Literature in the Fascist Phase - George Orwell 1984
ఫాసిస్టు దశలో సాహిత్యం - జార్జ్ ఆర్వెల్ 1984
ఇటీవల విజయవాడలో జరిగిన విప్లవ రచయితల సంఘం మహాసభల్లో 'ఫాసిస్టు దశలో రచనలు' అనే అంశం మీద ఒక సెషన్ నిర్వహించారు. అందులో నేను ఒక వక్తని.
"ఫాసిస్టు దశలోని రచయితలు ఐదు పనులు చేయాలి. ఫాసిజం గురించి, ఫాసిస్టుల గురించి, ఫాసిజానికి బలవుతున్న సమూహాల గురించి, ఫాసిజాన్ని ఎదురు తిరుగుతున్న సమూహాల గురించి, వీళ్లందరినీ ఏకంచేసి ఫాసిజాన్ని అంతంచేసే మార్గాల గురించి రాయాలి" అన్నాను.
అన్నింటికన్నా ముందు మనం స్పష్టం చేసుకోవాల్సిన అంశం ఒకటుంది; నియంతృత్త్వానికి ఫాసిజానికి మధ్య తేడాను తెలుసుకోవాలి.
మన దేశపు కమ్యూనిస్టు సాహిత్యంలో తరచూ ఒక లోపం కనిపిస్తూ ఉంటుంది. విప్లవ వాస్తవిక సాహిత్యం పేరిట కమ్యూనిస్టు రచయితలు పీడితులు చేసే పాక్షిక పోరాటాలను చాలా అంకిత భావంతో చిత్రిస్తుంటారు. అంతవరకు గొప్ప విషయమేగాని దీనికో పరిమితి వున్నది. ఇది ప్రాధమిక అనుభవ జ్ఞానం మాత్రమే . ఇందులో , కాల్బలం, పాత్రధారులుతప్ప సూత్రధారులు, కిరీటధారులు కనిపించరు. జనం పోరాడుతున్నారని మనకు తెలుస్తుందిగాని మొత్తం దేశవ్యాప్త పోరాట సన్నివేశం అర్ధంకాదు.
శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటానికి ప్రతీకగా భూషణం 'కొండగాలి' నవల ప్రసిద్ధి చెందింది. శ్రీకాకుళ అటవీ ప్రాంతపు ఓ గ్రామంలో గిరిజనులు తిరగబడి, కపటులు, అత్యాశాపరులైన ఓ భూస్వామిని ఓ కిరాణా కొట్టు యజమానిని కొందరు ఫారెస్టు గార్డుల్నీ చంపడం ఆ నవల కథ. కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా ఉన్న కాలంలో ఇలాంటి వందలాది కథలు మనకు వచ్చాయి. వీటిల్లో ప్రజల పోరాటాలు ఆరాటాలు వాటిపై ప్రభుత్వ దమనకాండ కనిపిస్తాయిగాని, అరుదుగా మాత్రమే స్థానిక భూస్వాములు కనిపిస్తారు. పెట్టుబడిదారులు కనిపించరు, రాజ్యాధినేతలు, దేశాధినేతలు అసలు కనిపించరు.
ఫాసిస్టు వ్యతిరేక సాహిత్యం పేరిట ఇప్పుడొస్తున్న కథల్లో పీడితులు వుంటారు. చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. ఫాసిస్టులు కనిపించరు. కనీసం ఫాసిస్టు అల్లరి మూకలు కూడా కనిపించవు. బాలనాగమ్మ కథలో పులిని చంపి గోర్లు తెమ్మంటే తిప్పడు మొండితోక తెచ్చినట్టు ఉంటాయి అవి. "ఇవేమి ఫాసిస్టు వ్యతిరేక కథలు?" అంటే సదరు రచయితలకు చాలా కోపం వస్తుంది.
ఫాసిస్టు ముస్సోలిని, నాజిస్టు హిట్లర్ బతికుండగానే 1941 లో 'ద గ్రేట్ డిక్టేటర్' సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు రాసి దర్శకత్వం వహించి తానే నటించాడు చార్లీ చాప్లిన్. అందులో బాధితుడు యూదు మంగలి ఉంటాడు, మరోవైపు, ఫాసిస్టు ముస్సోలిని, నాజిస్టు హిట్లర్ వుంటారు. అలా చాప్లిన్ మనకు ఒక దారి చూపించాడు. ఆ దారిలో మనం నడవడం లేదు; నడవడానికి భయపడుతున్నాం.
చార్లీ చాప్లిన్ ది ఒక మంచి సంప్రదాయం. కిషన్ చందర్ 'తిరిగి వచ్చిన గాడిద' కాన్సెప్ట్ కు నా వెర్షన్ గా 1983లో రాసిన "గొయ్యి'' స్ట్రీట్ ప్లే లో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, ఆరెస్సెస్ ప్రచారక్ పాత్రల్ని ప్రవేశ పెట్టాను. ఇప్పుడు ఎవరయినా 'గొయ్యి' స్ట్రీట్ ప్లే వేస్తామంటే ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు పాత్రల్ని తీసేసి జగన్, చంద్రబాబు, అమిత్ షా, నరేంద్ర మోదీ పాత్రల్ని చేరుస్తాను. నేను రాసిన అనేక వ్యంగ్య కథల్లో ఆనాటి రాజకీయ ప్రముఖులు చాలామంది ఉండేవారు.
ప్రపంచ సాహిత్యంలో నియంతృత్త్వానికి వ్యతిరేకంగా వచ్చిన నవలల్లో '1984' ముందు పీఠిన ఉంటుంది. దీనిని బ్రిటీష్ రచయిత జార్జ్ ఆర్వెల్ 1949లో రాశాడు. ఆ తరువాతి స్థానం మరో బ్రిటీష్ రచయిత ఆల్డోస్ హాక్స్లే (Aldous Huxley) 1931 లో రాసిన 'బ్రేవ్ న్యూ వరల్డ్' నవలకు దక్కుతుంది. జాక్ లండన్ 'ఉక్కుపాదం' నవల కూడా ఈ జాబితాలోకి వస్తుంది. ప్రధానమంత్రి, కేంద్ర హోమ్ మంత్రి, గౌతమ్ ఆదానీలను ముఖ్యపాత్రలుగా చేసి నవలలు రాయాల్సిన కాలం ఇది.
క్షయ రోగంతో తీవ్రంగా బాధపడుతున్న కాలంలో చనిపోతున్నాడని డాక్టర్లు చెప్పేశాక తన తన జీవిత కాలపు చివరి కోరికగా ఆర్వెల్ '1984' రాశాడు. 1949 జూన్ 8న నవల విడుదల అయింది. 1950 జనవరి 21 న ఆర్వెల్ చనిపోయాడు.
ఫాసిజానికి వ్యతిరేకంగా రచనలు చేసే వారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం '1984 '.
- ఉష యస్ డానీ
'1984' ను ఈ కింది లింకులో ఉచితంగా చదవవచ్చు.
https://www.planetebook.com/free-ebooks/1984.pdf
మనవి: 24 అంగుళాల కంప్యూటర్ స్క్రీన్ మీద, టీవీఎస్ గోల్డ్ పెద్ద కి బోర్డుతో ISM V6 ఫాంట్ ఓపెన్ చేసి ఫొనెటిక్ ఇంగ్లీషు కి బోర్డు మీద వ్యాసాలు రాయడం నా అలవాటు. నాకు ఇక్కడ హైదరాబాద్ లో తెలుగు టైపు చేయడానికి సరైన సౌకర్యం లేదు. మొబైల్ ఫోన్, ఈజీ తెలుగు యాప్ లలో కొన్ని పదాలు తప్పు పడుతున్నాయి. పైగా నా మెకానిక్ బండ చేతులతో మొబైల్ ఫోన్ కీస్ ప్రెస్ చేయడం చాలా కష్టం. ఈ పరిమితిని గమనించగలరు. వీలు చూసుకుని '1984 నవలను పరిచయం చేస్తాను.
No comments:
Post a Comment