Sunday, 25 August 2013

Polavaram - Boon or Bane


పోల‘వర’మా, శాపమా?

ఏ. యం. ఖాన్ యజ్దాని (డానీ) 

నీటి వనరులు పుష్కలం
యాజమాన్య పద్ధతులదే లోపం
ఓటు బ్యాంకు రాజకీయాలతో సమస్య
విభజన ప్రకటనతో భయాందోళనలు
పరిష్కార మార్గాలు లేకపోలేదు!
నిల్వ సామర్ధ్యంలో పొరుగు రాష్ట్రాలే మిన్న
సహృద్భావ సూచిక ‘తెలుగు గంగ’
వివాద పరిష్కారమే సామర్ధ్య పరీక్ష 

అంధ్రప్రదేశ్‌ ను  విభజించాలని  కాంగ్రెస్‌ వర్కింగ్‌  కమిటి చేసిన తీర్మానంలోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ అనే రెండు అంశాల మీద  జరుగుతున్నంత చర్చ రాయలసీమ-తీరాంధ్ర (రాయలాంధ్ర) ప్రాంతాలకు కీలకమైన పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టు మీద  జరగడంలేదు.  

దక్షణ భారత దేశంలో అతిపెద్ద నదులు గోదావరి, కృష్ణా.  ఈ రెండూ ఆంధ్రప్రదేశ్  మీదుగా ప్రహించి,  తూర్పున బంగాళా ఖాతంలో కలుస్తాయి. పైగా, ఈ రెండు నదుల పరివాహక ప్రాంతంలో అత్యధిక భాగం అంధ్రప్రదేశ్‌ లోనే వుండడం ఇంకో విశేషం. తమిళనాడుతో  పోలిస్తే, ఆంధ్రప్రదేశ్‌ లో నీటి వనరులకు కొదువలేదు.  లోపం ఏదైనా వుంటే అది నదీజలాల యాజమాన్య పధ్ధతుల్లోనే వుంది. ఆంధ్రప్రదేశ్‌ లో నీటి అవసరాలు,  నదీజలాల  లభ్యతల్ని  పరిగణనలోనికి తీసుకుంటే, మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ నీళ్ళే అందుబాటులో వున్నాయని సులువుగానే అర్ధం అవుతుంది. అయితే, మూడు ప్రాంతాల నాయకులు ఆడే  ఓటు బ్యాంకు రాజకీయల కారణంగా మనం మనకున్న జలవనరుల్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం.  

అంధ్రప్రదేశ్‌ లో గోదావరి నది తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. కృష్ణానది  రాయలసీమ, తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాల్లో ప్రవహిస్తుంది.  గోదావరినది నీటి మీద వాటాదార్లు  ఇద్దరే తెలంగాణ, తీరాంధ్ర.  కృష్ణానది నీటి మీద వాటాదార్లు ముగ్గురు రాయలసీమ, తెలంగాణ, తీరాంధ్ర. ఇందులో విచిత్రం ఏమంటే, గోదావరి నదిలో నీళ్ళు ఎక్కువ వాటాదార్లు తక్కువ. కృష్ణానదిలో నీళ్ళు తక్కువ వాటాదార్లు ఎక్కువ.   

రేపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే, కృష్ణా,  గోదావరి నదుల నీటిని తీరాంధ్ర ప్రాంతానికి పారవు, పారనివ్వరు  అనేది ఒక ఆరోపణ. తెలంగాణ ఉద్యమ కాలంలో కొందరు నాయకులు, కొన్ని సందర్భాల్లో అతి‌ఉత్సాహంతో చేసిన హెచ్చరికలు కూడా ఇలాంటి భయాందోళనలకు దోహదం చేశాయి. తెలంగాణకు చెందిన  ఉదారవాదులు ఇలాంటి అపొహల్ని అనేకసార్లు కొట్టివేసినా  సీమాంధ్రలో అవి కొనసాగుతూనే వున్నాయి.  ఈ భయం కారణంగానే తాము ’సమైక్యాంధ్రా’ను కొరుతున్నామని వాదించేవాళ్ళు  తీరాంధ్రలో పెద్ద సంఖ్యలోనే వున్నారు. ఎక్కడైనా సమస్య ఉదారవాదులతోరాదు, దుందుడుకువాదులతోనే వస్తుంది.   

ఈ భయాందోళనల్ని పరిశీలించే ముందు మనం మరికొన్ని వాస్తవాలను గమనించాల్సివుంది.  ఉత్తర ఆఫ్రికా ఖండంలోని నైలునది పదకొండు దేశాల మీదుగా ప్రవహిస్తుంది. వీటిల్లో, ఈజిప్టు, సుడాన్ దేశాలకు  నైలునది మినహా మరో నీటి వనరు లేదు.  సింధూనది చైనాలోని మానససరోవరంలో పుట్టి, భారత్,  పాకిస్తాన్ ల మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారత - పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతతల గురించి అందరికీ తెలుసు. సింధూ, దాని ఉపనదుల్ని 53 సంవత్సరాలుగా భారత,  పాకిస్తాన్ లు వివాదంలేకుండా పంచుకుంటున్నాయని చాలా మందికి తెలీదు. 19 సెప్టెంబరు 1960 న దాయాది దేశాలు రెండూ కరాచీలో, సింధూ జలాల ఒప్పందం చేసుకున్నాయి. గడిచిన యాభై యేళ్లలో భారత_పాకిస్తాన్ ల మధ్య మూడు యుధ్ధాలు జరిగాయి. అయినప్పటికీ, సింధూ వాటర్స్ ట్రీటీ అమలుకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదు.   

దాయాది దేశాలే నిరంతరం నదీజలాల్ని పంచుకుంటున్నప్పుడు, దాయాది రాష్ట్రాలు పంచుకోలేవా? అంధ్రప్రదేశ్ సమైక్యంగా వున్న నాటితో పోలిస్తే, విభజనానంతరం  కొన్ని కొత్త ఇబ్బందులు తలెత్తే మాట నిజమేగానీ, వాటిని అధిగమించడానికి ఆధునిక మార్గాలు, పరిష్కారాలు, ఏర్పాట్లు, మార్గదర్శకాలు లేకపోలేదు. 

రెండు రాష్ట్రాలు సంయుక్తంగా నీటిపారుదలా ప్రాజెక్టుల్ని నిర్మించి, నిర్వహించడం మన దేశంలో కొత్తేమీకాదు. ఇప్పటికే తుంగభద్రా ప్రాజెక్టును  ఆంధ్రప్రదేశ్‌,  కర్ణాటక రాష్ట్రాలు సంయుక్తంగా  నిర్వహిస్తున్నాయి. దీని నిర్వహణ కోసం ఏర్పడిన తుంగభద్ర  కంట్రోలు బోర్డులో,  ఆంధ్రప్రదేశ్‌,  కర్ణాటక రాష్ట్రాల చీఫ్‌ ఇంజినీరు స్థాయి అధికారులు సభ్యులుగానూ, కేంద్ర జలసంఘం నియమించిన అధికారి అధ్యక్షునిగానూ వుంటారు. రేపు ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక, రాజోలిబండ, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ తదితర ప్రాజెక్టుల ల సంయుక్త నిర్వహణకు కొత్తగా అంతర్ రాష్ట్ర మండళ్ళు పెట్టుకోవాల్సి రావచ్చు. అంతకు మించి నదీజలాల గురించి మరీ ఆందోళన పడాల్సిన పనిలేదు. అయితే, తీరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు హైదరాబాద్ లా ప్రారిశ్రామిక ప్రాంతాలుకాదు కాదు. ముఖ్యంగా, తీరాంధ్ర ప్రాతం నూట అరవై సంవత్సరాలుగా కాల్వ వ్యవసాయం సాగిస్తున్న ప్రాంతం. తీరాంధ్రుల్ని ఆర్ధర్ కాటన్ సంతతి అన్నా, కాల్వల సంతితీ అన్నా తప్పుకాదు. వాళ్లకు నీళ్ళుతప్ప, మరో వనరు తెలీదు. అందువల్ల, నదీ జలాలగురించి వాళ్ళు సహజంగానే ఎక్కువగా ఆతృత కనపరుస్తారు.  

వివాదాలు ఎప్పుడూ ఉంటాయి. రెండు దేశాలు, రెండు రాష్ట్రాల మధ్య నిర్మించే ప్రాజెక్టుల్లోనేకాదు, రెండు ప్రాంతాలు, రెండు జిల్లాల మధ్య నిర్మించే ప్రాజెక్టుల్లోనూ వివాదాలుంటాయి. అంతెందుకూ, దిగువస్థాయిలో,  రెండు చేల మధ్య, ఇద్దరి కమతాల మధ్య కూడా  వివాదాలుంటాయి. మనం చేయాల్సిందల్లా, ఇరువర్గాలకు న్యాయంచేసే పరిష్కారాన్ని  వెదకడం ఒక్కటే!  

నూరేళ్లలో డెభ్భయి ఐదు సంవత్సరాల నీటిలభ్యత ప్రాతిపదికగా నికరజలాలను నిర్ధారిస్తారు. నదుల్లో కొన్ని సందర్భాల్లో, బహుశ, ఐదారేళ్లకు ఒకసారి  వరదలు  వస్తుంటాయి. ఆ సందర్భంలో వచ్చే నీళ్ళను అదనపుజలాలు, మిగులు జలాలు, వరదనీళ్ళు అంటారు. కొత్త ప్రాజెక్టులకు అన్నిరకాల అనుమతులు, గుర్తింపులు, ఆర్థికసంస్థల సహాయ సహకారాలు రావాలంటే, తప్పనిసరిగా నికరజలాల కేటాయింపులుండాలి. అదనపుజలాలు నమ్మదగ్గవికావు. వీటిని నమ్ముకుని కొత్త ప్రాజెక్టులు కడితే న్యాయపరంగానేకాక, ప్రకృతి పరంగానూ తీవ్ర ఇబ్బందులు తప్పవు.  

నికరజలాలను నిర్ధారించడానికి ఎలాంటి గణన పధ్ధతిని అనుసరించారన్నదీ కీలకమే. ఒక నదిలో గరిష్ట నీటి లభ్యత సంవత్సరాలను పరిగణనలోనికి తీసుకున్నారా? కనిష్ట నీటి లభ్యత సంవత్సరాలను పరిగణనలోనికి తీసుకున్నారా? అన్నది ముఖ్యం. కనిష్ట నీటి లభ్యత సంవత్సరాలను పరిగణనలోనికి తీసుకుని నికర జలాలను నిర్ధారిస్తే, ప్రతి సంవత్సరం ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతానికి కఛ్ఛితంగా నీరు లభిస్తాయి. అలా కాకుంగా, గరిష్ట నీటి లభ్యత సంవత్సరాలను పరిగణనలోనికి తీసుకుని నికర జలాలను నిర్ధారిస్తే, ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి  ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతానికి ఆశించిన మేరకు నీరు రాక వ్యవసాయం ఇబ్బందులకు గురవ్వాల్సి వుంటుంది.  

కృష్ణానది నీటి వనరుల్లో, ఆంధ్రప్రదేశ్‌ వాటాకు 811 శతకోటి ఘనపు అడుగుల (టీయంసీ) నికరజలాల్ని ఆర్.యస్. బచావత్‌ కృష్ణా జలవివాదాల ట్రిబ్యూనల్‌  1976లో కేటాయించింది. ఈ మొత్తం నికరజలాల్ని  అప్పటికి కృష్ణానదిపై నిర్మించిన, నిర్మాణంలోవున్న, ప్రతిపాదనలోవున్న ప్రాజెక్టులకు విడివిడిగా కేటాయించేసింది. అంటే,  బచావత్‌ ట్రిబ్యూనల్‌ తరువాత కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టులు నిర్మించడానికి ఎలాంటి అవకాశమూ లేదు. ఒకవేళ, నిర్మించినా వాటికి నికరజలాల కేటాయింపులు వుండవు. ఈ క్రమంలో సాగిన కృష్ణానదీ జలాల పంపకాల్లో, రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగింది. దీనిని సరిదిద్దనంత వరకు రాయలసీమ రగులుతూనే వుంటుంది.    

గోదావరినదిలో నికర జలాలు 3, 565 టీయంసీ లున్నట్టు బచావత్ ట్రిబ్యూనల్ (జీడబ్ల్యూడిటీ) 1980  లో అంచనావేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా 1495  టీయంసీ లు కేటాయించింది. ఇందులో, గోదావరినదిపై 2004  నాటికి నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల్లో కేవలం 600  టీయంసీల నీరు మాత్రమే వినియోగం అవుతున్న కారణంగా, మరో  895  టీయంసీల నికరజలాలు అందుబాటులో వున్నట్టు అంచనా వేశారు.

కృష్ణా బేసిన్‌ లో నీటి లభ్యత తక్కువగా వుండడం, గోదారి బేసిన్‌ లో నీటి లభ్యత ఎక్కువగా వుండడంతో, ఈ రెండు నదుల్ని అనుసంధానం చేయాలనే ప్రతిపాదన చాలా కాలం క్రితమే బలాన్ని పుంజుకుంది. దాని ఫలితమే పోలవరం ప్రాజెక్టు. ధవిళేశ్వరం, బెజవాడ ఆనకట్టల రూపశిల్పి సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ మహాశయుడు 1850ల లోనే పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదనని ముందుకు తెచ్చాడు.  

గోదావరి నది నుండి 80 టీయంసీల నీటిని ప్రకాశం బ్యారేజి ఎగువన కృష్ణానదిలోనికి మళ్ళించి,  ఆమేరకు, నాగార్జునసాగర్‌ నుండి కృష్ణాడెల్టాకు విడుదల చేసే నీటిని ఆదాచేసి, తెలుగుగంగ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌. ఎల్‌. బి.సి) లకు నికర జలాలను కేటాయించాలనేది పోలవరం ప్రాజెక్టు లక్ష్యం. విశాఖపట్నానికి 23 టియంసీల తాగునీరు, కొత్త కాలువల పరివాహక ప్రాంతంలో 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు  సాగునీరు అందించడం, 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయడం కూడా ఈ బహుళార్ధసాధక  ప్రాజెక్టులో వున్నాయి. 

అయితే, పైన చెప్పినంత సులువైన ప్రాజెక్టు కాదు పోలవరం. నిర్మాణ విధానం (డిజైన్‌) మొదలు, నీటి పంపకాల వరకు ఇందులో అనేక వివాదాలున్నాయి.  80 టీయంసీల నీటిని గోదావరి బేసిన్‌ నుండి కృష్ణాబేసిన్‌ కు మళ్ళించడానికి ఎలాంటి డిజైను అవసరమనేది ప్రధాన అంశం. ముంపు, గిరిజనప్రాంతాల్లో భూసేకరణ,  పర్యావరణం, పొరుగు రాష్ట్రాల అంగీకారం, సహకారం తదితర అంశాలు ఇందులో వున్నాయి.  రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, పొరుగురాష్ట్రాల జాబితాలో ఆ రాష్ట్రం కూడా చేరుతుంది. 

ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్‌ లో కృష్ణా - గోదావరి నదుల్ని అనుసంధానం చేస్తే, కృష్ణానది ఎగువనున్న మహారాష్ట్రకు 18  శాతంగా 14 టియంసీలు, కర్ణాటకకు 27  శాతంగా 21 టీయంసీల నీళ్ళు అదనంగా ఇవ్వాలని బచావత్ ట్రిబ్యూనల్ సూచనల్లోనే ఒక నియమం వుంది. మనం చాలా వెనుకబడివున్నాంగానీ, ఈ అదనపు వాటా నీటిని నిల్వచేసుకోవడానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అప్పుడే సంపూర్ణ ఏర్పాట్లు చేసుకుని కూర్చున్నాయి. పొలవరం ప్రాజెక్టు పూర్తయ్యి, కృష్ణా బేసిన్‌ కు నీరు విడుదల అయిన మరుక్షణం,  కర్ణాటక నుండి మన రాష్ట్రంలోనికి  వచ్చే కృష్ణాజలాలు  అధికారికంగా 35 టీయంసీలు తగ్గిపోతాయి. అంటే,  కృష్ణా బేసిన్‌ లోనికి మళ్ళించే 80 టియంసీలలో  ఎగువరాష్ట్రాలకు 35 టీయంసీలు పోగా మిగిలేది 45 టీయంసీలే. వీటిల్లో  30 టీయంసీలు ఎస్‌.ఎల్‌.బి.సి.కు  15 టీయంసీలు తెలుగుగంగకు  కేటాయించాలని 1985లో, యన్‌.టీ. రామారావు నిర్వహింహించిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.  ఈ రెండు ప్రాజెక్టులకు ఇప్పటివరకు నికర జలాల కేటాయింపులు లేవు. 

ఈ వివాదం ఇంతటితో, ఆగలేదు. ”దృఢనిశ్ఛయంవుంటే దారి దానికదే తెరుచుకుంటుంది” అని నమ్మే వైయస్‌ రాజశేఖరరెడ్డి, జలయజ్ఞంలో భాగంగా కృష్ణా బేసిన్‌ లో వరదనీటి ఆధారంగా అనేక కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు వీటిల్లో ముఖ్యమైనవి. రేపు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక వీటికి నికరజలాల కేటాయింపు సమస్య తప్పక ముందుకు వస్తుంది. అప్పుడు పోలవరం స్తోమతను మరింతగా పెంచాల్సి రావచ్చు. లేదా, గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానం చేసే ప్రాజెక్టులు మరిన్ని నిర్మించాల్సి రావచ్చు. దానికి తీరాంధ్రతోపాటూ, తెలంగాణ కూడా సహకరిస్తేనే వీటి నిర్మాణం సాధ్యం అవుతుంది. 

నీటి వివాదాల గురించి, అన్నీ చెడ్డ ఉదాహరణలేకావు అనేక మంచి ఉదాహరణలూ వున్నాయి. 1953లో ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి ఆంధ్రాప్రాంతం విడిపోయింది. భావోద్వాగాలతో ముడిపడివున్న మద్రాసు నగరాన్ని వదులుకోవాల్సి వచ్చింది.  మద్రాసును వదిలి వెళ్ళిపొమ్మని అప్పటి ముఖ్యమంత్రి సీ. రాజగోపాలాచారి (రాజాజీ) ఆదేశించడం ఆంధ్రా నాయకులు మరిచిపోలేని ఒక చేదు అనుభవం. అయితే ఆంధ్రులు ఆ చేదు అనుభవాన్ని చాలా త్వరగా మరిచిపోయారు. 1980వ దశకంలో మద్రాసు నగరం తీవ్ర నీటి ఎద్దడికి గురయింది. తాగునీటికి కూడా అవకాశంలేక మద్రాసు నగరవాసులు కటకటలాడిపోయారు. విజయవాడ నుండి  కృష్ణా నీటిని ప్రతిరోజూ ఎన్నో వ్యయప్రయాసలతో  ప్రత్యేక రైళ్లలో మద్రాసు నగరానికి సరఫరా చేసేవారు.  అప్పటి ముఖ్యమంత్రి యన్టీ రామారావు, చెన్నపట్నంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని, కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్‌  వాటా నుండి 5 టియంసీలు మద్రాసు నగర ప్రజల తాగునీటీ కోసం ఇవ్వాలని నిర్ణయించారు.  మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఉదారంగా స్పందించి చెరో  5  టియంసీల నీరు మద్రాసుకు కేటాయించాయి. మద్రాసుకు 15 టీయంసీల నీరు పంపడంతోపాటూ, పనిలోపనిగా రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో కొంత కొత్త ఆయకట్టుకు కూడా  సాగునీరు అందించాలని యన్టీ‌ఆర్‌ భావించారు. అలా రూపుదిద్దుకున్నదే తెలుగుగంగ ప్రాజెక్టు. 

ఇలాంటి సహృధ్భావ సంఘటనలు అనేకం ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత కూడా జరుగుతాయననే ఆశిద్దాం. ఇరువైపులా భావోద్వేగాలు తీవ్రంగా వున్నప్పటికీ నీటి వివాదాల్ని సామరస్యంగా పరిష్కరించడమే మన సామర్ధ్యానికి పరీక్ష! 

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ ః 90102 34336 

హైదరాబాద్‌
22 ఆగస్టు 2013

Friday, 16 August 2013

Red Fort Speeches

నిస్సారంగా ఎర్రకోట ఉపన్యాసాలు!

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ) 

నిస్సారంగా ఎర్రకోట ఉపన్యాసాలు!

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

స్వాతంత్ర్య దినోత్సవమంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల పండుగలా మారిపోయిందిగానీ,  మూడు దశాబ్దాల క్రితం వరకు అది ప్రజల పండుగలా వుండేది. ఎర్రకోట బురుజుల మీద నిలబడి దేశప్రజల్ని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసే ప్రసంగాన్ని వినడానికి జనం ఆసక్తిగా ఎదురు చూసేవారు. తమ భవిష్యత్తును నిర్ణయించే ప్రతి వాక్యపు ప్రతి పదాన్నీ రేడియోలూ, ట్రాన్సిస్టర్లకు చెవులురిక్కించి మరీ వినేవారు. ఇళ్లల్లో, టెలివిజన్లు వచ్చాక కళ్లప్పగించి చూసేవారు. మరునాడు దినపత్రికలన్నింటి మొదటి పేజీలన్నీ ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలతో నిండిపోయేవి.

  ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రధాని మన్మోహన్ సింగ్  ప్రసంగం దినపత్రికల ఫ్రంట్ పేజీల్లో డబల్ కాలమ్ నుండి సింగిల్ కాలమ్ కు కుచించుకుపోయింది. నిష్కర్షగా చెప్పాలంటే, ఈసారి ప్రధాని ఎర్రకోట ఉపన్యాసంకన్నా కిలో ఉల్లిపాయల ధర వంద రూపాయలకు చేరబోతుందనే వార్తే ఎక్కువమంది పాఠకులు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

  దేశానికి స్వాతంత్రంవచ్చి డెభ్భయి యేళ్ళు కావస్తున్న తరుణంలో, దేశప్రజలకు ఆహార భద్రత కల్పించగలమని కేంద్ర ప్రభుత్వాధినేత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు!. అంటే, దేశప్రజల్లో ఒక ప్రధాన భాగానికి ఇప్పటికీ కడుపు నిండా తిండి కూడా అందడంలేదని ప్రధాని  ఆమోదిస్తున్నారు. భారత స్వాతంత్ర సంగ్రామానికి ఇంతకన్నా అవమానకర నివాళి ఇంకేముంటుందీ?

  మన జాతీయ సగటు అభివృధ్ధి రేటు 5 శాతం మాత్రమే వుందని, స్వయంగా ఆర్ధిక సంస్కరణల పాత్రధారి మన్మోహన్ సింగే అంటున్నారు. ఆర్ధిక సంస్కరణల సూత్రధారి పీవీ నరసింహారావు అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నడూ లేనిది మన్మోహన్ సింగ్ తొలిసారిగా తన రాజకీయ గురువైన పీవీ నరసింహారావును ఎర్రకోట ప్రసంగంలో  తలచుకోవడం విశేషం. కష్టకాలంలోనే మనుషులకు తల్లిదండ్రులు, గురువులు, కోల్పోయిన మిత్రులు గుర్తుకు వస్తారు.

సగటు అభివృధ్ధి రేటు గురించి మాట్లడే సమయంలో మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేశంలోని వున్నతవర్గాలు, కార్పొరేట్ కంపెనీలు భారీ లాభాల బాటలో నడుస్తున్నట్టు మనం తరచుగా పత్రికల్లో చూస్తున్నాం. దాని అర్ధం ఏమిటంటే, మధ్యతరగతి, ఆ దిగువ తరగతి ప్రజలు రుణ_అభివృధ్ధికి గురవుతున్నారని అర్ధం. ఒక్కమాటలో చెప్పాలంటే, దేశంలోని సగటు, పేద వర్గాలు మరింత పేదలుగా మారిపోతున్నారని అర్ధం.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక పెరగడంవల్ల, పలు రంగాల్లో అభివృధ్ధిని సాధిస్తామని, స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో, ప్రధాని చెప్పడం ఒక వైచిత్రి! 1863 నాటి అమెరికా అంతర్వ్యుధ్ధపు రోజుల్లో "ప్రజలద్వార (ఎన్నుకోబడి), ప్రజలచే (నడపబడి), ప్రజల కొరకు (పనిచేసే) ప్రభుత్వం ఈ భూమి మీద ఎన్నటికీ నశించదు" అన్నాడు అబ్రహామ్ లింకన్ . ఆ మాటల్ని గమనిస్తే, మనకు ఏం అర్ధం అవుతుందీ?   ప్రజల ద్వార (ఎన్నుకోబడి), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులచే (నడపబడి), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కొరకు (పనిచేసే) ప్రభుత్వం ఈ భూమి మీద ఎంతోకాలం బతకదు అనేకదా!.

నా మిత్రుడు, సీనియర్ పాత్రికేయుడు రంగావజ్జుల భరద్వాజ ప్రధాని ఉపన్యాసం విన్నాక ఓ మాట అన్నాడు. "మనోళ్లు 1857  నుండి 1947  వరకు దాదాపు తొంభయి యేళ్ళు స్వాతంత్ర సమరాన్ని సాగించారు. బహదూర్ షా జాఫర్, నానాసాహెబ్ పేష్వా మొదలుకుని రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్ల ఖాన్,   చంద్రశేఖర ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వరకు అనేక యోధులు పోరాడారు. స్వదేశీ ఉద్యమం మొదలుకుని క్విట్ ఇండియా, శాసనోల్లంఘనం వరకు అనేక పోరాటలు చేసి, వేలాదిమంది జైళ్లకు పోయి, జలియన్ వాలా బాగ్ వంటి నరమేధాల్లో వందలాదిమంది చనిపోయి దేశానికి స్వాతంత్రం తేవడం అంతా వృధాకద సార్!" అన్నాడు.

నా మిత్రుని మాటలు కాస్త కటువుగా వుండవచ్చుగానీ అర్ధంలేనివి మాత్రంకావు. రెండు వందల అరవై యేళ్ల క్రితం బ్రిటీషువాళ్ళు ప్లాసీ యుధ్ధం చేసి, అంతకు ముందు పోర్చుగీసువాళ్ళు, ఫ్రెంచివాళ్ళు ఇంకేవో యుధ్ధాలు చేసి భారత దేశాన్ని తమ వలసగా మార్చుకున్నారు. ఇప్పుడయితే, అన్ని యుధ్ధాలు గట్రా చేయాల్సిన పనిలేదు. గౌరవనీయమైన పార్లమెంటు సభ్యుల్ని కాస్త మంచి చేసుకుంటే చట్టబధ్ధంగానే దేశాన్ని ఆధునిక వలసగా మార్చుకోవచ్చు! గౌరవనీయమైన పార్లమెంటు సభ్యుల్ని చాలా మంది చాలా సందర్భాల్లో మంచి చేసుకున్న సంఘటనలు మనకు తెలుసు. 1993  లో పీవీ నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని గెలిచినపుడు జార్ఖండ్ ముక్తి మోర్చా పాత్ర వివాదాస్పదంగా మారింది. అలాగే, 2008 లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం భారత_అమేరిక పౌర అణు ఒప్పందం బిల్లును గెలిపించుకున్నప్పుడూ అలాంటి వదంతులు బయటికి వచ్చాయి. మొన్న ఎఫ్ డీఐ బిల్లు పాసైనపుడు కూడా  భారీ మొత్తాలు చేతులుమారిందని వార్తలు వచ్చాయి. అంత పెద్ద మొత్తాలు చేతుల్లో పట్టవు గనుక, సూటుకేసులు మారడమో, ఆన్ లైన్ ట్రాన్సఫర్లో జరిగాయి అనుకోవాలి.

మొదటి యుపియే, రెండవ యూపియే గా పిలిచే సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్ ల  తొమ్మిదేళ్ల పాలనలో  ప్రజల మేలు కోసం ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనైనా ఎవరికైనా గుర్తుందా?  కోల్, రైల్, 2 జీ స్పెక్ట్రం, ఛాపర్, టాట్రా ట్రక్స్, కామన్ వెల్త్ గేమ్స్, క్యాష్ ఫర్ ఓట్, ఆదర్శ్ అపార్ట్ మెంట్, ఐపిఎల్, సత్యం స్కాములు తప్పా.

అలాగని, ఎన్డీయే చరిత్ర అత్యంత పవిత్రమైనది అనేమీకాదు. కార్గిల్ యుధ్ధ అమర సైనికుల శవపేటికల స్కామ్ ఎన్డీయే ప్రభుత్వంలోనే జరిగిందన్నది మరిచిపోవడం కష్టం. ఒక కోటి నలభై లక్షల టన్నుల ఇనప ఖనిజాన్ని అక్రమంగా తవ్వేసి చైనా తదితర విదేశాలకు తరలించేసి, నాలుగున్నర వేల కోట్ల రూపాయల దేశసంపదని దోచేసిన ఓబుళాపురం గనుల ఘనులు ఆ కుంభకోణానికి పాల్పడ్డప్పుడు, సంఘపరివారం సభ్యులే అన్నది మన జ్ఞాపకాల నుండి ఇంకా చెరిగిపోలేదు.

అయితే, యూపియే, ఎన్డీయేలు సంయుక్తంగా ఈ దేశప్రజలకు ఒక అద్భుతమైన స్వేఛ్ఛనిచ్చారు. తలను రాయితో బద్దలుగొట్టువాలా? ఇటుకతో బద్దలు గొట్టుకోవాలా? అనే స్వేఛ్ఛ అది. ఇది కాకపోతే అది. బీజేపి మతవాద కాంగ్రెస్ అయితే. కాంగ్రెస్ మితవాద బీజేపి.

సోనియా, మన్మోహన్, రాహుల్, రాబర్ట్ వధేరాల పాలనను అంతంచేయడానికి వజ్రాయుధ్ధాన్ని చేతబట్టి దూసుకు వస్తున్నాడని ఒకరకం మీడియా కొనియాడుతున్న బీజేపి ఎన్నికల ప్రచార సారధి నరేంద్ర మోదీ కూడా ఈవారమే తన యువభారత జయభేరీని హైదరాబాద్ లో ఆరంభించారు. మోదీ తొలి సభ హైదరాబాద్ కావడానికి ఒక చారిత్రక నేపథ్యం వుంది.

ఇందిరాగాంధీ హత్య తరువాత జరిగిన 1984 సాధారణ ఎన్నికల్లో, దేశమంతటా వీచిన కాంగ్రెస్ సానుభూతి పవనాల్లో  బీజేపీ మట్టికరిచింది. ఆ పార్టీకి లోక్ సభలో రెండే రెండు సీట్లు లభించాయి. గుజరాత్ లోని మెహాసన నుండి అమ్రత్ భాయ్ కాళీదాస్ పటేల్, ఆంధ్రప్రదేశ్ లోని హనమకొండ నుండి చందుపట్ల జంగారెడ్డితప్ప, బీజేపీ అతిరథమహారథులందరూ ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈ సెంటిమెంటుతోనే, గుజరాత్ కు చెందిన నరేంద్ర మోదీ తన ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ లో మొదలెట్టారు.

మన్మోహన్ సింగ్ ను మీడియా మౌనముని అంటుంది. నరేంద్ర మోదీ అలాకాదు. వారు బహిరంగ సభల్లో నిప్పులు కురిపించగలరు. అయితే, దేశరాజకీయ పరిస్థితీ,  ప్రాంతీయ తెలంగాణ వాతావరణం ఎంతో అనుకూలంగా వున్నప్పటికీ మోదీ హైదరాబాద్ ఉపన్యాసంలో విద్యుత్తు, విద్వత్తు రెండూ కనిపించలేదు. గుజరాత్ లో అభివృధ్ధి రేటూ భారీగా వుందని మోదీ గట్టిగా చెప్పడానికి ప్రయత్నించారుగానీ, ఆ ఘనతను మోదీ ఒక్కరికే ఇచ్చివేయడం సమంజసంకాదు. 1990 వ దశకంలో బీజేపి ప్రభావం గుజరాత్ లో పుంజుకోవడానికి ముందే ఆ రాష్ట్రంలో అభివృధ్ధి రేటు గణనీయంగా వుండింది. మోడీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు.  నిజానికి గుజరాత్ లో మోడీ సాధించినదానికన్నా చెడగొట్టిందే ఎక్కువ. ఆ రాష్ట్రం సామాజిక సూచికలు రెండవ ప్రపంచ యుధ్ధం నాటి జర్మనీని తలపిస్తూ భయపెడుతున్నాయి. దేశంలో అన్నింటికీ తావు వున్నట్టే ఫాసిస్టు ప్రేమికులు కూడా వుంటారు. మోదీ ఉపన్యాసం బహుశ వాళ్లను అలరించి వుండవచ్చు.

ప్రధాని ఎర్రకోట ఉపన్యాసం చారిత్రక ప్రాధాన్యతని కోల్పోతున్నది అనడానికి టెలివిజన్ రేటింగ్స్ ను కూడా ఒక సూచికగా భావించవచ్చు. స్వాతంత్ర దినోత్సవం రోజు అన్ని టీవీలు ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నించాయి. ప్రభుత్వరంగ దూరదర్సన్ ను మినహాయిస్తే, ఇతర న్యూస్ ఛానళ్ళలో ప్రధాని ఉపన్యాసం ఇన్_బాక్స్ ఫీచర్ గా మారిపోయింది. ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన అంశం కూడా వర్షంలో కొట్టుకు పోయింది. వచ్చే గురువారం విడుదలయ్యే టామ్ రిపోర్టును పరిశీలిస్తే ఈ వాస్తవాన్ని గణాంకాలతో సహా అర్ధంచేసుకోవచ్చు.

ఈ నిర్లిప్తత మన దేశంలోనే వ్యాపిస్తున్నదనుకుంటే పోరపాటు. ప్రపంపంచ వ్యాప్తంగా పాలకులపట్ల నిర్వేదం కొనసాగుతున్నదని టీవీ కార్యక్రమాలు చెపుతున్నాయి. ఏకధృవ ప్రపంచాన్ని ఏలుతున్నామని భావించే అమేరికా అధ్యక్షులకు కూడా ఈ గతి తప్పడంలేదు. అమేరికా అధ్యక్షుల ఓవల్ ఆఫీసు ప్రసంగం అంటే ఒకప్పుడు అదో చారిత్రక ఘట్టంలా వుండేది.  1962 లో క్యూబా క్షిపణి సంక్షోభం గురించి కెన్నడీ,  1986 లో అంతరిక్ష నౌక ఛాలెంజర్ పేలిపోయినపుడు రోనాల్డ్ రీగన్,   9/11 దాడి తరువాత జార్జి డబ్యూ బుష్ చేసిన ప్రసంగాల్ని ప్రపంచమంతా చెవులు రెక్కించి, కళ్ళు  పెద్దవి చేసుకుని చూసింది. అమెరికా అధ్యక్షుల ఓవల్ ఆఫీసు సాయంకాలపు ప్రసంగాల్ని టీవీ ఛానళ్లన్నీ ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేసేవి, తద్వార రేటింగ్ పాయింట్స్ ను భారీగా పెంచుకునే ప్రయత్నం చేసేవి.

రోనాల్డ్ రీగన్ రికార్డు స్థాయిలో  29 సార్లు ఓవల్ ఆఫీసునుండి ప్రైమ్ టైమ్ లో ప్రసంగించాడు. ఆ తరువాతి స్థానం  22 ప్రసంగాలతో రిచర్డ్ నిక్సన్ ది. ప్రస్తుత అధ్యక్షుడు బారక్ ఒబామా ఇటీవల వర్ణవివక్ష మీద చేసిన ప్రసంగంతో సహా మూడు సార్లు మాత్రమే ఓవల్ ఆఫీసు నుండి ప్రసంగించాడు. రేటింగ్స్ రావడం లేదని అమేరికా టెలివిజన్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు ప్రెసిడెంట్ ఓవల్ ప్రసంగాన్ని ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేయడానికి ఆసక్తి చూపడంలేదు. అధ్యక్షుని ప్రసంగాన్ని ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేయించడానికి వైట్ హౌస్ అధికారులు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలతో పైరవీలు చేస్తుండడం దీనికి కొసమెరుపు.  

తీరికలేని నేటి జీవితాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి ఉపన్యాసాల్ని జనం పట్టించుకోకపోవడం సహజమేనని కొందరు అనుకోవచ్చు. అది చాలా వరకు నిజమేగానీ, సమస్య అంతకన్నా తీవ్రమైనది. శాసనకర్తల్ని, రాజ్యాంగ నిర్వాహకుల్ని జనం పట్టించుకోవడం లేదంటే, ప్రజల్లో పార్లమెంటరీ వ్యవస్థ మీద అపనమ్మకమో, నిర్లిప్తతో పెరిగిపోతున్నదనేగా అర్ధం! పార్లమెంటరీ ప్రజాస్వామ్యం  అవసానదశకు చేరుకుంటుంన్నది అనడానికి ఇది గట్టి సంకేతం అనుకోవాలి.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మొబైల్ :  90102 34336

హైదరాబాద్
17  ఆగస్టు 2013

ప్రచురణ : సూర్య దినపత్రిక,
18 ఆగస్టు2013



Monday, 12 August 2013

Dictatorship of Communal Class & Cultural Nationalism

Dictatorship of Communal Class & Cultural Nationalism

మతవర్గతత్వ నియంతృత్వం సాంస్కృతిక జాతీయవాదం
. యం. ఖాన్ యజ్దానీ ( డానీ)


ఇప్పుడు రాష్ట్రాల్లో కులపోరాటాలు ఊపందుకుంటున్నాయనీ, జాతీయస్థాయిలో ఒక మతయుధ్ధ వాతావరణం కమ్ముకుంటున్నదని గుర్తించనివాళ్ళు బొత్తిగా అమాయకులైనా అయ్యుండాలి లేకుంటే మహాకపటులైనా అయ్యుండాలి. 

మనిషి స్వభావసిధ్ధంగా మంచివాడు అని ఎవరైనా అన్నప్పుడు వాళ్ళు ఒక గొప్ప విషయాన్ని చెపుతున్నట్టు మనమంతా నమ్ముతాము. కానీ, మనిషి స్వభావసిధ్ధంగా ఒక భూతం అని ఎవరైనా అంటే వాళ్ళు అంతకన్నా మహత్తర విషయాన్ని చెపుతున్నారని మనం మరిచిపోతాం అన్నాడు  హెగెల్.

జాక్ లండన్ నవల ’కాల్ ఆఫ్ ద వైల్డ్ ’ ముగింపు సన్నివేశంలో కథా నాయకుడైన బక్ అనే కుక్క అడవిలో తన యజమానితో భీకరంగా తలపడి అనూహ్యంగా చంపేస్తుంది. అప్పుడు జాక్ లండన్ ఒళ్ళు గగుర్పొడిచే ఒక వాక్యం రాస్తాడు. బక్ మనిషిని చంపింది. ఈ భూమి మీద అది అన్నింటికన్నా మహత్తరవేట. బక్  పనిచేసింది అంటాడు.

ప్రకృతిలో అతిక్రూరమైన జీవి మనిషి. తల్లిదండ్రులో, సోదరులో చనిపోతే వాళ్ల ఆస్తి తనకు సంక్రమిస్తుందని ఆశించేంతటి స్వార్ధపరుడు మనిషి. వ్యక్తిగతఆస్థి యావ ఒక భూతం. సోదరుల్ని, భార్యాబిడ్దల్నీ చివరకు తల్లిదండ్రుల్ని చంపడానికి కూడా వెనుకాడని భూతం మనుషుల్ని ఆవహించివుంటుంది. ఈ భూమ్మీద ముందుగా వేటాడాల్సింది వ్యక్తిగతఆస్థి యావ ఆవహించిన మనుషుల్ని. 

మనుషుల్లో దాగివున్న భూతం బిరడానుతీసి, ప్రజల్లో ఒక ఉన్మాదాన్ని రేకెత్తించి తన రాజకీయార్ధిక ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనుకుంటుంది మతవర్గనియంతృత్వం. యాధృఛికంగా సోదరులు చనిపోతే కొందరికి ఆస్తి కలిసి రావచ్చు.  కానీ, ఆస్తి కోసం సోదరుల్ని చంపేస్తే అది రక్తపు కూడు అవుతుంది. ఇంతటి కౄరత్వానికి ఒక సాంస్కృతిక జాతీయవాద ముసుగు కప్పి దానికి ఆమోదాంశాన్ని సాధించడం ద్వార చరిత్రలో మతవర్గ నియంతృత్వం ప్రవేశిస్తుంది.

సువిశాల ప్రజల ఆమోదాన్ని (పాపులర్ మ్యాండేట్) పొంది కొద్దిమందిగా వుండే పెట్టుబడీదారుల ఉమ్మడి ప్రయోజనాలను నేరవేర్చడమే  పెట్టుబడీదారీ రాజ్యం నిర్వర్తించే ప్రధాన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని సాధ్యమైనంత వరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వార  నెరవేర్చడానికే అది ప్రయత్నిస్తుంది. అయితే పెట్టుబడీదారుల సహజమైన అత్యాశవల్లనో, స్వయంకృతాపరాధాలవల్లనో ప్రజల విశ్వసనీయతను పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తరచూ  కోల్పోతూవుంటుంది. అలాంటి సందర్భాల్లో పెట్టుబడీదారీ రాజ్యం అడ్డడారుల్ని తొక్కైనాసరే పెట్టుబడీదారుల ఉమ్మడి ప్రయోజనాలను నేరవేర్చడానికి ప్రయత్నిస్తుంది. పెట్టుబడీదారీ రాజ్యం ఆలా వెతుక్కునే అడ్డదారుల్లో మతవర్గతత్వం ముఖ్యమైనది.  అప్పుడది మతవర్గ నియంతృత్వంగా మారుతుంది.

పార్లమెంటరీప్రజాస్వామ్యం, మతవర్గనియంతృత్వం రెండూ పెట్టుబడీదారీ నియంతృత్వానికి రెండు పార్శ్వాలు మాత్రమే. పార్లమెంటరీప్రజాస్వామ్యం మతానికి ముసుగేసి వుంచుతుంది.  మతవర్గనియంతృత్వం మతతత్వాన్ని  బోను నుండి బయటకు వదులుతుంది.

నియంతృత్వం అన్నింటికన్నా ముందుగా మనుషుల్ని వాళ్ళు మనం” అని విభజిస్తుంది. వాళ్లను అంతం చేసి మనం పెరుగుదాం అనేది ప్రతి నియంతృత్వం ఇచ్చే తొలి నినాదం.  ఆర్దిక సంక్షోభాల్లో కూరుకు పోయిన అసమసమాజాల్లో ఈ నినాదం అగ్నిలా వ్యాపిస్తుంది. 

సమాజంలో ధనిక-పేద వర్గాల మధ్య నిరంతరం అంతర్లీనంగా ఒక వైరం కొనసాగుతూ వుంటుంది. ఆ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా  పాలకవర్గాలకు ఊడిగం చేయక తప్పదు. నిజానికి తమకు మెరుగైన ఊడిగం చేసే పార్టీలు-కూటములనే  పాలకవర్గాలు ప్రోత్సహించి అధికార పీఠం మీద కూర్చోబెడుతుంటాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటు అనేది అచ్చంగా కార్పొరేటు సంస్థలు, రాజకీయ పార్టీల వ్యవహారంకాదు. అందులో ఓటర్ల పాత్రకూడా వుంటుంది.  ఎన్నికలకు ముమ్దు ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు అనేక  సంక్షేమ పథకాలను ప్రకటిస్తుంటాయి. కానీ, అధికారాన్ని చేపట్టగానే వాటి ప్రాధాన్యతలు మారిపోతాయి. కార్పొరేట్ సంస్థలు, నిర్మాణ కాంట్రాక్టు సంస్థల ప్రయోజనాలు ప్రధానంగా మారి ప్రజలకిచ్చిన వాగ్దానాలు అప్రధాన అంశాలుగా మారిపోతాయి.

దిష్టి తీయడానికి అన్నట్టు కొన్ని ప్రభుత్వాలు పేదప్రజలకు కొంత ముష్ఠి పడేస్తాయిగానీ కొన్ని ప్రభుత్వాలు ఆ ముష్ఠిని కూడా పడేయవు. తమకు ముష్ఠి కూడా పడేయని ప్రభుత్వాలను ప్రజలు ఎన్నికల సమయంలో మార్చేస్తుంటారు. ప్రజలు ఎలాగూ ఐదేళ్ళకోసారి ప్రభుత్వాల్ని మార్చేస్తున్నపుడు ఇక ముష్టిపడేయాల్సిన అవసరం కూడా లేదని పాలకులు ఒక నిర్ణయానికి వస్తారు. అలాంటి దశలోప్రభుత్వాలనుమార్చినా ప్రయోజనంలేదని గమనించిన ప్రజలు సమూలంగా సమాజాన్నే మార్చాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. ప్రజలకు అలాంటి సామాజిక చైతన్యం వచ్చినప్పుడెల్లా పార్లమెంటరీ రాజకీయ పార్టీలు కొత్త సంక్షేమ ప్యాకేజీలతో ఎన్నికల బరిలో దిగుతాయి.


అణగారిన సామాజికవర్గాలకు ఉద్దీపన పథకాలు, దేశాన్నిసామ్యవాద, మతసామరస్య, ప్రజాస్వామిక రిపబ్లిక్ గా ప్రకటించడాలు వంటి కొన్ని మహత్తర అంశాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వచ్చినవే. అయితే,వీటిని ప్రభుత్వాలు ప్రజల మీద ప్రేమతో ఇచ్చినవిగా గాక, ప్రజల చైతన్యం పోరాట రూపం దాలుస్తుందనే భయంతో ఇచ్చినవిగా భావించాలి. 

పాలకులకు, పాలితులకు మధ్య ఆర్ధికవైరాన్ని సాంస్కృతికనియంతృత్వం తోసిపుచ్చుతుంది. దేశప్రజల్లో ధనికులు, పేదలనే విభజనని అది తొలి అడుగులోనే నిరాకరిస్తుంది. దేశప్రజలందరూ ఒక అఖండజాతి  అనే ఒక బూటకపు నినాదాన్ని హోరెత్తించి ఉన్మాదాన్ని సృష్టిస్తుంది. అఖండజాతి సభ్యులందరూ కుల, వర్గ సాంస్కృతిక విబేధాలను మరచిపోయి దేశాభివృధ్ధి కోసం  ఎలాంటి త్యాగాలకైనా, ఎంతటి సాహసాలకైనా సిధ్ధపడాలని పిలుపిస్తుంది.  నిజానికి అది త్యాగాలు చేయమని కోరేది పేదవారిని, అణగారిన కులాలని, ఆదివాసుల్ని,  వెనకబడిన ప్రాంతాలని, మతఅల్పసంఖ్యాక వర్గాలని.  అది అభివృధ్ధిఫలాలు పంచేది ధనికులకు, పెత్తందారీ కులాలకు, మైదాన ప్రాంతాలకు, అందులోనూ అభివృధ్ధి చెందిన ప్రాంతాలకు, మత అధికసంఖ్యాక వర్గాలకు. అఖండజాతి సిధ్ధాంత ఆచరించే ఈ త్యాగాలు, పంపాకాలవల్ల ప్రయోజనం పొందేది  అధికసంఖ్యాక మత వర్గాలే కనుక ఈ సిధ్ధాంతం ఆ సామాజికవర్గంలోని పేదలకు కూడా ఉత్తేజాన్ని ఇస్తుంది. ఒక దశలో అది  ఉన్మాదంగానూ మారుతుంది.     

 అంతటి త్యాగాలు చేసి అఖండజాతి సాధించిన ప్రగతిని దేశప్రజలందరికీ అది సమానంగా పంపిణీ చేస్తుందా? అనే ఒకే ఒక ప్రశ్న వేస్తే చాలు నియంతృత్వం రెచ్చగొట్టే జాతీయ ఉన్మాదం మొత్తం నీరుగారిపోతుంది.  పాలకులకు లబ్ది చేకూర్చడానికి వర్గసమాజపు రాజ్యం నిర్వర్తించే కర్తవ్యాలనే మతవర్గతత్త్వరాజ్యం కూడా నిర్వర్తిస్తుంది. అయితే, ఆ పనిని లబ్దిదారులతో మాత్రమేకాక బాధితులతోనూ చేయిస్తుంది. అదే దాని ప్రత్యేకత!

సాంస్కృతిక రూపంలో ఎంత దళసరి ముసుగుని కప్పినా దాని కిందున్న ఆర్ధిక వాస్తవాన్ని ఎక్కువ కాలం కప్పలేరు. సాంస్కృతిక జాతీయవాదానికి నిజమయిన ప్రమాదం బయటి నుండి కాదు దాని పునాదులనుండే వస్తుంది. మతఅధిక సంఖ్యాక సామాజికవర్గం లోని పేదలు సాంస్కృతిక జాతీయవాదం ముసుగులో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎంత త్వరగా గమనిస్తే దాని పునాది అంతత్వరగా కూలిపోతుంది. ఇటలీ, జర్మనీల్లోనే ఇది పుష్కర కాలానికి మించి సాగలేదు.

నియంతృత్వం ఎప్పుడూ రెండు స్థాయిల్లో పనిచేస్తూవుంటుంది. మొదటిది,  సాంస్కృతికస్థాయి. రెండోది అధికారస్థాయీ. సాంస్కృతికస్థాయిలో అది చాలా అకర్షణీయంగా వుంటుంది. మనుషులపై మాదకద్రవ్యాలకన్నా శక్తివంతంగా పనిచేస్తుంది. దాని అసలు రూపం అధికారాన్ని చేపట్టినపుడే బయట పడుతుంది. ఎందుకంటే అధికారంలో వున్నప్పుడు దాని సాంస్కృతిక ముసుగు చిరిగిపోతుంది.

దేశప్రజల్లో జాతియోన్మాదాన్ని రెచ్చగొట్టడం  మతవర్గతత్వానికి సాంస్కృతిక పార్శ్వం అయితే భారీపరిశ్రామిక సంస్థలకు భారీ లాభాల్ని అర్జించి పెట్టడం దీని రాజకీయార్ధిక పార్శ్వం. దేశభక్తి ముసుగులో అది సాధించే లక్ష్యం అదే! వాజ్ పాయి మంత్రివర్గంలో ఏకంగా డిస్ ఇన్వెస్ట్ మెంట్ శాఖనే ఏర్పాటు చేశారు. అరుణ్ శౌరీ దానికి మంత్రిగా వున్నారు.  దేశ జనాభాలో నాలుగోవంతు ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్నా ఓ డజను జాతీయ కార్పొరేట్ సంస్థలు దేశవిదేశాల్లో సాధిస్తున్న విజయాలను చూసి ఆనందించమంటుంది మతవర్గతత్వం.

సాధారణ ప్రజల్లో కుత్రిమ ఉత్సాహాన్ని నింపడానికి దేశంలోని ఏదో ఒక సామాజిక వర్గాన్ని ఒక కుత్రిమ శత్రువుగా చిత్రిస్తుంది మతవర్గ నియంతృత్వం. ఆ కుత్రిమ శత్రువుకు వ్యతిరేకంగా మిగిలిన సామాజికవర్గాల్ని కూడగడుతుంది. శత్రుసంహారం జరిగితే మిగిలిన సామాజికవర్గాలకు సర్వసౌభాగ్యాలు అందుబాటులోనికి వస్తాయనే బూటకపు ప్రచారాన్ని ఉధృతంగా చేపట్టి, భూలోకస్వర్గాన్ని నిర్మిస్తున్నట్టు ఒక కుత్రిమ ఉత్సాహాన్ని విశాల ప్రజానీకంలో నింపుతుంది. ఈ కుత్రిమ ఉత్సాహాన్ని కొనసాగించడానికి వీలుగా ఒక అల్లరి మూకను సృష్టించి రోడ్ల మీదకు వదులుతుంది.

మతవర్గ నియంత్రుత్వం సృష్టించే కుత్రిమ శత్రువు నిత్యం ఒకే సామాజికవర్గం అవ్వాల్సినపనిలేదు. ఒకసారి ముస్లింలు, ఇంకోసారి శిక్కులు, మరోసారి క్రైస్తవులు ఇలా సందర్భాన్నిబట్టి కుత్రిమ శత్రువును మారుస్తూ వుంటుంది. ఎప్పుడైనా ఒకరికి వ్యతిరేకంగా అందరినీ కూడగట్టడమే దాని లక్ష్యం.

నియంతృత్వం ఊరించే భూలోకస్వర్గ ప్రాప్తి పొందే ఉత్సాహంతో ప్రజలు ఉత్పత్తిలో చురుగ్గా పాల్గొంటారు. అలా దేశంలో అభివృధ్ధి సూచికలు చెప్పుకోదగ్గ పెరుగుదలను సాధిస్తాయి. ఇలాంటి సంకేతాలన్నీ తాము ఆశిస్తున్న స్వర్గం అతిదగ్గరలో వుందనే భ్రమను ప్రజల్లో పెంచుతాయి. వాళ్ల ఉత్సాహం పెరిగిన  ఫలితంగా ఉత్పత్తి మరింత పెరుగుతుంది.. మళ్ళీ స్థూల జాతీయ ఉత్పత్తి సూచికలు పెరుగుతాయి.\


పెరుగుదల – అభివృధ్ధి (Growth and Development)-- 

 అయితే, ఈ పెరుగుదల అంతా నిలువు (Vertical) అభివృధ్ధి మాత్రమే అనీ, అది సమమట్టపు (Horizintal)  అభివృధ్ధిని సాధించడంలేదనీ, సాధించనూ లేదని ప్రజలకు తెలియడానికి ఎంతోకాలం పట్టదు.  నియతృత్వాన్ని నమ్మి దాని వెంట పరుగులు పెట్టిన సమూహాలే దాని సామర్ధ్యాన్ని శంకించడం మొదలెడతాయి. నియంతృత్వాన్ని నమ్మిన సమూహాల్లో ఉత్సాహం నీరుగారిపోయే కొద్దీ ఉత్పత్తి తగ్గి, అభివృధ్ధి సూచికలు దిగువముఖం పడతాయి. ఫలితంగా దేశంలో నిలువు అభివృధ్ధి సహితం కుంటుపడిపోతుంది.

వర్తమాన రాజకీయాల్లో యూపియే వన్ కూ, యూపీయే టూకూ తేదా ఇదే. యూపియే వన్ నిలువు అభివృధ్ధిని సాధించిన ఫలితంగానే దానికి 2009 ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు లభించాయి. అది సమమట్టపు అభివృధ్ధి కాదని తెలిశాక ప్రజల్లో ఉత్పాదక ఆసక్తి తగ్గిపోతుంది. అప్పుడు మొత్తం అభివృధ్ధే కుంటుపడిపోతుంది.  ఆ పరిణామాల్నే ఇప్పుడు మనం చూస్తున్నాం.

అసమ అభివృధ్ధితో విసుగు చెందిన జనానికి కష్టానికి తగిన ప్రతిఫలం శక్తిమేరకు శ్రమ అవసరం మేరకు ప్రతిఫలం వంటి సామ్యవాద ఆర్ధిక నీతులు ఉత్సాహాన్నివ్వవు. శ్రమ పడకుండానే సౌఖ్యం వంటి మాటలు సహజంగానే కొన్నివర్గాల్లో ఆసక్తినీ, ఆశల్నీ పెంచుతాయి. పచ్చిగా చెప్పాలంటే దొంగసొత్తును పంచుకుందాం అనేమాట అల్లరి మూకల్లో ఉన్మాదాన్ని పెంచుతాయి.

అయితే ఇక్కడో చిక్కు ప్రశ్న ముందుకు వస్తుంది. ఎవరిసొత్తును ఎవరు పంచుకోవాలి? అనేదే ఆ ప్రశ్న. ఈ సమస్యను పరిష్కరించడానికి నియంతలు దేశీయ  సామాజికవర్గాల్ని సాంస్కృతిక పునాదిపై రెండు శతృశిబిరాలుగా చీలుస్తారు. ఒకవర్గాన్ని బానిసలుగా మార్చి వాళ్ల మీద వాళ్ల సంపద మీద హక్కును రెండో వర్గానికి కల్పిస్తామంటారు. ఇది సాంస్కృతిక జాతీయవాదపు ఆర్ధిక కోణం.

మతవర్గతత్వనియంతృత్వం ఎప్పుడు పుడుతుంది? ఎలా పుడుతుంది? ఎప్పుడు జనాకర్షణగా మారుతుంది? అనేవి కీలక అంశాలు. వీటిని తెలుసుకోవడానికి కొన్ని దేశీ ఉదాహరణల్నీ, మరికొన్ని విదేశీ మూలాల్నీ పరిశీలించాల్సివుంటుంది.

హిందూత్వ సిధ్ధాంతం ప్రాతిపదికగా ఏర్పడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  రాజకీయ విభాగమైన భారతీయ జన సంఘ్  1951లోనే ఆవిర్భవించినప్పటికీ దానికి ఎన్నికల్లో ఎన్నడూ చెప్పుకోదగ్గ మద్దతు లభించలేదు. భారత తొలి, మలి ప్రధానులైన జవహర్ లాల్ నెహ్రు, లాల్ బహద్దూర్ శాస్త్రి ఇద్దరూ ఏడాదిన్నర వ్యవధిలో చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వంలో నాయకత్వ సమస్య తలెత్తి రాజకీయ అస్థిరత చోటుచేసుకున్న తరుణంలో ప్రతీఘాతశక్తులు పుంజుకున్నాయి.  అప్పట్లో జరిగిన 1967 ఎన్నికల్లో సి రాజగోపాలాచారి నాయకత్వంలోని స్వతంత్రపార్టికి 44 సీట్లు రాగా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ నాయకత్వంలోని భారతీయ జనసంఘ్ కు 35 సీట్లు దక్కాయి.  ఇందిరాగాంధి ప్రభుత్వం అత్యయిక పరిస్థితిని ప్రకటించి, భారత పార్లమెంటరీ వ్యవస్థ ఆమోదాంశాన్నే సంక్షోభంలోనికి పడేసింది. ఎమర్జెన్సీ తరువాత, 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  హిందూత్వ శక్తులు ఇందిరా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులతో కలిసి జనతా పార్టీగా  ఏర్పడి రాజకీయాల్లో బలపడి తొలిసారిగా అధికారాన్ని పంచుకున్నాయి. 1980 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత  జనతా పార్టి కూటమి కకావికలై, అందులోని హిందూత్వశక్తులు భారతీయ జనతాపార్టీగా ఆవిర్భవించాయి. ఇందిరాగాంధి హత్యానంతరం వీచిన సానుభూతి పవనాల మధ్య జరిగిన 1985 సాధారణ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టి ధాటికి బీజేపి మట్టి కరిచింది. ఆ పార్టికి లోక్ సభలో రెండే సీట్లు దక్కాయి. మొదటిది గుజరాత్ లోని మెహాసన, రెండోది ఆంధ్రప్రదేశ్ లోని హనమకొండ. ఈ సెంటిమెంటుతోనే గుజరాత్ కు చెందిన బీజేపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోదీ నవభారత యువ భేరీని ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించారు.

పార్టీ వునికే ప్రమాదంలో పడిన కాలంలో బీజేపి పగ్గాలు చేపట్టిన అడవాణీ రామజన్మ భూమి – బాబ్రీ మసీదు వివాదాన్ని ముందుకు తెచ్చి దేశంలో హిందూత్వకు మళ్ళీ ప్రాణం పోశారు. మరోవైపు బోఫోర్స్ వంటి కుంభకోణాలతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అప్రతిష్టపాలు కావడంతో దేశంలో మతోన్మాదశక్తులకు ఆమోదాంశం పేరిగింది.  1989  లోక్ సభ ఎన్నికల్లో 85 స్థానాలు గెలుచుకున్న బీజేపి, విపీ సింగ్ ప్రభుత్వానికి బయటినుండి మద్దతు ఇచ్చింది. మండల్ కమీషన్ సూచనల్ని వీపీ సింగ్ ఆమోదించి ఓబిసిలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసింది. 1991 ఎన్నికల్లో ఆపార్టీ బలం 120 కు పెరగ్గా, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత జరిగిన  1996  ఎన్నికల్లో 161కు పెరిగింది.   1998 ఎన్నికల్లో  ఆ పార్టి సీట్ల సంఖ్య 182  కు చేరుకుంది. ఇప్పటికి అదే దాని గరిష్ట బలం.  1996 lo లో  16 రోజులు,  1998 లో  13 నెలలు ప్రధానిగా వున్న బీజేపి నేత అటల్ బిహారీ వాజ్ పాయి అత్యల్ప తేడాతో పదవిని కోల్పోయారు. ఆ తరువాత జరిగిన కార్గిల్ యుధ్ధం 1999 lo ఎన్నికల్లో  బీజేపి సీట్లు పెరగడానికి ఉపయోగపడకపోయినా, ఆపార్టి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదేళ్ళు సజావుగా సాగడానికి మాత్రం అవకాశం కల్పించింది. భారతదేశం వెలిగిపోతున్నదనే నమ్మకంతో 2004 లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన బీజేపిని గుజరాత్ అల్లర్లను మరిచిపోని భారత ప్రజలు గొప్పగుణపాఠం నేర్పారు. ఆ ఎన్నికల్లో దానికి 138  సీట్లు మాత్రమే వచ్చాయి. 2009 లో ఆ పార్టి బలం మరింత తగ్గి 116కు పడిపోయింది.

మర్యాద పురుషుడు శ్రీరాముడ్ని ఓట్ల రాజకీయంలో అమర్యాదకరంగా వేలం వేసి ఓటు బ్యాంకును  కొల్లగొట్టి అధికారాన్ని ఆస్వాదించిన బీజేపికి ఇప్పుడు శ్రీరాముని పేరిట ఓటు బ్యాంకులేదు. భక్తులకూ, మతోన్మాదులకూ తేడాఇదే. భక్తులది విశ్వాసం. మతోన్మాదులది రాజకీయం. మందిర్-మస్జీద్ వివాదానికి ఇక ఓట్లు పడవని తేల్చుకున్న బీజేపి ఇప్పుడు ఒక కొత్త భావోద్వేగాన్ని సృష్టించింది. మతోన్మాదానికి అభివృధ్ధి వున్మాదాన్ని జోడించి గుజరాత్ అల్లర్ల కిరీటధారి  నరేంద్ర మోదీని ముందుకు తెచ్చింది.  నరేంద్రమోదీ రూపంలో అభివృధ్ధివున్మాది. సారాంశంలో మతోన్మాది.

భారతీయ జనతా పార్టి చరిత్రలో మనం పరిశీలించిన అంశాలన్నీ కేవలం గతానికి చెందిన కొన్ని ఘటనలు, కొన్ని గణాంకాలు మాత్రమే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడినపుడు మతోన్మాదశక్తులు బలపడతాయి అని నిర్ధారించడానికి ఈ గణాంకాలు సరిపోతాయి. అయితే, మతోన్మాదరాజకీయాలను అర్ధంచేసుకోవడంలో ఇది తొలి అధ్యాయం మాత్రమే. మతోన్మాద రాజకీయాల భవిష్యత్తుని మరీ ముఖ్యంగా వాటి పతనాన్ని పరికల్పన చేయడానికి ఆ సమాచారం సరిపోదు. దానికోసం వీటికి జన్మనిచ్చిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పుట్టుకనేకాక, భారతదేశంలో హిందూత్వ సిధ్ధాంతానికి ప్రేరణ ఇచ్చిన ఫాసిజం, నాజిజంల చావుపుట్టుకల్ని సహితం అధ్యయనం చేయాల్సి వుంటుంది.

        భారతదేశంలో ఎమర్జెన్సీ తరువాత ఒకసారి, బాబ్రీమసీదు కూల్చివేత తరువాత ఇంకోసారి, ఇప్పుడు యూపియే-2 ఘోరవైఫల్యం మూలంగా మరోసారి  ఏర్పడిన రాజకీయ అస్థిరతల వంటివే 1920-30 దశకాల్లో  ఇటలీ, జర్మనీల్లో కొనసాగాయి. మొదటి ప్రపంచయుధ్ధ నష్టాల నుండి ఇటలీని బయట పడేస్తాననీ డాంబికాలు పలుకుతూ అధికారాన్ని చేపట్టిన ముస్సోలిని దేశంలో ఒక జాతియోన్మాద ప్రతీఘాత ఉద్యమానికి ఆజ్యంపోశాడు. దీని పేరే ఫాసిజం. దేశప్రజల్లో జాతియోన్మాదాన్ని రెచ్చగొట్టడం ఫాసిజానికి సాంస్కృతిక పార్శ్వం అయితే,  భారీ పారిశ్రామిక సంస్థలకు విపరీతమైన లాభాల్ని అర్జించి పెట్టడం దీని రాజకీయార్ధిక పార్శ్వం. అనుమానం వున్నవాళ్ళు నివృత్తి కోసం నాటి ఇటలీ వరకు వెళ్ళాల్సిన పనిలేదు; నేటి గుజరాత్ లో మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఆర్ధిక ప్రోత్సాహకాలకు ప్రధాన లబ్దిదారులు ఎవరో తెలుసుకుంటే చాలు. సైన్సు సిటీల గురించి ప్రచారం చేస్తున్న మోదీగుజరాత్ లో ఇప్పటికీ మరుగుదొడ్లు శుభ్రంచేసే పాకీవాళ్ళువున్నారోలేదో తెలుసుకుంటే చాలు.

 దేశంలోని ప్రతి ఒక్కరూ మత, వర్గ, సాంస్కృతిక   విబేధాలను మరిచిపోయి, దేశాభివృధ్ధి కోసం ఎలాంటి త్యాగాలకైనా, ఎంతటి సాహసాలకైనా సిధ్ధపడాలనేది ఫాసిజం  తత్వం అని అంటే  ఇదేదో గతవారం పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ఉపన్యాసంలా వుందని ఎవరికైన అనిపించవచ్చు. అందులో తప్పులేదు. మోదీ ఉపన్యాసాలకైన,  పవన్ కళ్యాణ్ ఉపన్యాసానికైనా మూలం ముస్సోలినే, ఫాసిజమే! కమలనాధులు ఇటలీపాలన అని సోనియా గాంధీని విమర్శిస్తుంటారుగానీ, నిజానికి వాళ్ళు కూడా ఫాసిస్టు సిధ్ధాంతాన్ని ఎరువు తెచ్చుకున్నది ఇటలీ నుండే.
జర్మన్  రీచ్ స్టాగ్ (పార్లమెంటు) కు 1924 నుండి తొమ్మిదేళ్ల కాలంలో  ఏకంగా ఎనిమిదిసార్లు మధ్యంతర ఎన్నికలు జరిగాయంటే రాజకీయ అస్థిరత ఏస్థాయిలో వుండిందో అర్ధం చేసుకోవచ్చు. చివరి రెండు ఎన్నికల్లో హిట్లర్ నాజీ పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందిగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావల్సిన  సంఖ్యాబలం దానికి దక్కలేదు. అప్పటి జర్మనీ అధ్యక్షుడు హిండేన్ బర్గ్ 1933 మార్చి నెలలో  మళ్ళీ ఎన్నికలు జరుపుతున్నట్టు ప్రకటించి, ఆలోపున రెండు నెలల కాలానికి  మైనారిటీ ప్రభుత్వానికి హిట్లర్ ను ఆపధ్ధర్మ ప్రధానిగా నియమింఛాడు.  ఆపధ్ధర్మ ప్రధాని పదవిని చేపట్టి నెల తిరక్కుండానే రీచ్ స్టాగ్ కు తనే నిప్పు పెట్టించి, దేశంలో రాజకీయ అస్థిరత సృష్టించడానికి కమ్యునిస్టులు కుట్రలు చేస్తున్నారు అని బూటకపు ప్రచారం మొదలెట్టాడు హిట్లర్.

జర్మనీలో రీచ్ స్టాగ్ తగలబడిన సంఘటనకూ, భారతదేశంలో కార్గిల్ యుధ్ధం జరిగిన సందర్భానికీ ఒక పోలికవుంది.  అప్పుడు జర్మనీలో హిట్లర్ అపధ్ధర్మ ప్రధానిగా వుండగా,  ఇక్కడ వాజ్ పాయి కూడా  అపధ్ధర్మ ప్రధానిగా వున్నారు. కార్గిల్ యుధ్ధం పుణ్యాన వాజ్ పాయి అపధ్ధర్మ ప్రధాని నుండి సుస్థిర ప్రధాని అయినట్టు, రీచ్ స్టాగ్ తగలబడిన పుణ్యాణ హిట్లర్ అపధ్ధర్మ ప్రధాని నుండి సుస్థిర అధ్యక్షుడు (ఫ్యూరర్ ఆఫ్ జర్మనీ) అయ్యాడు.

ఫాసిజం అంటే కట్టెలమోపు అనో, నాజిజం అంటే సమైక్యత అనో నిఘంటువు అర్ధాలు వుంటే వుండవచ్చు. చారిత్రకంగా సాంస్కృతిక రాజకీయార్ధిక భాషలో అది అతివాద సర్వసత్తాక జాతీయవాదం (Radical Authoritarian Nationalism). ఇది అంతర్గతంగానూ బాహ్యాత్మకంగానూ వ్యవహరిస్తుంది. ఫాసిజానికి ఆద్యుడైన ముస్సోలిని ఆఫ్రికా ఖండాన్ని ఖాళీ చేయించి, అక్కడ కోటి మంది ఇటాలియన్లకు స్థిరనివాసం ఏర్పాటు చేస్తేనేగానీ ఇటలీకి ఊపిరి ఆడేచోటు వుండదన్నాడు.  నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా జర్మన్ల ఆహార భద్రత కోసం రష్యాను ఆక్రమించుకుని అక్కడి యూదులు, తదితర నిమ్నజాతుల్ని బానిసలుగా మార్చుకోవాలని తన ముఫ్ఫయి ఆరవ యేట రాసుకున్న ఆత్మకథ మైన్ కెంఫ్’ (నా పోరాటం) లో సూచించాడు. జర్మనీలో మతఅల్పసంఖ్యాకులైన  యూదులందర్నీ చంపేస్తే దేశంలో మత అధికసంఖ్యాకులైన క్రైస్తవులందరూ బాగుపడతారని హిట్లర్ బాహాటంగానే ప్రకటించాడు.  జర్మనీలో మాత్రమేకాక రెండవ ప్రపంచ యుధ్ధ కాలంలో జర్మనీ ఆక్రమిత ప్రాంతాల్లోనూ నరమేధం  (Holocaust)  జరిపి దాదాపు కోటి మంది యూదుల్ని కౄరాతిక్రూరంగా చంపించేశాడు.  ఇంతటి నరరూప రాక్షసత్వాన్ని వాళ్ళు రహాస్యంగా ఏమీ చేయలేదు. సమస్తరంగాల్లో యూదుల్ని అణిచివేసి, బానిసలుగా మార్చడానికేకాక, వాళ్లను చంపివేయడానికి కూడా ప్రభుత్వానికి రాజ్యాంగబధ్ధ హక్కులు వుండేలా హిట్లర్  నురెంబర్గ్ చట్టం చేశాడు.

        హిట్లర్ మైన్ కెంఫ పుస్తకాన్ని జర్మనీలో 1925లో ప్రచురించారు. సరిగ్గా ఆ సంవత్సరమే భారత దేశంలో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ను స్థాపించారు. హిట్లర్, హెగ్డేవార్ ఇద్దరూ ఆర్యజాతిని ఆకాశానికి ఎత్తేశారు. హిట్లర్ యూరప్ లో యూదుల వినాశనాన్ని లక్ష్యంగా చేసుకుంటే, హెగ్డేవార్ భారత ఉపఖండంలో హిందూయేతరుల వినాశనాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రత్యక్షంగా చెప్పినా  ప్రఛ్ఛన్నంగా చెప్పినా సంఘ్ పరివారం ప్రవచనాల సారం ఒక్కటే; అన్యమతస్తుల్ని భారతదేశం నుండి పంపించివేయాలి. ఇక్కడున్నవాళ్ళని బానిసలుగామార్చాలి.  వాళ్లసంపద, వాళ్లసంతతి పెరక్కుండాచూడాలి.

సంఘ్ పరివార్ లక్ష్యాలపై హిట్లర్ ప్రత్యక్ష  ప్రభావం ఆరెస్సెస్ రెండవ సర్సంఘ్ ఛాలక్ గురూజీ మాధవ్ సదాశివ్ గోల్వార్కర్ రచనల్లో ప్రస్పుటంగా కనిపిస్తాయి. జర్మనీలో హిట్లర్ యూదువ్యతిరేక నురెంబర్గ్ చట్టం చేసిన 1938 లోనే  గోల్వార్కర్ భారతదేశంలో హిందూయేతరులు (అనగా ముస్లింలు) ఎలా వుండాలో వివరిస్తూ ఒక పౌరస్మృతిని రూపొందించి,  We or Our Nationhood Defined” పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. భారతదేశంలోని హిందూయేతరులు హిందూజాతికి సంపూర్ణ విధేయులుగా లొంగివుండాలనీ, వాళ్ళు ఎలాంటి వాటాల్నీ, సౌకర్యాలనీ, ప్రాధాన్యతల్నీ,  చివరకు పౌర హక్కుల్ని కూడా కోరకూడదని అందులో గోల్వాల్కర్ సెలవిచ్చారు.

బీజేపి వృధ్ధవీరుడు లాల్ కిషన్ అడవాణీజీ ఇప్పుడైతే సౌమ్యుడిగా మాట్లాడుతున్నారుగానీ, వారు సంఘ్ పరివారంలో అతిరథిగా వున్నప్పుడు గురూజీ గోల్వాల్కర్ స్మృతికి ఆధునిక వ్యాఖ్యానాలు, అన్వయాలు చాలా చేసేవారు. భారత దేశంలో ముస్లింలు ప్రాధమిక విద్య చదువుకోవచ్చు, కూలీనాలీ చేసుకుని బతకవచ్చు. జ్వరమో జబ్బో వస్తే సర్కారు దవాఖానలో వైద్యం కూడా చేయించుకోవచ్చు. అంతేతప్ప సహజవనరుల్లో, పరిపాలనా వ్యవస్థల్లో వాటాలు కోరకూడదని గట్టిగా చెప్పేవారు.

అడవాణీజీయే ఒక సాంస్కృతిక జాతీయఅతివాది. ఆయన తానే అదుపు చేయలేని ఒక భూతాన్ని సృష్టించారు. ఇప్పుడా భూతం ముందుగా అడవాణీజీనే మింగేసింది. ఆ భూతం పేరు నరేంద్ర మోడీ అని వేరేచెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో హిందువులకు వున్నది భారతదేశం ఒక్కటే అంటున్నారు నరేంద్ర మోదీ. అయన ఇప్పటికి కాస్త ముసుగులో మాట్లాడుతున్నారుగానీ, వారు చెప్పదలుచుకున్నదిమాత్రం భారతదేశంలో వుండాల్సింది హిందువులు ఒక్కటే అని.

        కాలానికి వున్నట్టే పెట్టుబడీదారి రాజ్యపు నిర్వహణ కాలచక్రంలో కూడా ఆరు  రుతువులు వుంటాయి. మొదటి రుతువులో ప్రజలందరి ప్రతినిధిగా ఆమోదాంశం వున్న రాజకీయకూటమికి అది అధికారాన్ని అప్పచెపుతుంది. ఆ రుతువులో తమకేదో గొప్పమేలు జరిగిపోతున్నదన్న ఆశలో, ఉత్సాహంలో ప్రజలు వుంటారు.  రెండవ రుతువులో అధికారాన్ని చేపట్టిన రాజకీయ కూటమి ద్వార పెట్టుబడీదారులకు రాజ్యం ఊడిగం చేయిస్తుంది. మూడవ రుతువులో పెట్టుబడీదారుల సహజమైన అత్యాశవల్ల అధికారంలోవున్న రాజకీయ కూటమి  అప్రతిష్టపాలై ప్రజల నమ్మకాన్ని కోల్పోతుంది.  పోతుంది. నాలుగవ రుతువులో ప్రభుత్వాన్ని ఏమాత్రం సహించలేని ప్రజలు అధికార రాజకీయకూటమిని ఓడించాలనే నిర్ణయానికి వస్తారు. ఐదవ రుతువులో ప్రభుత్వం మీద నిరసన మరింత తీవ్రంగామారి పెట్టుబడిదారీ ప్రభుత్వాన్నేకాక పెట్టుబడీదారీ రాజ్యాన్ని  కూలగొట్టడానికి కూడా ప్రజలు  సిధ్ధపడతారు. దానితో, పెట్టుబడిదారీ ప్రభుత్వమేకాక,  పెట్టుబడీదారీ రాజ్యం మనుగడ సహితం సంక్షోభంలో పడిపోతుంది. ఆరవ రుతువులో సంక్షోభం నుండి బయటపడి కొత్తజీవం పోసుకోడానికి పెట్టుబడీదారీరాజ్యం ప్రజల ముందు తానే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని ప్రవేశపెడుతుంది. ఈ ప్రత్యామ్నాయ రాజకీయకూటమి మరింత ప్రజాస్వామ్యయుతమైనదీకావచ్చు, లేదా మరింత ఉన్మాదమైనదీ కావచ్చు. పెట్టుబడీదారీరాజ్యానికి ఈ రెండింటి మధ్య తేడాలేదు. ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి మందు అయినా మాదకద్రవ్యం  అయినా ఒకటే. మరలా, పెట్టుబడీదారీ ప్రభుత్వం ఏర్పడడమే దానికి ముఖ్యం.

యూపీఏ ప్రభుత్వం ఎంత తొందరగా పోతే అంత మంచిదని ప్రజలు చూస్తున్నారని అని బీజేపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు చెపుతున్న మాటల్లో అవాస్తవంగానీ, అతిశయోక్తిగానీ ఏమీలేదు. ఇవన్నీ పెట్టుబడీదారి రాజ్యపు నిర్వహణ కాలచక్రపు ఐదవ రుతువులో సహజ వ్యక్తీకరణలు. అయితే, ఈ దశలో ప్రభువు పంపిన రక్షకుడిగా నరేంద్ర మోదీ ప్రజలకు కనిపిస్తున్నారని వెంకయ్యనాయుడు చెపుతున్నది మాత్రం బీజేపి ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయం మాత్రమే. నరేంద్రమోదీ నరమేధం సమానార్ధకాలుగా చాలా మంది అనుకుంటారని  వెంకయ్యనాయుడుకు కూడా తెలుసు. గుజరాత్ లో ఒక పుష్కర కాలంగా మతకలహాలు జరగలేదని వారు గుర్తు చేసి జాగ్రత్త పడుతున్నారు.

అద్డాల దుకాణంలో ఎద్దు వంటి నరేంద్ర మోదీని బీజేపి ప్రతిపాదిస్తుంటే, అసలు స్వరపేటికేలేని రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నది. వీళ్ళిద్దరుతప్ప మరో ప్రత్యామ్నాయమే లేనట్టు ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. మోదీమానియాలో నిండామునిగిపోయిన మన మీడియా నరేంద్రుని పట్టాభిషేకం కేవలం లాంచనమే అన్నట్టు ప్రసారాలు చేస్తోంది.

బీసి సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని  ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన ఘనత తమదే అని ఈసారి బీజేపి ఘనంగా చెప్పుకుంటున్నది. ఇలాంటి సందర్భాల్లో, హిందూ వెనుకబడిన తరగతులతో సంఘ్ పరివారానికి కుదిరిన అనుబంధం నేపథ్యాన్ని కూడా ఒకసారి పరిశీలించాల్సివుంది.
ఉమా భారతి, కళ్యాణ్ సింగ్, నరేంద్ర మోదీ



పుట్టిన ప్రతి జీవీ చావకతప్పదు అన్నట్టు, అస్థిత్వంలోనికి వచ్చిందల్లా అస్థిత్వాన్ని కోల్పోకతప్పదు అన్నట్టు, అతివాద సర్వసత్తాక జాతీయవాదం పుట్టుకలోనే దాని చావు కూడా రాసి వుంటుంది. ఉపస్రవంతిని అశాంతికి గురిచేసిన ప్రధాన స్రవంతి ఎన్నడూ ప్రశాంతంగా వుండజాలదు. చర్యకు ప్రతిచర్య వుంటుంది అన్నట్టు అశాంతికి గురైన సామాజికవర్గం మొత్తం సమాజాన్నే అశాంతికి గురిచేస్తుంది. మనుషులు తమ మేరకు సౌఖ్యాలను కొరుకునే మహాస్వార్ధపరులనే మాట నిజమేగానీ సామాజిక అశాంతి విస్తరించినపుడు ప్రతిఒక్కరూ సామాజిక ప్రశాంతతనే బలంగా కోరుకుంటారు. సరిగ్గా ఈ కారణం వల్లనే మతవర్గతత్వం స్వజనం మద్దతునే కోల్పోతుంది. మరోమాటల్లో చెప్పాలంటే, మతవర్గతత్వంవల్ల లబ్దిపొందినవర్గాలు సహితం దాన్ని భరించలేని స్థితికి చేరుకుంటాయి. అలాంటి దశకు చేరుకున్నాక తన లబ్దిదారుల చేతుల్లోనే మతవర్గతత్వం మరణిస్తుంది. గుజరాత్ నరమేధం తరువాత జరిగిన 2004 సాధారణ ఎన్నికల్లో బీజేపిని ఓడించడంలో ప్రధానపాత్ర పోషించింది హిందూ సామాజికవర్గాలే; అందులో హిందూయేతరుల పాత్ర కూడా వున్నప్పటికీ అది సంఖ్యరీత్యా చాలా చిన్నది. గుజరాత్ నరమేధాన్ని ఆనాడు హిందూ సామాజికవర్గాలు సహితం  సహించలేకపోయాయి. ఇటలీలో ఫాసిస్టు ముస్సోలిని, జర్మనీలో  నాజీ హిట్లర్ ముగింపుఘట్టం అలాగే సాగింది. ఇటాలియన్లు నిజంగానే ముస్సోలిని తోలుతీసి, మాంసం దుకాణాల్లోజంతువుల్లా ఓ గ్యాస్ స్టేషన్లో కొక్కేనికి వేలాడదీశారు. జర్మన్లు తనను అతిభయంకరంగా చంపేస్తారని భయపడిపోయిన  హిట్లర్ సైనిక బంకర్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ దేశంలోఅయినా, ఏ మతంలోఅయినా  ఏ కాలంలో అయినా అతివాద సర్వసత్తాక జాతీయవాదం ముగింపు అదే!

బీజేపియో, సంఘ్ పరివారమో ఆశిస్తున్నట్టు హిందువులంతా హిందూత్వను సమర్ధిస్తారనుకోవడం ఒక భ్రమ. అలాగే, నరేంద్ర మోదీ హిందూ వెనుకబడిన సామాజికవర్గానికి చెందినవారైనంతమాత్రాన హిందూ వెనుకబడిన సామాజికవర్గాలన్నీ ఆయన్ని సమర్ధిస్తాయనుకోవడమూ తప్పే. హిందువులూ హిందూత్వ రెండూ ఒకటే అయ్యేదయితే స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశాన్ని ఏ జనసంఘో, బీజేపీయో ఏలివుండాలి. కానీ అలా జరగలేదు. జరగదు కూడా. ఎప్పుడయినా జరిగినా అది తాత్కాలికమే!


అతివాదసర్వసత్తాకజాతీయవాదం

(Radical Authoritarian Nationalism) 

 "To keep up the purity of the Race and its culture, Germany shocked the world by her purging the country of the Semitic races—the Jews. Race pride at its highest has been manifested here. Germany has also shown how well nigh impossible it is for Races and cultures, having differences going to the root, to be assimilated into one united whole, a good lesson for us in Hindustan to learn and profit by"

— M. S. Golwalkar, - We, or Our Nationhood Defined (1938)


 "The non-Hindu people of Hindustan must either adopt Hindu culture and language, must learn and respect and hold in reverence the Hindu religion, must entertain no idea but of those of glorification of the Hindu race and culture ... In a word they must cease to be foreigners, or may stay in the country, wholly subordinated to the Hindu nation, claiming nothing, deserving no privileges, far less any preferential treatment—not even citizens' rights."

M. S. Golwalkar, - We, or Our Nationhood Defined (1938)


Fascism : a governmental system led by a dictator having complete power, forcibly suppressing opposition and criticism, regimenting all industry, commerce, etc., and emphasizing an aggressive nationalism and often racism.  

లాల్ బనో 
21 ఏప్రిల్ 2015

జాతీయ ఐక్యత
ప్రజలు బాగుండాలంటే దేశం బాగుండాలి దేశం బాగుండాలంటే బూర్జువావర్గం బాగుండాలి. ఈ మూడు కర్తవ్యాలను నెరవేర్చడమే జాతీయ ఐక్యత. ఇందులో ఒక తిరకాసు వుంది. ఇందులో మూడు అంశాలున్నట్టు కనిపిస్తున్నప్పటికీ నిజానికి వుండేది ఒక్క అంశమే; బూర్జువావర్గం బాగుండాలి. ప్రజలు బాగుండడం, దేశం బాగుండడం అనేవి కేవలం లాంఛనమే. 

భారత కార్పొరేట్ సంస్థలు భారీగా లాభాలు అర్జిస్తుంటే జిడిపి అభివృధ్ధి రేటు డబల్ డిజిట్ లో సాగుతుంటుంది. జిడిపి అభివృధ్ధి రేటు మెరుగ్గా వుంటే దేశం బాగున్నట్టే లెఖ్ఖ! దేశం బాగున్నపుడు దేశ ప్రజలూ బాగున్నట్టే లెఖ్ఖ!. ఈమధ్య హైదరాబాద్ ను దేశంలోకెల్లా  బిలియనీర్లు అత్యధికంగావున్న నగరంగా పేర్కొంటున్నారు. ఇలాంటి సూచికల్ని చూసినపుడు హైదరాబాద్ అభివృధ్ధిని తలచుకుని మైమరచిపోవాలేతప్ప చింతలబస్తీనో, పాతబస్తీనో గుర్తుకు తెచ్చుకుని అక్కడి పేదరికాన్ని తలచుకుని బాధ పడకూడదు. ఆలా చేస్తే మనకు జాతీయ భావాలు లేనట్టే. హైదరాబాదీ తత్వంలేనట్టే. 

జాతీయ ఐక్యత విషయంలో సంఘ్ పరివారానికీ కాంగ్రెస్‍కూ పెద్ద తేడా లేదు. గుజరాత్ లో నరేంద్ర మోదీ ప్రాపకంలో అంబానీ, ఆదానీ సంస్థలు పెరిగాయని మనం అనుకుంటూవుంటాం. కానీ, “అంబానీ, ఆదానీల పెరుగుదల కాంగ్రెస్‍కీ మెహర్బానీ హై” అంటూ ఈమధ్యనే వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. భారత కార్పొరేట్ సంస్థలు ప్రపంచ కార్పొరేట్ సంస్థలతో పోటీపడడమేగాక, అగ్రస్థానంలో నిలబడాలంటే శాసన సంబంధమయిన జాతీయ ఐక్యతను సాధించాలని కాంగ్రెస్‍భావిస్తుంది. సంఘ్ పరివార్ అక్కడితో ఆగదు జాతీయ భావం నరనరాల్లో జీర్ణించుకుపోయి విశుధ్ధ జాతీయతత్వం అధికార తత్వం కావాలని అది ప్రతిపాదిస్తుంది. బీజేపి మతవాద కాంగ్రెస్‍అయితే కాంగ్రెస్‍మితవాద బీజేపి. 

విశుధ్ధ జాతీయతత్వం – రెండు పార్శ్వాలు
విశుధ్ధ జాతీయతత్త్వానికి రెండు పార్శ్వాలుంటాయి. ఆర్ధికరంగంలో కార్పొరేట్ సంస్థల్ని ఒక ఉన్మాదంతో ప్రోత్సహిస్తుందికనుక  అది కార్మికవర్గానికి వ్యతిరేకమైనది. సాంస్కృతిక, ధార్మికరంగాల్లో  హిందూధర్మాన్ని ఆచరించడం తప్పనిసరి చేస్తుంది కనుక అది మతఅల్పసంఖ్యాకులకు వ్యతిరేకమైనది. 

మన దేశంలో ఇంతవరకూ జరుగుతున్నదేమంటే విశుధ్ధ జాతీయతత్వం మీద కమ్యూనిస్టులు ఆర్ధిక కోణం నుండి ఒక పాక్షిక పోరాటాన్ని చేస్తుంటే, ముస్లింలు, క్రైస్తవులు, ఆదివాసులు  తదితర సామాజికవర్గాలు సాంస్కృతిక కోణం నుండి మరో పాక్షిక పోరాటాని చేస్తూ వున్నారు. ఈ రెండు పోరాటాలు సమైక్యంగా సాగాలని చెప్పడం సులువేగానీ, దాన్ని నిర్మాణంగా కార్యాచరణగా మార్చడం అంత సులువుకాదు. మతాన్ని తిరోగమనవాదంగా భావించే కమ్యూనిస్టులకు మతఅల్పసంఖ్యాక సామాజికవర్గాలతో ఐక్యసంఘటన కట్టడం  ఎంత ఇబ్బందో తాము నాస్తికులుగా నిందించే కమ్యూనిస్టులతో ఐక్యసంఘటన కట్టడం మతఅల్పసంఖ్యాక సామాజికవర్గాలకూ అంతే ఇబ్బందే. 

పునాదిని పెంచుకుంటున్న సంఘపరివారం
హిందూమతసమాజంలో ధార్మికరంగం మీద ఆధిపత్యం బ్రాహ్మణ సామాజికవర్గానిదే. సహజంగానే సంఘ్ పరివార్ కు బ్రాహ్మణులే నాయకత్వం వహింస్తూవుండేవారు. అయితే బ్రాహ్మణ సామాజికవర్గం సంఖ్యరీత్యా చిన్నది. భారత పెట్టుబడీదారీవర్గం ప్రయోజనాలు విస్తృతం అయ్యేకొద్దీ ఇతర సామాజికవర్గాల్లోనూ విశుధ్ధ జాతీయతత్త్వాన్ని ఎక్కించాల్సిన అవసరం సంఘ్ పరివార్ ముందుకు వచ్చింది. ముందు అగ్రవర్ణాలు, ఆఢిపత్యకులాల సామాజికవర్గాల్లో స్థానాన్ని ఏర్పరచుకున్న ఆరెస్సెస్ క్రమంగా హిందూ వెనుకబడిన కులాల్ని ఆకర్షించింది. ఇప్పుడు దళితులు, ఆదివాసుల్ని పెద్ద సంఖ్యలో సమీకరించే పనిలో పడింది.  వీలు దొరికితే, ముస్లింలను సమీకరించే అవకాశాన్ని కూడా అది ఒదులుకోవడంలేదు. 

ఆర్గనైజర్, పాంచజన్య అంబేడ్కర్  

మహాత్మా గాంధీజీ, బాలగంగాధర తిలక్, మదన మోహన మాలవ్య మొదలు గోల్వార్కర్, హెగ్డేవార్ వరకు  భారత పెట్టుబడీదారీవర్గ సిధ్ధాంతవేత్తలందరూ భూస్వామ్య భావజాలమైన హిందూధర్మాన్నీ తమదైన తీరులో జాతీయ పెట్టుబడీడారుల ప్రయోజనాలకు అనుకూలంగా సంస్కరించేపనినే చేశారు.