధించడానికి తప్ప సంక్షేమానికి పనికిరాదు.

 

275.  ఇంకోవైపు, సిఏఏ అమలుకు సన్నాహాలు జోరందుకున్నాయి. కరోనా తగ్గాక ఎన్ ఆర్ సి నెపంతో పెద్ద ఎత్తున ముస్లింలను డిటెన్షన్ సెంటర్లకు పంపేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

276.  ఇండియా మెయిన్ ల్యాండ్ లో ముస్లింలకు, ఈశాన్య రాష్ట్రాల్లో జాతులకు ఒక పెను  ముప్పు రాబోతున్నది. ఎదుర్కోవడానికి మనం సిధ్ధంగా వున్నామా? మనం నిజంగానే సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నామా?

 

277.  అణగారిన సమూహాలకు చెందిన ఆలోచనాపరులు అందరితోనూ ఉసా సఖ్యతగా వుండేవాడు.

 

278. ‘షాహీన్ బాగ్ ఆందోళన పేరిట సాగిన మతసామరస్య భారత రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో ఉసా చురుగ్గా పాల్గొన్నాడు. అప్పట్లో తెలంగాణలో ఏర్పడిన అనేక జేఏసిల్లో మేమిద్దరం సభ్యులుగా వున్నాం.

 

279.  క్రమంలో ఏర్పడినకాషాయ కార్పొరేట్ ఫాసిస్టు వ్యతిరేక వేదిక  తెలంగాణ విభాగంలోనూ మేమిద్దరం కీలక బాధ్యులుగా వున్నాం.

 

280. కామ్రేడ్  అంటే ఉద్యమ సహచరుడని  అర్ధం. దేశంలో మత నియంతృత్వం విజృంభిస్తున్నపుడు మనం ఒక గొప్ప కామ్రేడ్ ను కోల్పోయాం. అయితే, ఉసా ప్రాతినిధ్యం వహించిన లాల్ నీల్ హర్యాలీ ఆలోచనలు కొనసాగుతాయి

281.  మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులు, మైనారిటీవాదుల త్రివేణి సంగమం ఇప్పుడు ఒక చారిత్రక అవసరం. లాల్-నీల్-హర్యాలీ వర్ధిల్లాలి!.

 

282. ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి ముగ్గురూ కలిసినా సరిపోదు. ఉదారవాదులు, సౌమ్యవాదులు, సామాజికన్యాయవాదులూ, ప్రజాస్వామికవాదులు కూడ కలవాలి.

 

283.  దేశంలో కొనసాగుతున్న మనువాద ఫాసిజానికి వ్యతిరేకంగా అణగారిన సమూహాలన్నీ ఆత్మగౌరవ బావుటాను చేబూనడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.

 

284.  సకల వివక్షలకు వ్యతిరేకంగా ఒక మహాఆత్మగౌరవ సమీకరణ జరగాలి. అలా జరుగుతుందని ఆశిద్దాం.

 

285.  హిందూ ముస్లిం మతసామరస్యం వర్ధిల్లాలి.

 

 

లాల్ సలామ్ ! జై భీం! జై మీమ్!

లాల్-నీల్-

హర్యాలి వర్ధిల్లాలి!.

 

22 జులై 2021

No comments:

Post a Comment