Debate on Animal Farm
కర్లపాలెం భాస్కరరావుగారికి,
ఇంత వివరంగా స్పందించినందుకు ధన్యవాదాలు.
మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. కానీ ,ఆమోదించడంలేదు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో రెండు వందలకు పైగా సామాజికవర్గాలు ఉంటాయి. వీటిలో రెండు లేదా మూడు సామాజికవర్గాలకు చెందినవారే కమ్యూనిస్టు ప్రభావం బలంగా ఉన్నకాలంలో కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎందుకు అయ్యారు? అనే ఒక సామాజిక ప్రశ్నకు మీ దగ్గర సామాజికార్ధిక వివరణ ఏమైనా వుందా? ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న సామాజికవర్గాలే కమ్యూనిస్టు పార్టీలకు కూడ నాయకత్వం వహించడంలో ఉన్న హేతువేమిటి?
ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కమ్యూనిస్టు సమాజం ఏర్పడే అవకాశమేలేదు. కనీసం సోషలిస్టు సమాజం అయినా ఏర్పడిందా? అంటే అదీ జరగలేదు. అది ప్రజల లోపమా? నాయకుల లోపమా? ప్రజలు ఒకప్పుడు కమ్యూనిస్టు నాయకుల్ని అపారంగా ప్రేమించారు? వాళ్ళను గట్టిగా నమ్మేరు. పార్టీ కోసం ప్రాణత్యాగం చేయమంటే చేశారు. నాయకులేం చేశారు?
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మూడువేల మంది చనిపోయారని అంచనా. అమరవీరుల సామాజికవర్గ విశ్లేషణ ఎవరయినా చేశారా? అలాగే శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారి సామాజికవర్గ విశ్లేషణ చేశారా? అలాగే కరీంనగర్- ఆదిలాబాద్ రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారి సామాజికవర్గ విశ్లేషణ చేశారా? నాయకులకు అమరులకు మధ్య సామాజికవర్గ వైరుధ్యం ఉందని గమనించారా? ఈ తప్పులు కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం నిరంతరం చేస్తున్నపుడు ప్రజలకు తమ సామాజిక ఉనికి గుర్తుకు రావడంలో తప్పేమిటి? వచ్చి తీరాల్సిందే. మార్క్సిజం ప్రకారం సామాజిక అస్తిత్వమే మనుషుల ఛైతన్యన్ని నిర్ణయిస్తుంది. దాన్ని తప్పుపట్టడానికి కమ్యూనిస్టు పార్టీల నాయకులెవరూ?
ఫాసిజం మత వ్యవస్థలో పీడక వర్గం పక్షాన నిలిచి పీడిత వర్గాల్ని మరింతగా అణిచివేస్తుందనే సూత్రీకరణతో మీకు ఏకాభిప్రాయం వుందా? వర్తమాన భారతదేశ మత వ్యవస్థలో పీడకులు ఎవరో ? పీడితులు ఎవరో? నిర్ధారించి ఒక విధాన పత్రాన్ని విడుదల చేసే పని కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడయినా చేశాయా?
ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించిన రెండు సామాజికవర్గాలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీలుగా చీలిపోయి హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి. మీరెటువైపు? ఒకనాడు సగర్వంగా కమ్యూనిస్టులమని చెప్పుకునే సమూహం ఇప్పుడు చంద్రబాబు ప్రత్యక్షంగా ఫాసిస్టు పార్టీతో పొత్తుపెట్టుకోవాలని వత్తిడి చేస్తున్నది. మీరేమో "ఆస్తిత్వ ఉద్యమాల సుడిగుండంలో పడి కమ్యూనిస్టులకు కుల ఆధిపత్యం కట్టబెడుతున్నారు" అని 1990 ల నాటి ఆవేదనను ఇప్పటికీ మరచిపోలేని స్థితిలో వున్నారు. కమ్యూనిస్టు పార్టీల నాయకత్వపు వైఫల్యమే నేటి ఈ దుస్థితికి కారణం అని మీకు తెలీదా? పుచ్చలపల్లి సుందరయ్యగారి 'రాజీనామా' పత్రాన్ని చదవలేదా? సిపిఐ కాంగ్రెస్ ను అతిగా ప్రేమిస్తే, సిపియం జనసంఘ్ (ఆరెస్సెస్) తో అంటకాగింది నిజం కాదా?
ఈ పరిణామాల్ని జార్జ్ ఆర్వెల్ చాలా ముందుగా ఊహించాడు. వీటికి సహజ పరిణామంగా వచ్చే ఫాసిస్టు పాలనను '1984 ' నవలలో చాలా గొప్పగా రాశాడు. అందుకే ఆర్వెల్ నాకు ఇష్టం. ఆర్వెల్ ను విమర్శించడానికి వెచ్చించిన సమయాన్ని అతను హెచ్చరించిన అంశాల మీద వెచ్చించి ఉంటే కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఇంతటి దయనీయ స్థితిలో ఉండేవి కావు.
చివరగా ఒకమాట చెప్పాలి. కమ్యూనిస్టు ఆలోచనాపరులు అనుక్షణం ప్రజల్ని, పాఠకుల్ని హెచ్చరిస్తూ వచ్చారు. కమ్యూనిస్టు పార్టీల నాయకులే ప్రతి మలుపులోనూ ప్రజల్ని బలిపెడుతూ వచ్చారు. కమ్యూనిస్టు ఆలోచనాపరుల్ని వెలివేస్తూ వచ్చారు.
నేను పౌరునిగా భారతీయుడిని, సామాజికవర్గంగా ముస్లింని, తాత్వికంగా మార్క్సిస్టుని. నేను మాట్లాడే ప్రతిమాటలో చేసే ప్రతి పనిలో ఈ మూడు అంశాలు ఉంటాయి.
No comments:
Post a Comment