*కాలధార*
*సోనమ్ వాంగ్ చుక్ నుండి
ఖాన్ సర్ వరకు*
*డానీ*
*సమాజ, రాజకీయ విశ్లేషకులు*
అందరిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే;
ఎన్ని బొద్దింకలు ఢిల్లీ జంతర్ మంతర్ చేరుకున్నాయి? అని. ఎన్ని రావాలనుకున్నాయీ? ఎన్ని
వచ్చాయి? ఎన్ని రాలేకపోయాయి? ఎన్నింటిని రానివ్వలేదు?
అనే సందేహాలు ఎలాగూ వుంటాయి. వాటికి ఎవరి సమాధానాలు వారికి వుంటాయి. అక్కడ భారీగా దించిన
పోలీసుల్ని, పారా మిలటరీ దళాల్నీ చూస్తే చాలు ఎలీనవారు ఎంతగా భయపడ్డారనేది తెలిసిపోతుంది.
అదే అసలు విషయం.
కాక్రోచ్ జనతా పార్టికి సోషల్ మీడియాలో
రెండు కోట్ల కన్నా ఎక్కువ మంది మద్దతు పలికారు. అంతమంది ఎలాగూ ఢిల్లీ రాలేరు. వస్తే
ఎలా వుంటుందో ఆ ప్రళయ దృశ్యాన్ని ఊహించడం కూడ కష్టం. వెయ్యిమంది గోల చేస్తే వందమంది
వచ్చారు అని కొన్ని మీడియా సంస్థలు ఎద్దేవ చేశాయి. రెండు కోట్లలో పది శాతం ఎంతో వాళ్లు
లెఖ్ఖగట్టినట్టు లేదు. ఇంకా టీనేజ్ కూడ దాటని
విద్యార్ధులు దేశ రాజధాని వీదుల్లో నిటారుగా నిలబడి జాతీయ విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర
ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలని ధైర్యంగా నినాదాలు చేశారు. ఇందులో ఎవరికీ రాబోతున్న
ఒక కొత్త పరిణామం కనిపించడంలేదా?.
డిజిటల్ జెనరేషన్ వీధుల్లోనికి వచ్చినప్పుడెల్లా ఒక సామాజిక కార్యకర్తని బలివ్వడం ఒక సాంప్రదాయం. గత ఏడాది సెప్టెంబరు లడాఖ్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని విద్యార్ధులు ఆందోళనకు దిగినపుడు అక్కడి విద్యా
సంస్కర్త, ప్రసిధ్ధ సైంటిస్టు సోనమ్ వాంగ్ చూ ను అరెస్టు చేసి ఆరునెలలు జైల్లో నిర్భందించారు.
విద్యార్ధుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాంగ్ చుక్ రెచ్చగొట్టాడు అనేది ఆరోపణ. ఇప్పుడు దాదాపులాంటి
కథే పునరావృతం అవుతోంది. ఇప్పుడు ఢిల్లీ నొరసన ప్రదర్శనలకు పాట్నా ఖాన్ సర్ ను బలిపీఠం ఎక్కిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ఒక విచిత్రమైన ప్రశ్న
తరచుగా వినిపిస్తుంది. ప్రజాదరణ పొందిన వ్యక్తులు అధికార వ్యవస్థలతో ఘర్షణకు దిగితే
ఏమవుతుంది? లడఖ్ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ అయినా, లక్షలాది విద్యార్థుల ఆదరణ పొందిన
ఖాన్ సర్ అయినా, వారి చుట్టూ వివాదాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి?
ఖాన్ సర్ అసలు పేరు ఫైజల్ ఖాన్. సోనం
వాంగ్‌చుక్, ఖాన్ సర్ మధ్య ప్రత్యక్ష పోలికలు చాలా పరిమితమే. ఒకరు పర్యావరణం, రాజ్యాంగ
హక్కుల కోసం ఉద్యమం చేస్తున్న సామాజిక కార్యకర్త. మరొకరు విద్యా రంగంలో లక్షలాది మంది
విద్యార్థులకు చేరువైన ఉపాధ్యాయుడు. అయినప్పటికీ ఇద్దరి మధ్య ఒక సామాన్య అంశం ఉంది.
ఇద్దరూ తమ తమ రంగాల్లో భారీ ప్రజాదరణ సంపాదించారు. ప్రజాదరణ పెరిగిన వ్యక్తుల చర్యలు,
వ్యాఖ్యలు, ఉద్యమాలు సహజంగానే ప్రభుత్వాలు, మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి.
ఈ ఇద్దరి వెనుక పెద్ద సామాజిక మద్దతు
ఉంది. వాంగ్‌చుక్‌కు లడఖ్ ప్రజలు, పర్యావరణ ఉద్యమకారులు మద్దతు ఇస్తారు. ఖాన్ సర్‌కు
విద్యార్థులు, ఉద్యోగార్థులు, మధ్యతరగతి కుటుంబాల మద్దతు ఉంది. సమాజ శాస్త్రవేత్త మాక్స్
వెబర్ దీనిని "కరిష్మాటిక్ అథారిటీ" అని అంటాడు. అంటే పదవి వల్ల కాకుండా వ్యక్తిగత ప్రభావం వల్ల ఏర్పడే
నాయకత్వం. అలాంటి వ్యక్తులు ప్రజలలో ఆశలు, ఆకాంక్షలు, భావోద్వేగాలను ప్రేరేపిస్తారు.
ఖాన్ సర్ కేవలం ఒక కోచింగ్ టీచర్ మాత్రమే
కాదు. లక్షలాది మంది ఉద్యోగార్థులకు, విద్యార్థులకు పరిచయమైన ప్రజా వ్యక్తి. ఖాన్ గ్లోబల్
స్టడీస్ (KGS) అనే సంస్థ ద్వార పేద విద్యార్ధులకు చాలా తక్కువ ఫీజుతో కాంపిటేటివ్ పరీక్షలకు
కోచింగ్ ఇస్తుంటారు. ఆయన విద్యార్ధులు లక్షల్లో వుంటారు. ఆయన YouTube ఛానల్ కు 25 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు వున్నారు. ఇటీవల మల్టీ
స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి నమ్మలేనంత తక్కువ ఫీజులకు వైద్య సేవలు అందించడం మొదలెట్టారు.
లోకంలో ఎవరయినా పేదలకు సేవ చేయాలనుకుంటే
వెంటనే వారికి ధనవంతులు శత్రువుగా మారిపోతారు.
విద్యారంగంలో కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు, వైద్యరంగంలో కార్పొరేట్ హాస్పిటళ్లు ఖాన్ సర్ ను పెద్ద శత్రువుగా భావిస్తున్నాయి. సమయం
కోసం ఎదురుచూస్తున్నాయి.
ఖాన్ సర్ అకడమిక్ అంశాలు తప్ప సాధారంగా
రాజకీయాలు మాట్లాడరు. హిందూ-ముస్లిం విభజన గురించు కూడ మాట్లాడదు. కరెంట్ అఫైర్స్ క్లాసులు
చెప్పే సమయంలో ఇరాన్ యుధ్ధం గురించి, రష్యా చమురు గురుంచి ఇటీవల ఆయన ఆన్ లైన్లో మాట్లాడుతున్న
విషయాలు ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందికరంగానే మారాయి.
ముఖ్యంగా NEET పరీక్షా వివాదాలు,
NTA పనితీరుపై ఆయన బహిరంగంగా విమర్శలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు
ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు. ఒక దశలో కేంద్ర విద్యాశాఖమంత్రి నైతిక బాధ్యత వహించి
రాజీనామా చేయాలని కోరారు. అంతే. నిప్పు రాజుకుంది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు
కొదువా?
ఆయన ప్రత్యర్ధులయిన ఒక కార్పొరేట్ కోచింగ్
సెంటర్ ప్రోద్భలంతో రెండు డజన్ల మంది జూన్ 2 రాత్రి ఖాన్ గ్లోబల్ స్టడీస్ భవనం మీద
దాడి చేశారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కేజిఎస్ భద్రతా సిబ్బంది దుండగుల్ని అడ్డుకుంది.
అయినప్పటికీ పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపింది. అక్కడ నుండి
కథ అడ్దం తిరిగింది. ఖాన్ సర్ మీద కేసు నమోదు అయింది. కాల్పులు జరపమని భద్రతా సిబ్బందిని
ఖాన్ సర్ ఆదేశించినట్టు క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. అయితే, అతన్ని అరెస్టు చేయవద్దని
పాట్నా సివిల్ కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీచేసింది. ఇది ఎంతకాలం ఆయనకు అరెస్టు కాకుండా
రక్షణ ఇస్తుందో తెలీదు. ప్రత్యర్ధులు పైకోర్టులకు తప్పక వెళతారు. ఈ కేసు కేంద్ర ప్రభుత్వానికి
కూడ కీలకమైనది. విధ్యాశాఖా మంత్రి రాజీనామా చేయాలని ఖాన్ సర్ చేసిన్బ డిమాండును కేంద్ర
ప్రభుత్వ పెద్దలు అంతత్వరగా మరచిపోరు. ఎస్.ఎస్. సి. యూజి పేపర్ రీ-వాల్యూయేషన్ కోరిన
విద్యార్ధి లొకేషన్ నెట్లో సౌత్ ఏషియా అని వస్తేనే అతను పాకిస్తానీ అనేసిన మీడియా,
ఇంటి పేరు ఖాన్ అని వున్నాయన్ని ఇంకేమి అంటదో ఊహించుకోవచ్చు.
ఖాన్ సర్ మద్దతుదారులలో చాలామంది ఆయనపై
అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారు. మరోవైపు, చట్ట అమలు సంస్థలు తాము కేవలం విచారణ
నిర్వహిస్తున్నామని చెబుతున్నాయి. ఇక్కడే ప్రజాస్వామ్యంలో ఒక సవాలు ఉంటుంది. ప్రజల
భావోద్వేగాలు ఒక వైపు, న్యాయ ప్రక్రియ మరోవైపు. హన్నా అరెండ్ చెప్పినట్లుగా, ప్రజాస్వామ్యానికి
అత్యంత ప్రమాదకరమైనది అబద్ధం కాదు; వాస్తవం మరియు అభిప్రాయం మధ్య సరిహద్దు చెదిరిపోవడమే.
అందువల్ల మనం వాస్తవాలను, ఆరోపణలను, అభిప్రాయాలను వేరు చేయాలి.
సోనం వాంగ్‌చుక్, ఖాన్ సర్, లేదా గతంలో
వివిధ రంగాల్లో ప్రజాదరణ పొందిన ఇతర వ్యక్తులు—వారి
చుట్టూ ఏర్పడిన వివాదాలు ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం
కలిగిన వ్యక్తులు అధికార వ్యవస్థలను ప్రశ్నించినప్పుడు, వారు ఎక్కువ వేధింపులకు గురవుతారా?
లేక ప్రజాదరణ పెరిగిన కొద్దీ సహజంగానే వివాదాలు కూడా పెరుగుతాయా? దీనికి సులభమైన సమాధానం
లేదు. కానీ ప్రజాస్వామ్య ఆరోగ్యానికి అవసరమైనది ఒకటే—ప్రశ్నించే
హక్కు ఉండాలి, విచారణ నిష్పాక్షికంగా జరగాలి, తీర్పు సాక్ష్యాల ఆధారంగా రావాలి.
నిజానికి ప్రజాస్వామిక యుగంలో ప్రజలకు మెరుగైన విద్యా, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ అలా జరగడంలేదు. ప్రభుత్వాలు
ఒక పథకం ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థల్ని, హాస్పిటల్స్ ను నిర్వీర్వం చేసేస్తున్నాయి.
దానితో ప్రజలు ప్రైవేటు విద్యాసంస్థల్ని, కార్పొరేట్ హాస్పీటల్స్ ని ఆశయించక తప్పడం
లేదు. ఇదే అదనుగా కార్పొరేట్ విద్యా సంస్థలు.
హాస్పిటల్స్ ఫీజుల్ని, పరీక్షల్ని, వైద్యప్రక్రియల ధరల్ని విపరీతంగా పెంచేశాయి. ఎవరో
అన్నట్టు కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు వున్నంత వరకు ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్లు
లీక్ అవుతూనే వుంటాయి. కొన్నిసార్లు ఆ విషయం బయటపడుతుంటుంది. అనేకసార్లు బయటపడదు.
ఇక్కడో తాత్విక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలు నిర్వీర్యం అయిపోవడంవల్ల కార్పొరేట్ సంస్థలు లాభాలు
దండుకుంటున్నాయా? లేక తద్భిన్నంగా, కార్పొరేట్ సంస్థల లాభాల్ని పెంచడానికే ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్ని నిర్వీర్యం చేసేస్తున్నదా?
కారణం ఏదైనా ఇది కొత్తగా ఎదిగి వస్తున్న కొత్త తరం సమస్య. మనం ఆలోచించాల్సింది వారి
గురింది.
సమాజంలో చాలా అరుదుగానే సోనమ్ వాంగ్
చుక్, ఖాన్ సర్ లాంటివారు పుడతారు. వాళ్ళు గొప్పవాళ్ళే కావచ్చుగానీ వ్యవస్థ చాలా బలమైనది.
చాలా క్రూరమైనది.
09-06-2026
No comments:
Post a Comment