Thursday, 11 June 2026

Look East, Act East - India and China

 *లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్  : ఇండియా, చైనా*

 

డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు

 

            మన విదేశాంగ, వాణిజ్య వ్యవహారాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతోంది. సరిహద్దుల్లో చైనాతో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్సాయ్ చిన్‌ లో 38 వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా అరవై యేళ్ళుగా ఆక్రమించుకుని కూర్చుంది. దాదాపు 80 వేల చదరపు కిలో మీటర్లున్న అరుణాచల్‌ ప్రదేశ్ మొత్తం తనదే అంటోంది. దానిని దక్షణ టిబెట్ అని వాదిస్తోంది.  మరోవైపు భారత మార్కెట్లలో చైనా వస్తువులు కొండల కొద్దీ వచ్చిపడుతున్నాయి. ఇలాంటి సందర్భాలలోనే దేశ సార్వభౌమాధికారం మీద అనేక సందేహాలు  ముందుకు వస్తుంటాయి.

 

            పెట్రోలు, విద్యుత్, నీటి వినియోగంలో మితవ్యయాన్ని పాటించాలని ప్రభుత్వం తరచుగా ప్రజలకు సూచిస్తోంది.  దీనిని బట్టి ఓ ముఫ్ఫయి ఐదేళ్ళ క్రితపు ఆర్ధిక సంక్షోభం దిశగా మనం వేగంగా పోతున్నట్టు అనుమానం రావడం సహజం. 1980ల చివరినాటి-1990 ఆరంభంనాటి సంక్షోభం నుండి దేశాన్ని బయట పడేయడానికి పివి నరసింహారావు – మన్మోహన్ సింగ్ ద్వయం సరళీకృత ఆర్ధిక  విధానాలతోపాటూ “తూర్పుకు చూడండి” (లుక్ ఈస్ట్) అనే ఒక  కొత్త  ప్రాపంచిక దృక్పధాన్ని ముందుకు తెచ్చారు.

 

            లుక్ ఈస్ట్ అనేది కేవలం ఒక విదేశాంగ విధాన నినాదం మాత్రమే కాదు. రష్యా, అమెరికాల మధ్య శీతల యుధ్ధం ముగిసి ప్రపంచం పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో వున్నప్పుడు భారతదేశం తన అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నం ఇది. ఆసియా ఖండంలో భారత నాగరికత, సాంస్కృతిక, భౌగోళిక, రాజకీయార్ధిక వ్యూహాల దిశను నిర్దేశించే పిలుపు ఇది. ప్రధానంగా తూర్పు – ఆగ్నేయాసియా దేశాలతో ప్రగాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకుని భారతదేశం - ప్రపంచ పటం మీద - ఈ ప్రాంతంలో - ఒక ప్రధాన శక్తిగా ఎదగాలనే వ్యూహం ఈ పిలుపులో వుంది. 

 

            19వ శతాబ్దంలో ఐరోపా, 20వ శతాబ్దంలో అమెరికా ప్రపంచ చోదక శక్తులుగా కొనసాగాయి. 21వ శతాబ్దంలో తూర్పు ఆసియా ప్రపంచ చోదక శక్తిగా మారగలదని అప్పట్లో ఒక ఊహాగానం చెలరేగింది. ఇండియాతోపాటూ సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, జపాన్, చైనాలు అనూహ్యంగా శక్తిని పుంజుకుంటాయని అంచనాలు వేశారు.

 

            నరేంద్ర మోదీజీ ప్రధాని అయ్యాక ‘లుక్ ఈస్ట్’ ను ‘యాక్ట్ ఈస్ట్’ గా ప్రకటించి క్రియాశీలంగా మార్చేందుకు పూనుకున్నారు. ఇది కొన్ని ఫలితాలను ఇచ్చింది కూడ. దక్షణాసియా దేశాల సంఘం (ASEAN)లో ఇండియా ప్రాధాన్యత పెరిగింది. జపాన్ ఇండియాకూ మద్దతుగా నిలిచింది.  ఆస్ట్రేలియా ఇండియాను కీలకమైన భాగస్వామి అనుకుంది. అమెరికా అయితే, చైనాను ఆసియా ఖండాన్ని దాటి విస్తరించకుండ నిలవరించాలంటే ఇండియాతో స్నేహం వ్యూహాత్మక అవసరం అని భావించింది. ఇంతటి అనుకూల వాతావరణాన్ని ఇండియా పూర్తిగా వాడుకునేలోపు కొన్ని అనూహ్య పరిణామాలు జరిగాయి.  

 

            తూర్పు యూరోపు, సోవియట్ రష్యాలు బలహీనపడిన తరువాత చైనా సోషలిస్టు మార్గం నుండి పెట్టుబడీదారీ విధానం వైపుకు మారింది. చైనాను పెట్టుబడీదారీ దేశం అనడం కొందరికి ఇష్టం లేకపోవచ్చు. అలాంటివాళ్ళు చైనాది ఉత్పత్తిలో సోషలిస్టు విధానం, మార్కెటింగులో పెట్టుబడీదారీ విధానం అనుకోవచ్చు. అలా పదేళ్ళు పుంజుకుని, 2001 చివర్లో ప్రపంచ వాణిజ్య సంస్థలో 143వ దేశంగా చేరిన తరువాత చైనా ప్రపంచ మార్కెట్లో విజృంభించింది.   

 

            టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇ-కామర్స్,. ఇతర ఉత్పత్తిరంగాల్లో చైనా ఎవరికీ అందనంత దూరం వెళ్ళిపోయింది. ఉత్పత్తి ఎక్కువయితే వస్తువుల ధరలు పడిపోతాయని అందరికీ తెలుసు. ధరల్ని  తగ్గించడమే మార్కెటింగ్ ఆయుధంగా చైనా మార్చుకుంది. విపరీతంగా ఉత్పత్తిచేసి సరుకుల్ని తక్కువ ధరకు ప్రపంచ మార్కెట్లో విసిరేయడం  దాని విధానం. "ధర కారుచౌక. వాడండి. ఆస్వాదించండి. పాడైపోతే పడేయండి"  అనే చైనా మార్కెటింగ్ విధానం ప్రపంచ కన్స్యూమర్స్ ను తెగ ఆకర్షిస్తున్నాయి. చౌక ధరల వస్తువులు  భారీ ఫిరంగుల్లాగా పనిచేస్తాయి. వాటితో  చైనా గోడల్ని సహితం పెట్టుబడీదారులు సులువుగా కూల్చేస్తారు అనే అర్ధం వచ్చేలా ఒక సందర్భంలో కార్ల్ మార్క్స్ అన్నాడు. ఇప్పుడు చైనా చౌక ధరల ఫిరంగులతో ప్రపంచ మార్కెట్ ను కొల్లగొడుతోంది.

 

            ప్రపంచంలో  అత్యధిక జనాభాగల దేశంగావున్న కాలంలోనూ చైనా భయపడలేదు. అధిక జనాభాను సరుకుల ఉత్పత్తికి సద్వినియోగం చేసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, చౌక విద్యుత్, భారీ పోర్టులు, నైపుణ్య శిక్షణ, ఎగుమతి ఆధారిత పారిశ్రామిక విధానం అమలు చేసింది. ఫలితంగా ఒక వస్తువు ఉత్పత్తికి కావలసిన వందల భాగాలు, విభాగాలు కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే తయారయ్యే వ్యవస్థల్ని ఏర్పాటుచేశారు. దీనినే Supply Chain Ecosystem అంటున్నారు. అలా చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా  మారిపోయింది.

 

            ఇప్పుడు జనాభాలో మనదేశం చైనాను అధిగమించిందిగానీ, వస్తు ఉత్పత్తిలో చైనాతో పోలిస్తే చాలా వెనుకబడివున్నాం. ఏ దేశంలోనూ లేనంత  యువతరం వున్నా వాళ్ళను పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో ఉపయోగించుకోలేకపోతున్నాం.

 

            మన దేశంలో వివిధ రాజకీయ పార్టీల గెలుపు వ్యూహాలు   యువతరాన్ని ఉత్పత్తికి దూరం చేస్తున్నాయని సమాజ విశ్లేషకుల అంచనా. మన రాజకీయాలు  మత రాజకీయాలుగా మారిపోతున్నాయనే ఆందోళన తరచూ వినిపిస్తున్నది. ఇలాంటి వాతావరణంలో ఎన్నికల్లో లబ్ది పొందాలంటే మత చీలికల్ని కొనసాగించక తప్పని పరిస్థితి. దానికోసం ఉత్సవాలు, ఊరేగింపులు, యాత్రలు, జాతరలు వంటివి  ఏవో ఒకటి నిరంతరం జరపాల్సి వస్తున్నది. అలా యువతరాన్ని ఉత్సాహ పరుస్తున్నారు మన రాజకీయ నాయకులు.

 

            ఒకవైపు, రాజకీయరంగం తీరిక లేకుండా కార్యక్రమాలు జరుపుతుంటే, మరోవైపు, మన ఫ్యాక్టరీ గొట్టాల నుండి పొగ రావడంలేదు. స్వంత ఉత్పత్తి పెద్దగా లేకపోవడంతో మన ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరుగుతున్నాయి. ఫలితంగా రూపాయి విలువ పతనం అవుతోంది. నిరుద్యోగమూ పెరుగుతోంది.

            మన ఆర్ధికాభివృధ్ధిలోనూ ప్రాంతాల భాగస్వామ్యం లోపించింది. సహజవనరులు, మౌలిక నిర్మాణాలను గుజరాత్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల కార్పొరేట్లే హస్తగతం చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడ వున్నాయి. కొందరు దీనిని ‘వెస్ట్ ఇండియా కంపెనీ’ అంటూ విమర్శిస్తున్నారు.

            1990లో  చైనా స్థూల జాతీయ ఉత్పత్తి 397 బిలియన్ డాలర్లు, అమెరికా జిడిపి 5,960 బిలియన్ డాలర్లు. అంటే 15 రెట్లు ఎక్కువ. 2025లో చైనా జిడిపి 20.6 ట్రిలియన్లు, అమెరికా జిడిపి 31.8 ట్రిలియన్లు. అంటే ఒకటిన్నర రెట్లు మాత్రమే ఎక్కువ. సమీప భవిష్యత్తులో చైనా జిడిపి అమెరికాను అధిగమించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వాళ్లు అలా అనడానికి బలమైన కారణాలు కూడా వున్నాయి. అమెరికా సాంకేతిక ఆధిపత్యం, డాలర్ ప్రాబల్యం, భౌగోళిక-రాజకీయ ప్రభావం, సైనిక పాటవం ఆధారంగా చేసుకుని ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. చైనా సరుకులకు బ్రాండ్ కూడ అక్కర లేదు. ‘చైనా సరుకు - ధర తక్కువ’ అదే దాని మార్కెటింగ్ క్యాప్షన్.

 

            2020 జూన్ నెలలో గాల్వాన్ లోయ వద్ద చైనా మన సరిహద్దుల్ని దాటే ప్రయత్నాలు చేయడంతో రెండు దేశాల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘అత్మనిర్భర్’ తత్త్వం ముందుకు వచ్చింది. ‘చైనా సరుకుల్ని బహిష్కరించండి’  నినాదాలు చెలరేగాయి. ఇది కొంచెం అతిశయించి రోడ్ల పక్కన నూడిల్స్ అమ్ముకునే తోపుడు బండ్ల మీద కూడ దేశభక్తులు దాడులు చేశారు. టిక్ టాక్ వంటి చైనా యాప్స్ ను రద్దు చేశారు.  ఓ రెండూ మూడేళ్ళ తరువాత అందరూ అన్నీ మరచిపోయారు. ఇప్పుడూ మన దేశంలోని మొబైల్ ఫోన్స్, ఫర్నిచర్, అపెరల్స్, (దుస్తులు- బూట్లు) టాయ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ పార్ట్స్ మార్కెట్లన్నీ చైనా సరుకులతో కిటకిటలాడిపోతున్నాయి.

 

            ఆహారధాన్యాలు, హార్టికల్చర్ (కూరగాయల) ఉత్పత్తిలో ఇండియా ముందుంది అనే అభిప్రాయం వుంది. ఆ రంగంలోనూ చైనా ఉత్పత్తులు ప్రవేశించేస్తున్నాయి. చివరకు రైతు బజార్లలోనూ వెల్లుల్లి పాయలేగాక ఉల్లిపాయలు కూడ చైనావి అమ్ముతున్నారు. ఇంకా ఆశ్చర్యకర పరిణామం ఏమిటంటే ఇండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) పెట్టడానికి కొన్ని షరతులతో  చైనాకు అనుమతి ఇచ్చారు.

 

            ‘లుక్ ఈస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’ విధానం భారత్‌ను ఆసియాతో అనుసంధానించాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. వ్యూహాత్మకంగా ఇది విజయవంతమైంది. జపాన్, ఆస్ట్రేలియా, ఆసియాన్ దేశాలతో ఇండియా సంబంధాలు బలపడ్డాయి. కానీ ఆర్థికంగా చైనా మరింత వేగంగా ముందుకెళ్లింది. ఆసియా సరఫరా గొలుసుల్లో చైనా కేంద్రంగా మారగా భారత్ ఇంకా ప్రవేశదశలోనే ఉంది. అయిష్టంగానే అయినా ఒక విషయాన్ని ఒప్పుకోక తప్పదు. ‘లుక్ ఈస్ట్’  యాక్ట్ ఈస్ట్’ విధానం చైనాకు ఆర్థికంగా బలపడడానికి దోహదపడింది. మన రాజకీయ విధానాలు మనల్ని ఆర్ధిక రంగంలో వెనక్కి లాగాయి.  
            సరిహద్దుల్లో చైనాను వ్యూహాత్మక ప్రత్యర్థిగా పరిగణిస్తూనే, మార్కెట్లలో చైనా ఉత్పత్తులపై ఆధారపడే వైరుధ్య స్థితిలో భారత్ ఉంది. ఈ వైరుధ్యాన్ని అధిగమించాలంటే నినాదాలకన్నా ఉత్పత్తి, నైపుణ్యం, పరిశ్రమల నిర్మాణంపైనే దేశం దృష్టి పెట్టాలి. లేకపోతే 'లుక్ ఈస్ట్', 'యాక్ట్ ఈస్ట్' చరిత్రలో చేతికి అందిన అవకాశాలను కోల్పోయిన విధానాలుగానే మిగిలిపోతాయి.
        సరిహద్దుల్లో సైనిక శక్తితో చైనాను ఎదుర్కోవడం ఒక విషయం. మార్కెట్‌లో చైనా ఉత్పత్తులతో పోటీ పడటం మరో విషయం. మొదటిదానికి సైన్యం అవసరం. రెండోదానికి పరిశ్రమలు అవసరం. నినాదాలు, భావోద్వేగాలు, బహిష్కరణ పిలుపులు కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి. కానీ ఉత్పత్తి, సాంకేతికత, నైపుణ్యం, ఉపాధి — ఇవే ఒక దేశ ఆర్థిక సార్వభౌమాధికారానికి శాశ్వత పునాదులు అవుతాయి.
11-06-2026

No comments:

Post a Comment