Tuesday, 17 December 2024

Kethu Viswanatha Reddy's story 'Rekkalu' - Three-Act Play analysis

 

*కేతు విశ్వనాధ రెడ్డిరెక్కలుకథ - మూడు అంకాల విశ్లేషణ*

ఉషా యస్ డానీ

          కథకులు వేరు; విమర్శకులు వేరు అనే అసంబధ్ధపు బైనరీ ఒకటి ఇటీవల తెలుగు సాహిత్య సమూహాల్లో కొనసాగుతోంది. దీనికి పరిష్కారంగా నేరుగా కథకుల్నే ఒకచోట కూర్చోబెట్టి ఇతర కథకుల కథల్ని సమీక్షించమనడం మంచి ఆలోచన. ‘కథాంతరంగం – 2024’ పేరిట ఖమ్మం ఈస్థటిక్స్ సంస్థ ఇలాంటి వినూత్న ప్రక్రియను చేపట్టింది. ఇదొక మంచి పరిణామం.

          దాదాపు 30 మంది రచయితలు నాలుగు బృందాలుగా ఏర్పడి రెండు రోజులుగా (డిసెంబరు 14,15) 5 క్లాసిక్ తెలుగు కథల మీద చర్చించారు.   చర్చల సారాంశాన్ని నాలుగు బృందాల నుండి నలుగురు ప్రతినిధులు సమర్పించారు. వీరుగాక, మరి కొందరు సీనియర్ కథా సాహిత్య పరిశీలకులు కూడ ఈ చర్చల్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

        ఇప్పుడు ఆరో క్లాసిక్ తెలుగు కథగా  సుప్రసిధ్ధ రచయిత కేతు విశ్వనాథ రెడ్డి (1939, జూలై 10 - 2023, మే 22)  రాసినరెక్కలుకథను మీరందరూ పరిశీలించారు. మీ ప్రతిస్పందనను మీ ప్రతినిధులు ఈ వేదిక మీద నుండి వివరించారు. రెక్కలు’ కథకు సంబంధించిన అనేక అంశాలు, పార్శ్వాలు, సూక్ష్మాలను పోలింగ్ డ్యూటీలో  తమ స్వీయ అనుభవాలను కూడ కలిపి  వారు ప్రస్తావించారు.  కేతు విశ్వనాథ రెడ్డి కథల్లో ప్రత్యేకంగా వినిపించే కథకుని కంఠధ్వని (tone) గురించి కూడ రావులపాటి సీతారాం గుర్తు చేశారు. గంటన్నరకు పైగా సాగిన ప్రక్రియను సమీక్షించడం ఇప్పుడు నాకు అప్పగించిన బాధ్యత.

ఇంతకు ముందే ప్రతినిధులు, సీనియర్ సాహిత్య పరిశీలకులు ఈ కథ గురించి ప్రస్తావించిన అంశాలను నేను రిపీట్ చేయను. పునరుక్తి దోషం రాకుండా కథ నిర్మాణం గురించి మాట్లాడుతాను. ఇది అందరికీ కాకున్నా కొందరికైనా ఉపయోగకరంగా వుంటుందని ఆశిస్తాను.

కథ; ఒక సంఘటనను ఎంచుకుని దాన్ని పది కోణాల్లో  వివరిస్తుంది. నవల చాలా విస్తారమైనది. పాత్రలకు వుండే అనేక పార్శ్వాలనూ, వివిధ సందర్భాల్లో, విభిన్న చారిత్రక దశల్లో అవి  ప్రతిస్పందించిన తీరును  చిత్రిస్తుంది.

          ఇది ఒక కథ. అంటే  ఒక సంఘటన. కథా రచన గురించి మనందరికీ  తెలిసిన బేసిక్స్ రెండున్నాయి. రచయిత ఏ సంఘటన ద్వార కథను  చెప్పాడు అనేది కథాంశం. కథ ద్వార రచయిత ఏం చెప్పదలచుకున్నాడు? అనేది కథా వస్తువు. నవలకు కూడ ఈ సూత్రమే వర్తిస్తుంది. పోలింగ్ బూతులో ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న  బృందానికి ఒక రోజు కలిగిన అనుభవం ఇందులో కథాంశం. మహిళల స్వీయరక్షణ (Self defense)  ఇందులో కథావస్తువు.

          ఓ మూడు పాత్రల ద్వార ఈ కథను చెప్పాలనుకున్నాడు రచయిత.  మొదటిది; కథ చెపుతున్నవాడు. ఉత్తమ పురుష. ఆ పాత్రకు పేరులేదు. అతని  పదవి కూడా రచయిత స్పష్టంగా చెప్పలేదు. కానీ అతను అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ అని మనకు అర్థం అవుతుంది. రెండో పాత్ర   పోలింగ్ ఆఫీసర్ నాగేశ్వర రావు. మూడో పాత్ర మహిళా కానిస్టేబుల్ / హోంగార్డు పంకజం.

          జలపాతంలా జలజలా పారుతూ అగ్నికణంలా రగులుతూ ఇట్టే ఆకట్టుకునే స్వభావంతో సందడి చేస్తుంటుంది కనుక ఈ కథ ఆమె కోసమే  అనిపిస్తుంది. నిజానికి కథను పంకజం కోసం రాయలేదు. మరెవరి కోసం రాసినట్టూ?  కథలో ప్రధాన పాత్రను నిర్ధారించడానికి మనకు కొన్ని పరికరాలు ప్రమాణాలూ వున్నాయి.

సాహిత్యానికి మారకపు విలువ వున్నా లేకపోయినా ఉపయోగపు విలువ అయినా వుండాలి. సాహిత్యం మెరుగయిన సమాజ నిర్మాణానికి తోడ్పడాలి. అదే సాహిత్య ప్రయోజనం. మెరుగయిన సమాజం  అంటే కొందరికి సమసమాజం. కొందరికి కుల అణిచివేత లేని సమాజం. కొందరికి మతసామరస్యంతో మెలిగే సమాజం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు  సనాతన ధర్మాన్ని పాటించేదే మెరుగైన సమాజం. సరే, ఇదంతా కథల బహ్యాత్మక ప్రభావం.

సాహిత్యానికి సమాజాన్ని మార్చే శక్తి ఏమాత్రం వుండదు అనే వారున్నారు. కళ కళ కోసమేగానీ మధ్యలో ఈ సమాజం ఎక్కడి నుండి వచ్చిందీ? అని గడుసుగా అడిగే వారూ వున్నారు. సరే; ఎవరి ఛాయిస్ వారిది.

సాహిత్య ప్రక్రియల్లో అంతర్గత ప్రభావం ఒకటి వుంటుంది. రచన ఒక స్థితిలో ఆరంభమయ్యి అంతకన్నా మెరుగైన స్థితిలో ముగియాలి. కనీసం మెరుగైన ఆలోచనల్ని రగిలిస్తూ ముగియాలి. మూల స్థితికన్నా గమ్యస్థితి మెరుగ్గా వుండాలి. ఆరంభ స్థితికన్నా ముగింపు స్థితి వున్నతంగా  వుండాలి. కథ సాగేకొద్దీ పరిమాణం పెరగడమేగాక ఒక గుణాత్మక పరిణామం చోటుచేసుకోవాలి.  

కథలో ఇలాంటి మార్పు ఎవరిలో వచ్చింది? పంకజం ఎలా ఎంటరయ్యిందో అలాగే వెళ్ళిపోయింది. ఆమెలో మార్పు లేదు. పి వో నాగేశ్వర రావు ఎలా ఎంటరయ్యాడో అలాగే వెళ్ళిపోయాడు. అతనిలోనూ కొత్తగా వచ్చిన మార్పు లేదు. కానీ పి వో పాత్ర అలా కాదు. ఒక భయంతో మొదలయ్యి కథా క్రమంలో కొంత ధైర్యాన్ని కూడబలుక్కుంటాడు. కథలో మార్పు వచ్చింది ఈ పాత్రలోనే. అదే ప్రధాన పాత్ర. అతనిలో కలిగిన  పరివర్తనకు కారణం పంకజం. ఆమె గమనం; అతను గమ్యం.

ఆడపిల్లల్ని తల్లిదండ్రులు తమ రెక్కలతో కాపాడడం ఎల్లకాలం  సాగదు; కుదరదు. అంచేత, ఆడపిల్లల్ని తమ స్వంత కాళ్ళ మీద నిలబడేలా ప్రోత్సహించాలి  అని గ్రహిస్తాడు ఏ పి వో. ఇది గుణాత్మక మార్పు. ఇదే కథ ప్రయోజనం.

కథకు ఎంచుకున్న మూడు అంకాల (three-act play)  ఫార్మాట్ బాగుంది. మూడు అంకాలంటే ఆరంభ సన్నివేశంసంఘర్షణ -  పరిష్కారం. (Set up – confrontation – resolution). తర్కశాస్త్రంలో ప్రతిపాదన – ఖండన – పరిష్కారం (Thesis – Antithesis – Synthesis) అని వుంటాయి. అవే కళాసాహిత్య రంగాల్లో ఆరంభ సన్నివేశంసంఘర్షణ -  పరిష్కారంగా మారుతాయి.

ఆరంభ సన్నివేశం, సంఘర్షణ, పరిష్కారాల్లో దేనికి ఎంత శాతం చోటు కేటాయించాలనే సందేహాలు అక్కరలేదు. మన ఇంగితాన్ని బట్టి కొన్నింటికి  ఎక్కువ స్పేస్ కేటాయించవచ్చు. కొన్నింటికి తక్కువ స్పేస్ కేటాయించవచ్చు. వరుస క్రమం కూడ సరిగ్గా ఇలాగే వుండాలని ఏమీలేదు. ఘర్షణని ముందుకు తేవచ్చు. ఆరంభ సన్నివేశాన్ని వెనక్కి గెంటేయ వచ్చు. అవన్నీ మన సృజనాత్మకత మీద ఆధారపడి వుంటాయి. మూడు అంకాల్ని సరిగ్గా అర్ధం చేసుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. ఆ తరువాత మనకు ఇష్టమొచ్చినట్టు  వాటితో ‘మూడు ముక్కలాట’ ఆడుకోవచ్చు.

three-act play  అనగానే మనకు ప్లేటో గుర్తుకొస్తాడు. అయితే కథా నవలా నాటక సాహిత్యాల్లో  three-act playను పాటించాలని ప్లేటో ఎక్కడా చెప్పలేదు. (అప్పటికి ఇన్ని కళా సాహిత్య ప్రక్రియలు కూడ లేవు.) కానీ, తన రచనల్లో three-act play విధానాన్ని ప్లేటో పాటించాడు.  three-act playను ప్లేటో సిధ్ధాంతీకరించాడంటే ఎన్ వేణుగోపాల్ వంటివాళ్ళు ఒప్పుకోరు. రుజువుగా ప్లేటో నుండి స్పష్టమైన కొటేషన్ ఒకటి కావాలంటారు. ప్రజాస్వామ్యంలో డిసెంట్ వాయిస్ కూడ ఒకటి వుండాలిగా? వుండనిద్దాం. వాచ్యంగా వున్నా లేకపోయినా లోకంలో కొన్నింటిని మనంగా అర్ధం చేసుకోవాలి.  అంచేత చాలామంది  three-act play మీద కాపి రైట్స్ ను ప్లేటోకు ఇచ్చేశారు.

          three-act play కోసం ఇప్పుడు మీరు ప్లేటోను ప్రత్యేకించి చదవాల్సిన పనిలేదు. అంతంత హోం వర్క్ అక్కరలేదు. మనకు నచ్చిన ప్రతి రచనలోనూ పరికించి చూస్తే  మూడు అంకాల విధానం వుంటుంది. రామాయణం, మహాభారతం, భాగవతం లోనూ మూడు అంకాల నిర్మాణాన్ని చూడవచ్చు.

          శ్రీరామునికి పట్టాభిషేకం జరిపేందుకు సన్నాహాలు జరుగుతుంటాయి. అది ఆరంభ సన్నివేశం. పట్టాభిషేకాన్ని రద్దుచేసి శ్రీరాముడ్ని అడవులకు పంపుతారు అది సంఘర్షణ. రావణుడు వచ్చి సీతను ఎత్తుకు పోతాడు అది మరింత పెద్ద సంఘర్షణ. రావణుడ్ని శ్రీరాముడు వధిస్తాడు. శ్రీరాముడు ప్రతీకారం తీర్చుకున్నాడు సరే.  ఇందులో లోకకళ్యాణం కూడ వుంది. వ్యక్తిగతం కాస్తా సామాజికం అయిపోయింది. అది ఉన్నత స్థితి. అదే  పరిష్కారం.

          ‘రెక్కలు’ కథ సుఖాంతం అవుతుంది. అయితే, సుఖాంత కథల్లోనేగాక విషాదాంత కథల్లోనూ మెరుగయిన సమాజ సూచనలుంటాయి. ఉదాహరణకు గౌరీ లంకేష్ మీద కథ రాస్తే చివరకు ఆమె దారుణ హత్యకు గురవుతుంది. ఇది విషాదాంతమే. కానీ ఇలా జరక్కూడదు, మరో గౌరీ లంకేష్ చనిపోకూడదు అని పాఠకుడికి అనిపిస్తుంది. అప్పుడూ అది మెరుగైన సమాజం కోసం ఆరాటమే  అవుతుంది.

మంచి రచయితలు అసంకల్పితంగానే మూడు అంకాల నియమాలని పాటిస్తారు. రచయితలకు మూడు అంకాల నియమాల గురించిన అవగాహన వుంటే మరింత మంచి కథలొస్తాయి. అందుకే సాహిత్య విమర్శకులు మూడు అంకాల నిర్మీతిని వివరిస్తుంటారు. ఈ చట్రాన్ని కొందరు నిరాకరించవచ్చు. ఆ హక్కు ఎవరికయినా వుంటుంది. నిరాకరించడం కోసం అయినా సరే  ముందు ఈ మూడు అంకాల చట్రాన్ని అర్ధం చేసుకోవాలి.

కథ మొదటి పేరాలో, మహిళా కానిస్టేబుళ్ళు / హోంగార్డులు పివోలు ఏపివోలు   పోలింగ్ డ్యూటీలకు బయలుదేరుతారు. ఇది ఆరంభ సన్నివేశం.  రెండో పేరాలోఆడపిల్లల తండ్రిగా శంకించడం, కీడెంచడం, భయపడ్డం అలవాటయ్యాయిఅని వుంటుంది.  ఇది సంఘర్షణకు ఆరంభం. “మా అమ్మాయిలను ఇన్నాళ్ళూ కాపాడుతున్నాయనుకుంటున్న మా రెక్కలు ఎంత బలహీనమైనవో క్షణంలో తెలిసి వచ్చిందిఅని కథ ముగుస్తుంది.

ముగ్గురి వయసులకు అటూ ఇటూ వయసులున్న నా కూతుళ్ళు చెయ్యలేని పని వీళ్ళు చేస్తున్నారు. ముచ్చటేసిందిఅని రెండో పేరాలో ఒక వాక్యం వుంటుంది. వాక్యాన్ని చివరి వాక్యంతో కలిపిచూస్తే మహిళలు స్వీయ రక్షణ అలవరచుకోవాలనే అర్ధం వస్తుంది. ఇది పరిష్కారం. చేపల్ని పంచడంకన్నా చేపల్ని ఎలా పట్టాలో నేర్పించడం గొప్పది అనే మాట ఒకటుంది. ఇది అలాంటిదే.

పరిష్కారం మీద స్పష్టమైన అవగాహన వుంటే సెటప్ గా  దేన్నయినా ఎంచుకోవచ్చు. ఈ కథను పోలింగ్ బూత్ సెటప్ లో చెప్పారు. ఓ చలికాలం లంబసింగిలో క్యాంప్ ఫైర్ దగ్గర ఈ కథను ఆరంభించవచ్చు. ఓ రాత్రి పూట రైల్వేస్టేషన్ లోనో బస్ స్టాండ్ లోనో ఈ కథను ఆరంభించవచ్చు. ఓ వర్షపురాత్రి మర్రి చెట్టు కింద ఈ కథను ఆరంభించవచ్చు. మన ఊహా శక్తినిబట్టి అనుభవం అబ్వగాహనలను బట్టి ప్రపంచంలో ఎక్కడయినా ఈ కథను ఆరంభించవచ్చు. రూల్స్ ఆఫ్ ద గేమ్  తెలియాలి. అంతే. ఎంచుకున్న  పరిష్కారం దిశగా ఆసక్తికరంగా కథను నడపడమే రచయితకు ఉండాల్సిన నైపుణ్యం.

మూడు అంకాలను నిర్ణయించుకున్నాక వాటి మీద తప్పకుండా విస్తారంగా రీసెర్చ్ చేయాలి. అప్పుడు కొన్ని కొత్త కోణాలు, సున్నితమైన అంశాలు మనకు తెలుస్తాయి. అవి కథకు రక్తమాంసాల్ని అందిస్తాయి. ఈ కథ పోలింగ్ బూత్ లో జరుగుతుంది కనుక ఎన్నికల ప్రక్రియను సమగ్రంగా  అధ్యయనం చేయాలి.

ఎన్నికల్ని కొందరు పవిత్రకార్యం అనుకుంటారు. కొందరు ఉత్తడొల్ల అనుకుంటారు. మరి కొందరు ఎన్నికల్ని బహిష్కరించాలంటారు. ప్రజాస్వామ్యం బతుకుతున్నదే ఎన్నికల మీద అనే వారూ వుంటారు. మరోవైపు; ప్రజలు ఊరికే ఓట్లు వేయరు; నాయకులు వాటిని డబ్బు పెట్టి కొనుక్కుంటారు అనే వారూ వుంటారు. చివర్లో ఓ పది ఇరవై మందికి ఓట్లు వేసే అవకాశాన్ని నిరాకరిస్తే ఎన్నికల ఫలితాలే తారుమారు కావచ్చు. ఇలాంటి వన్నీ తెలుసుకోవాలి. ఈ కథ రాసే నాటికి బ్యాలెట్ పేపర్ విధానమే వుంది. ఇప్పుడు ఎలక్ట్రానికి ఓటింగ్ మిషిన్లు (EVM) వచ్చాయి. ఈ మార్పుల మీద  రచయితలు మరింతగా పరిశోధన చేయాల్సి వుంటుంది.  అప్పుడు కథలు రక్తమాసాలతో జీవాన్ని పోసుకుని తొణికిసలాడుతుంటాయి.

ఈ కథలో మహిళా కానిస్టేబుల్ ని పోలింగ్  ఆఫీసర్  గోకుతుంటాడు. ప్రజాస్వామ్యంలో అధికారాల వికేంద్రీకరణ ప్రకారం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం పోలింగ్ ఆఫీసర్ల బాధ్యత,  పోలింగ్ బూత్ ను కాపాడడం పోలీసుల బాధ్యత. అలాంటప్పుడు ఈ గోకడం దేన్ని సూచిస్తుందీ? సందర్భానుసారంగా ఏక్ తారా మీద “పుట్టి ఆ దారినే వస్తివి మరలా ఆ దారి కాశిస్తివి” అంటూ ఒక తత్త్వం వినబడుతుంటుంది. ఎంచుకున్న అంశం మీద విస్తారమైన పరిశోధన, పరిశీలన సాగించినపుడే ఇలాంటి చురకలు వేయడం రచయితలకు సాధ్యం అవుతుంది. లేకుంటే కథ రక్తమాంసాలు లేని అస్థిపంజరంలా వుండిపోతుంది.

ఈ కథ మీద చిన్న అసంతృప్తి కూడ వుంది. కేతు విశ్వనాథ రెడ్డి  రెక్కలుకథను 1991లో రాశారు.  అప్పటికే తెలుగునాట స్త్రీవాద ఉద్యమాలు వుధృతంగా సాగుతున్నాయి. ఉనికి ఉద్యమాల్లో తొలి అడుగు మహిళలదే. 1990 దశకం నాటికి తెలుగు సమాజంలోనూ, సాహిత్యంలోనూ మహిళల ఉనికి చైతన్యం బాగా అభివృధ్ధి చెందింది. అలా చూస్తే ఈ కథ వాస్తవ సమాజంకన్నా కొంచెం వెనుకబడి వుందనవచ్చు.  సాహిత్యం ఎప్పుడూ తన కాలపు సమాజంకన్నా ఒక అడుగు ముందుండాలి. రేపు జరగబోయేది సూచనగా అయినా చెప్పాలి. అయితే, ఆఫీసుల్లో, పర్క్ ప్లేసుల్లో ఈ ‘గోకడాలు’ ఇప్పుడూ వున్నాయి కనుక ఈ కథ  ప్రాసంగికత కొనసాగుతోంది అనవచ్చు.  

15 డిసెంబరు 2024

No comments:

Post a Comment