Is the decision to wage war the responsibility of the Prime Minister? The Army Chief?
డానీ
రాజకీయ,
సామాజిక విశ్లేషకులు
భారత్–చైనా
సరిహద్దులో 2020లో జరిగిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఓ ప్రశ్న
దేశాన్ని కుదిపేస్తోంది. యుద్ధం అంచున నిలిచిన వేళ సైన్యానికి రాజకీయ ఆదేశాలొచ్చాయా?
లేదా? “మీకు నచ్చినట్టు చేయండి” అంటూ చేతులెత్తేశారా? ఈ ప్రశ్నలకు కేంద్ర బిందువుగా
మారిన ఒక పుస్తకం ప్రచురణ కాకముందే పార్లమెంటును కుదిపేసింది.
భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎం. ఎం. నరవణే రాసిన ‘నాలుగు నక్షత్రాల విధి’ (Four Stars of Destiny) అనే పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదు. కాని ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు ‘కారవాన్’ మ్యాగజైన్ ద్వారా బయటకు రావడంతో దేశ రాజకీయాల్లో భూకంపం మొదలైంది. ప్రత్యేకించి, చైనా సైన్యం ముందుకు దూసుకు వచ్చిన అత్యంత ఉద్రిక్త క్షణాల్లో భారత ప్రభుత్వ నాయకత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించలేదన్న అంశం ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది. ఇప్పుడిది కేవలం ఒక పుస్తకం కాదు. ఇది ఒక సంక్షోభ కాలంలో తీసుకున్న లేక తీసుకోలేకపోయిన నిర్ణయాల వివాదం.
2020
జూన్ నాటి సంగతి. గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఆ తర్వాత తూర్పు
లద్దాఖ్ మొత్తం ఉద్రిక్తతల్లో మునిగిపోయింది. చైనా సైన్యం కైలాస్ రేంజ్ వైపు కదలడం
మొదలు పెట్టింది. ఇది కేవలం సరిహద్దు సమస్య కాదు; ఒక యుధ్ధ ప్రకటన.
ఇలాంటి
వేళల్లో దేశాన్ని నడిపించాల్సింది ఎవరు? యుధ్ధ నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరూ? సైన్యమా? కేంద్ర ప్రభుత్వమా?
ఆగస్టు
31, 2020. రాత్రి సమయం. చైనా యుద్ధ ట్యాంకులు భారత స్థావరాలకు కిలోమీటర్ దూరంలో మోహరించాయి.
భారత కమాండర్లు కూడ
అప్రమత్తమై
దాడిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, విధానపరంగా ఒక సమస్య వచ్చిపడింది. ఢిల్లీ నుండి ఎలాంటి ఆదేశాలు
లేవు. స్పష్టమైన ఆదేశాలు లేకుండా కాల్పులు చేయకూడదన్న నిబంధనలున్నాయి.
అప్పటి
ఆర్మీ చీఫ్ నరవణే రక్షణ మంత్రి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు, విదేశాంగ మంత్రి అందరికీ ఫోన్లు చేశారు.
అందరికీ వారడిగింది ఒక్కటే మాట. “ఏం చేయాలి?”!
కొన్ని గంటల వరకు స్పందన లేదు; ఆదేశాలు రాలేదు. తరువాత రక్షణశాఖా మంత్రి నుండి ఒక ఫోన్
వచ్చింది. రెండే రెండు క్లుప్త వాక్యాలు. “ప్రధానితో మాట్లాడాను”. “జో ఉచిత్ సమ్జో వో కరో” (ఏది సరైనది అనుకుంటే అది చెయ్యండి”).
ఈ సూచన విని తాను షాకుకు గురయ్యినట్టు ఈ పుస్తకంలో
నరవణె రాసుకున్నారు. యుధ్ధానికి సంబంధించిన ప్రాణప్రదమైన అంశం ఇది. యుధ్ధం చేయాలనో,
జరుగుతున్న యుధ్ధాన్ని ఆపాలనో నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరూ? రాజకీయ నాయకత్వమా? సైనిక
నాయకత్వమా?
ఇలాంటి
ఉద్రిక్త సన్నివేశాలు 1971లో ఇందిరాగాంధీ హయాంలోనూ, 1999లో వాజ్ పాయి హయాంలోనూ వచ్చాయి.
వాళ్ళిద్దరూ అప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నరవణే ఆ పుస్తకంలో చెప్పిందేమంటే ప్రధాని
మోదీలో అలాంటి నిర్ణయాత్మక శక్తిగానీ, స్పష్టతగానీ
కనిపించలేదు అని. దీన్నేమీ ఆయన ఒక ఆరోపణగా చెప్పలేదు. తనకు ఎదురయిన అనభవంగా పాఠకులతో
పంచుకోవాలనుకున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో శాసన వ్యవస్తే నిర్ణయాలు తీసుకుంటుంది;
దాన్ని సైన్యం పాటిస్తుంది.
పుల్వామా,
బాలాకోట్ ప్రతిదాడుల తరువాత ప్రధాని మోదీజీ దృఢ నిర్ణయాలు తీసుకోగల సమర్ధులు అనే మాట
బాగా ప్రచారం అయ్యింది. కానీ చైనా విషయంలో వారు తడబడినట్టుగా నరవణె కథనం
ద్వార అర్ధం అవుతోంది. సరిగ్గా ఈ అంశమే ప్రతిపక్షానికి ఇప్పుడు చేతికి అందివచ్చిన ఆయుధంగా
మారింది.
జాతీయ
భద్రత కారణంగా నరవణే పుస్తకాన్ని పరిశీలించాల్సివుందని రక్షణ శాఖ అంటున్నది. ఏడాదిన్నర గడిచినా సమీక్ష పూర్తికాలేదు. ప్రచురణకు అనుమతి
రాలేదు. జాతీయ భద్రతకన్నామ్తమకు ఎదురయ్యే రాజకీయ
ఇబ్బందుల గురించే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా జంకుతున్నదనే విమర్శలూ వున్నాయి. ఇది సెన్సారా?
నియంత్రణా? ఒక ఆర్మీ మాజీ చీఫ్ తన యుధ్ధ అనుభవాలను ప్రజలతో పంచుకోకూడదా?
ప్రధాన
ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్ సభలో నరవణె
పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నించినపుడు అధికార పక్షాలు
గట్టిగా అడ్డుకున్నాయి. సభ వాయిదాపడింది.
అగ్నివీర్,
అగ్నిపథ్ పథకాల మీద కూడ నరవణె ఈ పుస్తకంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాశ్విత
ఉద్యోగ భద్రత లేదనీ, జీతాలు కూడ తక్కువనీ ఆయన గుర్తుచేశారు. ఆ సందర్భంగా భారత సైన్యం
భవిష్యత్తు మీద ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ వ్యవహరించినంత కటువుగా
చైనాతో వ్యవహరించలేకపోతున్నదని నరవణె అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పుస్తకం
పూర్తిగా బయటికి వస్తే దేశంలో ఒక దుమారం రేగుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని మోదీ గురించి ప్రధాన స్రవంతీ మీడియా ప్రచారం
చేస్తున్న అతిశయోక్తులకు, మోదీ అమిత్ షా ద్వయం తమ గురించి చెప్పుకుంటున్న ప్రగల్భాలకూ
ఈ పుస్తకం ఒక ఇబ్బంది కావచ్చు !
అయితే,
ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ చేస్తున్న వాదనకు భిన్నమైన కోణం కూడా వుండవచ్చు. ఎందుకంటే,
ఎంఎం నరవణె సంఘ్ పరివారానికి అనుకూలురనీ, దానివల్లనే వారికి సైన్యంలో అంతటి స్థానం
దక్కిందనే మాట కూడ ప్రచారంలోవుంది. కారవాన్ పత్రిక ఆ పుస్తకంలోని కొన్ని పేజీలను మాత్రమే
ప్రచురించింది. మిగిలిన పేజీల్లో మోదీజీ నాయకత్వాన్ని నరవణె పొగిడి వుండవచ్చు. మొత్తం
పుస్తకం అందుబాటులోనికి వస్తేగానీ అంతిమ నిర్ణయం చెప్పలేము.
6
ఫిబ్రవరి 2026
No comments:
Post a Comment