Sunday, 18 February 2024

George Orwell - Animal Farm (1945)

 జార్జ్ ఆర్వెల్ నవలిక - యానిమల్ ఫార్మ్స్ (1945)

     నియంతృత్త్వానికి, ఫాసిజానికి  వ్యతిరేకంగా '1984' వంటి మహత్తర  నవలను  ప్రపంచానికి అందించినప్పటికీ కమ్యూనిస్టులకు జార్జ్ ఆర్వెల్ అంటే పడదు. అందుకు  కారణం   అతను రాసిన నవలిక 'యానిమల్ ఫార్మ్ ' నవలిక. ఆ పుస్తకం విడుదల అయ్యాక ఆర్వెల్ ను  సోవియట్  రష్యా వ్యతిరేకిగానేగాక ఏకంగా కమ్యూనిజానికి వ్యతిరేకిగా భావించి విరుచుకు పడ్డారు.   నిజానికి జార్జ్  ఆర్వెల్   సోషల్  డెమొక్రాట్. అతను సామ్యవాదాన్ని ఇష్టపడతాడు; ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తాడు. మొరటు  కమ్యూనిస్టులకు సోషలిజమూ తెలీదు; ప్రజాస్వామ్యమూ తెలీదు.  వాళ్లకు ఆర్వెల్ సోషల్  డెమోక్రసీ నచ్చలేదు. అలా కమ్యూనిస్టుల అపార్ధానికి గురయిన రచయితల్లో జార్జ్ ఆర్వెల్  ఒకడు. 

రెండవ ప్రపంచ యుద్ధ విజేతగా జెవి స్టాలిన్ అనేక దేశాల్లో జేజేలు అందుకుంటున్న కాలంలో,  ఆర్వెల్ 1945  లో   'యానిమల్ ఫార్మ్' ను ప్రచురించాడు. "జంతువులన్నీ సమానం; కొన్ని జంతువులు మరింత సమానం" అనే మాట పెద్ద వివాదంగా మారింది.   

1917  నాటి అక్టోబరు విప్లవంలో  లెనిన్ తరువాత అంతటి నాయకుడు లియోన్ ట్రాట్స్కి.  పెట్రోగ్రాడ్ (సెయింట్ పీటర్స్ బర్గ్) యుద్ధ విజయంలో అతనిదే పెద్ద పాత్ర. క్రెస్తవుడయిన జార్  చక్రవర్తిని వింటర్ ప్యాలెస్ లో నేరుగా  ఎదుర్కోవడానికి  యూదుడయిన ట్రాట్క్సిని ఎంపిక చేశాడు లెనిన్.  ఆయనకు మతఘర్షణను వర్గ ఘర్షణగా మార్చడం తెలుసు. 

ఆ  తరువాత స్టాలిన్ హయాంలోనూ  రష్యన్ ప్రభుత్వంలో  ట్రాట్క్సీ నెంబర్  టు గా కొనసాగాడు. అది స్టాలిన్ కు ఇష్టంలేదు.  ప్రక్షాళన (purging ) కార్యక్రమంలో భాగంగా ట్రాట్క్సీ మీద దేశ బహిష్కరణ విధించారు. మెక్సికో వెళ్లి తలదాచుకున్నా అతన్ని   వదలలేదు. వెంటాడి చంపేశారు.  ఈ పరిణామాలు జార్జ్ ఆర్వెల్  మనసును  గాయపరిచాయి. సోషలిజం ముసుగులో   స్టాలిన్ నియంతృత్త్వాన్ని సాగిస్తున్నాడని అతనో నిర్ధారణకు వచ్చాడు. అలా పుట్టింది 'యానిమల్ ఫార్మ్'. 

ఈ పుస్తకాన్ని ఆర్వెల్  1943  నవంబరులో మొదలెట్టి  1944 ఫిబ్రవరిలో పూర్తి చేశాడు. నాజీ జర్మనీ నాయకత్వంలోని అక్షరాజ్యాల కూటమికి  వ్యతిరేకంగా ఏర్పడిన  మిత్రరాజ్యాల కూటమికి  రష్యా నాయకత్వం వహిస్తున్న రోజులవి. బ్రిటన్ లో లేబర్ పార్టీ పరపతి పెరుగుతున్న రోజులవి.  బ్రిటీష్ మేధావి వర్గం స్టాలిన్‌ను ఎంతగానో  గౌరవిస్తున్న రోజులవి. ఇలాంటి చారిత్రక సందర్భంలో ఏటికి  ఎదురీదాలని నిర్ణయించుకున్నాడు ఆర్వెల్. యానిమల్ ఫార్మ్స్ ను ప్రచురించడానికి బ్రిటీష్ పబ్లిషర్లు  నిరాకరించారు. అలాంటి ఆలోచనలు మానుకోమని సలహాలు ఇచ్చారు.  అయినా ఆర్వెల్  తన పట్టుదలను వదలలేదు.   

నిన్న జరిగింది ఈరోజు రాయడం సులువు. ఈరోజు జరిగింది ఈరోజు రాయడం కష్టం. రేపు జరగబోయేది ఈరోజు రాయడం ఒక సవాలు. అలాంటి సవాలుకు సిద్ధమయ్యాడు ఆర్వెల్. రెండవ ప్రపంచ యుద్ధం ముసుగుస్తున్న కాలంలో  'యానిమల్ ఫార్మ్'  ప్రచురించాడు. అతని జోస్యం నిజమైయింది. ఆర్వెల్  ఊహించినట్టే రష్యా సోషల్ సామ్రాజ్యవాదిగా మారింది. 1991 లో పూర్తిగా విచ్చిన్నం ఆయిపోయింది. \

రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక, ప్రచ్చన్నయుద్ధ కాలంలో యానిమల్ ఫార్మ్ బెస్ట్ సెల్లర్  గా మారింది. అనేకానేక అవార్డులు గెలుచుకుంది.   

 హాస్యం నవ్విస్తే సరిపోతుంది; వ్యంగ్యం  నవ్వించాలి వీలు చూసి కత్తితో పొడవాలి. 'యానిమల్ ఫార్మ్' శైలిపరంగా ఒక  వ్యంగ్య రచన. పైగా  ఇదొక కాల్పనిక గాధ. పాత్రలన్నీ జంతువులు పక్షులేగానీ వాటన్నింటికి మనుషుల భావోద్వేగాలు ఉంటాయి. మనిషి భాషలో మాట్లాడుకుంటాయి (anthropomorphic  animals).  

\1954 లో  హాలీవుడ్ లో యానిమల్ ఫార్మ్ ను కొంచెం తేలిక చేసి  2 -డి కార్టూన్ సినిమాగా తీశారు.  ఆ సినిమా అంతగా  ఆడలేదు. దానికి కారణం ఏమంటే పెద్దవాళ్లకు అది పిల్లల సినిమాగా అనిపించింది; పిల్లలకు అది పెద్దల సినిమాగా అనిపించింది. ఆ తరువాత కూడా 'యానిమల్స్ ఫార్మ్'   అనేకమార్లు  సినిమాలుగా వచ్చింది. విజువల్   క్యాప్చరింగ్ నటనలో ప్రపంచ మొనగాడుగా ఉన్న ఆండీ  సెర్కిస్  ( Andy Serkis)  ఇప్పుడు మళ్ళీ యానిమల్ ఫార్మ్స్ ను సినిమాగా నిర్మిస్తున్నాడు.  

క్లుప్తంగా కథ. 

1   ఇంగ్లాండ్ లోని వెల్లింగ్టన్  నగర శివార్లలో జోన్స్ అనేవాడు ఒక జంతువులశాలను నిర్వహిస్తుంటాడు. అక్కడ అనేక జంతువులు పక్షులు ఉంటాయి. దాని పేరు 'మ్యానోర్ ఫార్మ్'.  

2. జోన్స్ పిసినారి, స్వార్ధపరుడు, జంతువులను హింసిస్తుంటాడు. వాటికీ కావాల్సినంత దాణా కూడ పెట్టడు. వాటి గుడ్లను, పాలను, చివరకు మాంసాన్ని కూడా  అమ్ముకుని  విలాసాలు  అనుభవిస్తుంటాడు.

3   'ఓల్డ్  మేజర్'  అనే వృద్ధ పంది మ్యానోర్ ఫార్మ్ లోని జంతువులకు పెద్ద. 'మరో ప్రపంచం' పిలుస్తున్నట్టు ఓరోజు 'ఓల్డ్  మేజర్' కు కల వస్తుంది. ఆ కలను మిగిలిన జంతువులకు వివరించడానికి ఒక రహస్య సమావేశం పెడుతుంది. మరోప్రపంచాన్ని నిర్మించడానికి జంతువులన్నీ విప్లవించాలని చెపుతుంది.  ఆ వెంటనే చనిపోతుంది. 

4  'ఓల్డ్  మేజర్'  చనిపోయాక జయింతువులన్ని తిరగబడి జోన్స్ ను తరిమి కొట్టి 'మ్యానోర్ ఫార్మ్'ను స్వాధీనం చేసుకుంటాయి. ఈ తిరుగుబాటుకు స్నోబాల్, నెపోలియన్ అనే రెండు పందులు నాయకత్వం వహిస్తాయి.  

5   'మ్యానోర్ ఫార్మ్' పేరును  'యానిమల్ ఫార్మ్' గా మారుస్తాయి. ఏడు అంశాలతో కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంటాయి. 

రెండు కాళ్ల మీద నడిచే జీవులు మన శత్రువులు. 

నాలుగు కాళ్లపై నడిచేవి, రెక్కలు ఉన్నవి మన స్నేహితులు. 

జంతువులు బట్టలు ధరించకూడదు.

జంతువులు  మంచం మీద పడుకోకూడదు.

జంతువులు  మద్యం తాగకూడదు.

జంతువులు  ఇతర జంతువులను చంపకూడదు.

జంతువులన్నీ సమానమే 

అనేవి ఇందులోని ఆదేశాలు. 

6   'యానిమల్ ఫార్మ్'  మొదలయిన రోజు నుండే స్నోబాల్, నెపోలియన్ ల మధ్య అధికార పోటీ మొదలవుతుంది. స్నోబాల్ తెలివైనది నెపోలియన్ కపటి. 

7     'యానిమల్ ఫార్మ్' లో విద్యుత్ కొరతను అధిగమించడానికి విండ్ మిల్ నిర్మించాలని స్నోబాల్ ప్రతిపాదిస్తుంది. కపటంతో స్నోబాల్ ను జంతు వ్యతిరేకిగా చిత్రిస్తుంది నెపోలియన్. స్నోబాల్  మీద  తన పెంపుడు కుక్కలను ఉసి గొలుపుతుంది. ప్రాణాలు దక్కించుకుని స్నోబాల్ తప్పించుకుంటుంది. 

8   'యానిమల్ ఫార్మ్' లో పాతపద్ధతులన్నీ వచ్చేస్తాయి.  జంతువులన్నీ సమానమే  అనేదాన్ని జంతువులన్నీ సమానమే గానీ కొన్ని జంతువులు మరింత సమానం అని రాజ్యాంగ సవరణ చేస్తారు.  

9.   నెపోలియన్ రెండుకాళ్ళజీవులతో సామరస్యంగా ఉండడం మొదలెడతాడు (రివిజనిజం అన్నమాట ) రెండుకాళ్ళజీవులు కూడ మంచివే అనే వాదనను ముందుకు తెస్తాడు. 

10.    జోన్స్ ను మించిన నియంతగా మారిన నెపోలియన్ తన అనుయాయులు, పెంపుడు కుక్కలతో విలాసాలను ఆస్వాదిస్తుంటుంది. తిరగబడినవారిని చంపించేస్తుంటుంది . స్నోబాల్ పథకమైన విండ్ మిల్ ప్రాజెక్టును తనదిగా చెప్పుకుని దాని పూర్తి  చేయమని  ఆదేశిస్తుంది. 

11.    ఇన్ని ఘోరాలు జరుగుతున్నా మరోప్రపంచం సాకారం అవుతుందని  బాక్సర్ అనే ఓ గుర్రం, బెంజమిన్ అనే గాడిద గట్టిగా నమ్ముతుంటాయి. అవి  పగలు రాత్రి విండ్ మిల్   దగ్గర పనిచేస్తుంటాయి.  

12.     ఒకరోజు  విండ్ మిల్  దగ్గర ప్రమాదం జరిగి  బాక్సర్ తీవ్రంగా గాయపడుతుంది . పని చేయలేని బాక్సర్ ను నెపోలియన్ కబేళాకు పంపించేస్తాడు. ఆ దారుణాన్ని చూసి జంతువుల్లో తిరుగుబాటు వస్తుంది. 

13. యానిమల్ ఫారంలో ఓల్డ్ మేజర్ ఫోటోను కూడా తొలగించేస్తాడు నెపోలియన్.  యానిమల్ ఫారంలో  తొలగించేస్తాడు నెపోలియన్  ఫారంలో తన పందుల సంతతిని పెంచుకుంటాడు. 

14. ఎల్లప్పుడూ తమను పందులు మాత్రమే ఎందుకు నాయకత్వం వహిస్తున్నాయని మిగిలిన జంతువులకు సమంజసమైన  పెద్ద అనుమానం వస్తుంది. ఈ సీన్స్ లో  భారతదేశ  కమ్యూనిస్టు పార్టీల్లో కొనసాగుతున్న కుల ఆధిపత్యం గుర్తుకు వస్తుంది. 

15.   ఓ రాత్రి జంతువుల ఉత్పత్తుల అమ్మకానికి  మానవ   వ్యాపారులతో నెపోలియన్ బేరసారాలు కుదుర్చుకుని విందులు చేసుకుంటుంది. 

16.   బయట కిటికీల నుండి ఈ విందు కోలాహలాన్ని చూస్తున్న  జంతువులకు పందులే మనుషులుగా మనుషులే పందులుగా కనిపిస్తుంటాయి. తాము మోసపోయామని వాటికీ అర్ధం  అవుతుంది.

17,   పశువులశాల మళ్లీ మనుషుల చేతుల్లోనికి పోవడానికేనా  తాము కష్టపడింది పోరాడింది  ప్రాణ త్యాగాలు చేసింది అని అవి బాధపడి కుమిలిపోతాయి.

18. తరువాత ఏం జరిగి ఉంటుందో  ఊహించుకోవచ్చు 

- ఉష యస్ డానీ

జార్జ్ ఆర్వెల్ నవలిక - యానిమల్ ఫార్మ్స్ ను  ఈ కింది లింకులో ఉచితంగా  చదవవచ్చు. 

https://docs.google.com/file/d/0B-qbgH1SfSUdUWNxNFBWeHNCR3M/view?resourcekey=0-y0UaERHtE7aLaKt_cwsElg



No comments:

Post a Comment