Review on Jayasree Muvva 's story NOPPI
*గొప్ప రచయిత్రి కావడానికి ప్రయత్నించు*
నీ కథ ‘నొప్పి’ ఇప్పుడే చదివాను.
ఇదొక షాక్ ట్రీట్మెంట్ కథ.
క్లుప్తంగా సూటిగా శిల్ప పరంగా బాగుంది.
అక్కడక్కడ భావోద్వేగాలను కవితాపరంగా వ్యక్తం చేయడం నచ్చింది.
వచనంలో కవిత్వం బాగుంటుంది కూడ.
“మాటలైతే మల్లెపూలకి వెన్నెలద్దుకున్నట్టే వుంటాయి”.
“శరీరానికి మాత్రమే కదా ఇంకో మనిషిని పుట్టించే శక్తి అవకాశం వుంది”.
“వొళ్ళంతా కదిలిస్తూ తంగేడు కొమ్మని దులిపినట్టు నవ్వేది”.
“ఆమె ప్రేమ, అతని మత్తు ఎవరూ ఎవరినీ జయించలేకపోయారు”.
“మాటకంటే మౌనం చాలా పదునుగా వుంటుంది”.
“ఒక్కోసారి నిశబ్దం చేసే శబ్దం వినలేనంత భయంకరంగా వుంటుంది”.
“లోపల గుండె అంతా ఎవరో తగలబెట్టినట్టు కమురు వాసన”.
“ఒంట్లో నీరు యాతం వేసి తోడినట్టు”
“ఎవరికీ కనిపించని యుధ్ధం”
“రెండు వైపులా తానే పోరాడుతోంది”.
“మత్తుకన్నా అనుమానం మనిషిని కుమ్మరి పురుగులా తొలిచేస్తుంది”.
“ఆవిరి ముద్దలా”
“మనిషి నాగుపాము కంటే ఎక్కువ విషం చిమ్ముతూ నాలుక చాపినట్టు”.
వంటి వ్యక్తీకరణలు బాగున్నాయి.
నీ వాక్యాలకు చదివించే గుణం వుంది.
“బతికే వున్నాడా? వుండాలి” అనే ముగింపు బాగుంది.
వాడు బతికుండాలి. వాడిని చూసినప్పుడెల్లా లోకం వాడు చేసిన తప్పును గుర్తుచేసుకోవాలి. మరొకడు అలాంటి తప్పుచేయడానికి భ యపడాలి.
ఇవి నీ కథలో వున్న పాజిటివ్ అంశాలు.
కథకులు ఎంపిరికల్ అనుభవం దగ్గర ఆగిపోవడం నాకు నచ్చదు.
దానితో కథల విస్తృతి మరీ చిన్నదై, వ్యక్తిగతం అయిపోతుంది.
ఇప్పుడు చాలా మంది తెలుగు కథకులు ఈ స్థాయిలోనే ఆగిపోతున్నారు.
అలా ఆగిపోవడం నేరం ఏమీకాదుగానీ, తమది అంతర్జాతీయ స్థాయి అనుకుంటున్నారు.
ఇది వాళ్ళ పెరుగుదలనేగాక, మొత్తం తెలుగు సాహిత్యం పెరుగుదలను అడ్డుకుంటుంది.
భార్య ప్రొటోగానిస్ట్ అయితే భర్త యాంటోగోనిస్టు.
ఒక ఊరు ప్రొటోగోనిస్టు అయినప్పుడు యాంటోగోనిస్టు ఎవరూ?
సమాజం ప్రొటోగోనిస్టు అయినప్పుడు యాంటోగోనిస్టు ఎవరూ?
దేశం ప్రొటోగోనిస్టు అయినప్పుడు యాంటోగోనిస్టు ఎవరూ?
ప్రపంచం ప్రొటోగోనిస్టు అయినప్పుడు యాంటోగోనిస్టు ఎవరూ?
తెలుగు రచయితలు ఇలా ప్రశ్నించుకుంటూ తమ స్థాయిని పెంచుకోవాలి.
తద్వార తెలుగు కథ స్థాయి కూడ పెరుగుతుంది.
ఓ వందేళ్ళ క్రితం సాహిత్యం పాలకులదే వుండేది. దాన్ని వ్యతిరేకిస్తూ
పాలితుల గురించి రాయాలనే సాంప్రదాయం వచ్చింది. ఇది మంచి సాంప్రదాయం. అయితే, అందులోనూ
ఒక అతివాదం వచ్చింది. పోరాటాలను చిత్రించేదే సాహిత్యం అనేవారు వచ్చారు. పోరాటం అనేది మనిషి అంతర్గ సంఘర్షణ కూడ
కావచ్చు. దాన్ని ఒక ప్రాంతానికి ఓ రెండు జిల్లాలకు కుదించడం సంకుచిత వాదం (Reductionism). అతివాద వాస్తవికవాదంవల్ల తెలుగు సాహిత్యానికి చాలా నష్టం
కూడ జరిగింది. ఇప్పుడు ధోరణి మారుతోంది.
వ్యక్తిగతంగా నాకు కూడ నష్టం జరిగింది. నాకు జానపద సాహిత్యం, మాయలు, మంత్రాల సాహిత్యం మీద కొంత పట్టుంది.
నేను పోరాట ప్రాంతానికి చెందిన వాడిని కాను. Fantasy, Folkloric and magical Traditionలోనూ పోరాట సాహిత్యం రాయవచ్చు
అనుకున్నాను. ప్రవక్త మోజెస్ ఎర్ర సముద్రాన్ని చీల్చిన సంఘటన ప్రేరణతో వేలం అనే ఒక
కథను కూడ రాశాను. కానీ అప్పట్లో దాన్ని ఆమోదించేవారుకారు. ఈ సాంప్రదాయంలో ఆఫ్రికన్లు,
లాటిన్ అమెరికన్లు గొప్ప విజయాలను సాధించారు. Gabriel García Márquez's నవల ‘One Hundred Years of Solitude’ చదివే వుంటావు. అలాగే వీలయితే Guillermo del Toro సినిమా Pan's
Labyrinth తప్పకుండా చూడు. నియంతృత్వాన్ని ఇంత ఫాంటిసీగా చెప్పడం ఒక అద్భుతం అనిపించింది.
ఇది నా అభిప్రాయం మాత్రమే.
నా అభిప్రాయం అల్టిమేట్ అని నేను ఎన్నడూ అనుకోను.
నా అభిప్రాయాన్ని ఏ వేదిక మీద అయినా ఇలాగే చెపుతాను.
మొన్న ఖమ్మం ఈస్థటిక్స్ సభలోనూ ఈమాటే అన్నాను.
నీకు నచ్చిందో లేదో నాకు తెలీదు.
కొందరికి నచ్చుతుంది; కొందరు నొచ్చుకుంటారు.
నీ కథలో కొన్ని గ్రామెటికల్ తప్పులు కనిపించాయి.
ఇలాంటి తప్పుల్ని సీనియర్లు కూడ చేస్తున్నారు.
నిజానికి వీటిని ఎవరూ పట్టించుకోవడంలేదు.
కానీ పట్టించుకుంటే చదవడానికి ఇంకా బాగుంటుంది.
… గాల్లోకి తీక్షణంగా చూస్తుంది – చూస్తోంది, చూస్తున్నది,
అరుస్తుంది – అరుస్తోంది.
పొగలు కక్కుతుంది – పొగలు కక్కుతోంది.
పోరాడుతుంది – పోరాడుతోంది.
ఏడుస్తుంది –ఏడుస్తున్నది.
సూర్యుడు ఉదయిస్తాడు – తధ్ధర్మ క్రియ.
సూర్యుడు ఉదయిస్తున్నాడు – present continuous tense
జరుగుతుంది వేరు; జరుగుతున్నది వేరు.
రెండింటికీ తేడా వుంది. గమనించు.
మరింత పెద్ద వేదిక మీద నిలబడి మాట్లాడానికి ప్రయత్నించు.
దానికి కావలసిన దినుసులు నీ దగ్గరున్నాయి. వాడుకో.
నువ్వు ఆల్రెడీ రచయిత్రివి. గొప్ప రచయిత్రి కావడానికి ప్రయత్నించు.
- డానీ
No comments:
Post a Comment