Is the problem of Tribal limited to the forest?
ఆదివాసుల సమస్య అడవికే పరిమితమా?
మిత్రులారా!
ఆదివాసుల జాతీయ
సదస్సులో ప్రారంభోపన్యాసం చేయడం చాలా ఆనందంగావుంది.
ఇలాంటి ఒక మహత్తర
అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు.
ఢిల్లీలో
జరగాల్సిన ఈ కార్యక్రమం పోలీస్ పర్మిషన్ రాకపోవడంతో రద్దయి విజయవాడకు మారింది.
ప్రారంభ ఉపన్యాసం
చేయాలని కేవలం రెండు గంటల ముందే నన్ను నిర్వాహకులు కోరారు.
ఆదివాసుల సమస్య
మీద వున్నఫళంగా మాట్లాడానికి కూడ నేను సిధ్ధంగా వుంటాను.
ణాకు చాలా
ఆసక్తివున్న అంశం ఇది. యానాదులకు దేశంలోనే తొలి సమాఖ్యను1998లో పెట్టే అవకాశం నాకు
కలిగినందుకు ఇప్పటికీ చాలా ఆనందంగా వుంటుంది.
(డిసెంబరు 10న
(2024) విజయవాడలో జరిగిన ఆదివాసి సదస్సులో నా ప్రసంగ పాఠం ఇది)
ఆదివాసుల సమస్య అడవికే పరిమితమా?
కష్టాలు వేరు;
అణిచివేత వేరు. కష్టాలు అందరికీ వుంటాయి. గౌతమ్ ఆదానీగారికీ, నరేంద్ర మోదీగారికి
కూడ కష్టాలు వుంటాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా అణిచివేతకు గురవుతున్నది ఎవరూ?
అని ప్రశ్నించుకుంటే మాత్రం మనకు రెండు సమూహాలు గుర్తుకు వస్తాయి. మొదటిది;
ఆదివాసులు. రెండోది; ముస్లింలు..
ఆదివాసి, ముస్లిం
సమూహాలు ఈ భూమి మీద వుండడం మెగా కార్పొరేట్లకు ఇష్టంలేదు. ఎందుకంటే, ఆదివాసుల
కాళ్ళ కింద వుండే ఖనిజాలు, ముస్లిం దేశాల్లోవున్న చమురు నిల్వలు మొత్తంగా వాళ్ళకు
కావాలి.
రాజకీయాలను,
ఆర్ధిక వ్యవస్థను మనం తరచూ విడదీసి చూస్తుంటాం. అవి ఒకే శరీరానికివున్న రెండు తలలు
అనుకోము. పైగా, నరేంద్ర మోదీజీ ప్రధాని కావడంవల్ల ఆదానీ, అంబానీల సంపద పెరుగుతోంది
అనే అపోహలో వుంటాము. కానీ, మెగా కార్పొరేట్లు తమ సంపదను పెంచుకోవడానికి తమకు
అనుకూలమైన రాజకీయ నాయకుడ్ని ప్రధానిని చేసుకుంటారనే ఆలోచన మనకు రాదు.
ప్రభుత్వ
విధానాలు, చట్టాలు మెగాకార్పొరేట్లకు అనుకూలంగానే వుంటాయి. అంటే, ఆదివాసులు,
ముస్లింలకు వ్యతిరేకంగా వుంటాయి.
ఆదివాసులు, ముస్లింలను అంతరించిపోతున్న జాతులు (endangered species)
అనాల్సినంతగా పరిస్థితులు మారిపోతున్నాయి. చంపాల్సిన కుక్కను పిచ్చిది అని ప్రచారం
చేయాలని ఓ కుటిలనీతి వుంది. ఇప్పుడు ఆదివాసులు, ముస్లింల మీద అలాంటి కుటిల ప్రచారాన్నే
ఏలినవారు సాగిస్తున్నారు. “ఆదివాసులు అనాగరీకులు; ముస్లింలు మూర్ఖులు” - ఇదీ ఆ
ప్రచారం సారాంశం. ఈ ప్రచారాన్ని ఎక్కువ
మంది నమ్మరు. కానీ ఓటర్లలో ఓ మూడోవంతు నమ్మి ఓటేసినా దేశాధినేతలు మళ్ళీమళ్ళీ గెలువగలరు.
ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని (UCC) అమలు
చేయాలని ఒక ప్రయత్నం మొదలెట్టింది.
ముస్లిం సమూహాన్ని ఇబ్బంది పెట్టడానికి తాము ఒక చట్టాన్ని తెస్తున్నట్టు కేంద్ర
ప్రభుత్వ పెద్దలు గట్టి సంకేతాలు ఇచ్చారు. తమ ప్రత్యేక ఉనికిని
కోల్పోతున్నట్టు ముస్లిం సమాజం కూడ ఆందోళన
చెందింది.
మైదాన సమాజం ‘అనాగరికులు’
అంటూ తరచూ కించపరిచే ఆదివాసులకు ఈ చట్టం వెనుకనున్న అసలు కుట్ర అర్ధం అయింది.
మనదేశంలో ప్రస్తుతం ఏడు వందల రకాల ఆదివాసీ సమూహాలున్నాయి. ప్రతి ఒక్క సమూహమూ ప్రత్యేకమైన సంస్కృతినీ, ఆచార
వ్యవహారాలని పాటిస్తాయి. వైవిధ్యపూరితమైన
తమ సంస్కృతుల్ని అంతం చేయడానికే ఉమ్మడి పౌర స్మృతిని తెస్తున్నట్టు వాళ్ళకు
బోధపడింది. ఆదివాసి సంఘాలు ఝార్ఖండ్ లో పెద్ద సభ జరిపి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ
దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని ఓ తీర్మానం చేశాయి.
కొన్ని మసీదులను తవ్వితే వాటి కింద
హిందూ దేవాలయాల శిధిలాలు కనిపించే అవకాశాలున్నాయి. ఆంతకన్నా లోతుకు తవ్వితే బౌధ్ధ, జైన దేవాలయాల శిధిలాలు బయటపడే
అవకాశాలున్నాయి. అంతకన్నా లోతులకు పోతే ఆదివాసుల ఆరాధనా చిహ్నాల శిధిలాలు
కనిపిస్తాయి. కొన్ని మసీదుల మీద సంఘపరివారం చేస్తున్న వాదన ప్రకారం ఈ భూమి అంతిమంగా
ఆదివాసులకు చెందాలి. అలా జరక్కపోగా ఆదివాసులకు ఇప్పుడు మిగిలిన భూమిని సహితం
లాక్కోవడానికి ఢిల్లీ స్థాయిలో వ్యూహరచనలు సాగుతున్నాయి.
నక్సల్
బరీ-శ్రీకాకుళం రైతాంగ సాయుధ ఉద్యమాల
రూపంలో భారత గడ్డ మీద కమ్యూనిజానికి తిరిగి ప్రాణం పోసింది ఆదివాసులే. ఆ ఉద్యమాలను
చూసి ఉలిక్కిపడిన ప్రభుత్వాలు మైదాన ప్రాంతాల్లో భూపరిమితి చట్టాల్ని, అటవీ
ప్రాంతాల్లో ఆదివాసీ భూముల పరిరక్షణ చట్టాల్ని తెచ్చాయి. ఇప్పుడు ఆ చట్టాలను
వరుసగా రద్దుచేసే పనిలో పడ్డాయి.
మణిపూర్ లోని కొండలు అటవీ భూముల మీద ఆదివాసులయిన కుకీ-జోలకు
సాంప్రదాయిక హక్కు వుంది. లోయలో వుండే నాగరీకులయిన మెయితీలకు కూడా కొండలు, అటవీ
భూముల మీద హక్కు కల్పిస్తూ కొత్త చట్టం చేయడంతో
అక్కడ మంటలు రాజుకున్నాయి. ఇదంతా బహిరంగ రహాస్యమే. దీని వెనుక అంతకు
మించిందేదో వుందని కుకీ-జోలకు గట్టి అనుమానం.
ఏడాదిన్నరగా అల్లర్లు
చెలరేగుతున్నా మణిపూర్ మీద ప్రధాని కనీసం
స్పందించలేదు. వారు మౌనంగా వుంటూనే పార్లమెటులో ఇంకో పని చేశారు. అంతర్జాతీయ
సరిహద్దుల నుండి వంద కిలో మీటర్ల లోపువున్న అటవీ భూముల్ని దేశ ప్రయోజనాలకు అవసరమైన
వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం వాడుకునేలా చట్ట సవరణ చేశారు.
ఇండియాకు ఏడు
దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. వీటి పొడవు 15 వేల కిలో మీటర్లు. ఆ లెఖ్ఖన
అటవీ భూముల సవరణ చట్టం కేటాయించిన భూముల
విస్తీర్ణం దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్లు.
అంటే, 37 కోట్ల ఎకరాలు. ఇంతటి విస్తీర్ణమయిన భూమిని ఎవరి కోసం
సేకరిస్తున్నారూ? అనేది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. దేశానికి వ్యూహాత్మక
ప్రాజెక్టులంటే రక్షణ శాఖ ప్రాజెక్టులని ఎక్కువమంది భావిస్తారు. ఆదానీ, అంబానీలకు
అవసరమైన భూముల్ని కూడ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు అవసరమైన వ్యూహాత్మక
ప్రాజెక్టులుగా పరిగణించే వీలు లేకపోలేదు.
ఈశాన్య
రాష్ట్రాల్లో మణిపూర్ తో సహా అనేకం ఈ వంద
కిలో మీటర్ల పరిధిలోనికి వస్తాయి. అంటే
వ్యూహాత్మక ప్రాజెక్టులు వస్తే ఈ రాష్ట్రాలు అంతరించిపోతాయి. దేశంలోని రేవు
పట్టణాలన్నీ ఈ పరిధిలోనికే వస్తాయి. ఆ వంద కిలో మీటర్ల పరిధిలో రాష్ట్ర
ప్రభుత్వాలకు కూడ ఎలాంటి అధికారాలు వుండవు.
మణిపూర్ మీద
ఎందుకింత ప్రత్యేక ఆసక్తి? అనేది ఎవరికయినా రావలసిన సందేహం. ఈ సందర్భంగా అనేక
వాదనలు వినిపిస్తున్నాయి. మణిపూర్ ను ఆనుకుని మయన్మార్, లావోస్, థాయిలాండ్
దేశాలున్నాయి. మెకాంగ్, రువాక్ (Mekong and Ruak) నదులు ఇక్కడే
కలుస్తాయి. ఈ మూడు దేశాల సరిహద్దులు కలిసే ప్రాంతానికి ‘గోల్డెన్ ట్రయాంగిల్’
(బంగారు త్రిభుజి) అనే ఒక చెడ్డ పేరుంది.. ఓపియం, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలకు ఇది
ప్రపంచ కేంద్రం.
పాకిస్తాన్,
ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులు కలిసే ప్రాంతాన్ని బంగారు నెలవంక (Golden Crescent) అంటారు. అది సహజ
మాదకద్రవ్యాల కేంద్రమయితే, ‘బంగారు త్రిభుజి’ సింథటిక్ మాదకద్రవ్యాల కేంద్రం. ‘యాబా’ అని పిలిచే మెథంఫెటమైన్ (methamphetamine) సింథటిక్ మాదకద్రవ్యం వాణిజ్యం ఇటీవల
ఈ ప్రాంతంలో విపరీతంగా పెరిగింది. డ్రగ్స్ తో పాటు
ఆయుధాలు, వాణిజ్య సంభోగం (commercial sex) రవాణాలకు ఇది ట్రాన్సిట్ పాయింట్.
ప్రపంచ వాణిజ్యంలో ఆయుధాలకన్నా మాదకద్రవ్యాలది
చాలా పెద్ద వాటా. స్టాక్ హోం ఇంటర్నేషనల్
పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) అంచనా ప్రకారం సాలీన ఆయుధాల వాణిజ్యం వంద
బిలియన్ డాలర్లు. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ILO) అంచనా ప్రకారం ‘వాణిజ్య సంభోగం’ కూడా
దాదాపు అంతే పరిమాణంలో వుంటుంది. ఐక్యరాజ్య
సమితి ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC) అంచనా
ప్రకారం మాదకద్రవ్యాల వాణిజ్యం 426 బిలియన్ డాలర్లు.
ఆయుధాలకన్నా మాదకద్రవ్యాల అమ్మకాలు నాలుగు
రెట్లు ఎక్కువగా వుండడానికి కారణం ఏమంటే, మనుషులు ఆయుధాలను ఎప్పుడో ఒకసారి
వాడుతారు. మాదకద్యవ్యాలకు అలవాటు పడితే ప్రతిరోజూ వాటిని కొనాల్సి వుంటుంది.
అంచేత, వాణిజ్యంలో భారీ టర్నోవర్ ఆశించే మెగాకార్పొరేట్లు ఇప్పుడు మాదకద్రవ్యాల
మీద దృష్టిపెట్టారనే ఊహాగానాలున్నాయి. గోల్డెన్ ట్రయాంగిల్ మీద పట్టుకోసమే మణిపూర్
ను మండిస్తునారని కుకీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ
లోకంతో విరక్తి చెందినవారు పూర్వకాలంలో వనవాసానికి పోయేవారు. ఇప్పుడు వనవాసీలకు
కూడ అడవిలో ప్రశాంతత లేదు. ఆడవుల నుండి
ఆదివాసుల్ని తరిమేస్తున్నట్టే పట్టణ
శ్రామిక వాడల నుండి ముస్లింలని ఒక పథకం ప్రకారం బుల్ డోజర్లతో తరిమేస్తుండడాన్ని
మనం తరచూ చూస్తున్నాం. భారత ముస్లింలలో కొందరు వ్యాపారులు, కొండొకచో కార్పొరేట్లు
కూడ వున్నారు. కానీ, అత్యధికులు యంత్రయుగపు కుల వృత్తుల్లో జీవిస్తున్నారు.
మెగా
కార్పొరేట్ల ఆగడాలు అడవులకే పరిమితంకావు. ఆదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ (AGEL) నుండి పాతికేళ్ళపాటు
సోలార్, పవన విద్యుత్తును అధిక ధరకు కొనడానికి
జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని కోసం ‘నీకెంత నాకెంత’ (quid pro quo) పధ్ధతిలో
భారీగా ముడుపులు అందుకుందని
ఇటీవల అంతర్జాతీయ వేదికల మీద పెద్ద దుమారం రేగడం మనకు తెలుసు. ఒప్పుకున్న
షరతుల ప్రకారం భారీ నష్టపరిహారాన్ని చెల్లించాల్సివుంటుంది గనుక ఈ ఒప్పందాన్ని
రద్దు చేసుకోవడమూ ఇప్పుడు చంద్రబాబు
ప్రభుత్వానికి కుదరదు. ఫలితంగా ఆ భారాన్ని
రాష్ట్ర ప్రజలే భరించాల్సి వుంటుంది. ఇది కూడా మనకు తెలుసు. కానీ మనకు తెలియాల్సిన
మరో పార్శ్వం ఏమంటే ఆదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థకు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్,
పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
లోనూ ప్లాంట్లున్నాయి. వీటి నిర్మాణానికి
ఆయా ప్రాంతాల్లో ఆదివాసులతోపాటు, మత్స్యకారులు, వ్యవసాయదారులు, పేదవర్గాల్ని భారీ
సంఖ్యలో సామూహిక స్థానభ్రంశానికి గురిచేశారు.
ఆధునిక
పంచభూతాల్లో విద్యుత్తు కూడ ఒకటి కనుక, దాని ఉత్పత్తి కోసం కొందరి స్థానభ్రంశం
తప్పదని వాదించేవారూ వున్నారు. నిర్వాశితులకు పునరావాసం-పునర్ వ్యవస్థీకరణ (R&R
Package) పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలని వాళ్ళు కోరుతున్నారా? లేదు. విద్యుత్తు ఆవశ్యకతను
గుర్తించినవాళ్ళు ఈ పార్శ్వాన్ని మాత్రం వదిలేస్తున్నారు.
అణిచివేత ఒకచోట
మొదలయితే అది ఒకటి రెండు సమూహాలకు పరిమితమై ఆగిపోదు. హిట్లర్ మందు
కమ్యూనిస్టుల్ని, యూదుల్ని అణిచివేయాలనుకున్నాడు. అది అతిశయించి మొత్తం తన దేశ
ప్రజల్ని అణిచివేయడానికి సిధ్ధమయ్యాడు. అత్యాశపరులయిన
కార్పొరేట్ల ఆగడాలకు బలవుతున్నది అడవుల్లో ఆదివాసులు పట్టణాల్లో మరొకరు మాత్రమే
అనుకోవడానికి వీల్లేదు. వాటి దుష్ప్రభావాలు దేశప్రజలు అందరి పైనా వుంటాయి;
వుంటున్నాయి.
డానీ
సమాజ విశ్లేషకులు
రచన:
29 డిసెంబరు 2024
ప్రచురణ
: 07 జనవరి 2025
No comments:
Post a Comment