Monday, 15 June 2026

*అణగారిన సమూహాల ఐక్యతే ప్రత్యామ్నాయం*

 *అణగారిన సమూహాల  ఐక్యతే ప్రత్యామ్నాయం*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*

 

ఆర్ధికరంగంలో  కార్పొరేట్ల అత్యాశ, సామాజిక,  సాంస్కృతిక రంగాల్లో  మెజారిటీ మతతత్త్వం, రాజకీయ, పరిపాలన వ్యవహారాల్లో నియంతృత్వం నేటి మన వ్యవస్థ స్వభావం. దీనిని పొడుగ్గా భారత కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ (సిసిడి) అనుకోవచ్చు. పొట్టిగా Communal Corpocracy అనవచ్చు.  

 

కమ్యూనల్ కార్పోరసీ మన అంచనాలకన్నా క్రూరమైనది. దానిని ఫాసిస్టు అంటే సరిపోదు. దేశంలోని సహజ వనరులు, ఓడరేవులు, వినాశ్రయాలు, రైల్వేలు, విద్యుత్తు, చమురు, ఉక్కు తదితర మౌలిక వ్యవస్థలన్నీ గుప్పెడుమంది కార్పొరేట్ల వశమైపోతున్నాయి. ఆర్ధికవ్యవస్థలో బలపడుతున్న గుత్తాధిపత్యాన్ని గుర్తించకుండ సమాజాన్ని  నిరంతరం మత విద్వేషాలలో ముంచి వుంచుతున్నారు.   దీనికి వ్యతిరేకంగా ఎవరయినా గొంతు ఎత్తితే కలలో కూడ ఊహించని నిందలేసి క్రూరంగా శిక్షిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం, పౌరులకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది; కానీ మాట్లాడిన తర్వాత స్వేచ్ఛకు హామీ లేదు.

 

ఫాసిజం అనగానే అందరికీ  వందేళ్ళ క్రితపు ఇటలీ, జర్మనీ గుర్తుకొస్తాయి. అదే ఇప్పుడు పునరావృతం అవుతున్నదని చాలామంది అంటున్నారుగానీ అది సరికాదు. మునుపెన్నడూలేని దారుణమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

 

అప్పటి ఫాసిజం, నాజిజంలకు స్వావలంబన (autarky)  భావన చాలా బలంగా వుంది. మన కమ్యూనల్ కార్పోరసీలో అది లోపించింది. ఈ కోణాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి ప్రపంచ యుధ్ధం తరువాత ఇటలీ, జర్మనీ దేశాల మీద అనేక ఆంక్షలున్నాయి. వాటిని అధిగమించి ఇనుము-ఉక్కు, రసాయనాలు, ఆటోమోటివ్స్, టెక్స్ టైల్స్ జలవిద్తుత్తు రంగాల్లో ఇటలీ చాలా ముందంంజ వేసింది.  ఏరోస్పేస్, మోటార్ వెహికిల్స్,  సింథటిక్ రబ్బర్, సింథటిక్ ఫ్యూయల్, హెవీ ఇంజినీరింగ్, ప్రెసిషన్ ఆప్టిక్స్ రంగాల్లో జర్మనీ చాలా ముందడుగు వేసింది. ఇది వందేళ్ళ క్రితపు వ్యవహారం. ఇప్పటికీ ఆ రంగాల్లో ఇటలీ, జర్మనీలదే పైచేయి.  

 

1857 నుండి 1947 వరకు దేశంలో వలస పాలనకు వ్యతిరేకంగా  జాతియోద్యమం సాగింది. స్వాతంత్ర్యం తరువాత ఇండియా  ప్రపంచ మాహాశక్తులైన అమెరికా, రష్యాల్లో ఏ శిబిరంలోనూ చేరలేదు. అలీన విధానాన్ని కొనసాగించింది. కానీ, గత దశాబ్దంలో విధానం మారింది.  భారత విదేశాంగ, ఆర్థిక, రక్షణ విధానాల్లో అమెరికా ప్రాబల్యం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. మనదేశం విదేశాంగ వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించగలుగుతోందా? అనే సందేహాలు సహితం తలెత్తుతున్నాయి.

ప్రపంచ మార్కెట్లో అమ్మడానికి మనదైన బ్రాండుగల ఉత్పత్తులు ఎన్ని ఉన్నాయి? అనే ప్రశ్నకు మనం ఓ నాలుగు పేర్లు చెప్పలేకపోతున్నాం. లెఖ్ఖ ప్రకారం అయితే, అందుబాటులోవున్న అపారమైన యువ శక్తుల్ని ఉత్పాదకరంగంలో సద్వినియోగం చేయాలి. కానీ, అందుకు భిన్నంగా జరుగుతోంది. మన పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి యువతరాన్ని  దుర్వినియోగం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మైనారిటీలను హింసించి ఆనందించే అవకాశాలు సహితం కల్పిస్తున్నారు.  అనైతిక పాత్రల్ని ఆరాధించేలా సినిమాలు తీసి ప్రజల మీద వదులుతున్నారు. అలా సాంస్కృతిక రంగం కలుషితం అవుతోంది.  దాని ప్రభావాలు కూడ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు నచ్చనివారు సహితం ఈ మృత సంస్కృతిని వ్యతిరేకించడానికి  భయపడుతున్నారు. శ్వాసతో సరిపెట్టుకోండి ఆలోచనలు చేయకండి అనే ఒక భయానక నిర్బంధ వాతావరణంలో మనం బతుకుతున్నాం. 

 

కమ్యూనిస్టులు మాత్రమే ఫాసిస్టులను ఓడించగలరు అని కొందరు అంటుంటారు.  అలా అనడం అతిశయోక్తి. అయితే, కమ్యూనిస్టులు లేకుండా ఫాసిస్టులను ఓడించడం కూడా సాధ్యం కాదు. ఆనాడు ఇటలీ-జర్మనీలను  నిలువరించడంలో సోవియట్ రష్యాది కీలక పాత్రేగానీ, మిత్రశక్తులు, ‘బిగ్ -ఫోర్’ కూటముల సమిష్టి కృషిని విస్మరించడం సమంజసం కాదు.  ఫాసిజం-నాజిజాల మీద సాధించిన విజయాల్లో నిర్ణయాత్మక పాత్ర ఎర్రసైన్యానిది. మేడేనాడు  ఎర్రసైన్యం బెర్లిన్ నగరంలోనికి ప్రవేశిస్తున్నదని తెలిసే అంతకు ముందురోజు రాత్రి హిట్లర్, తన భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు.

 

ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి వామపక్షాలు, ప్రజాతంత్ర ఉద్యమ శక్తులు కలవాలని కొందరు తరచూ సూచిస్తుంటారు. అది అవసరమేగానీ, కార్పొరేట్ కమ్యూనల్ కార్పోక్రసీని ఎదుర్కోవడానికి ఈ రెండు శక్తులు ఏవిధంగానూ సరిపోవు.

 

మన సమాజంలో  ఆదివాసీ, దళిత, బహుజన, మత అల్పసంఖ్యాక, మహిళా సమూహాలున్నాయి. వామపక్షాలు తమ ప్రధాన సామాజిక పునాదిగా భావించే శ్రామికులు, వ్యవసాయ కూలీలున్నారు. ఈ సమూహాలు అన్నింటిలోని కొంత భాగం చాలా కాలం వామపక్షాలతో వున్నాయి.  1990లలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విశేష మార్పుల ఫలితంగా ఉనికివాద సమూహాలు కమ్యూనిస్టు పార్టిలకు దూరమయ్యాయి. వాళ్ళు మాత్రమేగాక, శ్రామికులు, వ్యవసాయ కూలీలు  సహితం ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీల్లో తగ్గిపోయారని కొత్త గణాంకాలు చెపుతున్నాయి. ఆ సమూహాలకు వామపక్షాల మీద గత కాలపు నమ్మకం సన్నగిల్లిందనేది ఒక వాస్తవం. అలా వాళ్లు  దూరం కావడానికి ప్రధాన కారణం  కమ్యూనిస్టు పార్టిలు అనుసరించిన   విధానాలే అనవచ్చు.

 

కమ్యూనిస్టు పార్టీల నుండి బయటికి వెళ్ళినవారే తమ స్వీయ సమూహాల ఆత్మగౌరవ, ఉనికివాద ఉద్యమాలకు నాయకత్వం వహించారన్నది గుర్తించుకోవాల్సిన పరిణామం. అయితే, మార్క్సిస్టు శిబిరం  నుండి అలిగి  వెళ్ళిపోయిన ఆదివాసీ, దళిత, బహుజన, మత అల్పసంఖ్యాక, మహిళా సమూహాలు కూడ సమసమాజం దిశగా సాగలేకపోయారు. ఇంకొకవైపు, మానవ హక్కులు, పౌర హక్కుల కార్యకర్తలు, హేతువాదులేగాక, హిందూ సమాజంలోని మతసామరస్యవాదులున్నారు. వీరు కూడ కమ్యూనల్ కార్పోరసీని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళందరితో కూడిన అత్యంత  విశాల సంఘటన ఒకటి ఇప్పుడు ఏర్పడాలి. 

 

అధికారంలో వున్న పార్టి విధానాలు నచ్చకపోతే ఎన్నికల ద్వార ప్రభుత్వాన్ని మార్చే అవకాశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వుంది.  కానీ, అన్ని సందర్భాలలో  అలా జరుగుతుందని చెప్పలేం. కమ్యూనల్ కార్పోక్రసీ  చాలా తెలివైనది మాత్రమేకాదు; కపటి. తమను ఎదురించే శక్తులు ఎన్నికల ద్వార తమను అధికార పీఠం నుండి గెంటేయకుండా అది అన్ని జాగ్రత్తల్ని తీసుకుంటుంది. తమను వ్యతిరేకించే సమూహాలను ఏకంగా ఓటర్ల జాబితా  నుండి తప్పించేందుకు ప్రయత్నిస్తుంది. ఒక వేళ గేటు దాటినా ఈవిఎంల ద్వార ఎన్నికల ఫలితాలను నియంత్రించడానికి కూడ వెనుకాడదు. మనదేశంలో ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండాలనే డిమాండు చాలా కాలంగా వుంది.

 

దేశం గొప్పగా వెలిగిపోతున్నట్టు, అభివృధ్ధి పరుగులు తీస్తున్నట్టు,  రేపోమాపో ప్రపంచ సూపర్ పవర్ గా అవతరించబోతున్నట్టు ప్రభుత్వానుకూల మీడియా  సంస్థలు దేశ పురోగతి కథనాలను విస్తృతంగా ప్రచారం చేస్తుంటాయి. దీనివల్ల ఓటర్లలో ఒక సమ్మతి ఉత్పత్తి అవుతుంది. ఆపైనా కూడ ఎక్కడయినా జనంలో అసంతృప్తి వున్నదనిపిస్తే డబ్బూ, మద్యం వంటి పాత చిట్కావైద్యాలు ఎలాగూ వుంటాయి. ఎన్నికల పంథాలో ఇంతటి పద్మ వ్యూహాల్ని దాటుకెళ్ళి గెలిచి నిలిచే అభిమన్యులు మనకెందరున్నారూ? 

 

ఆలోచనాపరుల్ని సమాజాన్ని మార్చాలన్నాడు కార్ల్ మార్క్స్.  ఈ పిలుపులో మూడు అంశాలున్నాయి. మొదటిది; ఇప్పటి సమాజం ఎంత క్రూరంగా వున్నదన్నది వాస్తవంగా విశ్లేషించాలి. రెండోది;  దీన్ని ఎలాంటి ఆదర్శ సమాజంగా మార్చబోతున్నామో వివరించాలి. అలాంటి ఆదర్శ సమాజాన్ని  ఎలాంటి ప్రక్రియలతో నిర్మించగలమో విడమర్చి చెప్పాలి.  దీని కోసం ఒక డిటేయిల్ ప్రాజెక్టు రిపోర్టును సిధ్ధం చేయాలి.  ఈ పనుల్ని గతంలో కమ్యూనిస్టు పార్టీలు చేయలేదని కాదు. చేశాయి. ఉత్పత్తి విధానమే మారిపోయింది కనుక గతంలో రూపొందించిన వాటికి  కాలం చెల్లిపోయింది. కమ్యూనిస్టు పార్టీల డాక్యుమెంట్లకు కూడ ఎక్స్ పైరీ డేట్ వుంటుంది. వాటిని పక్కన పడేసి కొత్త కార్యక్రమాల్ని రూపొందించుకోవాలి.

 

మనం చేసిన తప్పుల్ని గుర్తించకుండా మనం చెయ్యాల్సిన పనులు ఎప్పటికీ అర్థం కావు. మనం మారినట్టు ధృఢంగా సంకేతాలు ఇచ్చినప్పుడే పాత మిత్రులతోపాటు కొత్త మిత్రులూ వస్తారు. ఉత్పత్తి రంగంలో కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం మీద సాధికారత సాధించిన వాళ్లనే కొత్త తరాలు గౌరవిస్తాయి. కొత్త తరాలను కదిలించగలిగిన ఉద్యమాలే విజయాలను సాధించగలుగుతాయి.

అంతిమ నియమం ఏమంటే, కులం, మతం, తెగ, లింగ అసమానతలను గుర్తించకుండా, అస్తిత్వ సమూహాల భావోద్వేగాలను గౌరవించకుండా వామపక్షాలు విస్తరించలేవు; సమసమాజ స్వప్నం లేకుండా అస్తిత్వ సమూహాలు సంపూర్ణ విముక్తినీ పొందలేవు. సూక్ష్మంగా చెప్పాలంటే మార్క్స్ వెర్సెస్ అంబేడ్కర్ కాదు; మార్క్స్ ప్లస్ అంబేడ్కర్. ఈ  ప్లస్ లు ఇంకా వున్నాయి.

రాజ్యాంగం మనకు హక్కులను ఇస్తుంది. కానీ హక్కులను కాపాడేది కాగితాలుకాదు; సంఘటిత ప్రజాశక్తి. సామాజిక విభజనలు, ప్రజాస్వామ్య సంస్థల బలహీనతలతో కూడిన కాలంలో ఒక్కో అణగారిన సమూహం ఒంటరిగా పోరాడితే పరాజయం తప్పకపోవచ్చు. కానీ ఆదివాసీలు, దళితులు, బహుజనులు, మత అల్పసంఖ్యాకులు, మహిళలు, శ్రామికులు, రైతులు, ప్రజాస్వామ్యవాదులు, మానవహక్కుల కార్యకర్తలు, వామపక్షాలు  ఒక ఉమ్మడి వేదికపై కలిసినప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి పుడుతుంది. అందుకే, ఇప్పుడు అణగారిన సమూహాల ఐక్యత ఒక నినాదం కాదు; అది చారిత్రక అవసరం.

13 -06-2026

No comments:

Post a Comment