Thursday, 26 December 2024

The flood of Books

The flood of Books

*పుస్తకాలు ప్రవాహంలా వస్తున్నాయి!.*




 

*పుస్తకాలు ప్రవాహంలా వస్తున్నాయి!.*

 

ఈమధ్య ఎక్కడికి వెళ్ళినా కనీసం పది పుస్తకాలతో తిరిగి వస్తున్నాను. కొన్ని ఆసక్తితో కొన్నవి; కొన్ని వాళ్ళు అభిమానంతో ఇచ్చినవి. గతవారం ఖమ్మం నుండి సంచెడు పుస్తకాలతో తిరిగి వచ్చాను. ఈవారం  హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ నుండి ఇంకో సంచెడు పుస్తకాలతో వచ్చాను.

 

ఇప్పుడు తెలుగు పుస్తకాలకు కూడా బూమ్ వచ్చింది. నిజానికి పుస్తకాలకు గిరాకీ ఎప్పుడూ వుంది. డిజిటల్ టెక్నాలజీ పెరిగినా, ఆన్ స్క్రీన్ రీడింగ్, ఆడియో బుక్స్, ఏఐ, ఛాట్ జిపిటి వంటి సౌకర్యాలు వచ్చినా యువతరం సహితం నిరంతరం హార్డ్ కాపీ బుక్స్ చదువుతూనే వుంది.

 

హార్డ్ కాపీలో చదువుతున్నప్పుడు పాఠకునికీ కథ నవల రచనల్లోని పాత్రలకు మధ్య ఒక ఆర్గానిక్ అనుబంధం ఏర్పడుతుంది. ఆ ఫీల్ డిజిటల్ రీడింగ్ లో రాదు. కథాంశం తెలుస్తుందిగానీ, పాత్రలతో తాదాత్మ్యం కలగదు. అలాంటి అనుభూతిని ఇవ్వకపోతే అది వర్ణణాత్మక రచన అవ్వదు. వ్యాసం గొడవ వేరు. వ్యాసం మెదడుని ఆలోచింపచేస్తుంది; కథ నవలలు హృదయాన్ని తాకుతాయి.

 

పాఠకుల్ని సృష్టించుకునే బాధ్యత రచయితలదే. కథా చాలా ఎత్తైన ప్రదేశంలో సాగాలి. పాత్రల చిత్రీకరణ చాలా లోతుగా వుండాలి. అప్పుడు పాఠకులు పెరుగుతారు.

 

తీవ్రవాదం, ఉనికివాదాల మూలంగా తెలుగు సాహిత్యం విస్తృతి బాగా పెరిగింది. కానీ, దాని ఎత్తు, లోతు, శైలి, శిల్పాలు పెరగాల్సినంతగా పెరగలేదు. వ్యక్తిగతంగా నేను కూడ తీవ్రవాదం, ఉనికివాదాల ప్రభావంలో కొనసాగుతున్నవాడినే. ఆ వొరవడిలో కొన్ని కథలు కూడ రాశాను.  ఇంకా రాయాలని కూడ అనుకుంటున్నాను.

 

 ప్రపంచ సాహిత్యంతో పోలిస్తే తెలుగు సాహిత్యం స్థాయి రీత్యా వెనుకబడివుంది. ముఖ్యం, నవలా సాహిత్యం. ముందు మనం దీన్ని గుర్తించాలి.

 

అంతర్జాతీయ ఉనికివాద సాహిత్యంలో వచ్చిన హార్పర్ లీ నవల ‘To Kill a Mockingbird’ ను నేను ఓ పాతికేళ్ళు ఆలస్యంగా 1980లలో చదివాను.  ఒక ఉద్వేగానికి గురయ్యాను. 2021లో వచ్చిన ‘జైభీమ్’ తమిళ సినిమాకు ఆధారం 1993 నాటికి  అడ్వకేట్ గా వున్న జస్టిస్ చంద్రు వాదించిన ‘కడలూరు కేసు’ అని మనకు తెలుసు. ‘To Kill a Mockingbird’ సినిమాగా కూడ వచ్చింది. దాని ప్రేరణ కూడ ‘జై భీమ్’ సినిమా  మీద వుందని నాకు అనిపించింది.  రెండు సినిమాలను ఎవరయినా పోల్చుకోవచ్చు.

 

అలాగే, జీన్ పాల్ సార్త్రే (ఫ్రెంచ్ వాళ్ళు ఆయన పేరును మరోలా పలుకుతారట) 1946లో రాసిన ‘The Respectful Prostitute’ నాటకం కూడ ఉనికివాద సాంప్రదాయంలో వచ్చిన గొప్ప రచన. చట్టం ముందు తెల్లవాళ్ళు వేరు; నల్లవాళ్ళు వేరు అని చెపుతుందీ నాటకం.  దాన్ని నేటి ‘ఇస్లామో ఫోబియా’ నేపథ్యంలో తెలుగు అడాప్షన్ చేయాలని  కొంత ప్రయత్నం మొదలెట్టాను. ఒక రచయిత్రి నేను కలిసి దాన్ని తెలుగులో అనువాదం చేశాము. ఇండియన్ అడాప్షన్ దశలో కోవిడ్ కారణంగా ఆ ప్రయత్నం ఆగిపోయింది. హైదరాబాద్ లో నేను కోవిడ్ నుండి కోలుకుంటున్న సమయంలోనే జిలుకర శ్రీనివాస్ కొన్ని కథలు పంపించాడు. ఉనికివాద సాహిత్యంలో శిల్పపరంగా అతను అప్పటికి ముందున్నాడు అనిపించింది.

 

ఉనికివాద సాహిత్యానికి కొన్ని పరిమితులుంటాయి. వుంటున్నాయి అనుకోవచ్చు. అది సూక్ష్మస్థాయికి పరిమితం అయ్యే ప్రమాదం వుందని మనం గమనించాలి. దాన్ని స్థూలస్థాయికి పెంచాలి. ఏదో ఒక పక్షాన్ని కాకుండా మొత్తం సమాజాన్ని సమస్య మీద సెన్సిటైజ్ చేయడం లక్ష్యంగా మారాలి.

 

కొత్త తరాన్ని కలిసినప్పుడెల్లా వాళ్ళు కొత్త ఇంగ్లీషు నవలల గురించి చాలా ఆసక్తిగా మాట్లాడుతున్నారు. వాళ్ళేమీ తెలుగుకు వ్యతిరేకులుకాదు. వాళ్ళొక కొత్త మార్కెట్. దాన్ని తెలుగు రచయితలు ఏ మేరకు వుపయోగించుకుంటారో చూడాలి. ఫలానా తెలుగు కథ ఫలానా  ఇంగ్లీషు కథ నుండో, లాటిన్ అమెరికన్ కథ నుండో పుట్టిందని ఇప్పుడు వినిపిస్తోంది. ఫలానా ఇంగ్లీషు కథ ఫలానా తెలుగు కథ నుండి పుట్టిందని అనుకునే రోజులు రావాలి. దానికోసం ఇప్పుడున్న తరాలన్నీ కలిసి ఒక సమిష్టి ప్రయత్నం చేయాలి. 

 

నేను ‘సీనియర్’ ని కనుక కొత్తవాళ్ళను మెచ్చుకో ‘లేననే’  అభిప్రాయం కొందరికి సహజంగానే వుంటుంది. అది నిజం కాదు. నాకు నచ్చింది నచ్చిందని చెపుతూనే వున్నాను. అందరూ గొప్పగా రాస్తున్నారని చెప్పడం ఎలాగూ సాధ్యంకాదు. అయినా నేను అచ్చయిన పుస్తకాలన్నీ చదవడంలేదు. అవకాశాన్నిబట్టి చదువుతున్నాను.

 

ఇంకా గురజాడ, చెలం, శ్రీశ్రీ, యేనా? అనేవాళ్ళూ వున్నారు. ఆరోజుల్లో కూడ ఆ ముగ్గురే లేరు. వాళ్లతో పాటు చాలామంది వున్నారు. ఆ ముగ్గురే మనకు గుర్తున్నారు. ఇపుడూ అంతే చాలా మంది రాస్తుంటారు. ఓ ముగ్గురో నలుగురో తరువాతి తరాలకు గుర్తుంటారు.

 

కొండశిఖరం మీద నిలబడి రాయాలి అని నేను తరచుగా అంటుంటాను. అంటే ఏమిటీ? అని కొందరు అడుగుతుంటారు. వాళ్ళు నిజంగానే తెలుసుకోవాలని అడుగుతున్నారో, వెటకారంగా అంటున్నారో  అనే సందేహం వస్తుంటుంది.

 

ప్రపంచ మానవాళిని కుదిపేసిన ఒక ప్రళయ సంఘటన హీరోషీమా  మీద  1945 ఆగస్టులో అణుబాంబు వేయడం. ఆ ‘లిటిల్ బాయ్’ను ఎవరు వేశారూ? ఎవరు వేయించారు? తయారు చేసినవారు ఎవరూ? మానవ వినాశనాన్ని సాంకేతిక అభివృధ్ధి అనవచ్చా? దీనికి ఎవరెవరెరు సహకరించారు? వాళ్ళెందుకు చేశారూ? ఇది విజ్ఞానశాస్త్ర ప్రయోగమా? క్రూరత్వానికి నిదర్శనమా? ఇందులో  ఉనికివాద కోణం కూడ వుందా? క్రైస్తవ యూదు ఘర్షణ వుందా?  హిట్లర్ కోసం తయారు చేసిందాన్ని జపాన్ మీద వేశారా? అణుబాంబును తయారు చేసిన వాడు దాన్ని ప్రయోగించడానికి ముందు ఎలా వున్నాడూ? లక్షల మంది చనిపోయారని తెలిశాక అతని మానసికస్థితి ఏమిటీ? అతను మహాశాస్త్రవేత్తా? మానవరూపంలోవున్న మహామృత్యువా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. ఇంతకు మించిన అనేక సందేహాలు Kai BirdMartin Sherwin అనే జంట రచయితలకు వచ్చాయి. వాళ్ళు 2005లో ‘American Prometheus: The Triumph and Tragedy of J. Robert Oppenheimer” పేరిట అణుబాంబు తయారీదారుని జీవిత చరిత్రను రాశారు.   ప్రొమేథియస్ అంటే గ్రీకు అగ్నిదేవుడు.  ఇతనికి విచక్షణ,  ముందు చూపు అనే విశేషణాలు కూడ వున్నాయి.

 

          చారిత్రక సంధి సమయంలో మనం కిరీటధారుల క్రౌర్యాన్ని గురించి రాయాలి అని నాకు అనిపిస్తుంది. దేశ కిరీటధారుల గురించి రాయాలి. వీలయితే ప్రపంచ కిరీటధారుల గురించి రాయాలి. ప్రపంచ నియంతలయిన ముస్సోలిని, హిట్లర్ ల గురించి వాళ్ళు బతికున్న కాలంలోనే 1940లో ఒక స్క్రిప్టు రాసి సినిమా తీసి  ప్రపంచానికి చూపించాడు చార్లీ చాప్లిన్. ప్రపంచ సాహిత్యంలో చోటు సమ్పాదించాలంటే ఇప్పుడు మనమేం చేయాలీ?

 

          ఇప్పుడు ప్రపంచంలో రష్యా-ఉక్రేయిన్ మధ్య, ఇజ్రాయిల్-పాలస్తీనల మధ్య యుధ్ధాలు జరుగుతున్నాయి. సుడాన్, సిరియా, యమన్ లలో అంతర్యుధ్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచ యుధ్ధం దగ్గరగా వుందని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాడ్ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు.

 

          భాష; తెలుగు సరే. కథాంశం కూడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే  సాగాలా? ఎందుకీ స్థలకాల పరిమితులు?. జాక్ లండన్ ఐదు వేల కిలో మీటర్లు అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం చేసి అలాస్కా వెళ్ళి వచ్చి నవల్లు, కథలు రాశాడు. పంజాబ్ లో అశాంతి చెలరేగిన కాలంలో ‘కృపాణ్’,  హర్యాణ, ఉత్తర ప్రదేశ్లో మతకల్లోలాలు సాగినప్పుడు ‘మదరసా మేకపిల్ల’ రాయడానికి నాకు ఒక విధంగా జాక్ లండన్ పడిన ప్రయాస ప్రేరణ.  మణిపూర్ నేపథ్యంలో ఒక నవల రాసే ప్రయత్నంలో వున్నాను.  

 

ఇప్పుడు మన దేశంలో మతతత్త్వంతో కూడిన నియంతృత్వం కొనసాగుతోంది. దీనికి సూత్రధారులు ఎవరూ? పాత్రధారులు ఎవరూ? అబ్దిదారులు ఎవరూ? కాల్బలం ఎవరూ?  అమాయికపు ఉద్రేకాలకు గురవుతున్న దెవరూ? బాధితులు ఎవరూ? వంటి ప్రశ్నలు వేసుకుని చేసే రచనలు ఒక చారిత్రక దశకు అద్దంపట్టి కాలాతీతంగా నిలబడతాయి అని నేను అనుకుంటాను. భిన్నమైన అభిప్రాయాలు, నిర్వచనాలు  ఎప్పుడూ వుంటాయి. వుండనివ్వండి.

 

          తెలుగులో కొత్త రచయితలు ఇంకా కొండ శిఖరం మీదకు చేరుకోకపోయినా  కొత్తగా రాస్తున్నారు. కొత్త తరాన్ని ఆకర్షిస్తున్నారు. త్వరలో వాళ్ళు కొండ శిఖరం మీదకు చేరుకోనూ వచ్చు. అది వాళ్ళకేగాక తెలుగు సాహిత్యానికీ చాలా మేలు చేస్తుంది. ఆ రోజు కోసం అందరం ఎదురుచూడ్డం కాదు; కృషి చేద్దాం. 

 

ఉషా యస్ డానీ

FaceBook Post

విజయవాడ,  27 డిసెంబరు 2024


No comments:

Post a Comment